సహవాసము

సహవాసము

1ఉత్తేజమును పుట్టించు వర్తమానమును సహోదరుడు, పియరీ ఇప్పుడే మనకు దేవుని వాక్యము నుండి అందించాడు. మనము దేవునికి పరిమితి విధించుచున్నాము, మనము దేవునికి సమయము నిర్ణయించుచున్నాము; ఆయనేమో నిత్యుడు. మనమా విధంగా చేయజాలము. అనుమాట ఎంత వాస్తవము. కనుక ఈ రాత్రి మరో సంగతిని ఇప్పుడు ఎదుర్కొనుచున్నాము… అది ప్రభురాత్రి భోజనము.

టుసాన్ లో సంఘమునకు (church) వచ్చుటకు మూడు సంవత్సరములు నేను ఎదురుచూచాను, కాని ఇప్పుడు అది ఇక్కడున్నది. మనము ఇక్కడున్నాము. కాబట్టి మనము దేవునికి వందనములు చెల్లించుచున్నాము; ఇప్పుడు దానిని మనము అభినందించునట్లుగా ఆయన మనలను ఎదురుచూడనిచ్చెను.

2ఇప్పుడు, ప్రభురాత్రి భోజనము ఆరంభించు ముందుగా ఒక్క విషయమును నేను చెప్పగోరుచున్నాను. అదేమనగా మనము, నేడు మనము జీవించుచున్న దినములలో చాలినంత మనము చూచాము అని నేను నమ్ముచున్నాను. మనము నిజంగా ప్రతివారు… మన సర్వస్వము దేవునికి ఇవ్వవలసియున్నాము. మనము నిజంగా దేవుని సేవించవలెను. వాక్యమునకు ప్రత్యక్ష జవాబుతో ఆయన మనలను దీవించేనని నేను నమ్ముచున్నాను. కొద్ది క్షణముల క్రితము సహోదరుడు, పీయరీ చెప్పినట్లుగా, మనము ఆ కాలములో ఉన్నాము. మనము గ్రుడ్డివారము కాము; మనము ఇక్కడున్నామని చూచుచున్నాము, మనము చేరుకొన్నాము.

ప్రజల నుండి మానవ మనస్సు ఎట్లు పోవుచున్నదో కూడా మనము చుట్టూ చూచినపుడు గమనించగలము. అది మనము ఎక్కువ కాలము మనము కూడా నిలిచియుండలేము; అట్లు వుండినచో మనము పూర్తిగా మతి-తప్పిన సంస్థలో ఉండినవారమవుదుము. సర్వప్రపంచము అట్లే ఉండబోవుచున్నది, చూచారా. కనుక, మనము అంత్యకాలములో ఉన్నాము.

3ఇప్పుడు - సహోదరుడు పియరీ అక్కడ ముగించియుండగా — ఈ సంగతులు నిజమని చూస్తూయున్నాము, అవి నిజమేనేమో చూడండి… అవి కట్టుకధలు కావు. అవి కేవలము మనము ఊహించునవి కావు. అవి దేవుని వాక్యము ద్వారా ప్రత్యక్షముగా మనకు అనుగ్రహించబడినవి. మన ఎదుట బహిరంగముగా అవి వెల్లడి అయినవి. మనము ఇక్కడున్నామని మనకు తెలియును. మనము ఇప్పుడిక ఎంత కొలమో మనకు తెలియదు, ఎందుకనగా మరల మనము ఎంత సమయమైనదో చూచుటకు గడియారము నొద్దకు వచ్చుచున్నాము. కాని మనకు తెలుసు, మనము ఇక్కడున్నామని, ఆ కాలమునొద్ద మనమున్నాము. దేవుని సమయమేమిటో, నేను ఊహింతును.

ఒకరు ఒకసారి ఒక చిన్న విశ్లేషణ ఇచ్చారు, ఏమనగా, దేవుడు తన సంకల్పము ప్రకారము చేయ తలంచినచో… ఆయన సమయమును కేటాయించదలచినచో… ఒక వెయ్యి సంవత్సరములు కేవలము ఒక దినము. కాబట్టి, ఒక మనిషి డెబ్బది సంవత్సరములు బ్రతికినచో, దేవుని సమయములో అది కేవలము కొన్ని నిమిషములే, చూచారా. సరే, దానిని నలుబది సంవత్సరములనుకొందాము, అది అసలు దేవుడు కన్ను మూసుకొని తెరచే మధ్య కాలము కన్న తక్కువగును, చూచారా. చూడండి, అది గనుక కేటాయించబడిన సమయమే అయినచో, అంతయూ ఎంత త్వరితముగా జరిగిపోవుచున్నదో కదా — ఆయనకు ఎట్టి సమయము లేదు. కాబట్టి ఆయన నిత్యుడు.

4ఆ వెనుక నున్న శారా లేక చిన్న జోసెఫ్ అనుకొంటాను, ఒక రాత్రి నాతోను సహోదరుడు పియరీతోను ఇట్లు చెప్పెను, "నాన్నగారూ, దేవుడు ఎప్పుడు రంగము మీదికి వచ్చెను? ఆయన ఎక్కడి నుండి వచ్చెను?" చూచారా? "ఆయనకు ఒక ఆది ఉండవలసియున్నది, కాదా? ఆయన ప్రారంభించవలసి లేడా?"

అందుకు నేను, "కాదు. ఆది ఉన్న ప్రతిదానికి ఒక అంతము ఉండును, కాని ఆది లేనిదానికే అంతము కూడా ఉండదు," అన్నాను. అవును, అతనికి పది సంవత్సరాలు వయస్సు; కాబట్టి ఆ మాట అతను కాస్త గ్రహింపలేకుండెను, చూచారా. ఆది అనేది లేదు అన్న మాటను ఆతడెట్లు అంగీకరించగలడు? అతనికే కాదు, నాకు అంతే, చూచారా. అదెట్లు అసలు ప్రారంభమైనది అనేది నాకు ఒక పెద్ద మోతాదుగా నుండును.

1COR 11:25

 

5ఇప్పుడు, మనము నిజంగా ఇక్కడ పవిత్రమగు దానిని గమనించుటకు ఉపక్రమించాము.

ఎవరో చాలా చక్కని క్రైస్తవ పెద్ద మనిషి కొద్ది రోజుల క్రితం నన్ను పిలిచాడు, ఆయన ఎన్నడూ దీనిని ఆచరించియుండలేడు, మనము ప్రభురాత్రి భోజనమును అక్షరాలా తీసికొనుచున్నామని అతడు అర్థము చేసికొనెను. దానిని వారు "ఆత్మీయ ప్రభురాత్రి భోజనము" అని పిలుదురు. దానిని వారు తీసికొందురు. సహవాసమునకు సంబంధించినంత వరకు అది మంచిదే అని నేను చేప్పెదను, ఎందుకనగా సహవాసము అనగా, "మాట్లాడుట" అని భావము, చూచారా. ఈ లేఖనమును ఇచ్చిన ఈ సోదరుడు ఈలాగు చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం, నీపుడు ఈలాగు అనుకొనుట లేదా….?"

ఇప్పుడు, నేను దీనిని చేప్పటకు కారణము ఏమనగా… అది మంచిదే, సహోదరుడు పియరీ? చూడండి, అది… కారణము, మీరు ఏమి చేయుచున్నారో దానిని మీరు గ్రహించునట్లుగా నేను దీనిని చెప్పుచున్నాను. దేనిలోనికయినా మీరు గ్రుడ్డిగా నడిచినట్లయినచో, ఏమి చేయుచున్నారో ఎరుగరు. మీరు చేయుచున్న దానిని మీరెరుగనిచో, మీకు కనీసము నమ్మకము కూడా ఉండదు. కాని నీవు తప్పక నీవేమి చేయుచున్నావో, దానిని ఎందుకు చేయుచున్నావో అర్థము చేసికోవలెను.

ఆయనట్లు చెప్పేను, "దేవుని వాక్యమును మనము తీసికొనినచో, మనము మాట్లాడుచున్నది దేవునిని కాదా?"

"ఖచ్చితముగా నిజమండి, అది నిజము. కాని ఇక్కడ మనము చదువుచున్నది ఏమనగా… అక్షరాలా ప్రభువు రాత్రి భోజనమును తీసికొనుమని పౌలు మాట్లాడుచున్నాడు," అని నేను అన్నాను. "నా జ్ఞాపకార్థము ఇది చేయుడి," అని యేసు చెప్పెను. నా జ్ఞాపకార్థమై మిరు దీనిని చేయునపుడెల్లనూ, ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును మీరు ప్రచురము చేయుచున్నారు," చూచారా. ఇప్పుడు, దానిని మనము తీసికోవలసియున్నాము.

6దానిని సంఘములో అభిషేకించిన పరిశుద్ద పౌలు నూతన నిబంధన ప్రవక్తగా ఉండెనని మనము అర్థము చేసికొందుము. పేతురు, యాకోబు, యోహాను, వారందరూ (మత్తయి, మర్కు, లూకా) యేసు చేసిన దానిని లేఖకులవలె వ్రాసిరి. కాని పౌలు సంగతులను క్రమములో ఉంచెను; అతడు క్రొత్త నిబంధన యొక్క ప్రవక్త అయి ఉండెను. బైబిలులోని మొదటి అయిదు గ్రంథములను ప్రోయుటకు కావలసిన దైవావేశమును పొందుటకు మోషే అరణ్యములోనికి వెళ్ళిన రీతిగా, పౌలు కూడా ఎడారిలోనికి వెళ్ళి, దేవుని నుండి ప్రేరణను పొంది, పాత నిబంధనలో మాదిరి గాను, క్రొత్త నిబంధన సంఘమును క్రమములోను ఉంచు ఆవేశమును పొందెను.

ఇశ్రాయేలు ఒక జ్ఞాపకార్థముగా ఆ బల్యర్పణ గొర్రెపిల్లను కలిగియుండిరి. అసలు అది ఒక్కసారియే అనగా ఐగుప్తు నుండి బయటకు వచ్చునపుడు ఉపయోగించబడినది. కాని ఇప్పుడు వారు దానిని యుగము అంతటిలోను ఒక జ్ఞాపకార్థముగా ఉంచిరి. మంచిది, ధర్మశాస్త్రము రానున్న సంగతులకు ఛాయ, మీరు చూచారా…

ఇప్పుడు, నేను ఆ సహవాసము, "ప్రభురాత్రి భోజనము" అని నమ్ముచున్నాను. (ఇప్పుడు దీనిని మనము "సహవాసము" అని పిలచుచున్నాము)

7ఇప్పుడు, మనకు మూడు దైవిక క్రమములు మాత్రమే విడిచి పెట్టబడియున్నవి: అందులో ఒకటి, సహవాసము; పాదములు కడుగుట; నీటి బాప్తిస్మము. ఆ మూడు మాత్రమే ఉన్నవి. అదే పరిపూర్ణత మూడు చూచారా? మనకున్న మూడు విధులు అవి మాత్రమే క్రొత్త నిబంధనలో పరిశుద్ధ పౌలు ద్వారా ఇవ్వబడిన విధులు అని మనము గ్రహించుచున్నాము.

"ఈ సంస్కారము కేవలము వాక్యమును తీసికొనుట" అని మనము చెప్పుచున్నచో ఒక వ్యక్తి తన హృదయములోనికి ప్రభువును చేర్చుకోనంతవరకు ప్రభురాత్రి భోజనమును స్వీకరించు హక్కు కలిగియుండని నేను నమ్ముచున్నాను, చూచారా, ఎందుకనగా… కొద్ది క్షణములలో నేను మీ కొరకు చదివి వినిపించుదును మరియు మీరు చూడగలరు. ఇప్పుడు గమనించండి. అప్పుడు, ఎందుకు మనము…?

అదే ప్రాతిపదిక మీద మనము సంపూర్తిగా రక్షణ సైన్యమును నీతిమంతులుగా తీర్చవచ్చును. వారు ఎట్టి విధమగు నీటి బాప్తిస్మమును విశ్వసించరు, "అది మనకు అవసరము లేదు," అని చెప్పెదరు. ఇప్పుడు నీటి బాప్తిస్మము మనకు అక్కరలేనిచో మనమెందుకు బాప్తిస్మము పొందాము? "నీరు నిన్ను రక్షించదు గాని రక్తము నన్ను రక్షించును" అని వారు చెప్పెదరు.

నేను దానితో సమ్మతించెదను. అది సరియే. నీరు కాదు గానీ, రక్తమే నిన్ను రక్షించును. కానీ అంతరంగమందు ఒక కృపా కార్యము జరిగినదనుటకు ఒక బాహ్య కదలికగా తప్పకుండా మనము నీటి బాప్తిస్మమును తీసికొనవలెను, చూచారా. కాబట్టి మనము తప్పక ప్రభురాత్రి భోజనమును ఆచరించవలెను.

ACTS 2:38•

1COR 11:23-27

 

8ఎప్పుడైతే మనము ప్రభువును, మన అర్పణ, మనలోనికి, మనలోనికి ఒక ఆత్మీయ జన్మగా పరిగ్రహించుచు, మరియు ఆయన శరీరము — వాక్యమును బట్టి మనము ఆయన ద్వారా జీవించుదుము — కాబట్టి దానిని మనము చిహ్న రూపముగా కూడా చూపించవలసియున్నాము, ఎందుకనగా, "ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందవలెను," అన్నది మనకివ్వబడిన ఆజ్ఞ.

పౌలు చెప్పెను, "ప్రభువు యొద్దనుండి నేను దేనిని పొందితినో, నేను మీకు ప్రకటించియున్నాను. ప్రభువైన యేసు, తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసికొని, దానిని విరిచి, శిష్యులకిచ్చి, ఈలాగు చెప్పెను, 'తీసికొని తిసుడి, నా జ్ఞాపకార్థముగా దీనిని చేయుడి.' ఆయన తిరిగి వచ్చువరకు ఆయన మరణమును మీరు ప్రచురపరచుడి." ఇక్కడ మనము కనుగోనునదేమన, దానిలో వచ్చిన ప్రజలుండిరి, మరియు…

ACTS 2:38•

GAL 1:8

 

9ఈ ప్రశస్త సోదరుడు, కాగా ప్రియమైన ఒక సోదరుడు, వచ్చి ఇట్లనెను, "నేను ఎన్నడు నేను దానిని తీసికొనలేదు బ్రెన్హాం సహోదరుడా. అది ఏమిటో నాకు అర్థము కాలేదు, నేను మరియొక విధంగా నేర్పించబడితిని."

నేనిట్లు చెప్పాను, "కాని గుర్తుంచుకోండి, పరిశుద్ధ పౌలు దానిని ఆదిమ క్రైస్తవ సంఘములో క్రమబద్దీకరణ చేసి అమలుపరచెనని మనము అంగీకరించుదుము. వారు సంఘము నుండి… వారు ఇంటింటా రొట్టె విరచిరి, ఏక హృదయముతో ఆలాగు చేసిరి. అతడు దానిని ఇప్పుడు సంఘములో ఉంచెను. గలతీ 1:8లో ఇట్లు పలికెను, 'పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి మరియొక విధముగా బోధించినచో, శాపగ్రస్తుడగును.' మీరు చూడండి — వారికి యోహాను బాప్తిస్మమును కాదని యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము ఇచ్చినది ఇతడే."

మీరు చూడండి, గుర్తుగా మనము తప్పక చేయవలసినవి మూడు విషయములున్నవి: ప్రభురాత్రి భోజనము, కాళ్ళు కడుగుట, నీటి బాప్తిస్మము, చూచారా.

LUKE 23:42•

1COR 11:27

 

10"మంచిది…" అని మీరనవచ్చును. ఇప్పుడు, సాల్వేషన్-ఆర్మీ వారు దీనిని ఏ కోణములో చూస్తున్నారో వినండి, "చనిపోవుచున్న దొంగ, ఆ చనిపోవు సమయమునకు ఇంకా బాప్తిస్మము పొంది యుండలేడు. అతడు పరలోకములో ఉండునని యేసు చెప్పెను." అది ఖచ్చితంముగా సత్యము. కాని మీరు చూడండి, అతడు తాను మరణించుచున్న ఆ ఘడియలోనే అక్కడే యేసును గుర్తించెను, చూచారా. కేవలము అది మాత్రమే అతనికున్న అవకాశము. అతడు ఒక దొంగ, దూరంగా, బయట ఉండేవాడు. కాని అతడు వెలుగును చూసిన వెంటనే దానిని గుర్తించేను: "ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసికొనుము!" అపుడు యేసు… అది సత్యమైయున్నది.

కాని బాప్తిస్మము పొందవలెనని ఎరిగిన మీరు మరియు నేను దానిని నిరాకరించినచో, అది అపుడు నీకు దేవునికి మధ్య విషయమై ఉండును. ప్రభురాత్రి భోజన విషయములోనూ అంతే.

ఇప్పుడు, మనమి ప్రభురాత్రి భోజనమును తీసికొనునపుడు, "ఏదో ఇక్కడకు వచ్చి రోట్టె ముక్కను తిందాము. నేను ఏలాగో క్రైస్తవుడిని అని నమ్ముచున్నాను గదా," అని తేలికగా భావించరాదు. కానీ మీరు గమనించినచో బైబిలు ఈలాగు చెప్పుట విందురు, "అయోగ్యముగా తిని త్రాగువాడు ప్రభువు యొక్క శరీరము, రక్తము విషయములో అపరాధియగును." నీవు యధార్థముగా ఉన్నావని ప్రజల యెదుట, దేవుని యెదుట చూపించగల ఒక జీవితమును జీవించవలసియున్నావు.

2KGS 17:37

 

11(ఇప్పుడు, ఒక క్షణము పాటు మాత్రమే.) ఇప్పుడు, పాత నిబంధనలో బలియర్పణ ఒక కట్టడ లేదా విధిగా రూపొందించబడినది… అలాగే నీటి బాప్తిస్మము కూడా ఒక విధి, ఆలాగే కాళ్ళు కడుగుట కూడా ఒక విధి, అలాగే ప్రభురాత్రి భోననము కూడా ఒక విధి. జీవవృక్షములో ప్రవేశించు హక్కును పొందుటకు వీలుగా ఆయన యొక్క విధులన్నిటిని, ఆయన యొక్క కట్టడలన్నింటిని, ఆయన యొక్క ఆజ్ఞలన్నింటిని గైకొనువాడు ధన్యుడు."

ఇప్పుడు, ఇక్కడ దీనిని గమనించండి, ఒక బలిని సంఘమునకు, మరియు ఒక ఆలయమునకు, బలిపీఠము నొద్దకు తీసికొని వచ్చి, ఆ తెచ్చిన నీ కానుకను, అనగా, బలిగా అర్పించబడు గొర్రెపిల్లను నీ పాపముల కొరకు అక్కడ అర్పించుట మొదటగా దేవుని యొక్క విధియైయుండెను. మంచిది, తాను అపరాధిని అని గ్రహించిన ఒక యూదా సోదరుడు మార్గములో వచ్చుచుండుటను నేను కేవలము ఊహించి చూడకలుగుచున్నాను. అతడు బలిపీఠము నొద్దకు వెళ్ళును. తనయొక్క క్రొవ్విన యెద్దును, లేదా ఒక దూడను, లేదా తనకున్నదానిని, లేక ఒక పొట్టేలును, గొర్రెపిల్లను, మరిదేనినో తీసికొని వచ్చును. తనకు సాధ్యమైనంత శాయశక్తులా యధార్థముగా ఉండి దానిని అతడు మార్గములో తీసికొని వచ్చెను. అక్కడికి నడిచి వచ్చాడు. శక్తివంచన లేకుండా ప్రయత్నించి, దేవుని యొక్క విధిని అతడు గైకొనెను.

అపుడు అతడు దాని మీద తన చేతినుచును, తన పాపములను ఒప్పుకొనును. దీనిని (అతని పాపములను) ఆ యాజకుడు. గొర్రెపిల్ల మీద ఉంచును. గొర్రెపిల్ల గొంతు కోయబడును, అతని కొరకు అక్కడది చనిపోయేను. అతడు దానిని అక్కడ ఉంచినపుడు, ఆ చిన్న గొర్రెపిల్ల రకములో గిలగిల తన్నుకొనును. అతని చేతులు పూర్తిగా రక్తముతో వీడిపోవును. ఆ రక్తము అతని మీద పూర్తిగా చిందును. (ఆ చిన్న గొర్రె పిల్ల విల విలలాడుచు మరణించును) తాను పాపము చేసెను గనుక తన స్థానములో ఏదో చనిపోయియుండవలసియున్నదని అతడు గ్రహించును. కాబట్టి అతడు తన మరణము కొరకు ఈ గొర్రెపిల్ల మరణమును అర్పించుచున్నాడు, చూచారా. ఆ గొర్రెపిల్ల అతని స్థానములో చనిపోయెను. అపుడు ఆ మనిషి దానిని యధార్థముగా, అతని హృదయము యొక్క లోతుతో దానిని జరిగించెను.

ISA 28:8-13

 

12చివరకు అదే మరల మరల పునరావృతమైనది, చివరకు అది ఒక ఆచారముగా తయారగువరకు కొనసాగినది. దేపుని యొక్క ఆజ్ఞ జనులకు ఒక పారంపర్యాచారముగా అయినది. అపుడు ఆయన ఇక్కడకు వచ్చెను, "మంచిది, మనము చూద్దాం, ఇది ఈనాటి ఫలాని ఫలానిది, నేను కూడా అందులోనే వెళ్ళిపోవుట మంచిదేమో. అవును, నేను ఒక ఎద్దును బలిగా అర్పించెదను." ఆయన వెళ్ళెను, "సరే, ప్రభువా, ఇదిగో నా ఎద్దు" అనెను. చూచారా, అందులో ఎట్టి యధార్థత లేదు. దానిని అసలు గ్రహింపు లేదు.

ఇప్పుడు, ఆ విధంగా మనము ప్రభురాత్రి భోజనమును తీసికొనరాదు. ప్రభుని బల్లయొద్దకు వచ్చునపుడునూ అలాగే యున్నది.

యెషయా 35… కాదు, క్షమించండి, యెషయా 60… దానిని తిరిగి తీసికోనియండి… అది యెషయా 28 అనుకొంటాను. దీనిని అక్కడ చూతుము. అదే సరియైన అధ్యాయమని ఖచ్చితంగా చెప్పగలను. ఆయనిట్లు పలికెను, "ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ; సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము; కొంత ఇచ్చట, కొంత అచ్చట యెహోవా వాక్యము మాకు వచ్చును. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను, అన్యభాషల చేతను ఈ జనులతో మాట్లాడుతున్నాడు."

ఆయనిట్లు పలికెను, "ప్రభువు యొక్క బల్లలన్నియూ వాంతితో నీండియున్నవి. ఎవరికి విద్య నేను బోధింతును? ఎవరికి వర్తమానము తెలియచేయుదును?" చూచారా? (అదే సరైన వాక్యభాగమని నేను తలంచుచున్నాను, యెషయా 28.) "ఎవరికి విద్య నేర్పుదును?" చూచారా, "భోజనపు బల్లలు."

13ఇప్పుడు, మనము ఈ రాత్రి జరిగించబోవు గొప్ప సంగతి ఏదనగా, ఆయన మరణము గూర్చిన జ్ఞాపకార్ధము; మరియు మనము రోజు తినుచున్నామని నమ్ము ఆయన శరీరము - లేక తినుట జరుగుచున్నది, దేవుని వాక్యము తీసుకొని మన సహోదరుడు బోధించిన ప్రకారము… దానిని మనము మన యొక్క పూర్ణహృదయముతో నమ్ముచున్నాము. అది ప్రత్యక్షపరచబడుట మనము చూచుచున్నాము; అది మనకు అనుగ్రహించబడుట చూస్తున్నాము; అది రుజువుచేయబడుట చూస్తున్నాము; మన జీవితములలో దానిని మనము అనుభవించుచున్నాము. అది ఒక క్రమము అని మాత్రమే చేయుట కాదు గాని, మనము చేయుచున్న దానిని ఒక లోతయిన మనస్సాక్షితో చేయుటకు తప్పక రావలెను.

సంఘములోనికి వెళ్ళండి, చాలా సార్లు వారు ఒక పాత పిండితో చేసిన బిస్కెట్ లేదా ఒక విధమగు దానిని ఏదో ఇచ్చి, దానిని విరచుదురు, మరియు తేలికపాటి రొట్టె లేదా ఏదో ఒకటి, దానిని విరచుదురు; పొగత్రాగువారు, మద్యము త్రాగువారు, సమస్త హేయములు చేయువారు పాల్గొందురు, ఎందుకనగా వారు సంఘములో సభ్యులు గనుక వారు వచ్చి ప్రభురాత్రి భోజనమును తీసికొందురు. మంచిది, అది దేవుని ఎదుట మురికి అయి యున్నది.

AMOS 5:21

 

14బలి సహితము అంతే… "మీ పవిత్ర దినములు, మీ బలులు నాకు మురికి వాసన కొట్టుచున్నవి" అని ఆయన చెప్పెను. అయినను ఆయన బలి అర్పించమని వారికి ఆదేశించెను. కాని వారు దానిని జరిగించిన తీరు ఆయనకు (ఆయన ముక్కునకు, నాసికా రంధ్రములకు) దుర్వాసన కొట్టినది. ఆయన ఆదేచించిన ఆ బలియే ఆలాగు మాగినది.

దేవుని వాక్యమును కూడా మనము అలాగే ఈ రోజున స్వీకరించుచున్నాము. ఈనాడు అనేకమంది క్రైస్తవులు (నామకార్ధపు వారు) దానిని చేయుచన్నారు. మనము ఇక్కడ నిలబడి ఈ వాక్యమును బోధించుచుండగా, "యేసుక్రీస్తు నిన్న, నేడు, నీరంతరము ఏకరీతిగా లేడని" చెప్పెదరు, తాను గౌరవించుదునని ఆయన మనకు వాగ్ధానము చేసినవి చెప్పుచుండగా, "ఓ, మంచిది, అది మరెవరి కొరకులే" అని అనుచున్నారు. మన విధేయమైన ఆరాధనలు ఆయన ముక్కునకు చెడు వాసన కొట్టుచున్నవి. ఏ విధముగాను ఆయన వాటిని స్వీకరిచడు. అదే కారణమును, మన పారంపర్య ఆచారము వలననే…

15ఒక ఆచారముగా ప్రభురాత్రి భోజనమును నీవు తీసికొనకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుటలో దేవుని యొక్క ప్రేమ నీ హృదయములో ఉన్నది కనుకనే నీవు తీసుకొనుచున్నావు, చూచారా. అందుకొరకే నీవు దానిని తీసుకొనుచున్నావు.

కనుక, దానిని నీవు యధార్థముగా తీసికోనియెడల — కేవలము, ఒక ఆచారముగా పరిగణించుచూ, "మా సంఘము ప్రతి ఆదివారమునకొకసారి, లేదా నెలలో ఒకసారి, లేదా సంవత్సరములో రెండుసార్లు ఆచరించుదురు," అని చెప్పి; నీవు వెళ్ళి, "నా సమయము వచ్చినది," అనుకొంటూ, ప్రభురాత్రి భోజనమును తిసుకొందురు — ఏల, అది దేవునికి మురికి కంపు. చూచారా, అది కేవలము ఒక ఆచారము.

ఏ విషయములో అయినాగాని, నీవు యధార్థముగా ఉండవలసియున్నావు. దేవుడు నీ హృదయ లోతును కోరుచున్నాడు. నీవు గుర్తుంచుకొనుము, ఈ భూమి మీదకు నిన్ను తీసికొనివచ్చిన అదే దేవుని నీవు సేవించుచున్నావు.

ఆయన ఆలాగు వలికెను కాబట్టి మీరు దీనిని చేయుచున్నారు, ఎందుకనగా అది ఆయన క్రమము. అయితే దేవుని కృపను బట్టి మనము రక్షించబడియున్నామని ఎరిగినవరమై, మనము లోతయిన యధార్థతతో రావలెను. మనము ఆయనను ప్రేమించుచున్నాము మరియు మనము ఆయన సన్నిధిని తాకుచున్నాము, అది మన జీవితములను మార్చుటను చూస్తున్నాము. మనము సర్వస్వమూ మారినది. మనము ప్రత్యేకమైన జనులము. ఇంతకు మునుపువలె మనము జీవించము. ఇంతకు మునుపువలె మనము ఆలోచించము.

16ఇక్కడి ఈ గ్రంధములో ఉన్నట్లుగానే… అందులోని రెండు గ్రంధములలో మనము ఒకటి, అనగా, జీవగ్రంధమును గూర్చి మాట్లాడుకొనుచున్నాము. నీవు పుట్టినపుడు ఆ మొదటి జీవగ్రంధము ప్రారంభమగును. అది నీ స్వాభావిక జన్మము, చూచారా. కాని అపుడు ఒక కాలములో, ఎక్కడో ఆ వెనుకన, (ఈ మధ్యాహ్నము ఆ ఇంటి యొద్ద కొందరు యవ్వన సోదరీలకు నేను వివరించినట్లుగానే), ఆ చిన్న జీవ బీజమున్నది. చూడండి, అక్కడ ఆ చిన్న జీవపు గింజ అక్కడ పడియున్నది. అదెక్కడనుండి వచ్చినది? ఈ వింత సంగతులన్నియూ ఏమిటి?" అని నీవు ఆశ్చర్యపడుచుందువు.

నన్ను నేనే తీసికొని ఇది నేను చెప్పుకొనుచున్నాను, "విలియం బ్రెన్హాం, ఆ నలభై ఏండ్ల క్రిందనున్న విలియం బ్రెన్హామేనా ఇతడు?" అని మీరు ఈ రాత్రి నన్ను చూచి చెప్పుకొనుట జరుగును గదా? ఆ వెనక నన్ను ఎరిగిన ఎవరో ఈ విధముగా అందురు, "అతడొక అగ్రశ్రేణి పనికిమాలినవాడు," చూచారా, ఎందుకనగా నేను చార్లెస్ మరియు ఎల్లా బ్రెన్హాములకు జన్మించాను కాబట్టి. వారి స్వభావములో నేను ఒక పాపిని. ఈ లోకములోనికి నేను ఒక అబద్ధీకునిగా వచ్చాను, లోకము యొక్క అలవాట్లన్నియూ నాలో ఉండినవి. కానీ అక్కడ లోతులో మరియొక స్వభావము కూడా ఉండినది, ముందుగా నిర్ణయించబడినది. దేవునిచే ముందుగా ఏర్పాటయినది. ఇదే శరీరము, రెండు స్వభావములు ఉన్నవి.

అయితే నేను ఒకదానికే కేటాయించబడితిని. ఎదుగుతూ పిల్లవానిగా ఉన్నపుడు నేను, "నాన్నా…నా" అన్నాను. మొదటి సంగతి మీకు తెలుసా, నేను ఒక అబద్ధీకునిగా మారాను, పాపిగా నుండవలసినవన్నీయూ నాలో ఉండెను, ఎందుకనగా ఆ రీతిగా నేను పెంచబడ్డాను. కాని ఆ లోతులో ఎక్కడో ఈ కాలమంతటిలోను ఒక చిన్న జీవ కణము ఉండెను.

17చిన్న బాలునిగా నున్నప్పటి ఒక సంగతి నాకు గుర్తున్నది (ఎక్కువ సేపు మిమ్మును ఉంచను. కాని తెలిసికొనుడి…) ఆ ఏటి గట్టున కూర్చుని రాత్రులందు చట్టూ చూస్తుండేవాడిని. మా అమ్మ నాన్న విశ్రాంతికి వెళ్ళిపోయేవారు. ఆ రోజుల్లో వారు ఇంకా పాపులే, మా గృహాల్లో అసలు క్రైస్తవ్యమే లేదు. ఓ, త్రాగుడు విందులు అన్నీ కొనసాగేవి… అది నాకు నచ్చేది కాదు. నేను నా లాంతరు, నా కుక్కను తీసికొని అడవులకు వెళ్ళి రాత్రంతా ఉండిపోయేవాడిని. చలికాలమందు ఆ విందు అయిపోయేవరకు వేటాడేవాడిని. ఉదయపు వెలుగులో కూడా ఆలాగు చేసేవాడిని. ఇంటికి వచ్చేసరికి ఆ విందులు ఇంకా అయిపోని స్థితిలో, ఆ గుడిసె పైభాగాన నిద్రపోయేవాడిని. పగలు ఎప్పుడగునా అని ఎదురుచూచేవాడిని.

అపుడు ఆ కాలములు ఎట్లు గడిచినవో నేను ఆలోచించుచుందును, ఎండా కాలములో నేను అక్కడ ఉండే ఒకవేళ వర్షము వచ్చునేమోనని, కొద్దిగా గాలిని అడ్డగించుటకు కర్రలు తీసికొని క్రింద అమర్చెడివాడిని; అక్కడుండి, కర్రలు నీటిలో గ్రుచ్చి చేపలు వేటాడేవాడిని; ఆ ముసలి కూన్ కుక్క అక్కడే ఉండేది. నేను ఈలాగు చెప్పేవాడిని, "ఇటు చూడు, గత చలికాలంలో ఒక రాత్రి ఇక్కడే నిలిచియున్నాను. చెట్టు వద్దనున్న నా ముసలి కుక్కను కనిపెట్టుకొంటూ ఇక్కడే సరిగ్గా ఒక మంట రాజేసాను. ఇక్కడే నిప్పులు తయారు చేశాను. భూమి మీద అయిదు అంగుళాల మంచు గడ్డకట్టుకొనియున్నది. కాని, ఓ చిన్న పుష్పమా, నీవెక్కడ నుండి వచ్చావు? ఎక్కడ నుండి నీవు వచ్చావు? ఎవరు నిన్ను తీసికొని వచ్చి ఇక్కడ నాటారు? వారు ఏ వేడి గృహము నుండి నిన్ను బయటకు తీసికొనివచ్చారా? లేక నీ సంగతి ఏమిటి? ఎక్కడ నుండి వచ్చావు?" చూచారా, ఆ చిన్న పూవు… "అంతా మంచుతో గడ్డకట్టుకొన్నది. ఇక్కడ ఈ పైభాగాన నేను నిప్పు రాజేశాను, ఆ గడ్డకట్టే శీతల గుణమే కాకుండా అక్కడ నేను మండించిన ఆ పాత చీకిపోయిన మొద్దులో ఒక వేడి గుణము కూడా దాగియున్నది. అయినను నీవు ఇక్కడ ఇంకా సజీవంగా ఉన్నావు. నీవెక్కడ నుండి వచ్చావు?" అని నేను ఆ పూవుతో చెప్పుచుండేవాడిని.

18ఏమిటది? అక్కడ మరియొక విలియం బ్రెన్హాం ఉన్నాడు, చూచారా. ఎక్కడో అడుగున దేవుని యొక్క జన్యువుల నుండి వచ్చిన ఒక చిన్న నిత్యజీవ తునక ఉన్నది. అక్కడ దేవుని యొక్క వాక్యము ఉంచబడినది. మీ ప్రతి ఒక్కరు అదే రీతిగా సంగతులు ఆలోచించగలరు, చూచారా. అది పని చేయుచున్నది.

అపుడు నేను చెట్లు వైపు చూచి ఈలాగు తలంచేవాడిని, "ఆకూ, గత సంవత్సరము నీవు రాలిపోవుట చూచాను. ఏలాగు నీవు మరల ఇక్కడకు వచ్చావు? ఎక్కడ నుండి నీవు వచ్చావు? ఏది నిన్ను ఇక్కడికి తీసికొని వచ్చినది?" చూడండి, అది శరీరములో పని చేయుచున్న నిత్యజీవము.

ఒక రోజున నేను నడిచి వెళ్ళిపోవుచుండగా, ఆ స్వరము మాట్లాడినది, "ఎన్నడూ పొగ, మద్యము త్రాగవద్దు. అట్టి చెడ్డపనులేవీ చేయవద్దు." ఆ యువకులందరూ పెద్దవారయిపోయారు. చూడండి, ఏదో అక్కడ కదులుచున్నది.

అయితే హఠాత్తుగా ఒక్క సారి నేను పైకి చూచి ఇట్లన్నాను, "నేను ఛార్లెస్, ఎల్లా బ్రెన్హాముల కుమారుడిని కాదు. ఏదో నన్ను పిలుస్తున్నది." ఆ నా చిన్న పక్షిరాజు పిల్లవలె; "నేను కోడిపిల్లను కాను. ఆ ఆవల ఎక్కడో ఏదోయున్నది. ఓ, గొప్ప యెహోవా, నీ వెవరివయినా

గాని బయలుపరచుకొనుము ! నేను ఇంటికి రాగోరుచున్నాను. నాలో ఏదో యుండి పిలచుచున్నది."

అపుడు నేను తిరిగి జన్మించాను. అక్కడ పడియున్న ఆ చిన్న జీవము మీద జీవజలము పోయబడినది. అపుడది ఎదుగ నారంభించినది. అపుడు ఆ పాత జీవితము క్షమించబడినది. దేవుని యొక్క మరపు అను సముద్రములో అది పడవేయబడినది, నాకు వ్యతిరేకముగా అది ఎన్నడూ తిరిగి జ్ఞాపకము చేసికొనబడదు, చూచారా. ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి నిలబడియున్నాము. — అసలు ఎన్నడూ పాపము చేయనివారివలె — దేవుని సన్నిధిలో యున్నాము.

1COR 11:33

 

19ప్రభువు యొక్క భోజన యొద్దకు మనము వచ్చునపుడు తప్పకుండా మనము గౌరవము, ప్రేమ, మర్యాదలతో రావలెను. అది ఆయన కొరకు కానిచో మనము ఎక్కడ ఉండియుండెడివారము?" చూచారా. మనము ఎక్కడ ఉండేడివారమో…

కాబట్టి, పౌలు, ఈ విధంగా చెప్పెను అనుకొంటాను, "కాబట్టి దీనిని తినుటకు మీరందరు కూడి వచ్చునపుడు ఒకరికొరకు ఒకరు కనిపెట్టుకొనియుండుడి," మరొక మాటలో, కొద్ది నిమిషములు ఆగి, ప్రార్థించి, మిమ్ములను మీరు పరీక్షించుకొనుడి. ఏదయిన పొరపొటులో ఉన్న నీకు తెలిసిన ఒక సోదరుడు, అక్కడున్నచో అతని కొరకు కూడా నీవు ప్రార్థించవలెను. చూచారా, "ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకొని యుండుడి." ఒక్క నిమిషము ఆగి, ప్రార్థించండి. నీకును ఇంకెవరికైనా మధ్య ఎట్టి వీభేదములయినా ఉన్నచో దానిని చేయవద్దు. అది ఆచరించవద్దు — మొదటగా దానినీ సరిచేసికొనుము, చూచారా. వెళ్ళి, మొదటగా దానిని చక్కదిద్దుకొనుము, ఎందుకనగా వారు ఇచ్చటకు సాధ్యమైనంత పవిత్రతతో రావలెను, దేవుని పట్ల, ఒకరికి-మరొకరి పట్ల మన ఆలోచనలు వీలయినంత పవిత్రముగా ఉండవలెను. పరస్పరము మనము ఆలాగే యుండవలెను, మరియు అపుడు మనము ప్రభువు బల్ల యొక్క సహవాసమును సమీపించవలెను, చూచారా.

JOHN 6:53

 

20దీనిని మనము ఎందుకు చేయుచున్నామనగా, అందరి మధ్య మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆయన యొక్క రక్తము మరియు ఆయన యొక్క శరీరముగా — అందరము కలిసి, మన మధ్యలో రొట్టెను తినుచున్నాము; అందరము కలిసి, మన మధ్యలో ద్రాక్షారసమును త్రాగుచున్నాము.

"మనుష్యకుమారుని శరీరము తిని, ఆయన రక్తము త్రాగితేనే గాని, మీలో నిత్యజీవముండదు," చూచారా. చూడండి, అది బైబిలు చెప్పిన మాట. అది నీవు చేయనియెడల, నీలో జీవముండదు. మీరు చూచారా? అపుడు నీవు, కొద్దో గొప్పో, నిన్నునీవు క్రైస్తవునిగా గుర్తించుకొనుటకు సిగ్గుపడుచున్నావని చూపించుచున్నాను, ఎందుకనగా నీవు జీవించుచున్న జీవితమును బట్టియే. అపుడు ఇది నిజంగా ఒక బలప్రదర్శనయే. అపుడు నీవు ఆలాగు చేయనిచో, నీకు జీవనుండదు. నీవు అయోగ్యముగా దానిని చేసినచో, నీవు ప్రభువు యొక్క శరీరమును గూర్చి అపరాధివగుదుపు.

21నీటి బాప్తిస్మము విషయములోను అంతే. "మేము యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఆయన మమ్మును పాపము నుండి రక్షించెను. మేము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందామ!" అని మనము చెప్పినచో, ఆయనకు మనము అవమానము తెచ్చుట కాక మరేమీ కాదు —మనము తప్పు క్రియ చేయుచున్నాము కాబట్టి వాటికి వెల చెల్లించవలెను. మరో సంగతి, అది మనము చేసినపుడు, మనము పైకి ఒకటి చెప్పి, మరొకటి చేయుచున్నాము. ఈనాడు మన సమస్య అదే.

నేననుకొనుచున్నాను… "మనము" అని నేను నా గూర్చియు, మరియు ఈ చివరి ఘడియలలో నన్ను మాట్లాడనిచ్చుటకు ప్రభువగు దేవుడు నాకిచ్చిన సంఘమును ఉద్దేశించియు చెప్పుచున్నాను — మనము అంత్య సమయములో ఉన్నామని నమ్ముచున్నాము. దేవుడు మనకు ఒక వర్తమానము ఇచ్చెనని నమ్ముచున్నాము. అది దేవునిచే అభిషేకించబడినది, అది దేవునిచే రుజువు చేయబడినది, అది దేవునిచే ఎత్తి చూపబడినది. ఇప్పుడు, మనము తప్పక భక్తి మర్యాదతో మరియు ప్రేమతో, మరియు హృదయము మరియు మనస్సు మరియు ఆత్మ పవిత్రతతో ఆయన యొద్దకు రావలెను.

22అననీయా, సప్పీరాలతో మాట్లాడినట్లుగానే పరిశుద్ధాత్మ మాట్లాడు ఘడియ మన మధ్యకు త్వరలోనే రానున్నదని మీకు తెలిసికొనుడి. చూడండి, ఆ ఘడియ సమీపించుచున్నది, చూచారా. మరియు మనము… ఇప్పుడు, మీరు గుర్తుంచుకొనండి, దేవుడు తన జనుల మధ్య నివాసము చేయనైయున్నాడు. ఇప్పుడు ఆయన చేయగోరునది అదియే.

మనము వర్తమానమును స్వీకరించుటను ఇట్లు చెప్పవచ్చును… నేను ఒక యువకునిగా ఉండి, ఒక భార్య కొరకు వెదకుచున్నాననుకోండి, నేను భార్యను కనుగొనగలను. నేను ఈలాగు అందును, "అమె పరిపూర్ణమైనదిగాను, ఆమె క్రైస్తవురాలిగాను, ఆమె చక్కని స్త్రీగాను ఉండవలెను. ఇవన్నీ ఆమెలో యున్నపుడు నాకు నమ్మకము కలుగును." ఎంత నమ్మకమున్నా గాని, ఆమె ఎంత మంచిదని నేను ఆలోచించినా గాని, ఆమె నన్ను స్వీకరించాలి, నేను ఆమెను స్వీకరించాలి, చూడండి, ఈ ప్రమాణముల మీదనే.

వర్తమానము విషయములోను అదే రీతిగా యున్నది. అది సరయినదని మనము చూచాము. దానిని సరిగా దేవుడే బయలుపరచెనని మనము చూచాము. అది పూర్తిగా సరియైనది. సంవత్సరాల తరబడి, సంవత్సరాల తరబడి అది సరయినదిగాను, ఖచ్చితమైనదిగాను కొనసాగుచున్నది. అది చెప్పిన ప్రతిది ఆయన చెప్పిన ప్రకారమే ఖచ్చితముగా జరుగుచున్నది. ఇప్పుడు, అది నిజమని మనము ఎరిగియున్నాము; కాని, చూడండి, దానిని జ్ఞానసంబంధమైన కోణములో చూడకండి. ఆలాగు మీరు చేసినచో, మీకు ఒక వాడేసిన మతము (secondhanded religion) దొరుకును. మనకు వాడేసిన మతము అక్కరలేదు — ఎవరో తమ అనుభవాన్ని బట్టి కనుగొనిన ఏదో మనకు వద్దు. వారి సాక్ష్యమును మనసు జీవించుచున్నాము.

23పిలాతుతో యేసు చెప్పిన మాట అనుకొంటాను (ఏదో - ఒక మాట నేను ఆలోచింస్తున్నాను — కొద్ది క్షణముల క్రితము ఆయన అక్కడ ఇట్లనెను), "అది నీకేవరు చెప్పారు, లేదా అది నీకు బయలుపరచబడినదా? ఈ సంగతులు నీకెట్లు తెలియును?" మరో మాటలో (ఖచ్చితంగా ఆ మాట ఏమిటో ఇప్పుడు నాకు తెలియదు; దానిని నేను చదివి చాలా కాలము అయినది), కాని, "నీవెట్లు గమనించావు… ఏలాగు… దీనిని నీకెవరు బయలుపరిచిరి?" [దేవుని కుమారుడని ఆయనను గురించిన విషయము.] దానిని నీకు ఎవరు బయలుపరిచిరి? దానిని నీకు ఏ మనిషి అయినా చెప్పెనా? లేదా," యేసు చెప్పిన విధంగా, "పరలోకమందున్న నా తండ్రియేనా నీకు దీనిని బయలు పరచినది?" చూచారా? "దానిని నీవెట్లు నేర్చుకొన్నావు? వాడేసినదా? లేక అది దేవుని నుండి వచ్చిన ఒక పరిపూర్ణ ప్రత్యక్షతా?''

ఏదో నేను పాల్గొనక తప్పని ఒక క్రమమేనా ఈ ప్రభురాత్రి భోజనము, "అందరూ తీసికొనుచున్నారు కదా, నేను కూడా తీసికొందును" అని అనుచున్నావా? అది ఒక ప్రత్యక్షత - నేను ఆయనలో భాగమైయున్నాననునదియు మరియు నేను మీలో భాగమైయున్నాననునదియు, మరియు నేను మిమ్మును ప్రేమించుచున్నాను మరియు ఆయనను ప్రేమించుచున్నాను, మనము పరస్పరము కలిగియున్న ప్రేమ మరియు సహవాసములకు, మరియు దేవుని పట్ల మన యొక్క ప్రేమకు చిహ్నముగా, దీనిని కలిసి తీసికొనుచున్నాము.

24ఇప్పుడు, నేను వాక్యము నుండి కొంత చదువగోరుచున్నాను. అపుడు నేను అనుకొందును… సహోదరుడు పియరీ ఈ రోజు ఏ మార్గమునకు నడిపించగోరునో, అదే చేయుదము. మీ యొద్ద బైబిలున్నచో, మీరు నాతో దానిని చదువవలెనని కోరుచున్నాను. I కొరింథీయులకు - 11వ అధ్యాయము 23వ వచనము నుండి ప్రారంభించుదము.

మన ఆలయము నొద్ద కూడా ఎల్లప్పుడు దీనిని మరియు కాళ్ళు కడుగుటను ఆచరించియున్నాము, ఎందుకనగా ఆ రెండూ జతగా వెళ్ళుచుండును. దానిని బుధవారము రాత్రి సోదరుడు ప్రకటించెనని నమ్ముచున్నాను (ఎందుకనగా జనమును బట్టియును మరియు మీకు కాళ్ళు కడుగుటకు జనులు పట్టునంత స్థలము లేనందునను), వారు దానిని ఈ బుధవారము రాత్రికి ఆచరించనైయున్నారు.

1COR 11:23,24•

GAL 1:8

 

25ఇప్పుడు I కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనములో పౌలు చెప్పినది వినండి. ఇప్పుడు గుర్తుంచుకొనండి, గలతీ 1:8ని మీరు మనస్సులో ఉంచుకొనుడి: "మేము గాని లేదా పరలోకము నుండి ఒక దూతగాని వచ్చి మరేదైనా సువార్తను బోధించినచో, [అతడు బోధించిన ఈ సువార్త గాక మరొక్కటి] అతడు శాపగ్రస్తుడగును గాక," చూచారా.

నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తికొని:

కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి, … తీసుకొని మరియు తినుడి: ఇది నా శరీరము, ఇది మీ కొరకు నలుగగొట్టబడినది: నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

ఇప్పుడు, నన్ను ఇక్కడ ఆగనీయండి, మీరు చూడండి. ఈ సహవాసములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమును తీసికొనుట అనగా క్రీస్తు యొక్క శరీరమును అక్షరాలా ప్రభురాత్రి సంస్కారములో తీసికొనుట కాదు. అది కాతలిక్కు భావము. అది సరియైనదని నేను నమ్మను. కేవలము అది దేవుడు మనతో చేసిన ఒక విధి మాత్రమేనని నేను నమ్ముచున్నాను, చూచారా; అది అక్షరాలా శరీరము కాదు. ఇప్పుడు, అది నిజముగా ఒక చిన్న రొట్టె ముక్క. అది కేవలము ఒక విధి.

26అలాగే నీటిలో యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మమును (యేసు క్రీస్తు నామములో) మా పొషములను క్షమించునని కూడా నేను నమ్మను. రోజంతా మీరు బాప్తిస్మము పొందవచ్చును… బహుశా, ఇప్పుడు ఇక్కడే అపోస్తలిక్ సంఘము నుండి వచ్చిన వారు కూర్చుండి యుండవచ్చును… అనగా దానిని బోధించు యునైటెడ్ పెంతెకోస్తు సంఘమువారని నా భావము. కాని, మీరు చూడండి, నీరు పాపములను క్షమించునని నేను నమ్మును. లేదా, అలాగయినచో, యేసు చనిపోవుట వ్యర్థము, చూచారా. అది దేవుని యొక్క ఒక విధి అని మాత్రమే అని నేను నమ్ముచున్నాను, చూడండి. మీరు క్షమించబడినారని చూపించుటకే అది. కాని నూతన జన్మ కొరకు బాప్తిస్మము, లేదు, నేను దానిని నమ్మను. నీరు పాపములను క్షమించునని నేను నమ్ముట లేదు.

ఈ రొట్టె మరియు ద్రాక్షారసము దేవుడు మనకు చేయమని ఆజ్ఞాపించిన విధిని గైకొనుట తప్ప మరేమీ కాదు, అని నేను నమ్ముచున్నాను, చూచారా. అది నిజము. నీటి బాప్తిస్మము కూడా అంతే. దానిని చేయమని అది మనలను బలవంతపరచుచున్నది, మన మాదిరి కొరకు, ఆయన దానినంతటిని చేసెను. దీనిని ఆయన మన ఉదాహరణగా చేసెను, మరియు మన మాదిరి కొరకు ఆయన కాళ్ళు కడిగెను.

1COR 11:25-29

 

27ఇప్పుడు, "ఆ ప్రకారమే" అని ఇప్పుడు 25వ వచనము చెప్పుచున్నది:

ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని, ఈ పాత్ర నా రక్తమువలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

మీరు ఈ రొట్టెను తిని, [ఇప్పుడు, గుర్తుంచుకొనండి] ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. [ఎంత కాలము? "ఆయన వచ్చు వరకు, చూచారా],

కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.

నన్ను ఒక్క నిమిషము ఆగనీయండి. దీనిని ఆయన చెప్పిన కారణము… ఇక్కడే మరియొక వచనములో, మరో అధ్యాయములో ఆయన చెప్పెను, "ప్రభుని బల్లయొద్దకు మీరు మద్యముతో మత్తులగుటకు కూడా కూడివచ్చుచున్నారని నాకు అర్థమగుచున్నది." వారు దానిని అపార్థము చేసికొనిరి, మీరు చూడండి. వారు తిండిబోతులయిరి, చూడండి. ఈనాడు ప్రజలు చేయుచున్నట్లుగానే, ఏ విధమగు జీవితము జీవించినాగాని దానిని తీసికొనుచున్నారు, చూచారా. ఆయన చెప్పెను, "మీరు తినుటకు, త్రాగుటకు మీకు ఇండ్లున్నవి, చూడండి. కాని ఇది మనము గైకొనవలసిన ఒక విధి," చూచారా." ఇప్పుడు:

కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను.

ప్రభువు శరీరమని వివేచింపక, తిని త్రాగువాడు తనకు శీక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

1COR 11:30-34

 

28నీవేమైయున్నావు? నీవు ఒక క్రైస్తవునివి. అందరి యెదుట నీవు ఒక క్రైస్తవునిగా జీవించుచున్నావు. ఒకవేళ నీవు దానిని తీసికొనియు, ఒక క్రైస్తవునిగా జీవించనిచో, నీవు ప్రభువు శరీరమును వివేచించుటలేదు. ఎవరో ఒకరి మార్గములో నీవు ఒక అడ్డు బండను పడవేయుచున్నావు, చూడండి, నీవు అది చేయుటకు ప్రయత్నము చేయుచున్నావని వారు చూచినప్పుడు మరియు అప్పుడు నీవు జీవించవలసిన విధముగా నీవు జీవించుటలేదు, చూచారా. మీరు ప్రభువు యొక్క శరీరమని వివేచించుట లేదు. దాని యొక్క శాపమేమిటో ఇప్పుడు గమనించండి:

ఇందువలననే మిలో అనేకులు బలహీనులును, రోగులునైయున్నారు, చాలామంది నిద్రించుచున్నారు. (దానికి సరయిన తర్జుమా, సహోదరుడా పియరీ, "మరణము." చూచారా, చాలా మంది చనిపోయిరి.]

అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందకపోవుదుము. [మనలను మనమే తీర్పు తీర్చుకొన్నచో తీర్పు పొందక పోదుము.]

మనము తీర్పు పొందినయెడల, లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. [చూడండి, లోకముతో ఎట్టి విజ్జోడు లేదు.]

కాబట్టి నా సాహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడా వచ్చునపుడు, ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొనియుండుడి.

మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల, తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినపుడు మిగిలిన సంగతులను క్రమపగతును.

AMOS 5:21

 

29ఇప్పుడు ఇంకో మాటలో చెప్పాలంటే, ఏదో తీసికొనుటకు రావద్దు… కొద్దిసేపటి క్రితం నేను యూదులు తమ అర్పణములను తెచ్చుట గూర్చి చెప్పిన ప్రకారమే, వారు… అది అద్భుతము, అది దేవునిచే ఇయ్యబడెను. కాని వారు యధార్థముతో మరియు గౌరవముతో, క్రమముతో జరిగించని స్థితికి వచ్చిరి. అది కేవలము… ఆయన ముక్కుకు దుర్వాసన కొట్టినది.

ఇప్పుడు, మనము ప్రభువు యొక్క భోజనమును తీసికొనుటకు వచ్చుట కూడా ఆలాగే యున్నది. మనము చేయుచున్న దానిని ఎరిగి, తప్పక మనము రావలెను. నీవు నీటిలోనికి వెళ్ళి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందినట్లుగానే యున్నది. నీవు చేయుచున్న దానిని నీవు ఎరుగుదువు: దేవుడు నీలో ఉంచిన దానిని నీవు సంఘమునకు ధరింపజేయుచున్నావు — అది క్రీస్తే.

దీనిని మనము తీసికొన్నపుడు, అది సంఘమునకు ఈ విధముగా చూపించుచున్నది, "నేను దేవుని యొక్క ప్రతి మాటను నమ్ముదును. పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చిన జీవాహారము ఆయనే అని నేను నమ్ముచున్నాను. ఆయన చెప్పే ప్రతిమాట సత్యమని నేను నమ్ముచున్నాను. నా శాయశక్తులా నేను దానికి కట్టుబడి జీవించుదును, దేవుడే నాకు తీర్పరి. కాబట్టి నా సోదరుల ఎదుట, నా సోదరీల ఎదుట, నేను ఒట్టు పెట్టుకొనను, నేను శపించను, ఈ కార్యములు ఏవియూ నేను చేయను, ఎందుకనగా నేను దేవుని ప్రేమించుచున్నాను; మరియు ప్రభువు దానిని ఎరుగును మరియు నాతో ఆయన సాక్ష్యమిచ్చును. కాబట్టి, మీ యెదుట, లోకమతో పాటుగా నేను ఖండింపబడనని ఎరుగుటకు, నేను ఆయన శరీరము యొక్క కట్టను (parcel) తీసికొనుచున్నాను." చూచారా, అది అర్థము; అపుడు అది ఒక ఆశీర్వచనము.

30మరియు గుర్తుంచుకొనండి, దీనిపై నేను ఎన్నో సాక్ష్యములు ఇయ్యగలను, దానిని తీసికొని వెళ్ళి ఒక వ్యాధిగల చోట వివరించినపుడు వారు బాగుపడుట చూచాను.

గుర్తుంచుకొనండి, దీనికి సాదృశ్యముగా నున్న దానిని ఇశ్రాయేలియులు తీసికొనినపుడు, వారు అరణ్యములో నలుబది సంవత్సరములు ప్రయాణము చేసిరి మరియు వారి బట్టలు ఎన్నడూ పొతగిలలేదు; రెండు మిలియనుల మందిలో ఒక్క బలహీనుడు కూడా లేకుండా వారు బయటకు వచ్చిరి — దీనికి అది ఒక మాదిరిగా. అయితే అంతకన్న శ్రేష్టమైన ఈ సాటిలేని మాదిరి ఏమీ చేయును? బలి అర్పించబడిన ఒక జంతు శరీరమే వారికి ఆలాగు చేసినయెడల, యేసుక్రీస్తు యొక్క శరీరము, ఇమ్మానుయేలు, మన కొరకు ఏమిచేయును?

మనము వచ్చునపుడు భక్తిపూర్వకముగా ఉందము. వచ్చుటకు ఎంత భక్తిపూర్వకముగా ఉండవలెనని మనకు తెలియునో, అంత భక్తిపూర్వకముగా మనము ఉందము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...