ఎఫెస్సు సంఘ కాలము
సంఘ కాలములకు ఉపోద్ఘాతము
సంఘ కాలముల యొక్క వర్తమానమును మీరు పూర్తిగా అర్థము చేసికొనునట్లుగా ఆ యా సూత్రములను మీకు వివరించగోరుచున్నాను. వర్తమానికుల యొక్క పేర్లను, కాలముల యొక్క వ్యవధిని, ఇంకా అందులో ఇమిడియున్న ఇతర విషయములను నిర్ధారించుటకు నేను ఆ సూత్రములనే నియమించుకొంటిని.
ఈ సమయము వరకు నేను తీసికొనిన అన్ని విషయముల అధ్యయనము కంటె ఈ విషయ అధ్యయనము అతిప్రాధాన్యత కలిగినదయి యున్నందున పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కొరకు చాలా దినముల పాటు నేను దేవుని వెదకియున్నాను. అప్పుడు మాత్రమే నేను సంఘ కాలములను గురించిన లేఖనములను చదివియుంటిని. నాకు దొరికిన, పక్షపాతము లేకుండా వ్రాసిన అతి మంచి సంఘ చరిత్రకారుల వ్రాతలు చాలా నేను పరీక్షించియుంటిని. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇయ్యకుండా ఉండలేదు, వాక్యము మరియు చరిత్రను నేను చదువుచుండగా శతాబ్దముల నుండి సాగివచ్చుచున్న ఒక మాదిరి నా ముందు తెరువబడియుండుటను పరిశుద్దాత్మ సహాయము ద్వారా నేను చూచితిని. ఆ మాదిరి ఈ ప్రస్తుత దినమునకు కూడా చెందియున్నది.
ప్రభువు నాకు ఇచ్చిన ఒక తాళపు చెవి ద్వారా నేను ప్రతి కాలమునకు చెందిన ఒక వర్తమానికుని నిర్ణయించగలిగితిని. ఇది అతి లేఖనపూర్వకమైనది. వాస్తవానికి దీనిని బైబిలు యొక్క మూలరాయి అని పిలువ వచ్చును. దేవుడు ఎన్నడును మారడను ప్రత్యక్షత అది. ఆయన మార్గములు కూడా ఆయన వలెనె మార్పులేనివైయున్నవి. హెబ్రి 13:8లో చెప్పబడినది.
"యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు."
ప్రసంగి 3: 14,15
"దేవుడు చేయు పనులన్నియూ శాశ్వతములని నేను తెలిసికొంటిని. దానికేదియు చేర్చబడదు. దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగియుండునట్లదేవుడిట్టి నియమము చేసియున్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును. జరుగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరల రప్పించును."
ఇక్కడున్నది చూడండి. మార్పులేని దేవుడు మార్పులేని విధానములను కలిగియున్నాడు. ఆయన మొదట చేసినదానినే చివరి వరకు చేయుచూ యుండవలసియున్నాడు. ఎన్నడును మార్పు చేయడు. సంఘ కాలములకు దానిని అన్వయించుము. దేవుడు మొదటి సంఘ కాలమునకు ఏ రకమైన మనుష్యుని ఎన్నుకొనునో మరియు ఆ వ్యక్తి యొక్క పరిచర్యయందు దేవుడు ఎట్లు బయలుపరుచుకొనునో అవి ఇతర కాలములకును ఉదాహరణయై యున్నవి. దేవుడు మొదటి సంఘ కాలములో ఏమి చేసెనో దానినే ఆయన అన్ని ఇతర కాలములలోను చేయగోరుచున్నాడు.
పరిశుద్దాత్మ ద్వారా నమోదయియున్న వాక్యము నుండి మొదటిది మరియు ఆదిమ సంఘము ఎట్లు కనుగొనబడెనో, దానిలో దేవుడు తన్నుతాను ఎట్లు బయలుపరచుకొనెనో మనకు ఖచ్చితంగా తెలియ చేయబడినది. వాక్యము మారలేదు. దానికి మారు గుణము లేదు, ఎందుకనగా వాక్యము దేవుడై యున్నాడు. యోహాను 1:1.
''ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను.''
అవ్వవలె దానిలో ఒక్క మాట మార్చినా గాని పాపము మరియు మరణము సంప్రాప్తించును. ప్రకటన 22:18-19 లో కూడా చెప్పబడియున్నది.
"…ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా — ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును.ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలులేకుండా చేయును."
ఆ విధముగా పెంతెకోస్తు యొద్దనున్న సంఘమే ప్రామాణికముగా యున్నది. అదియే మూల నమూనా మరియొక మాదిరి లేదు. పండితులు ఏమి చెప్పినా, దేవుడు ఆ మాదిరిని మార్చడు. దేవుడు పెంతెకోస్తు యొద్ద ఏమి చేసెనో దానిని సంఘ కాలములు పూర్తగు వరకు ఆయన కొనసాగించవలసియున్నాడు.
అపోస్తలుల యొక్క కాలము అయిపోయినదని పండితులు మీతో చెప్పవచ్చును, దానిని మీరు నమ్మవద్దు. ఆ వాదము రెండు విధములుగా తప్పు అని గ్రహించవచ్చును. మొదటగా, అపోస్తలులు ఇక ఉండరని అనుకొనుట తప్పు, ఎందుకనగా ఆ ఆది అపోస్తలులు పన్నెండు మంది చనిపోయిరి గనుక ఇక లేరని వారనుకొనుచున్నారు. అపోస్తలుడు అనగా 'పంపబడినవాడని అర్థము.' ఈనాడు పంపబడినవారు చాలామంది యున్నారు, కాని వారిని మిషసెరీలని మనము పిలచుచున్నాము. జీవవాక్యముతో జనులు పంపబడుటకు పిలుపును కలిగియున్నంతవరకు అపోస్తలుల యుగము కొనసాగుచున్నట్లే గ్రహించవలెను.
రెండవదిగా, పరిశుద్దాత్మ శక్తి ప్రత్యక్షత్ర పొందిన ఒక కాలమునకు వారు చూపబడియున్నారు. బైబిలు పూర్తి అయి పోయినదని వారు చెప్పుచున్న మాట నిజము కాదు. ఏ ఒక్క వాక్యము కూడా ఆలాగున చెప్పుట లేదు, కాని చాలామంది వేరే విధంగా చెప్పుచున్నారు. ఈ రెండు వాదములు తప్పు అని చెప్పుటకు ఇక్కడ రుజువులున్నవి. అపోకా 2:38,39.
"పేతురు - మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందెదరు.ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్దులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను."
ఈ వాగ్దానము యొక్క శక్తితో అపోస్తలులు పెంతెకోస్తు యొద్ద నింపబడి, "మీకును (యూదులు) మీ పిల్లలుకును (యూదులు) దూరస్తులందరూకును (అన్యులు) అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలచిన వారికందరికిని చెందును (అనగా యూదులు మరియు అన్యులు ఇద్దరును)." ఆయన పిలుపును ఆపనంత వరకును పెంతెకోస్తు వర్తమానము మరియు శక్తి నిలచిపోదు.
పెంతెకోస్తు యొద్ద సంఘము పొందినది అన్యాక్రాంతము కాని ఆమె యొక్క హక్కు అయియున్నది. ఆమెకు పవిత్రమైన దేవుని యొక్క వాక్యము ఆది నుండియూ యున్నది. ఆమెకు ఆత్మ యొక్క శక్తి వివిధ సూచక క్రియులు, అద్భుతములు, పరిశుద్ధాత్మ యొక్క వరములు ద్వారా బయలుపరచబడుచూ యున్నది. హెబ్రి 2:1-4,
"కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు, న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా;ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము; అట్టి రక్షణ ప్రభువు బోధించుటచేత ఆరంభమైదేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, ఏవిధములైన పరిశుద్దాత్మ వరములను అనుగ్రహించుట చేతను, వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారిచేత మనకు ధృడపరచబడెను."
ఆ మూల సంఘము మానవుల ద్వారా స్థాపించబడలేదు. అది పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినది. అది చాలా పెద్దది కాదు. దానిని ద్వేషించి తృణీకరించిరి. దానిని అణచివేసిరి. మరణము వరకు వారు హింసించబడిరి. కాని అది దేవుని పట్ల నమ్మకముగా యుండెను. ఆది వాక్య మాదిరితో నిలచియుండినది.
ఇక్కడ మీరు తప్పు త్రోవ పట్టవద్దు. దేవుడు మరియు ఆయన యొక్క మార్గములు ఎన్నడునూ మారవు అని నేను చెప్పాను. సంఘము మరియు దాని యొక్క వర్తమానికులు మారరని నేను చెప్పలేదు. సంఘము దేవుడు కాదు. కాబట్టి ఆమె మారును. కాని నేను చెప్పిన దానిని వినండి. దేవుడు మారనివాడు ఆయన మార్గములు మారవు కాబట్టి మనము ఆది యొద్దకు వెళ్ళి పరిపూర్ణమగు దేవుని మొదటి కార్యమును చూడవలెను. ఆ ప్రమాణము బట్టి దానిని తీర్పుచేయవలెను. ఆ విధముగానే ఇది జరిగియున్నది. నిజమగు సంఘము ఎల్లప్పుడు కూడా ఆదియందు పెంతెకోస్తు యొద్దనున్న సంఘమువలెనె యుండుటకు ప్రయత్నించుచున్నది. ఈనాటి నిజ సంఘము ఆ మొదటి ఆది సంఘమును ప్రామాణికముగా తీసికొనుచున్నది. సంఘములకు వర్తమానికులు అదే దేవుని యొక్క ఆత్మను తమలో కలిగియుండి, అపోస్తలుడగు పౌలును తమ ప్రమాణముగా తీసికొనుటకు ప్రయత్నించుచున్నారు. వారు ఖచ్చితంగా ఆలాగు ఉండరు. కాని నిజమగు వర్తమానికులు పౌలుకు దగ్గరగా వచ్చుటకు ప్రయత్నించెదరు. అతడు మనుష్యులకు దాసుడు కాడు, దేవునికి అమ్మబడినవాడు, దేవుని వాక్యమును మాత్రమే ఇచ్చెను. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బయలుపరచెను. మరెవరును ఆలాగు ఉండలేదు. ఆరంభము ద్వారానే మీరు పనిచేయవలసియున్నారు. ఏ జాతికి చెందినది ఆ జాతి దానినే తిరిగి పుట్టించును. నిజ సంఘము ఎల్లప్పుడును పెంతెకోస్తు యొద్ద తమ సంస్థాపకుల యొక్కఅడుగుజాడలనే వెంబడించుటకు ప్రయత్నించును. ఆమె యొక్క వర్తమానికులు మొదటి వర్తమానికుడగు అపోస్తలుడగు పౌలును వెంబడించుటకే ప్రయత్నించెదరు. అతడు మొదటి సంఘమునకు వర్తమానికుడు. అది చాలా సూక్ష్మము మరియు అద్భుతము
ఈ సూక్ష్మముగానున్న తాళపు చెవితో నాకు ఇది సాధ్యమయినది. ఇది చాలా అద్భుతమైనది. పరిశుద్దాత్మ యొక్క సహాయము ద్వారా ప్రకటన గ్రంథమును చదివాను. చరిత్రలు చదివాను మరియు ప్రతి కాలమును ఆ విధంగా కనుగొన్నాను, ప్రతి వర్తమానికుని కనుగొన్నాను, ప్రతికాలము యొక్క వ్యవధిని కనుగొన్నాను. ప్రతివారును, అనగా పెంతెకోస్తు మొదలుకొని ఈ కాలముల సమాప్తము వరకు ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఉద్దేశ్యమును ఎట్లు నెరవేర్చిరో చూచాను.
నిజమగు సంఘమును ఎట్లు కనుగొందువో ఇప్పుడు మీరు అర్థము చేసికొని యున్నారు. (ఆమె పెంతెకోస్తు యొద్ద ఎట్లున్నదో, అపోస్తలుల కాలములో ఎట్లున్నదో, అపోస్తలుల కార్యముల గ్రంథములోని వాక్యమును బట్టి చూచెదము) సంఘము యెట్లు తప్పిపోయినదో కూడా అదే సూత్రమునుపయోగించి చూచెదము. ప్రధానమగు పొరపాటు లేదా తప్పులు మొదటి సంఘములోనికి ఎట్లు చొరబడినవో అపోస్తలుల కార్యముల గ్రంథములోను, మరియు ప్రకటనలోను, మరియు పత్రికలోను మరింత ఎక్కువగా మరియు మరింత దృశ్యకరముగా ప్రతీ కాలములో నుండి ఈ చివరది యగు లవొదికయ కాలములో ఆ పూర్ణమగు సత్యము సంపూర్తియగు వరకూ బయలుపర్చబడును.
ఇప్పుడు ప్రభువు నుండి మనము పొందిన ఈ మొదటి తాళపుచెవి వలన మరియొక అద్భుతమగు సత్యము బయటకు వచ్చుచున్నది. కానీ ఇది మరీ అంత ఆశ్చర్యకరముగా యుండకపోవచ్చును. నిజసంఘము ఎల్లప్పుడును అపోస్తలుల కార్యముల గ్రంథములో యున్నట్లుగానే యుండును. ముందే ఈ విషయమును నేను చెప్పాను. ఇది అక్షరాలా నిజము. పొరపాటు దండెత్తి వచ్చుట గూర్చి కూడా వాక్యము బోధించుచున్నట్లు మనము కనుగొనియున్నాము. చివరి దినము వచ్చుసరికి పూర్తి అంధకారము అలముకొనుట అనగా సత్యము పూర్తిగా కనుమరుగవుట గమనించుదుము. ఈ సమయములోనే ప్రభువు ప్రత్యక్షమవును. ఇప్పుడు మన మనస్సులలో ఒక ప్రశ్న తలెత్తును. దేవుడు తన స్వకీయులను విడనాడి వారు పూర్తి మోసములో పడునట్లుగా చేసెనా? అది ఎన్నడును జరుగదు. ఏర్పరచబడినవారు మోసపుచ్చబడరని మత్తయి 24:24లో స్పష్టముగా చెప్పబడియున్నది.
"అబద్ద క్రీస్తులు లేచెదరు, అబద్ధ ప్రవక్తలు లేచెదరు, గొప్ప అద్భుతములను, ఆశ్చర్య కార్యములను వారు చేసి చూపుదురు. సాధ్యమయితే వారు ఏర్పరచబడినవారిని కూడా మోసపుచ్చుటకు ప్రయత్నము చేయుదురు."
చూడండి మరి? దానికి జవాబు మన యెదుట తేటగా యున్నది. నిజమయిన సంఘమున్నది మరియు అబద్ధ సంఘమున్నది. నిజమైన ద్రాక్షావల్లి ఉన్నది మరియు అబద్ధ ద్రాక్షావల్లి ఉన్నది. అబద్ధ సంఘము, అబద్ధ ద్రాక్షావల్లి ఎల్లప్పుడును నిజ సంఘము యొక్క స్థానమును ఆక్రమించుటకు ప్రయత్నించును. ఏర్పరచబడిన వారు కాక తానే నిజమైనదానిననియు, అధికారముగల దానిననియు పోట్లాడును. నిజమైనదానిని చంపుటకు అబద్ధమైనది ప్రయత్నించును. అపోస్తలుల కార్యముల గ్రంథములో దానిని మనము చూడగలము, ఏడు సంఘకాలములలోను అదే జరిగియున్నది. ఆ యా పత్రికలలో ఆ విధముగానే మనము చూడగలము. ఆ విధముగానే అది యుండును. ఇప్పుడును ఆ విధముగానే యున్నది. ఆ విధముగానే ఉండబోవుచున్నది. అది మారదు.
ఇప్పుడు ఈ విషయములో మనము గందరగోళపడరాదని చాలా జాగ్రత్తగా యుండవలెనని కోరుచున్నాను. ఈ విషయమును అంగీకరింపవలెనని మనము ఆ నిజ వాక్యమును కోరుదుము. బైబిలులోని మొదటి గ్రంథమగు ఆదికాండము యొద్దకు మనము వెళ్ళుదుము. ఏదెను తోటలో రెండు వృక్షములున్నవి. ఒకటి మంచిది; ఒకటి చెడ్డది. ఒకటి జీవమును ఇచ్చెను, మరియొకటి మరణమును తెచ్చెను. దేవునికి ఆదియందు అర్పణలను ఇద్దరు కుమారులు అర్పించిరి. దానిని మరల చెప్పనివ్వండి. ఇద్దరును దేవునికి బలులు అర్పించిరి. ఆదికాండము 4:3-5,
"కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్వినవాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను.కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనెను."
ఒకడు దుష్టుడు (కయీను) అతని తండ్రివంటివాడు. (దుష్టుడు), హేబెలు ప్రభుని యెదుట నీతిమంతుడుగా యుండెను. ఒకే తల్లిదండ్రులకు శరీరరీత్యా జన్మించిన మరియొక ఇద్దరు పిల్లలను చూడండి. వారు ఇస్సాకు మరియు రిబ్కాలకు కవలలుగా పుట్టినవారు. ఒకడు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు మరియొకడు భ్రష్టుడు. ఇద్దరును దేవుని ఆరాధించిరి. అన్ని విషయములలోను వారు దేవునిని ఆరాధన చేసిరి. చెడ్డవాడు అన్ని విషయములలోను నీతిమంతుని దూషించెను, నీతిమంతుని అతడు హింసించెను. కొన్ని సందర్భములలో నీతిమంతుని నాశనము చేయుట కూడా జరిగియున్నది. కాని గమనించండి. వారిద్దరును కలిసి నాటబడిరి. వారు కలిసి జీవించిరి. వారిద్దరును దేవుని విషయములో గొప్పలు చెప్పుకొనిరి మరియు దేవుని ఆరాధించిరి.
ఈ ఉదాహరణలు ప్రభువు యొక్క ఉపమానమును చక్కగా వివరించి చూపించు చున్నవి. పరలోక రాజ్యము గూర్చి యేసు క్రీస్తు చెప్పిన ఉపమానము చూడండి. ఒకడు మంచి విత్తనములను చల్లిన వెంటనే శత్రువు వచ్చి మంచి విత్తనముల మధ్యనే, అనగా దేవుని విత్తనముల మధ్యనే ఆ గురుగులను చల్లినది. రెండు రకముల విత్తనములను చూడండి అవి రెండు రకముల మొక్కలు (ప్రజలు), ఇద్దరూ కలిసి ఎదిగారు. ఒకే భూమిలో యున్న బలమును ఆ రెండును లాగుకొనుచున్నవి. ఓకే సూర్యుని, ఒకే వర్షమును, ఇంకా ఇతర మేలులన్నింటినీ అవి రెండునూ పంచుకొనుచున్నవి. రెండునూ వాటి కాలములో కోత కోయబడు దశకు వచ్చియున్నవి. దానిని మీరు చూశారా? మనము సంఘ కాలములను మరియు ఆ తరువాత ముద్రలను గూర్చి అధ్యయనము చేయుదము గనుక ఈ సత్యములను ఎన్నడునూ మీరు మరచిపోరాదు. అన్నింటికన్నా మరచిపోరాని సంగతి మరియొకటి యున్నది, అదేమనగా, ఈ చివరి కాలములోనే గురుగులు కట్టలుగా కట్టబడి అగ్నితో కాల్చబడుటకు సిద్ధమగుచున్నవి. ప్రభువు గోధుమలను వేరుచేసి తన కొట్టులో సమకూర్చును.
ఈ ఆలోచనను మీరు చివరి వరకును మరచిపోరాదని కోరుచున్నాను, కాబట్టి మరో అడుగు ముందుకు వెళ్ళుదము. ఉజ్జీవముల యొక్క చరిత్రను ఎన్నడయినా మీరు చదివారా? ఉజ్జీవమనగా దేవుడు శక్తితో కదిలి వచ్చుటకు సూచన. దేవుడు కదిలిన ప్రతిసారి సాతాను కూడా కదలుచుండును. అది ఎన్నడునూ తప్పిపోదు. ఆ మహా వేల్పు ఉజ్జీవపు దినములలో (చాలామంది జనులకు ఇది తెలియదు), పిచ్చాసుపత్రులన్నియూ త్వరగా నిండిపోయినవి. అపవాది యొక్క గొప్ప శక్తి అక్కడ పని చేసినది, దేవుని నుండి జనుల దృష్టిని మళ్ళించుటకు సాతాను ఆ విధంగా చేసెను. వెస్లీ యొక్క దినములలో జనులు చాలా వింతయగు పనులు చేసినట్లు వ్రాయబడియున్నది. ఇది ఖచ్చితంగా సాతాను యొక్క పని, దేవుని యొక్క శక్తిని మరియు మంచితనమును వెక్కిరించునట్లు చేయుటకు ఈలాగు చేసెను. లూథరు దినములలో జరిగిన దానిని వినండి, రోమను కాథలిక్కు సంఘమును విజయవంతముగా ఎదిరించుటయే అతని యొక్క పరిచర్యలోని అద్భుతమని మనము తలంచరాదు. కాని అతడు మతి స్థిమితము కలిగి ఆ ఉన్మాదుల మధ్య నిలువగలుగుటయే గొప్ప అద్భుతము, ఎందుకనగా ఆ ఉన్మాదులు దయ్యపు ఆత్మల చేత నింపబడి, వాటి ద్వారానే నడిపించబడిరి. మీరు ఈ చివరి దినపు పరిచర్యను గూర్చి ఎరిగియున్నచో, అబద్ధపు ఆత్మలు, దుష్టపు ఆత్మలు ఆ విధముగానే దండెత్తుటను మీరు గమనించగలరు. అది ఆ విధముగానే యుండును. దానిని మీరు గ్రహించగలిగిన ఆత్మ సంబంధమగు మనస్సును కలిగియుందురని నేను నమ్ముచున్నాను. దానివలన ప్రయోజనము పొందవలెనని ఆశించుచున్నాను.
నిజమైన ద్రాక్షావల్లి, అబద్ధ ద్రాక్షవల్లి ఏకమగుచూ రెండు ఆత్మలు పనిచేయడం చూపించుకొనుచున్న ఈ అంశమును ముద్రించే ముందు మనము I యోహాను 4:1-4 మరియు యూదా 3, 4, 12 చూద్దాం.
"ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.యేసు క్రీస్తు శరీరధారియై వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు.ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో యున్నది.చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు (దేవుని ఆత్మ) లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు గనుక మీరు వారిని (క్రీస్తువిరోధి ఆత్మను) జయించియున్నారు."
యూదా 3,4,12.
"ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయ నాధుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.""వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు." (వీరు పరిశుద్దులు కారు. వారు ద్వారముగుండా వచ్చినవారు కారు. కాబట్టి వారు దొంగలు)
ఈ లేఖనములను బట్టి మనము దేనినీ కాదనలేము. నిజమగు సంఘము మరియు అబద్ధ సంఘము పెనవేసికొనినవి, కలిపి నాటబడినవి కాని విత్తనములు వేరు.
ఇప్పుడు, మీరు తెలిసికొనవలసియున్నది మరియొకటున్నదని నేననుకొనుచున్నాను. యోహాను ద్వారా ఉద్దేశించబడిన ఏడు సంఘములు ఆసియా మైనరులో యున్నవి మరియు అవన్నియూ అన్య సంఘములే. యెరూషలేము యొద్దనున్న సంఘముతో అతడు మాట్లాడుట లేదు. అది దాదాపుగా యూదులతో నిండియున్నది. కొద్దిమంది అన్యులు ఉండియుండవచ్చును. కారణమేమనగా దేవుడు యూదుల వైపునుండి అన్యుల వైపుకు తిరిగియున్నాడు. ఆ విధముగా సంఘకాలములన్నింటిలోను దేవుడు అన్యులతోనే వ్యవహరించుచున్నాడు, తన కొరకు ఒక అన్య వధువును పిలచుచున్నాడు. ఆ విధముగా సంఘ కాలములు ఏర్పడినవి. అన్యుల యొక్క సంపూర్ణత వచ్చియున్నది. అపో.కా. 13:44-48,
"మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను.యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి.అప్పుడు పౌలును, బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి — దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో, మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము.ఏలయనగా — నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను, అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి: మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడినవారందరు విశ్వసించిరి.
రోమా 11:1-8,
"ఆలాగైన యెడల నేనడుగునదేమగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడు.తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడినే మిగిలియున్నాను. నా ప్రాణము తీయజూచుచున్నారు, అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళూనని ఏడు-వేలమంది పురుషులను నేను శేషముగా ఉంచుకొనియున్నాను.ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క యేర్పాటు చొప్పన శేషము మిగిలియున్నది.అది కృపచేతనైన యొడల ఇకను క్రియల మూలమైనది కాదు, కానియెడల కృప ఇకను కృప కాకపోవును.అలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను; తక్కినవారు కఠిన చిత్తులైరి.ఇందు విషయమై — నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.
రోమా 11:25-29,
"సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠినమనస్సు కొంతమట్టుకు కలిగెను.వారు ప్రవేశించునప్పుడు — విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే, అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.సువార్త విషయమైతే వారు మిమ్ము బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులైయున్నారు.ఏలయనగా, దేవుడు తన కృపా వరముల విషయము లోను, పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు."
ఆసియా మైనరులో యున్న ఈ ఏడు సంఘములు కొన్ని ప్రత్యేక గుణలక్షణములు కలిగియున్నవి. తరువాత కాలములకు అవి పరిపక్వము చెందుట ప్రాచీన కాలము నుండియే ఉన్నది. అప్పుడవి విత్తనములుగా యుండి ఆ తరువాత పరిపక్వమై కోతకు సిద్ధముగా యున్నవి. యేసు కూడా అదే చెప్పెను.
"పచ్చని మ్రానుకు వారు ఈలాగు చేసినయెడల, ఎండిన దానికేమి చేయుదురో గదా?" లూకా 23:31.
ఎఫెసు సంఘ కాలమునకు వర్తమానముః
ప్రకటన 2:1-7
ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము — ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులులు కాకయే తాము అపోస్తులులమని చెప్పుకొనువారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు,నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదనియు నేనెరుగుదును.అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది.నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సు పొంది, ఆ మొదటి క్రియలను చేయుము, అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి; లేనియెడల, నేను నీ యొద్దకు వచ్చి, నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.అయితే ఈ ఒకటి నీలో యున్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడ వీటిని ద్వేషించుచున్నాను.చెవిగలవాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక! జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును.
వర్తమానికుడు
ఎఫెసు సంఘమునకు వర్తమానికుడు (దూత) అపోస్తలుడగు పౌలు. అన్యుల శతాబ్దమునకు అనగా మొదటి కాలమునకు, అతడు వర్తమానికుడని ఎవరయినా గాని అంగీకరించెదరు. అన్యులకు తలుపులను తెరచు అధికారము పేతురుకు ఇవ్వబడినప్పటికిని, వారికి అపోస్తలుడుగాను, ప్రవక్తగాను పౌలు ఎన్నుకొనబడెను. అతడు అన్యులకు ప్రవక్త-వర్తమానికుడు. అతడు తన ప్రవచనాత్మక కార్యము ద్వారా అన్యుల కందించవలసిన వాక్యప్రత్యక్షతను పూర్తిగా పొందుకొనేను. అతడు వారి యొక్క అపోస్తలిక వర్తమానికునిగా అధికారమును పొందియున్నాడు. యెరూషలేములోని ఇతర అపోస్తలులు కూడా దానిని అంగీకరించిరి. గలతి 1: 12-19,
"మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది.పూర్వముందు యూద మతస్తుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచునా పితరుల పారంపర్యాచారములందు విశేషాసక్తిగలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులుకంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని, నా నడవడిని గూర్చి మీరువింటిరి.అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడునేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచ ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రదించలేదు.నాకంటె ముందుగా అపోస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని, వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.అటుపైని మూడు-సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి, అతనితో కూడా పదునయిదు దినములుంటిని.అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని."
గలతీ 2:2.
"దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్ధమవునేమో లేక వ్యర్ధమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని."
గలతీ 2:6-9,
"ఎన్నికైనవారుగా ఎంచబడిన వారియొద్ద నేనేమియూ నేర్చుకొనలేదు, వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైనవారు నాకేమియూ ఉపదేశించలేదు.అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకప్పగింపబడెనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందినవారికిఅపోస్తలుడవుటకు పేతురునకు సామర్ద్యము కలుగజేసినవాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడుస్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును, తాము సున్నతి పొందినవారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివరమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.
రోమా 11:13,
"అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనైయున్నాను, నా పరిచర్యను ఘనపరచుచున్నాను."
మొదటి శతాబ్దము మధ్యలో ఎఫెసు యొద్ద సంఘమును పౌలు ప్రారంభించెను. ఇందువలన ఎఫెసు సంఘ కాలమునకు తేదీని నిర్ణయించుటకు సాధ్యమగుచున్నది. అది దాదాపుగా క్రీ.శ. 53.
అతని యొక్క పరిచర్య విధానము రాబోవు వర్తమానికులందరికిని ఒక మాదిరిని నెలకొల్పియున్నది. వాస్తవానికి దేవుని యొక్క ప్రతి నిజదాసునికిని మాదిరిని నియమించిన వాడు ఇతడే. అయితే మిగిలిన వారందరూ పౌలు యొక్క ఉన్నత స్థితికి చేరియుండక పోయినా, అతని యొక్క ప్రవచనాత్మక ఔన్నత్యము చాలా గొప్పది. పౌలు యొక్క పరిచర్యలో మూడు రకముల గుణములున్నవి మరియు దానిని ఈ క్రింద విధముగా చెప్పవచ్చును:
అన్నిటికంటె ముందుగా పౌలు వాక్యముపట్ల పూర్తి నమ్మకత్వమును కలిగియుండెను. వెల ఎంత చెల్లించవలసి వచ్చినా గాని అతడు దానినుండి తొలగిపోలేదు. గలతీ 1:8-9.
"మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవును గాక!మేమిది వరకు చెప్పిన ప్రకార మిప్పుడును మరల చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి ఎవడైనను మీకు ప్రకటించినయెడల, వాడు శాపగ్రస్తుడవును గాక"
గలతీ 2: 11-14,
"అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని."ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని, వారు రాగానే సున్నతి పొందినవారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడచుకొనకపోవుట నేను చూచినప్పుడు, అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా — నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనుల వలెనె ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు?"
I కొరింధీ 14:36-37,
"దేవుని వాక్యము మీ యొద్ద నుండియేబయలు వెళ్ళేనా? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా?ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మ సంబంధిననియైనను తలంచుకొనినయెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను."
పౌలుకు ఒక సంస్థ లేదని మీరు గమనించండి, గాని అతడు ఆత్మచేత నడిపించబడెను. ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలీయులను బయటకు రప్పించుటకు ఎట్లు మోషేను కదిపెనో, అ విధంగానే పౌలును కదిపెను. యెరూషలేము యొక్క ఆలోచన సభ పౌలును ఎన్నడూ బయటకు పంపించలేదు, అతని మీద వారికి ఏమీ అధికారము గాని, శక్తిగాని లేదు. దేవుడు మాత్రమే అతనిని బయటకు పంపెను మరియు నడిపించెను. పౌలు మనుష్యులకు సంబంధించిన వాడు కాడు గాని, దేవుని సంబంధియైయున్నాడు. గలతీ 1:1,
"మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును.
గలతీ 2:3-5,
"అయినను నాతో కూడా నున్న తీతు గ్రీస్తు దేశస్తుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు.మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తుయేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది.సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు."
రెండవదిగా అతని పరిచర్య ఆత్మ యొక్క శక్తితో నిండినదైయుండెను. అందువలన పలుకబడిన మరియు వ్రాయబడిన వాక్యము యొక్క ప్రత్యక్షత బయటపడుచుండెను. I కొరింధీ 2:1-5,
"సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని, జ్ఞానాతిశయముతో గాని, దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.నేను, యేసుక్రీస్తును అనగా, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటిని.మరియు బలహీనతతోను, భయముతోను, ఎంతో వణకుతోను మీ యొద్ద నుంటిని.మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను,జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్దాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.
అపో, కా, 14: 8-10.
లుస్త్రలో బలహీన పాదముగల యొకడు౦డెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై, యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.అతడు పౌలు మాటలాడుట వినెను: పౌలు అతని వైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి,నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు, అతడు గంతులు వేసి నడువసాగెను"
అపో.కా. 20:9-12.
"అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి, మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయినవాడై యెత్తబడెను.అంతట పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని — మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.అతడు మరల పైకి వచ్చి, రొట్టె విరచి పుచ్చుకొని, తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను.వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు, వారికి విశేషమైన ఆదరణ కలిగెను."
అపొ.కా. 28:7-9,
"పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను, అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిధ్యమిచ్చెను.అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను, రక్త భేది చేతను భాదపడుచు పండుకొనియుండెను: పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్ధన చేసి, ఆతని మీద చేతులుంచి స్వస్థపరచెను.ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడ వచ్చి, స్వస్థత పొందిరి."
II కొరింధీ 12:12,
"సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన, అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను."
మూడవదిగా, అతడు తనకు దేవుడిచ్చిన పరిచర్య యొక్క స్పష్టమైన ఫలమును కలిగియుండెను. II కొరింధీ 12:11,
"నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మొప్పు పొందవలసినవాడను; ఏలయనగా నేను ఏ మాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్టులైన ఈ అపోస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువవాడనుకాను."
I కొరింధీ 9:2,
"ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను, మీ మట్టుకైనను అపోస్తలుడనైయున్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?''
II కొరింధీ 11:2,
"దేవాసక్తితో మీయెడల ఆసక్తి కలిగియున్నాను: ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని.''అన్య గొర్రెలను మందలు మందలుగా తీసికొనివచ్చు పనిని పౌలు కలిగియుండెను. అతడు వాటిని మేపెను, వాటి కొరకు శ్రద్ధవహించెను. ఆ నీతి ఫలములను ఫలియించు వరకు ఎదురుచూచెను. అన్య వధువుని ఒక భాగముగా వారు ప్రభువును ఎదుర్కొనునట్లు సిద్ధపరచెను.
ప్రత్యక్షత ఇవ్వబడిన కాలమునకు ముందే పౌలు హతసాక్షిగా మరణించెనని చరిత్రగాధ తెలుపుచున్నది, కాని యోహాను అతనికి బదులుగా పనిని కొనసాగించుచుండెను. పౌలు తన పరిచర్య దినములలో ఏమి చేసెనో, అక్షరాలా ఇతడును దానినే చేసెను. ప్రత్యక్షత ఇవ్వబడక ముందే పౌలు మృతిపొందెను, కనుక ఇతడు ఎఫెసు సంఘ కాలమునకు వర్తమానికుడు కాదని అనుకొనరాదు. ప్రతి కాలము యొక్క వర్తమానికుడు వచ్చుటతోను, పోవుటతోను నిమిత్తము లేకుండానే ఆ కాలము అతని వలన ప్రభావితము చెందును. వాక్యప్రత్యక్షత కలిగిన సేవ ద్వారా దేవునికి ఆ కాలమును అతడు చూపించును. పౌలు అట్టి మనుష్యుడు.
ఎఫెసు పట్టణము
ఎఫెసు పట్టణము ఆసియాలోని మూడు అతి పెద్ద పట్టణములలో ఒకటియై యున్నది. క్రైస్తవ విశ్వాసమునకు అది మూడవ పట్టణమని తరచు దానిని పిలచెడివారు. మొదటిది యోరుషలేము, రెండది అంతియొక. ఇది చాలా ధనికమగు పట్టణము. ప్రభుత్వము రోమను గాని భాష మాత్రము గ్రీకు. యోహాను, మరియ, పేతురు, అంద్రేయ మరియు ఫిలిప్పు మొదలగువారందరూ ఈ అందముగు పట్టణములో సమూధి చేయబడిరని చరిత్రకారులు చెప్పుచుందురు. ఈ పట్టణములో నిజవిశ్వాసమును స్థాపించిన పౌలు మూడు-సంవత్సరములు మాత్రమే ఇక్కడ సంఘకాపరిగా యుండెను; కాని అతడు మందకు దూరముగా యున్నప్పుడు, ఎడతెగక వారిని జ్ఞాపకము చేసికొని వారి కొరకు ప్రార్థించుచుండెను. దాని యొక్క మొదటి బిషప్పు తిమోతీ. 1 తిమోతీ 1:1-3,
"మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తుయేసు యొక్క అపోస్తలుడైన పౌలు;విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి, శుభమని చెప్పి వ్రాయునది: తండ్రియైన దేవుని నుండియు, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండియు కృపయు, కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలచియుండవలెని హెచ్చరించుచున్నాను."
ఎఫెసు అను పేరునకు చాలా వింతయిన బహుళార్ధమున్నది. "గురి చూపుట" మరియు "విశ్రాంతి పొందుట," అను అర్ధమును కలిగియున్నది. ఈ కాలము యొక్క ఉన్నతమైన ఆశయములు ఆత్మ యొక్క సంపూర్ణతతో ప్రారంభించబడినవి. "దేవుని యొక్క లోతు,'' వైపు గురి కలిగి వారు దేవుని యందు ఉన్నతమగు పిలుపు కలిగియుండిరి, కాని వారు కొద్దిగా నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శింప ప్రారంభించిరి. ఆసక్తి చల్లారి యేసును వెంబడించుట వారిలో కనపడసాగినది. రానున్న కాలములకు అది ఒక అశుభ సూచన. సంఘమను పిలువబడు భౌతిక సాధనమును "సాతాను యొక్క అగాధములో'' ముంచుటకు అది ఒక నాందియైనది. అది విశ్రమించి దారి తప్పసాగినది. అప్పటికే ఆ కాలము వెనుకకు జారిపోయినదిగా ఉన్నది. అది దానియొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టియున్నది. ఎఫేసు సంఘ కాలములో నాటబడిన చిన్న విత్తనము ఒక దినమున తప్పు ఆత్మలో ఎదుగును. కొన్ని తప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలను ఆశ్రయించును. ఇది మానవ హేతుబుద్ధికి విఘూతమును కలిగించును, ఎందుకనగా ఆ చిన్న మొక్క క్రొత్త హవ్వ వలె (నూతన సంఘమువలె) కనిపించును. మరల ఆమె సాతాను ద్వారా మోసపుచ్చబడును. ఎఫెసుకాలము సంఘమునకు దేవుని యొక్క అత్యుత్తమ భాగమును ఇచ్చినది. ఆమె కొంతకాలము జయించి ఆ తరువాత నిద్రపోసాగినది. ఆ జాగ్రత్తపడని క్షణములోనే సాతాను వచ్చి పూర్తి పతనవిత్తనమును నాటిపోయినది.
ఎఫెసు యొక్క మతము, ఈ మొదటి కాలము ఆ రానున్న కాలములకు ఒక పరిపూర్ణ మాదిరిని చూపించుచున్నది. మొట్టమొదటిగా ఆ అతి సుందరమగు డయానా దేవాలయమును గమనించండి, దానిని ఎన్నో సంవత్సరముల పాటు నిర్మించిరి, అతి కళాత్మకముగాను మరియు పరిపూర్ణ నైపుణ్యముతోను మలచిన డయానా విగ్రహమును ఆ పవిత్ర ఆవరణలలో నిలువబెట్టిరి. ఈ డయానా ప్రతిమను ఊహతో మీరు చూడవచ్చును. ఆమె కొరకు ప్రతిష్టింపబడిన దేవాలయములు ఇంకా చాలా యున్నవి గాని, ఈ ప్రతిమతో పోల్చుటకు అవేవియూ ఎన్నతగినవి కావు. చెప్పవలెనన్నచో, ఆమె నిరాకారముగానున్న స్త్రీ రూపము. ఆమెను ఒక మ్రానులో చెక్కిరి. ఆమె యొక్క రెండు చేతులు రెండు మామూలు ఇనుప ఊచలతో చేయబడియుండెను. మొదటి కాలములో దిగివచ్చిన క్రీస్తువిరోధి ఆత్మకు ఇది ఎంతో మాదిరిగా చెక్కబడియున్నది. జనుల మధ్యకు అది విడుదల అయ్యెను. జనులను గందరగోళము చేయు ఏ ఆకారమును ఇంకా సంతరించుకొనలేదు, కాని దేవుని యొక్క కార్యమును చితుక ద్రోక్కుటకు ఆ రెండు ఇనుప చేతులు సూచనగా యున్నవి. వాడందుకు బాట వేయుచుండెను, ఎవరూ వానిని గమనించినట్లుగా కనబడలేదు. వాడు చేయుచున్నదానిని పట్టించుకొనలేదు. కాని ఒక దినమున వారు గమనించెదరు, ఆ ఇనుప చేతులు చేయు 'క్రియలు' ఒక దినమునకు "బోధ'' గా మారును. వానియొక్క బోధ ఆ సామ్రాజ్యము యొక్క చట్టముగా మారినది.
ఆలయ సేవా విధానము కూడా చాలా వింతగా యుండును. అన్నిటికంటె ముందు గమనించవలసినది ఆ యాజకులను, వారు నపుంసకులు. ఈ వంధ్యులకు. యూజకులు జనుల యొక్క వంధ్యత్వమునకు సూచనప్రాయముగా యున్నారు. వాక్యము నుండి తొలగిపోయినవారికి సూచన కనబడుచున్నది. తమకు దేవుడు తెలియునని ఆ జనులు చెప్పుకొనుచున్నారు గాని వాక్యము నుండి వారు తొలగిపోయి యున్నారు. వంధ్యులగు నపుంసకులవలెనె వీరును ఫలించనివారుగా యున్నారు. రెండవదిగా, ఆలయములో కన్యకలగు యాజకురాండ్రున్నారు, ఆలయములోని మత కార్యక్రమములను వారే జరిగించుదురు. పరిశుద్దాత్మ యొక్క స్థానమును ఆచారములు, సంప్రదాయములు, మత సంబంధమగు కార్యక్రమములు, పద్ధతులు ఆక్రమించు రాబోవు దినములకు ఇది హెచ్చరికగా యున్నది. దేవుని యొక్క ఆలయమును ఉల్లాసపరచు ప్రత్యక్షత ఇక నింపదు. వారందరి మీదను ఒక ప్రధాన యాజకుడున్నాడు. రాజకీయాధికారమును అతడు కలిగియున్నాడు. ప్రజల యొక్క పలుకుబడి అతనికుండినది. అప్పటికే పరిణామము చెందుచున్నదానిని అతడు ప్రదర్శించుచున్నాడు, అయితే ఇంకా పూర్తిగా బయలుపరచ బడలేదు. సంఘము త్వరలోనే మానవుని యొక్క నాయకత్వమునకు అప్పగించబడబోవుచున్నది. మానవుని యొక్క పథకములు మరియు మానవుని యొక్క ఆశలు చోటు చేసికొనవై యున్నవి. "పరిశుద్దాత్మ ఈలాగు సెలవిచ్చుచున్నది" అనుట ఇక ఆగిపోవును. అది ఒక సజీవ సత్యముగా ఇక ఉండబోవుట లేదు. ఆలయ బానిసలకు అది ఒక కేంద్రముగా యున్నది. వారికి ఇక వేరే మార్గము లేక ఆ మత పాలకులకు విధేయులయిరి. దీని యొక్క భావమును గ్రహించండి. ఒక దినము రాబోవుటను ఇది చూపించుచున్నది. అప్పుడు ఆ యాజకులు రాజకీయాధికారమును పొందుదురు. ప్రభుత్వ అండదండలను పొందుదురు. వాక్యమునకు మరియు ఆత్మకు బదులుగా ఆచారములను, మత విశ్వాసములను, మానవ నాయకత్వమును రూపొందించెదరు, విశ్వాసులను బానిసలుగా చేయుదురు. నాయకులు సుఖభోగములను అనుభవించెదరు. సిరిసంపదలతో తులతూగుదురు. తమ అపవిత్ర సుఖ సౌఖ్యములను అనుభవించుదురు. దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నడచుకొనుచున్న పేదవారు వారికి దాసులుగా మారుదురు.
యేసు, ఆయన వర్తమానికుడు మరియు సంఘములు
ప్రకటన 2:1,
"ఏడు నక్షత్రములను తన కుడిచేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్యసంచరించు వాడు చెప్పు సంగతులు."
ఈయన గూర్చియే ఈలాగు చెప్పబడియున్నది. 'ఈ యేసే ప్రభువును మరియు క్రీస్తు అయి యున్నాడు. ఆయన ఒక్కడే సర్వశక్తుడగు దేవుడు మరియు ప్రభువు అయి యున్నాడు. ఆయన తప్ప మరెవరునులేరు. ఆయనే రక్షకునిగాయున్నాడు. ("…రక్షణ యొహోవా నుండి కలుగును," యోనా 2:9) ఏడు సంఘకాలములలోను సంఘముల మధ్య నడచుచున్నాడు. ఆయన మొదటి సంఘకాలములో ఎట్లున్నాడో అన్ని సంఘకాలములలోను ఆ విధంగానే యున్నాడు. ప్రతి విశ్వాసికి ఆయన మారనివానిగా యున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఒకప్పుడు ఆయన ఏమి చేసెనో ఇంకా దానిని ఆయన చేయుచున్నాడు, మరియు ఇంకా చేయుచునేయుండును.
యేసు తన సంఘముల మధ్య ఒంటరిగా నడచుచున్నాడని మీరిచ్చట గమనించగలరు. ఆయనతో మరెవరును లేరు. ఎవరును నిశ్చయముగా ఉండజాలరు, ఎందుకనగా ఆయన మాత్రమే రక్షణను తీసికొని వచ్చెను. ఆయన ఆమెను తన స్వరక్తమిచ్చికొనెను. ఆమె ఆయన సొంతం. ఆమెకు ఆయనే ప్రభువు, యజమాని. ఆమె తన ప్రభువగు ఆయనకు సంపూర్ణ మహిమను ఇచ్చును మరియు ఆయన తన మహిమను మరెవరితోను పంచుకొనడు. ఆయనతో ఏ పోపు లేడు. ఆయనతో ఏ ఆర్చిబిషప్పు లేడు. ఆయన యొక్క శరీరసంబంధమగు తల్లియగు మరియ ఆయనతో కూడా లేదు. ఆయన ఒక తండ్రియగు వానిపైపు చూచి మాట్లాడలేదు, ఎందుకనగా ఆయనే తండ్రియైయున్నాడు. పరిశుద్ధాత్మకు ఆజ్ఞలు జారీచేయుటకు ఆయన వెనుదిరగలేదు, ఎందుకనగా ఆయనే దేవుడు, నిత్యుడగు ఆత్మయైయున్నాడు. సంఘములో ఆయన యొక్క జీవము ప్రవహించుచున్నది. సంఘమునకు నాడిగా యుండి జీవమును ఇచ్చుచున్నది. ఆయన లేకుండా ఏ జీవమును లేదు. రక్షణ ప్రభువు నుండియే కలుగును.
దేవుని యొక్క మహా తీక్షణమగు ఉగ్రత అను మధ్యపు తొట్టిని ఆయన త్రోక్కినప్పుడు ఎవరూ ఆయనకు జతలేరు. సిలువ మీద వ్రేలాడి రక్తమును కార్చినది ఆయన ఒక్కడే. మన విశ్వాసమునకు ఆదియు, అంతమును ఆయనే అయి యున్నాడు. మన రక్షణకు అల్ఫాయు, ఓమేగయు ఆయనే. ఆయనకు తప్ప మరెవరికిని మనము ప్రధానము చేయబడలేదు. మనము సంఘమునకు చెందియుండలేదు. మనము ఆయనకు చెందియున్నాము. ఆయన యొక్క మాటయే శాసనము. ఆచారములు, సిద్దాంతములు, విశ్వాస ప్రమాణములు రాజ్యాంగములు మన మీద ఎట్టి అధికారమును కలిగిలేవు. అవును సంఘముల మధ్య నడచుచున్నవాడు యేసు మాత్రమే. ఆమెలో దేవుడుండి ఆయన చిత్తమును, తన అనుకూలమును స్వేచ్చగా ఆమె యందు జరిగించుచున్నాడు. దానిని ఎన్నడును మరువరాదు. దేవునితో నీకు ఒకే ఒక్క సంబంధమున్నది. మరియు నీతో దేవునికి ఒకే ఒక్క సంబంధమున్నది — అదే యేసు, యేసు ఒక్కడే.
ఆయన యొక్క కుడి చేతిలో ఏడు నక్షత్రములున్నవి. కుడి చేయి లేదా హస్తము దేవుని యొక్క శక్తి మరియు అధికారమును సూచించును. కీర్తనలు 44:3,
"వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు: నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే, వారికి విజయము కలుగజేసెను."
ఆ కుడిచేతి యొక్క శక్తిలో ఏడు నక్షత్రములున్నవి. ప్రకటన 1:20, ప్రకారము వారు ఏడు సంఘములకు వర్తమానికులు. ప్రతి కాలమునకు ఆయన పంపిన వర్తమానికుల వెనుక శక్తి మరియు అధికారము ఉన్నదని ఇది సూచించుచున్నది. వారు పరిశుద్దాత్మ యొక్కయు, వాక్యము యొక్కయు శక్తితోను, మంటతోను బయలు వెళ్ళుచుందురు. వారు నక్షత్రములు, ఎందుకనగా వారు వెలుగును ప్రతిబింబించుచున్నారు. వారు ప్రతిబింబించుచున్న ఆ వెలుగు ఆయన యొక్క వెలుగు. వారికి స్వంత వెలుగు ఏమీ లేదు. జనులు వారియొక్క అగ్నిజ్వాలల వెలుగులో నడుచుటకు వారు తమ స్వంత అగ్నిజ్వాలలను రాజేయుట లేదు. యెషయా 50:11, అది రాత్రి సమయము. అప్పుడే నక్షత్రములు బయటకు వచ్చును. ఇది పాపము యొక్క చీకటి రాత్రి. (సర్వ ప్రపంచమును) ఏలయనగా అందరును పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోవుచున్నారు. రోమా 3:23.
ఈ ఏడుగురు వర్తమానికులు జనులకు దేవునిని తెలియపరచుచున్నారు. వారిని చేర్చుకొనువాడు వారిని పంపినవానిని చేర్చుకొందురు. యోహాను 13:20. ఆయన యొక్క అధికారము బట్టి వారు మాట్లాడుచూ పనిచేయుచుందురు. దేవత్వము యొక్క శక్తి అంతటితో ఆయన వారి వెనుక నిలిచియున్నాడు. మత్తయి 28:18-20,
"అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును, భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి యున్నది.కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాప్తిస్మమిచ్చుచునేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను? (కాలముల అంతం వరకును)."
ఆ విధముగా అక్కడ, వారు పరిశుద్దాత్మతో నిండినవారై యుండి, విశ్వాసము కలిగి అగ్నివలె మండుచుండిరి. సత్య వాక్యమును చేతపట్టుకొని యుండిరి మరియు ఆయన వారి వెనుక నిలబడి వారిని బలపరచుచుండెను. దానిని గూర్చి ఆలోచించండి, ఏ కాలములోని విశ్వాసి కూడా తన హృదయములో ఈలాగున కేక వేయవలసిన అవసరము లేదు, "అపోస్తలులు మొదటగా పంపబడిన ఆ మొదటి కాలములో నేనుండిన బాగుండియుండును.? వెనుకకు చూడవలసిన అవసరము లేదు. పైకి చూడు! అన్ని కాలములలోను ఉండు, సంఘముల మధ్య నడచుచున్న ఆయనను చూడుము. ఇప్పుడు కూడా ఆయన నడచుచున్నాడు. నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్న ఆయన వైపు చూడుము. ఆయన తన యొక్క మార్గములలో గాని, దేవత్వములో గాని మార్పు లేనివాడు. ఎక్కడ ఆయన నామములో ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్యను ఆయన నిలచియుండును. వారి మద్య ఆయన కేవలము ప్రేక్షకునిగా నిలచియుండుట కాదు గాని, లేదా రికార్డు చేయు దూతగా కాదు; కాని ఆయన తానేమైయున్నాడో దానిని బయలుపరచుచు నిలబడియున్నాడు. ఆయనే సంఘమునకు జీవమును, పోషకుడును, సమస్త మంచి ఈవులను అనుగ్రహించువాడైయున్నాడు. హల్లెలుయా!
"ఏడు సువర్ణ దీప స్తంభముల మద్య ఆయన నడచుచున్నాడు" లేఖనము యొక్క వెలుగులో ఆ మాటలను సమీక్షించినప్పుడు ఎంత అర్ధవంతముగా కనబడుచున్నవి! "క్రీస్తే మన జీవమైయున్నాడని" ఆ మాటలు వివరించుచున్నవి. క్రీస్తే నిశ్చయముగా సంఘమునకు జీవమై యున్నాడు. ఆమెకు మరియొక జీవము లేదు. ఆయన లేకుండయున్నయెడల ఆమె కేవలము ఒక సమాజము లేదా మత-తెగగానే మిగిలియుండును. ఆయన లేని గుంపును ఒక క్లబ్ లేదా అర్ధము లేని ప్రజా కూడిక అని మనము చెప్పవచ్చును క్రీస్తు లేకుండా అది శవము గానే పిలువబడును. ఆ విధముగానే సంఘమునకు ఎన్నో కార్యక్రమములు ఉండవచ్చును, ఎన్నో ప్రేమ లేదా దయ చూపించు కార్యములను చేయుచుండ వచ్చును, ఏవేవో సాధించియుండవచ్చును, కాని క్రీస్తు లేనియెడల ఆమె శవము గానే మిగిలియుండును. కాని ఆమె మద్యన ఆయన యుండినయెడల, ఆయన యొక్క నడిపింపును ఆమె కలిగియుండినయెడల ఆమె అందరిలోనూ సుందరమైనదగును. "ఆయన శరీరము, ఆయన యొక్క సంపూర్ణత సర్వమును నింపును." ఈ ఘడియలోనే ఆయన ఈ చివరి యుగపు సువర్ణ దీప స్తంభము మద్య నడచుచున్నాడు. ఆయన మొదటి సంఘ కాలములో ఏ విధముగా నడిచెనో ఆ విధముగానే ఈ చివరి సంఘకాలములోను నడచుచున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
"ఏడు సువర్ణ దీప స్తంభములు" నిర్గమ కాండము 25:31లో ఇట్లు చెప్పబడినది,
"మరియు నీవు మేలిమి బంగారుతో దీప వృక్షమును చేయవలెను. నకీషీ పనిగా ఈ దీప వృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏ కాండమై యుండవలెను."
యేసుక్రీస్తు యొక్క నిజ సంఘము, వధువు, మేలిమి బంగారముతో పోల్చబడియున్నది. ఆమె యొక్క నీతి ఆయన యొక్క నీతియే. ఆమె యొక్క గుణ లక్షణములు, ఆయన యొక్క సొంత మహిమకరమైన గుణ లక్షణములు. ఆయన లోనే ఆమె యొక్క గుర్తింపును మనము కనుగొనగలము. ఆయన ఎమైయున్నాడో, దానినే ఆమె ప్రతిబింబించ వలసియున్నది. ఆయన కలిగియున్న దానిని ఆమె బయలుపరచ వలసియున్నది. ఆమె యందు ఏ లోపములేదు. ఆమె బయట, లోపట కూడా మహిమతోనే నిండియున్నది. ఆది నుండి అంతము వరకు ఆమె ప్రభువు యొక్క పనియైయున్నది. ఆయన యొక్క పనులన్నియు పరిపూర్ణములు. నిత్య జ్ఞానము మరియు దేవుని యొక్క ఉద్దేశ్యము వాస్తవానికి ఆమెలోనే గుప్తమైయుండి బయలుపడుచున్నవి. దానిని ఎట్లు కొలత వేయగలరు? దానిని ఎవరైనాఎట్లు గ్రహించగలరు? మనము దానిని చేయలేనప్పటికినీ దానిని మనము విశ్వాసము ద్వారా అంగీకరించుచున్నాము, ఎందుకనగా దానిని దేవుడు పలికెను.
అది బంగారు దీప వృక్షము మాత్రమే కాదు గాని నకిషీ బంగారమైయున్నది. నకిషీ చేయబడిన అల్లిక పనియైయున్నది. ఆత్మ అనుగ్రహించిన నమూనా చొప్పున అది చేయబడియున్నది. ఆమె యొక్క ప్రభువు, యజమాని మరియు యేసుక్రీస్తులో నుండి జనులు నకిషీ చేయబడి వచ్చుచున్నారు. యేసుక్రీస్తు యొక్క వధువుగా రూపముదిద్దుకొని వచ్చుచున్నారు. క్రీస్తు పొందగా మిగిలిన శ్రమలను నిశ్చయంగా ఆమె నేరవేర్చుచున్నది. ఆమె యొక్క సామాగ్రి చెల్లాచెదురు చేయబడినది. ఆమె యొక్క జీవితము ఆపదలో యున్నది. వధకు కొనిపోబడుచున్న గొర్రెతో ఆమె పోల్చబడియున్నది. దినమంతయూ ఆమె చంపబడుచున్నది. ఆమె చాలా శ్రమపడుచున్నది, అయిననూ ఆమె దానంతటకీ ప్రతీకారము చూపుట లేదు. ఇతరులకు కూడా ఆమె శ్రమ కలిగించుట లేదు. క్రీస్తు యొక్క ఈ ప్రియమగు వధువు సువార్తకు యోగ్యురాలుగా యున్నది. బంగారమును సాగగొట్టినప్పుడు విరుగదు, కాని ఇత్తడి విరిగిపోవును. ఈ దేవుని యొక్క బంగారము తన ప్రభువు కొరకు శ్రమననుభవించును, వంగిపోదు, విరిగిపోదు, నాశనము కాదు, కానీ ఈ జీవితములో ఎదురగు పరీక్షలు మరియు శోధనల వలన నిత్య సంతోషమును అనుభవించును మరియు అందమగు వస్తువుగా రూపుదిద్దుకొనును.
క్రీస్తు తన స్వంతవారిని పొగడుచున్నాడు
ప్రకటన 2:2,3,
"నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొనువారని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు,నీవు సహనము కలిగి, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును."
రక్షకుడు తన పిల్లలను ఎంత చక్కగా పొగిడి ఘనపరచుచున్నాడో చూడండి. వారి యొక్క చక్కని ఆత్మసంబంధమగు వైఖరిని మరియు ప్రవర్తనను ఆయన పూర్తిగా లెక్కలోనికి తీసికొనియున్నాడు. వారి మధ్య బలహీనత యున్నదని ఆయన ఎరుగును, అయిననూ ఆయన వారిని గద్దించుట లేదు. ప్రభువు అటువంటి వాడు కాడా? మనము మంచి క్రియలను జరిగించినప్పుడు ఎట్లు ప్రోత్సహించవలెనో, చెడ్డ క్రియలను చేసినప్పుడు ఎట్లు నిరుత్సాహపరచవలెనో ఆయనకు తెలియును. సంఘములను నడిపించుటలోను, మరియు కుటుంబములను నడిపించుటలోను మనకందరికి అవసరమగు ఒక మంచి పాఠము ఇచ్చటున్నది. ఇంకా శ్రద్ధగా నేర్చుకొనవలసిన పాఠమేదనగా, దేవుడు ప్రతి ఒక్కరితోను ఆ విధముగానే వ్యవహరించుననునదియే. దేవుని పరిశుద్దులారా, ఎన్నడునూ నిరుత్సాహము చెందవద్దు. దేవుడు నీ ప్రేమ ప్రయాసలను మరచిపోవునంత దయలేనివాడు కాడు. మనము ఏమి చేసినా గాని, ఎవరికయినా ఒక గిన్నెడు చల్లని మంచినీళ్ళు ఇచ్చినా గాని, ప్రభువు యొద్ద నుండి బహుమానమును, ప్రతి ఫలమును పొందుదుము.
"నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును." ఆయన తన సంఘము మధ్య నడచుచున్నాడు గనుక ఆయనకు తన ప్రజల కష్టము తెలియును. అందుకే శ్రద్ధ వహించుచున్నాడు. ఐగుప్తు దేశము యొక్క చెరలో వారుండినప్పుడు, ఆయన వారి మొరను వినెను. ఎన్నడూ మారని ఆయన తృణీకరింపబడుచున్నవారి మొరలను ఇంకా వినుచునేయున్నాడు, ఎందుకనగా ఆయన వారి మధ్య నడచుచున్నాడు. కష్టము అను మాట అణిచివేత ద్వారా కలుగు ఆయాసమును చూపించుచున్నది. ప్రేమ ద్వారా ఆయన కొరకు దేవుని ప్రజలు కష్టించుట మాత్రమే కాదు గాని, వారాయన కొరకు ఆనందముతో శ్రమపడుదురు. కాడిని మోయుటలో వారు సహనము చూపింతురు. ఈ మొదట కాలము మహాశ్రమను సహించెను. సువార్తను ప్రకటించుటకు మరియు సత్యము చాటించుటకు అది చాలా కష్టపడి పని చేయవలసి వచ్చెను. వారు జీవితములలో దేవునిని సేవించుటకు ఉన్నత పిలుపును కలిగియుండిరి. తమ జీవితములోని ఆశలు అడుగంటినప్పుడు వారు సహనము కలిగియుండి, సమస్తమును వాగ్దానము చేసిన ఆయనకు అప్పగించియుండిరి. ఆయన కొరకు ఈ భూమి మీద వారు దేనిని పోగొట్టుకొందురో దానికి పరలోకమందు గొప్ప ప్రతిఫలము కలుగునని ఆయన వాగ్దానము చేసెను.
ఇక్కడ మనము ఆగి దేవుని ప్రజలు ఎప్పుడును ఎందుకు శ్రమననుభవించ వలసివచ్చుచున్నదో ఆలోచించుదము. ఇంతకు ముందును వారు శ్రమపడిరి. ఆది కాండమే అన్ని గ్రంథములకు ప్రారంభము, అక్కడ ప్రారంభమైనది ప్రకటన వరకు కూడా కొనసాగి వచ్చుచుండును మరియు ఎన్నటికి మారదు. కయీను అక్కడ హేబేలును హింసించి చంపెను, ఎందుకనగా హేబెలు దేవునిని సంతోషపరచెను. ఆ తరువాత మరియొక సంపూర్ణ దృశ్యమును శరీరసంబంధముగా అబ్రహామునకు జన్మించిన కుమారుడగు ఇష్మాయేలు వాగ్దానమూలముగా జన్మించిన కుమారుడగు ఇస్సాకును హింసించి అల్లరి చేసిన సందర్భములో చూచెదము. ఏశావు యాకోబును ద్వేషించి చంపగోరెను, దేవుడు అడ్డుపడనియెడల చంపియుండెడి వాడే. క్రొత్త నిబంధనలో యూదా యేసును అప్పగించుట చూచెదము. మొదటి శతాబ్దములోని మత శాసనములు, ఆది కాలపు విశ్వాసులను నాశనము చేయుటకు ప్రయత్నములు చేసినవి. ఈ లోకసంబంధులు అపవాది యొక్క అధీనములో యుండి, ఆత్మ యొక్క ఆధీనములో యుండిన దేవుని పిల్లలను ద్వేషించుచున్నారు.
జనుల ఎదుట ఒక క్రైస్తవుడు ఎంత యధార్థముగా, నీతిమంతునిగా యున్నాగాని, తన తోటివారిపట్ల ఎంత దయను చూపించుచున్నాగాని మేలు తప్ప మరేమియూ చేయుకున్నాగాని అతడు క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించియున్నాడు. పరిశుద్దాత్మ యొక్క వరములను, అనగా భాషలు మాట్లాడుట, ప్రవచించుట, స్వస్థత మరియు అద్భుతములు మొదలగు వానిని అంగీకరించినందున అతనిని ఖండించుచుందురు. ఈ లోకపు ఆత్మ దేవుని ఆత్మను ద్వేషించును, ఎందుకనగా ప్రభువు యొక్క ఆత్మను అది జయింపజాలదు. అందుకని సత్య ఆత్మ ఏ పాత్రలో నివాసము చేయునో ఆ పాత్రను నాశనము చేయుటకు ప్రయత్నించును.
హింసలు మరియు శోధనలు సాధారణమైనవే, క్రైస్తవ జీవితములలో అవి ఒక సామాన్యభాగమైయున్నవి. వాటి విషయములో నీవు చేయవలసినది ఒకే ఒకటున్నది. వాటినన్నింటిని దేవునికి అప్పగించుము, తీర్పు తీర్చవద్దు, వాటి యొక్క ఫలితములను, తుది తీర్పును ఆయనకే విడిచిపెట్టము.
"నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొనువారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి." దేవుని యొక్క ప్రజలు పరిశుద్ధముగా యుండవలెనని ఈ ఎఫెసు వారు నమ్మిరి. ఈ వాక్యము ప్రకారము వారు శరీరము పాపముచే పులియబడనిదానిగా యుండుటకు కొన్ని మొట్లు ఎక్కినట్లు అర్థమగుచున్నది. విశదముగా తెలిసికొనవలసిన సంగతి ఏమనగా విశ్వాసభ్రష్టత్వము ముందే ఆరంభమయినది. సంఘములోనికి పాపము ప్రవేశించెను, కాని వారు పౌలు చెప్పిన మాటకు లోబడిరి. వారి మధ్యనుండి దుష్టులను తొలగించిరి. వారు ఒక ప్రత్యేకమగు జనులుగా యున్నారు. వారు లోకములో నుండి బయటకు వచ్చియున్నారు, మరియు ఇప్పుడు వారు తమలోనికి లోకము ప్రవేశించుటకు చోటియ్యుట లేదు. వారు సంఘములో పాపమును నిలిచియుండనిచ్చుట లేదు. పరిశుద్ధత అను మాట వారికి ఒక ఊతపదము కాదు లేదా అలంకార పదము కాదు, అది వారియొక్క జీవన విధానము.
"అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని నీవు పరీక్షించివారు అబద్ధికులని నీవు కనుగొంటివి." మై, అది చాలా సూటియైన వచనము. "తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని నీవు పరీక్షించితివి." అది గొప్ప కాదా? తాము అపోస్తలులమని చెప్పుకొనుచున్నవారిని పరీక్షించు హక్కు ఎవరికున్నది? వారెట్లు పరీక్షించిరి? ఓ, ఇది నాకు ప్రియమైనది. గలతీ 1:8లో అది ఉన్నది.
"మేము మీకు ప్రకటించిన సువార్త కాక, మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవును గాక. (ముందే బోధింపబడినది)."
జనులకు అసలు వాక్యమును బోధించినవారు అపోస్తలులు. ఆ మూల వాక్యము మారనేరదు, దానిలోని ఒక పాలు లేదా సున్న కూడా మారదు. తనతో మాట్లాడినవాడు దేవుడేనని పౌలుకు తెలియును, అందుకే అతడాలాగు పలికెను. "నేను మరల వచ్చి నాకు రెండవ ప్రత్యక్షత దొరికినది గనుక ముందే నేను చెప్పిన దానిలో కొద్దిగా మార్పు చేయుదునని అతడు చెప్పినా శాపగ్రస్తుడగును."చూడండి, మొదటి ప్రత్యక్షత సరియైనదని పౌలుకు తెలియును. ముందు ఒక ప్రత్యక్షతను, ఆ తరువాత రెండవ ప్రత్యక్షతను దేవుడు ఇయ్యడు, ఆలాగు చేసినయెడల ఆయన తన మనస్సును మార్చుకొనినట్లే. ఆయన ఒక ప్రత్యక్షతను ఇచ్చి దానికి మరొకటి చేర్చును. ఏదెను తోటలో ఆయన దానినే చేసెను. స్త్రీ యొక్క సంతానము గూర్చి ఆయన వాగ్దానము చేసెను, ఆ తరువాత ఆ సంతానము అబ్రహాము ద్వారా వచ్చుటకు ఏర్పాటు చేసెను. ఆ తరువాత అదే రక్తసంబంధియగు దావీదు వంశావళి ద్వారా వచ్చునని చెప్పెను. కాని అది ఒకే ప్రత్యక్షత, ప్రజలకు అది మరి ఎక్కువ సమాచారమును ఇచ్చెను, అందువలన వారు దానిని బాగా అర్థము చేసికొనుటకును, పొందుటకును సహాయము దొరికెను. కాని దేవుని యొక్క వాక్యము మారదు. ఆయన బయలుపరచిన ప్రకారమే సంతానము వచ్చెను. హల్లెలూయా. అబద్ధ అపోస్తలులు ఏమి చేయుచున్నారో చూడండి. వారు తమ స్వంత మాటతో వచ్చిరి. పౌలు వారికి నేర్పించిన వాక్యమును బట్టి ఆ ఎఫెసు వారికి తెలియును. పౌలు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్దాత్మను పొందిరి. ఆ అబద్ద అపోస్తలుల యొక్క కళ్ళలోనికి చూచి ఇట్లనిరి, "మీరు పౌలు చెప్పిన దానిని చెప్పుట లేదు, గనుక మీరు అబద్ధికులు." ఓ, అది నా హృదయమును మండించుచున్నది. వాక్యము యొద్దకు తిరిగి రండి! అపోస్తలుని పరీక్షించువారు నిజంగా మీరు కారు. ప్రవక్తను లేదా బోధకుని పరీక్షించువారు నిజంగా మీరు కారు. ప్రవక్తను లేదా బోధకుని పరీక్షించు వారు మీరు కారు గాని వాక్యమే వారిని పరీక్షించుచున్నది. ఈ దినములలోనే ఒక దినమున లవొదికయ సంఘ కాలమునకు ఒక ప్రవక్త వచ్చును, అతడు నిజముగా దేవుని చేత పంపబడినవాడో, కాడో మీరే ఎరుగుదురు. అవును, మీకు తెలియును, అతడు దేవుని ద్వారా వచ్చిన వాడయినచో, అతడు ఆ వాక్యములో యుండును. పౌలుకు దేవుడిచ్చిన ఆ వాక్యములోనే అతడు ఖచ్చితంగా యుండును. ఒక్క క్షణము కూడా అతడు ఆ వాక్యము నుండి తొలగిపోడు. ఒక్క పొల్లు కూడా తప్పిపోడు. ఆ చివరి కాలములో చాలామంది అబద్ద ప్రవక్తలు కనబడుదురు. మీరు వారిని, మరియు వారు చెప్పిన దానిని నమ్మనట్లయితే నశించెదరు అని వారు మీతో చెప్పుచున్నదానిని మీరు గమనించి చూడండి. కాని చివరి దినపు ప్రవక్త రంగము మీదికి వచ్చినప్పుడు, అతడు మీతో ఇట్లనును, "మీరు వాక్యము యొద్దకు తిరిగి రావలెను లేనియెడల నశించెదరు. అతడు నిజప్రవక్త, స్వంత అనువాదము మీద గాని, సొంత ప్రత్యక్షత మీద గాని అతడు జనులను కట్టడు. వాక్యము మీదనే కట్టను. ఆమేన్. ఆమేన్!
ఈ అబద్ద అపోస్తలులు క్రూరమగు తోడేళ్ళు, అని పౌలు చెప్పెను. "నేను వెళ్ళిపోయిన తరువాత వారు వచ్చి మాకును దానికి సమానమగు ప్రత్యక్షత వచ్చినదందురు; కాని వారి ఉద్దేశ్యము మీకు సహాయము చేయుట కాదు గాని, మిమ్మును నాశనముచేయుటయే." అపో. కా. 20:27-32,
"దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్దాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో, ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియును. వారు మందను కనికరింపరు.మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొనిపోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి.ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ జేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమను గ్రహించుటకును శక్తిమంతుడు.
వారిని గూర్చి యోహానుకు కూడా తెలియును, ఎందుకనగా I యోహాను 4:1లో ఇట్లు చెప్పెను,
"ఇప్పటికే చాలామంది అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి యున్నారు."
ఆ క్రీస్తువిరోధి ఆత్మ ఇప్పటికే సంఘములో పనిచేయుచున్నది. వాక్యమునకు విరోధముగా వెళ్ళుట ద్వారా అది పని చేయుచున్నది. అది ఎక్కడ ప్రారంభమాయెనో ఇచ్చట మనము చూచుచున్నాము. మొదటి సంఘకాలములోనే అది ప్రారంభమయినది. ఇప్పటికే వారు వాక్యమును నిరాకరించుట ఆరంభమైనది. వాక్యమునకు బదులుగా వారు తమ స్వంత ఆచారములను మరియు వేదాంతమును ప్రవేశపెట్టుచున్నారు. అదియే అంత్యక్రీస్తు. యేసు వాక్యమైయున్నాడు. వాక్యమునకు విరోధిగా యుండుట అనగా యేసుకు విరోధిగా ఉండుటయే. వాక్యమునకు విరోధియనగా అంత్యక్రీస్తే, ఎందుకనగా వాక్యము మరియు ఆత్మ ఒక్కటే. నీవు వాక్యమునకు విరోధివైనచో, నీవు క్రీస్తు విరోధివే. అది మొదటి సంఘములో ఆరంభమయినది గనుక అది చివరి వరకు ఎదగవలసియున్నది. అది దానిని ఆక్రమించును, కాలములన్నింటిని మనము చూచినప్పుడు ఈ విషయము అర్థమగును. ఎఫెసు సంఘకాలములో అది చాలా చిన్నదిగా ప్రారంభమయినది. ప్రతి కాలములోను అది ఎదుగుచున్నది. చివరకు వాక్య విరోధిగా అంత్యక్రీస్తు విధానముగా పరిణమించి సమస్తమును అక్రమించును. వాక్యము యొక్క తప్పిపోని నియమమును తప్పుత్రోవ పట్టించుటకు అబద్ధ అపోస్తలులు మరియు అబద్ధ సంఘము దుష్ప్రచారము చేయుదురు.
మనము మాట్లాడుకొనుచున్న దానిని గూర్చి ఒక తప్పు అభిప్రాయమును అలవరచుకొనుట చాలా సులభము, ఎందుకనగా నేను దీనిని చాలా గట్టిగా చెప్పుచున్నాను. ఇది మీకు వాక్య విరోధముగా వినబడవచ్చును. క్రీస్తువిరోధి ఆత్మ వాక్యమును బాగుగా చెరచును. బైబిలును అది పూర్తిగా నిరాకరించును. కాదండీ. ఇది అది కాదు. ఏమిటది, ప్రకటన 22:18,19 వచనములు చూడండి.
"ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా — ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును.ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను, పరిశుద్ధ పట్టణములోను వానికి పాలులేకుండా జేయును.
ఒక్క మాటను మార్చినా ఇది జరుగును, లేదా దానికి చేర్చరాదు, దానినుండి తీసివేయరాదు. ఏదెను తోటలోని సాతాను యొక్క మొదటి పన్నాగము అదియే. దేవుడు చెప్పినదానికి ఒక చిన్న మాటను వాడు చేర్చెను, అందువలన ఇది జరిగెను, అది మరణము మరియు నాశనము తీసుకొని వచ్చెను. ఎఫెసులో అదే జరిగెను. ఒక్క మాట చేర్చబడెను, ఒక్కమాట తీసివేయబడెను, వాక్యవిరోధి, క్రీస్తువిరోధి ఆత్మ వర్ధిల్లసాగెను.
ఇప్పుడు మీరు దానిని గ్రహించారా? ఆ కవలలు మరల అక్కడున్నవి. ఆ రెండు వృక్షములు మరల అచ్చటున్నవి. ఒకే భూమి మీద అవి ప్రక్క-ప్రక్కనే ఎదుగుచున్నవి. ఒకే రకమగు ఆహారమును, ఒకే వర్షములోని నీరును, ఒకే సూర్యరశ్మిని తీసుకొనుచూ, వాటి మేలులను పొందుచున్నవి. కాని వాటి విత్తనములు వేరు. ఒక చెట్టు దేవుని వాక్యము కొరకు దేవునిచే అనుగ్రహింబడి, దానిని ప్రేమించి, దానికి లోబడును. మరియొక చెట్టు దేవుని వాక్యమునకు విరోధిగాయున్న విత్తనము నుండి వచ్చెను. కాబట్టి తన ఇష్టానుసారముగా దానిని మార్చెను. సజీవమగు, నిజమైన వాక్యమునకు బదులుగా, తన స్వంత ఆచారములను మరియు బోధలను ప్రవేశపరచుచున్నది. కయీను కూడా ఆలాగే చేసి హేబెలును చంపెను. కాని చిన్న మందా, భయపడకుడి. వాక్యముతో నిలచియుండుడి. మీకును, అపవాదికిని మధ్య ఆ వాక్యమును ఉంచుకొనుడి. హవ్వ ఆలాగు చేయనందున ఓడిపోయినది. సంఘము వాక్యమును త్రోసివేసినప్పుడు సాతాను యొక్క చీకటి అగాధములలోనికి పోక తప్పదు.
"నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.'' రెండవ వచనములో చెప్పబడిన రీతిగానే ఇది కూడా ఉన్నది. కాని రెండవ వచనములో క్రియలు, కష్టము, సహనము గూర్చి వ్రాయబడియున్నది. పవిత్ర వాక్యమునకు కాపలా వారికి అప్పగించబడినది. వారు విరోధులను ఎట్లు నిరోధించిరో చూడండి. వారు పౌలుకు నిజంగా ఎంత అతిశయోక్తిగా యున్నారో చూడండి. కాని ఈ వచనములో, వారు యేసు నామము నిమిత్తము శ్రమలను, శోధనలను, సహనమును భరించినట్లు వ్రాయబడినది.
ఇది ఏమీ వింత కాదని మీరెరుగుదురు. వాక్యమును మరియు ఆయన నామమును పట్టుకొనియున్నప్పడే శత్రువు మనలను వరదవలె వెంటాడును. స్వస్థతలు, సూచక క్రియలు, అద్భుతములు, ఇంకా ఇతర కార్యములు వాక్యము ద్వారానే జరుగును. అది శక్తి గలది. పరిసయ్యులు అందువలననే నిజ విశ్వాసులను చంపవలెనని కేకలు వేసిరి. ఆ నామమును ఇప్పుడు యూదులు ద్వేషించి తృణీకరించుచున్నారు. నాగరికత పొందితిమని తలంచిన వారు, ఆ నామమును హేళన చేయుచున్నారు; వారు నవ్వుచున్నారు, చనిపోయి తిరిగి లేచి, ఇప్పుడు పరలోకమందున్న ఒక మనుష్యుని నమ్ముట ఏమిటని వారు వెక్కిరించుచున్నారు. కాబట్టి ఇక్కడ మత హింసకులున్నారు, వారు యూదులు, యేసును శపించుచున్నారు, వారి దృష్టిలో ఆయన అబద్ధ మెస్సీయా; ఇతరులు కూడా చాలా ఆనందముతో దానిని నమ్ముచున్నారు, ఒక క్రొత్త దేవుని నామమును గూర్చి వారు వ్యంగ్యముగా చిత్రీకరించు చున్నారు, వారి దృష్టిలో ఆయన దేవుడే కాడు.
ఆ కాలములో ప్రారంభమై మిగిలిన కాలములలోను కొనసాగి వచ్చుచుండిన మరియొక సంగతి ఇక్కడున్నది. ఇంకా లోతుగాను, ఇంకా చీకటి లోనికి ఇది కూరుకొనిపోవును. జనులు ఆ నామమును దూషించుచున్నారు. నిజమగు ఎఫెసు సంఘము ఆలాగు చేయుట లేదు. అది కాదండీ! వారు అబద్ద అపోస్తలులు. బయటివారు, లోనికి వచ్చుటకు ప్రయత్నించు విశ్వాసులను అపవిత్రపరచగోరుచున్నారు. ఎఫెసీయులు ఆ నామమును ఎరుగుదురు, దానిని వారు ప్రేమించుచున్నారు. ఎఫెసు సంఘము యొక్క మూలమును గుర్తుచేసికొనండి. మెస్సీయా కొరకు ఎదురు చూచుచున్న ఒక చిన్న గుంపు ఒక ప్రవక్తను గూర్చి విన్నారు. మెస్సీయాకు మార్గము సరాళము చేయుటకు అతడు పాలస్తీనా ఎడారిలో ప్రత్యక్షమాయెను. ప్రజలకు వారి పాపముల నుండి మారుమనస్సు కలుగు నిమిత్తము అతడు బాప్తిస్మమిచ్చుచుండెను. వారు యోహాను యొక్క బాప్తిస్మమును పొందిరి. కాని పౌలు వారి యొద్దకు వచ్చి ఆ ప్రవక్త చనిపోయెనని చెప్పి, యేసు వచ్చి తన జీవితమును పాపమునకు బలిగా అర్పించెననియు, ఇప్పుడు పరిశుద్దాత్మ వచ్చియున్నదనియు, యేసునందు విశ్వాసముంచిన నిజవిశ్వాసులందరూ దానితో నింపబడుదురనియు, ఆత్మలోనే నివాసము చేయుననియు, యేసే మెస్సీయా అనియు అతడు వారికి చెప్పెను. వారు దీనిని వినినప్పుడు, ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందిరి. వారి మీద పౌలు చేతులుంచినప్పుడు వారందరును పరిశుద్దాత్మ చేత నింపబడిరి. వాక్యమునకు విధేయత చూపి ఆయన నామములో (ప్రభువైన యేసుక్రీస్తు) బాప్తిస్మము పొందిరి. ఆ విధముగా వారికి పరిశుద్ధాత్మతో నింపబడుట ఏమిటో తెలిసినది. ఆ జనులను నీవు మారునట్లుగా చేయజాలవు. వారికి సత్యము తెలియును. అపో. కా. 19:1-7.
ఆ నామము యొక్క శక్తిని వారెరుగుదురు. ఆ నామము చాలా శక్తిగలదని వారు చూచియున్నారు. పౌలు ధరించిన వస్త్రములను చింపి రోగుల మీద ఉంచగా, వారు స్వస్థత పొందుటను జనులు చూచిరి. యేసు నామములో, ఆ వస్త్రములను బాధపడుచున్న జనుల మీద ఉంచగా, వారు ఏ విధమగు రోగముతో యుండినా గాని, ఆ రోగము నుండి విడుదల పొందిరి. దురాత్మలు పారిపోయినవి. ఆ నామము వలన వారెన్నో అద్భుతములను జరిగించిరి, అయినా గాని భ్రష్టమనస్సుగల యూదులు ఎఫెసులో ఆ నామమును దయ్యములకు ప్రత్యామ్నాయముగా వాడిరి. అపో.కా.19:11-17,
"మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను;అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్టయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను.అప్పుడు దేశసంచారులును మాంత్రికులైన కొందరు యూదులు — పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద, ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.యూదుడైన స్కెవయను, ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా,ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి, వారి మీద పడి, వారిలో ఇద్దరిని లోంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింట నుండి పారిపోయిరి.ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను, గనుక, ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను."
ఆ నామమును కలిగియుండువారు ఎట్టి నీతి గల జీవితమును జీవించుదురో వారికి తెలియును, ఎందుకనగా ప్రభువు యొక్క నామమును ధరించినవాడు పాపము నుండి దూరము కావలెను. మీరు పరిశుద్ధులుగా ఉన్నచో మీరు ప్రభువు యొక్క పాత్రలుగా ఉన్నారు. నీ దేవుడగు యెహోవా నామమును నీవు వ్యర్థముగా కలిగియుండరాదు. ఈ ఎఫెసు వారు క్రైస్తవులు. వారు ఒక నామము ధరించియున్నారు, ఆ నామము క్రీస్తు. ఆయన దేవుని యొక్క ఆత్మయై వారిలో యున్నాడు. వారి ప్రభువు యొక్క నామము మూడు విధములుగా యున్నది.
"నా నామము నిమిత్తము నీవు శ్రమపడి అలయలేదని నేనెరుగుదును." ఈ విశ్వాసులు పౌలు కొరకు శ్రమపడలేదు లేక ఒక సంస్థ కొరకు శ్రమపడలేదు. వారు కార్యక్రమములకు లేక సంస్థలకు అంకితము కాలేదు. వారు వాటి ద్వారా ఆస్తి సంపాదించుకోవలెనని ఆశ కలిగిలేరు. వారు ప్రభువు కొరకు ప్రయాసపడిరి. వారు ఆయనకు దాసులు, సంస్థ యొక్క బానిసలు కారు. వారు ఆదివారము ఆలయమునకు వెళ్ళి, ఆ నామము గూర్చి మాట్లాడుకొని మిగిలిన వారమంతయూ మరిచిపోయెడివారు కారు. ఆ నామమును వారు పెదవులతో ఆరాధించినవారు కారు. కాదండీ. వారి జీవితముల ద్వారానే ఆ నామమును జీవింపచేసిరి.
వారు ఏమి చేసినాగాని, ఆ నామములోనే చేసిరి. ఆ నామములోనే వారు క్రియ జరిగించిరి. వారు ఆ నామములో క్రియ జరిగించనియెడల, ఆ నామమును పలికెడివారు కారు. వీరు పరలోకమునందలి ఉన్నత స్థానములో కూర్చుండియున్న క్రైస్తవులు, వారియొక్క నడవడిక ప్రభువునందున్నది.
కానీ ఆ కారు ద్రాక్షావల్లి గుంపు ఆ నామమును పాడుచేయగోరి చీకటిలో పొంచియున్న తోడేళ్ళవలె ఉండిరి, లోనికి ప్రవేశించి వారిని చీల్చగోరిరి. కాని పరిశుద్దులు ఆ పరీక్షకు నిలబడియుండి వాక్యమును, ఆ నామమును పట్టుకొనియుండిరి.
దేవుని యొక్క ఆరోపణ
ప్రకటన 2:4,
"అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది."
దీనిని అర్థము చేసికొనుటకు నీవు ఒక గ్రహింపును కలిగియుండవలెను. అదేమనగా ఆత్మ ఎఫెసులో యున్న మూల విశ్వాసులతో మాత్రమే మాట్లాడుట లేదు గాని, ఈ వర్తమానము ఆ మొత్తం కాలమునకు అనగా, సుమారు 120 సంవత్సరములకు సంబంధించును. ఈ వర్తమానము, ఆ మొత్తం కాల వ్యవధిలోయున్న తరములకు సంబంధించినది. చరిత్ర దానికదే పునరావృత్తమగును. ఇశ్రాయేలు వారి తరములలో ఒక తరములో వచ్చిన ఉజ్జీవము, ఆ మరుసటి తరములో చల్లారిపోవుట మనము చూడగలము. మూడవ తరములో బహు తేలికపాటి వెలుగును మనము చూడగలము, కాని నాలుగవ తరములో ఆ ఆది మంట యొక్క ఛాయకూడా కనబడదు. ఆ తరువాత దేవుడు మరల జ్వాలను వెలిగించును మరియు మరల అదే విధానము కొనసాగుట చూచెదము. దేవునికి మనుమలు లేరు అను సత్యమును ఇది మరల తేటపరచుచున్నది. స్వాభావిక జన్మ వలన రక్షణ ఒకరి నుండి మరొకరికి సంక్రమించదు. అపోస్తలుల క్రమము వంశపారంపర్యముగా రాదన్నది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యము. వాక్యములో అది లేదు. నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసిగానే నీవు ప్రారంభించవలసియున్నావు. ఆ తరువాత వచ్చిన తరము కూడా అలాగే క్రైస్తవులుగా ఉందురని మనము తలంచరాదు. వారు ఆ శాఖ యొక్క పేరును మాత్రమే ధరించుకొందురు. ఇప్పుడు వారు బాప్టిస్టులుగాను, మెతడిస్టులు మొదలగువారిగాను యుందురు. ఇందులో ఏమియూ సందేహము లేదు. వారు క్రైస్తవులు కారు. మీరు దేవుని యొక్క చిత్తము మూలముగా జన్మించవలసియున్నారు. మానవ చిత్తానుసారముగా జన్మించిన యెడల, రక్షణ కలుగదు; కాని ఈ జనులు ఇప్పుడు మానవ చిత్తముననుసరించి కూడుకొనుచున్నారు. అందులో కొందరు దేవునితో సరిగా లేరని నేను చెప్పుట లేదు. ఒక్క నిమిషము కూడా నేను ఆ మాట అనను, కాని ఆది నిప్పు ఆరిపోయినదని మాత్రమే నేను చెప్పుచున్నాను. వారు ఇంతకు ముందున్నట్లుగా మాత్రము లేరు.
దేవునిని సంతోషపరచవలెనను ప్రగాఢ వాంఛ, ఆయన వాక్యమును తెలిసికొన వలెనను తీవ్రమగు కోరిక, ఆత్మలో కొనసాగవలెనన్న వేదన చల్లారిపోసాగినది. దేవుని యొక్క అగ్నితో మండుచుండవలసిన సంఘము అందుకు బదులుగా చల్లారిపోయి ఆచారపూర్వకమైనదానిగా మారిపోయినది. ఆ ఎఫెసీయులకు ఆనాడు అదియే జరిగినది, వారు అలవాటు పూర్వకమైనవారుగా మారిపోయిరి, దేవుని పట్ల వారికున్న కోరిక నెమ్మదినెమ్మదిగా క్షీణించిపోవుచున్నది. దేవుని యొక్క ఉద్దేశ్యమును గూర్చి జనులు అంత ఆసక్తిని చూపించుట లేదు, కానీ లోకము వారి నుండి ఆశించుచున్నదానిని గూర్చిజాగ్రత్తవహించుచున్నారు. వచ్చుచున్న ఆ రెండవ తరము ఇశ్రాయేలు వారివలెనెయున్నది. వారు, ఇతర దేశములకున్నట్లుగా మాకును రాజు కావలెనని కోరిరి. ఆ విధముగా వారు దేవునిని విసర్జించిరి, ఏమయినా గాని రాజు మాకు కావలెనని వారు కోరుకొనిరి. అది సంఘము యొక్క చరిత్ర. వారు దేవునికి చెందియుండకుండా, ఈ లోక మర్యాదను ఎక్కువగా అనుసరించుచూ, ఇంతకు ముందు వారు చేయుచుండిన భక్తి క్రియలను ఇక చేయక ఆపివేసి వారిప్పుడు ఇంతకుముందు చేయని కార్యములను చేయుచుందురు. వారిప్పుడు తమ వస్త్రధారణను, వారి వైఖరిని, వారి ప్రవర్తనను మార్చియున్నారు. వారు విశ్రమించి యున్నారు. 'ఎఫెసు' అను పదమునకు అదే అర్థము, "విశ్రాంతి పొందుట - దారి తప్పుట."
ఆ తరువాత ఉజ్జీవము మరియు చల్లదనము ఒక చక్రమువలె తిరిగి వచ్చుట తప్పదు. నీవు చేయవలసినదంతయూ ఒక్కటే, దేవుని ఆత్మ యొక్క చివరి కదలికను గుర్తించి స్త్రీలు మరియు పురుషులు క్రైస్తవులవలె దుస్తులు ధరించి , ఆలయమునకు వెళ్ళి, రాత్రంతయూ ప్రార్ధనచేసి, వీధుల మూలలకు వెళ్ళి సిగ్గుపడకుండా ఆత్మ యొక్క ప్రత్యక్షతలను ఇతరులకు చూపించవలెను. వారు తమ పాత, చచ్చిన సంఘములను విడిచిపెట్టి గృహములలోను, పాత స్టోరు భవనములలోను ఆరాధన చేయుచుండిరి. వారికి వాస్తవము దొరికినది. కాని అది ఎంతో కాలముకాకుండా వారికి సరిపోయినంత ధనము రాగానే చక్కని నూతన భవనములను నిర్మించిరి. వారంతట వారు దేవునికి గానములను పాడుట మాని, గాయక బృందములు ఏర్పరిచిరి. వారు గాయక బృందమునకు ప్రత్యేక దుస్తులు ధరింపచేసిరి. వారు ఒక ఉద్యమమును ఏర్పరచి, దానిని మానవుల ద్వారా నడిపించిరి. వారు చదువుటకు తగని పుస్తకములను చదవనారంభించిరి. వారు ద్వారములను తెరచియుంచినందున మేకలు వచ్చి వాటిని ఆక్రమింపసాగెను. సంతోషపు కేరింతలు పోయినవి. ఆత్మ యొక్క స్వాతంత్ర్యము పోయినది. ఓ, వారు ఒక ఆచారమును రూపొందించిరి; అగ్ని చల్లారిపోయి, నల్లని బూడిది మాత్రమే మిగిలినది.
దేవునిని ప్రేమించుట అనగా ఏమిటో యోహను అర్థము చేసికొనెనని, కొద్ది క్షణముల క్రితం నేను చెప్పియున్నాను. ఆ గొప్ప ప్రేమ అపోస్తలుడు, సంఘము ఎక్కడ మొదటి దేవుని ప్రేమను విడిచిపెట్టెనో చూచెను. I యోహాను 5:3లో ఇట్లు చెప్పబడి యున్నది.
"ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించుటయే దేవునిని ప్రేమించుట, (ఆయన వాక్యము)."
ఆ వాక్యము నుండి కొద్దిగా దారి తప్పిపోయినా గాని, క్రీస్తు నుండి ఒక అడుగు దూరము పోయినట్లే. దేవునిని ప్రేమించుచున్నామని జనులు చెప్పుచుందురు. వారు ఆలయములకు వెళ్ళుదురు, చప్పట్లు కొట్టుదురు, సంతోషించుదురు, పాటలు పాడుదురు, గొప్ప ఉద్రేకముగా సమయము గడుపుదురు. అయితే అంతా అయిపోయిన తరువాత చూడండి, వారు ఆ వాక్యములో ఉండి, నడచి, జీవించినట్లయితే చూడండి. వారు ఎన్ని చేసినా గాని, ఆ వాక్య ప్రకారము నడువనప్పుడు, తాము దేవునిని ప్రేమించుచున్నట్లుగా చెప్పలేరు, ఎందుకనగా వారి జీవితములు వేరొక గాధను తెలియజేయుచున్నవి. యోహాను చనిపోకముందు ఈ విధమైన దానిని చాలా చూచియుందురు. తాము దేవుని ప్రేమించుచున్నామని జనులు చెప్పుచుందురు, కాని ఆయన వాక్యమునకు లోబడరు. ఓ, ఎఫెసు సంఘమా, నీకు ఏదో జరుగుచున్నది. కొందరు చేరి ఆ వాక్యమునకు ఏదో కలుపగోరుచున్నారు, మరికొందరు దానిలో నుండి కొంత తీసివేయగోరుచున్నారు. కాని వారు చాలా యుక్తిగా దానిని చేయుచున్నందున, మీరు చూడలేకపోవుచున్నారు. వారు మీరు చూడగలిగినంత గొప్పగా మరియు దానిని అందరూ చూడకలిగినట్లుగా వారు చేయుట లేదు. ముసుగులో వారు దానిని చేయుచున్నారు, హేతువాదము మరియు మనుష్యజ్ఞానము ద్వారా దానిని వారు చేయుచున్నారు. దానిని నీవు తిరస్కరించనిచో నిన్ను కూడా అది మ్రింగివేయును. ఆలస్యము కాకముందే నీవు పెంతెకోస్తు యొద్దకు వెళ్ళుము.
కాని ప్రజలు దేవుని యొక్క హెచ్చరికను పాటించకుండా యుండుట మామూలు అయిపోయింది. పవిత్రమగు వాక్యము మీద నిర్మించబడిన ఆ ఉజ్జీవము చాలా అద్భుతమైనది, ఆత్మ యొక్క ప్రత్యక్షత చాలా ధన్యకరమైనది. ఒక చిన్న భయము లోనికి ప్రాకివచ్చి హృదయములో గుసగుస ఈలాగు వినబడుచున్నది, "మనము పొందిన సత్యమును ఎట్లు కాపాడుకొందుము? ఈ ఉజ్జీవమును ఆరిపోనీయకుండా ఏమి చేయగలము?" అప్పుడు క్రీస్తువిరోధి ఆత్మ వచ్చి అది కూడా ఇట్లు చెవిలో చెప్పెను, "చూడు, ఇప్పుడు నీకు సత్యమున్నది, అది నశించిపోలేదని నీకు తెలియును. నీవు నమ్ముచున్న దానిని ఒక ఆచారముగా మార్చి సంస్థను తయారు చేయుము. దానినంతటినీ సంఘ పుస్తకములో వ్రాయుము." వారు ఆ ప్రకారమే చేయుచున్నారు. సంస్థను తయారు చేయుచున్నారు. వాక్యమునకు కొంత కలుపుచున్నారు. అవ్వవలెను వారు కూడా చనిపోవుచున్నారు, ఎందుకనగా ఒక్క తప్పు మాటను చేర్చుకొనిరి. జీవమును తీసికొని వచ్చునది దేవుని యొక్క వాక్యము. వాక్యమును గూర్చి మనము ఏమి చెప్పుచున్నామో అది లెక్కలోనికి రాదు గాని, దానిని గూర్చి దేవుడేమి చెప్పెనో అదియే లెక్కలోనికి వచ్చును.
దేవుని యొక్క హెచ్చరిక
ప్రకటన 2:5,
"నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సు పొంది, ఆ మొదటి క్రియలను చేయుము; అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి, లేనియెడల నేను నీ యొద్దకు వచ్చి దీప స్తంభమును దాని చోటనుండి తీసివేతును."
జ్ఞాపకము చేసికొనమని దేవుడు వారికి చెప్పుచున్నాడు. వారి మనస్సులలో నుండి ఏదో పోయినది. వారు ఏదో మరచిపోయిరి. వారు తమ ముందు స్థితి వైపుకు తిరిగి రావలెనని తమ మనస్సులలో దానిని జ్ఞాపకము చేసికొనవలెనని హెచ్చరించుచున్నాడు. మొదటి కాలము యొక్క ప్రారంభము పెంతెకోస్తు, వారు దాని నుండి పడిపోయిరి. వారు దానియొక్క మహిమను, అద్భుతమును మరచిపోయిరి. వారు తమ మనస్సులలో దానిని జ్ఞాపకము చేసికొనవలసిన సమయము వచ్చెను. నిజత్వమును గ్రహించవలసియున్నారు. "నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే," అను పరిస్థితికి వారు రావలసియున్నారు. అననీయ మరియు సప్పీరాల తప్పును బయట పెట్టకలిగిన ఆ పాత స్థితికి వారు రావలసియుండిరి. శృంగారమను దేవాలయము నొద్ద జరిగించిన దానిని వారు జరిగించవలసిన స్థితికి తిరిగి రావలసియున్నారు. దేవుని నుండి మరియు ఆయన సముఖము నుండి తొలగిపోవుట ఎంత విషాదము! ఆ కార్యములు ఆయన నామమును అపవిత్రపరచును. ఆయన నామమును ధరించుకొని పాపము నుండి తమ్మునుతాము దూరపరచుకొని, దేవుని కొరకు పవిత్రమగు పాత్రలవలె జీవించినవారు లారా, ఒకప్పుడు నీవు నీ హృదయములో, నీ మనస్సులో, నీ జీవితములో ఏమి కలిగియున్నావో చూచుకొనుము. దాని యొద్దకు తిరిగి వెళ్ళుము.
వెనుకకు మళ్ళుటకు మార్గము ఏమిటి? పశ్చాత్తాపమొక్కటే మార్గము. పశ్చాత్తాపమను మార్గము ద్వారా ఒక పాపి దేవుని యొద్దకు వచ్చిన యెడల, నులివెచ్చనివాడు, వెనుకకు జారిపోయినవాడు అంతకంటె మరి యొక్కువగా మారుమనస్సు పొందవలెను. మారుమనస్సు పొందుడి! అందుకు తగిన ఫలములు ఫలించుడి. మీ జీవితము ద్వారా వాటిని నిరూపించు. "నీవు మారుమనస్సు పొందనియెడల, నీ దీప స్తంభమును నేను తీసివేయుదను," అని దేవుడు చెప్పుచున్నాడు. నిశ్చయంగా! ఆ స్థితిలోనున్న సంఘము, లోకమునకు వెలుగును ఈయజాలదు. దాని యొక్క వెలుగు చీకటిగా మారియున్నది. అప్పుడు దేవుడు ఆమె యొక్క నమ్మకస్తుడగు వర్తమానికుని తీసివేయును. వారి యొక్క నమ్మకస్తులగు సంఘ కాపరులను తీసివేయును మరియు వారి స్థితికి వారిని విడిచిపెట్టును, మరియు వారు క్రైస్తవ్యము గూర్చి మాట్లాడుచునే యుందురు గాని దానివలె జీవించరు.
త్వరగా మారుమనస్సు పొందుము! సందేహింప వద్దు! ఎఫెసు సందేహించిన సంగతి విశదమగుచున్నది. ఆమె యొక్క జీవిత వ్యవధి ఎంతో లేదు. బహు త్వరితముగా దేవుని యొక్క మహిమ తొలగిపోయినది. ఆ పట్టణము తరువాత కొద్ది కాలమునకే శిథిలావస్థలోనికి వచ్చెను. దాని యొక్క మహిమకరమగు ఆలయము, రూపము లేని దిబ్బగా మిగిలినది. ఆ భూమి ఇక బురద గుంటగా మారినది. నీటి మొక్కలు దానిలో పెరిగి యుండెను; జనులు మిగలలేదు, ఒక చిన్న గ్రామముగా అది మారినది. అందులో కొద్దిమంది జనులున్నారు, వారు అవిశ్వాసులు. ఒక్క క్రైస్తవుడు కూడా మిగిలి యుండలేదు. దాని స్థానములో నుండి దీపము తీసివేయబడెను.
ఇప్పుడు ఆమె మారుమనస్సు పొందలేకపోయినదని దాని అర్ధము కాదు. మనము మారుమనస్సు పొందలేమని దాని భావము కాదు. మనము పొందగలము. కాని అది త్వరగా జరుగవలెను. దుఃఖముతో నిజముగా మనము దేవునికి కేకవేయవలెను. ఆ హృదయ కేకను విని, దేవుడు మనలను చక్కబరచును. మహిమ మరల వచ్చును.
నికోలాయితుల విత్తనము
ప్రకటన 2:6,
"అయితే ఈ ఒకటి నీలో యున్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను."
ఈ నికోలాయితులు ఏమిటి అను దాని మీద రెండు ఆలోచనలున్నవి. విశ్వాసభ్రష్టులయిన ఒక గుంపు వారని కొందరు చెప్పుచున్నారు. వారి నాయకుడును అట్టివాడేయందురు. అంతియొక వాడగు నికోలస్, ఒక మతాంతర ప్రవిష్ణుడు, యెరూషలేములోని ఏడుగురు పెద్దలలో అతడు ఒకడాయెను. వారికి అన్య పండుగలున్నవి మరియు వారి ప్రవర్తన చాలా అనైతికముగా యుండెను. శరీరసంబంధమగు కార్యముల మీద జయము పొందవలెనన్నయెడల, మొదటి ఆ కార్యములను ఆ అనుభవపూర్వకముగా రుచిచూడవలెనని వారు బోధించుచుండిరి. ఆ రకమగు బోధను చేసిన వారెట్టివారో సహజముగానే మీరు గ్రహించగలరు. వారియొక్క నైతిక స్థాయి పూర్తిగా దిగజారినది. వారు తమ ఈ ప్రవర్తనకు సరిపడు పాత నిబంధన పేర్లను పెట్టుకొనిరి; బిలాము మరియు యెజెబెలు. బిలాము జనులను అపవిత్రపరచి జయించెను, నికోలస్ కూడా ఆ విధంగానే చేసిరని జనులు చెప్పెదరు. ఈ గుంపును బలప్రయోగము చేసి ఎఫెసు నుండి బయటకు త్రోసివేసిరి మరియు వారు పెర్గములో ఒక చోట స్థానము సంపాదించుకొనిరి.
కాని ఈ నమ్మకమును గూర్చిన ఒక సమస్య ఏమనగా ఇది సత్యము కాదు అనునదియే. సంపూర్ణముగా దీనికి చరిత్ర అనునది లేదు. ఇది సాంప్రదాయము అని చెప్పవచ్చును. అటువంటి ఉద్దేశ్యమును మనము కలిగియున్నప్పుడు, ఎఫెసు సంఘకాలము కేవలము చరిత్రగానే మిగిలియుండును. ఈ దినమునకు అన్వయింపబడదు. ఇది సత్యము కాదు, ఎందుకనగా ఆదిమ సంఘములో ఏది ప్రారంభమయినా గాని అది తప్పకుండా అన్ని సంఘకాలములలోను కొనసాగి, అది మంచిదయినచో దేవుని ద్వారా మహిమపరచబడి ఆశీర్వదింపబడును కానియెడల అది నాశనము చేయబడి అగ్నిగుండములో పడవేయబడును. ఈ సంప్రదాయము లేఖనమునకు విరోధము, ప్రకటన 22లో దానిని మీరు చూడండి. దుష్టులను సహించలేనిదని ఎఫెసు సంఘమును గూర్చి చెప్పబడెను. వారు ఆ విధముగా వారిని బయటకు త్రోసియుందురు, ఎందుకనగా వారిని వీరు సహించలేకపోయిరి. వారిని వీరు బయటకు త్రోయనియెడల వారిని సహించినవారగుదురు. ఇప్పుడు ఆరవ వచనములో చూడండి, వారి క్రియలను వీరు ద్వేషించిరని వ్రాయబడినది. కాబట్టి ఈ నికోలాయితుల గుంపు మొదటి కాలములోనే ఒక భాగముగా నిలచియుండి, వారి క్రియలను జరిగించుచుండిరి. ఆ క్రియలను ద్వేషించిరి కాని జనులు పూర్తిగా వాటిని విసర్జించిరని చెప్పలేము. ఆ విధముగా ఎఫెసులో విత్తనములు పడి అవి పెరిగి, చివరకు ఒక బోధగా మారి, చివరకు అగ్నిగుండములోనికి చేరును.
ఈ నికోలాయితులు ఎవరు? ఈ పదము రెండు గ్రీకు మాటలలో నుండి వచ్చినది. నికో, అనగా జయించుట అనియు, లావోస్, అనగా అర్ఛకేతర వర్గము అనియు అర్ధము. దీని వాస్తవమును గమనించండి. ఆ మొదటి సంఘములో ఎవరో ఏదో చేయుచుండిరి. అదియే అర్ఛకేతరులను జయించుట. సంఘములోని విశ్వాసులను జయించినట్లయితే వారి మీద "అధికారము" చెలాయించవచ్చును.
దేవుడు ద్వేషించిన దానిని వారు చేయుచుండిరి. అయితే అది ఏమిటి? ఆ సంఘములో ఏమి జరుగుచుండెను. అప్పుడు జరుగుచున్నదే ఇప్పుడును జరుగుచూ యున్నది, నికోలాయితు అను పదమునకు, అక్షరాలా అర్థము అదే. జనులను ఏదో రకంగా తమ వశములో యుంచుకొనిరి. అది పూర్తిగా దేవుని వాక్యమునకు విరోధము.
ఇప్పుడు దానియొక్క నిజమగు అర్ధమును మనము గ్రహించుటకు ముందు, దీనిని మీరు ఎల్లప్పుడు మనస్సులో యుంచుకొనవలెనని హెచ్చరించుచున్నాను. (అవి ఆత్మసంబంధమగు సంగతులు) ఇందులో రెండు సంగతులు ఒకదానికొకటి పెనవేసికొని యున్నవి, కాని అవి తెలుపుకు నలుపు ఎంత వ్యతిరేకమో అంత విరోధముగా ఉన్నవి. మతము మరియు ఆత్మ సంబంధమగు ప్రపంచము అను ఆ రెండు చెట్లు ఏదెను తోటలోనే ప్రారంభమయినవి. అక్కడ రెండు చెట్లున్నవి. ఒకటి జీవ వృక్షము మరియు రెండవది మంచి, చెడ్డల తెలివిని ఇచ్చు వృక్షము. ఏదెను తోట మధ్యలోనే అవి యుండినవి. వాటి కొమ్మలు ఒకదానికొకటి పెనవేసికొనినవని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఆ విధముగానే ఎఫెసు సంఘమున్నది. మంచివారితోను, చెడ్డవారితోను సంఘము మిశ్రమమైయున్నది. రెండు ద్రాక్షాతీగెలు సంఘమును తయారుచేసినవి. ప్రక్కప్రక్కనే ఎదుగుచుండిన గోధుమలు మరియు గురుగులవలె అవి యున్నవి. కాని ఒకటి నిజమైనది. మరియొకటి అబద్ధమైనది. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితోను, ప్రతిఒక్కరి గూర్చి ఆయన మాట్లాడును. వారిని ఆయన సంఘము అని పిలచును. ఏది నిజమగు ఆత్మయో ఏర్పరచబడినవారు మాత్రమే తెలుసుకొందురు. ఏర్పరచబడినవారు మాత్రమే మోసపుచ్చబడరు. మత్తయి 24:24,
"అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు లేచి గొప్ప అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములు చూపించుదురు. వారు సాధ్యమయితే ఏర్పరచబడినవారిని సహితము మోసము చేయుదురు."
ఆది సంఘములోనే ఆ కారు ద్రాక్షాతీగె నిజమగు ద్రాక్షావల్లిని పెనవేసి కొనసాగినది. (పెంతెకోస్తు తరువాత కొద్ది కాలమునకే) ఈ నికోలాయితుల క్రియలను మనము చూతుము. నిజమగు ద్రాక్షావల్లితో ఆ ఆత్మ పోరాడుటను మనము గమనించగలము. చివరకది దేవుని ద్వారా నాశనము చేయబడును. మీరిప్పుడు దానిని గమనించారా?
సరే. ఇప్పుడు ఆ సంఘము యొక్క ఆత్మీయ వాతావరణము ఎట్లున్నదో గమనించండి? అది దానియొక్క మొదటి ప్రేమను విడిచి పెట్టియున్నది. దేవుని వాక్యమునందు తనకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టినది. దానియొక్క మొదటి స్థితి అనగా పెంతెకోస్తు నుండి పడిపోయినదని మనకు వివరించబడియున్నది. సామాన్య ఆంగ్ల భాషలో దానిని ఇట్లు చెప్పవచ్చును. అది పరిశుద్దాత్మ యొక్క నడిపింపు నుండి తొలగిపోవు ప్రమాదకరస్థాయికి చేరుకొనినది. పరిశుద్దాత్మ యొక్క ఆధీనములో లేదు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను మోషే బయటకు తీసికొని వచ్చిన తరువాత అదే జరిగినది. దేవుడు వారిని నడిపించిన మార్గము ఒకటున్నది. అనగా మేఘము ద్వారాను, ప్రవచనాత్మక స్వరము ద్వారాను, అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యముల ద్వారాను దేవుడు వారిని నడిపించెను. దీనిని నెరవేర్చుటకు దేవుడేర్పరచుకొని, దేవుడభిషేకించినవారు ఉండిరి. దేవుడే వారికి సమస్తమును సమకూర్చెను. వారు దేవుని చేతనే పంపబడిరి. పరిశుద్దాత్మ యొక్క కదిలింపు వలన పాళెము మొత్తము నడిపించబడినది. వారు తిరుగుబాటు చేసి, ఆచారములు మరియు పద్దతుల ద్వారా నడువవలెనని కోరుకొనిరి. రాజు కావలెనని వారడిగిరి. లోకస్తులవలె ఉండవలెనని ఆశించిరి, పూర్తి విశ్వాస భ్రష్టత్వము మరియు నాశన కూపములోనికి దిగిపోయిరి. మొదటి సంఘకాలము ఆ విధంగానే ప్రారంభమయ్యి, రానురాను మరింత అధ్వాన స్థితికి అది దిగిపోయినది. చివరకు పరిశుద్ధాత్మను పూర్తిగా నిరాకరించిరి. దేవుడు ఆ జనులను తప్పక నాశనము చేయును.
ఆది సంఘములో అదెట్లు ప్రారంభమయినదో చూడండి. క్రియలు అని వాటిని పిలచెను. ఆ తరువాత అది ఒక బోధగా మారినది. అది ఒక ప్రామాణికముగా తయారయినది. అది ఒక వంచరాని మార్గముగా మారిపోయినది. చివరకు అది పూర్తిగా లోనికి వచ్చి మరియు దేవునిని ప్రక్కకు త్రోసివేసినది. అది చాలా చిన్నగా, చాలా నెమ్మదిగా, చాలా నిరపాయకరముగా ప్రారంభమయినది. అది చాలా మంచిగా కనబడినది. అది చాలా సద్భోధగా కనబడినది. తరువాత అది కొండచిలువవలె చుట్టుకొనినది. ప్రాణమును అది పీల్చివేసి, ఆ సంఘములో ఉన్న ఆత్మీయతను చంపివేసినది. ఓ! ఆకారు ద్రాక్షావల్లి చాలా యుక్తిగలది. అది వెలుగు దూతవలెయున్నది. అది నిన్నుగట్టిగా పట్టుకొని వదలదు. నాయకత్వమందు నాకు విశ్వాసమున్నదని ఇప్పుడు నేను చెప్పగోరుచున్నాను. కాని మానవ నాయకత్వమందు మాత్రము నాకు నమ్మకము లేదు. వాక్యము ద్వారా వచ్చుచున్న పరిశుద్దాత్మ యొక్క నాయకత్వమందు నేను నమ్మికయుంచుచున్నాను. దేవుడు సంఘములో మనుష్యులను నియమించెనని కూడా నేను నమ్ముచున్నాను. మరియు వారు సంఘమును ఒక క్రమములో పెట్టుదురు. దేవుడు పంపిన వారిద్వారా సంఘము పరిపాలించబడుననియు, వారు దాని బాధ్యతను వహించుదురని కూడా నేను నమ్ముచున్నాను. కాని శాసనము ఒక్కటే యున్నది, అది దేవుని వాక్యము. కావున మనుష్యులు నిజంగా పరిపాలించుట లేదు గాని, దేవుని ఆత్మ పరిపాలించుచున్నది; ఎందుకనగా వాక్యము మరియు ఆత్మ, ఒక్కటే. హెబ్రీ 13:7,
"మీకు దేవుని వాక్యము బోధించి, మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి."
కాని ఆ వెనుక ఏమి జరిగినదో చూడండి. ఆ కారు ద్రాక్షావల్లి పెనవేసికొని మానవుని యొక్క ఏలుబడి సరియేనని బోధించుచున్నది. సంఘము పరిపాలించబడవలెనని అది నేర్పుచున్నది. జనుల మీద పెత్తనము చేయవలెనని బోధించుచున్నది. దేవుని యొక్కమార్గమును వెంబడించుటకు బదులుగా వారు అధికారమును సుళువుగా హస్తగతము చేసికొనిరి. తమ చేతులలోనే ఆత్మీయ అధికారమునంతటిని పెట్టుకొని పరిశుద్ధ యాజకత్వముతో ముందుకు వచ్చి దేవునికిని జనులకును మధ్య నిలబడిరి. ఆ పాత అహరోను క్రమము యొద్దకు మరలిరి. వారు క్రీస్తు విరోధులయిరి, ఎందుకనగా వారాయన యొక్క మధ్యవర్తిత్వమును విసర్జించి తమ స్వంత మధ్యవర్తిత్వమును నెలకొల్పుకొనిరి. దానిని దేవుడు అసహ్యించుకొనెను. ఎఫెసువారు దానిని అసహ్యించుకొనిరి మరియు ఏ నిజవిశ్వాసి అయినా గాని దానిని అసహ్యించుకొనును. అన్ని కాలములలోను అదే పని చేయుచూ వచ్చుచున్నది, కటిక గ్రుడ్డివారు మాత్రమే దానిని చూడలేరు. ఇప్పుడది ఎప్పుడూ లేనంత అధ్వాన స్థితికి చేరుకొన్నది. ఏమిటది? సంస్థ. జనులను అది వేరు చేసినది. దేవుని యొక్క జనులు ప్రత్యేకముగా ఉండవలసియున్నారు. ఒకే ఆత్మ ద్వారాను, ఒకే బాప్తిస్మము ద్వారాను వారందరూ ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నారు. ప్రతి ఒక్కరును దేవుని యొక్క ఆరాధనలో పాలుపొందవలసియున్నారు. కాని మనుష్యులు ఆధిక్యతను పొందగోరుచున్నారు, కాబట్టి వారు ఆధిపత్యము తీసికొనిరి. బిషప్పులు అర్చిబిషప్పులయిరి. వారు తమకు బిరుదులను తగిలించుకొని దేవుని వాక్యమును దాటిపోయి తమ స్వంత సిద్ధాంతములను నేర్పించిరి. ప్రజలు తమకు లోబడవలెనని శాసించిరి. చివరకు వారి యొక్క ఆరాధన ఆ పెంతెకోస్తు తరువాత ఉండిన రీతిగా అసలు ఉండనే లేదు. అపోస్తలుల కాలము తరువాత ఈ క్రియలు ప్రారంభమైనవి. అపోస్తలుల కాలము తరువాత వారు ఒక తేలికయిన తొందరపాటు నిర్ణయము తీసికొనిరి. "సంఘ సభ్యత్వము" చాలనిరి మరియు రక్షించు కృప ఉండనే ఉన్నది కదా అనిరి. వాక్యమును కుదించి ఆచారముగా తయారు చేసిరి. క్రీస్తువిరోధి తన ఆత్మద్వారా సంఘములో అధిపత్యము చెలాయించుచున్నాడు.
ఈనాడు కూడా చూడండి. అపో.కా. 2:4 మీరు చదివినయెడల, కొందరేమి చేయుచున్నారో మీకు తెలియును. దానిని మీరు ఈ విధముగా చదువగలరు, "పెంతెకోస్తు దినము సంపూర్తిగా వచ్చినప్పుడు చిన్న రొట్టెముక్క పట్టుకొని మతాధికారి వచ్చి "నీ నాలుకను బయటకు చావుమని చెప్పి," దాని మీద ఆ రొట్టె ముక్కను ఉంచెను. అతడు తనకుతానుగా ద్రాక్షారసమును త్రాగి, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరని చెప్పెను." అది నమ్మశక్యముగా యున్నదా? ఆ నికోలాయితులు ఖచ్చితంగా అందుకొరకే వచ్చిరి." దేవుని వాక్యము ఏలాగు చెప్పినా మీరు పట్టించుకోవద్దు, అని వారు చెప్పిరి. దానిని మీరు అర్థము చేసికొనలేరు. మీకు దానిని మేము అనువదించవలెను. ఇంకా చెప్పవలెనన్నచో, బైబిలు పూర్తికాలేదు. అది కాలానుగుణముగా మారవలసియున్నది. ఆ మార్పులు ఏమిటో మేము చెప్పెదము అనిరి." వారు దేవుని వాక్యమునకు ఎంత భిన్నముగా యున్నారో చూడండి. "దేవుడొక్కడే సత్యవంతుడు, ప్రతి మానవుడు అబద్ధికుడే." సత్యము విషయములో భేదాభిప్రాయములు వచ్చినయెడల మీరు వాక్యము పైనే నిలబడవలెను. భూమ్యాకాశములు గతించునుగాని, దేవుని యొక్క ఒక్కమాట కూడా గతించదు. కాబట్టి జనులను ఆ మనుష్యులు నడిపించిరి. వారు తమ వేషధారణ మరియు నటన చేత మోసము చేసిరి. వారు క్రీస్తు యొక్క ప్రతినిధులుగా చాటించుకొనిరి, కాని వారే అసలు క్రీస్తువిరోధులు.
ఇక్కడ మరొక విషాద గాథ యున్నది. అది నీటి బాప్తిస్మపు గాథ. యేసు దినములలోను, పెంతెకోస్తు తరువాతను నీటిలో ముంచెడివారు. దానినెవరునూ కాదనలేరు. నీటిని పోసిరని చాలామంది విద్యనభ్యసించినవారు చెప్పెదరు, ఎందుకనగా అక్కడ నీటిగుంటలు ఎక్కవ గనుక నీటిని పోసిరని చెప్పెదరు. వారు, వారి మీద నీటిని పోసినయెడల, మరియు ఆ బిరుదులే నిజమయిన పేర్లు అయిన యెడల, బాప్తిస్మమును కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములో ఇచ్చియుందురు. ఒక్క దేవునికి బదులుగా ముగ్గురున్నట్లుగా నమ్మిరి. కాని నీవు ఆ సంస్థలో యుండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముంచుట బాప్తిస్మము గూర్చి బోధించినయెడల లేదా ఆ ప్రయత్నము చేసినయెడల బయటకు త్రోసివేయబడెదవు. నీవు దేవుని ద్వారా నడిపించబడినట్లయితే అందులో నిలచియుండవు. అది అసాధ్యమగు పని.
ఇప్పుడు పౌలు ఒక ప్రవక్తగా ఉండెను, అతడు పరిశుద్దాత్మ వలన నేర్చుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పౌలు బాప్తిస్మమిచ్చెను. దానికి వ్యతిరేకముగా చేసినవారు, బోధించినవారు శపించబడుదురని చెప్పెను. ఇది మేల్కొని చూడవలసిన సమయము. ఇప్పుడు సంఘము పరిశుద్దాత్మ యొక్క అధీనములో లేదు, అయితే నికోలాయితులు దానిని వశపరచుకొనిరి. అపో.కా. 20:27-30,
"దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియూ దాచుకొనలేదు.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో, ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియును, వారు ముందను కనికరింపరు.మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొనిపోవలెనని, వంకర మాటలు పలుకు, మనుష్యులు మీలోనే బయలుదేరుదురు."
అది వచ్చుటను పౌలు చూచెను. ఈ యుక్తిగల యాజకత్వము గూర్చి జాగ్రత్తపడుడి వారు వచ్చి తమ అబద్ధ బోధలతో మోసము చేయుదురు అని అతడు హెచ్చరించెను. వారు ఒక రకమగు ఆరాధనను నెలకొల్పుదురని, మరియు పరిశుద్దాత్మ యొక్క పరిచర్యలో ఏ భాగమును పాటించకుండా ప్రజలను తప్పించెదరు అని అతనికి తెలియును. ఈనాడు స్వాతంత్ర్యమును, ఆత్మనింపుదలను కలిగియున్నామని చెప్పుకొనుచున్న వారు సహితము విశ్వాసులకు స్వాతంత్ర్యమును ఎక్కువగా ఇచ్చుట లేదు. కొద్దిమంది బోధకులు ఆత్మావేశము కలిగి బోధించుచుండగా జనులు కూర్చొని దానిని వినుచూ గ్రహింప ప్రయత్నించుచున్నారు. అదే మనము చూచుచున్నాము. పౌలు చెప్పిన మాటను ఎవరూ చెవిని పెట్టుటలేదు, అందరూ కూడి వచ్చినప్పుడు ఆత్మ నడిపింపును బట్టి, ఆత్మ సంబంధమగు ఆరాధనలో పాలుపొందవలెను.
లేఖనము నుండి గాని లేదా చరిత్ర నుండి గాని ఈ పాఠమును సంఘము ఎన్నడూ నేర్చుకొనలేదు. దేవుడు పరిశుద్దాత్మ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించిన ప్రతిసారి కూడా ప్రజలు స్వాతంత్ర్యము పొందుచున్నారు. ఆ తరువాత కొంత కాలమునకు వారు ఎందులో నుండి బయటకు వచ్చిరో మరల ఆ బంధకములలోనికే వెళ్ళుచున్నారు. లూథర్ కథోలిజం నుండి బయటకు వచ్చిన తరువాత, జనులు కొంతకాలము స్వాతంత్ర్యముగానే యుండిరి. కాని అతడు చనిపోగానే, జనులు సంస్థగా మారిరి. అతడు నమ్మినదానిని గూర్చి వీరు ఊహించి, తన మత స్వంత ఆచారములను, అభిప్రాయములను అందులో స్థాపించిరి. వారు చెప్పిన దానికి ఎవరూ ఎదురు చెప్పరాదనిరి. కొద్ది రూపపు మార్పుతో వారు మరల కథోలిజంలోనికి వెళ్ళిరి. ఈనాడు చాలామంది లూథరనులు తిరిగి అందులోనికి వెళ్ళుటకు సిద్ధముగా యున్నారు.
ఓ, అవును! ప్రకటన 12లోని మహా వేశ్యకు చాలామంది కుమార్తెలున్నారు. ఈ కుమార్తెలు తల్లివలెనె యున్నారు. వారు వాక్యమును ఒక ప్రక్కకు త్రోసివేసిరి, దేవుని యొక్క ఆత్మ కార్యమును నిరాకరించిరి, విశ్వాసులను నిర్లక్ష్యము చేసిరి. వారి ద్వారాను లేదా వారి విధానము ద్వారా వచ్చినయెడల మాత్రమే దేవునిని ఆరాధించుట విశ్వాసులకు సాధ్యపడునని చెప్పిరి. అది సాతాను యొక్క అవిశ్వాసము నుండి పుట్టిన అబద్ధ రూపకల్పన తప్ప మరేమియూ కాదు.
ఎక్కడా, మనము ఆత్మీయంగా ఎక్కడున్నాము? మనము అంధకార అరణ్యములో యున్నాము. మొదటి సంఘమునకు మనము ఎంత దూరములో యున్నాము. అసలు పెంతెకోస్తు ఎక్కడా కనబడుట లేదు మరియు వాక్యము అసలు లేనే లేదు. అపోస్తలుల వారసులమని వీరు నేడు చెప్పుకొనుచున్నది వాక్యములో లేనే లేదు. అది ఒక మానవ కల్పిత విధానము, మానవుడు కాదు, ఆయనే తన సంఘములో నాయకులను ఏర్పరచియున్నాడు. దేవుని యొక్క సత్యమును అవి అక్రమంగా అతిక్రమించుచున్నవి. పేతురు అసలు రోమ్ లో లేడు. అయినా అతడున్నట్లు వారు అబద్ధమాడుచున్నారు. అతడు లేడని చరిత్ర రుజవు చేయుచున్నది. చరిత్రను చదివిన జనులున్నారు, అయినా గాని వారు భుజములను ముడుచుకొని అబద్ధమును నమ్ముటకు వెళ్ళుచున్నారు. "క్రీస్తు యొక్క ప్రతినిధులను" మాటను వాక్యములో మీరు ఎక్కడ కనుగొందురు? ఆయన స్థానమును ఎవరునూ ఆక్రమించలేరు, అయినా గాని వారు దానిని నమ్మి అంగీకరించుచున్నారు. "అదనపు ప్రత్యక్షత" అను మాట దేవుని చేత ఆమోదించబడినది అని మీరు వాక్యములో ఎచ్చట చూడగలరు? ఇంతకు ముందివ్వబడిన ప్రత్యక్షత్రకు అది విరోధము, అయినా గాని వారు దానిని అంగీకరించి దాని మీద ఆధారపడుచున్నారు. "పాప పరిహార పద్ధతిని" మీరెచ్చట కనుగొందురు? "మాస్" అను దానిని మీరెక్కడ చూపించగలరు? "పాతాళము నుండి బయటకు వచ్చుటకు డబ్బులు చెల్లించుట" మీరెక్కడ చూడగలరు? అది వాక్యములో లేదు, కాని మనుష్యులు తమ స్వంత గ్రంథములో వాటిని వ్రాసుకొనియున్నారు. వాటి ద్వారా జనులను భయపెట్టి పరిపాలించుచున్నారు. "మానవునికి దేవునివలె క్షమించు అధికారము కలదని" ఎక్కడ మీరు చూడగలరు? "క్రూరమైన తోడేళ్ళు" వారిని వివరించుటకు ఆ మాటలు చాలవు. నికోలాయితుల బోధ. సంస్థ. మానవుని మీద మానవుని పెత్తనము.
దేవుని యొద్దకు తిరిగి రమ్ము ఆలస్యము కాకముందే మారుమనస్సు పొందుము. గోడమీది చేవ్రాతను చూడుము. అది తీర్పును వ్రాయుచున్నది. పరిశుద్ధమగు పాత్రలు అపవిత్రపరచబడినవి మరియు ఆ విధముగా దేవుని యొక్క ఉగ్రత వచ్చినది, ఇప్పుడు పవిత్రమగు వాక్యము అపవిత్రపరచబడియున్నది. ఆత్మ దుఃఖించుచున్నది మరియు తీర్పు ఇక్కడున్నది, తలుపు యెద్ధనే యున్నది. మారుమనస్సు పొందుము! పశాత్తాపపడుము! పెంతెకోస్తు యొద్దకు తిరిగి రమ్ము పరిశుద్దాత్మ యొక్క నాయకత్వము యొద్దకు తిరగి రమ్ము! దేవుని యొక్క వాక్యము నొద్దకు తిరిగి రమ్ము, ఎందుకు నీవు చావవలెను?
ఆత్మ యొక్క స్వరము
ప్రకటన 2:7,
"చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక: జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును."
"చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక!" ఈ మాటలను మిలియనుల మంది వింటూ లేదా చదువుచూ యుండవచ్చును, కాని ఎంతమంది వాటిని జాగ్రత్తగా వినుచున్నారు? అది మనకు తెలియదు. చెవిగలవాడు సత్య వాక్యమును వినవలెనని ఆశించి ఆత్మ యొక్క మాటను వినుటకు వేగిరపడువాడు దేవుని యొక్క జ్ఞానమును పొందును. వాక్యము వైపుకు నీవు నీ చెవిని తెరచినయెడల, దేవుని యొక్క ఆత్మ ఆ వాక్యమును నీ పట్ల వాస్తవమగునట్లుగా చేయును. ఇప్పుడు అది ఆత్మ యొక్క కార్యము. నేను మీకు సత్యము బోధించవచ్చును, కాని మీరు దానిని వినుటకు మీ చెవిని తెరువనిచో, దానిని చేర్చుకొనుటకు మీ హృదయమును మీరు తెరువనిచో, మీరు ప్రత్యక్షతను పొందరు.
ఇప్పుడు చూడండి, ఆత్మ సంఘములతో మాట్లాడుచున్నట్లుగా చెప్పబడినది. అది ఏకవచనము కాదు గాని, బహు వచనము. ఆ స్థానిక ఎఫెసు సంఘమునకు లేదా మొదటి కాలమునకు మాత్రమే వ్రాయమని ఆత్మ యోహానుతో చెప్పలేదు. అది అన్ని సంఘ కాలములకు చెప్పబడినది. కాని ఇది ప్రారంభ సంఘము. కాబట్టి ఇది ఆదికాండమువలె యున్నది. ఆదికాండములో ప్రారంభమయిన సత్యము. వాక్యమంతటిలోను కనబడును మరియు చివరికది ప్రకటనలో అంతమగును. ఆ విధముగా ఈ అపోస్తలుల కార్యముల గ్రంథములో ప్రారంభమైన ఈ సంఘము అన్ని కాలములకును నమూనాగా ఉండి మరియు చివరకు లవొదికయ సంఘ కాలముతో సమాప్తమగును. దానిని జాగ్రత్తగా గమనించండి. ప్రతికాలము కూడా జాగ్రత్తపడవలెను, ఇక్కడ జరుగుచున్నది కేవలము ఆరంభము మాత్రమే. నాటబడిన ఆ చిన్న మొక్క ఎదుగుచున్నది. అన్ని కాలములలోను అది ఎదుగుచునే యున్నది. యేసు వచ్చు వరకు ప్రతి కాలమునకును, ప్రతి క్రైస్తవునకును ఒక వర్తమానము ఇచ్చటున్నది. అవును, ఎందుకనగా ఇది ఆత్మ మాట్లాడుచున్నది. ఆమేన్.
వాగ్దానము చేయబడిన ప్రతిఫలము
ప్రకటన 2:7,
"…జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనితును."
ఇది అన్ని యుగములలోను జయించిన వారికి ఇవ్వబడు భవిష్యత్తు బహుమానముగా ఉన్నది. ఎప్పుడైతే మన యుద్ధమునకు చివరి కేక వినబడునో, అప్పుడు మన యుద్దోపకరణములు క్రింద పెట్టి దేవుని యొక్క పరదైసులో విశ్రాంతి పొందుదుము. జీవ వృక్షము మన భాగము, సదాకాలము దానిని భుజించుదుము.
"జీవ వృక్షము." అది చాలా చక్కని అలంకార పదము కదూ? ఆదికాండములో మూడు సార్లును, ప్రకటన గ్రంథములో మూడు సార్లును ఆ మాట వాడబడినది. ఆరు చోట్లను అదే వృక్షము గూర్చి చెప్పబడెను మరియు ఒకే దానికి సాదృశ్యముగా యున్నది.
కాని జీవ వృక్షము అనగా ఏమిటి? మంచిది, అసలు ముందుగా ఒక చెట్టు దేనికి అర్థమో మనము చూడవలెను. సంఖ్యాకాండము 24:6, ఇశ్రాయేలును బిలాము వర్ణించెను, "యెహోవా నాటిన అగరు చెట్ల వలె ఉన్నారు," అని అతడు వారి గురించి చెప్పెను. చెట్లు ఎక్కడయినా గాని వాక్యములో మానవులకు సూచనగా యున్నవి. కీర్తన 1 చూడండి. కాబట్టి తప్పకుండా ఈ జీవ వృక్షము, ఒక వ్యక్తి జీవము అయి ఉండవలెను, మరియు అదే యేసు.
ఇప్పుడు ఏదెను తోట మధ్యలో రెండు వృక్షములు ఉన్నవి. ఒకటి జీవ వృక్షము, మరియొకటి మంచి, చెడ్డల తెలివిని ఇచ్చు వృక్షము. జీవ వృక్షము వలన మానవుడు జీవించవలెను; కానీ ఇతర వృక్షమును అతడు తాకరాదు, తాకినయెడల అతడు చనిపోవును. కాని మానవుడు ఆ ఇతర వృక్షముతో పాలుపొందెను, అందువలన మరణము, పాపము ప్రవేశించెను. మరియు దేవుని యొద్ద నుండి అతనికి ఎడబాటు కలిగెను.
ఆ ఏదెను తోటలోయున్న చెట్టును చూడండి, అది జీవమునకు మూలమైయున్నది, ఆయనే యేసు. యోహాను సువార్త ఆరవ అధ్యాయము నుండి ఎనిమిదవ అధ్యాయము వరకు యేసు తానే నిత్యజీవమునకు మూలమని చెప్పెను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, అని చెప్పెను. ఆయన తన్ను అర్పించుకొనుటను గూర్చి చెప్పెను. తనను తినినవాడు ఎన్నడునూ మరణించడని ఆయన చెప్పెను. అబ్రహాము తనకు తెలియునని ఆయన చెప్పెను, మరియు అబ్రహాము కంటె ముందే తానుంటినని ఆయన చెప్పెను. ఆయనే స్వయంగా జీవ జలమును ఇచ్చెదనని చెప్పెను, ఆ జీవ జలము త్రాగినవాడెన్నడును దప్పిగొనడని, అయితే నిత్యమూ జీవించునని చెప్పెను. తానే ఆ గొప్ప ఉన్నవాడను అని ఆయన చెప్పెను. ఆయనే జీవాహారము, జీవపు ఊట, నిత్యుడు, జీవ వృక్షము. ఆయనే ఆ ఏదెను తోట మధ్యలో అప్పుడుండెను. దేవుని యొక్క పరదైసు మధ్యలో కూడా ఆయనే ఉండును.
ఆ ఏదెను తోటలోని రెండు వృక్షములు ఆ మిగిలిన చెట్లవలె మరో రెండు చెట్లు అని చాలా మంది అనుకొనుచుందురు. కాని ఇది సరయిన అభిప్రాయము కాదని బాగుగా అధ్యయనము చేసినవానికి తెలియును. అన్ని చెట్ల మొదళ్ళ యొద్దను గొడ్డలి యుంచబడినదని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పినప్పుడు, అతడు కేవలము చెట్లను దృష్టిలో ఉంచుకొని ఆలాగు మాట్లాడలేదు, ఆత్మ సంబంధమగు సూత్రములను అన్వయించు చున్నాడు. 1 యోహాను 5:11లో ఇట్లున్నది,
"ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారునియందున్నది."
యేసు, యోహాను 5:40లో ఇలాగు చెప్పెను,
"అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు."
ఇక్కడ దేవుని వాక్యము తేటగాను మరియు స్పష్టముగాను కుమారునిలోనే జీవము, నిత్యజీవము ఉన్నవి అని చెప్పుచున్నవి. ఇంక ఏ స్థలములో లేదు. I యోహాను 5:12,
"దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేనివాడే.?
సాక్ష్యము మారదు, దానికేమియూ చేర్చబడదు, దాని నుండి ఏమియూ తీసివేయబడదు. కుమారునియందు జీవము గలదు అనునది సాక్ష్యము… కాబట్టి ఏదెను తోటయందున్న వృక్షము యేసే, ఇందులో సందేహము లేదు.
సరే, జీవవృక్షము ఒక వ్యక్తి గనుక మంచి చెడ్డల తెలివిని ఇచ్చు వృక్షము కూడా ఒక వ్యక్తియైయుండవలెను. మరొకటిగా ఉండదు. ఆ విధముగా నీతిమంతుడు మరియు దష్టుడు ఆ ఏదెను తోటలో ఒకరి ప్రక్కను ఒకరు నిలబడియున్నారు. యెహెజ్కేలు 28:13,
"నీవు (సాతాను) ఏదెనులో, దేవుని యొక్క ఏదెను తోటలో యుంటివి."
"సర్ప సంతానము" యొక్క నిజ ప్రత్యక్షతను ఇచ్చట మనము చూచెదము. ఏదెను తోటలో నిజంగా అదే జరిగెను. హవ్వ సర్పము వలన మోసపుచ్చబడెనని వాక్యము చెప్పుచున్నది. ఆమె వాస్తవంగా సర్పము చేత చెరచబడినది. ఆదికాండము 3:1లో ఇట్లున్నది,
"ప్రభువగు యెహోవా సృజించిన భూజంతువులన్నింటిలోను సర్పము బహుయుక్తిగలదై యుండెను."
ఈ జంతువు దాదాపుగా మానవునివలె యుండెను (అయినా గాని అది పూర్తిగా జంతువే) అది మాట్లాడగలదు మరియు వాదించగలదు. అది ఒక చక్కని జంతువు. చింపాంజీకి మరియు మానవునికి మధ్య రూపములో యుండెను, అయితే మానవు పోలియుండెను. మానవునికి సమీపమగు పోలికలో యుండెను, కనుక వాని యొక్క బీజము స్త్రీ అండముతో కలిసిపోయెను, అప్పుడు ఆమె గర్భము ధరించినది. ఇది జరిగినప్పుడు, దేవుడు సర్పమును శపించెను. సర్పము యొక్క శరీరములోని ప్రతి ఎముకను ఆయన అందుకనే మార్చెను మరియు అది పామువలె ప్రాకసాగెను. విజ్ఞానము ఎన్నో విధములుగా ప్రయత్నము చేసినది గాని ఆ తప్పిపోయిన గొలుసును కనుగొనలేకపోయినది. దాని విషయము దేవునికి తెలియును. మానవుడు తెలివైనవాడు మరియు మానవుడు జంతువుతో సాంగత్యము చేయగలడనియు అందు మూలముగా పరిణామము వచ్చుననియు చెప్పిరి. పరిణామమనునది ఏదియూ లేదు, కాని మానవుడు మరియు జంతువు మిశ్రమమాయెను. దేవుడు మరుగు చేసిన మర్మములలో ఇది ఒకటి, కాని ఇప్పుడది ప్రత్యక్షపరచబడినది. ఎప్పుడైతే హవ్వ జీవమును కాలదన్ని మరణమును కోరుకొనెనో, అప్పుడే, ఆ ఏదెను తోట మధ్యలో ఇది జరిగినది.
ఏదెను తోటలో దేవుడు వారితో ఏమి చెప్పెనో గమనించండి,
ఆదికాండము 3:15,
"నీకును, స్త్రీకును మధ్య నేను వైరము కలుగజేసెదను. నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును మధ్య నేను శత్రుత్వము కలుగజేయుదును. నీవతని యొక్క మడిమెను కరచుదువు, నీ తలను అతడు చిదుకద్రోక్కును."
మనము వాక్యమును లెక్కలోనికి తీసికొనిన స్త్రీకి ఒక సంతానమున్నది అనిన యెడల, సర్పమునకు కూడా తప్పకుండా ఒక సంతానముండియుండవలెను. స్త్రీ యొక్క సంతానము పురుషుని మూలముగా కలిగిన ఎడల సర్పము యొక్క సంతానమును ఆ మాదిరిగానే కలిగియుండవలసియున్నది. మానవ పురుషుని మూలముగా సంతానము కలిగినట్టే, మరో పురుష బీజము వలన సంతానము కలిగియుండెను. మానవుని సంభోగము వలన కాక, దేవుని యొక్క సాధనము అయిన స్త్రీ విత్తనము ద్వారా క్రీస్తు వచ్చెనని, ఏ విధ్యార్థి అయినా ఒప్పుకొనక మానడు. సర్పము యొక్క శిరస్సును చితుకగొట్టుట అనగా, అది ఒక ప్రవచనము. సిలువ యొద్ద క్రీస్తు సాతానును ఏమి చేయునో ముందే చెప్పబడినది. క్రీస్తు ఆ సిలువ యొద్ద సాతాను యొక్క తలను చితుకగొట్టెను, ప్రభువు యొక్క మడిమెను సాతాను కరచెను.
ఈ వాక్యభాగము సర్పము యొక్క సంతానము అక్షరాలా భూమిమీద చల్లబడి యున్నది అని తెలిపే ప్రత్యక్షతయైయున్నది. లూకా 1:26-35లో మీరు చూడండి, మానవు బీజముతో సంబంధము లేకుండా స్త్రీ యొక్క సంతానము ఎట్లు బయటకు వచ్చెనో చూడగలము.
"ఆరవనెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్తుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి — దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి — ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత.మరియా భయపడకుము: దేవుని వలన నీవు కృప పొందితివి.ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.ఆయన యాకోబు వంశస్తులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై యుండును అని ఆమెతో చెప్పెను.అందుకు మరియ — నేను పురుషుని ఎరుగనిదాననే.ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత — పరిశుద్దాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్దుడై దేవుని కుమారుడనబడును."
దేవుడే స్వయంగా తన్ను మానవ శరీరములో పుట్టించుకొనుటను, ఈ స్త్రీ సంతానములో మనము చూడగలము. కాబట్టి మానవ జాతిలో తన సంతానమును కూడా తాను ఏర్పరచు కొనగల మార్గమున్నదని సాతాను ఎరిగియున్నది. కాని దేవునివలె సాతాను తన్నుతాను బయలుపరచుకొనుట అసాధ్యము (ఎందుకనగా అతడు సృజింపబడిన ఆత్మగా ఉన్నాడు) కాబట్టి వాడు తన సంతానమును ఎట్లు రూపొందించెనో మనము ఆదికాండములో చూడగలము. మానవజాతిలోనికి వాడెట్లు చొచ్చుకొని వచ్చెనో, ఎట్లు దూరెనో మనము చూడగలము. సాతానును "సర్పము" అని పిలచుట మనము గమనించవలెను. మానవ జాతిలోనికి వాడు ఎట్లు చొచ్చుకొని వచ్చెనో, మనము మాట్లాడుకొనుచున్నాము.
అవ్వను గూర్చి ఆదాము శరీర సంబంధముగా అవగాహన చేసికొనక ముందే సర్పము అవగాహన చేసికొనినది. దాని మూలముగా జన్మించినవాడు కయీను. కయీను దుష్టుని సంబంధి (వాని వలన పుట్టినవాడు) I యోహాను 3:12. ఒక చోట ఆదామును "దుష్టుని సంబంధి" అనియు, మరో చోట ఆదాము "దేవుని కుమారుడనియు" యోహానులో నున్న పరిశుద్దాత్మ పిలువదు (కయీనుకు అతని తండ్రి అయిన యెడల దుష్టుడే అగును కదా?) కాని అతడు దేవునిచే సృజింపబడెను. లూకా 3:38. కయీను తన తండ్రి వంటి గుణములనే కలిగియుండెను, మరణమును తీసికొని వచ్చిన హంతకుడు. అతడు సర్వశక్తుడగు దేవునిని కలిసికొనినప్పుడు కూడా దేవునిని ఎదిరించెను. ఆదికాండము 4:5,9,13,14 చూడండి. అతడు మానవ లక్షణములు లేనివానిగా మనము చూడగలము. దేవునిని సాతాను ఎదిరించినదానికంటె ఎక్కువగా ఇతడు ఎదిరించినట్లు మనము లేఖనములో కనుగొందుము.
"కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి, అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా.యెహోవా — నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా, అతడు — నేనెరుగను: నా తమ్మునికి నేను కావలివాడనా? అనెను.అందుకు కయీను — నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది.నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశ దిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను."
కయీను, హేబెలు మరియు షేతుల యొక్క పుట్టుక గురించి దేవుని యొక్క లేఖనము ఏమి చెప్పుచున్నదో చూడండి. ఆదికాండము 4:1,
"ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు; ఆమె గర్భవతియై, కయీనును కని — యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను."
ఆదికాండము 4:25,
"ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు; ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి, షేతు అను పేరు పెట్టెను."
ఆదాము యొక్క శరీరసంబంధమగు జ్ఞానపు రెండు క్రియల వలన ముగ్గురు కుమారులు జన్మించిరి. బైబిలు, దేవుని యొక్క పరిపూర్ణ మరియు ఖచ్చితమగు వాక్యము. గనుక ఇది తప్పు కాదు గాని మనకొక కనువిప్పు కలుగజేయుచున్నది. ఆదాము యొక్క రెండు క్రియల వలన ముగ్గురు కుమారులు జన్మించిరి. ఆ ముగ్గురిలో ఒకడు ఆదాము యొక్క కుమారుడు కాడని మీరు అర్థము తెలిసికొనగలరు. దేవుడు దానిని మనకు చూపించుటకై అక్షరాలా దానిని రుజువు చేసెను. ఈ సంగతి యొక్క సత్యమును గమనించండి. హవ్వ యొక్క గర్భములో ఇద్దరు కుమారులుండిరి (కవలలు), వారు వేర్వేరు సంయోగముల వలన రూపొందినవారు. ఆమె కవలలను మోయుచున్నది. హేబెలు కంటె కొద్ది ముందుగా కయీను పుట్టెను. మరల ఆ కవలలను చూడండి, ఎల్లప్పుడును పరిపూర్ణ మాదిరిగానే యున్నది. ఇది సాధ్యము కాదని అనుకొనుచున్న వారికి నేను చెప్పుచున్నాను. వైద్య అధ్యయములను పరీక్షించండి. చాలా కేసులు దాఖలయినవి. వేర్వేరు సంయోగముల వలన కవలలను కనినవారిని గూర్చి చెప్పబడినది. కొన్ని దినముల తేడాతో ఈ అండములు ఫలధీకరణము చెందియున్నవి. అంత మాత్రమే కాదు, ఆ కవలల యొక్క తండ్రులు వేరువేరుగా ఉన్నారని చెప్పబడెను. ఈ మధ్యనే ప్రపంచమంతయూ ఒక సంఘటన మారుమ్రోగినది. ఒక నార్వే దేశపు తల్లియున్నది, ఆమె తన భర్తకు కుట్టు పనిలో సహాయపడుచున్నది. ఆమె తన కొరకును, తన కవల పిల్లల కొరకును పాటుపడుచున్నది. ఆ పిల్లలలో ఒకరు నలుపు, ఒకరు తెలుపుజాతివారు. ఆమె తనకు ఒక నిగ్రో ప్రేమికుడున్నట్లు ఒప్పుకొనినది. ఆ ఇద్దరి గర్భధారణ, దాదాపు మూడు వారముల వ్యవధిలో జరిగియున్నది. టెక్సాస్ లోని బ్యూమౌవుంట్ లో 1963 సంవత్సరమందు ఒక కేసు నమోదయినది. అక్కడ కూడా ఇద్దరే జన్మించిరి. ఆ గర్భధారణలు చాలా దినముల ఎడములో జరిగినవి. ఒక బిడ్డను కను సమయములో ఆ తల్లి దాదాపు మరణము నుండి బయటపడినది.
ఇదెందుకు ఈలాగు జరిగియున్నది? సర్పము యొక్క సంతానము. ఈ విధంగా ఎందుకు రావలసియున్నది? మానవుడు దేవుని కొరకు సృజింపబడెను. మానవుడు దేవునికి ఆలయముగా ఉండవలసియున్నాడు. దేవుడు విశ్రాంతి తీసికొను స్థలము, ఆలయము మానవుడే (పరిశుద్దాత్మ) అపో.కా. 7:46-51.
"అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను.అయితే సొలోమోను ఆయన కొరకు మందిరము కట్టించెను.అయినను — ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? అని ప్రభువు చెప్పుచున్నాడు, అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు.ఇవన్నియు నా హస్తకృతములు కావా?ముష్కరులారా, హృదయములను, చెవులను, దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు."
సాతాను దీనినంతటిని ఎరుగును. దేవునివలె వాడు కూడా మానవునిలో నివాసము చేయగోరుచున్నాడు. కాని దానిని దేవుడు తన మట్టుకు మాత్రమే పదిలపరచుకొనెను. సాతాను దానిని చేయలేదు. దేవుడు మాత్రమే శరీరమందు ప్రత్యక్షమాయెను. సాతాను దానిని చేయజాలదు చేయలేదు. సృజనాత్మక శక్తి దానికి లేదు. సాతాను తాను కోరుకొనిన దానిని నెరవేర్చుకొనుటకు ఒకే ఒక మార్గమున్నది. అదేమనగా, సాతాను ఏదెను తోటలో సర్పములో ప్రవేశించినట్లు, గదేరా యొద్ద పందులలో అది ప్రవేశించినట్లు, దేవుడు జంతువులలో ప్రవేశించడు; కాని సాతాను వాటిలో ప్రవేశించి తన లక్ష్యమును నెరవేర్చుకొనగలడు. దేవుడు మరియ ద్వారా వచ్చినట్లుగా సాతాను హవ్వ ద్వారా ప్రత్యక్షంగా బిడ్డను కనజాలడు. కాబట్టి వాడు సర్పములో ప్రవేశించి ఆ తరువాత అవ్వను మోసము చేసెను. ఆమెను వాడు చెరచెను. అందువలన సాతానుకు ప్రతినిధి జన్మించెను. సాతాను యొక్క దయ్యపు లక్షణములను సర్పము యొక్క జంతు లక్షణములను కయీను నిండుగా కలిగియుండెను. (శరీర సంబంధమగు, కామోద్రేకమును) కయీను ఆ దుష్టుని సంబంధియని పరిశుద్ధాత్మ చెప్పుటలో ఆశ్చర్యము లేదు. అతడు ఆ సంబంధియే.
ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమగు కొంత రుజవు యొద్దకు వెళ్ళగోరుచున్నాను. మానవునికి మరియు జంతువునకు మధ్య ఒక ఖచ్చితమగు అవినాభావ సంబంధమున్నట్లు రుజవున్నది. అది ఒక శారీరక సంగతి. జన్మించని ఫీటస్ (fetus) నుండి ఎంబ్రియో ( embryo cells) సెల్స్ ను తీసి మానవులలోనికి ఎక్కించగలరని మీరెరుగుదురా? ఆ థైరాయిడ్ సెల్సు తిన్నగా మానవ థైరాయిడ్ లోనికి వెళ్ళును. మూత్రపిండముల సెల్సు తిన్నగా మానవ మూత్ర పిండములలోనికి వెళ్ళును. ఇదెంత బుద్ధిహీనతయో మీరు గ్రహించారా? ఆ జంతు కణములను సరయిన చోటులోనికి ఒక జ్ఞానము నడిపించుచున్నది. ఆ జ్ఞానము ఆ కణములను అంగీకరించుచున్నది. వాటిని సరయిన చోటులో ఖచ్చితంగా ఉంచుచున్నది. మానవునికి మరియు జంతువుకు మధ్య ఒక అవినాభావ సంబంధమున్నది. వారు వాటిని సంయోగము చేసి ప్రత్యుత్పత్తిని జరిగించజాలరు. వారది ప్రయత్నించి చూచిరి. కాని ఏదెను తోటలో ఆ సంయోగము జరిగినది, ఇంకా ఆ రసాయినిక అవినాభావ సంబంధము నిలిచేయున్నది, దీనిని రుజువు చేయుచున్నది. ఎందుకనగా ఏదెను తోటలో సర్పము ఆనాడు తిన్నని జంతువుగా యుండెను. అది మానవునికి దగ్గర పోలికలో యుండెను. దాదాపు మనిషివలె యున్నది. సర్పము యొక్క శారీరక లక్షణములను సాతాను ఉపయోగించుకొనినది. అందు మూలముగా అవ్వను మోసము చేసెను. ఆ తరువాత దేవుడు సర్పము యొక్క రూపమును నాశనము చేసెను. ఏ ఇతర జంతువు కూడా మానవునితో సంయోగము చెందలేదు. కాని ఆ అవినాభావ సంబంధమున్నది.
ఇప్పుడు మనము ఇంత వరకు వచ్చియున్నాము, ఈ అంశము మీద మీ ఆలోచనను నేను స్పష్టముగా ఉండునట్లు చేయుటకు ప్రయత్నించుచున్నాను. అప్పుడు మీరు "సర్పసంతానము యొక్క బోధ? ఎంత అవసరమో గ్రహించగలరు. దానినే నేను చెప్పియున్నాను. ఏదెను తోట మధ్య రెండు చెట్లున్నవని ప్రారంభములో నేను చెప్పాను. జీవ వృక్షము యేసే. మరియొక వృక్షము ఖచ్చితంగా సాతాను, ఎందుకనగా ఆ వృక్షము యొక్క ఫలము ఏమిటో మనము చూచాము. ఈ రెండు వృక్షములను మానవునితో సంబంధము కలిగియున్నట్లు చూచాము, లేనియెడల అవెన్నడునూ అచ్చట ఉండెడివి కావు. దేవుని యొక్క సౌర్వభౌమిక సంకల్పము మరియు ఉద్దేశ్యములలో తప్పక వాటికి పాలుండియుండును. మానవులతో వాటికి సంబంధమున్నది. ఆయనతో మానవులకు సంబంధమున్నది. దేవునిని సర్వజ్ఞాని అని మనము అందుకే పిలచుచున్నాము. ఇంతవరకు అది వాస్తవము, కాదా? దానిని వాక్యము బహు ఖచ్చితముగా ముందే స్థాపించి యున్నది. భూమి యొక్క పునాదికి ముందే తన యొక్క నిత్యజీవమును మానవులతో పంచుకొనవలెననుదనియే దేవుని యొక్క సంకల్పము. ఎఫెసీ 1:4-11,
"ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,మనము తనయెదుట పరిశుద్దులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.దేవుని కృ పా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన ఏర్పాటునుబట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచనకలుగుటకు, ఆ కృపను మన యొడల విస్తరింపజేసెను.ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెనుమరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను.
ప్రకటన 13:8.
'భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమ౦దు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు (సాతానుకు) నమస్కారము చేయుదురు."
"దేవుడు శరీరధారియై ప్రత్యక్షమవుట ద్వారా తప్ప," ఆ జీవము మరి ఏ విధముగాను పంచుకొనబడదు. ఇది ఆయన యొక్క నిత్య మరియు ముందు నిర్ణయపు ఉద్దేశ్యములో భాగమైయున్నది. ఆయన కృప యొక్క మహిమను స్తుతించుటకు ఇది సంకల్పమైయున్నది. ఇది విమోచన యొక్క పధకము, ఇది రక్షణ యొక్క సంకల్పము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. "దేవుడు రక్షకుడైయున్నాడు, కనుక రక్షణ అవసరమగు ఒక మానవునిని ఆయన ముందుగా నిర్ణయించుట ఒక అవసరమాయెను. ఆయనే స్వయంగా దీనికి కారణభూతుడాయెను." ఇది నూరు శాతము నిజము. అందుకు ఎన్నో లేఖనములు సాక్ష్యమిచ్చుచున్నవి. రోమా 11:36లోని అంశమును ఎత్తిచూపుచున్నవి,
"ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్."
మానవుడు ప్రత్యక్షంగా వచ్చి ఏదెను తోట మధ్యలోయున్న జీవవృక్షములో పాలు పొందజాలడు. ఆ వృక్షము యొక్క నిత్యజీవము మొదట శరీరమును ధరించవలెను. దేవుడు తిరిగి లేచి పాపిని రక్షించుటకు ముందుగా, ఆయన లేచి రక్షించుటకు, ఒక పాపి కావలెను. మానవుడు పడిపోవలెను. ఆ పతనము కూడా సాతాను మూలముగా జరుగవలెను. అది కూడా శరీరమును ధరించి పని చేయవలెను. సాతాను కూడా శరీరము ద్వారానే రావలసియున్నది. కాని సాతాను మానవ శరీరమును ధరించజాలదు. క్రీస్తు అయితే మానవ శరీరమును ధరించి వచ్చి పడిపోయిన దానిని తిరిగి లేపెను. కాని అక్కడ ఒక సర్పమున్నది, మానవునికి దగ్గర పోలికలోయున్నది. సాతాను ఆ మృగములోనికి వెళ్ళగలదు, ఆ మృగము ద్వారా మానవ శరీరములోనికి ప్రవేశించగలదు, ప్రవేశించి పతనమును తీసికొనిరాగలదు. ఏదో ఒకరోజు యేసు వచ్చి మానవ జాతిలో ప్రవేశింపగోరినట్లుగా, ఆ విధముగా తన్ను మానవజాతి లోనికి ప్రవేశింపచేసికొనెను. మానవ దేహములోనికి ఆయన వచ్చెను. ఆయన పునరుద్దానుడు కూడా అయ్యెను. ఆయన యొక్క మహిమ శరీరమువంటి శరీరములను మనకు అనుగ్రహించెను. ఆ విధముగా దేవుడు ఏదెను తోటలో చేసిన పని ఆయన యొక్క ముందు నిర్ణయము, సంకల్పము. దేవుని యొక్క ఉద్దేశ్యమునకు అవసరమయిన దానిని సాతాను తీసికొని వచ్చిన, ఆ కారణముచే తోటలోని జీవవృక్షము యొద్దకు మానవుడు సమీపించజాలడు. నిశ్చయంగా ఇది జరుగని పని. అది సమయము కాదు. ఒక జంతువు తీసికొనెను (జంతువు వల్లనే పతనము సంభవించెను గదా? అందుకని జంతువునే వధించెను) దానియొక్క రక్తమును చిందించెను. అప్పుడు దేవుడు మరల మానవునితో సహవాసము కలిగియుండెను. దేవుడు శరీరధారిగా వచ్చు ఒక కాలము రావలసియుండెను. ఆయన తనయొక్క తగ్గింపు ద్వారా పడిపోయిన మానవుని తిరిగి లేపగలిగెను, నిత్యజీవములో మానవునికి పాలు ఇయ్యగలిగెను. దీనిని ఒక్కసారి నీవు చూచినప్పుడు, నీవు సర్ప సంతానమును అర్థము చేసికొనగలవు. హవ్వ తినినది యాపిలు పండు కాదని మీరు గ్రహించగలరు. కాదు, విత్తనమును సంకరము చేయుట వలన మానవాళి యొక్క స్థాయి దిగజారినది.
ఇప్పుడు ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చినప్పుడు మరియొకటి తల ఎత్తునని నాకు తెలియును. జనులు నన్ను అడుగుచుందురు, "ఆ విధముగా హవ్వ పడిపోయినచో ఆదాము ఏమిచేసెను? ఎందుకనగా దేవుడు ఆదామును నిందించుచున్నాడు గదా? అది చిన్న ప్రశ్న దేవుని యొక్క వాక్యము పరలోకమందు సదా స్థిరపరచబడియున్నది. ఒక్క నక్షత్ర ధూళి తయారుకాకముందే, ఆ వాక్యము (దేవుని యొక్క ధర్మశాస్త్రము) మన బైబిలులో వ్రాయబడియున్న ప్రకారమే ఖచ్చితంగా అక్కడుండెను. ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టి వేరొక పురుషునితో జీవించుచున్నయెడల ఆమె వ్యభిచారిణియనబడును. ఆమెకు ఇక పెండ్లి లేదు మరియు ఆమె భర్త ఆమెను తిరిగి స్వీకరించడు. అది మోషే ధర్మ శాస్త్రములో ఎంత నిజముగా యున్నదో అంతే నిజముగా ఏదెను తోటలోను యున్నది. వాక్యము మారదు. ఆదాము ఆమెను తిరిగి చేర్చుకొనెను. తాను చేయుచున్నది ఏమిటో ఆదాముకు బాగుగా తెలియును, అయినా గాని దానిని చేసెను. ఆమె అతనిలో భాగమైయున్నది. అతడు ఆమె యొక్క బాధ్యతను స్వీకరించుటకు ఇష్టపడెను. అతడామెను పోనియ్యలేదు, కాబట్టి హవ్వ అతని వలన గర్భవతి అయ్యెను. ఆమె గర్భవతియగునని అతనికి తెలియును. మానవజాతికి ఏమి జరుగునో ఖచ్చితంగా అతనికి తెలియును. అతడు అవ్వను ప్రేమించెను గనుక అతడామెను చేర్చుకొనెను. అందుకొరకు అతడు మొత్తం మానవజాతిని పాపమునకు అమ్మివేసెను.
కావున ఆ ఇద్దరు కుమారులు జన్మించిరి. మానవజాతికి పితరులుగా ఉండబోవు ఆ కుమారుల వలన నేటికిని చెరుపు కలుగుచున్నది. వారిని గూర్చి వాక్యమేమి చెప్పుచున్నది? వాక్యము చదువుడి యూదా 14,
"ఆదాము నుండి ఏడవవాడగు హనోకు కూడా ప్రవచించెను …"
హనోకు యొక్క వంశావళిని గూర్చి ఆదికాండము 5వ అధ్యాయములో యున్నది. ఆ వంశావళి ఈ విధంగా యున్నది:
1. ఆదాము, 2.షేతు, 3. ఏనోషు, 4. కేయినాను, 5. మహలియేలు, 6. జెరెదు, 7. హనోకు.
కయూనును అందులో చేర్చకపోవుట చూడండి. ఆదాము యొక్క సంతతి షేతు నుండి వచ్చుచున్నది. కయీను గాని ఆదాము యొక్క బిడ్డ అయినచో, జ్యేష్ఠత్వపు హక్కును కయీనుకు ఆదాము ఇచ్చియుండెడివాడు. అతడు వంశావళిలలో చేర్చబడియుండును. ఆదికాండము 5:3 లో చెప్పబడిన దానిని కూడా తప్పకుండా జాగ్రత్తగా గమనించవలెను. "ఆదాము నూట-ముప్పది ఏండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను." కయీను ఆదాము యొక్క పోలికలో ఉన్నట్లు ఎక్కడనూ చెప్పబడలేదు. అతడు ఆదాము కుమారుడయినచో అక్కడ ఉండియుండెడివాడే, ఎందుకనగా ప్రత్యుత్పత్తిని గూర్చిన విషయము ఒకటున్నది. అదేమనగా ప్రతి జాతి, తన జాతినే తిరిగి పుట్టించును. ఇంకా ఆ వాస్తవమును మీరు గమనించండి. ఆదికాండము మరియు లూకా రెండింటిలోను యున్న వంశావళిలో, కయీను పేరు లేదు. కయీను గాని ఆదాము యొక్క కుమారుడయినచో, ఎక్కడో చోట, ఈ విధంగా చెప్పబడియుండును. "ఆదాము కుమారుడగు కయీను, దేవుని కుమారుడగు ఆదాము," అని చెప్పబడియుండెను. ఈ విధంగా అక్కడ చెప్పబడలేదు, ఎందుకనగా ఆ విధంగా చెప్పజాలదు.
బైబిలు పండితులు రెండు వంశములను గూర్చి ఎక్కడో చెప్పిరి: ఒకటి దేవుని యొక్క వరుస, దానిని షేతులో కనుగొందుము. మరియొకటి భక్తిహీన వరుస, అది కయీను ద్వారా కనుగొనబడినది. ఇది వింతగా నుండును, అయితే నిజము, కయీను ఎందువలన అటువంటివానిగా యుండెనో ఈ పండితులు ఎన్నడూ చెప్పలేదు. హేబెలు మరియు షేతు ఆత్మసంబంధులుగా దేవుని వరుసలోను యుండిరి గదా? కయీను కూడా ఆత్మసంబంధిగానే నిజంగా యుండవలెను. హేబెలు కొద్ది తక్కువ ఆత్మసంబంధిగా యుండవలెను, షేతు ఇంకా తక్కువ, ఆలాగు రాను-రాను తగ్గిపోవుచూ ఉండవలెను, ఎందుకనగా ఒక తరముకంటె ఆ తరువాత తరము దేవుని నుండి దూరమగుట పరిపాటి. కాని కయీను అందరికంటె దుష్టునిగా యున్నాడు. దేవునిని మరియు వాక్యమును ఘోరముగా ఎదిరించినవాడు.
ఇప్పుడు తెలిసికొనండి: లేఖనము వాక్యముతో ఎన్నడూ ఆడుకొనదు. నమోదయిన దానిని అభిషేకించబడిన నేత్రములు చూడవలెను. అది ఒక ఉద్దేశ్యము చొప్పుననే అచ్చటున్నది. ఆ వాక్యము ఇట్లు చెప్పుచున్నది. ఆదికాండము 3:20,
"ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను; ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి,
కాని ఆదాము జీవముగల ప్రతివానికిని తండ్రి అని ఎక్కడనూ లేఖనము లేదు. ఆదికాండము 3:20లో ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి అనియున్నది గాని, ఆదామును గూర్చి ఎందుకు చెప్పలేదు? అది యధార్థము. హవ్వ జీవముగల ప్రతివానికిని తల్లి, కాని ఆదాము జీవముగల ప్రతివానికిని తండ్రి కాడు.
ఆదికాండము 4:1లో, హవ్వ ఇలా చెప్పుచున్నది. చూడండి. "యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాను." ఆమె కయీనను కనినందుకు ఆదాముకు పితృత్వమును ఆపాదించుట లేదు. ఆదికాండము 4:25లో ఆమె ఇలా చెప్పుచున్నది.
"కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని, అతనికి షేతు అను పేరు పెట్టెను."
దేవుడు తనకు మరియొక సంతానమును ఇచ్చెనని ఆమె చెప్పలేదు — ఆలాగయితే క్రీస్తు అయి యుండును, ఎందుకనగా ఆయన అనుగ్రహించబడెను. ఈ కుమారుడు, అనగా షేతు, హేబెలునకు ప్రతిగా నియమించబడెను. ఆదాము ద్వారా వచ్చిన కుమారుని ఆమె గుర్తించెను; ఇప్పుడామె కయీనును గుర్తించదు, ఎందుకనగా అతడు సర్పము మూలముగా జన్మించెను. హేబెలునకు ప్రతిగా మరియొక సంతానము అని చెప్పి కయీనుకు హేబెలుకు తేడాయున్నదని ఆమె చెప్పినది. వారు ఒకే తండ్రికి చెందినవారయినచో, "ఇంకొంత ఎక్కువ సంతానము" నాకు ఇవ్వబడినది అని ఆమె తప్పకుండా చెప్పియుండును.
నేను చదువుచున్న ప్రతి దానిని నమ్మను, కాని అది నిశ్చయంగా ఒక ఆసక్తికరమగు సంగతి. 1963, మార్చి 1 లైఫ్ పత్రికలో మానసికవేత్తల నివేదికను చూచాను. సరిగ్గా ఇప్పుడు మనం చర్చించుకొన్న విషయములనే వారు వ్రాసిరి. మానసిక వేత్తలందరూ ఒకరితో ఒకరు ఏకీభవించరని నేను ఎరుగుదును, కాని ఇక్కడ ఇది చూడండి. పాములను గూర్చిన భయము అంతరంగమందుండు మానసిక అభిప్రాయము వలన వచ్చినది కాదు గాని నీవనుకోకుండానే అది వచ్చును. అది ఒక సహజమగు భయము. అటువంటి సహజ భయమున్నాగాని జనులు గొరిల్లా లేదా సింహము యొక్క గుహల ముందు ఆనందంగా ఎందుకు నిలబడుచున్నారు? కాని వారియొక్క సృహలేని ఆలోచనలు వారిని పామువైపు చూచునట్లుగా చేయుచున్నవి. ఆ పాముల యొక్క దృశ్యమే లైంగికత్వమును ప్రబోధించుచున్నట్లు అనుకోకుండా గ్రహించగలము. దీనిని జనులు ఎన్నో సంవత్సరాల తరబడి చూచుచున్నారు. ఒక తరము తరువాత మరియొక తరము వాటిని చూచుచున్నారు. పాములు ఎప్పుడూ ఆకర్షణకు వ్యతిరేకముగా ఉన్నవి మరియు ఉండును. మంచి మరియు చెడు రెండింటికిని పాము ఎల్లప్పుడు సాదృశ్యముగా యున్నది. అది అనాది కాలము నుండి ఒక మహా దృశ్యముగా ముందుకు వచ్చుచునే యున్నది. ఏదెను తోట యొక్క వివరణవలెనే అది యున్నది, అత్యధిక కోరికను చెడు పట్ల కలిగించు వ్యక్తిత్వమును పాములో చూడగలము.
దాదాపుగా ప్రపంచమంతటియందున్న ఆయా సంస్కృతిలోని తెగలవారు పామును ఆరాధించుట తరచుగా చూతుము. లైంగికత్వమునకు దానిని జోడించి పూజించెదరు. లైంగిత్వమును గూర్చి ఆధ్యయనము చేసినప్పుడు చాలా సందర్భములలో ఈ సత్యము బయటపడును. ఈ జనులు దానిని ఎక్కడ నుండి నేర్చుకొనిరో నేను తెలిసికొనగోరుచున్నాను, వారు చదువు లేనివారు, ఎన్నడును బైబిలు చదువలేదు. జల ప్రళయమును గూర్చిన గాధ ప్రపంచమంతా తెలియును, ఆ విధంగానే ఈ మానవుని పతనము గూర్చియు తెలియును. ఏదెను తోటలో ఏమి జరిగినదో వారికి తెలియును
ఇప్పుడిచ్చట ఎవరయినా నన్ను ఈలాగు ప్రశ్నించవచ్చును: సర్పము వచ్చును గనుక జాగ్రత్తగా యుండుమని అవ్వతో దేవుడు చెప్పెనా లేక సర్పమే ఆమెను వంచించెనా? ఇప్పుడు వినండి, జరుగబోవు దానిని గూర్చి దేవుడు ఏమియూ చెప్పనవసరము లేదు. ఆ గాధ యొక్క మూలాంశమును తెలిసికొనండి. ఆయన వాక్కును ఇచ్చెను. తెలివితేటలలో పాలుపొందవద్దు అని ఆయన చెప్పెను. జీవములో పాలుపొందమని చెప్పెను. దేవుని యొక్క వాక్యమే జీవము. దేవుని యొక్క వాక్యమునకు చెందనిది ఏదయినా గాని మరణమే. ఆమె ఒక్క మాటను మార్చుటకు అనుమతించెను ఆ వెంటనే సాతాను ఆమెను వంచించెను. "నీవు తినలేనివాటిని, ఎక్కువ ఫలములను తెంపవద్దని" దేవుడు చెప్పగలడు. సాతాను ఇట్లు చెప్పగలదు, "చూడు, అది పూర్తిగా సత్యమే. నీవు చాలా తెంపినట్లయితే అవి క్రుళ్ళిపోవును. కాని ఫలములను చెడకుండా నిలువచేయు విధానము ఇచ్చటున్నది, కాబట్టి నీవు కోరినవన్నియూ నీవు తెంపుకొనవచ్చును. కాబట్టి నీవు ఒకే సమయములో నీ ఇష్టమును, దేవుని ఇష్టమును కూడా జరిగించుకొనవచ్చును." చూడండి. అపవాది సరిగ్గా అక్కడే ఆమెను పట్టుకొనినది. ధర్మశాస్త్రములో ఒక్కదానిని తప్పిపోయినను మొత్తం ధర్మశాస్త్రమును తప్పిపోయినట్లే. ఆ వాక్యముతో మీరు ఆటలాడవద్దు. క్రీ.శ. 170లో అది నాశనము కాకముందు ఎఫెసీ సంఘ కాలమునకు అదే జరిగెను.
ఆ చెట్టు దేనిని ఉత్పత్తి చేసినది? తెలివినిచ్చు చెట్టు మరణమును ఉత్పత్తి చేసినది. కయీను తన సోదరుడగు హేబెలును చంపెను. దుష్టుడు నీతిమంతుని చంపెను. ఒక మాదిరిగా అది మారినది. ప్రవక్తల ద్వారా పలుకబడినట్లుగా అన్ని సంగతులు చక్కదిద్దబడు వరకు ఆ మాదిరి వచ్చుచుండును.
తెలివినిచ్చు వృక్షము వలన వివేకముగల మనుష్యులు వచ్చిరి; పేరుపొందిన మనుష్యులు జన్మించిరి, కాని వారియొక్క మార్గములు మరణ మార్గములు. దేవుని యొక్క ప్రజలు సామాన్యులు, ఆత్మ సంబంధమగు మనస్సుగలవారు, దేవుని మీద ఆనుకొని, ప్రకృతిని ఆధారము చేసికొని భూమిని దున్నుకొనుచుండిరి, మరియు సంపదకంటె ఎక్కువగా సత్యము మీద ఆనుకొనుయుండిరి. సర్పము యొక్క సంతానము అద్భుతమగు వాణిజ్యమును, ఆశ్చర్యకరమగు సాధనములను కనిపెట్టిరి, కాని వాటివలన మరణము వచ్చెను. వారి యొక్క తుపాకీ మందు మరియు అణుబాంబులు, యుద్ధములో మానవులను చంపుచున్నవి; శాంతిగానున్న సమయములో, వారి యంత్ర సాధనములగు కార్లు, మనుష్యులను చంపుచున్నవి, యుద్ధసామాగ్రి వలన చంపబడిన వారికంటె, శాంతి సమయములో వీటి ద్వారా చంపబడినవారే ఎక్కువగానున్నారు. వారి యొక్క అన్వేషణల ఫలితము మరణము మరియు నాశనము.
కాని వారు మతభక్తిగలవారు. వారు దేవునిని నమ్ముదురు. వారు తమ తండ్రియగు అపవాదివలెను, తమ మూల పురుషుడగు కయీనువలె ఉన్నారు. వారిరువురు దేవునియందు విశ్వాసముంచిరి. వారు సంఘమునకు వెళ్ళుదురు. గోధుమలతో గురుగులు ఏకమయినట్లుగానే వారు నీతిమంతులతో మిశ్రమమగుచున్నారు. ఆ విధముగా చేసి వారు చెడును, ఒక నికోలాయితు మతమును ఉత్పత్తి చేసిరి. కయీను హేబెలును చంపినట్లుగానే, వారు దేవుని యొక్క సంతానమును నాశనము చేయుటకు సర్వప్రయత్నములు చేయుచూ తమ విషమును (poison) వెళ్ళగ్రక్కుచున్నారు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
కాని దేవుడు తన స్వకీయులలో ఏ ఒక్కరినీ పోగొట్టుకొనడు. మరణము వచ్చినా గాని ఆయన వారిని భద్రపరచును. అంత్యదినమున వారిని లేవుదునని ఆయన వాగ్దానము చేసెను.
ముగింపు"జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షపు ఫలములు భుజింపనిత్తును."
ఇది ఎంత ఆశ్చర్యము గొలుపు ఆలోచన! ఏదెను తోటలోయున్న జీవవృక్షమును ఎవరును సమీపించరాదు, ఎందుకనగా ఆదాము పడిపోయెను. ఇప్పుడది జయించు వానికి ఇయ్యబడెను. కావలి కాయుచున్నకెరూబు యొక్క అగ్నిజ్వాలతో నిండిన ఖడ్గము ఒరలో పెట్టినది. కాని అది ఒరలో పెట్టబడుటకు ముందుగా దానియొక్క పదును వలన గొర్రెపిల్ల యొక్క రక్తము చిందించబడినది. ఇప్పుడది రక్తసిక్తమాయెను. ఈ సత్యమును గూర్చి కొంతసేపు మనము అధ్యయనము చేయవలెను. ఆదామునకు అతని తరువాత వారికి ఆ చెట్టును నిషేధించినా ఇప్పుడది మరల తిరిగి ఎందుకు అనుమతించబడినది అనేది చూద్దాం.
తన సృష్టియగు మానవునికి తన మాటలను వ్యక్తపరచవలెననునదియే దేవుని యొక్క ఉద్దేశ్యము. ఆదికాండములో ఆదామునకు జీవవాక్యమియ్యబడెను. "వాక్యమువలన జీవించిన జీవితము వ్యక్తపరచబడిన వాక్యమే అయి యుండును." అది నిజము కాదా? కాని ఆదాము ఆ వాక్యము వలన జీవించెనా? లేదు, ఎందుకనగా అతడు ప్రతిమాట వలనను బ్రదుకవలెను, కాని ప్రతిమాటను అతడు గైకొనుటలో విఫలమయ్యెను. ఆ తరువాత మోషే లేచెను. అతడు ఎంత గొప్ప శక్తిగల మనుష్యుడో మీరెరుగుదురు. అతడు కూడా ప్రతిమాట వలనను జీవించలేకపోయాడు, ఆ ప్రవక్త, రాబోవుచున్న మహాప్రవక్తకు మాదిరిగా యున్నాడు; వాక్యమునకు లోబడక, కోపము చెందెను. దావీదు కూడా యున్నాడు, ఇశ్రాయేలునకు గొప్ప మహా రాజు, దేవునికిష్టానుసారుడగు మనుష్యుడు. అతడు శోధనకు గురి అయినప్పుడు, వ్యభిచారము వలన పడిపోయెను. కాని చివరకు కాలము సంపూర్ణమైనప్పుడు ఒకాయన వచ్చెను. ఆయనే శిరస్సగు యేసు. ఆయన కూడా దేవుని యొక్క నోట నుండి వచ్చు ప్రతి మాటకు లోబడి జీవించునో లేదో అని అన్ని రకములుగా శోధింపబడెను. ఆ తరువాత సాతాను ఓడిపోయెను. ఎందుకనగా ఆయన "ఈలాగు వ్రాయబడియున్నది," అని చెప్పి జీవించెను. ఆ దేవుని యొక్క మహోన్నత కళాఖండము దేవుని యొక్క మాటను ప్రతిబింబించి, వానిని జయించెను. అప్పుడు ఈ బయలుపరచబడిన పరిపూర్ణుడు సిలువకు అప్పగించబడెను. పరిపూర్ణ బలికొరకు దేవుని యొక్క పరిపూర్ణ గొర్రెపిల్లగా మ్రానుమీద ఆయన మరణము నొందు గాయములను పొందెను. ఆయన ద్వారాను, ఆయన వలనను జీవవృక్షమును మనము భుజించగలగుచున్నాము. ఉచితముగా ఇయ్యబడిన ఆ జీవము వలన మనము జయించగలుగుచూ, దేవుని యొక్క వాక్యమును బయలుపరచగలుగుచున్నాము.
ఇప్పుడు ఈ దేవుని కుమారులు, ఆయన ద్వారానే జయించుచున్నారు. వారికి దేవుని యొక్క పరదైసు భాగ్యము ఇయ్యబడినది, యేసుక్రీస్తు యొక్క నిరంతర సహవాసము దొరకుచున్నది. వారికి ఏ మాత్రమూ ఆయన నుండి ఇక ఎడబాటు ఉండదు. ఆయన వెళ్ళు చోటికి ఆయన యొక్క వధువు వెళ్ళును. ఆయన తన సమస్తమును తన ప్రియ వధువుతో పంచుకొనును. అది ఒక ఉమ్మడి వారసత్వ సంబంధము. రహస్య సంగతులు బయలుపరచబడును. అంధకారములోనున్న సంగతులు వెలుగులోనికి తేబడును. మనము ఉన్నరీతిగానే తెలియబడుదుము. మనము ఆయనవలె యుందుము. ఇది జయించినవాని యొక్క అధిక్యత, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు, యేసుక్రీస్తు వాక్యము యొక్క సాక్ష్యమును బట్టియు జయించిరి.
ఆ దినము కొరకు ఎంతో మనము ఎదురు చూచుచున్నాము. వంకర మార్గములన్నియును అప్పుడు తిన్ననివిగా చేయబడును. మనము ఆయనతో కూడా యుందుము, అంతము లేని కాలమది. ఆ దినము త్వరగా వచ్చును గాక, మరియు ఆయన వాక్యము వినుటకు మనము వేగిరపడుదుము గాక! ఆ విధముగా మనము ఆయన మహిమను పంచుకొను యోగ్యతను రుజువుపరచెదము గాక!
"ఆత్మ సంఘములలో చెప్పుచున్న మాటను చెవిగలవాడు వినును గాక" ఈ మొదటి కాలము ఆత్మ యొక్క మాటను వినకుండుట ఎంత విషాదకరము! అందుకు బదులుగా అది మానవుని మాటను వినెను. కాని దేవునికి వందనములు, చివరి యుగమున ఒక గుంపు పైకి లేచును, చివరి దినము యొక్క నిజమగు వధువు మరియు ఆమె ఆత్మ యొక్క సర్వమును వినును. ఆ చీకటిగల దినమున వెలుగు వచ్చును మరియు పవిత్ర వాక్యము ద్వారా అది వచ్చును. మనము పెంతెకోస్తు యొక్క శక్తి యొద్దకు తిరిగి వచ్చి ప్రభువగు యేసుక్రీస్తును మరల ఆహ్వానించుదుము.