యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత
ప్రకటన 1:1-20
1. యేసు క్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రిహంచిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను:
2. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.
3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
4. యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది: వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాని నుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మల నుండియు,
5. నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండియు, కృపా సమాధానములు మీకు కలుగును గాక.
6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి రాజును గాను, యాజకులను గాను జేసెను.
7. ఇదిగో, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును. ఆమేన్.
8. అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
9. మీ సహోదరుడను, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును, పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.
10. ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్ప స్వరము -
11. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను యేడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని.
12. ఇది వినగా, నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.
13. తిరుగగా, యేడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్యకుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
14. ఆయన తలయు తలవెంట్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలె ఉండెను;
15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
16. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియుండెను; ఆయన నోటినుండి రెండంచులు గల వాడియైన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను; ఆయన ముఖము మహాతే జస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
17. నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను - భయపడకుము;
18. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
19. కాగా నీవు చూచినవాటిని, విన్నవాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని,
20. అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు యేడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు యేడు సంఘములు.
మొదటి అధ్యాయమునకు పరిచయము
ప్రకటన1:1-3.
''యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.
అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.''
ఈ గ్రంథమునకు లేఖకుడు (గ్రంథకర్త కాడు) దైవదాసుడగు పరిశుద్ధ యోహాను. ఈ గ్రంథమును వ్రాయు సమయములో, అతడు పత్మాసు ద్వీపములో యున్నప్పటికిని, అతడు తన జీవితపు చివరి భాగమును ఎఫెసులో గడిపెనని చరిత్రకారులు అంగీకరించెదరు. ఇది యోహాను యొక్క జీవిత చరిత్ర కాదు గాని, రాబోవు సంఘకాలములో నుండు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయైయున్నది. ఇది ఒక ప్రవచనమని మూడవ వచనములో చెప్పబడినది గనుక ఇది వాస్తవంగా ప్రవచనమైయున్నది.
ఈ గ్రంథమును మామూలుగా పరిశుద్ధ యోహాను యొక్క ప్రత్యక్షత గ్రంథమందురు గాని, అది సరి కాదు. అన్నికాలములలోని క్రైస్తవుల కొరకు యోహానుకియ్యబడిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయే ఇది. బైబిలు గ్రంథమంతటిలోను యేసు స్వయంగా వ్రాసినది ఇది ఒక్కటే, ఒక లేఖకునికి వ్యక్తిగతంగా ప్రత్యక్షమగుట ద్వారా.
ఇది బైబిలులోని చివరి గ్రంథము. అయినప్పటికి సువార్త యొక్క ఆది మరియు అంత్య యుగములను గూర్చి చెప్పుచున్నది.
ప్రత్యక్షతకు గ్రీకు పదము ''అపోకలిప్స్.'' అనగా ''ముసుగు తీయుట'' అని అర్ధము. ఈ ముసుగు తీయుట గూర్చి సంపూర్ణంగా గ్రహించుటకు ఒక శిల్పి తాను తయారు చేసిన విగ్రహముపైనున్న ముసుగును తొలగించుట ఉదాహరణగా చెప్పుకొనవచ్చును, ప్రేక్షకులకు దానిని కనుపరచును. అది ముసుగు తీయుట, అనగా ముందునుండియూ దాచబడిన దానిని బయటపెట్టుట. కాబట్టి ఈ ముసుగు తీయుట క్రీస్తు వ్యక్తిత్వము యొక్క ప్రత్యక్షత మాత్రమే కాదు గాని, రానైయుండిన యేడు సంఘ కాలములలోని ఆయన భవిష్యత్కార్యములను ప్రత్యక్షపరచుట అయి ఉన్నది.
ఒక నిజవిశ్వాసికి ఆత్మ ద్వారా అనుగ్రహింపబడు ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను ఎన్నడునూ హద్దుమీరి నొక్కి చెప్పలేము. ప్రత్యక్షత అనునది నీవు గ్రహించుదాని కన్న మిన్నయైనది. మరియు ఈ ప్రత్యక్షతా గ్రంథము మరియు నీవు అను దానిని గూర్చి నేను మాట్లాడుబోవుటలేదు. నేను పూర్తి ప్రత్యక్షత గూర్చి మాట్లాడుచున్నాను. ఇది సంఘమునకు అత్యంత ప్రాముఖ్యము. మత్తయి 16లో యేసు తన శిష్యులను అడిగిన ప్రశ్న మీకు గుర్తున్నదా?
''మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా,
వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు - కొందరు ఏలియా అనియు - కొందరు యిర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.
"అందుకాయన - మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను."
అందుకు సీమోను పేతురు - "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను."
అందుకు యేసు - "సీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్ననా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే గాని నరులు (రక్తమాంసములు) నీకు బయలుపరచలేదు."
"మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దానియెదుట నిలువనేరవని, నేను నీతో చెప్పుచున్నాను.''
పేతురు మీద సంఘము కట్టబడినదని రోమను కాథలిక్కులు చెప్పెదరు. అది నిజంగా శరీరసంబంధమగు మాట. ఎంతో అస్థిరుడై యుండి ప్రభువైన యేసును కాదని, పైగా ఆ మాట పలుకుచూ శపించుకొనిన ఒక మనుష్యుని మీద దేవుడు సంఘమును ఎట్లు నిర్మించగలడు? పాపములో జన్మించినఏ మానవుని మీద కూడా దేవుడు తన సంఘమును నిర్మించగలడు. ఆ స్థలము యొద్ద దేవుడు నేలను గుల్లగా చేసి రాయిని పడవేసినట్లు చెప్పుచున్నారు. యేసు మీదనే సంఘము నిర్మించబడినదని ప్రొటస్టెంటు వారు చెప్పుచున్నది కూడా సరి కాదు. అది ప్రత్యక్షతయైయున్నది. అక్కడ వ్రాయబడిన దానిని ఉన్నట్లుగా చదవండి: ''రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు గాని, నా తండ్రియే నీకు దీనిని బయలుపరచెను. మరియు ఈ బండ (ప్రత్యక్షత) మీద నేను నా సంఘమును కట్టుదును.'' ప్రత్యక్షత మీద సంఘము నిర్మించబడియున్నది. ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,'' మీద నిర్మించబడియున్నది.
దేవునికి సరి అయిన బలి అర్పించవలెనన్నచో ఏమి చేయవలెనో హేబెలుకు ఎట్లు తెలియును? విశ్వాసమునుబట్టి అతడు రక్తపు ప్రత్యక్షతను పొందియున్నాడు. కయీనుకు అటువంటి ప్రత్యక్షత దొరకలేదు. (అతనికి ఆజ్ఞయున్నా గాని, పొందలేకపోయెను) కాబట్టి అతడు సరి అయిన అర్పణను అర్పించలేకపోయెను. దేవుని నుండి వచ్చిన ఆ ప్రత్యక్షతయే, ఆ భేదమును కలుగజేసి మరియు హేబెలుకు నిత్యజీవమును ఇచ్చినది. నీవు సంఘకాపరి చెప్పిన దానిని స్వీకరించవచ్చును, లేక సెమినరీ బోధించినదానిని తీసికొనవచ్చును, నిన్ను ఒప్పింపచేయు వాగ్ధాటితో దానిని వారు నీకు బోధింపవచ్చును. కాని యేసేక్రీస్తై యున్నాడనియు, నిన్ను పవిత్రపరచునది రక్తమేననియు, దేవుడే నీ రక్షకుడనియు, దేవుడు బయలుపరచు వరకు నీవెన్నడూ నిత్యజీవమును పొందలేవు. ఆత్మసంబంధమగు ప్రత్యక్షత ద్వారా మాత్రమే అది జరుగును.
ఈ ప్రకటన గ్రంథము యేసు యొక్క ప్రత్యక్షతా గ్రంథమని నేను చెప్పాను. ఆ యేడు కాలములలో ఆయన సంఘములలో ఏమి చేయుచున్నాడో చూపించుచున్నది. అది ఒక ప్రత్యక్షత, ఎందుకనగా శిష్యులు తమంతట తాముగా ఈ నమోదయిన సత్యములను తెలిసికొనలేదు. ఇంతకు ముందు అది వారికి ప్రత్యక్షపరచబడలేదు. అపోస్తలుల కార్యముల గ్రంథములలోని ఒక సంగతి మీకు గుర్తున్నదా? వారు యేసు యొద్దకు వచ్చి ఇట్లడిగిరి, ''ఈ కాలములో నీవు ఇశ్రాయేలుకు రాజ్యమును తిరిగి ఇచ్చెదవా?'' అందుకాయన ఇట్లనెను, ''కాలములను, సమయములను తెలిసికొనవలసిన పని మీకు లేదు.'' ఆ మనుష్యులు యేసు భూసంబందమైన రాజ్యమును స్థాపించుచున్నాడనియే ఇంకా తలంచుచుండిరి. కాని ఆయన నిర్మించబోవుచున్నది ఆత్మసంబంధమగు రాజ్యము. అందులో ఆయన స్థానము ఏమిటో ఆయన వారికి చెప్పలేదు, ఎందుకనగా తండ్రి ఇంకా దానిని ఆయనకు ప్రత్యక్షపరచలేదు. కాని ఆయన మరణము మరియు పునరుత్థానముల తరువాత, ఆయన మధ్యవర్తిగా పనిచేయుచున్న ఈ ప్రత్యేక సమయములో ఆయన దీనిని స్థిరముగా చూపగలిగెను. ఇక్కడ ఆయనే స్వయంగా యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహించెను. సంఘములో తన యొక్క మహిమ మరియు సన్నిధి యొక్క అర్ధమును వివరముగా చూపియున్నాడు.
అపవాది యొక్క అంతము ఏమిటో ఈ ప్రత్యక్షతలో ఆయన చెప్పియున్నాడు. అపవాదిని ఆయన ఏమి చేయునో ఆయన మనకు చెప్పియున్నాడు. అగ్నిగుండములో వానిని పడద్రోయును. సాతానును వెంబడించు వారి యొక్క అనగా, దుష్టుల యొక్క అంతమును ఆయన బయలుపరచెను. దానిని సాతాను అసహ్యించుకొనును.
పరిశుద్ధ గ్రంథములోని రెండు గ్రంథములను మిగిలిన వాటన్నిటికంటె సాతాను అసహ్యించుకొనెనని మీరెప్పుడయినా గమనించారా? ఉదార వేదాంత పండితుల ద్వారాను, నకిలీ శాస్త్రజ్ఞుల ద్వారాను వాడు ఎల్లప్పుడు ఆదికాండము మరియు ప్రకటన గ్రంథము మీద దాడి చేయుచునే యున్నాడు. ఈ రెండు గ్రంథములలోను మనము సాతాను యొక్క ఆరంభమును, వాని యొక్క శాపగ్రస్త విధానములను, వాని యొక్క నాశనమును చూచెదము. అందువలననే వాడు వాటిమీద దాడి చేయుచున్నాడు. బయటపడుచున్నందుకు వాడు సిగ్గుపడి కోపించుచున్నాడు. ఆ రెండు గ్రంథములలో వాని యొక్క స్థితి ఏమిటో పూర్తిగా బయటపడుచున్నది. సాతాను గురించి యేసు చెప్పెను.''వానికి నాతో పాలు లేదు మరియు నాకు వానితో పాలు లేదు.'' దానిని అపవాది మరో విధంగా రుజువు చేయగోరుచున్నాడు; కాని అది వానిచేత కాదు, కాబట్టి వాక్యము పట్లయున్న నమ్మకమును తొలగించుటకు వాని శాయశక్తులా ప్రయత్నము చేయుచున్నాడు. కాని సంఘము సాతానును నమ్మక, వాక్యము యొక్క ఆత్మ ప్రత్యక్షతను నమ్మినయెడల ఆమెకు (సంఘమునకు) వ్యతిరేకంగా పాతాళలోక ద్వారములు నిలువజాలవు.
మీరు వేరుగా తలంచనియెడల ఇక్కడ నేను నా స్వంత సేవలోని ఒక మాటను చెప్పెదను. నా జీవితములోని ఈ వరము సహజాతీతమైనదని మీ అందరికి తెలియును. ఇది ఒక వరము, దీని మూలముగా పరిశుద్ధాత్మ వ్యాధులను వివేచింపకలుగుచున్నది, మరియు మానవుల హృదయములలోని ఆలోచనలను ఎరుగుచున్నాను, దేవునికి మాత్రమే తెలియు మరుగైన సంగతులు నాకు బయలుపరచబడుచున్నవి. సాతాను తాను బయటపడుచున్నానని ఎరిగినప్పుడు, ఆ ప్రజల ముఖములు ఎట్లుండునో మీరు నా ప్రక్కన నిలబడినప్పుడు మీకు తెలియును. నేను జనుల గూర్చి మాట్లాడుట లేదు. వారి జీవితములలో సాతాను ఉండి వారిని పట్టుకొని వారి ద్వారా పాపము చేయుచున్నది. విభేదములు మరియు వ్యాధులు కలిగించుచున్నది. మీరు వారి ముఖములను చూడవలెను. తాను బయటపడుచున్నానని సాతానుకు తెలియును, మరియు ప్రజల ముఖములలో వింతయగు మార్పులు అప్పుడు కనబడును. సాతానుకు భయము కలుగును. దేవుని యొక్క ఆత్మ వానియొక్క క్రియలను జనులకు తెలియపరచునని వానికి తెలిసిపోవును. అందువలననే ఈ కూటములను వాడు ఎంతగానో అసహ్యించుకొనును. పేర్లు పిలిచి, వ్యాధులను ఎత్తి చూపినప్పుడు సాతాను వాటిని ద్వేషించును. ఏమిటది? ఇది మనస్సు చదువుట కాదు, మరో మాయమంత్రము కాదు, చేతబడి కాదు, ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ప్రత్యక్షత. ఆ ఒక్క మార్గములోనే నేనది తెలిసికొనుచున్నాను. శరీరసంబంధమగు మనస్సు దానిని ఏదో పేర్లతో పిలచును గాని, ఇది పరిశుద్ధాత్మయై యున్నది.
సంఘములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను తెలియచేయు ఈ గ్రంథమును సాతాను అసహ్యించుకొనుటకు మరియొక కారణమును నేను చూపించెదను. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడనియు, ఆయన మారని వాడనియువానికి తెలియును. తొంబది శాతం మంది వేదాంత పండితులకు తెలియనంత ఎక్కువగా ఆ సంగతి వానికి తెలియును. దేవుడు తన స్వభావమును మార్చుకొనడన్న సంగతి వానికి తెలియును. ఆయన తన మార్గములను కూడా ఆ విధంగానే మార్చుకొనడని వానికి తెలియును. పెంతెకోస్తు యొద్దనున్న ఆది సంఘము దేవుని యొక్క శక్తి (క్రియారూపంలో ఉన్న మార్కు 16) కలిగిన నిజసంఘమనియు, దానిని తన స్వంత దానిగా యేసు చెప్పుకొనుచున్నాడనియు సాతానుకు బహు నిశ్చయముగా తెలియును. మిగతాదంతయూ అబద్ధమే. అవి తప్పు సంఘములు.
ఇప్పుడు దీనిని గుర్తుంచుకొనండి. నిజసంఘములో క్రీస్తు యున్నాడు గనుక అపోస్తలుల కార్యముల గ్రంథమునకు ముగింపులేక కొనసాగుచున్నది. కాని క్రీస్తువిరోధి యొక్క ఆత్మ దానిలోనికి వచ్చి దానిని ఎట్లు పాడుచేయునో, అది నులివెచ్చగాను, శక్తిహీనముగాను, నామకార్ధముగాను ఎట్లు మారునో ప్రకటన గ్రంథము చూపించుచున్నది. అది సాతానును బయటపెట్టును. వాని క్రియలను తెలియచేయును. (దేవుని జనులను నాశనము చేయుటకు కుట్రపన్ని, దేవుని వాక్యమును విలువలేనిదని చెప్పుటకు ప్రయత్నించును) వాడు అగ్ని గుండములో పడద్రోయబడు కాలము వరకును ఆ విధంగానే పనిచేయుచుండును. దానికి విరోధముగా అతడు పోరాడును. దాని ఎదుట అతడు నిలబడలేడు. నిజసంఘము యొక్క నిజ ప్రత్యక్షతను జనులు పొందినప్పుడు గొప్పకార్యములు ఆమె చేయును అని వానికి తెలియును. సంఘమనగా ఏమిటో, ఆమె ఎందుకొరకు నిలచియున్నదో వారు గుర్తించినప్పుడు ఆమె జయింపరాని సైన్యసమూహముగా యుండును. క్రైస్తవ సంఘము యొక్క నిర్మాణములోయున్న ఈ రెండు ఆత్మల యొక్క ఉనికిని గూర్చి వారు ఒక నిజ ప్రత్యక్షతను పొందినయెడల దానిని వారు దేవుని ఆత్మ ద్వారా వివేచించి క్రీస్తువిరోధ ఆత్మను ఎదిరించుదురు. ఆమె ముందు సాతాను శక్తిహీనమగును. వాని యొక్క ప్రతి ప్రయత్నమును ఎడారిలో క్రీస్తు వమ్ము చేసి వానిమీద ఎట్లు అధికారమును పొందెనో, ఆలాగే నేడును వానిని మనము ఖచ్చితంగా శక్తిహీనునిగా చేయగలము. అవును, సాతాను ప్రత్యక్షతను అసహ్యించుకొనును. కాని దానిని మనము ప్రేమించుదుము. మన జీవితములలో నిజమగు ప్రత్యక్షతను కలిగియున్నప్పుడు మనకు విరోధముగా పాతాళ లోక ద్వారములు నిలబడజాలవు, అయితే వాటిని మనము జయించుదుము.
ఈ వర్తమానమును ప్రారంభించు సమయములో నేను చెప్పిన దానిని మరల ఒక్కసారి గుర్తుచేసుకొనండి. ఇప్పుడు మనము అధ్యయనము చేయుచున్న ఈ గ్రంథము యేసు యొక్క వాస్తవ ప్రత్యక్షతయై యున్నది. ఆయన స్వయంగా సంఘములో ప్రత్యక్షమై తన భవిష్యత్ కార్యమును గూర్చి తెలియచేయుచున్నాడు. మనకు పరిశుద్ధాత్మయే ప్రత్యక్షతను అనుగ్రిహంపవలెను, లేనియెడల మనము దానిని పొందజాలము. ఈ రెండు ఆలోచనలను మీరు ఏకము చేయుడి, మామూలు అధ్యయనము చాలదని మీరు గ్రహించగలరు. ఈ గ్రంథమును మన ఆలోచనల ద్వారా వాస్తవతలోనికి తీసికొనిరాలేము. పరిశుద్ధాత్మ యొక్క పని కావలెను. కాబట్టి ఈ గ్రంథము ఒక ప్రత్యేక తరగతి జనులకు తప్ప మరెవరికిని బయలుపరచబడదని దీనివలన గ్రహించవలెను. ప్రవచనాత్మక దృష్టి గలవారు దీనిని గ్రహించగలరు. దేవుని నుండి విను సామర్ధ్యము కావలెను. దైవసంబంధమగు ఉపదేశము అవసరము, వచనముతో వచనమును పోల్చిచూచు విద్యార్ధివలె నుండరాదు, అది మంచిదే. కాని ఒక మర్మమును తెలిసికొనవలెనన్నయెడల పరిశుద్ధాత్మ యొక్క బోధ కావలెను, లేనియెడలఎన్నడును దానిని విశదముగా గ్రహించజాలరు. మనము దేవుని నుండి వినవలసిన అవసరత యున్నది. మనలను మనము ఖాళీ చేసికొనవలెను. ఆత్మ యొక్క ఆధీనములోనికి రావలెను. అప్పుడు విని తెలిసికొనవలెను.
ఇంతకుముందే నేను చెప్పాను, ఈ గ్రంథము (ప్రకటన)లేఖనముల యొక్క సంపూర్ణత. లేఖనముల యొక్క వరుసలోనే ఇది ఖచ్చితముగా ఉంచబడియున్నది; ముగింపులోయున్నది. దానిని చదువువారును, వినువారును దీవించబడుదురని అందువలననే చెప్పబడియున్నది. దేవుని యొక్క ప్రత్యక్షత అపవాది మీద నీకు అధికారమిచ్చును. ఆప్రకారముగానే దానికి కలుపువారు, దానిలోనిది తీసివేయువారు శాపగ్రస్తులగుదురని చెప్పబడెను. అది నిజముగా జరుగును, దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత నుండి కూర్పులు, మార్పులు చేయువారు శత్రువును జయించగలరా? అది చాలా సామాన్యముగా అర్ధమగు సంగతి. వాక్య ప్రత్యక్షత కంటె జయించు శక్తి మరేదియూ లేదు. చూడండి. మూడవ వచనములో ఈ గ్రంథము పట్ల శ్రద్ధ కలిగియున్నవారికి ఒక ఆశీర్వచనము వచ్చునని చెప్పబడెను. ఉదయకాలమందు జనులకు వాక్యమును యాజకులు చదివి వినిపించు ఆచారము పాత నిబంధనలో యున్నదని తలంచుచున్నాను. చూడండి. చాలా మంది చదువలేరు కాబట్టి యాజకుడు వారికి చదివి వినిపించవలెను. వాక్యము అక్కడున్నంత కాలము ఆశీర్వచనము అక్కడుండును. దానిని చదివినా వినినా ఒక్కటే.
''కాలము సమీపించియున్నది.'' ఇంతకు ముందు సమయము సమీపించియుండలేదు. దేవుని యొక్క జ్ఞానము మరియు పధకము బట్టి ఈ శక్తిగల ప్రత్యక్షత (దేవునికి సంపూర్తిగా తెలియును) ఇంతకు ముందు రాలేదు. ఆ విధంగా మనము వెంటనే ఒక సూత్రమును నేర్చుకొందుము — ప్రతి కాలమునకు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కాలములో మాత్రమే వచ్చును, ఒక ఆ ప్రత్యేక కాలములో మాత్రమే వచ్చును. ఇశ్రాయేలు యొక్క చరిత్రను చూడండి. దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకు ఒక ప్రత్యేక కాలములో మాత్రమే దొరికెను, అది ఒక చారిత్రక కాలము, ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు మరింత ప్రత్యేకముగా వచ్చినది. యేసు స్వయంగా కాలము సంపూర్ణమైనప్పుడే వచ్చెను, ఆయన దేవత్వము యొక్క సంపూర్ణ ప్రత్యక్షతయైయున్నాడు. ఈ కాలములో(లవొదికయ) దేవుని యొక్క ప్రత్యక్షత తగిన సమయములో వచ్చును. అది తప్పిపోదు, అది నిర్ణయ కాలమునకు ముందుగా రాదు. దీనిని ఆలోచించుము మరియు జాగ్రత్తపడుము, ఎందుకనగా నేడు మనము అంత్యకాలములో యున్నాము.
అభినందనము
ప్రకటన1:4-6.
''యోహాను ఆసియాలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది; వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాని నుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు;
నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తునుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు, ప్రభావమును, యుగ యుగములు కలుగును గాక!
ఆయన మనలను తన తండ్రియగు దేవునికి రాజులను గాను, యాజకులను గాను జేసెను. ఆమేన్."
ఆసియా అను మాటకు ఆసియా మైనరు అని అర్ధము. అది ఒక చిన్న భూభాగము. ఇండియానా రాష్ట్రమంత పరిమాణములో యుండును. అక్కడ ఈ యేడు సంఘములున్నవి. అక్కడుండిన ఇతర సంఘములన్నింటిలో నుండి వీటిని ఎన్నుకొనుట జరిగినది, ఎందుకనగా వాటికి ప్రత్యేక గుణలక్షణములున్నవి. శతాబ్దముల తరువాత ఆయా కాలములలో వచ్చు సంఘములకు అదే గుణలక్షణములుండును.
సింహాసనము ఎదుట యేడు ఆత్మలున్నవి, అవి యేడుగురు వర్తమానికులకు ఇవ్వబడిన ఆత్మలు, ప్రతివారికిని వారు జీవించిన కాలమునకు చెందిన పరిచర్య ఇవ్వబడెను.
ఈ పలుకబడిన పదములను చూడండి. 'ఇప్పుడున్నవాడు,' 'ముందుండిన వాడు,' 'రాబోవు వాడు,' 'నమ్మకమైన సాక్షియు,' 'మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును,' 'భూపతులకు అధిపతియు,' 'అల్ఫాయు ఓమెగయు,' 'సర్వాధికారియు,' అను ఈ మాటలన్నియు ఒకేవ్యక్తికి సంబంధించిన బిరుదులు మరియు వర్ణనలు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మన పాపములను ఆయన తన స్వరక్తమందు కడిగెను.
యోహానులోనున్న దేవుని ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఎనలేని దైవత్వమును ఆ విధముగా క్రమ పద్ధతిలో వ్యక్తపరచెను, దైవత్వమును ఒకే దేవునిగా బయలు పరచెను. ఈనాడు పెద్ద తప్పు జరుగుచున్నది. ఒక్క దేవునికి బదులుగా ముగ్గురు దేవుళ్ళను వారు చూపించుచున్నారు. ఈ ప్రత్యక్షత యేసు ద్వారా యోహానుకు ఇవ్వబడినది, ఆ తప్పును ఆయనే సరిదిద్దెను. అక్కడ ముగ్గురు దేవుళ్ళు కారు గాని, ఒకే దేవుడు మూడు కార్యాలయములలో యున్నాడు. ఒకే దేవునికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను మూడు బిరుదులున్నవి. ఈ గొప్ప ప్రత్యక్షతను ఆది సంఘము కలిగియుండినది, ఈ చివరి దినమున అది తప్పక పునరుద్ధరింపబడును, నీటి బాప్తిస్మము యొక్క సరయైన విధానముతో పాటుగా ఇది కూడా చక్కదిద్దబడును.
ఇప్పుడు ఆధునిక వేదాంత పండితులు నాతో సమ్మతించరు, ఏలయనగా ఒక గొప్ప క్రైస్తవ పత్రికలో ఈ విధముగా వ్రాయబడింది. ''ఆ బోధ (త్రిత్వము) పాత నిబంధన యొక్క హృదయములోనూ మరియు కేంద్రము వద్ద యున్నది. మరియు అది అంతే నిశ్చయముగా క్రొత్త నిబంధన యొక్క హృదయంలోనూ మరియు కేంద్రం వద్ద ఉన్నది. ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళున్నారను తలంపుకు పాత నిబంధన ఎంత వ్యతిరేకముగా యున్నదో, క్రొత్త నిబంధనయు అంతే వ్యతిరేకముగా ఉన్నది. అయినా క్రొత్త నిబంధన, తండ్రి దేవుడనియు, మరియు కుమారుడు దేవుడనియు, మరియు పరిశుద్ధాత్మ దేవుడనియు, మరియు ఈ ముగ్గురూ ఒకే దేవుని యొక్క మూడు పార్శ్వములు కావు గాని, ఒకరితో ఒకరు వ్యక్తిగత సంబంధము కలిగి నిల్చున్న ముగ్గురు వ్యక్తులని అంతే తేటగా బోధించుచున్నది. ముగ్గురు వ్యక్తులు గాని ఒకే దేవుడు అను గొప్ప సిద్ధాంతము ఇక్కడ మనకున్నది.''
వారు ఇలా కూడా చెప్పారు, "బైబిల్ పరముగా దేవుడు ఒక వ్యక్తి కాదు కాని, దేవుడు ముగ్గురు వ్యక్తులు ఒక దేవునిలో. అదే త్రిత్వము యొక్క గొప్ప మర్మము."
అది నిశ్చయంగా (గొప్ప మర్మమే - తర్జుమాదారుడు.) ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఎట్లుండగలరు? అందుకు సంబంధించిన బైబిలు లేదు సరి గదా, జ్ఞానయుక్తమగు తర్కము కొరవడుటను కూడా అది చూపించుచున్నది. ముగ్గురు వేర్వేరు వ్యక్తులు, ఒకే పదార్థంతో చేయబడిననూ ముగ్గురు దేవుళ్ళగుదురు, లేదా భాషకు పూర్తిగా అర్ధం లేకుండా పోయింది.
ఈ మాటలు మరలా వినండి. ''అల్ఫాయు, ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే, అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువుసెలవిచ్చుచున్నాడు.'' ఇది దైవత్వము. ఇప్పుడు ఒక సామాన్య ప్రవక్త కాడు, ఒక మనిషి కాడు. ఈయన దేవుడు. ఇది ముగ్గురు దేవుళ్ళ యొక్క ప్రత్యక్షత కాదు గాని, సర్వశక్తుడగు ఒకే ఒక్క దేవుని యొక్క ప్రత్యక్షత.
సంఘము యొక్క ప్రారంభములో వారు ముగ్గురు దేవుళ్ళను నమ్మలేదు. ఆ రకమైన విశ్వాసమును మీరు అపోస్తలులలో కనుగొనలేరు. అపోస్తలుల కాలము తర్వాత వచ్చిన ఈ సిద్దాంతము నైసియా ఆలోచన సభ వద్ద వివాదాంశముగానూ మరియు ప్రధాన బోధగానూ మారినది. దైవత్వమును గూర్చిన బోధ, నైసియా వద్ద రెండు మార్గములుగా చీలి పోవుటకు కారణమయ్యింది. మరియు ఆ చీలిక నుంచి రెండు విపరీతములు వచ్చాయి. ముగ్గురు దేవుళ్ళను నమ్ముతూ ఒకటి బహు దేవత్వములోనికి వెళ్ళింది, మరియు తక్కినవి ఏకత్వములోనికి (unitarianism) వెళ్ళాయి. అది రావడానికి కొంచెం సమయం పట్టింది, కానీ అది వచ్చింది, మరియు అది ఈ రోజు యిక్కడే ఉంది. కానీ యోహాను ద్వారా ఆత్మ సంఘములకిచ్చిన ప్రత్యక్షత, ''నేను ప్రభువైన యేసుక్రీస్తును, అది అంతా నేనే. వేరే దేవుడెవడూ లేడు.'' మరియు ఈ ప్రత్యక్షతపై ఆయన తన ముద్ర వేసెను.
దీనిని చూడండి: యేసు తండ్రి యెవరు? ''ఆమె పరిశుద్ధాత్మవలన కుమారుని కనినది,'' అని మత్తయి 1:18 చెబుతుంది. కాని దేవుడు తన తండ్రి అని యేసు స్వయంగా చెప్పుకొనెను. మనము తరచుగా వాడే తండ్రియగు దేవుడు, మరియు పరిశుద్ధాత్మయగు దేవుడు అనే మాటలు; తండ్రీ మరియు పరిశుద్ధాత్మ ఒక్కటే అని కనబరచుచున్నవి. నిశ్చయముగా వారు ఒక్కటే, లేదా యేసుకు యిద్దరు తండ్రులున్నారు. కాని గమనించండి, ఆయన మరియు ఆయన తండ్రీ ఒక్కటే అని యేసు చెప్పెను — యిద్దరు కాదు. అందువల్ల ఒక్కడే దేవుడగుచున్నాడు.
చరిత్రను బట్టియు మరియు లేఖనమును బట్టియూ ఇది నిజమగుట వలన, ఈ ముగ్గురు ఎక్కడ నుంచి వచ్చారని జనులు ఆలోచిస్తారు. క్రీ.శ. 325లో నైసియా-ఆలోచన-సభ వద్ద అది సంస్థాపక సిద్దాంతమయ్యింది. ఈ త్రిత్వము (పూర్తిగా యిది లేఖనానుసారము కాని మాట) రోమ్ యొక్క అనేక దేవుళ్ళపై ఆధారపడినది. వారు కలిగియున్న అనేక దేవుళ్ళకు రోమనులు ప్రార్దించుచుండిరి. పూర్వికులను కూడా వారు మధ్యవర్తులుగా ఆరాధించేవారు. పాత దేవుళ్ళకు కొత్త పేర్లు పెట్టుటకు యిది ఒక మెట్టు మాత్రమే, కావున దానిని బైబిలుకు చెందినట్లుగా చేయుటకై యిప్పుడు మనం పరిశుద్ధులను కలిగియున్నాము. కావున బృహస్పతి, వెనిస్, మార్స్ మొదలగు వారికి బదులుగా, పౌలు, పేతురు, ఫాతిమా, క్రిస్టొఫర్ వగైరా వగైరా మనకున్నారు. కేవలం ఒక్క దేవుడితో వారి అన్య మతమును వారు పనిచేయించలేరు, అందువల్ల వారు ఆయనను ముగ్గురిగా చీల్చారు, మరియు వారి పితరులను మధ్యవర్తులుగా చేసికొన్నవిధంగానే పరిశుద్ధులను మధ్యవర్తులుగా చేశారు.
అప్పటి నుంచీ, మూడు కార్యాలయములు లేక బయలుపాటులు కలిగి, కేవలం ఒక్క దేవుడే ఉన్నాడని గ్రహించుటలో, జనులు విఫలమయ్యారు. లేఖన ప్రకారం దేవుడొక్కడే అని వారికి తెలుసు, కాని దేవుడిని ఒక ద్రాక్షా గెలవలె; ఒకే దేవత్వము అందరి మధ్యా సమానంగా పంచబడిన ముగ్గురు వ్యక్తులుగా చేయుటకు వారు ప్రయ్నతించుదురు. కాని యిక్కడ ప్రకటనలో యేసు ''ఉన్నవాడు,'' ''ఉండినవాడు,''మరియు''రానున్నవాడని'' యిది తేటగా చెబుతున్నది. ''ఆయనే అల్ఫా మరియు ఒమేగా,'' అనగా ''అదినుండి అంతము'' వరకూ, లేదా దాని యొక్క సమస్తమూ ఆయనే అని అర్ధము. ఆయనే సమస్తమూ — సర్వశక్తుడు. ఆయనే షారోను పుష్పము, లోయలోని పద్మము, వేకు వనక్షత్రము, నీతి చిగురు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ. ఆయన దేవుడు, సర్వశక్తుడగు దేవుడు. ఒకే దేవుడు.
1 తిమోతీ 3:16 లో ఇట్లున్నది, ''నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది: ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యెను, ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను.'' ఈ విధముగా బైబిలు చెప్పుచున్నది. ఇక్కడ మొదటి వ్యక్తి గూర్చి గాని, లేదా రెండవ వ్యక్తి గూర్చి గాని, మూడవ వ్యక్తి గూర్చి గాని చెప్పలేదు. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెనని చెప్పెను. ఒకే దేవుడు. ఆ ఒక్క దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. ఇది చాలును. దేవుడు ఒక మానవరూపములో వచ్చెను. అందువలన మరొక దేవుడు కాడు గాని ఆయనే దేవుడు. అదే దేవుడు. అదియే ప్రత్యక్షత అయినది. ఎప్పుడును అదియే ప్రత్యక్షత. ఒకే దేవుడు.
మనము తిరిగి బైబిలు యొద్దకు వెళ్ళి మరియు ఆయన స్వయంగా ఇచ్చుకొనిన ప్రత్యక్షత ప్రకారముగా ఆది యందు ఆయన ఏమైయున్నాడో చూద్దాం. ఆ గొప్ప యెహోవా అగ్నిస్తంభములో ఇశ్రాయేలునకు ప్రత్యక్షమాయెను. నిబంధనకు దూతగా ఆయన ఆ అగ్ని స్తంభములో జీవించెను మరియు అనుదినము ఇశ్రాయేలీయులను నడిపించెను. ఆలయము వద్ద ఆయన తన రాకను ఒక గొప్ప మేఘముతో ప్రకటించెను. ఆ తరువాత ఒక దినమున ఆయన కన్యకు జన్మించెన. ఆయన తనకొరకు సిద్ధపరచబడిన శరీరమును పొందెను. ఇశ్రాయేలు యొక్క గుడారములకు పైన నివాసము చేసిన దేవుడు ఇప్పుడు తానే ఒక శరీరపు గుడారమును ధరించుకొని మనుష్యుల మధ్య మనిషిగా నివాసము చేసెను. కాని ఆయన ఆ దేవుడే.
క్రీస్తులో దేవుడున్నాడని బైబిలు బోధించుచున్నది. శరీరము యేసు. దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను, శరీరరిత్యా ఆయనలో యుండెను. అంతకంటె తేటగా నున్నది మరియొకటి ఏదియూ లేదు. మర్మము, అవును. కాని వాస్తవముగా సత్యము — అంతకంటె విశదముగా మరేమియూ చెప్పలేము. అప్పుడాయన ముగ్గురు వ్యక్తులుగా లేనప్పుడు, ఇప్పుడును ఆయన ముగ్గురు వ్యక్తులుగా యుండడు. ఒకే దేవుడు: ఆ దేవుడే శరీరమును ధరించుకొనెను.
''నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను. (తిరిగి) దేవుని యొద్దకు ఎక్కిపోవుచున్నాను,'' అని యేసు చెప్పెను. యోహాను 16:27-28. ఖచ్చితంగా అదే జరిగియున్నది. ఆయన తన యొక్క మరణము, సమాధి, పునరుత్థానము, మరియు ఆరోహణల మూలముగా భూమిమీద నుండి అదృశ్యుడాయెను. దమస్కునకు పోవు మార్గములో ఆ తరువాత పౌలు ఆయనను కలిసికొనెను. ఆయన పౌలుతో ఇట్లు మాట్లాడెను, ''సౌలా, సౌలా, నీవునన్నెందుకు హింసించుచున్నావు? ''అందుకు సౌలు, ''ప్రభువా, నీవెవరవు?'' అని అడుగగా, ''నేను యేసును,'' అని ఆయన చెప్పెను. ఆయన అగ్నిస్తంభముగా యుండెను, గ్రుడ్డితనము కలుగజేసిన వెలుగు. ఆయన వెనుదిరిగెను, ఆయన ఖచ్చితంగా తాను చేయుదునని చెప్పినదే చేసెను. శరీరము అను గుడారమును ధరించక ముందు ఆయన ఏ రూపములో అయితే యుండెనో, ఆ రూపములోనికే తిరిగి వెళ్ళెను. ఆయన దానిని పొందియున్నట్లుగా యోహాను చూచెను. యోహాను 1:18: ''దేవుని ఎవడును ఎన్నడును చూచియుండలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.'' గమనించండి, యేసు వర్తమాన కాలములో ఉన్నవాడని యోహాను చెప్పెను. ఆయన తండ్రి యొక్క రొమ్ములో యుండెను.
లూకా 2:11 చెప్పుచున్నది,
''దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.''
ఆయన క్రీస్తుగా జన్మించెను, ఎనిమిది దినముల తరువాత ఆయన సున్నతి చేయబడెను, యేసు అను పేరు పెట్టబడెను. దేవదూత ఆ పేరును బయలుపరచెను. నేను బ్రన్హంగా పుట్టియున్నాను. నేను జన్మించిన తరువాత వారు నాకు విల్లియం అను పేరు పెట్టిరి. ఆయన క్రీస్తుగా ఉండెను, ఆ తరువాత మనుష్యుల మధ్య ఒక నామము ఆయనకు ఇవ్వబడెను. మనుష్యులందరికిని బయటకు కనబడు ఆలయమే యేసు. ఆయన మహిమకు ప్రభువు, సర్వశక్తుడగువాడు శరీరమందు ప్రత్యక్షమాయెను. ఆయనే తండ్రియగు, కుమారుడగు, పరిశుద్ధాత్ముడగు దేవుడు. సర్వస్వము ఆయనే.
తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ అనునవి కేవలము బిరుదులు. అవిపేర్లు కావు. ఆ కారణము చేతనే మనము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చుచున్నాము, ఎందుకనగా అది నామమే గాని బిరుదు కాదు. ఆ బిరుదుల యొక్క నామమది, మీకు క్రొత్తగా శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుకు పేరు పెట్టుదురు. కుమారుడు అనునది బిరుదు, ఆ కుమారునికి నీవు జాన్ హెన్రీ బ్రవున్ అని పేరు పెట్టెదవు. నీవు కేవలము యేసు నామములో బాప్తిస్మమియ్యరాదు. ప్రపంచములో వేలాదిమంది యేసులున్నారు, మరియు మన రక్షకుడగు యేసుకు ముందే వారున్నారు. కాని క్రీస్తుగా జన్మించినవాడు ఒక్కడే యున్నాడు, ఆయన ''ప్రభువైన యేసు క్రీస్తు.''
దేవుని యొక్క నిత్య కుమారుడు యేసు అని జనులు చెప్పుకొనుచుందురు. అది ఒక భేదము కాదా? కుమారుడు నిత్యమైనవానిగా ఉండుట గూర్చి ఎవరు విన్నారు? కుమారులకు ప్రారంభము ఉన్నది గాని నిత్యమను దానికి ప్రారంభము లేదు. ఆయన నిత్యుడగు దేవుడు (యోహోవా) శరీరమందు ప్రత్యక్షమాయెను.
యోహాను సువార్తలో ఇట్లు చెప్పబడెను,
''ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను.''
తండ్రి యొక్క నిత్యమగు వాక్కునకు ఆయనే నిజమగు మరియు నమ్మకమగు సాక్షి. ఆయన ఒక ప్రవక్త. తండ్రి తనను ఏమి చెప్పమని ఆజ్ఞాపించునో దానినే చెప్పును. ''నా తండ్రి నాయందున్నాడు,'' అని ఆయన చెప్పెను. ఆలయముగానున్న యేసు అదే చెప్పెను, ''నా తండ్రి నాలో యున్నాడు.''
దేవునికి చాలా బిరుదులున్నవి: ''మన నీతి,'' ''మన సమాధానము,'' ''నిత్యమూ ఉండువాడు,'' ''తండ్రి,'' ''కుమారుడు,'' మరియు ''పరిశుద్ధాత్మ;'' కాని ఆయనకు ఒకే మానవ పేరున్నది. ఆ పేరు యేసు.
గందరగోళము చెందవద్దు, ఎందుకనగా ఆయనకు మూడు కార్యాలయములున్నవి, ఆయనకు మూడు విధముల ప్రత్యక్షత యున్నది. భూమిమీద ఆయన ప్రవక్తగా ఉండెను; పరలోకమందు ఆయన యాజకునిగా యున్నాడు; రాజులకు రాజుగా ఆయన ఈ భూమిమీదికి మరల రాబోవుచున్నాడు. "ఆయన ఉండినవాడు" — అనగా యేసు, ప్రవక్త. "ఆయన ఉన్నవాడు" — అనగా ప్రధాన యాజకునిగా యుండి మధ్యవర్తిత్వము చేయుచున్నాడు — ఆయన మన రోగములను, బలహీనతలను అంటుకొనగలవాడు. "ఆయన రాబోవుచున్నవాడు" — అనగా రానైయున్న రాజు. భూమి మీద ఆయన వాక్యముగా యుండెను — అనగా ప్రవక్త. ఆయనను గూర్చి మోషే చెప్పెను, ''మీ ప్రభువగు దేవుడు నావంటి యొక ప్రవక్తను మీలో పుట్టించును. ఆ ప్రవక్త యొక్క మాట విననివారు జనుల మధ్య నుండకుండా కొట్టివేయబడుదురు.''
యేసును గూర్చిన ఈ వాస్తవములను గమనించండి. భూమి మీద ఆయన ప్రవక్తగాను, గొర్రెపిల్లగాను, కుమారునిగాను యుండెను. ఇందువలన ఆయన ముగ్గురిగా లేడు. ఇవి ఆయన యొక్క లేదా యేసు అను ఒకే వ్యక్తి యొక్క మూడు కార్యాలయములు లేదా ప్రత్యక్షతలు.
దైవత్వములో ఒక వ్యక్తి కన్న ఎక్కువ మంది వ్యక్తులున్నారని ఈ త్రిత్వవాదులు ఎత్తిచూపు ఒకే లేఖనమున్నది. దానిని వారు తరచుగా చూపించుచుందురు.
అది ప్రకటన 5:6-8,
''మరియు సింహానమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును, ఏడు కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.
ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణెలును, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలును ఆ గొర్రెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్ధనలు.''
నిశ్చయముగా ఈ వచనములను ఒక్కొక్క దానిగా చూచినయెడల వారి వాదమును నిజమని రుజువు చేయును. నేను చెప్పినది మీరు గమనించండి. ఒంటరిగా ఈ వచనములను చూచినచో ఆలాగు అర్ధము వచ్చును.
ప్రకటన 4:2-3 మరియు 9-11, వచనములను చదవండి.
''వెంటనే నేను ఆత్మవశుడనైతిని" అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై యుండెను.
ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతమువలె ప్రకాశించు వర్ష ధనస్సు సింహాసనమును ఆవరించియుండెను.
ఆ సింహాసనమునందు ఆసీనుడై యుండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు, ఘనతయు కృతజ్ఞతా స్తుతులును కలుగునుగాకని'' ఆ జీవులు కీర్తించుచుండగా,
ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనము నందు ఆసీనుడై యుండు వానియెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచూ,
ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి యుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.''
రెండవ వచనములో జాగ్రత్తగా గమనించండి. ''ఒకటి'' (రెండు కాదు లేక మూడు కాదు, ఒక్కటి) ఒకడు సింహాసనము మీద కూర్చొనియుండెను. మూడవ వచనములో ఇట్లున్నది, ''ఆసీనుడైన వాడు'' (వారు కాదు) అతడు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. తొమ్మిదవ వచనములో ''ఆయనకు'' జీవులు ఘనతను కీర్తించుచున్నట్లుగా చూడగలము. (వారు కాదు) పెద్దలు ''ఆయన'' ఎదుట సాగిలపడునట్లుగా పదవ వచనములో యున్నది. (వారు కారు) ''ప్రభువా, నీవే అర్హుడవని,'' వారు కేకలు వేసినట్లుగా పదకొండవ వచనములో యున్నది. (ప్రభువులు కారు) ఈ సింహాసనము మీద యున్నవాడే ''సృష్టికర్త'' యని పదకొండవ వచనములో చెప్పబడినది. ఆయనే యేసు. (యోహాను 1:3) ఆయనే పాత నిబందన యొక్క యెహోవా దేవుని ఆత్మయై యున్నాడు. (ఆది కాండము 1:1)
కాని అక్కడే మనము ఆగిపోరాదు. ఇప్పుడు ప్రకటన 3:21 చదవండి.
''నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.''
హెబ్రీ 12:2, కూడా చదవండి.
''విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.''
గమనించండి, ప్రకటన గ్రంథమును వ్రాసిన యేసే తండ్రితో ఇక్కడ కూర్చొనియున్నాడు. ఆయన దేవుని యొక్క కుడి పార్మ్వమున కూర్చొనియున్నాడని పౌలులో యున్న ఆత్మ చెప్పుచున్నది. (ఆ ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ, ఏలయనగా వాక్యము ఆ ప్రవచనాత్మ ద్వారానే వచ్చును.) కాని యోహాను సింహాసనము మీద ''ఒక్కనినే'' చూచెను. ప్రకటన 5:6-8 వరకు గొర్రెపిల్ల ఆయన యొద్ద నుండి అనగా, సింహాసనము మీద కూర్చొనియున్నవాని యొద్ద నుండి గ్రంథమును తీసికొనినట్లుగా చూడుము. (ఆ తరువాత ప్రకటన 4:2-3లో కాలగమనమును చూచెదము) ప్రకటన 4:2-3లోను మరియు 9-10 వరకును గల వచనములలో దానిని చూచెదము. ఏమిటది? ఇది ''ఒకే దేవుని'' యొక్క మర్మము. ఆయన (యేసు) దేవునిలో నుండి వచ్చెను, శరీరమందు ప్రత్యక్షమాయెను, మరణించి మరల లేచెను, ''తండ్రి యొక్క రొమ్మునకు'' తిరిగి తేబడెను. యోహాను అదే చెప్పెను. తండ్రి యొక్క కుడిపార్వమునందున్న అద్వితీయ కుమారుడే, ఆయనను బయలు పరచెను. యోహాను 1:18. ఆయన తన యొక్క వధువును చేర్చుకొనుటకును, తన్ను స్వయముగా ఇశ్రాయేలు వారికి తెలియపరచు కొనుటకును దేవునికి (మెస్సీయా) సమయము వచ్చెను. (తన్ను తాను తెలియచేసికొనును) ఆ విధముగా మరలా దేవుడు మానవులతో శరీరసంబంధమును ఏర్పరచుకొనుటను మనము చూచుచున్నాము. దావీదు కుమారునిగాను, రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను, అన్య వధువుకు పెండ్లికుమారునిగాను, ఆయన తన్ను బయలుపరచుకొనును. ఇద్దరు దేవుళ్ళు కారు గాని, సూక్ష్మముగా ఒకే దేవుడు తన యొక్క సర్వశక్తిగల మూడు కార్యములను మరియు బిరుదులను బయలుపరచుచున్నాడు.
ఆయన ప్రవక్తయని జనులకు తెలియును. మెస్సీయా యొక్క గురుతు వారికి తెలియును. ప్రవక్త ద్వారా మాత్రమే అది రాగలదు.
యోహాను 1:44-51,
''ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణపు కాపురస్థుడు.''
ఫిలిప్పు నతనయేలును కనుగొని - ధర్మశాస్త్రములో మోషేయు, ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు, అని అతనితో చెప్పెను.
అందుకు నతనయేలు — నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? అని అతని నడుగగా — వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.
యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి - ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను.
నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు — ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.
నతనయేలు — బోధకుడా, నీవు దేవుని కుమారుడవు; ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
అందుకు యేసు - ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను.
మరియు ఆయన — మీరు ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కుటయును, దిగుటయును చూతురని, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
మానవులలోని హృదయాలోచనలను వివేచించగల శక్తి ఆయనకుండెను. దేవుని చేత ఏర్పరచబడినవారు ఈయన మెస్సీయా అని అర్ధము చేసికొనగలిగిరి. దేవుని యొక్క అభిషేకింపబడిన వాక్కు ఆయనే.
హెబ్రీ 4:12,
''ఏలయనగా దేవుని వాక్యము సజీవమై, బలముగలదై రెండంచులుగల ఎటువంటి ఖడ్గము కంటెను, వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులను విభజించునంతమట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.''
ఎప్పుడైతే బావియొద్దనున్న స్త్రీ ఆయన మాటలను విని, ఆమె యొక్క హృదయములోని ఆలోచనలను ఆయన వివేచించగలిగెనో, ఆయనను ఆమె ప్రవక్తగా గ్రహించెను. ఆ గొప్ప సామర్ధ్యమును బట్టి మెస్సీయాను గుర్తించెదరని ఆమె చాటించెను.
యోహాను 4:7-26,
''సమరయ స్త్రీ యొకతె నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు — నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.
(ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి.)
ఆ సమరయ స్త్రీ — యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
అందుకు యేసు — నీవు దేవుని వరమును, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పెను.
అప్పుడాస్త్రీ — అయ్యా! ఈ బావి లోతయినది, చేదుకొనుటకు నీకేమియూలేదే. ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?
తానును తన కుమాళ్ళును, పశువులును, ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.
అందుకు యేసు, ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును. నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్ళు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
ఆ స్త్రీ ఆయనను చూచి — అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింత దూరము రాకుండునట్లును, ఆ నీళ్ళు నాకు దయచేయుమని అడుగగా,
యేసు — నీవు వెళ్ళి, నీ పెనిమిటిని పిలుచుకొనిరమ్మని ఆమెతో చెప్పెను.
ఆ స్త్రీ — నాకు పెనిమిటి లేడనగా.
యేసు ఆమెతో — నాకు పెనిమిటిలేడని, నీవు చెప్పిన మాట సరియే.
నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి; ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివనెను.
అప్పుడా స్త్రీ - అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని, ఆరాధింపవలసిన స్థలము యోరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా,
యేసు ఆమెతో ఇట్లనెను — అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము.
మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
అయితే యధార్థముగా ఆరాధించువారు, ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెననెను.
ఆ స్త్రీ ఆయనతో — క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా,
యేసు - నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.''
ప్రకటన 15:3లో ఇట్లున్నది,
''వారు — ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును, సత్యములునైయున్నవి."
దానిని మీరు చూచారా? గొర్రెపిల్ల, ప్రధాన యాజకుడు తన రక్తమును పరిహారముగా కరుణా పీఠము మీద మన పాపముల కొరకు పట్టుకొనియున్నాడు. ఆయన ప్రభువగు సర్వశక్తుడగు దేవుడు. ఇది ఆయన ప్రసుత్త పని. ఇప్పుడు ఆయన దానినే చేయుచున్నాడు, మన పాపముల నిమిత్తము ఆయన వాదించుచున్నాడు. కాని ఒక దినమున గొర్రెపిల్ల, యూదా గోత్రపు సింహముగా మారును. ఆయన శక్తితోను మహిమతోను వచ్చి తన అధికారమును స్వీకరించి రాజుగా పరిపాలన చేయును. ఆయనే ఈ భూమిమీదికి రానైయున్న రాజు. దాని అర్ధము ఇప్పుడు ఆయన రాజు కాడనికాదు. ఏలయనగా ఆయనే మన రాజు, పరిశుద్ధులకు రాజు. ఇప్పుడున్నది ఆత్మసంబంధమగు రాజ్యము. అది ఈ ప్రపంచ క్రమములో లేదు, ఎందుకనగా మనము కూడా ఈలోక సంబంధులము కాము. ఆ కారణము చేతనే మనము ఈ లోకమునకు వేరుగా జీవించుచున్నాము. మనయొక్క పౌరసత్వము పరలోకమందున్నది. మనము తిరిగి జన్మించిన లోకము యొక్క ఆత్మను ప్రతిబింబించుచున్నాము, యేసు మనకు రాజు. అందువలననే మన స్త్రీలు పురుషుల యొక్క బట్టలను ధరించుట లేదు, జుట్టు కత్తిరించుటలేదు, లేదా ఆ అలంకరణ సామాగ్రిని వాడుట లేదు. లోకము యొక్క ఆయా క్రియలు వీరిలో కనబడవు. మన మగవారు అందుకే త్రాగుడు, పొగ మొదలగు పాపములకు దూరంగా యున్నారు. మన యొక్క అధికారము పాపము మీద ఉన్న అధికారమై యున్నది, మనలో నివాసము చేయుచున్న క్రీస్తు ఆత్మ ద్వారా అది బలముగా పనిచేయుచున్నది. భూమిమీద ఉన్న ప్రతి రాజ్యము చెల్లాచెదరగును, కాని మనది నిలచియుండును.
ఒకే నిజదేవుని యొక్క కార్యాలయములు మరియు ప్రత్యక్షతలు గూర్చి మనము మాట్లాడుకొనుచున్నాము. లేఖనపూర్వకమగు అధ్యయనము ద్వారా ఆయన మహిమను మనము చూచియున్నాము. కాని ఆయనను తెలివి ద్వారా మనము తెలిసికొనలేము. ఆత్మసంబంధముగా ఆయనను తెలిసికొనగలము; ఆత్మ సంబంధమగు ప్రత్యక్షత ద్వారా తెలిసికొనగలము. యేసుగా ఎరిగిన ఈయన శరీరము విడిచిన తరువాత అగ్నిస్తంభముగా తిరిగి మారిపోయెను. కాని ఆయన తిరిగి వచ్చి ఆత్మ ద్వారా జనుల మధ్య నివాసము చేయుదునని వాగ్దానము చేసెను. పెంతకోస్తు దినమున ఆ అగ్నిస్తంభము దిగి వచ్చెను. అగ్నినాలుకలుగా అది విభాగించబడెను, అవి ప్రతివారి మీదను వ్రాలినవి. దేవుడేమి చేయుచుండెను? ఆయన సంఘములో తన్ను విభాగించుకొనుచున్నాడు. ఆ స్త్రీ, పురుషులందరికీ తన్ను ఇచ్చుకొనుచున్నాడు. ఆయన తన్నుతాను సంఘము మధ్యను విభాగించుకొనుచున్నాడు. ఆలాగు చేయుదునని ఆయన చెప్పెను.
యోహాను 14:16-23,
''నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.
లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును.
మిమ్మును అనాధలనుగా విడువను: మీ యొద్దకు వత్తును.
కొంతకాలమైన తరువాత, లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే మీరు నన్ను చూతురు: నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.
నేను నా తండ్రియందును, మీరు నా యందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.
నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే, నన్ను ప్రేమించువాడు: నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనుబరచుకొందునని చెప్పెను.
ఇస్కరియోతు కాని యూదా — ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్నునీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా
యేసు — ఒకడు నన్ను ప్రేమించినయెడల, వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మరియు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము.''
మరియొక ఆదరణకర్తను పంపించునట్లుగా తండ్రిని వేడుకొందునని ఆయన చెప్పెను. ఇప్పటికే వారితో యున్నాడు (శిష్యులతో) కాని వారిలో లేడు. ఆయనే క్రీస్తు. ఆ తరువాత ఇరవై మూడవ వచనములో ఆయన నన్ను గూర్చియు, తండ్రి గూర్చియు చెప్పుచూ మేము వచ్చెదమని ఆయన చెప్పెను. "ఆత్మ వచ్చుచున్నది, అదే దేవుని యొక్క ఆత్మ తండ్రిగాను, కుమారునిగాను బయలుపరచబడి ఇంకా చాలా మందిలో బయలుపరచబడును" — ఆత్మ రూపిగా ఉన్న ఒకే దేవుడు.
పరిశుద్ధుడనగా పోపు, లేదా పరిశుద్ధుడనగా ఒక బిషప్పు, లేదా యాజకుడు అని ఎవరునూ చెప్పలేకపోవుటకు అదియే కారణము. క్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ మనలోనే యున్నది. విశ్వాసులకు మాట్లాడు హక్కు లేదని పోపు వారసులు చెప్పుటకు ఎంత ధైర్యము! ప్రతివారికిని చెప్పుటకు ఏదో యున్నది. ప్రతివారికి ఒక పని యున్నది, ప్రతివారికి వారి సేవ యున్నది. పెంతకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఒక్కొక్కరి మీద విభాగింపబడినది, క్రీస్తు చెప్పినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను.
''నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని, ఆ దినమున మీరెరుగుదురు.''
యోహాను 14:20.
నేనున్నవాడననిన గొప్పవాడు, సర్వశక్తుడగు దేవుడు, ఆత్మగా తన యొక్క నిజసంఘము నింపుటకు వచ్చియున్నాడు. ఆయన తనకిష్టమొచ్చిన చోటకు కదలగలడు. తాను కోరుకొనిన వారి మీదికి దిగి వచ్చును, మనము మనమధ్య ఎవరినీ పరిశుద్ధులనుగా చేయజాలము, అయితే ప్రభువు యొక్క నిజ సమాజమంతయూ పరిశుద్ధమైనదే. ఎందుకనగా, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అచ్చటున్నది. ఆయనయే, పరిశుద్ధాత్మయై యున్నాడు, సమాజము దానికది పవిత్రముగా లేదు గాని ఆయన పరిశుద్ధుడై యున్నాడు.
ఇప్పుడు ప్రత్యక్షత ఇది: యేసుక్రీస్తు దేవుడు. పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు. మీరెంత గట్టిగా ప్రయత్నించినా గాని ముగ్గురు దేవుళ్ళున్నారని రుజువు చేయలేరు. ఆయన ఒక్కడై యున్నాడను సత్యమును మిమ్మును గ్రహింపచేయకలిగినది పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతయే. పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు అని చూచుటకు ప్రత్యక్షత కావలెను. సాతాను సంఘములోనికి ప్రాకి వచ్చి జనులను సత్యము చూడనీయకుండా గ్రుడ్డివారినిగా చేసియున్నది. ఆ విషయములో వారు గ్రుడ్డివారయినప్పుడు రోమ్ సంఘము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చుటను ఆపినది.
ఈ దినములలో దైవత్వము యొక్క సత్యమును గ్రహించుటకు పరిశుద్ధాత్మ యొద్ద నుండి నిజమగు ప్రత్యక్షత కావలెను, ఎందుకనగా లేఖనములను తప్పుదారి పట్టించువారి మధ్య మనం ఉన్నాము. కాని జయించు, విజయము సాధించు సంఘము ప్రత్యక్షత మీదనే నిర్మించబడియున్నది. కాబట్టి తన సత్యమును దేవుడే బయలుపరచవలెను అని కోరుదుము. అయితే నీటి బాప్తిస్మపు విషయములో నీకు వాస్తవంగా ఒక ప్రత్యక్షత అవసరము లేదు. అది నీ కళ్ళకు కట్టినట్లుగా కనిపించుచున్నది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మము ఇమ్మని ప్రభువు శిష్యులకు ప్రత్యక్షముగా ఆజ్ఞాపించెను. ఒక్క నిమిషములో అపోస్తలులు తప్పుత్రోవ పట్టుటకు సాధ్యమయిన పరిస్థితి యున్నది. అప్పుడు వారు ఇష్టపూర్వకంగానే అవిధేయులయిన వారగుదురు. ఆ పేరు ఏమిటో వారికి తెలియును, మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తప్ప మరే విధముగా కూడా వారు బాప్తిస్మమును ఇచ్చినట్లుగా వాక్యములో ఎచ్చటనూ ఆధారము లేదు. అపోస్తలుల కార్యముల గ్రంథము సంఘము కార్యరూపములో యుండుటను చూపించుచున్నదని ఇంగితజ్ఞానము గల ఎవరయినా గాని చూడగలరు. వారు ఏ విధంగా బాప్తిస్మమిచ్చిరో అదే విధానమును మనము కూడా పాటించవలెను. అది చాలా గట్టిగా నున్నదని నీవు తలంచుచున్నయెడల దీని గూర్చి నీవేమి ఆలోచించుచున్నావు? ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందనివారెవరయినా గాని మరల బాప్తిస్మము పొందవలసియున్నారు.
అపొ. కా 19:1-6 ''అపొల్లో కొరింధులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి: కొందరు శిష్యులను చూచి — మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా, వారు పరిశుద్ధాత్మడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుతడు — అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా? వారు — యోహాను బాప్తిస్మమును బట్టియే అని, చెప్పిరి. అందుకు పౌలు — యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.'' చూడండి. ఎఫెసులోనున్న మంచి జనులు, రానున్న మెస్సీయా గూర్చి వినిరి, యోహాను వారికి బోధించెను. వారు మారుమనస్సు బాప్తిస్మము పొందియుండిరి, యేసునందు విశ్వసించుటకు ముందుకు చూచుచుండిరి. కాని ఇప్పుడు వెనుదిరిగి యేసు వైపుకు చూడవలసిన సమయము వచ్చెను. పాపముల యొక్క క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందవలసియున్నది. ఇది పరిశుద్ధాత్మను పొందవలసిన సమయము. మరియు వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందినప్పుడు, పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి దిగి వచ్చెను.
ఎఫెసు యొద్దనున్న ఆ జనులు చాలా చక్కని జనులే, వారికున్న భద్రత ఎవరికినీ లేదని చెప్పవచ్చును. వారెంత దూరము వచ్చారో గమనించండి. రానున్న మెస్సీయాను అంగీకరించు స్థాయికి వారు వచ్చిరి. వారాయన కొరకు సిద్ధపడియున్నారు. కాని వారాయనను తప్పిపోయిరని మీరు చూడగలరు. ఆయన వచ్చెను వెళ్ళిపోయెను. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలసిన అవసరత యున్నది. వారు పరిశుద్ధాత్మతో నింపబడవలసిన అవసరమున్నది.
నీవు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందినప్పుడు, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపును.
అపో. కా. 19:6 మనము చదివియున్నాము. అది అపో. కా. 2:38ని నెరవేర్చుచున్నది.
''ప్రతివాడును మారు మనస్సుపొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.''
చూడండి, పేతురు పరిశుద్ధాత్మ ద్వారా దేనిని చెప్పెనో, పౌలు కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా అదే చెప్పెను. చెప్పబడినది మారజాలదు. పెంతకోస్తు మొదలుకొని ఏర్పరచబడిన చిట్టచివరి వ్యక్తి బాప్తిస్మము పొందువరకును అది అదే విధంగా యుండవలెను.
గలతీ 1:8,
''మేము గాని లేదా పరలోకము నుండి ఒక దూత గాని వచ్చి మేము బోధించిన సువార్తను గాక మరియొక సువార్తను బోధించినయెడల శాపగ్రస్తుడగును.''
మీలో కొందరు ఏకత్వము వారు తప్పు బాప్తిస్మము ఇచ్చుచున్నారు. నీటిలో ముంచుట వలన మీకు రక్షణ కలుగవచ్చును గాని మీరు మారుమనస్సు కొరకే బాప్తిస్మమిచ్చుచున్నారు. నీటి ద్వారా మారుమనస్సు రాదు; అది ఆత్మ యొక్క కార్యము. పరిశుద్ధాత్మ ద్వారా అతడు ఆజ్ఞ ఇచ్చెను, ''మారుమనస్సు పొంది ప్రతివాడును ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందవలెను.'' నీటి మూలమున మారుమనస్సు వచ్చునని అతడు చెప్పలేదు. ''దేవునిపట్ల మంచి మనస్సాక్షి'' కలిగియున్నావనుటకు అది రుజువు మాత్రమే.
1 పేతురు 3:21,
''అందుకు సాదృశ్యముగానున్న బాప్తిస్మము ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది. (శరీరమాలిన్యమును తీసివేయుట కాదు గాని దేవునిపట్ల సరియైన మనస్సాక్షి కలిగియున్నావనుటకు ప్రత్యుత్తరమై యున్నది,) యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా అది వచ్చుచున్నది.''
దానిని నేను నమ్ముచున్నాను.
ఎవరికయినా ఏమయినా తప్పు అభిప్రాయములున్నయెడల చరిత్ర ఈ నీటి బాప్తిస్మమును గూర్చి రుజువు చేయును. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తప్ప మరే ఇతర విధానము లేదు; మీరు చరిత్రను చదువవలెనని సలహా ఇచ్చుచున్నాను, మీయంతటమీరే తెలిసికొనండి. బాప్తిస్మమును గూర్చిన నిజ రికార్డు మీ ముందుంచుచున్నాను. క్రీ.శ. 100లో రోమ్ నందు ఇది జరిగెను. ఇది టైమ్ పత్రికలో డిసెంబరు 5, 1955లో పునర్ముద్రితమయినది. ''పెద్ద తన చేయిని ఎత్తెను, పలబియస్ డెసియస్ బాప్తిస్మపు ద్వారము గుండా అడుగిడెను. నడుము వరకు ఉండిన నీటిలో కట్టెలమ్ము మార్కస్ వస్కా నిలబడియుండెను. తన ప్రక్కనున్న కొలనులో నుండి చేయి ఊపుచున్న పలబియస్‌ను చూచి అతడు నవ్వుచుండెను. 'క్రెడిస్?' (నమ్ముచున్నావా?) అని అతడడిగెను. 'క్రెడో' (నమ్ముచున్నాను) అని పలబియస్ జవాబు ఇచ్చెను. ''నా రక్షణ యేసుక్రీస్తు నుండి వచ్చినదని నేను నమ్ముచున్నాను. ఆయన పొంతి పిలాతు కాలములో సిలువ వేయబడెను. ఆయనతో కూడా నేను చనిపోయితిని, అందువలన నేను నిత్యజీవమును పొందితిని.'' అప్పుడు బలమగు చేతులు పట్టుకొని వెనుకకు వంచి నీటిలో ముంచెను. మార్కస్ యొక్క స్వరము అతని చెవులకు వినబడెను — 'ప్రభువైన యేసు నామములో నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను' — చల్లని నీటిలో అతడు మునిగియుండెను."
ఆ తరువాత సత్యము పోగొట్టుపోయినది. (ఈ చివరి కాలము వరకు అది తిరిగి రాలేదు. నైసీయా మొదలుకొని ఈ శతాబ్దపు మలుపు వరకు అది బయటకు రాకుండా యుండెను) వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చిరి. ఇది మరల వచ్చియున్నది. ఆత్మ ఇవ్వవలెనని కోరుచున్నప్పుడు ఆ ప్రత్యక్షతను సాతాను ఆపజాలదు.
అవును, ముగ్గురు దేవుళ్ళున్నయెడల నీవు తండ్రి కొరకును, కుమారుని కొరకును, పరిశుద్ధాత్మ కొరకును బాప్తిస్మము ఇవ్వవచ్చును. కాని దేవుడు ఒక్కడేయని యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహించబడెను. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. నీవు ఒక దేవుని కొరకే బాప్తిస్మమియ్యవలెను, ఒకే ఒక్కడు. అందువలననే పేతురు ఆ విధంగా పెంతకోస్తునాడు బాప్తిస్మమిచ్చెను. అతడు తాను పొందిన ప్రత్యక్షత పట్ల నమ్మకముగా యుండెను. ''మీరు ఏ యేసును సిలువ వేసితిరో, ఆ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను చేసెనని ఇశ్రాయేలీయులు నిశ్చయముగా తెలిసికొనవలెను.'' ఆయనే, "ప్రభువైన యేసుక్రీస్తు."
యేసే ప్రభువుగాను, క్రీస్తుగాను ఉన్నట్లయితే, ఆయనగా (యేసు) ఉన్నవాడు మరొకరు లేరు. "తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ" ఒకే వ్యక్తియందు శరీరము ధరించి ప్రత్యక్షమాయెను. ''దేవుడు ముగ్గురు వ్యక్తులలో ఉండుట కాదు, ధన్యమగు త్రిత్వము," అయితే ఒకే దేవుడు, ఒకే వ్యక్తిత్వము, మూడు పెద్ద బిరుదులు కలిగియున్నాడు. మూడు కార్యాలయములు కలిగియుండి ఆ బిరుదులను బయలుపరచుచున్నాడు. దీనిని మరియొకసారి వినండి. "ఈ యేసే, ప్రభువు మరియు క్రీస్తు అయి యున్నాడు." ప్రభువు (తండ్రి) మరియు క్రీస్తు (పరిశుద్ధాత్మ), యేసే అయి యున్నాడు. ఆ రెండునూ ఆయనే. (ప్రభువు మరియు క్రీస్తు)
దైవత్వము యొక్క నిజ ప్రత్యక్షతను అది చూపించనియెడల మరేదియూ చూపించదు. ప్రభువు మరియొకడు కాడు; క్రీస్తు మరియొకడు కాడు. ఈ యేసే ప్రభువైన యేసుక్రీస్తు - ఒకే దేవుడు.
ఒక రోజున ఫిలిప్పు యేసుతో ఇట్లనెను, ''ప్రభువా, మాకు తండ్రిని చూపించుము, అంతే చాలును.'' యేసు అతనితో ఇట్లనెను, ''ఇంతకాలము నుండి నేను మీతో యున్నాను గదా, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు, తండ్రిని చూచియున్నాడు. కాబట్టి మాకు తండ్రిని చూపించమని నీవు నన్ను అడుగుట ఏల? నేనును, నా తండ్రియు ఏకమైయున్నాము.'' ఒకసారి నేను దానిని చెప్పినప్పుడు, ఒకామె నాతో ఇట్లన్నది, ''ఒక్క నిమిషము ఆగు, శ్రీ. బ్రన్హం, నీవు నీ భార్య ఒక్కటి కదా?''
''ఆలాగు కాదు,'' అన్నాను.
''క్షమించు,'' అన్నది.
అప్పుడు నేనిట్లు చెప్పాను, ''నీవు నన్ను చూచుచున్నావా?''
''అవును,'' అన్నదామె.
''నా భార్యను నీవు చూచుచున్నావా?'' అన్నాను.
''లేదు,'' అన్నదామె.
''కాబట్టి ఆ ఏకత్వము వేరే విధమైనది, ఎందుకనగా నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు అని ఆయన చెప్పెను'' గదా, అన్నాను.
సాయంకాల సమయములో వెలుగుండును, అని ప్రవక్త చెప్పెను. పాటలో ఇట్లు వ్రాయబడినది:
"సాయంకాలమందు వెలుగుండును,
మహిమ బాటను నిశ్చయంగా మీరు కనుగొందురు,
నీటి బాటలో, ఈనాడు వెలుగున్నది,
ప్రశస్తమగు యేసు నామములో సమాధి చేయబడుటయే.
ముసలివారు, యువకులు, అందరూ పాపము విషయము
పశ్చాత్తప పడవలెను,
పరిశుద్ధాత్మ నిశ్చయముగా లోనికి ప్రవేశించును.
సాయంకాలపు వెలుగు వచ్చియున్నది —
దేవుడు మరియు క్రీస్తు ఏకమైయున్నారనునది నిజము."
కొద్దికాలము క్రిందట నేను ఒక యూదుడగు రబ్బీతో మాట్లాడుచున్నాను. అతడు నాతో ఇట్లనెను, ''అన్యులగు మీరు దేవునిని మూడు ముక్కలుగా చేసి ఒక యూదునికి ఇవ్వజాలరు. మాకు దానికంటే మరి ఎక్కువ తెలియును.''
నేను అతనికి చెప్పాను, ''అది సరియే రబ్బీ, మేము దేవుని మూడు ముక్కలుగా కోయము. నీవు ప్రవక్తలను నమ్ముదువా, నమ్మవా?"
''నిశ్చయముగా నేను నమ్ముదును,'' అని అతడు చెప్పెను.
''నీవు యెషయా - 9:6 నమ్ముదువా?''
''అవును.''
''ప్రవక్త ఎవరిని గూర్చి మాట్లాడుచున్నాడు?''
''మెస్సీయా.''
నేను చెప్పాను, ''మెస్సీయాకు దేవునికి గల సంబంధము ఏమిటి?''
అతడు చెప్పెను, ''ఆయన దేవుడై యుండును.''
నేను చెప్పాను, ''అది సరియే.'' ఆమేన్.
మీరు దేవుని ముగ్గురు వ్యక్తులు లేదా మూడు భాగములు చేయలేరు. తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ అను ముగ్గురు దేవుళ్ళున్నారని మీరు ఒక యూదునికి చెప్పజాలరు. ఆ సిద్ధాంతము ఎక్కడ నుండి వచ్చెనో వెంటనే అతడు చెప్పును. నైసీన్ ఆలోచన సభ యొద్ద ఈ ఆచారము పుట్టినదని యూదునికి తెలియును. వారు మనలను అన్యులని నిందించుటలో ఆశ్చర్యము లేదు.
మార్పులేని దేవునిని గూర్చి మనము మాట్లాడుకొనుచున్నాము. యూదులు కూడా దానిని నమ్ముదురు. కాని ఈ మారని దేవునిని మారు దేవునిగా సంఘము చూపించుచున్నది. ఒక్క దేవునిని ముగ్గురుగా చూపించుచున్నారు. కాని సాయంకాలమందు వెలుగు వచ్చుచున్నది. యూదులు పాలస్తీనాకు తిరిగి వచ్చుచున్న కాలములో, ఈ సత్యము తిరిగి వచ్చుచున్న సంగతిని ప్రత్యేకముగా చూడవలసియున్నాము. దేవుడు మరియు క్రీస్తు ఒక్కటే. ఈ యేసే ప్రభువు మరియు క్రీస్తు అయి యున్నాడు.
యోహానుకు ప్రత్యక్షత యున్నది, యేసే ప్రత్యక్షతగా యున్నాడు, మరియు లేఖనములో ఆయన స్వయంగా దానిని చెప్పుకొనెను — ''నేను ముందుండినవాడను, ఇప్పుడున్నవాడను, రానున్నవాడను, అని ఆయన చెప్పియున్నాడు. ఆయన సర్వశక్తుడు. ఆమేన్."
ప్రత్యక్షత నీకు అందనియెడల పైకి చూచి దేవుని వెదకుము. దానిని నీవు పొందుటకు అది ఒక్కటే మార్గము. ప్రత్యక్షత అనునది దేవుని నుండి రావలసియున్నది. అది ఎన్నడునూ మానవ ప్రయత్నముల ద్వారాను, ప్రకృతి సంబంధమగు ప్రయత్నముల ద్వారాను రాదు. ఆత్మసంబంధమగు ప్రభావము వలననే ఇది వచ్చును. నీవు లేఖనమును కంఠత చేయ వచ్చును, అది చాలా అద్భుతమైనదే, అయినా అది పని చేయదు. ఇది దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షతయై ఉండవలెను. దానిని నీకిచ్చును. పరిశుద్ధాత్మ ద్వారానే యేసు క్రీస్తుని ఒకడు ఒప్పుకొనునని వాక్యములో చెప్పబడియున్నది. నీవు పరిశుద్ధాత్మను పొందవలెను, అప్పుడు మాత్రమే, ఆ ఆత్మ యేసేక్రీస్తు అను ప్రత్యక్షతను అనుగ్రహించును: దేవుడు, అభిషిక్తుడు.
దేవుని యొక్క ఆత్మ బయలుపరచనియెడల దేవుని సంగతులను ఎవడునూ గ్రహించజాలడు. దేవుని యొక్క ఆత్మ వారికి ప్రత్యక్షపరచవలెను. ఈ లోకములోని దేనికంటెను ఎక్కువగా మనము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మొరపెట్టవలెను. మనము బైబిలును అంగీకరించియున్నాము, అందులోని గొప్ప సత్యములను మనము స్వీకరించియున్నాము, అయినను అవి చాలామంది ప్రజలకు ఆమోదయోగ్యముగా ఉండుట లేదు, ఎందుకనగా ఆత్మ యొక్క ప్రత్యక్షత వారికి లేదు. వాక్యము ఇంకా వారిలో జీవము పొందలేదు. II కొరింధీ 5:21లో చెప్పబడినది, యేసుక్రీస్తుతో మనము ఐక్యమగుట ద్వారా మనము దేవుని యొక్క నీతియగుచున్నాము. దానిని మీరు గ్రహించారా? "మనము దేవుని యొక్క నీతి అయి యున్నాము." ఇది క్రీస్తులో ఉండుట ద్వారా జరిగినదని చెప్పబడియున్నది. ఆయన (యేసు) మన నిమిత్తము పాపమాయెనని అది చెప్పుచున్నది. ఆయన పాపము చేసెనని చెప్పుట లేదు గాని మనకొరకు పాపమాయెను. ఆయనతో మనము ఐక్యమగుట వలన మనము దేవుని యొక్క నీతిగా మారియున్నాము. ఆ వాస్తవమును మనము అంగీకరించవలెను. (తప్పక మనము అంగీకరించవలెను) ఆయన అక్షరాలా మనకొరకు పాపమాయెను. మనకొరకు ఆయన ప్రత్యామ్నాయముగా మారెను. ఆయనతో మనము ఐక్యమగుట వలన మనము దేవుని యొక్క నీతి అయితిమను సత్యమును కూడా తప్పక మనము అంగీకరించవలెను. ఒక దానిని తిరస్కరించినప్పుడు మరో దానిని కూడా తిరస్కరించిన వారమగుదుము. ఒకటి అంగీకరించనప్పుడు మరొకటి అంగీకరించిన వారమగుదుము. దానిని బైబిలు చెప్పుచున్నదని మనకు తెలియును. దానిని కాదనలేము. కాని దాని యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకొనుచున్నారు. చాలా మంది దేవుని యొక్క పిల్లలకు అది వాస్తవముగా తోచుట లేదు. అది బైబిలులోని ఒక మంచి వచనమని చెప్పుచున్నారు. కాని దానిని మనము మన విషయములో సజీవమగు దానినిగా చేసికొనవలెను. అందుకు ప్రత్యక్షత అవసరము.
మీకు ఆశ్చర్యమును మరియు సహాయమును కలుగజేయు ఒక సంగతిని ఇక్కడ చూపించెదను. క్రొత్త నిబంధన ఆదిలో గ్రీకు భాషయందు వ్రాయబడినదన్న మాటను నమ్మని ఏ విద్యార్ధియు ఉండడు. మన గొప్ప బైబిలు విద్యార్ధులందరూ చెప్పినది వినండి. దేవుడు మన ప్రపంచమునకు మూడు గొప్ప రాజ్యములను ఇచ్చెను. సువార్త నిమిత్తము మూడు గొప్ప త్యాగములను చేసెను. ఆయన గ్రీకులకు ఒక విశ్వ భాషను ఇచ్చెను. ఆయన యూదులకు నిజమగు మతమును, నిజమగు దేవుని జ్ఞానమును రక్షకుని ద్వారా అనుగ్రహించెను. ఆయన రోమనులకు ఒక ఐక్య సామాజ్యమును ఇచ్చెను. వారు మనకు న్యాయ శాస్త్రమును మరియు ఉన్నత విధానముల యొక్క క్రమమును ఇచ్చిరి. ఆ విధంగా మనకు నిజమగు మతము, చాలా మంది జనులతో సంభాషించగల భాష, ప్రభుత్వము మరియు భౌతికంగా వ్యాపించు రహదారులు వచ్చియున్నవి. చారిత్రాత్మకంగా చూచినప్పుడు ఇది సరిగానే కనబడును. బైబిలు దినములలోని గ్రీకు భాష ఎంతో ఖచ్చితమైనదని, సరియైనదని ఈనాడు మన గ్రీకు పండితులు చెప్పుచున్నారు. గ్రీకు భాష నేర్చుకొనిన అనుభవము మరియు సరయైన వ్యాకరణము గడించిన వాడయినచో అతనికి క్రొత్త నిబంధన వాక్యము బోధించుచున్నది నిజంగా తెలియును.
కాని ఇది కేవలము సిద్ధాంతము మాత్రమేనా? ఇది నిజమా? బాగుగా ప్రసిద్ధిచెందిన ప్రతి గ్రీకు పండితుడును ఒక్కొక్క శాఖకు చెందియున్నాడు గనుక వారు ఒకరితో ఒకరు వాదించుకొనుచున్నారు. వారి యొక్క వాగ్వివాదము గుర్తింపుపొందిన గ్రీకు పదముల మీదను, గుర్తింపుపొందిన వ్యాకరణ సూత్రముల మీదను ఆధారపడియుండలేదా? నిశ్చయంగా అది ఆ విధంగానే యున్నది. 325 నాటి నైసీయా ఆలోచన సభకు ముందున్న పెర్గెమ కాలములో సహితము ఇద్దరు గొప్ప విద్యార్ధులుండిరి. వారు ఆరియస్ మరియు ఆతానిసియస్‌లు. ఒక గ్రీకు పదము గూర్చి వాదించుకొనుచూ సిద్ధాంతము విషయములో బంధింపబడిరి. వారి యొక్క వాదము బహు తీవ్రతరముగాను, ప్రపంచ ప్రసిద్ధిచెందినదిగాను ఉండెను. ప్రపంచము ఒక డిప్తాంగు మీద ముక్కలయినదని చరిత్రకారులు చెప్పుచుందురు. (ఒక డిప్తాంగు అనగా ఒక ఏక గుణితాక్షరమునందున్న రెండు అచ్చుల యొక్క శబ్దము.)
గ్రీకు అంత పరిపూర్ణముగా మరియు దేవుని చేత అంతగా నిర్ణయము చేయబడినప్పుడు అటువంటి వివాదము ఎందుకు పుట్టవలెను?మనమందరమును తప్పకుండా గ్రీకు నేర్చుకొనవలెనని దేవుడుద్దేశించలేదు గదా? ఈనాటికిని మనము గ్రీకు గూర్చి వాదములాడుకొనుచున్నాము. డాక్టర్ మెక్ క్రాసస్ వ్రాసిన ''క్రీస్తు యొక్క చచ్చుబడిన సంఘమును ఎక్స్ రే తీసిరి,'' అను పుస్తకమును ఉదాహరణకు తీసికొనండి. అందులో అతడు చాలామంది పేరొందిన గ్రీకు వ్యాకరణకర్తల యొక్క ఎన్నో వ్రాతలను ఎత్తి వ్రాసెను. తన స్వంత సంతృప్తి కొరకు రుజువుపరచుకొనెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవాడు నూతన జన్మను పొందిన వానితో సమానుడని బైబిలు బోధించుచున్నట్లు మారని గ్రీకు వ్యాకరణ సూత్రములను సంగ్రహించి చెప్పెను. బలిపీఠము మీదకు స్త్రీ రావచ్చునని అతడు నిస్సంకోచముగా చెప్పెను, ఎందుకనగా ప్రవచనము అను మాటకు బోధించుటని అర్ధము చెప్పెను. కాని అతనివలె సామర్ధ్యముగల ఇతర గ్రీకు పండితులను అతడు ఒప్పింప చేయగలడా? ఎన్నడూ ఒప్పింపజాలడు. వ్యతిరేక అభిప్రాయము గల ఆ ఇతర పండితుల యొక్క వ్రాతలను మీరందరూ చదవవలసియున్నారు, వారు ఎంత వ్రాసిన దానిని వినండి.
నేను చెప్పినది మాత్రమే సత్యమని ఎరుగుట కాదు గాని, మనము మరో అడుగు ముందుకు వేయుదము. యేసు యొక్క భాష మరియు ఆనాటి జనుల యొక్క భాషయగు ఆరామిక్‌లో మూల వ్రాతప్రతులు వ్రాయబడినవని చెప్పుకొను పండితులు నేడు మనకున్నారు. గ్రీకు భాషను ప్రజలు వ్రాయను లేరు, మాట్లాడను లేరు అని అందరికీ తెలిసిన సంగతేనని వారనుచున్నారు. దాని మీద మన చరిత్రకారులు విభాగింపబడి యున్నారనునది సత్యము. ఉదాహరణకు డాక్టర్ స్కొఫీల్డును చూడండి, చాలా తెలివిగల పండితుడు, పరిశోధన ద్వారా అతడు తన సంతృప్తి కొరకు రుజువు చేసినదానిని వినండి. ఆనాడు గ్రీకు మాట్లాడు జనుల వ్యావహారిక భాషలో క్రొత్త నిబంధన వ్రాయబడెనని అతడు చెప్పెను. తన నమ్మకములకు చక్కని కారణములను అతడు చూపించగలడు. అతని వశములో ఉండిన ఆయా పత్రములను ఆధారము చేసికొనెను. మరొక ప్రక్క ఇంకొక పేరొందిన పండితుడు డాక్టర్ లామ్సా యున్నాడు. క్రొత్త నిబంధన ఆరామిక్‌లో వ్రాయబడినదని అతడు నమ్మెను. ఆనాటి జనుల యొక్క భాష గ్రీకు కాదు గాని ఆరామిక్ అను అతని వాదనను బలపరచుటకు మహా చరిత్రకారుడగు టోన్‌బీ యున్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన మొదట ఆరామిక్ భాషలో వ్రాయబడినదనుట నిజమనిపించుచున్నది.
ఏమయినాగాని దీనిని గూర్చి మనము ఒప్పుకొను ముందు కింగ్ జేమ్సు వర్షన్ మరియు డాక్టర్ లామ్సా అనువాదము రెండింటినీ చదువుదము. రెండింటిలోను పదములు ఒకే విధముగా యుండుట మనకు ఆశ్చర్యము కలిగించును. విషయములో గాని, సిద్ధాంతములో గాని ఎట్టి భేదమును మనము కనుగొనము. ఈ క్రొత్తగా కనిపెట్టబడిన వ్రాతప్రతులు మరియు ముందే తెలిసిన వ్రాతల యొక్క క్రొత్త ప్రచురణలు ముందు మనకున్న వాటి యొక్క అధికారమును రుజువు చేయుచున్నవి. అందుకే దేవుడు వాటిని అనుమతించెనని మనము చెప్పవచ్చును. అనువాదకులు ఒకరితో ఒకరు పోరాడు కొనుచున్నా గాని లేఖనములు పోరాడుకొనుటలేదని మనము గ్రహించవలెను.
బైబిలును వ్రాసిన భాషలో ఎంతో పరిజ్ఞానము సంపాదించిన పండితుల అనువాదమును ఆధారము చేసికొని నీవు దానిని చూడలేవు. ఇంకా నీవు ఆ విషయమును గ్రహించనియెడల నీ మనస్సు ఆచారము యొక్క ముసుగు క్రింద యున్నదని భావము, ఇక్కడ ఒక చివరి మాదిరియున్నది. శాస్త్రులు, పరిసయ్యులు మరియు క్రీ.శ. 33 నాటి గొప్ప పండితులు వ్యాకరణము యొక్క ఖచ్చిత సూత్రములను ఎరుగుదురు. ఇందులో ఏమీ సందేహము లేదు. పాత నిబంధన వ్రాయబడిన భాష యొక్క పదములను, వాటి యొక్క ఖచ్చిత అర్ధములను ఎరుగుదురు. వారికి అన్యమగు జ్ఞానమున్నను కుమారునియందు బయలుపరచబడిన దేవుని యొక్క వాగ్దాన వాక్యపు ప్రత్యక్షతను వారు పొందలేకపోయిరి. ఆదికాండము నుండి మలాకీ వరకు ఆయన కనబడుచున్నాడు. మొత్తం అధ్యాయములు ఆయనకును, ఆయన పరిచర్యకును అంకితము చేయబడినవి. ఆత్మ ద్వారా వెలిగింపబడిన వారు తప్ప మిగిలినవారు పూర్తిగా ఆయన యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకొనిరి.
ఇప్పుడు మనము ఒక ముగింపునకు వచ్చియున్నాము, ఈ ముగింపును ముందే మనము వాక్యములో పొందియున్నాము. అతి పురాతనమగు మంచి వ్రాతప్రతులను సంపాదించవలెనని మనము ప్రయత్నములు చేయుచున్నాము. అప్పుడే వాక్యమునకు శ్రేష్టమగు అర్ధము గ్రహింప సాధ్యమగునని నమ్ముచున్నాము. మనము ఎంత యధార్థముగా లేఖనములను అధ్యయనము చేసి పోల్చి చూచికొనినప్పటికిని ఎన్నడును దాని యొక్క నిజ అర్ధమును గ్రహించలేము. దానిని బయటకు తెచ్చుటకు దేవుని యొద్దనుండి ప్రత్యక్షత కావలెను. పౌలు చెప్పినది ఖచ్చితంగా అదే. మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూచుచూ, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. 1 కొరింధీ 2:15. వాగ్దానము చేయబడిన దానిని రుజువుపరచుట ద్వారా దేవుడు తన స్వంత వాక్యమును అనువదించుటయే నిజమైన ప్రత్యక్షత.
నేను చెప్పిన దానిని బట్టి ఎవరును తప్పు త్రోవ పట్టకూడదు. వాక్యము యొక్క ఖచ్చితత్వము గూర్చి నేను నమ్ముట లేదని మీరు తలంచరాదు. ఇప్పుడు అది మనకున్నది. ఈ బైబిలు ఖచ్చితమైనదని నేను నమ్ముచున్నాను. యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు పాత నిబంధనను పూర్తిగా ధృవీకరించెను, మన క్రొత్త నిబంధనవలె ఖచ్చితంగా అది సమకూర్చబడినది. అందులో ఏమీ పొరపాటు జరుగలేదు. నేడు మనకు తప్పిపోని దేవుని వాక్యమున్నది మరియు ఏ వ్యక్తియు ధైర్యముగా దాని నుండి ఏదియూ తీసివేయలేడు లేదా దానికి మరేదియూ కలుపజాలడు. కాని మనకు అదే ఆత్మ అవసరమైయున్నది, అదే మనకు బోధించవలెను.
ఓ, ఆత్మ ద్వారా మనకు ప్రత్యక్షత కావలసియున్నది. ఒక క్రొత్త బైబిలు మనకు అవసరము లేదు, ఒక క్రొత్త అనువాదము మనకు అవసరము లేదు, అందులోకొన్ని చాలా మంచివే, మరియు వాటికి నేను వ్యతిరేకిని కాను. కాని మనకు ఆత్మ యొక్క ప్రత్యక్షత అవసరమైయున్నది. దేవునికి వందనములు, మనకు అవసరమగు దానిని మనము పొందగలము, ఏలయనగా మనకు దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యమును బయలుపరచగోరుచున్నాడు.
ఎడతెగని జీవప్రదమగు, జయించు ప్రత్యక్షతను దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించనారంభించును గాక. ఓ, సంఘము ఒక నూతన ప్రత్యక్షతను పొందినచో చాలును. దాని ద్వారా సజీవ వాక్యము బయలుపరచబడును, మనము గొప్ప కార్యములు చేయుదుము. పరమందున్నమన తండ్రిని మనము మహిమపరచుదుము.
పాపము నుండి విడుదల
ప్రకటన1:6,
''మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను కడిగినవానికి.''
''కడుగబడుట'' అను పదమునకు వాస్తవంగా ''విడిపించబడుట,'' అని అర్ధము — తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించెను. అది అద్భుతము కాదా? కాని మీరు ఆత్మ సబంధమగు మనస్సు కలిగియున్నారా? దానిని మీరు గ్రహించారా? మనలను మన పాపముల నుండి సంపూర్తిగా విడిపించినది ఆయన యొక్క స్వంత రక్తము. అది మానవ రక్తము కాదు. అది దేవుని యొక్క రక్తము. అది క్రీస్తు రక్తమని పేతురు పిలచెను. ప్రభువు యొక్క రక్తమనియు, యేసు యొక్క రక్తమనియు పౌలు పిలచెను. ముగ్గురు వ్యక్తులు కారు, కాని ఒకే వ్యక్తి. అక్కడ మరల ప్రత్యక్షత యున్నది, ఒకే దేవుడు. సర్వశక్తుడగు ఆ యెహోవా దేవుడు క్రిందికి దిగి వచ్చి తనకు ఒక శరీరమును అమర్చుకొని కన్యక యొక్క గర్భము ద్వారా బయటకు వచ్చెను. మనలను మన పాపముల నుండి స్వతంత్రులనుగా చేయునది దేవుని యొక్క రక్తమే. (పూర్తిగా మనలను విడిపించును) ఆయన యెదుట మచ్చలేని వారినిగా మనలను నిలువబెట్టి మనకు మహదానందము కలిగించును.
మీకు పాత నిబంధన మాదిరి కావలెనా? ఏదెను తోట యొద్దకు వెళ్ళుదము. కుమారుడగు ఆదాము నశించిపోయెనని మొదట వర్తమానము మహిమలోనికి అందినప్పుడు, దేవుడు ఒక దేవదూతను పంపెనా? ఒక కుమారుని ఆయన పంపెనా? మనవంటి మరియొకరిని ఆయన పంపెనా? లేదు, నశించిన కుమారుని విడిపించుటకు ఆయనే స్వయంగా వచ్చెను. హల్లేలూయా! దేవుడు తన యొక్క రక్షణ సంకల్పమును మరియొకరికి అప్పగించలేదు. తననుతాను ఆయన నమ్ముకొనెను. దేవుడు శరీరధారిగా మనమధ్య నివసించెను, తన కొరకు మనలను విమోచించెను. "దేవుని యొక్క రక్తము వలన మనము రక్షింపబడియున్నాము." నిత్యుడగు దేవుడు ఒక మర్త్య శరీరమందు నివసించెను, పాపమును పరిహరించుటకు ఆలాగున చేసెను. తన రక్తము చిందించుటకు ఒక గొరెపిల్లగా అయ్యి ముసుగు ధరించి దానిలో ప్రవేశించెను.
దీనిని గూర్చి ఆలోచించండి. అది దేవుని రక్తము గనుక అది పరిపూర్ణ రక్తము. మనలను పాపము యొక్క శక్తి, దాస్యము మరియు అపవిత్రత నుండి ఆ పరిపూర్ణ రక్తము విమోచించును, ఆ విధమగు విమోచన పరిపూర్ణమైనది మరియు సంపూర్తియైనది. కాబట్టి ఇక ఏ శిక్షా విధియును లేదు.
''దేవుడు చేత ఏర్పరచబడినవారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే; శిక్షవిధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే..''
రోమా 8:33-34.
ఆయన మరణము ద్వారా మనకు రక్తము వచ్చెను. ఆ రక్తము మనలను విమోచించెను. ఇప్పుడు ఏ శిక్ష విధియు లేదు. ఎట్లుండగలదు? శిక్షవిధించబడుటకు ఏమియూ లేదు, ఎందుకనగా రక్తము మనలను పాపము నుండి విడిపించెను. మనము స్వతంత్రులము, పాపము లేనివారము. మానవుని మాట వినవద్దు, వాక్యమునకు చెవియొగ్గుడి. మీరు రక్తము చేత విమోచింపబడియున్నారు.
ఆచారముల ద్వారాను మరియు మత నమ్మకముల ద్వారాను, సంస్థల ద్వారాను మరల బంధింపబడవద్దు. దేవుని యొక్క శక్తిని మరియు యేసు రక్షించును, స్వస్థపరచును, పరిశుద్ధాత్మతోను, శక్తితోను నింపును, అని నమ్మని వారి మాటలను విని దాని నుండి దారి తప్పిన వారవ్వకుడి. మీరు దేవుని చేత స్వతంత్య్రము పొందినవారు. ఆయన యొక్క స్వరక్తము వలన విమోచింపబడినవారు. మీరు ఇంకా మీ శాఖలయందు, ఆచారములయందు నమ్మకముంచియున్నయెడల, మీరు వాక్యమునందు విశ్వాసమును పోగొట్టుకొనియున్నారనునది నిశ్చయము.
రాజులు మరియు యాజకులు
ప్రకటన1:6,
''ఆయన మనలను మన తండ్రియగు దేవునికి రాజులు గాను యాజకులను గాను చేసెను. ఆయనకు మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాక! ఆమేన్.''
ఆయన మనలను ఆలాగు చేసెను. ఓ, ఇక్కడ నొక్కి చెప్పవలసిన కొన్ని ప్రత్యేక సత్యములున్నవి. ఇది అందులో ఒకటి. ఆయన! ఆయన మనలను చేసెను! రక్షణ అనునది ఆయన పని. రక్షణ ప్రభువు నుండి కలుగును. అంతా కృప ద్వారానే కలుగును. ఒక ఉద్దేశ్యము నిమిత్తము ఆయన మనలను విమోచించెను. ఒక ఉద్దేశ్యము నిమిత్తము ఆయన మనలను కొనెను. మనము రాజులము, ఆత్మ సంబంధమగు రాజులము. ఆయన తన సింహాసనము మీద కూర్చుండియున్నప్పుడు ఆయనతో కూడా మనమును ఈ భూమి మీద రాజులముగా యుందుము. కాని ఇప్పుడు మనము ఆత్మ సంబంధమగు రాజులము. ఒక ఆత్మ సంబంధమగు రాజ్యమును మనము పరిపాలించుదము.
రోమా 5:17లో అది చెప్పబడినది.
''మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై; ఆ యొకని ద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవముగలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.''
కొలస్సీ 1:13లో ఇట్లున్నది,
''ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క (అధికారము) రాజ్య నివాసులనుగా చేసెను.''
ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా ఏలుచున్నాము. పాపము మీద, లోకము మీద, శరీరము మీద, అపవాది మీద మనకు అధికారమున్నది. ఆయన యొక్క మహిమను మరియు స్తుతిని ప్రచురము చేయుచున్నాము; ఆయననే చూపుచున్నాము, ఏలయనగా క్రీస్తు మనలో యున్నాడు, ఆయన తన ఇష్టాను సారముగాను, చిత్త ప్రకారముగాను మనలో పనిచేయుచున్నాడు. అవును, నిశ్చయంగా! ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో కూర్చొనియున్నాము.
మనలను యాజకులనుగా చేసెను. అవును, ఆయనకు మనము యాజకులమైయుండి ఆత్మసంబంధమగు స్తుతిని సమర్పించుచున్నాము. అందుకు మన పెదవులు శుద్ధీకరింపబడినవి. ఆయన కొరకు మాధుర్యమగు అర్పణగా మన జీవితములను ధారపోయుచున్నాము. ఆయనను ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుచున్నాము. విజ్ఞాపనలు, అభ్యర్ధనను తెలియచేయుచున్నాము. మన దేవునికి యాజకులము గాను, రాజులము గాను యున్నాము. లోకము మనకు సంబంధించినది కాదనుటలో ఆశ్చర్యము లేదు మరియు మనము వింత జనులము, మంచి క్రియలు చేయుటకు ఆసక్తి కలిగియున్నాము. మన తండ్రిని పోలిన పిల్లలవలె యుండుటకు, ఆయనలో తిరిగి సృజింపబడియున్నాము.
రానున్న దేవుడు
ప్రకటన1:7,
''ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు: భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్.''
ఆయన వచ్చుచున్నాడు. యేసు వచ్చుచున్నాడు. దేవుడు వచ్చుచున్నాడు, ప్రవక్త వచ్చుచున్నాడు. యాజకుడు మరియు రాజు వచ్చుచున్నాడు. సర్వములో సర్వము వచ్చుచున్నాడు. అవును, ప్రభువైన యేసూ, త్వరగా రమ్ము. ఆమేన్.
ఆయన వచ్చుచున్నాడు. ఆయన మేఘములలో వచ్చుచున్నాడు, మహిమ మేఘములలో వచ్చుచున్నాడు. రూపాంతరపు కొండ మీద ఆ విధంగానే ఆయన కనబడెను. దేవుని శక్తి ఆయనలో ఇమిడియున్నట్లుగా ఆయన వస్త్రములు ప్రకాశించుచుండెను. ప్రతి నేత్రము ఆయనను చూచును. అనగా ఇది ఎత్తబడుట కాదని అర్ధము. ప్రపంచ అధినేతగా ఆయన వచ్చినప్పుడు తన స్థానమును ఆక్రమించునప్పుడు ఇది జరుగును. తన ఆచారములతోను, శాఖల సిద్ధాంతములతోను ఆయనను పొడిచినవారు ఆయనను చూచి ఏడ్చుచుందురు. జనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, ఎందుకనగా ఆయనే వాక్యము.
జెకర్యా 12:9-14లోని ప్రకటన గాధ ఇది. దాదాపు 2500 సంవత్సరాల క్రితం జెకర్యా దీనిని ప్రవచించెను. ఇది ఇప్పుడు జరుగుటకు సిద్ధముగా యున్నది. వినండి.
''యెరూషలేమునకు విరోధముగా, లేచిన ప్రతి దేశమును నేను ఆ దినమున నాశనము చేసెదను.
దావీదు ఇంటివారి మీదను, యెరూషలేము నివాసుల మీదను నేను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపనచేయు ఆత్మను కుమ్మరింపగా తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచెదరు… ''
ఇప్పుడు, యూదుల యొద్దకు సువార్త ఎప్పుడు వచ్చును? అన్యుల దినములు సంపూర్ణమైన తరువాత, సువార్త యూదుల యొద్దకు పోవుటకు సిద్ధముగా యున్నది. ఈ దినమున జరుగనైయున్న ఈ సంగతిని గూర్చి నేను మీతో చెప్పగోరుచున్నాను. జరుగుబోవుచున్న ఈ గొప్ప సంఘటన మనలను ప్రకటన 11 యొద్దకు తీసికొని వెళ్ళును, ఇద్దరు సాక్షులను చూడండి, వారిద్దరు ప్రవక్తలు, అనగా మోషే మరియు ఏలియాలు, సువార్తను మరల యూదుల యొద్దకు తీసికొనిపోవును. అందుకు మనము సిద్ధముగా యున్నాము. ప్రతిదియు క్రమములో యున్నది. యూదులు వర్తమానమును అన్యులయొద్దకు తీసికొని వచ్చిరి. అదే విధంగా అన్యులు మరల యూదుల యొద్దకు సువార్తను కొనిపోవుదురు, అప్పుడు ఎత్తబడుట వచ్చును.
ప్రకటన మరియు జెకర్యా గ్రంథములలో ఇప్పుడు మనము చదివిన దానిని గుర్తుంచుకొనండి. ఆ రెండునూ శ్రమల కాలము అయిన వెంటనే జరుగును. మొదటగా జన్మించిన వారి యొక్క సంఘము శ్రమలగుండా వెళ్ళదు. దానిని మనము ఎరుగుదుము. దానిని బైబిలు బోధించుచున్నది.
ఆ సమయమున దేవుడు తన ఆత్మను ఇశ్రాయేలు వారి ఇంటి మీద కుమ్మరించునని చెప్పబడియున్నది. వారి దినమున అన్యజనుల మీద కుమ్మరింపబడిన ఆత్మ కూడా అదే. ''ఆయనను పొడిచిన వారు ఆయనను చూచెదరు, మరియు వారాయన కొరకు ఏడ్చెదరు, తన ఏకైక కుమారుని పోగొట్టుకొనినవారు ఏడ్చినట్లుగా వారు ఏడ్చెదరు. ఏకైక కుమారుని కొరకు ఎంత ప్రలాపించెదరో అంతగా వారు ఆయన కొరకు ప్రలాపించెదరు. ఆ దినమున యెరూషలేములో మహా రోదన పుట్టును. మెగిద్దోను లోయలోని హాదద్-రిమ్మోను వరకు ఆ అంగలార్పు వ్యాపించును. దేశ నివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబికులు ప్రత్యేకము గాను, వారి భార్యలు ప్రత్యేకము గాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకము గాను, వారి భార్యలు ప్రత్యేకము గాను ప్రలాపింతురు…" అప్పుడాయన తన రెండవ రాకడలో మేఘముల మీద మహిమతో వచ్చును. ఆయనను పొడిచిన ఆ యూదులు ఆయనను చూచెదరు. మరొక వాక్యములో చెప్పబడియున్నట్లుగా ఆ గాయములు నీకు ఎక్కడయినవని వారు అడుగుదురు. ''నా స్నేహితుల ఇంటిలో,'' అని ఆయన చెప్పును. మెస్సీయాగా ఆయనను విసర్జించిన యూదులకు అది రోదన సమయముగా ఉండుట మాత్రమే కాదు గాని, ఈ దినమున ఆయనను రక్షకునిగా తిరస్కరించి విడిచిపెట్టబడిన అన్యులకును రోదన సమయముగా ఉండును.
అక్కడ ఏడ్పును, అంగలార్పును ఉండును. నిద్రించుచున్న కన్యకలు అంగలార్చుదురు. నూనెను పొందుటకు నిరాకరించిన సంఘమునకు వారు సాదృశ్యముగా యున్నారు (అది పరిశుద్ధాత్మకు సూచన) వారి దీపములలో నూనె లేదు (శరీరమునకు సాదృశ్యము లేదా నూనె పట్టు పాత్ర) కాని ఆలస్యమైపోయినది. ఆ జనులు మంచివారు కారని దానికి అర్ధము కాదు. వారు కన్యకలు, అనగా ఉన్నత నైతిక స్థాయిని అది సూచించుచున్నది. కాని వారియొక్క దివిటీలలో నూనె లేదు. కాబట్టి వారు బయటకు త్రోయబడిరి. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయును ఉండును.
ఆది కాండము 45వ అధ్యాయులోనున్న దానితో దీనినంతటినీ పోల్చి చూద్దాం. ఐగుప్తులో యోసేపు తన సోదరులను కలిసికొని తన్ను వారికి తెలియపరచుకొనెను. ఆదికాండము 45:1-7, ''అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్నుతాను అణచుకొనజాలక; నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికిపంపివేయుడని, బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు. అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తీయులును, ఫరో యింటివారును వినిరి. అప్పుడు యోసేపు — నేను యోసేపును; నా తండ్రి ఇంకా బ్రదికియున్నాడా, అని అడిగినప్పుడు; అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి, అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతట యోసేపు — నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు, వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు — ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడకు వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దు:ఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి: ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. రెండు సంవత్సరముల నుండి కరువు దేశములో యున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.
ఇప్పుడు దానిని మీరు జెకర్యా 12వ అధ్యాయముతో పోల్చి చూడండి. చాలా చక్కగా సరిపోవును గదా? ఆ రెండింటినీ మనము కలిపి చేర్చిన యెడల చక్కగా అదిసరిపోవును.
యోసేపు చాలా చిన్నవానిగా ఉన్నప్పటి నుండియే తన అన్నలచే ద్వేషింపబడెను. ఎందువలన అతడు తన అన్నలచే ద్వేషింపబడెను? అతడు ఆత్మ సంబంధి గనుకనే. అతడు అనుకోకుండానే దర్శనములను చూచెను, కలలుకని వాటికి భావమును చెప్పునది అతనిలో యుండెను. తనలో ఉన్నదానిని గాకుండా మరి దేనినీ అతడు వెల్లడి చేయలేదు. కాబట్టి కారణము లేకుండానే అతని అన్నలు అతనిని ద్వేషించిరి. కాని అతడు తన తండ్రికి ప్రియమైనవాడు. అతని తండ్రి ఒక ప్రవక్త గనుక దానిని అర్ధము చేసికొనెను. క్రీస్తుకు పరిపూర్ణ మాదిరిగా అతడున్నాడు. తండ్రియగు దేవుడు కుమారుని ప్రేమించెను, కాని సోదరులు (శాస్త్రులు మరియు పరిసయ్యులు) ఆయనను ద్వేషించిరి, ఎందుకనగా ఆయన రోగులను బాగుచేయగలడు, అద్భుతములు జరిగించెను, భవిష్యత్తును ముందే చెప్పెను, దర్శనములను చూచెను, వాటికి భావము చెప్పెను. ఆయనను ద్వేషించుటకు ఏ కారణము లేదు గాని వారు ద్వేషించిరి, యోసేపును కూడా అతని సోదరులు కారణము లేకుండానే ద్వేషించిరి.
యాకోబు కుమారులు యోసేపును ఎట్లు చూచిరో గుర్తుంచుకొనండి. వారతనిని గోతిలో పడద్రోసిరి. అతని తండ్రి అతనికి కుట్టి ఇచ్చిన రంగు రంగుల అంగీని వారు తీసివేసి దానిని రక్తములో ముంచి ఆ బాలుడిని ఏదో క్రూర మృగము తినివేసెనని, వారు తమ తండ్రికి చెప్పిరి. వారతనిని వర్తకులకు బానిసగా అమ్మివేసిరి, వారతనిని ఐగుప్తులోనికి కొనిపోయిరి, మరియు అక్కడతడు ఒక సైన్యాధిపతికి మరల అమ్మబడెను. ఆ సైన్యాధిపతి యొక్క భార్య అతనిని అన్యాయముగా చెరసాలలో వేయించినది, కాని కొంత కాలమైన తరువాత అతడు ప్రవక్త గనుక, ఆ సామర్ధ్యమును బట్టి ఫరో ఎదుటికి మరల తీసికొని రాబడెను. ఫరో యొక్క కుడి పార్శ్వమునకు అతడు హెచ్చింపబడెను. ఎవరైనా ఫరోను కలిసికొనవలెనన్నచో మొదట యోసేపును సంప్రదించవలెను, అంత గొప్ప అధికారము అతనికి ఇవ్వబడెను.
ఐగుప్తులో ఉండగా యోసేపు యొక్క జీవితమును మనము పరీక్షించుదము, ఎందుకనగా ఇక్కడ అతనిని క్రీస్తుకు పరిపూర్ణ మాదిరిగా చూచియున్నాము. అతడు సైన్యాధిపతి యొక్క ఇంటిలో యుండగా అబద్దముగా నేరము మోపబడెను, కారణము లేకుండానే శిక్షింపబడెను, చెరసాలలో వేయబడెను. యేసునకు కూడా వారాలాగే చేసిరి. అతడు చెరసాలలో యుండగా వంటలు చేయువానికి, పానదాయుకునికి వారి కలలకు భావము చెప్పెను. వారు అతనితో కూడా చెరసాలలో యుండిరి. పానదాయకుడు విమోచన పొంది బ్రదికెను, కాని మరియొకడు మరణ శిక్షకు గురి అయ్యెను. సిలువ మీద క్రీస్తు శిక్షకు గురి అయ్యెను. దేవునివలన, మానవులవలన విడిచిపెట్టబడిన వాడాయెను. ఆయనకు ఇరు ప్రక్కల ఇద్దరు బందిపోటు దొంగలుండిరి — ఒకడు ఆత్మసంబంధముగా చనిపోయెను, కాని మరియొకనికి జీవమను గ్రహించబడెను. గమనించండి, సిలువ మీద నుండి యేసు కొనిపోబడి పరలోకమునకు హెచ్చింపబడెను. యెహోవా యొక్క గొప్ప ఆత్మకు కుడి వైపున ఇప్పుడు ఆయన కూర్చొనియున్నాడు; ఆయన ద్వారానే తప్ప ఎవరును దేవుని యొద్దకు రాలేరు. మానవునికి మరియు దేవునికి మధ్య ఒక్కడే మధ్యవర్తియున్నాడు, ఆయనే నీకు కావలసియున్నాడు. మరియలు గాని, పరిశుద్ధులు గాని ఎవరూ లేరు, యేసు మాత్రమే.
ఈ మాదిరిని మనము యోసేపులో చూచెదము. ఐగుప్తులో అతడు చేసిన ప్రతిదియు ఎట్లు వర్ధిల్లెనో గమనించండి. సైన్యాధిపతితో అతని యొక్క పని వర్ధిల్లెను. చెరసాల సహితము వర్ధిల్లెను. యేసు తిరిగి వచ్చినప్పుడు, ఎడారి గులాబివలె పుష్పించును. ఆయన "వర్ధిల్లుటకు మూలపురుషుడు" (Son of Prosperity.) యోసేపు ఆధ్వర్యములో ఆ దేశము వర్ధిల్లినంతగా మరెప్పుడును వర్ధిల్లలేదు, ఈ భూమి మీదికి అటువంటి ఆశీర్వచన కాలము ఒకటి వచ్చుచున్నది, ఎన్నడూ అట్టి కాలమును ప్రపంచము చూడలేదు. మనందరమును మన స్వంత అంజూరపు చెట్టు క్రింద కూర్చొని ఆనందముగా ఆయన సన్నిధిలో నిత్య సంతోషమును అనుభవించెదము. ఆయన సన్నిధిలో నిత్య సుఖశాంతులు గలవు, ఆయన కుడిచేతిలో నిత్య ఆనందము గలదు. దేవునికి స్తోత్రము.
ఇప్పుడు చూడండి, యోసేపు వెళ్ళిన ప్రతి చోటికిని అతని రాకకు ముందే వారు బూరను ఊదుచుండిరి. ప్రజలు ఈలాగు అరచిరి, ''యోసేపునకు మోకరిల్లుడి!'' ఎవరు ఏమి చేయుచున్నా గాని ఆ బూర ధ్వని వినబడినప్పుడు మోకాళ్ళు వంచవలెను. అతడు వీధిలో ఏదయినా అమ్ముచుండవచ్చును, తను అమ్మిన దాని కొరకు డబ్బు పుచ్చుకొనుచుండవచ్చును, కాని ఆ బూర ధ్వనిని వినినప్పుడు అతడు ఆ పని నిలిపి మోకాళ్ళూనవలెను. అతడు ఏదయినా ప్రదర్శించుచుండవచ్చును లేదా నాట్యము చేయుచుండవచ్చును, దానిని అతడు ఆపి యోసేపునకు మోకరిల్లవలెను, ఎందుకనగా బూరధ్వని ద్వారా అతని రాక గూర్చి ప్రకటింపబడినది. ఈ దినములలోనే ఒక దినమున ప్రతిదియు నిశ్శబ్దముగా ఉండవలసి వచ్చును, ఎందుకనగా దేవుని యొక్క బూర మ్రోగును. క్రీస్తునందు మృతులు లేచెదరు. సూర్యోదయమగును, నిత్య వెలుగుదయించును. అప్పుడు ప్రతి మోకాలు వంగును, ఎందుకనగా ఈలాగు వ్రాయబడియున్నది,
''ఏలయనగా ఆయనను దేవుడు ఎంతో హెచ్చించెను, అన్ని నామములకంటె పై నామమును ఆయనకనుగ్రహించెను;
యేసు నామము ఎదుట ప్రతి మోకాలు వంగవలెను, పరలోకమందున్నవి గాని, భూమి మీద యున్నవి గాని, భూమి క్రింద ఉన్నవి గాని, అన్నియును వంగవలెను.
యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ఒప్పుకొనవలెను. తండ్రియగు దేవుని యొక్క మహిమార్ధము ఇది జరుగును.''
ఫిలిప్పీ 2:9-11.
ఈ యోసేపు యొక్క మాదిరిలో మరియొక మహిమకరమగు ప్రత్యక్షతను గమనించండి. యోసేపు ఐగుప్తులో ఉండగా అతనికి ఒక అన్య వధువు ఇవ్వబడెను. ఆమె ద్వారా అతనికి ఎఫ్రాయీము మరియు మనష్షేలు కలిగిరి. ఆ ఇద్దరు కుమారులను ఆశీర్వదించమని యోసేపు తన తండ్రిని అడిగెను. వారిని యాకోబు ముందర నిలువబెట్టెను. మొదట జన్మించిన మనష్షేను యాకోబు యొక్క కుడిచేతి వైపునను, ఎఫ్రాయీమును ఎడమ చేతి వైపునకు నిలువబట్టెను. వారిని దీవించనైయున్న యాకోబు తన చేతులను మార్చి దీవించెను. అతని కుడి చేయి చిన్నవాని మీద పడినది. యోసేపు దానిని అడిగెను, "తండ్రీ, ఆలాగు కాదు, ఇతడు మొదట జన్మించినవాడు; నీ కుడివైపున యున్నాడు." కాని యాకోబు, ''దేవుడు తన చేతులను మార్చెనని'' చెప్పెను. ఇక్కడఒక మాదిరిని మనము చూడగలము. మొదటగా జన్మించినవానికి (యూదులు) చెందవలసిన ఆశీర్వచనము చిన్న వానికి (అన్యులు) చెందెను. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువకు సాదృశ్యము (చేతులను అడ్డంగా పెట్టెను) సిలువ ద్వారా ఆశీర్వచనము వచ్చుచున్నది. గలతీ 3:13-14. ''ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు, అని వ్రాయబడియున్నది.'' అబ్రహాము యొక్క ఆశీర్వచనము సిలువ ద్వారా అన్యుల యొద్దకు వచ్చెను. యూదులు సిలువను విసర్జించిరి; కాబట్టి, యేసు అన్య వధువును పొందెను.
యోసేపు తన సోదరులను కలిసికొనుట గూర్చిన గాధ యొద్దకు ఇప్పుడు మరల వచ్చుదము. సోదరులందరూ రాలేదని మీరు గుర్తుంచుకొనవలెను. దానిని యోసేపు ఎరుగును. అందువలననే సోదరులందరూ తన ఎదుటకు హజరు కావలెనని నొక్కి చెప్పెను, లేనియెడల అతడు తన్ను తెలియపరచుకొనడు. చివరగా వారు ఆ చిన్నవాడగు బెన్యామీనును తీసికొనివచ్చిరి, చిన్న బెన్యామీను యోసేపునకు నిండు సోదరుడు. తన ఆత్మను అగ్ని మీద ఉంచినవాడతడే. మన యోసేపు, అనగా యేసు, దేవుని ఆజ్ఞలను గైకొనిన జనుల యొద్దకు వచ్చును. వారు పాలస్తీనాకు తిరిగి వెళ్ళిపోయిరి, ఆయనాత్మ అగ్ని మీద యున్నట్లుండును. చిన్న బెన్యామీను భూమిమీద ఉండి వారి విమోచన కొరకు పాలస్తీనాకు తిరిగి వెళ్ళిన 144,000 మంది ఇశ్రాయేలీయులకు మాదిరిగా ఉన్నాడు. వారాయనను చేర్చుకొనుటకు సిద్ధముగా నిలబడియున్నారు, వారికి నిత్యజీవము ఉన్నదని తెలియును. ''ఈయన మా దేవుడు, ఈయన కొరకు మేము ఎదురు చూచుచున్నామని,'' వారందురు. తాము పొడిచిన వానిని అప్పుడు వారు చూచెదరు. వారు దుఃఖముతో కేకలు వేయుదురు, ''ఈ గాయములు నీకు ఎవరు చేసిరి? ఇదెట్లు జరిగినది?'' అని వారాయనను ప్రశ్నించెదరు. వారు ఏడ్చి ప్రలాపించెదరు, ప్రతి కుటుంబము విడివిడిగా దుఃఖించును, ప్రతి వారును దుఃఖపు వేదనతో నిండియుందురు.
యేసు తన సోదరులకు తన్నుతాను తెలియచేసికొను సమయములో అన్య సంఘము ఎచ్చటుండును? యోసేపు యొక్క వధువు, తన ఇద్దరు కుమారులతో రాజ భవనములో యున్న సంగతి గుర్తుంచుకొనండి. ''అందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోవలెను; వారందరినీ నా యెదుట నుండి తొలగించుడి,'' అని యేసేపు సెలవిచ్చెను. యోసేపు యొక్క రాజ భవనములో అన్య వధువు దాచబడియుండెను. అన్య సంఘము రాకడలో ఎక్కడకు ఎత్తబడును? రాజ భవనములోనికి. వధువు భూమి మీద నుండి కొనిపోబడును. గొప్ప శ్రమల కాలము రాకముందే ఆమె కొనిపోబడును. ప్రభువును మధ్యాకాశములో కలిసికొనును. మూడున్నర సంవత్సరముల పాటు దేవుని యొక్క మహా ఉగ్రత కుమ్మరించబడు సమయములో ఆమె గొర్రెపిల్ల యొక్క గొప్ప పెండ్లి విందులో పాలుపొందును. ఆ తరువాత ఆయన తిరిగి వచ్చును, "తన తండ్రి ఇంటిలో" ఆయన తన వధువును విడిచిపెట్టును. అప్పుడాయన తన సోదరులకు తన్ను తెలియపరచుకొనును. ఇదే సమయములో క్రీస్తువిరోధి నిబంధన చేయును. రోమ్‌తో యూదులు చేసికొనిన ఒప్పందము భంగమగును. రోమ్ మరియు దాని సహచరులు తమ సైన్యములను పంపి దేవునికి భయపడు వారినందరినీ నాశనము చేయగోరును. వారు వాక్యమునకు కట్టుబడియుండు యూదులు.
వారు ఆ పట్టణమును నాశనము చేయవలెనని వచ్చియుండగా ఆకాశములో మనుష్యకుమారుని యొక్క రాకడ సూచన కనబడును. భూమిని నాశనము చేయగోరుచున్న వారిని ఆయన తన మహా సైన్యములతో నాశనము చేయును. శత్రువు సంహరింపబడును, అప్పుడు యేసు వచ్చును, 144000 మందికి తన్ను కనబరచుకొనును. ఆయన రక్షణ యొక్క మహా కార్యములను వారు చూచి ఆయన శక్తిని ఎరుగుదురు. ఆయన యొక్క గాయములను వారు చూచి వారాయనను విసర్జించినట్లుగా తెలిసికొనిరి. ఆ క్షణములో వారు మహా భయముతోను, భీతితోను, వేదనతోను, ఏడ్చుచుందురు. యోసేపు ఎదుటికి వచ్చిన ఆ సోదరుల వలె వీరును ఏడ్చుదురు, తాము చంపబడుదుమేమోనని బహుగా భయపడుదురు. కాని యోసేపు ఇట్లనెను, ''మీలో మీరు తగవులాడుకొనవద్దు. అది మంచిదే. దాని వెనుక దేవుడున్నాడు. మీ ప్రాణము కాపాడుటకు ఆయనావిధంగా చేసెను.'' ఆ విధంగానే యేసు వారితో సమాధానము గాను, ప్రేమగాను మాట్లాడును.
యూదులు ఎందుకు యేసును విసర్జించిరి? దాని వెనుక దేవుడున్నాడు. ఆ విధంగా మాత్రమే ఆయన తన అన్య వధువును బయటకు తీసికొని రాగలడు. అన్య సంఘము యొక్క జీవమును భద్రపరచుటకు ఆయన సిలువ మీద మరణించెను.
ఇప్పుడు ఈ 144,000 మంది వధువులో లేరు. ప్రకటన 14:4లో వారు కన్యకలుగా పిలువబడిరి మరియు వారు గొర్రెపిల్ల వెళ్ళిన ప్రతి చోటికిని వెళ్ళిరి. వారు స్త్రీ సాంగత్యము లేనివారని చెప్పబడినది, అనగా వీరు నపుంసకులు. (మత్తయి 19:12) నపుంసకులు పెండ్లి గదులకు ద్వార పాలకులుగా యుందురు. వారు కావలివారు. వారు సింహాసనము మీద కూర్చొన లేదని గమనించండి, అయితే వారు సింహాసనము ఎదుట యుండిరి. వారు వధువులో లేరు, కాని వారు మహిమకరమగు వెయ్యేండ్ల పాలనలో యుందురు.
ఇశ్రాయేలు వారిలో ఈ చివరి వారు ప్రభువు యొక్క ప్రేమలో చేర్చబడినప్పుడు శత్రువు నాశనము చేయబడుట మనము చూడగలము. దేవుడు తన పరిశుద్ధ పర్వతమును సిద్ధము చేయును, భూమి మీద వెయ్యి సంవత్సరముల విడిది కొరకు ఆయన యొక్క నూతన ఏదెను తయారగును. ఆయనకు, ఆయన వధువుకు, ఆ పరిచారకుల కొరకు అది సిద్ధము చేయబడును. ఆదామవ్వలు భూమి మీద యుండినా గాని వెయ్యేండ్ల కాలమును పూర్తి చేయలేదు. యేసే మన చివరి ఆదాము. ఆయన హవ్వ (నిజ సంఘము) దేవుని సంకల్పమును నెరవేర్చును
ఓ, బైబిలు దానికది ఎట్లు పునరావృతమగునో చూడండి. యోసేపు మరియు అతని సోదరుల యొక్క రంగము మరల జరుగును, ఎందుకనగా యేసు త్వరగా వచ్చుచున్నాడు.
యోసేపు యొక్క మాదిరిని మనము విడిచిపెట్టుచు౦డగా, ఈ అంత్యకాలము గూర్చి మరొక్క విషయమును నేను మీ దృష్టికి తేగోరుచున్నాను. యోసేపు తన సోదరుల ముందు నిలబడియున్నప్పుడు బెన్యామీను వారియొద్ద లేడు. అతడు ఒక అనువాదకుని ద్వారా వారితో మాట్లాడెను. అతనికి హెబ్రీ భాష తెలిసినదే, అయినా అతడు తన సోదరులతో మరియొక భాషలో మాట్లాడెను. గోడ మీద వ్రాయబడిన ఒక వ్రాత ద్వారా మొదటి అన్యుల కాలమునకు భాషల యొక్క వర్తమానము యున్నదని మీకు తెలియునా? (బంగారు శిరస్సు, బబులోను కాలము) అది ఒక కాలము. ఈ కాలము కూడా ఆ విధంగానే వెళ్ళిపోవుచున్నది. ఈ దినమున భాషల యొక్క సమృద్ధి అన్యుల కాలము సంపూర్ణమయి, దేవుడు ఇశ్రాయేలీయుల వైపుకు తిరిగియున్నాడనుటకు సూచనగా యున్నది.
ఆయన త్వరగా వచ్చుచున్నాడు, అల్ఫా మరియు ఓమేగా, ప్రవక్త, యాజకుడు మరియు రాజు, సర్వములో సర్వము ఆయనే, సైన్యములకధిపతియగు దేవుడు, ఆయన త్వరగా రాబోవుచున్నాడు. అద్వితీయుడును, ఒకే నిజ దేవుడును అగు ప్రభువైన యేసూ, త్వరగా రమ్ము!