పత్మాసు దర్శనము
ప్రకటన 1:9-20పత్మాసు మీద యోహాను
ప్రకటన 1:9,
"మీ సహోదరుడను, యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను, పాలివాడనునైన యోహానను నేను, దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.
పత్మాసు ద్వీపమునకు పరవాసిగా వెళ్ళగొట్టబడిన సమయములోనే యోహానుకు ప్రకటన గ్రంథములోని ఈ దర్శనములన్నియూ ఒక దాని తరువాత ఒకటి ఇయ్యబడినవి. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆసియా మైనరులోనున్న ఏజియన్ సముద్రము యొక్క తీరమునకు ముప్ఫయి-మైళ్ళ దూరములో ఈ చిన్న ద్వీపమున్నది. బండలతో నిండి పాములు, బల్లులు, మరియు తేళ్ళు విస్తారముగా ఇచ్చటుండినవి. వాణిజ్య విలువ కొద్దిగా మాత్రమే కలిగియుండినది, కనుకనే రోమను సామ్రాజ్యము వారు దీనిని శిక్షా-కేంద్రముగా వాడియుండిరి. అతి క్రూర నేరస్తులును, రాజకీయ-ఖైదీలను, మొదలగు వారిని ఇక్కడ బంధించెడివారు.
శ్రమలోనున్న సోదరునిగా యోహాను తన్ను గూర్చి క్రైస్తవులకు చెప్పుకొనుట మీరు ఇక్కడ గమనించగలరు. ఈ సమయములోనే ఆది-సంఘము మహా శ్రమలను ఎదుర్కొనుచుండెను. వారి మతమునకు "ప్రతిచోట వ్యతిరేకతతో మాట్లాడుట" మాత్రమే గాక, ప్రజలను చెరసాలలో వేసి చంపెడివారు. ఇతర సమూహము వారివలెనే యోహాను కూడా ఇప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము నిమిత్తమును శ్రమననుభవించుచున్నాడు. అతనిని బంధించి చంపుటకు విఫలయత్నములు చేసిరి. ఇరవై-నాలుగు గంటల పాటు నూనెలో పడవేసి మరిగించిరి. అయినా చావని యోహానును చూచి, అధికారులు కోపోద్రేకులై, శక్తిహీనులై, అతనిని ఒక మంత్రగానిగా ఎంచి, పత్మాసు ద్వీపమునకు చెరసాలకై పంపిరి. కాని దేవుడతనికి తోడైయుండెను, ఆ ద్వీపము విడిచి వచ్చుటకు అనుమతింపబడెను. ఎఫెసుకు తిరిగి వచ్చి తన మరణము వరకు సంఘకాపరిగా తన పరిచర్యను కొనసాగించెను.
యోహాను చూచిన దర్శనములు రెండు-సంవత్సరముల వ్యవధిలో వచ్చినవి. క్రీ.శ. 95-96. వాక్యములోని అన్ని దర్శనముల కంటెను ఇవి గుర్తింపదగినవి. ఈ గ్రంథము మొత్తము సాదృశ్యములతో వ్రాయబడినది, అందువలననే ఇది ఎక్కువ విమర్శకు మరియు వివాదమునకు గురి అయినది. ఏమయినా గాని, దానిమీద దేవుని ముద్రయున్నది. దీనిని బట్టి అదెంత అధికారపూర్వకమైనదో, ఎంత అద్భుతమగు విలువగలదో అర్థమగుచున్నది. దీని యొక్క పవిత్ర పేజీలను చదువు వారికి లేదా వినువారికి అంత విలువను ఇచ్చును.
ప్రభువు దినమందు ఆత్మవశుడనై
ప్రకటన 1:10,
''ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుండగా, బూర ధ్వనివంటి గొప్ప స్వరము.''
''నేను ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుంటిని." అది ఎంతో చక్కగా లేదా? మై, దానిని నేను ప్రేమించుచున్నాను. ఆ మాటలను మీరు వినవలెను. "క్రైస్తవ జీవితపు సారాంశము." మనము క్రైస్తవుల వలె జీవించగోరుచున్నచో, మనము ఆయన ఆత్మవశములో యుండవలెను. యోహాను తన స్వంత ఆత్మలో యుండుట గూర్చి ఇక్కడ మాట్లాడుట లేదు. అలాగుండినయెడల ఈ దర్శనములు వచ్చియుండేవి కావు. దేవుని యొక్క ఆత్మ వశములో యుండవలెను. మనము కూడా దేవుని యొక్క ఆత్మను కలిగియుండవలెను. లేనియెడల మన ప్రయత్నములన్నియూ వ్యర్ధములు. పౌలు చెప్పెను, "నేను ఆత్మతోను ప్రార్థించెదను, నేను ఆత్మతోను పాడుదును, నేను ఆత్మతోను జీవించెదను." నాకు మంచిది ఏమయినా రావలెనన్నచో అది దేవుని యొక్క ఆత్మ ద్వారానే రావలసియున్నది, వాక్యము ద్వారా అది ధృవపరచవలెను, దానివలన వచ్చు ఫలితములను బట్టి తెలియును. యేసు నుండి ఈ నూతనమగు అత్యద్భుత ప్రత్యక్షతలను పొందుటకు యోహాను ఖచ్చితంగా ఆత్మలో ఉండవలసిన అవసరమున్నది. దేవుడు మనకు ఇచ్చు ప్రత్యక్షతలను అర్ధము చేసికొనుటకు, ఆయన వాక్యము ద్వారా మనము జీవించుటకు, మనము ఆత్మలో ఉండవలసిన అవసరము ఉన్నది, ఎందుకనగా అది అదే-ఆత్మయై ఉన్నది.
ఇటు వైపుగా దానిని చూడండి. పరిశుద్ధ గ్రంథములోని అపోస్తలుల కార్యముల గ్రంథము 2:38ని చాలామంది చదువుచూ యుందురు.
"మారుమనస్సు పొంది, ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు."
ఇంకా ముందుకు చదువుకొంటూ పోవుదురు. వారు దానిని చూడరు. వారు దానిని చూచినయెడల, ఆత్మలో పరవశత పొంది, తాము పరిశుద్దాత్మను పొందవలసిన అవసరత యున్నట్లు గుర్తించెదరు. అందుకు వారు మారుమనస్సు పొంది ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు దేవుడు తన మాటను నెరవేర్చ బద్ధుడై పరిశుద్దాత్మతో వారిని నింపవలసియుండును. వారెన్నడును ఆయన ఆత్మలో పరవశులు కారు. ఆలాగైనయెడల, అక్షరాలా వాక్యములో యున్నట్లుగా వారికి జరిగి తీరును. ఆయన యొక్క ఆత్మద్వారా ప్రత్యక్షతను దయచేయమని దేవునికి ప్రార్ధన చేయుడి. అదే మొదటి మెట్టు. ఆత్మవశులు కండి.
మరియొక ఉదాహరణను నేను వాడుదును. నీకు స్వస్థత కావలెననుకొందము. వాక్యమేమి చెప్పుచున్నది? లెక్కలేనన్నిసార్లు మీరు దానిని చదివియందురు, కాని దానిని చదివినప్పుడు మీరు ఆత్మవశులు కాలేదు. దాని యొక్క నిజమగు సత్యమును ఆయన్మాత ద్వారా బోధించమని మనము దేవునిని అడిగితిమా? అలాగు చేసినయెడల మనము పెద్దలను పిలిపించుదుము, మన పాపములను ఒప్పుకొందుము, నూనె రాసి ప్రార్ధి౦చుకొందుము, అది ఆ విధముగా యున్నది. అది వెంటనే రాకపోవచ్చును, కాని ఆయన ఆత్మలో అది ముగిసియున్నది. దానిని గూర్చి ఇంకేమీ ఆలోచించవలసిన పనిలేదు. దేవుడు తన వాక్యమును నెరవేర్చును. ఓ, మనము ఆత్మవశులము కావలసిన అవసరమున్నది, మరియు అప్పుడు కార్యములన్నియూ జరుగును. మొదట క్రియల ద్వారా వెళ్ళవద్దు. ఆత్మవశుడవు కావలెను, ఆ తరువాత క్రియల ద్వారా వెళ్ళుము, అప్పుడు దేవుడు ఏమి చేయునో చూడుము.
లోకములోయున్న సంగతుల ఆత్మలోనికి లోకజనులు ఎటు ప్రవేశించెదరో ఎప్పుడయినా మీరు గమనించారా? వారు తమ బంతి ఆటలలోనికి, పాటలలోనికి, నాట్యములలోనికి వెళ్ళుదురు. వారు దానియొక్క ఆత్మలోనికి ప్రవేశించెదరు. వారు గోడ పువ్వులవలె అక్కడ కూర్చొనరు, ఎండిపోయిన కర్రలవలె యుండరు. వారు తిన్నగా ఆ కార్యములను పరవశతతో అనుభవించుచుందురు. ఆ కార్యములలో భాగస్తులుగా అగుదురు. కాని, ఓ, దేవుని వాక్యము యొక్క ఆత్మవశము లోనికి వెళ్ళిన క్రైస్తవ్యమును ఎంతో అసహ్యించుకొ౦దురు! వారు మనలను మత ఉన్మాదులనియు, పరిశుద్ధ బండలనియు వ్యంగ్యముగా పిలచుచున్నారు. వారు తమ ద్వేషమును మరియు ఏహ్యతను తెలియచేయుటకు ఆలాగు చేయుట లేదు గాని, దానిని వారు అలక్ష్యము చేయుచున్నారు. దానిని మీరు ముందే ఊహించవచ్చును. అదెక్కడి నుండి వచ్చుచున్నదో మీరెరుగుదురు. ముందుకు సాగిపోయి ఆత్మలో ఆరాధన చెయ్యండి.
మన ఆత్మ పరిశుద్ధముగా యున్నది. అది నూతనముగా యున్నది. అది వాస్తవమైనది, అది ఉత్తేజము పొంది తీవ్రముగా పనిచేయుచున్నది. ప్రభువు యొక్క ఆనందమును నిండుగా పొందియున్నది. లోకస్తులు తమ లోక-వినోదములలోను, సుఖ-భోగములలోను ఎంతగా ఆనందించుచున్నారో అంతే ఆనందమును, నిండు సంతోషమును ప్రభువునందు క్రైస్తవుడు అనుభవించవలసియున్నాడు. క్రైస్తవులు, మరియు లోకస్తులు ఇద్దరూ మానవులే; ఇద్దరికిని ఉద్రేకములున్నవి, కాని తేడా ఏమిటంటే, క్రైస్తవుల యొక్క హృదయములు మరియు ఉద్రేకములు ప్రభువు యొక్క మహిమలోను మరియు ప్రేమలోను యుండును, అయితే లోకస్తులు శరీర తృప్తిని పొందెదరు.
ఇప్పుడు, ప్రభువు దినమందు యోహాను ఆత్మవశుడై యుండెనని వ్రాయబడియున్నది.
ఓ, మై, కొంత అలజడిని సృజించు ఒక వచనము నిజంగా ఇచ్చటున్నది. ఆ అవసరము లేదు, అందుకు అవకాశము లేదు, కాని కొందరు వాక్యము నిజంగా ఏమి చెప్పుచున్నదో చూడలేకపోవుచున్నారు.
ప్రభువు దినము లేదా సబ్బాతు దినము, అనగా, శనివారమని కొందరు జనులు చెప్పుచున్నారు. కొందరయితే ప్రభువు దినమును వారములోని మొదటి దినమగు ఆదివారమని చెప్పెదరు. ఈ విధముగా రెండింటిలో ఒకటి లేదా ఈ రెండూ నిజమని ఎట్లు చెప్పుట జరుగును? ఎందుకనగా యోహాను ఆత్మవశుడై యుండి రెండు సంవత్సరముల పాటు ఆ దర్శనములను చూచెను. నిజంగా జరిగినదానిని చూడండి. యోహాను ఆత్మలో కొనిపోబడి, ప్రభువు యొక్క దినములోనికి తీసికొనిపోబడెను, అది ఇంకనూ రానున్నది. భవిష్యత్తులో యుండు ప్రభువు యొక్క దినము గూర్చి బైబిలు మాట్లాడుచున్నది, ఆ భవిష్యత్తు దినము యొక్క సంగతులను ఇప్పుడు యోహాను చూచుచున్నాడు. కాని ఈ మధ్య సమయములో, మన మనస్సులను కుదుటపరచుకొను నిమిత్తము, ఈ దినము నాటి వాస్తవ సబ్బాతు ఏమిటో మనము కనుగొందము.
క్రొత్త నిబంధన నుండి మనము తెలిసికొనిన ప్రకారముగా, సబ్బాతు అనగా ఒక ప్రత్యేక దినమును ఆచరించుట కాదు. శనివారమును సబ్బాతుగా ఆచరింపవలెనని గాని, లేదా వారములోని మొదటి దినమగు ఆదివారమును ఆచరింపవలెనని గాని, ఆజ్ఞ ఏమియూ లేదు. సబ్బాతు యొక్క సత్యమును చూడండి, దానికి అర్ధము "విశ్రాంతి." హెబ్రి 4:8, "యెహోషువ వారికి విశ్రాంతి (విశ్రాంతి దినము) కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలచియున్నది. (సబ్బాతును ఆచరించుట), ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును." ఆ వచనపు చివరి భాగములోయున్న మూల పదమును మీరు గుర్తించారా? "దేవుడు తన కార్యములను ముగించెను." దేవుడు ఇశ్రాయేలీయులకు ఏడవ దినమును సబ్బాతు దినముగా నియమించెను. అది ఆయన స్వంత పనికి జ్ఞాపకార్ధము. ఆయన ప్రపంచమును, అందులోనున్న సర్వస్వమును సృజించి, సృష్టించుట ఇక ఆపెను. ఆయన తన పనిని ముగించెను. ఆయన విశ్రమించెను. అందరూ ఒకే చోట, ఒకే సమయములో ఉండిన జనులకు ఒక ప్రత్యేక దినమును సబ్బాతు విశ్రాంతిగా ఇచ్చుట మంచిదే. ఈనాడు సగం ప్రపంచము వెలుగులోను, మరియొక సగము ప్రపంచము చీకటిలోను యుంటున్నది, కాబట్టి ఇది కుదరదు. కాబట్టి అది ప్రకృతి సంబంధమగు ఒక వాదన మాత్రమే.
ఈ సబ్బాతు విశ్రాంతి గూర్చి మనకు బైబిలు ఏమి బోధించుచున్నదో చూద్దాం. "ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు." ఇది మాములుగా ప్రవేశించుట మాత్రమే కాదు గాని, ఆ విశ్రాంతిలో నిలిచియుండుట అయి యున్నది. అది ఒక నిత్యవిశ్రాంతి. ఏడవ దినము దానికి మాదిరి మాత్రమే. ఏడు అనగా సంపూర్తి, ఎనిమిది అనగా మరల మొదటి దినము. వారము యొక్క మొదటి దినమున యేసు పునరుద్దానుడయ్యెను, మనకు నిత్యజీవమును ఇచ్చెను. నిత్య సబ్బాతు విశ్రాంతిని ఇచ్చెను. ఆ కారణము చేతనే సబ్బాతు (విశ్రాంతి) కొరకు దేవుడు ఏ ప్రత్యేక దినమును ఇవ్వలేదని మనము చూడగలము. మనము అందులోనికి ప్రవేశించి, అందులో నిలచియున్నాము. ఇశ్రాయేలు అది చేయలేదు. మనము అనుభవించుచున్న నిజస్వరూపము యొక్క ఛాయను వారు కలిగి యుండిరి. ఇప్పుడు మనకు వాస్తవమైనది ఉండగా, ఛాయ యొద్దకు ఎందుకు వెళ్ళవలెను?
ఈ విశ్రాంతిని, లేదా సబ్బాతును మనము యేసు యొక్క ఆహ్వానమును బట్టి పొంది, అందులో కొనసాగుచున్నాము. ఆయన దానిని మత్తయి 11:28, 29లో చెప్పెను.
"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి నిచ్చెదను. నా కాడిని మీ మీద ఎత్తుకొని, నా యొద్ద నేర్చుకొనుడి;… మీరు మీ ఆత్మలకు విశ్రాంతిని కనుగొందురు." (ఒక్క దినము మాత్రమే సబ్బాతు ఆచరించుట కాదు, కాని నిత్యజీవము, సబ్బాతు).
నీ పాప భారమును నీవు ఎంత కాలము నుండి మోయుచున్నాగాని పరవాలేదు, అది పది-సంవత్సరములు కావచ్చు లేక ముప్పది-సంవత్సరములు కావచ్చు లేదా ఏబది-సంవత్సరములు కావచ్చు, ఇంకా ఎక్కువ కాలము కావచ్చు, అలసిపోయి, సొమ్మసిల్లిన నీ జీవితముతో రమ్ము ఆయన యొక్క విశ్రాంతిని నీవు పొందగలవు. (నిజమగు సబ్బాతు) యేసు నీకు విశ్రాంతినిచ్చును.
యేసు ఇచ్చు ఆ విశ్రాంతి ఖచ్చితంగా ఏమిటి? యెషయా 28:8-12,
"వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషములతోను నిండియున్నవి, అవి లేనిచోటు లేదు.వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచిన వారికా? చన్ను విడిచిన వారికా?ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ; సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము; కొంత ఇచ్చట, కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.నిజమే, అలసినవానికి నెమ్మదికలుగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు.నత్తివారి పెదవుల చేతను, అన్యభాషతోను, ఈ జనులతో మాటలాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి." (ఆయన యొక్క సబ్బాతును ఆచరించుట)
యెషయా దీనిని ప్రవచించెను. ఆ తరువాత 700 సంవత్సరములకు పెంతెకోస్తు యొద్ద చెప్పబడిన విధంగానే ఖచ్చితంగా వారు పరిశుద్దాత్మతో నింపబడిరి. వాగ్దానము చేయబడిన నిజ విశ్రాంతి ఇదే. ఆ విధముగా వారు పరిశుద్దాత్మతో నింపబడినప్పుడు వారు ఈ లోక సంబంధమగు క్రియల నుండి, లోకపు కార్యముల నుండి, తమ చెడు మార్గముల నుండి మళ్ళుకొందురు. పరిశుద్దాత్మ వారి జీవితములను వశపరచుకొనును. వారు విశ్రాంతిలో ప్రవేశించియున్నారు. అదే మీ యొక్క విశ్రాంతి. అదే మీ సబ్బాతు. అది ఒక దినము కాదు, అది ఒక సంవత్సరము కాదు గాని, పరిశుద్ధాత్మతో నింపబడి మరియు ఆశీర్వదింపబడుటయు నిత్యత్వమునైయున్నది. నీవు ముగించి మరి దేవుడు పని చేయుటయైయున్నది. నీలోయున్న దేవుడు తన ఇష్టానుసారముగా క్రియచేయును. తన చిత్తమును నెరవేర్చును.
శనివారము ఆచరించువారి గూర్చి మరో మాట చెప్పెదను, మనము ఆదివారము కూడుకొనుట తప్పు అని వారనుచున్నారు, వారము మొదటి దినమది. ఇప్పుడు రెండవ శతాబ్దములో జెస్టిన్ చెప్పినది వినండి, "పట్టణములలోను, గ్రామములలోను నివసించుచున్న వారందరికొరకును ఆదివారమున ఒక కూటము జరుగును. వాక్యములో ఒక భాగమును చదువుదురు. అపోస్తలుల యొక్క వ్రాతలను, వారు కంఠస్థము చేసినవాటిని సమయమున్నంత వరకూ చదివెదరు. చదువుట అయిపోయిన తరువాత, అధ్యక్షుడు ఆ గొప్ప కార్యములను అనుసరించుటకు కావలసిన హెచ్చరికలను మరియు ఉపదేశములను ఇచ్చును. ఇది అయిపోయిన తరువాత మేమందరము ప్రార్థన కొరకు లేచుదము. ప్రార్ధన అయిన తరువాత, మేము వివరించిన ప్రకారము మా ముందు రొట్టె మరియు ద్రాక్షారసము ఉంచబడును. కృతజ్ఞతలు చెల్లించెదము. జనులందరూ "ఆమెన్," అని పలుకుదురు. ఆ తరువాత ఈ పదార్ధములను ఒక్కొక్కరికి పంచెదరు, అందరూ పాలుపొందుదురు. రాలేకపోయినవారి ఇంటికి పెద్దలు ఆ పదార్ధములను తీసికొని వెళ్ళెదరు. ధనికులు మరియు ఇష్టపడువారు తమ కానుకలను స్వేచ్చగా సమర్పించెదరు. దీనిని అధ్యక్షుడు జాగ్రత్త చేయును. దానిని వారు అనాధలకు, విధవరాండ్రకు, చెరసాలలో ఉన్నవారికి, అవసరతలో నున్న క్రొత్తవారికి ఇచ్చుదురు." ఆ విధముగా ఆది సంఘముండుటను మనము చూడగలము. వారము యొక్క చివరి దినమున, అనగా యూదుల ఆచారము ప్రకారముగా ఆది సంఘము వారుండిరను వారి వాదనకు రుజువు లేదు. చరిత్ర నిజంగా రూపొందించిన దానిని వారెరుగరు, కాబట్టి వారి నమ్మకము యోగ్యమైనది కాదు.
జనులు ఆయన యొద్దకు వచ్చి విశ్రాంతిని పొందవలసియున్నారు. ఈ విశ్రాంతి కొరకు అందరి హృదయములలోను ఒక మొర ఉన్నది, కాని ఎక్కువ మందికి దానికి జవాబు తెలియదు. కాబట్టి వారు కొన్ని దినములను ఆచరించుట లేదా శాఖకు చెందిన ఆచారములను అనుసరించుట, విశ్వాస ప్రమాణములను గైకొనుట ద్వారా తమలోయున్న మొరను చల్లార్చుకొనగోరుచున్నారు. కాని వారు అందులోను విఫలమయి, త్రాగుడుకు, జూదమునకు, శరీరసంబంధమగు క్రియలకు బానిసలగుచున్నారు. లోక సంబంధమగు ఆనందముల వలన కొంత సంతృప్తిని పొందవచ్చుననుకొనుచున్నారు. కాని అట్టివాటిలో నెమ్మదిలేదు. వారు పొగ త్రాగుచూ, నరముల ఉద్రిక్తతను చల్లార్చుకొనుటకు మాదక ద్రవ్యములు వాడుచున్నారు. కాని ఆ భూసంబంధమగు ప్రయత్నములలో నెమ్మది లేదు. వారికి యేసు అవసరము. పరలోకసంబంధమగు పరిహారము వారికి అవసరము, ఆత్మ యొక్క విశ్రాంతి అవసరము.
వారిలో ఎక్కువ మంది ఆదివారము ఆలయమునకు వెళ్ళుదురు. అది మంచిదే కాని దేవునిని ఎట్లు సమీపించవలెనో, ఆయనను ఎట్లు ఆరాధింపవలెనో వారికేమియూ తెలియదు. ఆత్మలోను, సత్యములోను నిజ ఆరాధన ఉన్నదని యేసు చెప్పెను. యోహాను 4:24. దేవుని గూర్చి ఏమీ తెలియని ఆలయములో నీవెటు దేవునిని ఆరాధించగలవు? క్రిస్మసు నాడు శాంతాక్లాస్ ను, ఈస్టరు నాడు చెవుల పిల్లులను నెలకొల్పుటయే వారికి తెలియును. దానిని వారెక్కడ నేర్చుకొన్నారు? అన్యుల నుండి వారు దానిని నేర్చుకొనిరి. దానిని వారు సంఘ సిద్దాంతములో భాగముగా చేసిరి. కాని ప్రభుని వైపుకు తిరిగి, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు అట్టి కార్యములన్నియూ మానుకొనును. అతను ఆత్మలో విశ్రాంతి పొందును. నిజముగా అతడు జీవించనారంభించును, దేవునిని ప్రేమించును మరియు ఆయనను ఆరాధించును.
ఇప్పుడు మనము మన లేఖనము యొద్దకు తిరిగి వచ్చుదము. ప్రభువు యొక్క దినము ఏది కాదో మనము ఎరిగియున్నాము. అది శనివారము కాదు లేక ఆదివారము కాదు. అయితే మరేది? ఈ విధముగా దానిని చెప్పెదము. ఈ దినము నిశ్చయంగా ప్రభువు దినము కాదు. ఇది మానవ దినము. ఇది మానవుని పని, మానవుని క్రియలు, మానవుని సంఘము, మానవుని ఆరాధనా ఉద్దేశ్యము, అంతా మానవునిదే. ఎందుకనగా ఇది మానవ ప్రపంచము (కాస్మాస్). కాని ప్రభువు యొక్క దినము వచ్చుచున్నది. అవును, అది వచ్చుచున్నది. యేసుక్రీస్తు యొక్క ఈ ప్రత్యక్షతా కాలములోనే ఆత్మ ద్వారా యోహాను కోనిపోబడెను. రానున్న ఆ గొప్ప దినములోనికి ఆత్మ ద్వారా ప్రవేశించెను. మానవుని యొక్క దినములు అయిపోయిన తరువాత ప్రభువు దినము వచ్చును. ఈ భూలోక రాజ్యములు అప్పుడు మన దేవుని రాజ్యములగును. తీర్పు వచ్చు దినమే ప్రభుని దినము మరియు ఆ తరువాత వెయ్యేండ్ల పాలన వచ్చును. ఇప్పుడు ఈ లోకము తన ఇష్టమొచ్చిన రీతిగా క్రైస్తవులకు చేయును. ఎన్నో రకముల చెడ్డ పేర్లు పెట్టి వారిని పిలచుచున్నారు, వారిని చూచి నవ్వుచున్నారు. కాని ఆ గొప్ప గుర్తింపదగు దినము వచ్చుచున్నది, అప్పుడు వారు ఏడ్చి గగ్గోలు పెట్టుదురు, ఎందుకనగా గొర్రెపిల్ల మహా ఉగ్రతతో లోకమునకు తీర్పు తీర్చుటకు వచ్చును. అప్పుడు నీతిమంతులు ప్రభువుతో యుందురు, ఏలయనగా దుర్మార్గులు దహించబడుదురు, వెయ్యేండ్ల పాలనలో నీతిమంతులు వారి ధూళి మీద నడిచిపోవుదురు. మలాకీ 4:3.
"నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రోక్కుదురని, సైన్యములకు అధిపతియగు యొహోవా సెలవిచ్చుచున్నాడు."
బూరవంటి స్వరము
ప్రకటన 1:10,
"బూర ధ్వని వంటి గొప్ప స్వరము నా వెనుక వింటిని."
యోహాను ఆత్మవశుడైయున్నాడు, ఆ విధముగా అతడుండినప్పుడు ప్రభువు యొక్క మహా అద్భుతమగు దినమును, యేసు మరియు ఆయన యొక్క పరిశుద్ధశక్తిని చూచెను. అతనికి భవిష్యత్తు వెల్లడియగుచున్నది, ఎందుకనగా దేవుడు బోధించబోవుచున్నాడు. అది బూర అని యోహాను చెప్పలేదు. అది బూరను పోలియున్నది. ఒక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడే బూర మ్రోగును. అది దూత వంటిది, రాజు యొక్క వర్తమానికుడు, జనుల యొద్దకు వచ్చుచున్నప్పుడు అతడు బూరను ఊదును. అది ఒక అత్యవసర పిలుపు. దానిని వినుటకు జనులు పోగవుదురు. (ఇశ్రాయేలీయులు ఎప్పుడును బూరను ఊదినప్పుడే సమాజముగా కూడుకొనెడివారు.) ఏదో ప్రాముఖ్యమైనది సమీపించియున్నది. "దానిని వినుడి." కాబట్టి ఈ స్వరము కూడా ఆ బూరవలెనె అత్యవసరమగు ఒక దానిని చూపించుచున్నది. అది స్పష్టముగాను, బలముగాను ఉండెను. ఉలిక్కిపడునట్లును, మేల్కోనునట్లును చేసెను. ఓ, దేవుని యొక్క స్వరమును ఈ దినమున మనము బూరను వినినట్లుగా వినవలెను, ఎందుకనగా ఇది "సువార్త బూర," మనకు తెలియచేయుటకు, మనలను సిద్ధపరచుటకు, భూమి మీదికి రానున్న దానిని గుర్తించునట్లు చేయుటకు "ప్రవచన వాక్యము" బయలు వెళ్ళుచున్నది.
వ్రాయమను ఆజ్ఞ
ప్రకటన 1:11,
"నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గెము, తుయతైర, సార్ధిస్, ఫిలడెల్ఫియ, లవోదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని."
అది ఇక్కడ ఉన్నది. మొదటి వాడు మరియు కడపటి వాడు, అల్ఫా మరియు ఓమేగా, సర్వమూ ఆయనే. ఆయన ఒక్కడే నిజదేవుడు. స్వరము మరియు దేవుని యొక్క వాక్యము. వాస్తవము మరియు సత్యము చేరువలో యున్నవి. ఆత్మవశములో యుండుట ఎంత గొప్ప సంగతి! దేవుని యొక్క సముఖములో యుండి ఆయన యొక్క మాట వినుట గొప్ప సంగతి. "నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, దానిని ఏడు సంఘములకు పంపవలెను." ఏదెను తోటలోను మరియు సీనాయి కొండ మీద దేవుని వాక్యమును పలికిన అదే స్వరము అత్యధికమగు మహిమతో రూపాంతరపు కొండ మీద కూడా వినబడినది, మరియొకసారి అది వినబడుచున్నది. ఈసారి ఏడు సంఘములకు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత మరియు తుది ప్రత్యక్షత వచ్చుచున్నది.
"యోహానూ, ఆ దర్శనములను వ్రాయుము. రాబోవు యుగములకు వాటిని తెలియచేయుము, ఎందుకనగా అవి నిజమగు ప్రవచనములు తప్పక నెరవేరవలసియున్నవి. వాటిని వ్రాసి పంపించుము, వారికి తెలియజేయుము."
యోహాను ఆ స్వరమును గుర్తించెను. నీవు ఆయన స్వకీయులలో ఒకరివైనయెడల ఆయన పిలిచినప్పుడు, ఆయన స్వరమును నీవు గుర్తించెదవు.
సువర్ణ దీప స్తంభములు
ప్రకటన 1:12,
"ఇది వినగా, నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా, ఏడు సువర్ణ దీప స్తంభములను చూచితిని."
స్వరము ఎవరి నుండి వచ్చెనో వారిని చూడవలెనని తిరిగినట్లు యోహాను చెప్పుట లేదు, కాని అతడు స్వరమును చూచుటకు తిరిగెను. ఓ, దానిని నేను ఇష్టపడుచున్నాను. అతడు స్వరమును చూచుటకు తిరిగెను. స్వరము మరియు వ్యక్తి ఒక్కరే అయి యుండును. యేసే వాక్యము. యోహాను 1:1-3,
"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.అదే ఆదియందు దేవునితో యుండెను.కలిగినవన్నియూ ఆయన వలననే కలిగెను; ఆయన లేకుండా కలిగియున్న దానిలో ఏదియూ సృజింపబడియుండలేదు."
నీవు ఎప్పుడయినా నిజంగా వాక్యమును చూడగలిగినప్పుడు యేసును చూచెదవు.
యోహాను తిరిగినప్పుడు, ఏడు సువర్ణ దీపస్తంభములను చూచెను. నిజానికి అవి దీప స్తంభములు. 20వ, వచనము ప్రకారము, అవి ఏడు సంఘములు: "నీవు చూచిన ఆ ఏడు దీప స్తంభములు, ఏడు సంఘములు." సంఘమునకు అవి సాదృశ్యముగా నున్నవి, క్రొవ్వొత్తులు కావు. క్రొవ్వొత్తి కొంతసేపు వెలిగిన తరువాత అయిపోయి ఆరిపోవును. అది చనిపోవును. ఇంక దానిలో ఏమీ ఉండదు. కాని దీప స్తంభమునకు చిరకాలము నిలచియుండు గుణమున్నది, అది ఆక్రొవ్వొత్తిలో కనబడదు.
దీపము యొక్క చక్కని దృశ్యమును మీరు చూడగోరుచున్నయెడల జెకర్యా 4;1-6 చదవండి,
"నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను లేపి.నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా? నేను, సువర్ణమయమైన దీప స్తంభమును దాని మీద ఒక ప్రమిదెయును, దీప స్తంభమునకు ఏడు దీపములును, దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి.మరియు రెండు ఒలీవ చెట్లు దీప స్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పగా.నా యేలినవాడా, ఇదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని?నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా, అని నన్నడుగగా? నేను, నా యేలిన వాడా, నాకు తెలియదంటిని.అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక; నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యొహోవా సెలవిచ్చెను."
ఇక్కడ మరియొక పూర్తి సువర్ణముతో చేయబడిన దీపమున్నది. అది ప్రకాశమానముగా వెలుగుచున్నది, ఎందుకనగా అందులో సమృద్దిగా నూనె యున్నది. ఇరువైపులా ఉన్న రెండు ఒలీవ చెట్ల నుండి నూనెను అది పొందుచున్నది. ఆ రెండు చెట్లు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలకు సాదృశ్యముగా యున్నవి. నూనె పరిశుద్దాత్మకు సాదృశ్యముగా యున్నది. పరిశుద్దాత్మ మాత్రమే దేవుని వెలుగును జనులకు ఇయ్యగలదు. మాట్లాడిన దూత ఇట్లు చెప్పినది, "నీవు చూచుచున్న దానికి అర్థము ఏమనగా, "సంఘము దేనినీ కూడా తన స్వంత బలము మరియు శక్తి ద్వారా సాధించలేదు గాని, పరిశుద్దాత్మ ద్వారానే సాధించును."
ఇప్పుడు, ఈ దీప స్తంభమును పరీక్షించండి. పెద్ద పాత్ర లేదా గిన్నె యున్నట్లు మీరు గ్రహించగలరు. ఏడు కొమ్మలకు మధ్యగా అది యున్నది. ఈ గిన్నె ఒలీవ నూనెతో నిండియుండి, ఆ ఏడు కొమ్మలకు మధ్యగా నున్న ఏడు వత్తులగుండా ప్రవహించుచున్నది. అవి ఆ ఏడు కొమ్మలలో ఉంచబడినవి. ఏడు గొట్టముల ద్వారా చివరను వెలుగును పుట్టించుచున్న నూనె అదే. ఈ దీపము ఎన్నడూ ఆరదు. యాజకులు ఆ గిన్నెలోనికి ఆపకుండా నూనెను పోయుచునేయున్నారు.
ఒక ప్రత్యేకమగు విధానములో ఆ దీపము వెలిగించబడినది. మొదటగా దేవుని యొక్క అగ్ని వలన వెలిగించబడినది. ముందుగా ఆయనే వెలిగించెను, ఆ పాత్రకు పై భాగమున ఆ దీపము ఉన్నది. మొదటి దీపము యొక్క మంట నుండి ఆ తరువాత రెండవ దీపము వెలిగించబడెను. రెండవ దీపము యొక్క మంట ద్వారా మూడవ దీపము వెలిగించబడెను. మూడవ దాని మంట ద్వారా నాలుగవది వెలిగించబడినది. ఆ విధముగా ఏడు దీపములును మండుచున్నవి. బలిపీఠము యొద్ద నుండిన పరిశుద్ద అగ్ని ఒక దీపము నుండి మరియొక దీపమునకు అందింపబడినది. ఆ విధముగా ఏడు సంఘ కాలములలో యున్న పరిశుద్దాత్మకు ఇది అద్భుతమగు మాదిరి. పెంతెకోస్తు యొక్క అసలు కుమ్మరింపు ఈ ఏడు సంఘకాలములలోను కొనసాగి వచ్చుచునేయున్నది. (కరుణాపీఠము మీద ఉండిన యేసు యొద్ద నుండి ప్రత్యక్షముగా అది వచ్చియున్నది.) యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడనియు, ఆయన తన విలువలో గాని, విధానములలో గాని ఎన్నడూ మారలేదని చక్కగా అది చూపించుచున్నది.
యోహాను 15లో, యేసు చెప్పెను, "నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు." ఆయనే ప్రధాన ద్రాక్షావల్లి, మూలమగు వేరు నుండి వచ్చిన తీగె, మూల విత్తనము నుండి వచ్చెను. అందులో జీవమున్నది. ద్రాక్షావల్లి తనంత తాను ఫలములను ఇయ్యదు; కొమ్మలు ఫలములను ఇచ్చును. ఇప్పుడు దీనిని గమనించండి: నారింజ చెట్టువంటి ఒక సిట్రస్ చెట్టును మీరు తీసికొని దానికి ఒక ద్రాక్ష కొమ్మను అంటు కట్టండి. లేదా నిమ్మ కొమ్మ గాని లేదా ద్రాక్ష కొమ్మను గాని లేదా మరే ఇతర ఆ రకమునకు చెందిన కొమ్మను గాని అంటు కట్టండి. ఆ కొమ్మలన్నియూ పెరుగును, కాని ఆ అంటు కట్టబడిన కొమ్మలు నారింజ పండ్లను కాయవు. నిమ్మ కొమ్మ, నిమ్మకాయలను కాయును. ద్రాక్ష కొమ్మ, ద్రాక్ష కాయలను కాయును. ఆలాగు ఏ కొమ్మ ఆ కాయలను కాయును, అయినా గాని ఆ కొమ్మలు తమ జీవమును మొదలులో నుండియే పొందును. కాని ఆ చెట్టు తనంతట తానుగా ఒక కొమ్మను వేసినచో అది నారింజ కొమ్మగా ఉండి, నారింజ కాయలను కాయును. ఎందువలన? ఎందుకనగా చెట్టులో యున్న జీవము, కొమ్మలో యున్న జీవము ఒక్కటే. కాని అంటు కట్టబడిన కొమ్మలు ఆ విధంగా ఉండవు. ఆ అంటు కట్టబడిన కొమ్మలు వేరే జీవమును కలిగియుండును, అవి ఇతర చెట్ల నుండి వచ్చియున్నది. వాటి వేర్లు మరొకటి, వాటి విత్తనము మరొకటి. ఓ, అవి పండు ఫలించును గాని, అవి నారింజలను మాత్రము కాయవు. ఎందుకనగా అవి మూల వేరుకు సంబంధించినవి కావు గనుక కాయజాలవు.
సంఘము కూడా ఆ విధంగానే యున్నది. ద్రాక్షావల్లి చీలిపోయినది. కొమ్మలు దానికి అంటు కట్టబడినవి. అవి బాప్టిస్ట్ కొమ్మలను అంటు కట్టుకొనినవి. మొతడిస్ట్ కొమ్మలను, ప్రెస్బిటేరియను కొమ్మలను, పెంతెకోస్తు కొమ్మలను అంటు కట్టుకొనినవి. ఆ కొమ్మలు బాప్టిస్ట్, మెథడిస్టు, పెంతెకోస్తు, ప్రెస్బిటేరియను ఫలములను కాయుచున్నవి. (శాఖల యొక్క విత్తనముల నుండి అవి వచ్చియున్నవి గనుక ఆ ఫలములనే అవి కాయుచున్నవి.) కాని ఆద్రాక్షావల్లి స్వయంగా ఒక కొమ్మను గాని ఎప్పుడైనా వేయుట జరిగినచో, ఆ కొమ్మ అక్షరాలా ఆ ద్రాక్షావల్లి మాదిరిగానే యుండును. పెంతెకోస్తు యెద్దకు తీసికొనిరాబడిన ఆ కొమ్మలవలెనే అది యుండును. అది భాషలు మాట్లాడును, ప్రవచించును, యేసుక్రీస్తు యొక్క పునరుద్దాన శక్తిని మరియు సూచక క్రియలును అందులో కలిగి యుండును. ఎందువలన? అది ద్రాక్షావల్లి యొక్క వేరు నుండి వచ్చు జీవము మీదనే ఆధారపడి జీవించుచున్నది. చూడండి. అది ద్రాక్షావల్లిలోనికి అంటు కట్టబడలేదు. అది ద్రాక్షావల్లిలో జన్మించినది. ఆ మిగిలిన ఇతర కొమ్మలు అంటు కట్టబడినవి. అవన్నియూ తమ స్వంత ఫలములను మాత్రమే ఫలించగలవు, ఎందుకనగా అవి ఆ ద్రాక్షావల్లిలో జన్మించలేదు. ఆ మూల జీవము గూర్చి వాటికి తెలియదు. మూల ఫలము గూర్చి వాటికి తెలియదు. అవి అందులో జన్మించలేదు గనుక వాటికి తెలియదు. కాని అవి దానిలో జన్మించియుండినయెడల ఆ మూల చెటులో యున్న జీవమే (యేసు) వాటిగుండా వచ్చి యుండెడిది. వారి ద్వారా అది ప్రత్యక్తపరచబడెడిది. యోహాను 14:12.
"నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును; అంతకన్న గొప్పవియు చేయును. ఎందుకనగా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవుచున్నానని," వారితో నిశ్చయముగా చెప్పెను.
మానవుల ద్వారా నడిపించబడుచున్న శాఖలు దేవుని మూలముగా జన్మించజాలవు; ఎందుకనగా జీవమిచ్చునది ఆత్మయైయున్నది, మానవుడు కాదు.
ఆ ప్రధానమగు గిన్నెలో నుండి జీవమును మరియు వెలుగును ఆ ఏడు దీపములు తీసికొని జీవించుట గూర్చి ఆలోచించునప్పుడు చాలా ఆశ్చర్యము ఆనందము కలుగును. వాటి యొక్క వత్తులన్నియూ అందులో మునిగియున్నవి. ప్రతికాలపు వర్తమానికుడు అందులో చూపించబడుచున్నాడు. అతని యొక్క జీవితము పరిశుద్దాత్మ శక్తితో మండుచున్నది. అతని యొక్క వత్తి (జీవము) క్రీస్తులో మునిగియున్నది. ఆ వత్తి ద్వారా అతను క్రీస్తు యొక్క జీవమును తీసుకు వచ్చుచూ దాని ద్వారా సంఘమునకు వెలుగు ఇచ్చుచున్నాడు. ఏ విధమగు వెలుగును అతడు ఇచ్చుచున్నాడు? మొదటగా వెలిగింపబడిన దీపములో యున్న కాంతినే ఇది కూడా ఇచ్చుచున్నది. అన్ని యుగములలోను అదే జీవము, అదే వెలుగు క్రీస్తునందు దాచబడిన జీవముగల వారి ద్వారా బయలుపరచబడుచున్నది. మరియు జరుగుచున్న కాలములలో నుండి ఈ చివరి దినపు వర్తమానికుని వరకు అదే బయలుపడుచున్నది.
ఆ విధముగా వర్తమానికులను గూర్చి మనము చెప్పుకొనుట మాత్రమే కాదు గొని, ప్రతి నిజవిశ్వాసియు ఇక్కడ చూపించబడియున్నాడు. ఒకే మూలాధారము నుండి వారందరునూ జీవమును పొందుచున్నారు. వారందరూ అదే పాత్రలో ముంచబడియున్నారు. వారు తమ విషయములో చనిపోయి మరియు వారియొక్క జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది. వారు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి యున్నారు. ఎఫెసీ 4:30,
"దేవుని పరిశుద్దాత్మను దు:ఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడియున్నారు."
ఎవడును వారిని ఆయన చేతిలో నుండి పెకలింపలేరు. వారి జీవితములకు ప్రమాదము లేదు. కనబడు జీవితము మండుచూ ప్రకాశించుచూ వెలుగును ఇచ్చుచూ పరిశుద్దాత్మ యొక్క ప్రత్యక్షతలను అనుగ్రహించుచున్నది. అంతరంగ, అదృశ్య జీవము దేవునియందు దాచబడి ప్రభుని వాక్యము ద్వారా పోషింపబడుచున్నది. సాతాను వారిని అంటుకొనజాలడు. మరణము సహితము వారిని అంటుకొనలేదు, ఎందుకనగా మరణపు ముల్లు విరిగెను; సమాధి యొక్క విజయము పోయెను. దేవునికి వందనములు, వారు ఆ విజయమును తమ అంతరంగములోను, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాను కలిగియుందురు. ఆమేన్ మరియు ఆమేన్.
ఇక యూజకుడు కాడు
ప్రకటన 1:13,
"తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్యకుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనియుండెను."
అక్కడ ఆయన నిలబడియున్నాడు, మనుష్యకుమారుని పోలిన రీతిగా ఉంగరము యొక్క అందముబట్టి రాయి ఎట్లు ప్రకాశించునో సంఘముల మధ్యను ఆయన ఆ విధముగా మహిమాన్నితునిగా యున్నాడు. అది ప్రభువు యొక్క దినము; ఆయన నిలబడియుండుటను యోహాను చూచెను, కాని ఆయన యూజకునిగా లేడు, రాబోవుచున్న న్యాయాధిపతిగా యుండెను. బంగారు దట్టి ఇప్పుడాయన నడుమునకు కట్టుకొని లేడు. అలాగు యాజకుడు తప్పక కటుకొనవలెను. అతి-పరిశుద్ధమగు స్థలములో దేవునికి సేవ చేయువారు ఆలాగున ధరించెదరు, కాని ఇప్పుడది ఆయన రొమ్మునకు కట్టబడినది. ఎందుకనగా ఇప్పుడాయన యాజకుడు కాడు గాని, న్యాయాధిపతి. ఇప్పుడు యోహాను 5:22 నెరవేరవలసియున్నది.
"ఏలయనగా తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని, తీర్పు అంతటిని కుమారునికి అప్పగించెను."
ఆయన యొక్క సేవ, ఆమోదించబడినది. యాజకత్వము ముగిసినది. ప్రవచన దినములు ముగిసినవి. ఆయన న్యాయాధిపతివలె దట్టికట్టుకొని నిలబడియుండెను.
ఆయన వ్యక్తిత్వము యొక్క ఏడింతల మహిమ
ప్రకటన 1:14-16,
"ఆయన తలయు తల వెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలె ఉండెను.ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మొరయుచున్న అపరంజితో సమానమై యుండెను. ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పటుకొనియుండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను."
యోహానుకు ప్రత్యక్షమైన యేసు ఎంత కదిలింపును, ఆత్మావేశమును తీసికొని వచ్చువానిగా యున్నాడో చూడండి. వాక్యము నిమిత్తమే అతడు పరవాసిగా అచ్చటున్నాడు, మరియు ఇప్పుడు చూడండి, సజీవ వాక్యము అతని ఎదుటనే నిలబడియున్నది. ఎంత ప్రజ్వరిల్లుచున్న దర్శనమది! వర్ణింపబడిన ప్రతి లక్షణమునకు ఒక గుర్తింపుయున్నది. ఆయన మహిమకర వ్యక్తిత్వము యొక్క గొప్ప ప్రత్యక్షత ఇది.
1. ఆయన తల వెండ్రుకలు హిమమంత ధవళముగా ఉండెను.
యోహాను మొదట ఆయన తల వెంట్రుకల యొక్క తెల్లదనమును గమనించి వివరించుచున్నాడు. అతని వయస్సు బట్టి ఇది జరుగలేదు. ఓ, కాదు. అంత గొప్పగా ప్రకాశించుచున్న తెల్లని వెంట్రుకలు ఆయన వయస్సును సూచించుట లేదు గాని; ఆయన అనుభవమును, పరిపక్వతను, జ్ఞానమును సూచించుచున్నవి. నిత్యునికి వయస్సుండదు. దేవునికి కాలము ఏమిలెక్క? కాలము దేవునికి చాలా అల్పమైనది, కాని జ్ఞానము అనంతము. ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు, న్యాయము చేకూర్చుటకు, సొలోమోను జ్ఞానమును కోరుకొనెను. సర్వభూమికి న్యాయాధిపతియగు ఆయన వచ్చుచున్నాడు. ఆయన జ్ఞానమును కిరీటముగా ధరించుకొనును. హిమమంత ధవళముగా మొరయుచున్న ఆ తలవెండ్రుకల యొక్క భావము అదే. దానిని మీరు దానియేలు 7:9-14లో చూడగలరు.
"ఇంక సింహాసనములను వేయుట చూచితిని. మహా వృద్దుడొకడు కూర్చొండెను. ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తల వెండ్రుకలు శుద్ధమైన గొర్రెబోచ్చు వలె తెల్లగాను ఉండెను: ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్నివలె ఉండెను.అగ్నివంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేలకొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్లకొలది మనుష్యులు ఆయన యెదుట నిలచిరి: తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడెను.అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్లు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను. సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయెను.రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహా వృద్దుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను.సకల జనులును, రాష్ట్రములను, ఆయూ భాషలు మాటలాడువారును, ఆయనను సేవించునటు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును, ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అదెన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు."
అది అక్కడ ఉన్నది. ఆ తెల్లని వెండ్రుకలతోనున్న ఆయనను దానియేలు చూచెను. ఆయన న్యాయాధిపతిగా గ్రంథములను తెరచుచూవారికి న్యాయము తీర్చుచున్నాడు. ఆయన మేఘములలో వచ్చుటను దానియేలు చూచెను. యోహాను చూచినది కూడా అక్షరాలా అదియే. వారిద్దరును ఆయనను ఆ విధంగానే ఖచ్చితంగా చూచిరి. వారు న్యాయాధిపతిని, రొమ్మునకు తన న్యాయవు దట్టి కట్టుకొనియున్నవానిని, పరిశుద్దునిగా, పవిత్రునిగా నిలబడియున్నవానిని, పూర్ణజ్ఞానము గలవానిని వారు చూచిరి. లోకమునకు నీతితో తీర్పు తీర్చుటకు పూర్తి అర్హతను పొందినవానిగా ఆయన నిలబడియున్నాడు. హల్లెలూయా!
ఈ పోలికలను ప్రపంచము కూడా అర్థము చేసికొనగలదు, పురాతన కాలములలో న్యాయాధిపతి ఆ విధంగానే కోర్టులో కనబడెడివాడు, తెల్లని విగ్గు ధరించెడివాడు, పొడవైన అంగీ ధరించెడివాడు. న్యాయుమును జరిగించుటకు తనకు సంపూర్త అధికారమున్నదనుటకు రుజువుగా ఆ వస్త్రములు ధరించెడివాడు. (తల నుండి పాదముల వరకూ గల వస్త్రము.)
2. ఆయన కన్నులు అగ్నివలె యుండెను.
దానిని గూర్చి ఆలోచించండి. ఆ కన్నులు ఒకప్పుడు దుఃఖముతోను, జాలితోను, కన్నీటితోను నిండియుండినవి. లాజరు యొక్క సమాధియోద్ధ జాలితో ఆ కన్నులు ఏడ్చినవి. ఆ కన్నులు తనను సిలువవేసిన హంతకుల యొక్క దుర్మార్ఘతను చూడలేదు కాని, ఆయన దుఃఖముతో ఇట్లు పలికెను, "తండ్రీ, వీరిని క్షమించుము." ఇప్పుడు ఆ కన్నులు అగ్నిజ్వాలవలె యున్నవి. అవి న్యాయాధిపతి యొక్క కన్నులు. ఆయనను విసర్జించినవారు ఆయన ముందు నిలువవలెను.
మానవ భావోద్రేకములను పూర్తిగా చూపించిన ఆయన మనుష్యకుమారునిగా కనబడుచున్నాడు. తరుచుగా ఆయన ఏడ్చెను. ఆయన ఏడ్చినప్పటికిని, కన్నీరు కార్చినప్పటికిని దేవునిగానే యున్నాడని గ్రహింపదగును.
అవే కన్నులు దర్శనములను చూచెను. అవి మానవ హృదయ లోతులను చూచినవి. మానవుల ఆలోచనలను అవి చదివినవి. వారి యొక్క మార్గములన్నింటినీ ఎరిగియుండెను. మర్త్య కన్నులుగల దేవుడు ప్రకాశించుచున్నాడు, ఆయన ఏమైయున్నాడో ఎరుగని అనేకుల కొరకు ఆ కన్నులు ఏడ్చినవి. "నేనే ఆయననని మీరు నమ్మనియెడల మీరు మీ పాపముల లోనే చనిపోవుదురు." యోహాను 8:24.
"నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి. కాని నేను చేసినయెడల (నా తండ్రి క్రియలు) నన్ను నమ్మకపోయినా గాని, ఆ క్రియలను మీరు నమ్ముడి."
యోహాను 10:37-38. ఆ పాతకాలపు యిర్మియా వలె ఆయన ఏడ్చు ప్రవక్తగా యుండెను, ఏలయనగా జనులు దేవుని వాక్యమును చేర్చుకొనలేదు మరియు ప్రత్యక్షతను ఒక ప్రక్కకు త్రోసిరి.
న్యాయాధిపతి యొక్క ఆ అగ్నిజ్వాలలను పోలిన కన్నులు ఇప్పటికి సహితము సర్వశరీరుల యొక్క జీవితములను నమోదు చేయుచున్నవి. భూమియందంతట సంచారము చేయుచున్నవి. ఆయనకు తెలియనిది ఏదియును లేదు. హృదయములోని కోరికలు ఆయనకు తెలియును. ఎవరెవరి ఉద్దేశ్యములు ఎట్లున్నవో ఆయనకు తెలియును. బయలుపరచకుండా దాయగలిగినది ఏదియూ లేదు, ఎందుకనగా ఆయన ఎదుట అన్నియూ చక్కగా కనబడుచున్నవి. మనము చేయు ప్రతి పనిని ఆయన ఎరుగును. దానిని గూర్చి ఆలోచించండి, ఇప్పుడు నీవు ఏమి ఆలోచించుచున్నావో కూడా ఆయనకు తెలియును.
అవును, అక్కడ ఆయన అగ్నిజ్వాలలను పోలిన కన్నులతో నిలబడి తీర్పు తీర్చుటకు సిద్దముగా యున్నాడు. కృపా దినము అయిపోయినది. ఓ, ఇంకా సమయముండగానే మనుష్యులు పశ్చాత్తాపపడి ఆయన యొక్క నీతి ముఖమును వెదుకవలెను. వారాయన యొక్క రొమ్మును తమ తలగడగా చేసికొందురు. ప్రపంచము అగ్నికి ఆహుతి కాకముందే ఇది చేయవలెను.
3. ఇత్తడి కాళ్ళు.
"ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మొరయుచున్న అపరంజితో సమానమైయుండెను." చెప్పలేనంత గట్టితనమునకు ఇత్తడి పేరు పొందియున్నది. దానిన నీవు దేనితోను మిశ్రమము చేసి గట్టితనమును పోగొట్టజాలవు. ఈయన పాదములను వర్ణించుచున్న ఈ ఇత్తడి అగ్నిలో పుటము వేయబడినది. అనగా అగ్నిపరీక్షకు నిలబడినది. ఎవరు నిలబడజలని అగ్నిపరీక్షకు అది తట్టుకొనినది. ఇది అక్షరాలా నిజము. దైవ తీర్పుకు ఇత్తడి సూచనగా యున్నది. దేవుడు జారీచేసి జరిగించిన న్యాయ తీర్పుకు సాదృశ్యము. యోహాను 3:14-19.
"అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక, ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను:దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని; లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి."
సంఖ్యా కాండము 21:8,9.
"మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా - నీవు తాపకరమైన సర్పమువంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను."
ఇశ్రాయేలీయులు పాపము చేసిరి. పాపమునకు తీర్పు తీర్చబడవలెను. కాబట్టి దేవుడు మోషేతో ఒక ఇత్తడి సర్పమును స్తంభము మీద నిలువబెట్టించవలెనని చెప్పెను. దానివైపు చూచినవాడు బ్రదుకును. పాపము యొక్క శిక్ష పోవును.
స్తంభము మీదనున్న ఇత్తడి సర్పము, ఏదెను తోటలో నుండి వచ్చిన పాపమునకు సాదృశ్యముగా యున్నది. సర్పము అవ్వను మోసము చేసినది, ఆమె పాపము చేయునట్లు చేసెను. ఇత్తడి తీర్పుకు సూచనగా యున్నది, ఇత్తడి బలిపీఠమును చూడండి, అక్కడ పాపము యొక్క శిక్షను తుడిచివేయుటకు బల్యర్పణ జరుగును. బలిని ఆ పీఠము మీద అర్పించెదరు. ఏలియా దినములలో దేవుడు ఇశ్రాయేలీయులను వారి పాపమును బట్టి శిక్షింపవలసి వచ్చెను, అప్పుడాయన వర్షము లేకుండ చేసెను. అగ్నివలె మండిన ఆకాశములు ఇత్తడివలె మారెను. ఇప్పుడు ఈ ఉదాహరణలో స్తంభము మీద ఉండిన సర్పము ముందే తీర్పు చేయబడిన పాపమునకు సాదృశ్యముగా యున్నది, ఎందుకనగా అది ఇత్తడితో తయారు చేయబడెను. పాపము మీద అప్పటికే దైవ తీర్పు పడినదని చూపించుచున్నది. స్తంభము మీదనున్న సర్పము వైపు ఎవరు చూచెదరో వారు దాని యొక్క గుర్తింపును అంగీకరించినందున శుద్దులగుదురు, ఏలయనగా ఇది ప్రభువు యొక్క రక్షణ కార్యము.
స్తంభము మీద నున్న సర్పము, భూమి మీద దేనిని నెరవేర్చుటకు యేసు వచ్చెనో దానికి సాదృశ్యముగా యున్నది. పాపము నిమిత్తము వచ్చు దేవుని తీర్పులను తన మీద వేసికొనునట్లు ఆయన శరీరధారి అయ్యెను. బలిపీఠము యొక్క పునాది పూర్తి ఇత్తడితో చేయబడియుండెను. జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రెపిల్లకు మాదిరిగా యున్నది. తీర్పు ఎప్పుడో ఆయన మీదికి వచ్చియున్నది, పాపులను వారు లేనప్పుడే అది జరిగెను. రక్షణ సంపూర్తిగా ప్రభువు నుండి కలిగియున్నది. దేవుని ఉగ్రత అను మద్యపు తొట్టిని ఆయన త్రోక్కియున్నాడు. ఆయన యొక్క స్వరక్తము వలన ఆయన వస్త్రము ఎర్రనిదాయెను. దేవుని యొక్క ఉగ్రత మరియు ఆయన న్యాయతీర్పులు అను కొలిమిలో ఆయన పుటము వేయబడెను. అది ఆయన భాగము. ఆయన శ్రమనొందెను. నీతిమంతుడు అన్యాయస్తుల కొరకు శ్రమనొందెను.
"ఓ దేవుని గొర్రెపిల్లా! నీవు యోగ్యురాలవు, ఎందుకనగా నీవు నీ స్వరక్తమిచ్చి మమ్మును విమోచించియున్నావు."
"ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను. ఆయన మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందియున్నాము." మనందరి యొక్క దోషమును, ప్రభువు, ఆయన మీద మోపెను. ఏ మానవుడూ ఎన్నడూ శ్రమపడని రీతిలో ఆయన శ్రమపడెను. సిలువ ఎక్కుటకు ముందే ఆయన రక్తమును చెమటగా కార్చెను. ముందున్న మహా వేదనను ఆయన చూచెను. ఆయన నాళములలో నుండి రక్తము వేరాయెను. ఆయన శరీరము నుండి రక్తము చెమటగా కారినది. లూకా 22:44.
"ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయెను."
కాని ఒక దినమున ఆ ఇత్తడి పాదములు ఈ భూమి మీద నిలబడును. సర్వ భూమికి ఆయన తీర్పు తీర్చును. సమానత్వముతోను మరియు పరిపూర్ణతతోను ఆయన మానవాళికి తీర్పు తీర్చును. ఆ తీర్పును తప్పించుకొను మార్గము లేదు. ఆ న్యాయమునకు తిరుగు లేదు. దానిని మినహాయించుకొను మార్గము లేదు. అన్యాయస్థుడు ఇంకా అన్యాయస్థుడు గానే ఉండును; అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే యుండును. మారనివాడు అప్పుడును మారడు, మారని దేవుడు ఎన్నడూ మారడు; ఆయన మార్పులేని వాడు. ఆ ఇత్తడి పాదములు శత్రువును చితక ద్రోక్కును. క్రీస్తు విరోధిని అవి నాశనము చేయును. మృగము మరియు ప్రతిమ ఆయన దృష్టిలో హేయులుగా నిలచియుందురు. ఆయన నామమును తీసికొని దాని యొక్క తేజస్సును చెరువుచేయుచూ ఉన్న ఈ సంఘ క్రమములను ఆయన నాశనము చేయును. క్రీస్తువిరోధితో కూడా ఆయన వారిని చితకగొట్టును. దుర్మార్గులు, నాస్తికులు, నిర్దేవులు, ఆధునికులు, ఉదారవాదులు, మొదలగు వారందరూ అక్కడ ఉందురు. మరణము, నరకము మరియు సమాధి అచ్చట యుండును. అవును. వారందులో పడద్రోయబడుదురు. ఆయన వచ్చినప్పుడు గ్రంథములు తెరువబడును. నులివెచ్చని సంఘము మరియు అయిదుగురు బుద్ధిలేని కన్యకలు కూడా అక్కడ ఉందురు. ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరు చేయును. ఆయన వచ్చినప్పుడు రాజ్యమును ఆయన తీసికొనును, ఎందుకనగా అది ఆయనకు చెందియున్నది. వేవేలకొలదిగా నున్న ఆయన యొక్క వధువు, ఆయనకు పరిచర్య చేయుటకు ఆయనతో కూడా వచ్చును. మహిమ! ఇప్పుడే మారుమనస్సు పొందవలెను, లేనిచో మరెన్నడునూ పొందలేవు. ఆలస్యము కాకముందే మారుమనస్సు పొందుము. మృతులలో నుండి లేచి దేవుని వెదకుము. ఆయనాత్మతో నింపబడుము, లేనియెడల నీవు నిత్యజీవమును పోగొటుకొందువు. సమయమున్నప్పుడే దానిని చేయుము.
4. ఆయన స్వరము విస్తారమగు జలప్రవాహములవలె ఉండును.
ఇప్పుడు జలములు దేనికి సాదృశ్యముగా యున్నవి? దానిని మీరు ప్రకటన 17:15లో వినండి.
"నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని చూపించును."
మన సమూహములు మాట్లాడుచున్నంత శబ్దమువలె ఆయన స్వరము వినిపించెను. ఏమిటది? అది తీర్పు. సాక్షి సమూహముల యొక్క స్వరములు ఇవే. వారి ద్వారా పరిశుద్దాత్మ అన్ని యుగములలోను క్రీస్తుకు సాక్ష్యమును చెప్పించి, ఆయన యొక్క సువార్తను ప్రకటించెను. హెచ్చరికను పాటించక యుండిన ప్రతి పాపికిని విరోధముగా తీర్పులో తిరిగి లేచిన ప్రతివారి యొక్క స్వరము అదియే. ఏడుగురు వర్తమానికుల యొక్క స్వరములు గట్టిగాను మరియు తేటగాను వినబడును. యేసు యొక్క రక్షించు శక్తిని గూర్చి నమ్మకముగా బోధించిన ఆ బోధకులు, యేసు నామములో నీటి బాప్తిస్మమును గూర్చియు, పరిశుద్దాత్మ శక్తి మరియు నింపుదల గూర్చియు బోధించిరి. వారు వాక్యముతో నిలబడియుండుటకు తమ స్వంత ప్రాణములను కూడా లెక్క చేయలేదు; వారందరును యేసుక్రీస్తు యొక్క స్వరములై యున్నారు. అన్ని యుగములలోను పరిశుద్ధాత్మతో వారు నింపబడిరి. యోహాను 17:20.
"నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రీ, నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమైయుండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను."
ఒక సుడిగుండము వైపుకు నిస్సహాయుడుగా కొటుకొనిపోవుచున్న వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత భయంకరముగా యుండునో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆ మహా హోరును అతడు సమీపించుటను గూర్చి ఆలోచించండి. నిశ్చయంగా, తప్పకుండా అతడు నశించును. అంతే ఖచ్చితముగా ఆ తీర్పుదినము వచ్చుచున్నది. సమూహములుగా యున్న జనుల యొక్క స్వరములు, నీవు ఆ హెచ్చరికను సమయము దాటిపోవు వరకు వినకుండుటను బట్టి నిన్ను ఖండించుచున్నవి. ఈ సమయములోనే నీవు జాగ్రత్తపడుము, ఎందుకనగా ఈ క్షణములో నీ ఆలోచనలు పరలోకమందు నమోదగును. అక్కడ నీ మాటలు కంటె నీ ఆలోచనలు గట్టిగా మాట్లాడును. పరిసయ్యులు నోటితో ఎంతగానో చెప్పుకొనిరి, కాని ప్రభుని మాటకు చెవి ఇవ్వలేదు, వారి మనస్సు కలుషితముతోను మరియు చెడుతనముతోను నిండియున్నది, సమయము మించిపోయినది. వాక్యమును వినుటకు నీకు ఇదే చివరి అవకాశము కావచ్చును. దానిని చేర్చుకొని నిత్య జీవమును పొందుము. సమయము దాటిపోవుచున్నది, తీర్పు మరియు శిక్ష యొక్క అనేక స్వరముల హోరును నీవు వినుటకు దగ్గరపడుచున్నావు.
జలము యొక్క శబ్దము ఎంత మాధుర్యముగాను, ఎంత ఆహ్లాదకరముగాను ఉండునో ఎప్పుడయినా నీవు గమనించావా? నాకు చేపల వేట ఇష్టము. నీరు త్రుళ్ళిపడుచూ ప్రవహించు చోటును నేను వెదకి కనుగొందును. నేను వెనుకకు చేరబడి ఆ స్వరము విందును. నా హృదయమునకు అది సమాధానము, సంతోషము, సంతృప్తి ఇచ్చును. పరలోకపు విశ్రాంతిలో నేను లంగరు వేయబడుటకు ఎంతగానో సంతోషించుచున్నాను. అక్కడ ప్రభువు యొక్క స్వరము సమాధానము నిచ్చును. వేరు చేయు జలముల యొక్క వాక్యము దానిని గూర్చి ముందే ప్రకటించెను. ఆయన యొక్క ప్రేమ స్వరమును, కాపుదల, నడిపింపు, భద్రత, దయచేయు స్వరమును వినుచున్నందుకు మనము ఎంతో కృతజ్ఞత చెల్లించవలెను. అదే మాధుర్యమగు స్వరము, ఒక దినమున మనతో మాట్లాడుటను మనము విందుము, తీర్పులో కాదు గాని, మనలను ఆహ్వానించుటను విందుము. ఆయన యొక్క రక్తములో తమ పాపములను కడుగుకొనినవారు, ఆత్మ నింపుదల కలిగిన జీవితములను కలిగియున్నవారు, వాక్యప్రకారముగా నడిచినవారు ఆహ్వానము అందుకొందురు. ఆహ్వానము పలుకు జన సమూహముల యొక్క స్వరములను వినుటకంటె ప్రశస్తమైనది ఇంకేముండును? నిత్యజీవమునందు విశ్వాసించిన ఆ జన సమూహముల చేత మనము ఆవరించబడుదుము. ఓ! దానివంటిది మరేదియూ లేదు. ఆయన స్వరమును వినియు మీ హృదయములను కఠినము చేసికొనరాదని నేను మీకు మనవి చేయుచున్నాను, అయితే ఆయనను మీ రాజాగా చేర్చుకొనుడి.
దానిని మీరు చూడగలిగినట్లయితే ప్రపంచమును జలములు నాశనము చేసినవి, కాని అవే జలములు నోవహును రక్షించినవి, మరియు నోవహు కొరకు సర్వభూమిని రక్షించినవి. ఆయన యొక్క స్వరమును వినండి, ఆయన దాసుల యొక్క స్వరమును వినండి, మారుమనస్సును మరియు జీవమును పొందమని అది పిలచుచున్నది.
5. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రములున్నవి.
"ఆయన యొక్క కుడి చేతిలో ఏడు నక్షత్రములు కలవు." ఇక్కడ ఏడు నక్షత్రములు ఏమైయున్నవో 20వ - వచనమును బట్టి ఇంతకు ముందే మనము తెలిసికొనియున్నాము. "ఆ ఏడు నక్షత్రముల యొక్క మర్మము ఏదనగా, ఏడు సంఘముల యొక్క దూతలు (వర్తమానికులు)." ఏ విధముగాను ఇక్కడ మనము తప్ప చేయరాదు, ఎందుకనగా ఆయనే మన కొరకు దాని భావమును చెప్పెను. ఏడు వరుస సంఘ కాలములకు ఈ ఏడు నక్షత్రములు వర్తమానికుల వలె యున్నవి. వారిని పేరు పెట్టి పిలువలేదు. ఏడుగురుగా మాత్రమే చెప్పబడిరి, ప్రతి కాలమునకు ఒక్కొక్కరు. ఎఫెసు సంఘ కాలము నుండి ఈ లవోదికయ సంఘ కాలము వరకు ఉండిన వర్తమానికులు వారే. వారు వర్తమానమును, సత్యమును జనులకు అందించిరి. ఆ ప్రత్యేక యుగమునకు సంబంధించిన దేవుని వాక్యమును అందించుటలో వారెన్నడూ తప్పిపోలేదు. ప్రతి ఒక్కరు దానిని పట్టుకొనిరి. అసలు వెలుగునకు వారు విధేయులై యుండిరి, వారు నిలకడగా యుండిరి. ప్రతి కాలము దేవుని నుండి దూరమైపోవుచుండగా, ఆయన యొక్క నమ్మకస్తుడగు వర్తమానికుడు ఆ కాలమును తిరిగి వాక్యము వైపునకు త్రిప్పెను. ప్రభువు యొద్ద నుండి వారు బలమును పొందిరి, లేనియెడల వారెన్నడును ఆ విధంగా ఎదురీది యుండెడివారు కారు. వారాయాన యొక్క కాపుదలలో క్షేమముగా యుండిరి. ఆయన చేతిలో నుండి వారిని ఏదియూ తొలగింపలేకపోయెను, దేవుని యొక్క ప్రేమ నుండి ఏదియూ వారిని వేరు చేయజాలక పోయెను. వ్యాధియైనను, అపాయమైనను, వస్త్రహీనతయైనను, కరువైనను, ఖడ్గమైనను, జీవమైనను, మరణమైనను ఏదయినా గాని వారిని దేవుని ప్రేమ నుండి వేరుచేయజాలలేక పోయెను. వారు నిజంగా ఆయనకు విధేయులై యుండిరి. ఆయన యొక్క సర్వశక్తి వలన కాపాడబడిరి. వారు తమకు సంభవించిన హింసను లెక్క చేయలేదు. బాధ మరియు శ్రమ కలిగెను, కాని వారు దేవునికి మహిమ చెల్లించి ఆయన కొరకు శ్రమననుభవించుట మహాభాగ్యమనుకొనిరి. ఆయన ఇచ్చిన రక్షణకు కృతజ్ఞతగా వారాయన జీవము యొక్క మంటతో మండియుండిరి. ఆయన ప్రేమను, సహనమును, సాత్వికమును, ఆశా నిగ్రహమును, మంచితనమును, నమ్మకత్వమును వారు ప్రతిబింబించిరి. దేవుడు తన అద్భుతములను, సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను వారిపట్ల చూపించి తాను వారితో యున్నట్లు రుజవు చేసెను. వారిని పిచ్చివారని హేళన చేసిరి, పరిశుద్ధ బండలని ఎగతాళి చేసిరి. సంస్థల ద్వారా వారు నిందింపబడిరి, అయినను వారు వాక్యము పట్ల యధార్థముగా యుండిరి.
ఒక మత ఆచారమును నమ్మకముగా గైకొని అందుకొరకు నిలబడుట కష్టము కాదు. అది తేలిక, ఎందుకనగా వాటి వెనుక అపవాది యున్నది. కాని దేవుని యొక్క వాక్యము పట్ల నమ్మకముగా యుండుట వేరు, పెంతెకోస్తు తరువాత వాక్యము నిజముగా బయలుపరచిన దానికి తిరిగి వెళ్ళుట.
కొంతకాలము క్రిందట ఒకడు నాతో చెప్పిన సంగతి, అది - "రోమను కాథలిక్కు సంఘము నిజమయిన సంఘమయి యుండవలెను, ఎందుకనగా ఇన్ని సంవత్సరముల నుండి అది తాను నమ్మిన దానిని విడిచిపెట్టలేదు; పెరుగుచూ పోవుచున్నది కానీ, మారుట లేదు." అసలు అది అలాగున ఏ మాత్రమూ లేదు. దాని వెనుక ప్రభుత్వమున్నది, దానికి దాని స్వంత ఆచారములున్నవి, అది అసలు వాక్యము కానే కాదు, ప్రత్యక్షపరచబడిన ఏ పరిచర్యయు వారికి లేదు. అందువలన అపవాదికి పనిలేదు, తప్పకుండా ముందుకు పోనిచ్చును. అది ఏమియూ గొప్ప సంగతి కాదు. కాని మీరు ఆ చిన్న గుంపును గూర్చి ఆలోచించండి, దాని సభ్యులు రంపములతో కోయబడిరి, సింహములచే తినబడిరి, శ్రమలపాలయిరి, పలుచోట్లకు తరుమబడిరి; అయినా గాని వారు వాక్యము పట్ల నమ్మకముగా యుండిరి — ఇది తప్పకుండా దేవుని నుండి వచ్చినదై యుండవలెను. వారు తమ విశ్వాస పోరాటమును ఎట్లు పోరాడిరో, ఇంకా ముందుకు ఎట్లు కొనసాగిరో చూడండి: అదియే ఒక అద్భుతము.
ఈ ఆదరణ ఏడు సంఘకాల వర్తమానికులకు మాత్రమే కాదు. ప్రతి నిజ విశ్వాసియు దేవుని యొక్క చేతిలో యున్నాడు, ఆయన యొక్క ప్రేమను మరియు శక్తిని వారు పొందుదురు, విశ్వాసికి దేవుడనుగ్రహించు ప్రతి మేలును వారు పొందగలరు. దేవుడు వర్తమానికునికి ఇచ్చినది, ఆయన వారిని దీవించిన విధానము, వారిని ఆయన వాడుకొనిన పద్ధతి విశ్వాసులందరికిని ఒక మాదిరిగా యున్నది. ఆయన యొక్క మంచితనము మరియు కాపుదల ఆయన శరీరములోని సభ్యులందరికిని చెందును. ఆమేన్.
6. రెండంచుల ఖడ్గము."ఆయన యొక్క నోటి నుండి వాడియైన రెండంచులు గల ఖడ్గము బయలువెడలెను." హెబ్రి 4:12, "ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్ళను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది."
ఆయన యొక్క నోటినుండి వాడియగు రెండంచులు గల ఖడ్గము బయలువెడలియున్నది. అది దేవుని వాక్యము. ప్రకటన 19:11-16,
"మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుర్రమొకటి కనబడెను. దాని మీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును, సత్యవంతుడును అను నామముగలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు.రక్తములో ము౦చబడిన వస్త్రవు ఆయన ధరించుకొనియుండెను: మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రోక్కును."రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును" అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడియున్నది."
యోహాను 1:48,
"నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు - ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను."
అది అక్కడ ఉన్నది. ఆయన వచ్చునప్పుడు దేశములన్నింటికి మరియు మనుష్యులందరికి విరోధముగా వాక్యము వచ్చును. దానికి వ్యతిరేకముగా ఎవరును నిలబడియుండజాలరు. నతనియేలునకు చేసిన విధంగానే ప్రతీ ఒక్క హృదయాలోచనలను అది బయటకు తెచ్చును. ఎవరు దేవుని చిత్తమును చేసిరో, ఎవరు దేవుని చిత్తమును చేయలేదో, దేవుని వాక్యము చూపించును. ప్రతి మనిషి యొక్క రహస్య కార్యములను మరియు అతడు ఎందు నిమిత్తము వాటిని చేసెనో బయటకు తెచ్చును. అది విభాగించును. రోమా 2:3లో అదే చెప్పబడినది.
"అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు, వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా?"
ఆ తరువాత దేవుడు మనుష్యులకు ఎట్లు తీర్పు తీర్చునో చెప్పబడియున్నది. 5 నుండి 17 వచనములలో ఇక్కడ ఉన్నది. కఠినమగు, మారుమనస్సు పొందని హృదయమునకు తీర్పు తీర్చబడును. క్రియలకు తీర్పు తీర్చబడును. ఉద్దేశ్యములకు తీర్పు తీర్చబడును. దేవుడు ఎవరికిని పక్షపాతి కాడు. అందరును ఆ వాక్యమును బట్టియే తీర్పు తీర్చబడుదురు, దానినెవరును తప్పించుకొనలేరు. వినియు ఆ ప్రకారముగా నడువని వారికి వారు వినిన దానిని బట్టి తీర్పు తీర్చబడును. కొందరు దానిని విశ్వసించి యున్నామని చెప్పి విశ్రాంతిపొందినవారు తీర్పు తీర్చబడుదురు, ఎందుకనగా వారు ఆ విధముగా జీవించలేదు. ప్రతి రహస్యమును వెలుగులోనికి వచ్చుచు మిద్దెల మీదనుండి చెప్పబడును. అప్పుడు మనము చరిత్రను నిజంగా అర్ధము చేసికొందుము. అన్ని యుగముల లోని మర్మము బయటకు తెలియును. ఏదీయు విడిచిపెట్టబడదు.
నేడు మనము జీవించుచున్న ఈ యుగములో ఆయన స్త్రీ, పురుష హృదయములలోని రహస్యములను బయలుపరచుచున్న సంగతి మీకు తెలియునా? వాక్యము తప్ప మరెవరు హృదయ-రహస్యములను బయలుపరచగలరు? హెబ్రీ 4:12,
"ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్ళను విభజించునంతమట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది."
అది వాక్యము. అది దేనికొరకు పంపబడినదో ఆ కార్యమును నెరవేర్చుచున్నది, ఎందుకనగా అది (వాక్యము) పూర్తిశక్తితో నిండియున్నది. యేసు (వాక్యము)లో నుండిన అదే ఆత్మ ఈ చివరి కాలములో ఒక చివరి సూచనగా మరల సంఘములో ప్రత్యక్షమగుచూ జనులను తీర్పులో నుండి తప్పించుటకు ప్రయత్నము చేయుచున్నది. ఎందుకనగా ఆయనను (వాక్యము) తిరస్కరించిన వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడియున్నది, ఆయనను వారు నూతనముగా సిలువవేయుచున్నారు. హెబ్రీ 6:6,
"తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచూ బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు."
వాక్యము శక్తితోను, స్వరమువలెను వచ్చియున్నదని పౌలు చెప్పుచున్నాడు. బోధించబడిన వాక్యము వాస్తవంగా దానికదే బయలుపరచుకొనును. అగ్ని జ్వాలవలెను, కోయు ఖడ్గమువలెను అది మనుష్యుల యొక్క మనస్సాక్లిలోనికి వెళ్ళను. వైద్యుని యొక్క శస్త్రచికిత్స చేయు కత్తివలె నుండి అది రోగములను కోసి చెరలోనున్నవారిని స్వతంత్రులనుగా చేయును. ఆనాటి ఆదిమ విశ్వాసులు ఎచ్చటికి వెళ్ళినా గాని వారు సువార్తను (వాక్యము) బోధించుచునే వెళ్ళిరి. మరియు సూచక క్రియలు వారిని వెంబడించుట ద్వారా దేవుడు ఆ వాక్యవును స్థిరపరచుచుండెను. రోగులు స్వస్థత పొందిరి, దయ్యములు వెళ్ళగొట్టబడినవి, వారు క్రొత్త భాషలలో మాట్లాడిరి. అది కార్యరూపములో నున్న వాక్యము. విశ్వసించిన క్రైస్తవుల నోటిలో నుండి అది ఎప్పుడు వచ్చినా విఫలము కాదు. ఈ చివరి కాలములో అది ఇచ్చట ఎప్పుడూ లేనంత బలముగాను, గొప్పగాను నిజమగు వాక్య వధువులో యున్నది. ఓ, చిన్న మందా, అల్ప సంఖ్యాకులుగా నున్నవారులారా, వాక్యమును పట్టుకొని యుండుడి, దానితో మీ నోటిని, హృదయమును నింపుకొనుడి, మరియు ఒక దినమున దేవుడు మీకు రాజ్యమును ఇచ్చును.
7. ఆయన ముఖము సూర్యునివలె ఉండెను"ఆయన ముఖము మహాతేజముతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
"మత్తయి 17:1-13,
"ఆరు దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని, ఎత్తయిన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి,వారి యెదుట రూపాంతరము పొందెను: ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.ఇదిగో, మోషెయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి.అప్పుడు పేతురు - ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను.అతడు ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను: ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు సేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను.శిష్యులు ఈ మాట విని, బోర్లపడి మిక్కిలి భయపడగా,యేసు వారియొద్దకు వచ్చి మరియు వారిని ముట్టి — లెండి, భయపడకుడని చెప్పెను.వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.వారు కొండ దిగి వచ్చుచుండగా - మనుష్యకుమారుడు మృతులలో నుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని యేసు వారికాజ్ఞాపించెను.అప్పుడాయన శిష్యులు - ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి?అందుకాయన - ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే.అయినను ఏలీయా యిది వరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతనియొడల చేసిరి. మనుష్యకుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను.అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి."
ఇప్పుడు మత్తయి 17:1-13లో నున్నదానికి మత్తయి 16:28 ఉపోద్ఘాతమువలె యున్నది. యేసు చెప్పెను,
"ఇక్కడ నిలచియున్నవారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను."
కేవలము ముగ్గురు అపోస్తలులు మాత్రమే - ఆయన రెండవ రాకడ యొక్క క్రమమును చూచిరి. కొండపై భాగమున ఆయన రూపాంతరము పొందుటను వారు చూచిరి. ఆయన యొక్క వస్త్రము హిమమంత తెల్లగా మొరయుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యునివలె ప్రకాశించుచుండెను. ఆయనకు ఇరువైపుల మోషేయు, ఏలీయాయు నిలచియుండిరి, ఆలాగు ఆయన ప్రత్యక్షమాయెను. ఖచ్చితంగా ఆయన ఆ విధంగానే తిరిగి వచ్చుచున్నాడు. నిజంగానే ఏలీయా మొదట వచ్చి పిల్లల హృదయములను (వధువు) తండ్రుల యొక్క అపోస్తలుల వాక్య బోధవైపుకు త్రిప్పును. మలాకీ 4:5,6.
"యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినము రాక మునుపు, నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును.నేను వచ్చి దేశమును శపించకుండునట్లు, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును."
ఇశ్రాయేలు ఇప్పటికే ఒక దేశముగా యున్నది. ఇప్పుడామె తన సైన్యములతో, నావికా దళముతో, తపాలా వ్యవస్థతో స్థిరపడియున్నది, పతాకము కలిగియున్నది, మరియు దేశమునకు ఉండవలసివన్నీయూ ఉన్నవి. అయిననూ ఇంకా నెరవేరవలసిన లేకనములు ఉన్నవి, "ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా?…" యొషయా 66:8. ఆ దినము త్వరగా వచ్చుచున్నది. అంజూరపు చెట్టు చిగురించియున్నది. ఇశ్రాయేలీయులు మెస్సీయా కొరకు ఎదురు చూచుచున్నారు. ఆయన కొరకు వారు కనిపెట్టుచున్నారు మరియు వారియొక్క ఆశలు నెరవేరుటకు సిద్ధముగా యున్నవి. ఆత్మ సంబంధముగా ఇశ్రాయేలు తిరిగి జన్మించును, ఎందుకనగా ఆమె యొక్క జీవము మరియు వెలుగు ఆమెకు బయలుపరచబడుటకు సిద్ధముగా యున్నది.
ప్రకటన 21:23,
"ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు: దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము."
ఇది క్రొత్త యొరూషలేము. ఆ పట్టణములో గొర్రెపిల్ల యుండును. ఆయన యొక్క సన్నిధిని బట్టి అక్కడ దీపము అక్కరలేదు. సూర్యుడు ఉదయించడు, దాని ప్రకాశము అక్కడ లేదు, ఎందుకనగా ఆయనే సూర్యుడు మరియు వెలుగు అయి యున్నాడు. అందులోనికి వచ్చు రాజ్యములు ఆయన యొక్క వెలుగులో నడచును. ఆ దినము మన యొద్దకు వచ్చుచున్నందుకు మీరు సంతోషముగా లేరా? ఆ దినము వచ్చుటను యోహాను చూచెను. ప్రభువైన యేసూ, త్వరగా రమ్ము!
మలాకీ 4;1-3,
"ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును: గర్వివిష్టులందరును, దుర్మారులందరును, కొయ్యకాలువలె ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండ రాబోవు దినము అందరిని కాల్చివేయుని సైన్యములకు అధిపతియగు యొహోవా సెలవిచ్చుచున్నాడు.అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు, నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.నేను నియమింపబోవు దినమున దుర్మారులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు; మీరు వారిని అణగద్రోక్కుదురని సైన్యములకు అధిపతియగు యొహోవా సెలవిచ్చుచున్నాడు."
మరల ఇక్కడ అది కనబడుచున్నది. సూర్యుడు మహా తేజస్సుతో ప్రకాశించుచున్నాడు. దేవుని కుమారుని యొక్క బలము ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య ప్రకాశించుచున్నది. ఆయన న్యాయాధిపతిగా నిలబడియున్నాడు. ఆయనే మనకొరకు శ్రమపడి చనిపోయెను. దేవుని తీర్పు యొక్క ఉగ్రతను ఆయన తన మీద వేసికొనెను. దేవుని తీక్షణమైన ఉగ్రత యొక్క మద్యపు తొట్టిని ఆయన త్రోక్కెను. ఇంతకు ముందే చెప్పియున్నాము, పాపికి ఆయన స్వరము జలపాతము యొక్క స్వరమువలె వినిపించును లేదా రాతిబండలుగల తీరమున మరణపు అలలు నురుగు వెళ్ళ గ్రక్కుచున్నటుగా యుండును. కానీ పరిశుద్దునికైతే ఆయన యొక్క స్వరము మధురముగా పాడుచున్న సెలయేటి పాటవలె ఉండి మీరు విశ్రాంతిని పొంది పరుండెదరు, క్రీస్తునందు సంతృప్తిపొందెదరు. మన మీద ఆయన యొక్క చల్లని ప్రేమ కిరణములు ప్రకాశించును. ఆయన ఇట్లు చెప్పును, "భయపడకుడి. ముందుండినవాడను, ఇప్పుడున్నవాడను, ఇకముందు ఉండబోవువాడను నేనే; నేను సర్వశక్తిగల దేవుడను. నేను తప్ప మరి ఎవరును లేరు. నేనే ఆల్ఫాయు, ఓమేగాయునై యున్నాను, అన్నియూ నేనే." ఆయనే లోయలోని పద్మము, ప్రకాశించు వేకువ చుక్క ఆయనే. ఆయన నా ఆత్మకు పదివేలమంది కంటె ప్రియుడు. అవును, ఆ గొప్ప దినము త్వరలో రాబోవుచున్నది, నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల క్రింద స్వస్థత యుండును.
జయశీలుడగు క్రీస్తు,
ప్రకటన 1:17,18,
"నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను - భయపడకుము; నేను మొదటివాడను, కడపటివాడను;జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి."
ఆ దర్శనము యొక్క పూర్తి ప్రభావమునకు ఏ మనిషియు తట్టుకొనజాలడు. అతని యొక్క బలము పూర్తిగా పోయెను, యోహాను చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడిపోయెను. కాని దేవుని యొక్క హస్తము ప్రేమతో అతనిని తాకినది, ఆశీర్వదించు స్వరము ఇట్లు పలికినది, "భయపడకుము, భీతిచెందవద్దు. నేను మొదటివాడను కడపటి వాడను. జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై యున్నాను." భయపడవలసినది అక్కడ ఏమున్నది? సిలువ యొద్దను, సమాధి యొద్దను మరియు ఆయన మనకొరకు క్రిందికి దిగినప్పుడు తీర్పు ఆయన మీద పడియున్నది. పాపము వలన ఏర్పడిన పూర్తి గాయమును ఆయన సహించుకొనెను, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏశిక్షావిధియను లేదు. ఇది నిశ్చయము, ఆయనే మన "ఉత్తరవాది" మరియు మనయొక్క "న్యాయాధిపతి." ఉత్తరవాది, న్యాయాధిపతి రెండును ఆయనే అయి యున్నాడు. న్యాయాధిపతిగా ఆయన కేసును పరిష్కరించియున్నాడు — అది సమాప్తమైయున్నది. కాబట్టి ఇప్పుడు ఏ శిక్షావిధియను లేదు. సంఘము ఎందుకు భయపడవలెను? ఆయన ఏ వాగ్దానమును మనయొదుట బయలుపరచకుండా యుండెను? మరణమునకు గాని, శిక్షకు గాని భయపడవలసిన అవసరము ఏమున్నది? అదంతయూ జయింపబడినది. దృశ్యమగు వానిని, అదృశ్యమగు వానిని, అనగా, రెండు ప్రపంచములను ఆయన జయించియున్నాడు. ఆ సర్వశక్తిగల జయశాలి ఇక్కడున్నాడు. అలెగ్జాండరు వలె కాదు, అతడు ముప్పది-మూడేండ్ల వయస్సులో ప్రపంచమును జయించి, ఇక జయించవలసినదిగా ముందుకు సాగెను, కాబట్టి అతడు పాపము యొక్క బానిసగానే మృతిపొందెను. పవిత్రము కాని జీవితమును జీవించెను, నెపోలియను వలె ఆయన లేడు; అతడు "యూరోపు" అంతా జయించెను, కాని చివరకు "వాటర్లూ"వద్ద ఓడించబడెను, "ఎల్బాకు" పరవాసిలా పంపబడెను, తనకు తాను ఓడిపోయినవానిగా మిగిలిపోయెను. కాని క్రీస్తును ఎవరూ జయించలేరు. క్రిందికి దిగియున్నవాడు ఇప్పుడు అందరికంటె పైకి ఆరోహణుడైయున్నాడు. ఆయనకు అన్ని నామములకంటె పై నామము ఇవ్వబడినది. అవును, ఆయన మరణమును, పాతాళమును, సమాధిని, జయించియున్నాడు. వాటి యొక్క తాళపు చెవులు ఆయన యొద్ద ఉన్నవి. ఆయన దేనిని విడిపించునో అది విడిపించబడును. ఆయన దేనిని బంధించునో అది బంధింపబడును. అందులో ఏ మార్పును లేదు. ఆయనకంటె ముందు ఏ జయశాలియు లేడు. ఆయన తప్ప వేరెవరును లేరు. ఆయన మాత్రమే రక్షకుడు మరియు విమోచకుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన యొక్క పేరు ''ప్రభువైన యేసు క్రీస్తు."
"యోహానూ, భయపడవద్దు. చిన్న మందా! భయపడకుడి. నాకున్నవన్నియూ మీవి, అందుకు మీరు వారసులు. నాకున్న అధికారమంతయూ మీది. నా యొక్క సర్వశక్తియు మీది, నేను మీ మధ్య నిలబడియున్నాను. భయమును, అపజయమును, తీసికొని వచ్చుటకు నేను రాలేదు గాని; ప్రేమను, ధైర్యమును, సామర్థ్యమును తీసికొని వచ్చియున్నాను. సర్వాధికారము నాకు ఇయ్యబడియున్నది, వాడుకొనవలసినవారు మీరు. మీరు వాక్యము పలుకుడి, దానిని నేను జరిగించెదను. అది నా యొక్క నిబంధన మరియు అది ఎన్నడూ విఫలము కాదు."
ఏడు నక్షత్రములు మరియు దీపస్తంభములు.
ప్రకటన 1:20,
"నా కుడి చేతిలో నీవు చూచిన ఆ ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు (వర్తమానికులు): ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు."
ఈ రెండు మర్మముల యొక్క సత్యములను ఇంతకు ముందే మనము కనిపెట్టియున్నాము. ఈ ఏడుగురు వర్తమానికులు ఎవరో మనకు బయలుపరచలేదు, కాని దేవుని సహాయము చేత మనము కనుగొందము. ఆ మర్మము సమాప్తమగును. ఏడు సంఘ కాలములు మనకు తెలియును. వాటి జాబితా వాక్యములో యున్నది, ప్రతి ఒక్క దానిని గూర్చి మనము తెలిసికొందము, మనము జీవించుచున్న ఈ చివరి కాలము వరకును చూచెదము.
ఈ అధ్యాయమును ముగించు ముందు, ఒక్క చివరి చూపును చూచెదము. ఆయన ఆ బంగారు దీపస్తంభముల మధ్య నిలబడియుండుట చూచెదము. ఆయన కుడి చేతి యందు ఏడు నక్షత్రములు గలవు. ఓ, ఆయన తన యొక్క సంపూర్ణ దైవత్వముతో నిలబడియుండుటను మనము చూచినప్పుడు ఉక్కిరిబిక్కిరి యగుదము. ఆయన న్యాయాధిపతి, యాజకుడు, రాజు, పక్షిరాజు, గొర్రెపిల్ల, సింహము, అల్ఫా, ఒమేగా, ఆది మరియు అంతము, తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ, భూత, భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాడు, సర్వశక్తుడు, సర్వములో సర్వముగా యున్నాడు. ఆయనే ఆది మరియు అంతము. ఆ గొర్రెపిల్ల యోగ్యుడు! ఆయనే స్వయంగా మన రక్షణను తీసికొని వచ్చుట ద్వారా తన యొక్క యోగ్యతను రుజవు చేసెను. ఇప్పుడు, ఆయన తన యొక్క శక్తియంతటి తోను, మహిమయంతటి తోను నిలబడియున్నాడు. న్యాయాధిపతిగా సమస్త అధికారము ఆయనకు అప్పగించబడియున్నది.
అవును, ఆయన దీపస్తంభముల మధ్యను నిలబడియున్నాడు, ఆయన చేతిలో నక్షత్రములున్నవి. అది రాత్రి, ఎందుకనగా మనము దీపములను అప్పుడే వెలిగించుదుము, ఆ సమయములోనే నక్షత్రములు ప్రకాశించుటను చూచెదము, అవి సూర్యుని యొక్క వెలుగును ప్రతిబింబించుచుండును. అది చీకటి సమయము. సంఘము విశ్వాసముతో ఆ చీకటిలో నడచుచున్నది. ఆమె ప్రభువు ఈ భూమిని విడిచి వెళ్ళెను, కాని పరిశుద్దాత్మ ఇంకను సంఘముగుండా ప్రకాశించుచున్నది. ఈ పాత పాపశపిత ప్రపంచములో వెలుగును ఇచ్చుచున్నది. ఆ నక్షత్రములు ఆయన యొక్క వెలుగును కూడా ప్రతిబింబించుచున్నవి. వారికున్న ఒకే ఒక వెలుగు ఆయన వెలుగు. ఎంత చీకటిగా యున్నది - ఆత్మసంబంధముగా ఎంత చల్లగా యున్నది! అయినను ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు వెలుగు, ప్రకాశము కలుగును, మరియు సంఘము శక్తితో నిండుకొనును, ఆయన ద్వారానే ఆయన కార్యములను చేయును.
యోహానువలెనె మనము కూడా ఆయనను ఒక క్షణము చూచిన చాలును. మనము ఏ రకమగు జనులముగా యుందుము! ఆ దినమున ఆయన ఎదుట నిలచి యుందుము.
నీవింకా ఆయనకు నీ జీవితమును ఇవ్వనియెడల, ఈ క్షణములో నీ హృదయమును దేవునివైపు త్రిప్పుము. నీవున్న చోటనే మోకరించుము, నీ పాపములను క్షమించమని ఆయనను అడుగుము. మరియు నీ జీవితమును ఆయనకు సమర్పించుము. ఆ తరువాత మనము ఆ ఏడు సంఘ కాలములను సమీపించుదము; మీకు ఆయన వాక్యమును బయలుపరచుటకు ఈ అయోగ్యుడగు దాసునికి దేవుడు సహాయము చేయునట్లుగా ప్రార్థించుచున్నాను.