స్ముర్న సంఘ కాలము

స్ముర్న సంఘ కాలము

ప్రకటన 2:8-11

"స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము — మొదటివాడును, కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగానీ శ్రమను దరిద్రతను నేనెరుగుదను, (అయినను నీవు ధనవంతుడవే) తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము.ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక! జయించు వాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు."

పరిచయము

మీ మనస్సులను నూతనపరచుటకు మరల నేను ఆయా కాలములకు చెందిన వర్తమానికుల పేర్లను ఎట్లు గుర్తించానో చెప్పగోరుచున్నాను. సర్వాధికారముగల దేవుడే దీనిని గూర్చి శ్రద్ధవహించెను. క్రొత్త నిబంధన సంఘము యొక్క చరిత్రను పోలేదు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర కూడా నశించిపోకుండునట్లు దేవుడు చూచుకొనెను. దానిని బైబిలులో భద్రపరచెను. నేడు అది విశదమగుచున్నది. లెక్క లేనన్ని వ్రాత ప్రతులు, మట్టి పాత్రలు, ఇంకా ఆయా ఉపకరణములు భూగర్భ శాస్త్రవేత్తల వలన కనుగొనబడినవి. వాటికి భావము చెప్పబడెను. మొదటి కాలము నుండి ఇప్పటి వరకు జరుగుచూ వచ్చిన బైబిలు చరిత్ర యొక్క ఎడతెగని వ్యాఖ్యానము మనకు వాస్తవంగా యున్నది.

ఆ విధముగా చరిత్ర చదువుట వలన, దేవుని యొక్క మూల విధానమునకు ఏ వ్యక్తి లేదా వ్యక్తులు దగ్గరగా యున్నారో ఆయా కాలములను విశ్లేషించి కనుగొందుము. మొదటి కాలమునకు అపోస్తలుడగు పౌలు అట్టివాడని మనము చూచాము. దేవుడు తన జనులను సత్య వాక్యము యొద్దకు తెచ్చుటకు ఎవరిని వాడుకొనెనో వారిని పరీక్ష చేయవలసియున్నాము. అట్టి వారందరిలో నుండి కాలమునకు ఒకరిని చొప్పున ఒక్కొక్కరిని మనము బయటకు తీయుదుము. వాక్యము యొక్క విధానమునకు మరియు శక్తికి ఎవరు అతి దగ్గరగా నిలబడియున్నట్లుగా సవివరముగా బయలుపడునో ఆ ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలమునకు నిర్ణయించుదుము. అతడు ఆ కాలమునకు వర్తమానికుడై యుండును. చరిత్ర అధ్యయనము వలననే కాలములు కూడా చూచెదము. ప్రకటనలో యున్నట్లుగానే కాలములను గూర్చి నీవు సూక్ష్మముగా చదివినచో చాలును. అది చరిత్రకు పరిపూర్ణ మాదిరిగా పనిచేయును, నిశ్చయంగా అది సరిపడి తీరవలెను. దేవుడే ముందుగా ఆ సంఘ కాలములు గూర్చి చెప్పెను. వాటి యొక్క పరిస్థితులు బయలుపరచబడెను, ఆ తరువాత అవసరమయితే చరిత్ర యున్నది. బైబిలు చెప్పిన మాదిరిగానే అది వివరించబడియున్నది. అది చాలా సూక్ష్మముగా యున్నది — వాక్యమునకు సామాన్యతయే తాళపు చెవి. నేను వీటిన్నంటిని కలిగియుండిన ఒక పండితుని లేదా చరిత్రకారుని మాత్రమే కాదు కానీ నేను ఆత్మ సంబంధమగు మనస్సు కలిగిన వ్యక్తిగా యుండగోరుచున్నాను. దేవుని ఆత్మ యొక్క ఖచ్చితమగు నిరూపణను ఆధారము చేసికొని మాత్రమే వీరిని నేను ఎన్నుకొనియున్నాను. వారిని నేను ఆలాగునే ఎన్నుకొనియున్నాను. దేవునికి నా హృదయము తెలియును, ఇది సత్యము.

వర్తమానికుడు

ప్రతికాలమునకు వర్తమానికుని ఎన్నుకొనుటకు దేవుడు మనకిచ్చిన నియమమునే ఉపయోగించుచూ ఆ స్థానమునకు ప్రభువు ద్వారా హెచ్చింపబడినవాడు ఐరేనియస్ అని నిస్సందేహముగా చెప్పగలము. మహా పరిశుద్ధుడును, విశ్వాసయోధుడునగు పోలికార్పుకు అతడు శిష్యుడు. ఆ మహా వ్యక్తియొక్క పాదముల యొద్ద అతడు కూర్చొని అతని యొక్క సమర్పణా పాఠములను నేర్చుకొనెనని సందేహము లేకుండా చెప్పగలము. అతని యొక్క సమర్పణా జీవితములో నుండి ప్రవహించిన సత్యములను గ్రహించెను, ఎందుకనగా అన్ని కాలములలోను యుండిన నిజమగు మాదిరిగల పరిశుద్ధులలో పోలికార్పు ఒకడని అతని యొక్క నిందారహిత జీవితమును గూర్చి ఆలోచించునప్పుడు విశదమగును.

పోలికార్పు హతసాక్షి అయ్యెనని మీ యంతట మీరే చదివి తెలిసికొనవచ్చును. పారిపోజాలని వృద్ధుడతడు, అతడు బహు యధార్థవంతుడైయుండి తనను దాచుటకు ఎవరికీ అనుమతి ఇయ్యలేదు, అందువలన అతనికి శిక్ష తప్పలేదు. అతడు మరణమునకు స్వయంగా అప్పగించుకొనెను. దానికి ముందుగా అతడు ప్రభువులోయున్న తన సోదరుల కొరకు రెండు గంటలు ప్రార్ధి౦చుటకు అనుమతి కోరి, అలాగున అనుమతి పొందెను. ప్రభుత్వాధిపతి కొరకు, తన శత్రువుల కొరకు, తనను పట్టుకొన్నవారికొరకు అతడు ప్రార్థించెను. అన్ని కాలములలోని మహా పరిశుద్దులవలెనె ఒక మంచి పునరుత్థానము ఆశించి గట్టిగా నిలబడియుండి ప్రభువును నిరాకరించుటకు ఒప్పుకొనక మనసాక్షితో చనిపోయెను. అతనిని కొయ్యకు ప్రక్కన నిలబెట్టిరి. (అతని కోరికపై కట్టలేదు) తరువాత అతనికి నిప్పు అంటించిరి. అగ్ని అతని శరీరమును కాల్చుటకు ఒప్పుకొనక క్రిందికి దిగిపోయెను. అతనిని తాకుటకు నిరాకరించినది. ఆ తరువాత అతనిని ఒక కడ్గముతో పొడిచి చంపిరి. ఇది జరిగిన తరువాత అతని ప్రక్కనుండి నీరు ప్రవాహమువలె వచ్చి అగ్ని జ్వాలలను ముంచివేసెను. అతనిలో నుండి అతని ఆత్మ ఒక తెల్లని పావురము ఆకారములో వెళ్ళిపోవుటను వారు వాస్తవంగా చూచిరి. ఇది గొప్ప సాక్ష్యము అయినా గాని ఈ ప్రకటన గ్రంథమును వ్రాసిన యోహాను యొక్క శిష్యుడగు ఇతడు నికోలాయితు క్రమమునకు విరోధి కాదు, ఎందుకనగా ఇతడు సంస్థ పట్ల మొగ్గు చూపెను. సహవాసము కొరకయిన ఈ వాంఛ మరియు దేవుని పని కొరకు ఉద్దేశించబడిన ఈ పధకము, శత్రువు యొక్క పన్నాగమని అతడు గ్రహించలేకపోయెను.

ఐరేనియస్ ఆలాగు లేడు. అతడు ఏ రకమగు సంస్థకయినా గాని విరోధియే. అతని జీవిత చరిత్ర చూడండి. అతడు ప్రభువుకు సేవ చేసెను. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప ప్రత్యక్షతను పొందినవారిలో ఇతడు ఒకడు. ముందెవ్వరూ చెప్పలేని సవివరముగాను, దృఢముగాను అతడు వాక్యమును నేర్పించెను. ఆది సూత్రములను బోధించెను. ఫ్రాన్సులో నున్న అతని సంఘములు ఆత్మవరములను కలిగియుండెనని ప్రసిద్ధిగాంచినవి. అందులోనున్న పరిశుద్దులు భాషలు మాట్లాడిరి, ప్రవచించిరి, మృతులను లేపిరి, విశ్వాస సహితమగు ప్రార్ధన ద్వారా రోగులను బాగు చేసిరి. పెద్దల మధ్యను, సంఘకాపరుల మధ్యను ఎటువంటి వ్యవస్థాపూర్వక సహోదరత్వమునకైనను ప్రమాదము వాటిల్లునని అతడు చెప్పెను. ఐక్యత కలిగి, ఆత్మనింపుదల కలిగి, వరములను బయలుపరచుచున్న స్థానిక సంఘము బలమైనదిగా ఉండవలెనని అతడు గట్టిగా పలికెను. దేవుడతనిని ఘనపరచినందున పరిశుద్దుల మధ్య దేవుని యొక్క శక్తి ప్రత్యక్షమాయెను.

దైవత్వము గూర్చి అతడు కలిగియున్న గ్రహింపు విషయములో కూడా అతను స్పష్టతను కలిగియుండెను. అతడు పోలికార్పు యొక్క శిష్యుడైనందున, ఆ పోలికార్పు పరిశుద్ధ యోహానుకు శిష్యుడైనందున అతనికి ఈ విషయమందు పరిపూర్ణమగు బోధ అంది యున్నదని నిశ్చయముగా మనము గ్రహించగలము. అంటే నైసీస్ ఫాదర్స్ అను గ్రంథము యొక్క సంపుటి 1, పేజీ 412లో అతడు ఈ దైవత్వము మీద ఇచ్చిన వివరణయున్నది. "ఇతర సారాంశములన్నియును అదే విధముగా ఒకే దేవుని యొక్క బిరుదులను తెలియచేయుచున్నవి. ఆయన ఒక్కడే, ఆయన శక్తిగల ప్రభువు, యజమాని, అందరికిని తండ్రి, సర్వశక్తుడగు దేవుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త, మూలపురుషుడు ఇటువంటి బిరుదులు ఇంకా చాలా యున్నవి, ఇవి పేర్లు కాదు గాని బిరుదులు. ఆ బిరుదులు వేర్వేరు వ్యక్తుల యొక్క బిరుదులు కాదు గాని ఒకే దేవుని యొక్క బిరుదులైయున్నవి." ఇవి బిరుదులు అని తేటగా అతడు చెప్పెను. షారోను పుష్పము, ప్రకాశించు ఉదయ నక్షత్రము, పదివేలలో అతి ప్రియుడు మొదలగు బిరుదుల వంటివి. దేవుడు ఒక్కడేయున్నాడు. ఆయన నామము ప్రభువైన యేసుక్రీస్తు.

ఆ విధముగా అతడు వాక్యముతో గట్టిగా అతుకబడి యుండెను. లేఖనమును అద్భుతముగా అతడు అర్ధము చేసికొనిన విధానము, ఆ పరిచర్య మీద దేవుని యొక్క శక్తి చాలా హెచ్చుగా యుండుటను బట్టి ఆ కాలమునకు ఆయనే తగినవాడు. ఇతర యుగములలోని ఇతర వర్తమానికులందరును అటువంటి పరిశుద్ధాత్మ యొక్క ఫలము, శక్తి, నాయకత్వము మరియు వాక్యమును సరిగ్గా కలిగియుండ లేకపోవుట పూర్తిగా దురదృష్టమే.

స్ముర్న

ఈ స్ముర్న పట్టణము ఎఫెసుకు కొద్దిగా ఉత్తరము పైపుగా స్ముర్న ఆఖాతపు ముఖ ద్వారములోయున్నది. చాలా మంచి నౌకాశ్రయమును కలిగియున్నందున అది వాణిజ్య కేంద్రముగా యుండి ఎగుమతి వ్యాపారమునకు పేరు పొందినది. పాండిత్యము, వేదాంతము, వైద్యము, విజ్ఞానము నేర్పించు కళాశాలలకు ఇది పేరొందినది, మరియు చక్కని భవనములు కూడా గలవు. ఇక్కడ చాలా మంది యూదులు జీవించిరి, వారు క్రైస్తవ్యమునకు బద్ధ శత్రువులు, రోమనుల కంటెను వీరే ఎక్కువగా విరోధము చూపిరి. వాస్తవానికి, స్ముర్నలోని ప్రధమ బిషప్పుయగు పొలికార్పు యూదుల ద్వారానే చంపబడెను. అతని శవమును కాల్చివేయుటకు కట్టెలు తెచ్చుటకై యూదులు తమ పరిశుద్ధ దినమును కూడా (శనివారము) అపవిత్రపరచుకొనిరని చెప్పెదరు.

స్ముర్న అను పదమునకు "చేదు," అని అర్థము. ఇది మాచి పత్రికి సంబంధించిన పదములో నుండి వచ్చెను. శవములను భద్రపరచు సుగంధ ద్రవ్యములలో వాడు పదార్థములలో దీనిని వాడేవారు. కాబట్టి ఈ యుగము యొక్క పేరులో రెండు రకముల భావము ఇమిడియున్నది. ఇది మరణముతో నిండియున్న చేదు కాలము. సంఘము యొక్క పరిధులలోనే రెండు ద్రాక్షావల్లులు వేర్వేరు దిశలకు వ్యాపించసాగినవి, కాని కారు ద్రాక్షాతీగె, నిజమగు ద్రాక్షావల్లి పట్ల ఎంతో ద్వేషమును పెంచుకోసాగినది. కారు ద్రాక్షావల్లి యొక్క విత్తనము మరణము ఒక్కటే కాకుండా, నిజ ద్రాక్షావల్లిలో కూడా సరయిన ఎదుగుదల లేక వ్యాధిగ్రస్తమగు స్థితిలో యుండినది. వారప్పటికే కల్తీ లేని పవిత్ర వాక్యసత్యము నుండి తొలగిపోయిరి. ఇది పెంతెకోస్తు తరువాత కొద్ది సంవత్సరములకే జరిగినది. ఎంత నిజ విశ్వాసి అయినా గాని పవిత్రమగు దేవుని వాక్యమును గట్టిగా అంటుకొని యున్నప్పుడే బలముగాను, ఆత్మ సంబంధముగు ఆరోగ్యము గాను యుండును. స్వంత తెలివి పనికి రాదు, ఇందుకు పాత నిబంధనలో ఉదాహరణలు కోకొల్లలుగా యున్నవి. సంస్థ చాలా త్వరగా పెరుగుచుండును, సభ్యత్వము యొక్క సంఖ్య వలన మరణము నిశ్చయమగును కాని ఆత్మీయతరాదు, ఎందుకనగా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము తీసివేయబడి, వాక్యము యొక్క స్థానములో ఆచారములను, స్వంత నమ్మకములను, మానవ కల్పిత పద్ధతులను ప్రవేశపెట్టుదురు.

ఇశ్రాయేలీయులు చట్ట సమ్మతముగాని సంధిని లోకముతో కుదుర్చుకొని వివాహము ద్వారా సహవాసములను ఏర్పరచుకొనిరి, చివరకు ఒక దినము వచ్చెను, ఈ లోకము ఆధిపత్యమును పొంది బబులోను వారు దేవుని ప్రజలను చెరలోనికి కొనిపోయిరి. వారు చెరలోనికి కొనిపోబడినప్పుడు యాజకులను, ఆలయమును, వాక్యమును తీసుకొనిపోయిరి. వారు తిరిగి వచ్చినప్పుడు వారికి రబ్బీలు పరిసయ్యల యొక్క వేదాంత క్రమము, సమాజ మందిరము, తాల్మాద్ ఉండినవి. యేసు వచ్చేసరికి వారు బహుగా చెడిపోయి యుండిరి కనుకనే ఆయన, వారి తండ్రి అపవాది అని పలికెను. వారు శరీరసంబంధముగా అబ్రహామునకు చెందినవారే కావచ్చును. ఈ కాలములోను మనము అదే జరుగుట చూచుచున్నాము. ఏమైనా గాని "ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలీయులు కారు కాని ఒక చిన్న గుంపు మాత్రమే నిజమగు ఆత్మసంబంధమగు ఇశ్రాయేలీయులుగా యున్నారు. ఆయన తన స్వకీయుల కొరకు వచ్చు వరకు, నిజమగు క్రైస్తవుల చిన్నగుంపు ఎల్లప్పుడు ఉండును, అదే క్రీస్తు యొక్క వధువు.

ఈ పట్టణములో రెండు ప్రసిద్ధ దేవాలయములున్నవి. ఒక దేవాలము జియాస్ ఆరాధన నిమిత్తము నిర్మించబడినది, మరియొకటి సైబిల్ కొరకు నిర్మించబడినది. ఈ రెండు దేవాలయముల మధ్య ఆ ప్రాచీన కాలములకు చెందిన అతి సుందరమగు రహదారి కనుకొనగలము, దానిని సువర్ణ వీధి యందురు. నాకయితే ఇది మొదటి కాలములోనే ప్రారంభమయిన అన్యత్వమునకు రాజబాటగా కనిపించుచున్నది, కాని దాని ఉనికిని రోమ్ యొద్దనే గుర్తించిరి. దేవునిని, దేవతను కలుపు ఈ రెండు దేవాలయముల మధ్యనున్న దారి మరియు పూజకు విత్తనముగా యున్నది, మరియను దేవుని తల్లి అని పిలచిరి. యేసు క్రీస్తుతో సమానమయిన ఘనతను, బిరుదులను, అధికారమును ఆమెకు ఇచ్చుచున్నారు.

వాటిని కలుపు ఆ బంగారు వీధి నికోలాయితు సంస్థ యొక్క దురాశకు ఒక సాదృశ్యముగా యున్నది. రాజ్యమును మరియు సంఘమును కలుపుటకు అది మాదిరిగా యున్నది, ఎందుకనగా సంపద మరియు అధికారము తమకు సంక్రమించునని వారికి తెలియును. భవిష్యత్తులో రాబోవుచుండిన పెర్గమ కాలమునకు ఈ ఎఫెసు సంఘ కాలము ఒక విషాదకరమగు బీజమును నాటినది. రాబోవుచున్న బహు దుష్టత్వమునకు ఈ స్ముర్న సంఘకాలము వర్షము, వెలుతురు, ఆహారముగా యుండెను. సంఘములో విగ్రహారాధనను ప్రతిష్టించిరి, అది ఆత్మసంబంధమగు జారత్వము. అందులో నుండి ఎన్నడూ అది బయటకు రాదు. దాని యొక్క వేరు మొదలుకొని కొమ్మ వరకు మరణము కాచుకొనియున్నది. విషము, మరణము దానికి సంప్రాప్తించును.

ఆ కాలము క్రీ.శ. 170 నుండి 312 వరకు ఉండినది.

అభినందనము

ప్రకటన 2:8,

"మొదటివాడను, కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు — చెప్పు సంగతులేవనగా."

"మొదటివాడును, కడపటివాడునై యుండి మృతుడై మరల బ్రదికినవాడు." ఇవి ఒక మానవుని మాటలు కావు. "నేను మొదటివాడను, కడపటి వాడను, మృతుడనై మరల బ్రదికినవాడను," అని కేవలము ఒక మానవుడు చెప్పగలడా, (సమాధిలో నుండి మాట్లాడగలడా?) ఒక మనిషికి మొదటిది జీవము, చివరిది మరణము. కాబట్టి ఇవి మానవుని మాటలు కావు. ఈయన దైవ నరుడు. మానవుడు (ఆదాము) జీవమును స్వీకరించి మరణముగా మార్చెను. కాని ఈ నరుడు (యేసు) మరణమును స్వీకరించి జీవముగా మార్చెను. ఆదాము నిర్దోషత్వమును దోషముగా మార్చెను. ఈయన దోషమును తీసికొని నీతిగా మార్చెను. ఆదాము పరదైసును తీసికొని దానిని ఒక పనికిరాని వ్యర్థ అరణ్యముగా మార్చెను. కాని ఈయన భూమిని కుదిపి తలక్రిందులు చేసి, నాశనము చేసి క్రొత్త ఏదెనును తయారు చేయుటకు వచ్చుచున్నాడు. ఆదాము దేవునితో సహవాసము, సంతోషము గల జీవితమును తీసుకొని దానిని ఒక ఆత్మసంబంధమగు అంధకారము గల ఎడారిగా మార్చెను. అందు మూలముగా సమస్త పాపము, నైతిక పతనము, బాధ, శ్రమ, భ్రమ, చెడుతనము ద్వారా మానవుల ఆత్మలలో పోరాటములు వచ్చెను. కాని ఈయన వచ్చి విషాదకరమగు మరణమును, మానవులలో నిండియున్న భక్తిహీన స్థితిని పైన వేసికొని నీతిగల జీవితమును, సౌందర్యమును ఆయన తిరిగి తీసికొని నీతిగా మార్చెను. ఒకప్పుడు పాపము వలన మరణము ఏలుబడి చేసినది, ఆ విధముగానే ఇప్పుడు యేసు క్రీస్తను ఒక నీతిమంతుని ద్వారా జీవము ఏలుబడి చేయుచున్నది. మరియు ఇప్పుడు శిక్షా విధి లేదు, అది ఒకనాడు చాలా భయంకరమైనదిగా యుండెను, కాని ఈనాడు నిత్యజీవము ఆయన యొక్క గొప్ప వరము.

ఇక్కడ ఆయన తాను విమోచించబడినవారి మధ్య అనగా, సంఘము మధ్య నడచుచున్నాడు. ఆ విమోచించబడినవారు ఎవరు? పౌలువలె హంతకులు, దుష్టులు కారా? చాలా మంది ఆ చనిపోవుచున్నదొంగవలెను, దోచుకొనినవారివలెను, లేరా? వీరందరును ఆయన కృప యొక్క బహుమతులుగా ఉన్నారు. అందురునూ మృతులలో నుండి తిరిగి బ్రదికింపబడిరి. అందురునూ ప్రభువగు క్రీస్తు యేసునందు సజీవులుగా చేయబడియున్నారు.

మొదటి కాలమునకు ఎట్టి అభివ౦దనమును తెలిపెనో మీరు గమనించియుందురు. ఇప్పుడు ఈ కాలపు అభివందనమును గ్రహించండి. వీటిన కలిపి చూడండి. "ఏడు నక్షత్రములు తన కుడిచేత పటుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు. మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా" వీరిద్దరూ ఒక్కరే! సంఘము తనదని ఆయన మనకు తెలియచేయుచున్నాడు.

ఒక ఫలము యొక్క విత్తనము మధ్యలో ఎట్లుండునో ఆ విధముగా రాజ విత్తనము సంఘము మధ్యలో యున్నది. విత్తనములో మాత్రమే జీవముండును. ఆ విధముగా సంఘమునకు ఆయనే జీవము. ఆయనయొక్క నడక, ఆయనయొక్క అలసట లేని కాపుదలకు చిహ్నముగా యున్నది. ఆయన ప్రధాన కాపరిగా యుండి తన స్వకీయులను కాపుకాయుచున్నాడు. అది ఆయన హక్కు, ఎందుకనగా ఆయన ఆ సంఘమును తన స్వరక్తమిచ్చి కొనియున్నాడు. ఆ రక్తము దేవునియొక్క రక్తము. ఆ సంఘమునకు యజమాని దేవుడే. ఆయనే దాని హక్కుదారుడు. ఆయనే మొదటివాడు మరియు కడపటివాడు." ఆ బిరుదు నిత్యత్వమును చూపించుచున్నది. ఆయన మృతుడై యుండియు తిరిగి బ్రదికినవాడు. ఆయన వెల చెల్లించెను కాబట్టి ఆయనే దేవుని ఆలయముయొక్క ఏకైక హక్కుదారుడు. ఆయనే పరిపాలించును. దానిలో ఆయనే ఆరాధించబడును. ఆయన తనయొక్క ప్రభుత్వమును మరియు అధికారమును ఎవరైనా దుర్వినియోగపరచినచో సహించడు. ప్రతికాలములోను ఆయన తన్ను ఒక దైవముగా పరిచయము చేసికొనుటలో ఏమీ ఆశ్యర్యము లేదు. ఎందుకనగా ఆయన జనులను హెచ్చరించుచూ, ఆదరించుచున్నాడు. ఆయన కారుద్రాక్షావల్లిని హెచ్చరించుచున్నాడు. నిజమగు ద్రాక్షావల్లిని ఆదరించుచున్నాడు. ఈయనే ఆ ఒకే నిజమగు సర్వశక్తిగల దేవుడు. ఆయన మాట విని జీవించుడి.

కాలము యొక్క పరిస్థితులు

ప్రకటన 2:9,

"నీ శ్రమను, దరిద్రతనునే నెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజము వారివలన నీకు కలుగు దూషణ నేనెరుదును."

ఈ కాలమునకు ప్రధానముగా శ్రమ కలిగినదని తెలియుచున్నది. మొదటి కాలములో శ్రమ కలిగినదనిన ఈ రెండవ కాలములో ఆ శ్రమ ఇంకా హెచ్చుగా పెరిగి ఉధృతమైనదని మనకు తెలియుచున్నది. పౌలు యొక్క మాటలు నిస్సందేహముగా ఈ క్రైస్తవులందరికీ వర్తించును. వారు ప్రపంచములో ఎక్కడున్నాగాని, ఏ కాలములో యున్నాగాని, వర్తించును.

హెబ్రీ 10:32-38,

"అయితే మీరు వెలిగింపబడిన మీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి;ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పదిమందిలో ఆరడిపడితిరి. మరియొక విధముగా చూచితే వాటి ననుభవించిన వారితో పాలివారలైతిరి.ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్ఠమైనదియు, స్థిరమైనదియునైన స్వస్ధ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతి ఫలముగా గొప్ప బహుమానము కలుగును.మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, వాగ్దానము పొందు నిమిత్తము, మీకు ఓరిమి అవసరమైయున్నది.ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును.నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల, అతనియందు నా ఆత్మకు సంతోషముండదు."

దయగల హృదయము కలిగినవారు ఒక నిజవిశ్వాసితో సహవాసము చేసిన యెడల, వారి దయకు ప్రతి ఫలముగా మరణమును మాత్రమే పొందవలసి వచ్చును.

ఇప్పుడు ప్రభువగు సర్వశక్తిగల దేవుడు "నాకు తెలియును," అని చెప్పుటను వినగలము. ఆయన తన ప్రజల మధ్యను నడచుచున్నాడు. ఆయనే గొర్రెల మందకు ప్రధాన కాపరి. కానీ ఆయన హింసను రాకుండా ఆపునా? ఆయన శ్రమను తుద ముట్టించునా? లేదు, ఆయనాలాగు చేయడు. "నీ హింసను నేనెరుగుదునని మాత్రమే ఆయన సామాన్యముగా చెప్పుచున్నాడు — నీ శ్రమను నేను పట్టించుకొనుట లేదని మాత్రమే? ఆయన చెప్పును." చాలామంది జనులకు ఇది ఎంత అడ్డుబండగా యున్నది! ఇశ్రాయేలువారివలె వారును దేవుడు తమను నిజంగా ప్రేమించుచున్నాడా అని ఆశ్చర్యము కలుగును. తన ప్రజలు శ్రమపడుచుండగా, దేవుడు నిలబడి చూచుచున్నాడు గదా ఆయన నీతిమంతుడని, న్యాయవంతుడని ఎట్లు అనగలము అనుచున్నారు?

మలాకీ 1;1-3లో వారదే ప్రశ్న వేసిరి.

"ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు.యొహోవా సెలవిచ్చునదేమనగా, నేను మీయెడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు — ఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు,ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్ధ్యమును అరణ్యముందున్న నక్కల పాలుచేసితిని."

చూడండి. వారు దేవుని ప్రేమను గమనించలేకపోయిరి. ప్రేమ చూపితే శ్రమ రాదని వారు భావించిరి. ప్రేమ అనగా పసిపిల్లను తల్లి గారాబముగా చూచినట్టని తలంచిరి. కాని తన ప్రేమ "ఏర్పరచబడిన" ప్రేమ అని దేవుడు చెప్పెను, ఆయన ప్రేమకు రుజువు ఎన్నికయే. ఏమి జరిగినా పట్టించుకొనరాదు. వారు రక్షణకు ఎన్నుకొనబడితిరని ఆయన నిరూపించుటయే ప్రేమకు వాస్తవ రూపము. (ఎందుకనగా దేవుడు నిన్ను రక్షణకు ఎన్నుకొనెను. ఆత్మ యొక్క పరిశుద్దీకరణ ద్వారాను, సత్యము యొక్క విశ్వాసము ద్వారాను ఆయన దానిని జరిగించెను) ఆయన పౌలును మరణమునకు అప్పగించినట్లు నిన్నును అప్పగించవచ్చును. (యోబుకు శ్రమలను అనుమతించినట్లుగా ఆయన నీకు అనుమతించ వచ్చును. అది ఆయన యొక్క ఇష్టము. ఆయన సర్వాధికారి. కాని దీనియంతటికి ఒక ఉద్దేశ్యమున్నది. ఆయనకు ఒక ఉద్దేశ్యములేని యెడల ఆయన సమాధానమునకు కాదు గాని ఆశాభంగమునకు కర్తగా యుండును. ఆయన యొక్క ఉద్దేశ్యమును గమనించండి. మనము కొంతకాలము శ్రమపడిన తరువాత, పరిపూర్ణులముగా యుందుము. స్థిరపరచబడి, బలపరచబడి కదలక యుందుము. యోబు అదే చెప్పెను, "ఆయన మనలో బలమును ఉంచును? (యోబు 23:6) మీరు చూడండి. ఆయనే శ్రమపడెను. ఆయన తాను శ్రమపడిన సంగతుల ద్వారానే తగ్గింపును (విధేయత) నేర్చుకొనెను. ఆయన తాను శ్రమపడిన సంగతుల ద్వారానే నిజంగా పరిపూర్ణుడయ్యెను.

హెబ్రీ 5:8-9,

"ఆయన, కుమారుడైయుండియు, తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను.మరియు ఆయన సంపూర్ణ సిద్ధిపొందినవాడై, మొల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధానయాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.

మామూలు భాషలో చెప్పవలెనన్నచో యేసు యొక్క శీలము, శ్రమల ద్వారా పరిపూర్ణపరచబడెను. పౌలు చెప్పినదానిని బట్టి ఆయన కొంత పరిమాణము చొప్పున శ్రమను వారికి కూడా విడిచిపెట్టెనని అర్థమగుచున్నది. వారు దేవుని యందు విశ్వాసముంచుట వలన ఆయన కొరకు శ్రమపడుచూ, వారును ఒక సంపూర్ణ స్థాయిని చేరుకొందురు. ఆయన దీనిని ఎందుకు కోరుచున్నాడు?

యాకోబు 1:2-4,

"నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలలోపడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,మీరు సంపూర్ణులును, అనునాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారై యుండునట్లు, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి."

ఆయన ఎందుకు నిలబడి చూచుచున్నాడు? దానికి కారణమును

రోమా 8:17-18లో చూడగలరు.

"మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తు తోడి వారసులము.మన యొడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను

"ఆయనతో మనము శ్రమపడనియెడల ఆయనతో కూడా పరిపాలించలేము. నీవు ఏలవలెనన్నచో శ్రమపడవలెను. దీనికి కారణమేమనగా శ్రమపడకుండా ఆ రకమగు గుణలక్షణము రాదు. గుణలక్షణము అనగా ఒక విజయము, వరము కాదు. గుణలక్షణము లేని మనిషి ఏలజాలడు, ఎందుకనగా గుణలక్షణము వలన రాని అధికారము సాతాను సంబంధమైనది. కాని గుణలక్షణముతో కూడిన అధికారము ఏలుటకు తగినది. ఆ ప్రాతిపదిక మీదనే ఆయన తన సింహాసనమును మనతో పంచుకొనగోరుచున్నాడు. ఆయన జయించి తండ్రి యొక్క సింహాసనము మీద కూర్చుండియున్న ప్రకారము, మనమును జయించినప్పుడే ఆయనతో కూడా సింహాసనము మీద కూర్చొందుము. ఇప్పుడు మనము అనుభవించుచున్న తాత్కాలికమగు శ్రమ, ఆయన వచ్చునప్పుడు ప్రత్యక్షపరచబడబోవు అద్భుతమగు మహిమతో పోల్చినప్పుడు ఎన్నతగినదిగా యుండదు. మహాశ్రమల ద్వారా ఆయన రాజ్యములోనికి ప్రవేశించగల వారందరికి ఆయన దాచియుంచిన భాగ్యములు అన్నీ ఇన్నీ కావు.

"అగ్నివలె మిమ్మును శోధించుచున్న ఈ శ్రమలు క్రొత్తవి కాదని పేతురు చెప్పెను."

శ్రమల ద్వారా వచ్చు క్రీస్తుని పోలిన గుణలక్షణమును రూపొందించుకోవలెనని దేవుడు కోరుట వింతగా ఉన్నదా? లేదండి, మనందరికిని శోధనలున్నవి. మనందరమును కుమారులమువలె శోధింపబడి పరీక్షింపబడియున్నాము. దానిగుండా వెళ్ళని వారెవరూ ఉండరు. శ్రమలను సహించని సంఘము, శోధన నెదుర్కొనని సంఘము, దేవునికి సంబంధించినది కాదు.

హెబ్రీ 12:6,

"ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించునట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి."

స్ముర్నలోయున్న ఈ ప్రత్యేక స్థితిని ప్రతి కాలమునకు దీనిని అన్వయింపవలెను. దానిని వర్తింపకుండా ఉండు కాలము లేనే లేదు. దానిని పొందని నిజవిశ్వాసి లేడు. ఇది దేవుని మూలముగా వచ్చును. ఇది దేవుని యొక్క చిత్తము. ఇది అవసరము. మనము శ్రమపడి ఆలాగు చేయుటలో క్రీస్తును పోలియుండవలెనను సత్యమును ప్రభువు మనకు బోధించవలసిన అవసరమున్నది. "ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును."

మత్తయి 5:11-12,

"నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.సంతోషించి ఆనందించుడి: పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి."

జీవితములో మేఘములు కమ్మియుండుట మరియు తుఫానులు దేవుని కోపమునకు కారణములు కావు. ఆలాగే మబ్బులు లేని మేఘములు, శాంతికరమగు జలములు ఆయన యొక్క ప్రేమకు మరియు అంగీకారమునకు సూచనలు కావు. ఆయన మనలనెవరినయినా గాని ప్రియులగానే స్వీకరించును. ఆయన ప్రేమ ఎన్నికతో కూడినది. జగత్తు పునాది వేయబడకముందే ఆయన దానిని మనపట్ల చూపెను. ఆయన మనలను ప్రేమించుచున్నాడా? అవును. కాని ఏలాగు మనకు తెలియును? ఆయానాలాగు చెప్పెను గనుక మనము ఎరుగుదుము. మనలను ఆయన ప్రేమించునట్లు కనుపరచెను, ఎందుకనగా ఆయన మనలను తన వైపుకు ఆకర్షించుకొని తన ఆత్మను మనకు ఇచ్చెను. మనలను కుమారులముగా స్వీకరించెను. నా ప్రేమను ఆయనకు ఎట్లు నిరూపించెదను? ఆయన చెప్పిన దానిని నమ్ముట ద్వారాను, శ్రమల మధ్య సంతోషించుట ద్వారాను, ఆయన తన జ్ఞానము ద్వారానే వీటన్నింటిని రానిచ్చుచున్నాడని ఎరుగుట ద్వారాను నిరూపించెదను.

"నీ దరిద్రతను నేనెరుగుదును? (అయినను నీవు ధనవంతుడవే)."

మరల ఇక్కడ ఉన్నది. చూడండి, ఆయన తన సంఘము మధ్య పైకి, క్రిందకు సంచరించుచున్నాడు. ఒక తండ్రి తన యింటిని (కుటుంబమును) చూచు విధముగా ఆయనే తన ఇంటికి శిరస్సు. ఆయనే ఏర్పరచువాడు. ఆయనే సంరక్షకుడు. అయినా గాని ఆయన వారి దరిద్రతను చూచుచున్నాడు. ఓ, ఇది గ్రహించని విశ్వాసి ఈ విషయములో ఎట్లు తప్పిపోవునో చూడండి. ఆయన స్వంతవారు అవసరము కలిగియుండిన సమయములో ఆయన చూచుచూ ఎట్లా ఊరకుండగలడు. దానినంతటినీ ఆయన ఆపడు — వారికి ధారళముగా ఆయన ఇచ్చునా?

దేవుని యొక్క ప్రేమ, మంచితనము మరియు జ్ఞానము గూర్చి ఇక్కడ మీరు మరల విశ్వసింపవలెను. ఇది కూడా అవసరమే. ఆయన యొక్క హెచ్చరికను గుర్తుంచుకొనండి. "ఏమి తిందుమా, ఏమి ధరించుకొందుమా అని రేపటిని గూర్చి మీరు చింతింపకుడి. మీకు అవసరమగునది ఏదో మీ తండ్రికి తెలియును. గడ్డి పువ్వులను అలంకరింప చేయుచున్నవాడు, పిచ్చుకలను పోషించుచున్నవాడు. మీ కొరకు ఇంకా శ్రేష్టమైనవి చేయగలడు గదా? ఈ భౌతిక విషయములు నిజంగా మీ జీవితమునకు ప్రధానమగు అవసరములు కావు. ఎందుకనగా ఒకనికి కలిగియున్న వస్తు సంపదనుబట్టి వాని జీవితము తృప్తి చెందదు, కాని మీరు మొదట ఆయన యొక్క రాజ్యమును మరియు నీతిని వెదకుడి. అప్పుడు ఈ వస్తు సంబంధమగు అవసరతలన్నియు మీకు దొరకును."

దేవుని యొక్క ప్రజలు వస్తు సంబంధమైన (లోకసంబంధమైన) మనస్సుగలవారు కారు. వారు క్రీస్తు-మనస్సును కలిగినవారు. వారు ఈ క్రింద ఉండిన నిధులను వెదకుట లేదు. వారు పైనున్న వాటిని వెదకుచున్నారు. ఇది పూర్తిగా నిజము. క్రైస్తవులలో ఎక్కువమంది ధనికులు కారు. వారు పేదవారిగా ఉన్నారు. యేసు దినములలోనూ అంతే. పౌలు దినములలోను అంతే. ఈ దినమున ఆలాగే యుండవలెను. కాని ఈ దినమున నిజంగా ఆలాగు లేరు, ఎందుకనగా లవొదికయ సంఘ కాలములో బహు విస్తారమగు సంపదయున్నది. భూసంబంధమగు వస్తువులు ఎంత ఎక్కువగా యుంటే అంత గొప్ప ఆత్మసంబంధులని పరిగణింపబడుచున్నారు. వస్తు సంబంధముగా సంఘము చాలా ధన సమృద్ధి కలిగి యున్నది, కాని ఆత్మ విషయములో ఎంత పేదగా యున్నదో చూడండి. "పేదలగు మీరు ధన్యులు, దేవుని యొక్క రాజ్యము మీది. దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు." అది వస్తు సంబంధమైనది కాదు. అది మనలోనే యున్నది. దేవునియందు ధనికుడే నిజమైన ధనికుడు. లోకసంబంధమగు వాటిలో ఐశ్వర్యవంతుడు కాదు.

"ఓ," "నీ దరిద్రతను నేనెరుగుదును. నీ అవసరతను నేను చూచుచున్నాను. నీకు గొప్ప చెప్పుకొనుటకు ఏమియూ లేదు. నీకున్నదంతయూ నీ యొద్ద నుండి తీసివేయబడినది. నిత్యమగు వాటికొరకు నీవు సంతోషముగా, నీ ఆస్తులను నీవు త్యజించియున్నావు. నిన్ను చూచి వారు నవ్విరి. నిన్ను వారు హేళనచేసిరి. నీకు ఏవస్తు సంబంధమగు ఆధారము లేదు. అయినా గాని నీవు ధనికుడవే. నీ భద్రత ఆయనలోనే దాచబడియున్నది. ఆయన నీ కేడెము. మరియు అత్యధికమగు గొప్ప బహుమానము. నీ రాజ్యము ఇంకనూ రానైయున్నది. కానీ అది వచ్చును. అది నిత్యమూ ఉండు రాజ్యము. అవును, నీ శ్రమలను, నీ శోధనలను నేను మరువలేను. వాటిని సహించుట ఎంత కష్టమో నాకు తెలియును. కాని నిన్ను నా స్వంతవానిగా నేను చేర్చుకొనునప్పుడు, దీనినంతటినీ నేను జ్ఞాపకము చేసికొని నీకు బహుమానము ఇచ్చెదను? అని ఆత్మ కేకవేయుచున్నది."

ఇది ధనవంతులకు వ్యతిరేకము కాదు, ఎందుకనగా దేవుడు ఒక ధనవంతుని రక్షించగలడు. కొందరు దేవుని బిడ్డలు ధనికులు. కాని డబ్బు ఒక ఉరి, దానిని కలిగియున్న వారికే కాదు గాని దానిని కలిగియుండని వారికిని అది ఉరియే. మొదటి కాలములోనే యాకోబు ఆ ధనసమృద్ధి కొరకు పాటుపడుచున్నవారిని చూచి ఇట్లు పలికెను, "మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క విశ్వాసము పక్షపాతము కాదని చెప్పెను." అక్కడున్నట్టి పేదవారు సహాయము పొందుట కొరకు ధనికుల యొక్క కాళ్ళు పట్టుకొనుచుండిరి. దేవునియందు అంతగా విశ్వాసముంచలేదు. ఆలాగు చేయవద్దని యాకోబు పలికెను, "ఆలాగు చేయరాదు. డబ్బే ప్రధానము కాదు. డబ్బు జవాబు కాదు." ఈ రోజు కూడా అది జవాబు కాదు. ఇంతకు ముందు ఎన్నడూ లేనంత ధనము ఇప్పుడు మనకున్నది. అయినాగాని ఆత్మ సంబంధముగా ఎక్కువ నెరవేర్చలేకపోవుచున్నాను. దేవుడు డబ్బులో పనిచేయడు. ఆయన తన ఆత్మ ద్వారా సంచరించును. ఆ ఆత్మ యొక్క కదిలింపు వాక్యమునకు అంకితమగు జీవితము మీదికి మాత్రమే వచ్చును.

సాతాను యొక్క సమాజము

ప్రకటన 2:9,

"తాము యూదులమని చెప్పుకొనుచూ యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును."

బాగుగా ఆలోచించవలసిన ఒక అంశము ఇచ్చట ఉన్నది. ఇది చాలా వింతగా యుండుటబట్టి మూత్రమే కాదు గాని ఆ తరువాత వెయ్యి సంవత్సరములకు మరల పునరావృతమైనది.

ప్రకటన 2:9

"నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. (అయినను నీవు ధనవంతుడవే) తాము యూదులమని చెప్పుకొనుచూ యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దేవదూషణ నేనెరుగుదును."

యూదులు, అను పదముతో మొదట ప్రారంభించినట్లయితే అది యూదా ప్రజల మతమును వివరించుట లేదు. యూదా జనులను గూర్చి మాత్రమే ఇది వివరించుచున్నది. నేను ఐరిష్ గా జన్మించి యున్నానని చెప్పితే ఎట్లు౦డునో ఆలాగే దీని భావమున్నది. తాము వాస్తవంగా యూదులమని ఈ జనులు చెప్పుకొనుచున్నారు. జన్మ ద్వారా యూదులే నిజమగు యూదులు. వారు అబద్ధికులు. వారు జన్మను బట్టి యూదులు కారు, వారు మతమును బట్టియు యూదులు కారు.

ఇదంతయూ నిజమైనవో మరి వీరెవరు? వారు మోసపుచ్చబడిన జనులు. వారింతకు ముందే సంఘములో భాగామైయున్నారు. వారు కారు ద్రాక్షావల్లికి చెందియున్నారు.

వారు నిజ సంఘమునకు చెందినవారు కారు, అబద్ద సంఘమునకు చెందిన వారు. ఎందునకగా వారిని గూర్చి దేవుడిట్లు చెప్పెను, "వారు సాతాను సమాజపు వారు." సమాజము అను పదము మనము మన సంఘమునకు ఉపయోగించుచున్నవంటి పదము కాదు. బైబిల్ లో సంఘమునగా "బయటకు పంపబడినది" లేదా "బయటకు పిలువబడినదని" అర్థము. ఈ ఏర్పరచబడిన జనుల గూర్చి కీర్తనకారుడు చెప్పెను.

"నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తిపొందెదము."

కీర్తనలు 65:4.

సమాజమనగా "కూడిక లేదా గుంపు" అని అర్ధము. ఇది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు, కాని ఈ సందర్భములో ఇది చెడ్డది. వీరు తమంత తాముగా కూడుకొనిరి కాని ఇది దేవుని సంబంధముగా ఏర్పడినది కాదు. యెషయా వారిని గూర్చి చెప్పెను.

"జనులు గుంపు కూడినను, వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు." యెషయా 54:15.

వీరు నిజంగానే మంచి ద్రాక్షావల్లికి విరోధులు గనుక దేవుడు ఒక దినమున వారిని నాశనము చేయును.

సంఘ పరిధులలో కూడుకొనిన ఈ మిశ్రమ జనులు యూదులమని ఎందుకు చెప్పుకొనుచున్నారు? దానికి కారణము ఇది: వారు అబద్ధికులు గనుక తమ కిష్టము వచ్చినట్లుగా వారు చెప్పుకొనగలరు. తాము కోరుకొనిన దానిని వారు పలుకగలరు. అది సత్యమయినట్లుగా వారు దానిని అంటిపెట్టుకొనియుండగలరు. ఈ సందర్భములో వారు తమ మనస్సులో చాలా శక్తిగల ఆలోచన కలిగియుండి అబద్ధమాడుచున్నారు. ఆది సంఘము దాదాపుగా యూదులతో నిండిపోయియుండి వారు ఆయన శరీరములోని అసలు సభ్యులుగా ఉన్నారు గదా? పండ్రెండు మంది అపోస్తలులు యూదులు. ఆ తరువాత అపోస్తలులు కూడా యూదులు లేదా మతాంతరము చెందినవారు కావచ్చును. ఆ విధముగా ప్రమాణము చేసినవారికి అనగా, తాము యూదులమని చెప్పుకొనినవారికి ఒక అధిక్యత లేదా ప్రధానత్వము అనుగ్రహించబడెడిది. వారు అబద్ధము చెప్పి దానికి అంటుకొనియుండెడివారు. వాస్తవమును గాని, చరిత్రను గాని వారు లెక్కచేసెడివారు కారు. ఆలాగు చెప్పుచూ జనులకు అది నిజమేనన్నట్లు భావన కలిగించేవారు, అందువలన త్వరలోనే వారిని జనులు చేర్చుకొనెడివారు.

ఇక్కడ మీరు ఒక సంగతిని గమనించారా? ఈనాడు సంఘములో అదే ఆత్మ యున్నది గదా? మేమే అసలయినవారమని, నిజ సంఘమని, మాలోనే రక్షణ యున్నదని చెప్పుకొనువారు లేరా? తాము పేతురు యొద్ద నుండి పరలోక రాజ్యపు తాళపు చెవులు పొందియున్నామని వారు చెప్పుకొనుట లేదా? తమ మొదటి పోపు, పేతురు అని; రోమ్ లో అతడు జీవించెనని వారు చెప్పుట లేదా? కాని అందుకు చారిత్రక ఆధారము ఏ మాత్రమునూ లేదు. అది చెప్పు అబద్ధములను అందులో ఉన్న అతి విద్యావంతులు, పండితులు కూడా నమ్ముచున్నారు. సాతాను యొక్క సమాజము! వారి తండ్రి సాతాను అయిన ఎడల వాడు అబద్ధములకు జనకుడు. కాబట్టి ఈ సమాజములలో అబద్ధికులుండుట పెద్ద వింత ఏమీ కాదు.

దేవదూషణ గూర్చి ఆలోచించండి. ఈ సాతాను సమాజము వారు ఈ సందర్బములో దేవుని దూషించుట లేదు గాని నిజ సంఘమును దూషించుచున్నారు. (చెప్పకుండానే వారిది చేయుచున్నారు) నిశ్చయంగా! కయీను హేబెలును హింసించి చంపినట్లుగానే ఇది యున్నది, ఎందుకనగా అతడు (కయీను) దుష్టుని సంబంధి. మృత ఆచారములను వెంబడించుచున్న యూదా వారు క్రైస్తవులను నాశనము చేయవలెనని ప్రయత్నము చేసిరి. (వారు అపవాది పిల్లలని యేసు చెప్పెను) మొదటి కాలములోని ముందు సంవత్సరములలో వారాలాగు చేయగోరిరి. ఇప్పుడు ఇదే గుంపు (కారు ద్రాక్షావల్లి) ఈ రెండవ కాలములో నిజమగు విశ్వాసిని నాశనము చేయుటకు చాలా బలముగా ప్రయత్నములు చేయుచున్నది. ఆ క్రీస్తువిరోధి ఆత్మ ఎదుగుచున్నది.

ఆ గుంపు దాని క్రియలను చాలా నెమ్మదిగా సంఘములోనికి ప్రవేశపెట్టి (నికొలాయితులు) ఇప్పుడు బయటకు వచ్చుటకు భయపడుటలేదు. అది తన స్వంత గుంపులో ఒక సంస్థగా మారినది. నిజ సంఘము మీదికి ప్రత్యక్షముగానే శత్రుత్వమును ప్రకటించి వచ్చుచున్నది.

ఇది వ్యవస్థీకృతమగు క్రీస్తువిరోధి సంఘమని నేను చెప్పియున్నాను. అధికారయుతమగు చరిత్రను బట్టి నేను ఇది సత్యమని మీతో చెప్పుచున్నాను. మొదటి సంఘము రోమ్ లో కనుగొనబడినది. క్రైస్తవ నామములు మరియు అర్ధములతో అన్య మతమును పరిచయం చేయుట ద్వారా దేవుని యొక్క సత్యమును, అబద్ధముగా ఎప్పుడో మార్చి యున్నది. (పెర్గము సంఘ కాలములో మనము దాని చరిత్రను చూచుదము) రెండవ కాలము వచ్చుసరికి అది మరింత అన్య మతమయిపోయినది. (నిజ సంఘముని చెప్పుకొనుచూ) పోలికార్పు దాదాపు 1500 మైళ్ళ దూరము నుండి చాలా వృద్ధాప్యములో వచ్చి వెనుకకు మరలుడని వారిని బ్రతిమలాడెను. వారతనికి లోబడలేదు. వారికి గట్టి సంప్రదాయము, గట్టి సంస్థ ఏర్పడినవి. వాక్యము నుండి పూర్తిగా దూరస్తులయిరి. ఇది సాతాను సమాజముగా మారిపోయినది. పూర్తిగా దేవదూషణను చూపినది. అప్పటికే నికోలాయితు బోధ యొక్క బీజములు ఉండినవి. ఇది వాస్తవానికి శక్తిగల మతముగాను, సాతాను పీఠముగాను మారిపోవును. ఇది ఆ ప్రకటన 2:9కి అక్షరాలా సరిపోయినది. ఈ జనులు సాతాను "యొక్క" సమాజమునకు చెందినవారని చెప్పలేదు గాని వారే సాతాను సమాజమని చెప్పెను.

ఈ క్రీస్తువిరోధి ఆత్మ క్రొత్తది కాదు. కేవలము ఈ సంఘ కాలములలో మాత్రమే వచ్చినది కాదు. ఇది ఎప్పటినుండో యున్నది. అదెట్లు పనిచేయునో, దేవునికి వ్యతిరేకముగా ఎట్లు వెళ్ళునో, సంఘములో ఎట్లు ప్రవేశించునో చూడవలెనని కోరుచున్నాను. పాత నిబంధనను చూడండి, అందులో మీరు కనుగొనగలరు. ఆ ఆత్మను మనము పరీక్షించుదము, అది ఇశ్రాయేలులో బయలుపరచబడి ఐగుప్తులో నుండి బయటకు వచ్చి అరణ్యములో సంఘముగా యుండినది.

ఆది సంఘము ఖచ్చితమగు పరిశుద్ధాత్మపరిచర్య క్రింద ప్రారంభమయినది. సూచక క్రియలు, అద్భుతములు, ప్రవచనము, భాషలు, భాషలకు అర్థము, జ్ఞానము, తెలివి, స్వస్థత మొదలగు ప్రత్యక్షతలు కనబడినవి. ఐగుప్తును విడిచి వచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని ఆత్మ యొక్క నాయకత్వము క్రింద యుండినప్పుడు వరములు ప్రత్యక్షమయినవి. ఆ ప్రజలకు దేవుడే నాయకుడు. వాస్తవానికి ఆయనే వారి రాజు, ఆయన తండ్రియైన రాజు. ఒక వ్యక్తి తన కుటుంబమును గూర్చి ఎట్లు శ్రద్ధవహించునో ఆ విధంగా ఆయన ఇశ్రాయేలీయులను గూర్చి శ్రద్ధవహించెను. ఆయన వారిని పోషించెను, వారి తరపున ఆయన యుద్ధములను చేసెను. వారియొక్క కష్టములన్నింటి నుండి బయటకు తీసికొని వచ్చెను. వారియొక్క సమస్యలను పరిష్కరించెను. ఆయన వారిమీద రెక్కలుచాపి యుంచినట్లుగా కమ్మియుండెను. ఆయన నిజంగా వారికి అనగా ఆ దేశమునకు మాత్రమే దేవుడు. కాని ఒక దినమున వారు చుట్టు ప్రక్కలకు చూడవలసి వచ్చెను. ఫిలిస్తీయులను, ఇతరులను చూచెను. వారికి రాజులుండిరి. అది వారి కన్నులను పట్టుకొనినది. వారు కూడా తమకు నాయకునిగా ఒక మానవుని నియమించుకొనవలెనని నిర్ణయించుకొనిరి. వారు రాజు కావలెనని కోరుకొనిరి. కాబట్టి దేవుడే వారికి స్వయంగా ఒక నాయకుని నియమించెను, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అను వ్యక్తి కాని వారికి ఆయన నచ్చలేదు. దేవుని యొక్క సంకల్పమును సాతాను ఎరిగినది. కాబట్టి వాడు జనుల హృదయములలో దేవుని (వాక్యము) పట్ల ఏహ్య భావమును కలుగజేసెను.

మరియువారు సమూయేలును సమీపించి తమకు రాజు కావలెనని అడిగినప్పుడు సమూయేలు చాలా నిరాశ చెందెను, దాదాపు అతని గుండె ఆగిపోయినది. ఈ సమర్పణగల, లేఖన ప్రత్యక్షతగల ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలను నడిపించుచుండగా తనను వారు విసర్జించిరని ఆయన తలంచెను. అతడు జనులను పోగుచేసి దేవుని నుండి దూరస్తులు కాకూడదని బ్రతిమలాడెను. వారిని ఆయన పిల్లలను చూచినట్లుగా చూచెను, వారిని వర్ధిల్లచేసెను, వారిని ఆశీర్వదించెను, అయినా గాని వారు ఒప్పుకొనలేదు. వారు సమూయేలుతో ఇట్లనిరి, "నీవెన్నడునూ నీ నాయక్వతములో తప్పు చేయలేదు, మరియు ఆర్థిక వ్యవహారములలో ఎన్నడునూ నీవు పొరపాటుచేయలేదు. యెహోవా యొక్క వాక్యపు వరుసలోనికి మమ్మును తెచ్చుటకు నీవు శాయశక్తులా పనిచేసియున్నావు. మేము దేవుని యొక్క అద్భుతములను, జ్ఞానమును, ఏర్పాటును, రక్షణను ప్రశంసించుచున్నాము. వాటియందు మేము విశ్వాసముంచుచున్నాము, మరియు అది మాకు చాలా ఇష్టము. ఇంకా చెప్పాలంటే అది లేకుండా మేముండలేము, కాని మాకు యుద్ధములో నాయకత్వము వహించుటకు ఒక రాజు ఉంటే చాలును. అయితే మేము యుద్ధమునకు వెళ్ళునప్పుడు మాకు ముందుగా యాజకులే వెళ్ళవలెనని ఉద్దేశ్యము కలిగియున్నాము, యూదాయే వెంబడించవలెను, మేము బూరలను ఊదెదము, పాటలు పాడెదము, మరియు గట్టిగా అరచెదము. వాటిని వేటినీ మేము ఆపుటకు ప్రయత్నించుట లేదు. కాని మాకు ఒక రాజు కావలెను, అతడు మాలో ఒక్కడై యుండి మమ్ములను నడిపించవలెను."

దేవుడు సమూయేలుతో ఇట్లనెను, "చూడుము! వారు నిన్ను విసర్జించలేదు గాని వారిని పరిపాలించకుండా నన్నే వారు విసర్జించిరి."

అది ఎంత విషాదకరమో చూడండి. తక్కిన ప్రపంచమువలెనె మాకును రాజు కావలెనని వారు కోరుకొనిరి. దేవునిని వారు విసర్జించుచున్నట్లుగా వారికి ఏ మాత్రము తెలియలేదు, ఎందుకనగా దేవుడు తన జనులు ప్రపంచమువలె కాకుండా వేరుగా ఉండవలెనని కోరుచున్నాడు. వారు లోకమునకు సంబంధించినవారు కారు, వారు లోకము వలె కనబడకూడదు, వారు లోకమువలె ప్రవర్తించరాదు. వారు లోకమునకు సిలువ వేయబడి యున్నారు, లోకము వారికి సిలువ వేయబడియున్నది.

II కొరింధీ 6:17-18,

"నేను వారితో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. మీరు నాకు కుమారులును, కుమార్తెలునై యుందురని, సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు."

ఇశ్రాయేలుకును, మిగిలిన దేశములకును మధ్యగల తేడా, దేవుడే అని మీరు చూడగలరు. దేవునిని తీసివేసినప్పుడు ఇశ్రాయేలు వారు ఇతర దేశముల వారివలెనె యుందురు. సంసోను జట్టు కత్తిరించుకొనినప్పుడు అందరి మనుష్యులవలె యున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమును ఒక ప్రక్క పెట్టినప్పుడు, ఇక సంఘము ఏమియూ కాదు. దేవుని పేరు తగిలించుకొనిన సంఘముగా మాత్రమే యుండును. యాకోబు మరియు ఏశావులు ఒకే తల్లిదండ్రులకు పుట్టియున్నట్లుగా, ప్రపంచము మరియు సంఘము ఒకే ముద్ద నుండి వచ్చినవి, కాని దేవుని యొక్క ఆత్మవలన తేడా కనబడును.

నిన్నునీవు క్రైస్తవునిగా పిలుచుకొనినా అది ఏమి కాదు. ఎవరయినా ఆలాగు చెప్పుకొనవచ్చును. కాని నీతో దేవుని యొక్క ఆత్మను కలిగియున్నావా లేదా అనునదే అసలయిన ప్రశ్న, ఆ ఆత్మ లేనియెడల నీవు భ్రష్ట మనస్సుగలవానిగానే యుందువు; లేనియెడల నీవు ఆయన వానివి కావు. ఆమేన్.

కొంతకాలము క్రిందట నేను ఒకామెను, "నీవు క్రైస్తవురాలవా" అనడిగాను. ఆమె నాతో ఇట్లన్నది, "అయ్యా! ప్రతి రాత్రి నేను క్రొవ్వొత్తిని వెలిగించుచున్నాను." దానివలన ఏమి లాభము? నేను మెథడిస్టును, నేను బాప్టిస్టును, నేను పెంతెకోస్తును అని చెప్పుచున్నారు. దానితో ఏమీ దేవునికి సంబంధములేదు. పరిశుద్ధాత్మ లేనియెడల నీవు నశించెదవు.

ఆ మొదటి సంఘము ప్రారంభములో చూడండి, దేవునిని ఎట్లు అభివృద్ధి చేయవలెనా అని వారు ఆలోచించిరి. నికొలాయితుల యొక్క క్రియలు వారిలో కనబడుట ప్రారంభమయినది. ఆ తరువాత ఒక గుంపు రూపొందినది. వాక్యము యొక్క పద్ధతిని వారు విడనాడిరి. ఒక్క మాటను మార్పుచేసినచో చాలును. చిన్న పులిపిండి మొత్తం ముద్దంతటిని పులియునట్లుగా చేయును. ధర్మశాస్త్రములోని ఒక్క విషయము గూర్చి అభ్యంతరపడువాడు అన్నింటిలోనూ దోషిగానే రుజువగును. ఒక్క మాటను హవ్వ మార్చినది. అందువలన ఇదంతా జరిగినది.

సాతాను నాయకునిగా గల ఆ గుంపు ఏర్పడినది. నిజవిశ్వాసులను అది ద్వేషించుచూ, పోరాడుటకు మొదలు పెట్టినది. తామే దేవుని సంఘమని చెప్పుకొన మొదలిడిరి. (వారు అన్యులు)

సంస్థ ఎట్లు ద్వేషమును పురిగొల్పినదో గమనించండి. అది సహవాసమును నాశనము చేసినది. అది ద్వేషమును తీసికొని వచ్చినది. అదే ఈ చేదుకు అర్థము. ఈ స్ముర్న దీనితోనే పూర్తిగా నిండియున్నది. చేదు, ద్వేషము, ద్వేషము యొక్క వేరు, చాలా మందిని పాడుచేయును. కాబట్టి ఆ అపవిత్రత చాలా ఎక్కువగా పెరిగిపోవుచున్నది. ప్రతి కాలములోను దాని యొక్క గాయపు మచ్చలను చూడగలము.

స్ముర్న సంఘము ఆది సంఘము నుండి చాలా దూరముగా తొలగిపోయినది. అది ఒక సంకరపు జాతిగా మారినది. హవ్వ చేసినట్లుగానే అది కూడ సంకరముగా దానిని మార్చినది. రెండు జాతులను మిశ్రమము చేసినప్పుడు, సంకరము ఏర్పడునని మీకు తెలియును. దాని యొక్క ఫలితముగా అసలయినది పోవును, కల్తి మిగులును. అది మిశ్రమముగా యుండును. హవ్వ తన భీజముతో మృగము యొక్క బీజమును కలుపుటకు అవకాశమును ఇచ్చినప్పుడు కయీను అను ఒక జీవిని ఆమె పుట్టించినది. అతడు పూర్తి మానవుడు కాడు. వాడు దుష్టుని సంబంధి. హేబెలుకు అతనికి ఎంత తేడా యున్నదో గమనించండి. షేతుకు అతనికి ఎంత తేడా యున్నదో చూడండి. అతడు దేవుని ద్వేషించెను మరియు వాక్యమునకు విధేయుడు కాక నీతిమంతుని హింసించి చంపెను. దేవుని వాక్యముకంటే తానే గొప్పవానిగా ఎంచుకొసెను.

సంఘము కూడా మూల స్థితినుండి దిగజారిపోయినది. ఆమె సంకర జాతియైనది. నామకార్ధ సంఘము సంకరజాతియైనదే. "నేను బాప్టిస్టునని" కొందరు చెప్పుకొనుచుందురు. ఆదియందు ఆలాగు లేదు. "నేను మెథడిస్టుని" మరికొందరు చెప్పుకొందురు. ఆదియందు ఆలాగున లేదు. దేవుని వాక్యమును సూటిగా స్వీకరించుటకు బదులుగా, సంఘములో ఆత్మ నింపుదల గలవారిని కలిగియుండుటకు బదులుగా, ఆత్మ అనుగ్రహించిన ప్రత్యక్షత ద్వారా నడిపించబడుటకు బదులుగా; ఇప్పుడు ఆచారములు, కట్టుబాట్లు, విద్యగల వారి యొక్క విద్యా ఊహాగానములు చోటు చేసికొనినవి. ప్రత్యక్షత యొక్క చోటును నేర్చుకొను పద్ధతి ఆక్రమించినది. విశ్వాసమునకు బదులుగా హేతువాదము వచ్చినది. పరిశుద్ధాత్మతో దేవునిని స్తుతించుటకు బదులుగా, కార్యక్రమములు చోటు చేసికొనినవి. ఆదిలో ఆలాగున లేదు. మొత్తం జాతియే మారిపోయినది. అది ఒక సంకరపు సంఘముగా మారినది.

సంకరపు జాతిగా మారిన సంఘము పవిత్రమగు క్రైస్తవులను ఉత్పత్తి చేయగలదా? చేయజాలదు. క్రైస్తవులను పుట్టించు జీవముగాని, విత్తనముగాని వారిలో లేదు. ఎటువంటిది మరల అటువంటి దానినే పుట్టించును. బాప్టిస్టులు ఇంకా ఎక్కువ మంది బాప్టిస్టులు పుట్టించుదురు. వారు బాప్టిస్టులవలె ప్రవర్తించెదరు. మొతడిస్టులు మొతడిస్టు వారినే పుట్టించెదరు. వారు మొతడిస్టు వారివలె ప్రవర్తించెదరు. ఏ ఒక్కరిలోనూ దేవుని యొక్క శక్తి యుండదు. వారది కావలెనని కూడా కోరుకొనరు. వారు దేవునిని ఆచారముల వలననే ఆరాధించెదరు మరియు వారి పద్ధతులు, బోధలు అలాగే యుండును.

సంకరము గూర్చి మాట్లాడినచో. ప్రపంచములోని అతి గొప్ప సంకరము ఏది మీకు తెలియునా? అది చాలా కాలము నుండి మనతోనే యున్నది. అది కంచర గాడిద. గాడిదకును, గుర్రమునకును మధ్యగా అది సంకరమువలన పుట్టినది. అది ఒక వింత రకమగు జంతువు. అది ప్రత్యుత్పత్తి చేయజాలదు. అందుకు కావలసిన జీవము దానిలో లేదు. అయినా గాని పనికి పెట్టింది పేరు. అది గాడిదను లేదా గుర్రమును మించి పని చేయును. కాని దాని స్వభావమును గమనించండి. అది చాలా మొండిది. దానిని నీవు ఎన్నడూ నమ్మలేవు. సంకరపు మతమునకు అది ఒక పరిపూర్ణ చిహ్నము. సత్యము మరియు చీకటిని సంకరము చేసిరి. గుర్రము ఒక నిజ విశ్వాసికి మాదిరి. గాడిద నీతి లేనివానికి మాదిరి. వాటిని నీవు మిశ్రమము చేసినప్పుడు ఒక వంధ్యత్వము, మాదిరి మతము వచ్చుచున్నది. అందులో జీవపు బీజము లేదు. అది చచ్చినది. అది సత్యమును గురించి మాట్లాడును కానీ దానిని ఉత్పత్తిచేయలేదు. దాని మధ్యను దేవునిని కలిగియుండదు, అయినా గాని వారు కూడికొని దేవుని గూర్చి మాట్లాడుచుందురు. ఎల్లప్పుడును వారు క్రమబద్ధంగా శక్తిని నిరాకరించుదురు. ప్రభువు యొక్క నామము పేరటనే వారు వాక్యమును త్రోసివేయుదురు. వారికి ఎట్టి నిరీక్షణ ఇక లేదు. సంస్థాగత మతమునకు ఎన్నడును ఉజ్జీవమనునది లేదని మీరెరుగుదురా? ఎన్నడూ లేదు! ఒక్కసారి వారు సంస్థగా మారి చనిపోయిరి. మరెన్నడూ వారు తిరిగి రాలేరు. లేదండి. దాని యొక్క మాదిరిని నేను చూపించగలను.

నిర్గమకాండము 13:13 చూడండి.

"ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్టింపవలెను. అట్లు దానిని విడిపించనియెడల దాని మెడ విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి యైన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపించవలెను."

చూచారా? గాడిద విడిపించబడగలదు. ఎంత ఘోరమైన పాపియైనగాని యేసుక్రీస్తు యొక్క బలి రక్తము వలన విడిపించబడును. లేదా క్రీస్తును విసర్జించుట అనగా తన్ను విసర్జించుకొనినట్లే. కాని మీరు కంచర గాడిదను విడిపించలేరు. దానికి విమోచన లేదు. వానిని విడిపించుటకు రక్తములేదు. ఉండజాలదు, ఎందుకనగా కంచర గాడిద సంఘములో తలదాచుకొనును గాని గాడిద రక్తమును ఆశ్రయించును. కంచర గాడిదలో "విత్తనము లేదు," అందువలన మేల్కోలుపబడదు, కాని గాడిదలో విత్తనమున్నది.

ఎందుకు? కొద్దివారముల క్రితం నేను ఒక వ్యాసమును చదివాను. అవును, రక్షించబడని ఒక వ్యాపారి వ్రాసిన వ్యాసమది; క్రైస్తవుడు వ్రాసినది కాదు. సంఘములను చూచి అతడు ఆశ్చర్యము పొందెనని వ్రాసెను. వాటిని అర్థము చేసికొనలేకపోతినని చెప్పెను. వారికి సెమినరీలున్నవి, వాటినిండా ప్రొఫెసర్లున్నారు. దానిని నాశనము చేయుటకు వారు దేవుని వాక్యమును బోధించుచున్నారు. ఈ వ్యక్తి ఆ సంగతిని గమనించలేకపోయెను. దానిని చూచి అతడు నివ్వరపోయెను. నాస్తికుడిని, లేదా కమ్యూనిస్టుని, లేదా స్వేచ్చా ఆలోచన గల వానిని లేదా, మరెవరినయినా అర్ధము చేసికోగలను అని అతడు చెప్పెను. సంఘమే స్వయంగా దేవుని వాక్యమును నాశనము చేయుచూ ముందుగానే, అనగా పరిపక్వము చెందకుండానే హత్యగావించుచున్నది. అదే నీ సంకరపు మతము. ఆలస్యము కాక ముందే అమెరికా మేల్కోనుము.

వాక్యము నుండి సంఘము ఎప్పుడు దూరమగునో అప్పుడది దేనినయినా నమ్మును. అది హవ్వవలెనె యున్నది. కయీను పుట్టినప్పుడు ఆమె ఇట్లనుకొనినది, "నేను యెహోవా దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకొన్నాను." ఆమె నిజంగా గ్రహించి ఆ మాట పలికెనని మీరునుకొనుచున్నారా? ప్రభువు యొద్ద నుండి ఒక మనుష్యుని పొందితినని ఆమె అనుకొనినది. చూడండి. ఒకసారి ఆమె మోసపుచ్చబడి, దేవుని యొక్క వాక్యమునకు బదులుగా సాతాను యొక్క మాటను గైకొనినది, కాబట్టి సాతాను ఏది చెప్పితే అదే సరియనుకొనినది. దేవుని యొద్ద నుండి మనుష్యుని పొందితివని అది చెప్పితే దేవుని యొద్ద నుండి మనుష్యుని పొందియున్నాననుకొనినది. కాని దేవుడు తన విశ్వములో కొన్ని సూత్రములను ఏర్పరచెను. మంచి విత్తనము మాత్రమే మంచి ఫలమును తీసికొని రాగలదు మరియు చెడ్డ విత్తనము చెడ్డ ఫలమును తీసికొని వచ్చును. ప్రతి విత్తనము, వేర్వేరుగా యున్నాగాని ఒకే భూమిని ఉపయోగించుకొని ఆహారమును, చెమ్మను, సూర్యరశ్మిని పొందును, కాని ప్రతి విత్తనము తన జాతినే మొలిపించును. కయీను వంశావళి యొక్క చరిత్రనే చూడండి. షేతు వంశావళి యొక్క చరిత్రను గమనించండి. వారి మధ్య ఒకే ఒక తేడా యున్నది. మూల విత్తనము. మరేమియూ కాదు.

హవ్వ యొక్క ఈ మాటను మీరు జాగ్రత్తగా చూచిన ఎడల, ఆమె గ్రహించుటకు బదులుగా అర్థము చేసికొనెనని గమనించగలరు. సాతాను కుమారుడని ఆమె అనలేదు. ఆలాగనిన యెడల అతడు దేవునితో సమానుడగును. మరియు గర్భములో అండమును దేవుడు మాత్రమే సృజించగలడు. సాతాను దానిని చేయలేదు. ఆ సంగతి హవ్వకు తెలియును. సాతాను వంకరగా మార్చగలదు. కాబట్టి చెడ్డ విత్తనముతో అది ఆమెను మోసము చేసెను. కయీనును ఉత్పత్తి చేసినది ఆ సర్పము యొక్క బీజమే. హేబెలు మరియు షేతులను ఉత్పత్తి చేసినది ఆదాము యొక్క బీజము. ఒకే విధానము ద్వారా ఆ విత్తనములు వెళ్ళియున్నవి, కాని బిడ్డలు మాత్రము వేరు, ఎందుకనగా విత్తనములు వేరు వేరుగా యున్నవి.

కయీను దేవుని మూలముగా వచ్చెనని ఆమె నమ్మియున్నది. అపవాది యొక్క అబద్ధమును ఆమె దేవుని యొక్క సత్యమువలె నమ్మినది. ఇప్పుడు ఖచ్చితంగా దానినే మనము కలిగియున్నాము. సంఘములు సత్యమును స్థాపించియున్నట్లుగా చెప్పుకొనుచున్నవి గాని వాటియందు సత్యము లేదు. అయినను వాటియొక్క పిల్లలు వాటిద్వారా ప్రమాణము చేసియున్నారు. తమ తప్పును ఎత్తి చూపు వారిని చంపి అయినా గాని తమను సమర్ధించుకొందురు.

అది మీరు అతిశయోక్తి అనుకొందురు గాని II తిమోతి 3వ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము మొదటి అయిదు వచనములు చదువండి.

II తిమోతీ 4:1-5,

"దేవుని యెదుటను సజీవులకును, మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పున దేమనగా;వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాస పడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచూ ఖండించుము! గద్దించుము. బుద్ధి చెప్పుము.ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులుగలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసుకొని,సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును.అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము."

మూల వాక్యము నుండి సంఘము దూరముగా తొలగిపోవుటకు అవకాశము చూచుకొనినప్పుడు, ఆదాము హవ్వలవలె, మరణము వచ్చును.

ఆమెయందు ఏమీ బలము లేదు. ఆమె ఒక నిర్జీవ స్థాయికి చేరుకొనినది. సంఘము ఏ నిమిషములో అయితే ఆచార వూర్వకముగాను, సంప్రదాయ పూర్వకముగాను మారిపోయి యాజకత్వము వైపు తిరిగి సేవకులను సంస్థగా మార్చినదో, పరిశుద్ధాత్మను మరియు వాక్యమును కాదని నాయకత్వమును నిర్ణయించుటకు ఒక గుంపును నియమించినదో, ఆ నిమిషమందే మరణము ప్రవేశించి ఆమె వ్యాధిగ్రస్తురాలగుట ప్రారంభమగును. ఆమె ఆ విధంగా రోగగ్రస్తమగుచుండగా ఆమె ఒక శక్తిహీనపు ప్రజల గుంపుగా మారుచుండును. ఇక వారికి వాదము మాత్రమే ఆయుధముగా మిగులును. ఆత్మయందు ఆమె ఏమియూ ఉత్పత్తి చేయజాలదు, ఎందుకనగా ఆమె యొక్క ఆశలన్నియూ ఒక కార్యక్రమము మీద నిర్మించబడియున్నవి గాని ఆయన వాక్యమందలి విశ్వాసములో కాదు. వారు కార్యక్రమమును చల్లిరి. కాబట్టి కార్యక్రమమునే కోయుదురు. వారు వంకరతనము చల్లిరి గనుక వంకరతనపు పిల్లలనే కోసిరి.

దేవునితో నీవు చలగాటం ఆడినచొ నీవు విత్తిన దానినే ఖచ్చితంగా కోయుదువు. ప్రకృతి నుండి మానవులు దానిని నేర్చుకోవలసియున్నారు. ఆయన ప్రకృతిలోనే దీనిని ఉంచెను. ఆయన స్వంత అభిప్రాయములను ప్రకృతిలోనికి చొప్పించెను. పరమాణువులు మొదలగువాటిని ఆయన అందులో మరల అమర్చియుంచెను. ఇప్పుడు సుడిగాలిని ఆయన కోయుచున్నాడు. వారు కోడి పిల్లలను ఎట్లు పొదిగించుచున్నారో చూడండి. చాలా ఎక్కువగా వాటిని ఉత్పత్తి చేయుచున్నారు, ఎందుకనగా పొదుగు యంత్రము ద్వారా వాటిని పుట్టించుచున్నారు. అది ఆహారమునకు మంచిది కాదు. చాలా మెత్తగాను తినుటకు రుచిలేనిదిగాను ఉండును. వారు ఆ మాంసము కొరకు ఏవేవో తినిపించెదరు. దానిని మనము తినుచున్నాము. అందువలన మానవ శరీరము మారిపోవుచున్నది. స్త్రీల క్రింది భాగము సన్నముగాను, పై భాగము వెడల్పుగొను తయారగుచున్నది. పురుషులు దానికి పూర్తి వ్యతిరేకముగా యున్నారు. నీవు ప్రకృతితో గాని ఆటలాడినయెడల ఎదురు దెబ్బతిందువు. అది నిన్ను మట్టికురిపించును. నీవు సత్యమును అబద్ధముగా మార్చినచో ఏమి జరుగును? దీనికి జవాబు ఏమనగా నీవు క్రీస్తువిరోధిని తయారుచేయుదువు. దేవునికి చోటు లేని ఈ మత క్రమము బహుగా వంకర చేయబడియున్నది. ఆదియందున్న దానివలె ఇది కనిపించదు మరియు అసలైనదానిని ఉత్పత్తిచేయదు. అటువంటి పరిస్థితికి దేవుడిచ్చు జవాబు అగ్నిగుండము మాత్రమే.

ఆ దరిద్రపు స్ముర్న కాలము చనిపోవుచున్నది. అది చనిపోయినప్పుడు మరెన్నడును తిరిగిరాదు. ఏ కాలమును మరల తిరిగి ఎన్నడునూ రాదు. ఏ ఉజ్జీవమును ఎన్నడూ మరల రాదు. దాని యందు దేవుని జీవము ప్రకృతి సంబంధమగు తరమునుండి రాదు, అది పైనుండి జన్మించిన తరము కావలెను. ఈ చివరి కాలము పెంతెకోస్తు జ్వాలలతో ప్రారంభమయినది. వారు దానిని వెంటనే సంస్థగా మార్చిరి, వారు వాక్యమును వారు తీసికొనుటకు బదులుగా తమ స్వంత అభిప్రాయములను తీసికొని అన్ని కాలముల వారు చేసినట్లుగానే వీరును చేసిరి — వాక్యమునకు బదులుగా ఒక పుస్తకమును రూపొందించిరి. నీవు ఆ పుస్తకములోయున్న దానిని అతిక్రమించినచో ఏమగునో చూడుము. సోదరుడా, నీ పని అయిపోవును. వారు నిన్ను హింసించుదురు. ఆ నెపమును వారు దేవుని మీద వేయుదురు. వారు తమ సంస్థను ఎట్లు ప్రేమించెదరో చూడండి. అందులో ఆశ్చర్యము లేదు. వారు రెండవ తరపు పెంతెకోస్తువారు. దేవునికి మనుమలు లేరు. వారు తమ తండ్రియొక్క పిల్లలు. వారికి ఆచారములు, ఆరాధనా క్రమము మాత్రమే తెలియును. వారు వాడుకలో యున్నదానిని గూర్చియే మాట్లాడుదురు కాని ఆ ముందున్న దానిని ఉత్పత్తి చేయజాలరు. ఒకప్పుడు వారికి మెరుపున్నది గాని ఇక మిగిలినది ఉరుము మాత్రమే.

వారి ఉద్యమము యొక్క మహిమలను చెప్పమని మీరు అడగండి. "అవునండీ, ఇది ఏ మానవుడూ ప్రారంభించని ఉద్యమము. అది దానంతట అదే జన్మించినది. ప్రపంచమంతటి మీదను ఆత్మపడియున్నది. అవునండి, పెంతెకోస్తు యొద్ద వారికుండిన దానినే మేమును కలిగియున్నాము. ఇది మనుష్యుల వలన వచ్చినది కాదు గాని దేవుని మూలముగా కలిగినది? అని పలుకుదురు. అయితే వారెందుకు దానిని ఆ ఉన్నరీతిగా ఉంచలేదు? దానిని దేవుడు ప్రారంభించినట్లయితే, దానిని దేవుడు నిలబెట్టి ముగించక పోవుటకు కారణమేమిటి? ఆచారములు, పద్ధతులు, సిద్దాంతములు కలిగిన చేత పుస్తకమును ప్రారంభములో దేవుడు వ్రాయనిచో వారెందుకు దానిని వ్రాయవలసి వచ్చియున్నది?

దేవుడు బాప్టిస్టుల మీదను, మెతడిస్టుల మీదను, నాజరీనుల మీదను, అడ్వెంటిస్టుల మీదను, ప్రెస్బిటేరియనుల మీదను, బ్రెదరిన్ల మీదను, చర్చి ఆఫ్ గాడ్ వారి మీదను, (ఇంకా చాలా పేర్లున్నవి) తన ఆత్మను దేవుడు కుమ్మరించెను. ఈ సోదరులందరూ వివిధ బోధల మూలముగా ఎదిగిరి. వివిధ చట్టములు, సంఘ నియమ నిబంధనలు, ఇంకా చాలాయున్నవి. దేవుడు వాటినన్నింటిని ఒక ప్రక్కకు ఊడ్చిపెట్టెను; వారియొక్క యుగ సంబంధమగు సిద్దాంతములను ఆయన నాశనము చేసెను, ఆత్మ యొక్క వరములను పునరుద్ధరించెను, ఆయను నిన్న నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లు నిరూపించెను. కాని ఆ పెంతెకోస్తువారు సంస్థ నుండి పాఠములను నేర్చుకొనిరా? లేదండి, వారు మరల సంస్థగా మారిరి. తమ స్వంత పాఠ్య గ్రంథములను వ్రాసికొనిరి. నియమ నిబంధనలను, సంఘ క్రమములను వ్రాసికొనిరి. వారికి సహవాస పుస్తకములున్నవి. మనస్సులోవారికి ఒక అభిప్రాయమున్నది. తమకు సత్యమంతా తెలియుననియు, అన్ని జవాబులు తెలియుననియు వారు రుజువు చేయగోరుచున్నారు. తాము దేవుని వలన నియమింపబడిన మార్గదర్శకులమని వారు ఇతరులకు చెప్పుకొనుచూ, మార్గము ఇదే అని చూపించగోరుచున్నారు. కాని వారియొద్ద ఏమియూ లేదు. వారికి వారే సంకరము చేయబడిరి. వారు అటువంటి గుంపులలోనుండియే బయటకు వచ్చియున్నారు. వారు వధువులో భాగముగా ఉండగోరుచున్నయెడల వారు తమ పితరులు ఎట్లు బయటకు వచ్చిరో ఆ విధంగానే తప్పకుండా రావలసియున్నారు.

వారు మిగిలినవారందరివలెనె యున్నారు. ఉజ్జీవము అయిపోయినది. వారు పేరు మాత్రము తగిలించుకొని బ్రదుకుచున్నారుగాని మృతులే. వారు సంస్థను తీసికొనిరి. వారెప్పుడూ దేవుని యొక్క ఆత్మను గూర్చియే మాట్లాడుచుందురు. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము గూర్చి వారు మాట్లాడుచుందురు. కాని అపవాది కూడా భాషలలో మాట్లాడునను సంగతిని వారు మరచిపోయియున్నారు. బాబెలుయొక్క గందరగోళము పూర్తిగా వారిమధ్య యున్నది. వారు దానిని దేవుని ఆత్మ అని పిలచుచుందురు. దేవుడు మానవునికి చెప్పుటకు బదులుగా మానవుడు దేవునికి చెప్పుటను మరొకసారి మనము చూచుదము.

ఇప్పుడు నేను చెప్పినదానిని బట్టి మీరు ఇక్కడే నన్ను తిట్టవలెనని కోరుచుండవచ్చును. మంచిదే. వారు పెంతెకోస్తువారమని, సంపూర్ణ సువార్తకు సంబంధించిన వారమని చెప్పుకొనుచున్నారు. దానిని రుజువు చేయమనండి. పెంతెకోస్తు యొద్ద అగ్ని మేఘములో దిగి వచ్చి విభాగించబడి వారందరి మీద నాలుకవలె దిగి ప్రతి ఒక్కరి మీదికి అది వచ్చెను. ఆ అగ్ని ఎక్కడున్నది? వారు పెంతెకోస్తు యొద్ద భాషలతో మాట్లాడిరి. మరియు ఎవరయితే విన్నారో వారు అర్థము చేసుకొనిరి. అది ఎక్కడ ఉన్నది? వినిన జనులందరూ మొత్తము ఒకే కుటుంబముగా ప్రవర్తించెను. ఇప్పుడు పెంతెకోస్తు వారు చరిత్రలో ఎవరునూ చీలిపోనంత ఘోరంగా చీలిపోయియున్నారు. అది సంఘములో ఏ ఒక్క వ్యక్తియూ చేరలేదు గాని దేవుడే వారిని అందులో కలుపుచుండెను. వారిమధ్య చాలా మేకలున్నవి. వారు సంపూర్ణ సువార్త అని చెప్పుకొందురుగాని దానిని వారు రుజవు చేయలేరు. వారియొక్క సంఘములు అన్ని సంఘముల మాదిరిగానే శక్తి లేక ఖాళీగా యున్నవి. వారు సంపూర్ణ సువార్తను నమ్ముచున్నయెడల బైబిలులో తప్పున్నదని ఎన్నడూ అనరు. పెంతెకోస్తుయెద్ద సంపూర్ణ సువార్త వారిని గూర్చి మనము ఎరుగుదుము. వారు ఇలా పాడిరి, "నాలో గొప్ప మార్పు వచ్చినది" వారు నిజము. కాని మార్పు అనునది మంచిగా యున్నామనుకొనుచున్నవారికి రాదు.

ఇది దేవుని యొద్దకు తిరిగి రావలసిన సమయము. వారికి జీవించుచున్న పేరు మాత్రమే యున్నది గాని వారు మృతులే. భాషలనునవి ఉజ్జీవమునకు సూచన కాదు. అవి మరణమునకు సూచన. యూదుల యొక్క ఆచారబద్ధమగు మతము ముగిసినదని భాషలు వక్కాణించినవి. ఒక క్రొత్త శకము ఆరంభమాయెను. అన్య సంఘ కాలములకు తెరపడినదనియు, సువార్త మరల యూదుల యొద్దకు వెళ్ళిపోవుచున్నదనియు ఈనాడు భాషలు తెలియజేయుచున్నవి. ప్రజలు వివరణ భాషలు గూర్చి మాట్లాడుచున్నారు. అది ఒక గొప్ప ఆత్మసంబంధ ఉద్యమమని భావించుచున్నారు. వారు గురిని తప్పిపోయిరి. మానవుల యొక్క అభిప్రాయుములకు, కార్యక్రమములకు, రాజ్యములకు సమాప్తము వచ్చియున్నదని ఈ వ్రాత్రలోని సత్యము. దేవుని రాజ్యము ఆవిర్భవించినది. దేవుని ప్రజలారా, మేల్కోనండి. నిద్రలేవండి.

ఇది సత్యము కాదని మీరు తలంచుచున్నయెడల దీనిని వినండి. ప్రపంచమంతటను, అనగా పెంతెకోస్తు మరియు మౌలిక గుంపులు రెండింటిలోను వ్యాపారులు చొరబడి సంస్థగా మార్చివేయుచున్నారు. దేవుని నుండి పిలువు లేకుండానే వారు వేదికను అక్రమించుకొనియున్నారు. తామే మనుష్యులను పట్టుజాలరులమని వారు చెప్పుకొనుచున్నారు. దేవునియొక్క ఉద్యమమునకు తామే మూల కారకులమని చెప్పుకొనుచున్నారు. ఎఫెసీ 4:10-13లో దేవుడు సంఘమునకు ఇచ్చిన వరముల పరిచర్య అయిపోయినదని వారు చెప్పుచూ సంఘములను ఆక్రమించుచున్నారు. ప్రవచనము యొక్క నెరవేర్పు మధ్యలో ఇప్పుడు మనము ఉన్నాము. కోరహు యొక్క డబ్బు సంపాదన కార్యక్రమమిది. దానిని వారు నెరవేర్చుచున్నసంగతి వారికే తెలియదు. వారు గ్రుడ్డిగా ముందుకు సాగిపోవుచూ సత్యము కొరకు అనుభవమును చాటించుచున్నారు. దేవుడు వారియెడల దయ చూపును గాక! ఇంకా ఆలస్యము కాకముందే సత్యమును చూచునట్లు దేవుడు వారి కన్నులకు తెరచు గాక! ఓ, నా మాటవినుడి. డబ్బు, సాంఘిక నాయకత్వము, వ్యాపార సామర్థ్యము, తెలివితేటలు మొదలగువానికి చోటు ఇచ్చెదరో దేవుని వాక్యమునకు విలువ ఎక్కడుండును? వారు అవి ఉన్న వ్యక్తినే ఆత్మసంబంధమగు నాయకునిగా ఎన్నుకొందురు. వస్తు సంబంధమగు స్తోమతను బట్టి మానవ విలువను ఎప్పుడు నిర్ణయించుట జరుగునో మనము దేవునికి విరోధముగా పోరాడుచున్నామను సంగతి మరువవద్దు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దేవుడు పనిచేయును. దానికి వేరే మార్గము మరేదియూ లేదు.

దీనిని నేను రికార్డ్ చేయవలెనని కోరుచున్నాను. సంఘములోని పెద్దలకు విరోధముగా నేను మాట్లాడుట లేదు. లేదండి. ఆ పెద్ద అందరికన్నపేదవాడై యుండవచ్చును లేదా ప్రపంచములోని ధనికులలో ఒక గొప్ప ధనికుడు యుండవచ్చును, కాని అతడు హృదయములోను మరియు క్రియలోను పెద్దగా ఉండవలెను. నిజమగు ఆత్మ సంబంధమగు అర్హతలుగల వానిని పెద్దగా నియమించుటకు నేను ఏమియూ సందేహించను. అతని యొక్క ఆర్థికస్తోమత, సామాజిక ఔన్నత్యములను నేను లెక్కలోనికి తీసికోకుండానే పెద్దగా లేదా డీకనుగా నియమించుదును. కాని ఎప్పుడయితే సంఘములోనికి ఆర్థిక స్టోమత మరియు సాంఘిక హోదా తేబడునో సంఘ సభ్యులలో చీలిక వచ్చును — అది దేవుని నుండి కలిగినది కాదు. అది మరియొక కాలపు సూచన. శరీరసంబంధముగా ధనవంతులు కావచ్చు గాని ఆత్మ సంబంధముగా పేదవారుగా ఉన్న ఈ ఆ లవొదికయ సంఘ కాలములో మనము జీవించుచున్నాము.

"నీ దరిద్రతను నేనెరుగుదును." వారియొక్క దరిద్రత సాతాను యొక్క సమాజముతో ముడివేయబడుట గూర్చిన ఆ వచనమును మీరు గమనించారా? అవును, అది అధిక ధనవృద్ధి కలిగిన శక్తిగల సంస్థగా దేవుని సేవచేయుచున్న దీన జనులను ఎల్లప్పుడూ త్రోసివేయుచున్నది. దేవుని యొక్క ఆత్మ మానవుల హృదయములను కదిలించినప్పుడు భవనములను మరియు ఆస్తులను విడిచి రాక ఏమగుదురు? చిన్న మంద ఎప్పుడునూ పెద్ద సంస్థ వలన నష్టపోవుచుండును. అప్పుడు జనులు ఎక్కడికి వెళ్ళుచుందురు? వారు గృహములలోను, పాత భవనములలోను, క్రింది స్థలములలోను ఆరాధన జరుపుకొందురు, ఆ పాత్ర కాలములోని వారు ఆ విధంగానే చేసిరి.

ఈ లోక సంబంధమగు సామాగ్రి విషయములో వీరు పేదవారే. నిశ్చయంగా! కాని వారు ఆత్మయందు ధనికులు.

"వారియొక్క దేవదూషణను నేనెరుగుదును." ఇక్కడ ఈ అబద్ధికులు దేవుని దూషించుచున్నారనునది ఆలోచన కాదు. చెప్పకుండానే ఆ అర్థము వచ్చుచున్నది. కాని వారు నిజసంఘమును దేవదూషణ చేయుచున్నారు. ఇది ఎల్లప్పుడునూ జరుగుచునే యున్నది. ఆదియందున్న సంఘమును యెరూషలేములోని యూదులు దూషించిరి. అన్యులగు బహు దేవతారాధకులు కూడా ఆ విధంగానే చేసియుండిరి. ఎవరయినా చెడ్డగా మాట్లాడినట్లయితే అది ఎల్లప్పుడు నిజమైన విత్తనము గురించియే. నీరో యొక్క దినములలో క్రైస్తవులను ఏ చిన్న ఉపద్రవము కలిగినా గాని నిందించుచుండిరి. రోము కాలిపోయినందుకు కూడా వీరినే దూషించిరి. కమ్యూనిష్టు దేశములలో చిన్న మంద ఎల్లప్పుడును మొదట నిందకు గురి అయ్యెడిది. వాస్తవాననికి అది పరిమాణములో చిన్నగా యున్నది. క్రైస్తవులు చక్కగా లోబడెడి జనులే. మేలు మాత్రమే వారు చేయుదురు, కానీ చివర వరకూ ఎల్లప్పుడూ వారే హింసకు గురి అయ్యి శారీరకంగా నాశనము చేయబడుచుండెడివారు.

ఈలాగు జరుగుటకు కారణము, వారు దేవునికి విరోధులగు వారికి అసహ్యముగా యున్నారు. వారు దుష్టుల యెదుట ఒక మ్రి౦గుడుపడని వారుగా యున్నారు. నీతిమంతులు ఆ దుర్మారులకు ఎట్టి హాని తలపెట్టకపోయినా గాని, మేలు మాత్రమే చేయగోరినా గాని, వారిని నానా రకములుగా దూషించి హింసించెడివారు. బాప్తిస్మమిచ్చు యోహానును హేరోదు ఆలాగే చేసెను. హేరోదుకు గాని, అతని భార్యకు గాని యోహాను ఏ హానియు చేయలేదు, కానీ దేవుని యొక్క ఉగ్రత నుండి వారిని కాపాడగోరెను. దీనిని వారు పూర్తిగా అపార్థము చేసికొని, సంపూర్తిగా ఎదిరించిరి, ఆ కారణము వలన యోహానుకు మరణము ప్రాప్తించెను. మరియు దేవుని యొక్క ప్రజలు కలిగిన మంచి అంతటిని చేయుదురు, అయినను వారు బహిరంగముగా అవమానమునకు మరణమునకు లోనగుదురు. నిశ్చయంగా దీని వెనుక ఒక దుష్ట బలమున్నది. మనస్సాక్షిలేని మనుష్యులు ఆ మేలుచేయు వారికి కీడును తలపెట్టుచున్నారు. అవును, అటువంటి శక్తి యున్నది. అది సాతాను. ఆ తరువాత వచనములో జవాబున్నది.

పది సంవత్సరముల శ్రమ

ప్రకటన 2:10

"ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. పది దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను."

"భయపడకుము," అని ప్రభువు ప్రతిసారియు వాడుచుండుట గమనించండి. రానున్న సంగతిని ఆయన ముందే ఎరిగి హెచ్చరించును. మహా అపాయము, శ్రమ, హింస చేరువలో యున్నదని హెచ్చరించుచున్నాడు. ఇప్పుడాయన ఈ మాటను కరుకు గాను, మొరటు విధానములోను చెప్పుట లేదు, "శ్రమ వచ్చుచున్నది." అది ఎవరినయినా గాని భయపెట్టును. కాని ఒక తల్లి తన బిడ్డతో దీపమును ఆర్పు ముందుగా ఎంత నెమ్మదిగా చెప్పునో అంత మృదువుగానే చెప్పుచున్నాడు, లేనియెడల భయపడును. "ఇప్పుడు భయపడకుడి, ఎందుకనగా దీపము ఆరిపోవును, చీకటి వచ్చుచున్నది, కాని నేను మీతో కూడా ఇచ్చట యున్నానని మరచిపోవద్దు." మనుష్యుల గూర్చి భయపడవద్దు లేదా వారేమి మీకు చేయుదురో అని తలంచవద్దు. నేను మీకు తోడైయున్నాను, నా కృప మీకు చాలును. మీరు జలముల లోబడి దాటి వెళ్ళునప్పుడు అవి మీ మీద నుండి పొర్లిపారవు. మరణ మందుకూడా మీరు ఓడిపోరు. మీరు అత్యధిక విజయవంతులు" అని ఆయన చెప్పుచున్నాడు.

గొప్ప అపోస్తలుడగు పౌలు ఈ మాటల యొక్క వాస్తవమును తన అనుభవము ద్వారా ఎరుగును. రోమా 8:35-59లో అతడిట్లు వ్రాసెను,

"క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, కరువైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబావునా?ఇందును గూర్చి వ్రాయబడిన దేమనగా — నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడినవారము.అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను ఉన్నవియైనను, రాబోవునవియైనను, అధికారులైనను,ఎత్తయినను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదయినను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను."లేదు, మనము భయపడవలసిన అవసరము లేదు. ప్రేమ సమస్త భయమును పారద్రోలును."

ఇప్పుడాయన చెప్పుదానిని గమనించండి. "ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు." యూదులు ఆలాగు అప్పుడు చేసిరి. అన్యులగు యాజకులు అప్పుడు ఆలాగు చేసిరి. జనుల యొక్క మద్దతును ఆ గవర్నర్లు పొందగోరి, వారికి పందెములంటే చాలా ఇష్టము, అందువలన ఆ పందెపు రంగములో వేలాదిమంది క్రైస్తవులను పడవేసి చంపిరి. సింహముల ద్వారాను, ఇంకా జట్టీల (మల్లుడు) ద్వారాను వారిని చంపిరి. అపవాదికి దీనితో ఏమి సంబంధము? వానిని ఎందుకు నిందించవలెను? దీనియంతటి వెనుక అపవాది యొక్క ద్వేషమున్నది. వాడు దేవునిని ద్వేషించును గనుక వీటి వెనుక వాడేయున్నాడు. దేవుడు తన హృదయమును దేని మీద ఉంచునో దానిని అపవాది నాశనము చేయుటకు పూనుకొనును. కాని గమనించండి. ఇక్కడ ఒక వివరణయున్నది. ఈ యూదుల వెనుక సాతాను ఉన్నచో, క్రైస్తవులను కోర్టులకు ఈడ్చినది ఎవరు, కాబట్టి యూదులు దేవుని యొక్క మనుష్యలు కారు, వారు అపవాది యొక్క అనుచరులు. వారియొక్క కూడిక కూడా సాతాను యొక్క సమాజమే. అంధకార యుగములలో రోమను కాథలిక్కు సంఘము గుంపుల కొలదిగా క్రైస్తవ విశ్వాసులను హతము చేసిరి. అవును. అన్ని యుగములలోను ఆలాగే జరిగెను. వారు అపవాది సంబంధులు. వారు కూడా సాతానుకు చెందినవారే.

ఇది చాలా ఆశ్చర్యము కలిగించునదిగా యున్నదని మీరు తలంచవచ్చును. అయిననూ ప్రకటన 13లోని ప్రవచనము నెరవేరువరకు ఎదురుచూడుడి. ఆ అధ్యాయములో అమెరికా సంయుక్త రాష్ట్రములు గూర్చి ఉన్న సంగతి పూర్తిగా నిజము. పదమూడు సంఖ్య ఈ దేశమునకు చిహ్నము. పదమూడు కాలనీలతో అది ప్రారంభమాయెను. దానియొక్క పతాకములో పదమూడు నక్షత్రములున్నవి. అందులో పదమూడు చారలున్నవి. దానియొక్క గమ్యమును గూర్చి పదమూడవ అధ్యాయములో చూతుము. ఈ అధ్యాయములో వివరించబడిన ఈ ప్రతిమలో దానికి ముందున్న మృగము యొక్క దుష్టత్వమంతయూ కనుగొందుము. నైసిన్ ఆలోచన సభలో మృగము లేచినట్లుగానే ప్రపంచ సంఘసమితిలో నుండి ఆ ప్రతిమ వచ్చును. అది మొత్తం భక్తిహీనపు శక్తి మరియు సాతాను శక్తితో దేవుని యొక్క నిజమగు ద్రాక్షావల్లి మీద తన కోపమును వెళ్ళగ్రక్కును. మరలా మరలా ఇది తన యొక్క యుక్తితోను మరియు క్రూరత్వముతోను ఈ విధముగా తన అక్కసును వెళ్ళగ్రక్కుచుండినది.

దేవుని యొక్క దీన బిడ్డలను ఎవరు హేళన చేసి, పోరాడి, నాశనము చేయగోరుచున్నారో వారిని పరీక్షించండి. వారి ఇష్టము వచ్చినట్లుగానే చేయనీయండి. ఇదంతయూ వారు దేవుని నామములోను, మతము పేరు మీదను చేయుచున్నారు. వారు అబద్ధమాడుచున్నారు. వారు దేవుని సంబంధులు కారు, వారు తమ తండ్రియగు అపవాది సంబంధులు. వారు తమ క్రియల ద్వారా దీనిని బహిర్గతము చేయుచున్నారు. వారు తమ యొక్క అసలు రూపమును బయటకు చూపించుచున్నారు. వారు సంస్థగా మారి, చిన్న మందను శ్రమపరచుచున్నారు. వారు అపవాది సంబంధులని ఆ తరువాత పూర్తిగా బయటపడును. వారు కారుద్రాక్షావల్లికి చెందినవారు - వారు హంతకులు. వారెవరో వారి ద్వేషము ద్వారా రుజువగుచున్నది. వారు నికొలాయితులు క్రీస్తువిరోధి సంఘము అయి యున్నారు.

"వారిలో కొందరిని చెరలో వేయించబోవుచున్నాడు." అవును, వారిని కోర్టులోనికి లాగిరి. అబద్ధముగా నేరారోపణ చేసిరి మరియు శోధనలకు గురిచేసి చెరలో వేయించిరి. ఇదంతయూ మతము పేరు మీదను, గొప్ప అమాయకత్వపు నటనతోను, పలుకుబడితోను జరిపియున్నారు. అంతా ఒక మంచి కారణముతోనే జరిపియున్నారు. దీనిని తలపోయుచుండగా ఈ మధ్య సుప్రీంకోర్టు వారు పాఠశాలలో ప్రార్థన చేయుట మరియు బైబిలు చదువుట గూర్చి నిర్దేశించిన సంగతి నాకు గుర్తుకు వచ్చుచున్నది. దీని వెనుక ఎవరున్నారు? సాతాను ఉన్నది. ఇది దేవునికి విరోధముగా వెళ్ళగ్రక్కిన మరో ద్వేషము.

"పది దినములు శ్రమ కలుగును." ఇది ఒక ప్రవచనము. స్ముర్న కాలము యొక్క జీవిత వ్యవధిని ఇది నిర్ధారించుచున్నది. అందరు చక్రవర్తులలోనికి అతి క్రూరుడగు డయోక్లిసియన్, దేవుని యొక్క పరిశుద్దులకు విరోధముగా ఒక భయంకర కార్యక్రమము తలపెట్టెను. దేవుని యొక్క కృప లేనియెడల మొత్తం విశ్వాసులను తుడిచి పెట్టియుండేడి వాడే. ఇది చరిత్రలో అతి రక్తసిక్తమగు అధ్యాయము. పది సంవత్సరముల పాటు కొనసాగెను. (ప్రకటన2:10లోని పది దినములు) ఇది 302 నుండి 312 వరకు ఉండినది.

"మరణము వరకు నమ్మకముగా ఉండుము." అనగా ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుమని అర్ధము గాని మరణము వచ్చుచున్నదని అర్ధము కాదు. మీరు మీ సాక్ష్యమును మీ రక్తముతో ముద్రించవలసియుందురు. వేలాదిమంది, మిలియనుల మంది ఈ కాలములలో చనిపోయిరి. వారు విశ్వాసముతోనే మరణించిరి. నమ్మకస్తుడగు హతసాక్షియగు అంతిపవలె వారును మరణము వచ్చినా గాని తమ ప్రాణములను లెక్కచేసినవారు కారు. హతసాక్షియగుట దాదాపుగా అసాధ్యమని మనము తరచుగా తలంచుచుందుము. కాని ధైర్యముగా చెప్పుచున్నాను. యేసు క్రీస్తులో విజయము సాధించుటకు ప్రతీదినము మనము ఎట్టి విశ్వాసము కలిగియున్నామో అదే విశ్వాసము పాలికార్పు మరియు తదితర హతసాక్షులను నిలబెట్టుచుండుట చూడగలము. అగ్రగామి యగు విశ్వాసము, అగ్రగణ్యమగు ఘడియలో, అగ్రగామియగు కృపను అనుగ్రహించును. దేవుడు సదా ధన్యుడు!

"నేను నీకు జీవ కిరీటమిచ్చెదను." ప్రభుని నామములో వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా గాని ప్రతిఫలము పోగొట్టుకొనరు, వారికి ప్రతిఫలముండును అని చెప్పిన, మరి ప్రభువైన యేసు నామము నిమిత్తము తన జీవితమును హతసాక్షిగా ఇచ్చిన వానికి ఆయన ఇచ్చు బహుమానము ఎంత గొప్పది. పందెములో గెలిచిన కిరీటముతో ఈ కిరీటమును పోల్చిచూచినచో మనకు కొంత వరకు ఇది గ్రాహ్యమగును.

I కొరింథీ 9:24లో పౌలు చెప్పెను,

"పందెపు రంగముందు పరుగెత్తు. వారందరు పరుగెత్తుదురు గాని ఒక్కడే బహమానము పొందునని మీకు తెలియునా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి."

ఒలింపిక్ పందెములో గెలుపొందిన వానికి ఒలీవ కొమ్మలతో చేసిన దండను వేయుదురు. కాని ఇక్కడ ప్రకటనలో హతసాక్షికి ఇచ్చు కిరీటము గూర్చి వ్రాయబడినది. ఇది రాజరికపు కిరీటము. యేసు దానిని జీవకిరీటమని పిలచెను. పోరాడిన వారికి ఒక కిరీటము మరియు ఇచ్చినవారికి (జీవమును) మరియొకటి ఇయ్యబడును. ఆ రెండు కిరీటములు నశించనివి. వారు కూడా నశించరు. ఈ లోక సంబంధమగు పందెములలో పరుగిడువారు పొందిన కిరీటము యొక్క ఆనందమును త్వరలోనే కోల్పోవుదురు. వారియొక్క అతిశయము అంతమగును. కాని దేవుని కొరకు తమ జీవితములను ఇచ్చిన వారూ అనగా అనుదిన పోరాటము కొరకు తమ జీవితములను ఇచ్చినవారు గాని లేదా జీవితములను లెక్కచేయక రక్తమును చిందించి ధారపోసినవారు గాని జీవ కిరీటమును పొందుదురు, ఎందుకనగా వారు తము జీవితములను బలిగా అర్పించిరి.

దేవుని యొక్క నిత్య బహుమానముల కొరకు మనము ఖర్చు చేయుచున్న కాలము చాలా అల్పము. దేవుని యొక్క బహుమానములు చాలా తక్కువగా అంచనా వేయుచున్నాము. శరీరము యొక్క వాస్తవ పునరుత్థానమును గూర్చి మనము నమ్ముచున్నయెడల, నిజస్వరూపముగా రానైయున్న నిత్య రాజ్యమును గూర్చి మనము విశ్వసించుచున్నయెడల, నమ్మకస్తులకు పరిశుద్ధుల కొరకు పరలోక నిధియందు దాచియుంచిన ఆ సంపద కొరకు మన జీవితములను ధారపోయుదుము.

జయించుటవలన వచ్చు బహుమానము

ప్రకటన 2:11

"సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక! జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు."

మరియొకసారి ఆత్మ అన్ని యుగములలోని వారితోను మాట్లాడుచున్నది. ఈనాడు మనలను ఓదార్చుటకు ఈ వర్తమానము వచ్చుచున్నది. అన్ని యుగములలోని మన సోదరులను ఈ వర్తమానము ఆదరించినది. రెండవ మరణము మనకు హాని చేయదని ఆయన చెప్పుచున్నాడు.

రెండవ మరణమనగా అగ్నిగుండమని మనకందరికిని తెలియును.

ప్రకటన 20:14,

"మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము."

అందులో ఎవరయితే యున్నారో వారందరు అగ్నిగుండములో పడవేయబడియున్నారు. ఇక్కడ మీకొరకు ఒక సంగతి నేను చెప్పగోరుచున్నాను. నా వింత సిద్దాంతము గూర్చి జనులు ఏదేదో చెప్పుకొనుట నిస్సందేహముగా జరుగును.

కాని ఇక్కడ నేను దేవుని యొక్క వాక్యాధికారము మీద నిలబడియున్నాను, ఒక అవిశ్వాసి నిత్య నరకమునకు వెళ్ళి నిత్యమూ అక్కడ కాలుచుండుటను నేను కాదని చెప్పుచున్నాను. మొట్టమొదటిగా నరకము లేక అగ్నిగుండము లేదా దానిని మీరేదయినా పేరుతో పిలువ వచ్చును. అది నిత్యమైనది కాదు. దానికి ఆరంభము యుండినది గనుక అదెట్లు నిత్యమైనదగును? మత్తయి 25:41లో చెప్పబడినది. "అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి" అది సిద్ధపరచబడినది గనుక ప్రారంభము లేకుండా అది లేదు. దానికి ప్రారంభమున్నయెడల నిత్యమైనది కాజాలదు. మీరు ఆ "నిత్యము"అను మాటను తీసికోని అభ్యంతరపడుదురు. కాని ఆ మాటకు "కాలముల నుండి కాలముల వరకు" అని అర్థము. దానికి ఇంకా ఇతర అర్థములు తగిలించబడియున్నవి. I సమూయేలు 3:13-14. ఏలీ యొక్క ఇంటిని నిత్యమూ తీర్పు చేయుదునని దేవుడు సమూయేలుతో చెప్పెను. దాని అర్ధము ఆయన యాజకులుగా వారు ఇక బలులు "నిత్యమూ" అర్చించరాదని. II రాజులు 2:27. ఏలీ యొక్క చివరి వంశస్తులకు సొలోమోను తిరిగి యాజకత్వమును అప్పగించుట మీరు చూడగలరు. అది నాలుగు, లేదా ఆ సుమారు తరముల తరువాత జరిగినది. ఇప్పుడు మీరు ఆ "నిత్యము"అను మూటను "నిత్యత్వము" అనుమాటతో పోల్చుటకు వీలులేదు. నిత్యత్వమనగా ఆది, అంతము లేనిదని అర్థము. ఇక్కడ కాల వ్యవధి (Everlasting) అనుమాటకు "అదృశ్యమగు సమయము వరకు" అర్థము. అదియే జరిగినది. వారు అదృశ్యమయిరి.

II థెస్సలోనీయులలోని 1:9లో యున్న "నాశనము" అను పదమును చూడండి,

"నిత్యనాశనమును దండన పొందుదురు."

గ్రీకులో "నాశనము" అనగా లయమని అర్థము వచ్చును. "నాశనము" అను మాటకు "పాడుచేయుట" అని అర్ధము కాదు. ఇప్పుడు "నాశనము చేయుట" అనగా ఉండి ఉండి క్షీణించిపోవుట అని అర్ధము. కావున నిత్య నాశనము అనగా అర్థమేమిటి? నాశనము చేసికొంటూ పోవుట అని అర్ధము కాదు. దానికి అర్థము చెడగొట్టుకొంటూ పోవుట అని అర్థము కాదు. "నాశనము" అనుటకు బదులుగా "నాశనము చేయుట" అను పదమును పెట్టిరి. అనగా చివరి మొనను కూడా నాశనము చేయుట అని అర్థము. దానికి అంతము కలుగజేయుట.

ఇప్పుడు మీరు ఆశ్చర్యపడవచ్చును, మీరు ఆ "నిత్యమను" మాటను ఉపయోగించేటప్పుడు, మీకు బోధించిన విధముగా వాడుట లేదు. ఇది చాలా తేలికగా గ్రహించవచ్చును. దేవుని దృష్టియందు ఆ మాటకు అర్ధము ఆది మరియు అంతము లేనిది, మరియు ఎన్నటికినీ లయము కానిది, నాశనము కానిది అనియే. మీరు నిత్యజీవమును గూర్చి మాట్లాడునప్పుడు అది దేవుని జీవమని మనస్సులో గుర్తుంచుకొనండి. ఇదియే సాక్ష్యము. "దేవుడు మనకు నిత్యజీవమును ఇచ్చెను. ఆ జీవము కుమారునియందున్నది. కుమారుని కలిగియున్న వాడే నిత్యజీవము గలవాడు." కాబట్టి ఇప్పుడు దేవుని కుమారులకు మాత్రమే నిత్యజీవమున్నది. అది ఎట్టిదనగా ఎన్నడూ ఆరంభమనునది లేనిది, కాని ఎల్లకాలము ఉండును. అది నిజము. ఇప్పుడు నీ లోపట ఏదో యున్నది. అది నిత్యజీవము ఆది గాని, అంతము గాని లేనిది. అది దేవుని యొక్క ఆత్మ. అది దేవునిలోని భాగము. అది దేవుని యొక్క జీవము.

ఒక పాపి నరకమునకు వెళ్ళి, పరలోకమునకు వెళ్ళి పరలోకమును అనుభవించుచున్న నీవలె సదాకాలము శ్రమను అనుభవించుచున్నయెడల, వానికిని నీవంటి జీవమేయున్నదని తలంచవచ్చును.

దేవుని బిడ్డల యొక్క సంక్షేమమునకు ఈ నిత్యజీవము చిహ్నముగా యున్నదని కొందరు చెప్పుచున్నారు. అది వారి యొక్క సంక్షేమము మరియు ఆనందము. దానికి ముప్పు పొంచియున్నది. మరియొక ప్రక్క పాపి శిక్షకు వెళ్ళుచున్నాడు. కాబట్టి రెండవ మరణమును మనము తగ్గించుచూ దానిని ఒక సామాన్య శిక్షను అనుభవించు స్థలముగా మార్చుచున్నాము. నిత్యజీవమనగా పరలోకము, నిత్యశిక్ష అనగా నరకము. గొప్ప వేదాంతులమని చెప్పుకొని హెచ్చించుకొనువారు కూడా దానిని నమ్మియన్నారని మీరు తెలిసికొనినప్పుడు ఆశ్చర్యపడుదురు. కాని మీకు అదేమి చేయునో తెలియునా? నిత్యజీవమును, ఒక వ్యక్తికి బదులుగా ఒక భౌగోళికముగా మార్చును. నిత్యజీవమనగా దేవుడు — ప్రభువైన యేసుక్రీస్తు, నిత్యజీవమనునది ఒక స్థలమని చెప్పినచో ఎవరు నమ్మగలరు? నాకు తెలిసినంతవరకు అంతకన్న గొప్పది. దానిగూర్చి నేను ఆలోచించవలసి వచ్చుచున్నది.

కాదండీ, ఒకే ఒక రకమగు నిత్యజీవమున్నది. అది దేవుని యొద్ద ఉన్నది. మనము దేవునిని కలిగియున్నప్పుడు మనము నిత్యజీవమును కలిగియుందుము. ఆయన ద్వారానే కలిగియుందుము.

కాబట్టి మీరు చూడండి, ఆ నిత్యము లేదా, నిత్యత్వము అను మాటను ఆయా విధములుగా అన్వయింపవచ్చును. కాని దానిని మనము దేవునికి అన్వయించినప్పుడు ఆయన ఏమైయున్నాడో దానినే అది చూపించును, దానికి ఒకే అర్ధముండును. అది దేవుని యొక్క వ్యవధి. మరేదో దానికి అన్వయించినట్లుగా దానిని నీవు అన్వయించలేవు. దేవుడు మాత్రమే నిత్యుడు, ఎందుకనగా ఆయన జీవించియున్నవాడు. ఆయనతో మనము జీవించుచున్నాము.

అగ్నిగుండమును, నరక శిక్షను నేను నమ్మనని ఎవరూ తలంచవద్దు. నేను నమ్ముచున్నాను. అదెంత కాలముండునో నాకు తెలియదు గాని ఒక కాలమునకు అది ముగింపు పొందును. ప్రకటన 21:8లో చెప్పబడిన ప్రకారము ఆ పాపులు అగ్నిగుండములో పాలుపొందుదురు (అనగా భాగము). కాని ఆ మాటకు నిజమగు అనువాదము "భాగము" కాదు గాని "కాలము" అని యున్నది. చూడండి. మీరు దానిని గ్రహించవలెను.

కాబట్టి దుర్మార్గులు నరకములో పడద్రోయబడుదురు (సమాధి లేదా సమాధిలో దిగినవాడు) మరియు నరకము అగ్నిగుండములో పడద్రోయబడును. దేవుని నుండి ఎడబాటు పొందుదురు. అదెంత ఫెూరమగు సంగతి!

కాని నీతిమంతులు ఆలాగు ఉండరు. వారు భయపడవలసిన అవసరము లేదు. వారు దేవుని ద్వారా విమోచింపబడిరి. వారాయన రొమ్ములో యున్నారు. వారే జయించినవారు. జయించినవాడెవడు? యేసే క్రీస్తని నమ్మువాడే జయశాలి.

ఎందువలన ఈ జయశాలి, విశ్వాసి తప్పింపబడి దేవుని యొక్క నిత్యజీవ రాజ్యములోనికి, ఆనందములోనికి వెళ్ళుచున్నాడు? మనలను పాపము నుండి విడిపించుటకు యేసు క్రయ ధనమును చెల్లించెను. ఆయన ఆ వేర్పాటు యొక్క శూన్యమును నింపెను. ఒకప్పుడు దూరస్తులముగా యుండిన మనము, ఇప్పుడు రక్తము ద్వారా సమీపస్తులమయితిమి.

వారెన్నడునూ శిక్షలోనికి రారు. వారెన్నడును ఆ అగ్ని గుండములో యుండరు. వారెన్నడును నశింపరు, ఎందుకనగా వారిలో ఎవరినీ ఆయన పోగొట్టుకొనడు. విమోచించబడిన ప్రతి ఒక్కరును యేసు ఉన్నచోట తప్ప మరెక్కడను ఉండరు.

అదెందుకు జరుగునో మీకు కారణము తెలియునా? మీకు దానిని ఉదాహరణ పూర్వకముగా చెప్పెదను. నాకు జోసఫ్ అను ఒక చిన్న బాలుడున్నాడు. ఏది ఏమయినా గాని అతడు నాలో ఒక భాగము. నేను ఒక ధనికుడయినచో అతనికి నేను స్వాస్థ్యము లేకుండా చేయవలెనని తలంచుదుననుకొనండి, కాని అతనిని నేను ఎన్నడునూ కాదనలేను. నేనతనిని తృణీకరించలేను, ఎందుకనగా అతడు నాలో భాగమై యున్నాడు. మా రక్తమును పరీక్ష చేయండి. అతని రక్తమును నా రక్తముతో జత చేయండి. జోసెఫ్ నా కుమారుడని రుజువగును. అతడు నా వాడు.

నీవు దేవునికి చెందియున్నావో లేదో రక్తపరీక్ష వలననే తెలియును.

ఒక సమయమును గూర్చి నేను జ్ఞాపకము చేసికొనకుండా ఉండలేను. నేను పశువులను తోలుచుండేవాడిని. కల్తీలేని హియర్ ఫోర్డ్ పశువులను కొలరాడోలో మేపుచుండే వాడిని. మేము ప్రభుత్వ తనిఖీ కొరకు వాటిని తీసికొని వచ్చుచుండెడివారము. ప్రభుత్వ భూములలో వాటిని మేము మేపవలెనన్నచో ఆలాగు చేయవలెను. చెవి మీద రక్త పరీక్షను తెలియజేయు చిహ్నమును తగిలించనిచో ఏ ఒక్కదానిని కూడా వారు అనుమతించేవారు కారు. అది కల్తీ లేదని ఆ చిహ్నము చూపించును. వాటిని తనిఖీ చేయువారు ఒక్కసారి కూడా ఆ బ్రాండును చూచెడివారు కారు. వారు ఆ గురుతును చూచి మంచి రక్తమైనదో కాదో గ్రహించెడివారు. హల్లెలూయా! అది సరయిన రక్తమునకు చెందినచో సరిగానే యుండును.

మీకు తెలుసా, దేవుడు క్రిందికి చూచి, "పాపము చేయు ఆత్మ అది చావవలసి యున్నది. అది నా నుండి వేరుపడినది. అది నన్ను సమీపించజాలదు," అని ప్రకటించి యున్నాడు. అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారని మనమెరుగుదుము. దాని అర్థం అందరూ చచ్చినవారైయున్నారని, అందరూ వేరుపడినవారని, మరియు ఆ కొంచెం జీవం కూడా ఆర్పివేయబడి యిది అంతా ముగించబడు ఒక సమయము ఒకానొక రోజున వచ్చును. కాని దేవుడు ప్రేమ వలన, ఒక పాపియొక్క ప్రాణం స్థానంలో ఒక జంతువును తీసికొని దాని ప్రాణమును తీసికొనెను.

పాత నిబంధన కాలములో పాపి ఒక గొర్రెపిల్ల తెచ్చెడివాడు. అతడు తన చేయిని గొర్రెపిల్ల మీద ఉంచగా యాజకుడు వచ్చి దాని గొంతును కోసెడివాడు. అది రక్తమును కార్చుచూ కొట్టుకొనుచూ కేకలు వేసెడిది. శరీరము చల్లబడి మరణించెడిది. చల్లబడిన రక్తము యొక్క పొగ దేవుని వైపు ఎక్కిపోవుట అతడు చూచెడివాడు. తన స్థానమును ఆ గొర్రెపిల్ల తీసికొన్నదని ఆ పాపికి తెలియును. తనకొరకు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము మాట్లాడుచున్నదని అతనికి తెలియును. ఆ గొర్రెపిల్ల యొక్క ప్రాణము జంతు జీవము. అది పాపి యొక్క జీవితమును పవిత్రపరచజాలదు. కాబట్టి అతడు పాపపు కోరికను కలిగియుండియే అచ్చట నుండి వెళ్ళెడివాడు. అతని మనస్సులో పాపము ఉండెడిది. ఆ విధంగానే తిరిగి వెళ్ళెడివాడు. మరల సంవత్సరము తరువాత వచ్చి అదే విధముగా అర్పణను అర్పించెడివాడు.

కాని క్రొత్త నిబంధనలో ఆలాగు లేదు. మనయొక్క చనిపోవుచున్న గొర్రెపిల్ల దేవుని కుమారుడే అనేకుల క్రయ ధనముగా ఆయన తన రక్తమును ఇచ్చెను. విశ్వాసము ద్వారా మనము నడిచి వెళ్ళి ఆ గొర్రెపిల్ల మీద మన చేతులను ఉంచెదము — రక్తము కారుచున్న గాయములతో ఆయనను మనము చూచెదము. ఆయన వీపు కొరడాలతో కొట్టబడినది. క్రూరమగు ముండ్లు ఆయన నొసటిని చీల్చియున్నవి — ఆయన యొక్క బాధను మనము అనుభవించుదుము. "నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచితివి?" అను కేకను మనము విందుము. ఏమి జరిగినది? విడువబడిన ఆ రక్త కణములోనుండి వచ్చిన జీవము పశ్చాత్తాపపడిన వాని మీదికి వచ్చియున్నది. ఆయనలో యున్న జీవముమన మీదికి వచ్చియున్నది. పాపము చేయవలెనను కోరిక ఇక ఉండదు. ఇప్పుడు మనము శరీరము యొక్క క్రియలు మరియు యిచ్చల పట్ల ద్వేష భావమును కలిగియుందుము.

మనలను చూచుకొందుము. మన జీవితము ఏమిటి? మన తండ్రి నుండి వచ్చిన ఒక చిన్న కణము. స్త్రీలో హిమోగ్లోబిన్ లేదు. ఆమె అండమును ఉత్పత్తి చేయును; ఆమె ఒక పొదుగు యంత్రము. కాని రక్తము మగవానిలో నుండి వచ్చును. ఆ కారణము చేతనే స్త్రీ పురుషుని యొక్క నామమును తీసికొనును. పిల్లలు అతని యొక్క పేరును పెట్టుకొందురు. తల్లి పొదుగు యంత్రమువలె యుండి అతని కొరకు పిల్లలను కనును.

మన విమోచన విషయములో కూడా అదే జరిగినది. పరిశుద్ధాత్మ మరియ మీదికి వచ్చి ఒక కుమారుని కని అతనికి యేసు అను పేరు పెట్టెను. మహా సృష్టికర్త క్రిందికి దిగి వచ్చి మన పాపము నిమిత్తము బలి ఆయెను. ఆయన రక్తము దేవుని యొక్క రక్తము. ఇందులో ఏమియూ సందేహము లేదు. ఆ దేవుని యొక్క రక్తము చిందించబడినది. ఆత్మ ఆయనను విడిచి వెళ్ళెను. ఆయన బాధతో మరణించెను. ఆ తరువాత అదే జీవము (ఆత్మ) మారుమనస్సు పొందిన పాపిలోనికి వచ్చి నివాసము చేయుచున్నది. అతనిని స్వాతంత్ర్యము గలవానిగా చేయుచున్నది. ఆ పాపి ప్రతి సంవత్సరము వచ్చి బలిని అర్పించవలసిన అవసరము లేదు. ఒకే అర్పణ వలన ఒక్కసారిగా ఆ పాపము యొక్క అధికారము నుండి విడుదల పొందుచున్నాడు, క్రీస్తు యొక్క జీవమును పొందుచున్నాడు. ఆ విధముగా అతడు పాపము మీద, లోకము మీద, శరీరము మీద, అపవాది మీద జయము పొంది పాలించుచున్నాడు.

దానిని దేవుడు చేసెను. అంతయూ ఆయనే చేసెను. పాపము చేత శపించబడిన లోకమునకు ఆయన ఇట్లు చెప్పుచున్నాడు. "నేను మీకు ఒక సూచనను ఇచ్చుదును. ఒక కన్యక కుమారుని కనును. ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనును. అదియే మీకు ఆనవాలు. అది ఒక నిత్యమగు సూచన. ఆమె తీసికొనివచ్చినవాని పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడని అర్ధము."

దేవుడు ఒక రక్త కణము ద్వారా క్రిందికి దిగి వచ్చెను. ఒక మానవుని ద్వారా రాలేదు గాని పరిశుద్ధాత్మ ద్వారా వచ్చెను. ఆ కన్య యొక్క గర్భములో ఒక దేవాలయముండెను. మరణమగుట కొరకే దానిని ఆయన నిర్మించెను. స్త్రీ సంతానముగా ఒక క్రమములో వచ్చిన ఆయన, అందు మూలముగా నలిగిపోయి మన రక్షణను తీసికొని వచ్చెను. మరియు మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆమె గర్భములో ఒక కణమును ఆయన సృజించెను. అది విస్తరించి మన ప్రభువు యొక్క శరీరముగా మారినది. ఆ కణము సృజింపబడినది. అది దేవుని యొక్క సృష్టికి మూలము. ఆయనే యేసు అయి యున్నాడు. ఆ పరిశుద్దుడు పరిశుద్ధ రక్తముతో నిండియుండెను, అనగా దేవుని యొక్క రక్తముతో నిండియుండెను. ఆ దేవాలయము జన్మించెను. ఆయన ఒక నరునిగా ఎదిగెను. ఆయన యోర్దానుకు వచ్చెను. అక్కడ ఆ బలి పశువును యోర్దాను నదిలో యోహాను కడిగెను. ఆ అంగీకారమగు బలి నీటిలో నుండి బయటకు వచ్చినప్పుడు, దేవుడు వచ్చి ఆయనలో నివాసము చేసెను. పరిమాణము లేని ఆత్మతో దేవుడాయనను నింపెను. ఆయన చనిపోయి తన రక్తమును చిందించిన తరువాత దేవుని యొక్క పరిపూర్ణ జీవము విమోచనము పొంది తిరిగి వచ్చి క్రీస్తును రక్షకునిగా అంగీకరించు పాపి మీదికి దిగుచున్నది.

ఓ, ఇదెంత ఆశ్చర్యకరముగా యున్నదో చూడండి. యెహోవా జన్మించి ఒక పశుల పాకలో కేకవేసెను. యెహోవా ఒక గడ్డి తొట్టెలో పరుండెను. మీ యొక్క నిత్య సూచన అదియే. అహంకారులు, గర్విష్ణులు, విద్య ద్వారా ప్రగల్భములు పలుకుచున్నవారు తమ స్వంత సిద్ధాంతమును రూపొందించుకొని దేవుని యొక్క సత్యమును నిరాకరించుచున్నారు. యెహోవా దేవుడు ఒక కంపు కొట్టుచున్న తొట్టెలో పసిబాలునిగా ఏడ్చుచుండెను. మనమయితే గర్వించు హక్కును కలిగియున్నట్లు ప్రవర్తించుచున్నాము, ముక్కు పట్టుకొనుచున్నాము, మనము ఏదో అయిపోయినట్టు విమర్శించుచూ ప్రవర్తించుచున్నాము. ఇక్కడ మీ యొక్క నిజమగు సూచనయున్నది. ఈయనే నిజమయినవాడు. యెహోవా, ఒక బాలునిగా ఆడుకొనెను. యెహోవా ఒక వడ్రంగి వాని దగ్గర పని చేసెను. యెహోవా జాలరుల యొక్క కాళ్ళు కడిగెను.

దేవుడిట్లు చెప్పుచున్నాడు, "నేను మీకు ఒక సూచన ఇచ్చెదను." తెల్లని అంగీలు ధరించిన యాజకత్వపు సూచన కాదు. సంపద మరియు అధికారము యొక్క సూచన కాదు. మీరు కోరుకొనునది గాని, మీకు తగియుండుననుకొనునది గాని ఈ సూచనలో ఏమియూ ఉండదు. కాని ఇది ఒక నిత్యమగు సూచన. ఇది అన్ని సూచనలకంటెను గొప్పది" యెహోవా ఆ కోర్టు అవరణలో నిలబడియున్నాడు. ఆయన యొక్క నొసటి మీద ముండ్లు నాటబడినందున ఆయన రక్తమును కార్చుచున్నాడు. ఆయన నలుగగొట్టబడి యున్నాడు, ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి, ఆయనను హేళన చేసిరి, అయినను ఏమీ లెక్కచేయలేదు. యెహోవా తృణీకరింపబడి, విసర్జింపబడి దిగంబరిగా సిలువ మీద వ్రేలాడుచుండెను. వేషధారులు నానా విధములుగా ఆయనను తిట్టుచుండిరి. సిలువ మీదనుండి క్రిందికి దిగి రమ్మని ఆయనను హేళనగా మాట్లాడిరి. యెహోవా చనిపోవుచున్నాడు. యెహోవా ప్రార్థించుచున్నాడు, అయినా ఏమియూ జరుగుట లేదు. ఆ తరువాత యెహోవా మరణించెను. ఇప్పుడు మనుష్యులందరికిని అదియే సూచన. అటువంటిది మరియొకటి ఉండదు. ఇది గొప్ప సూచక క్రియ.

ఆ సమయములో భూమిని చీకటి కమ్మెను. వారాయనను ఒక సమాధిలో ఉంచిరి. అక్కడాయన మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉండెను. ఒక రాత్రి భూకంపము కలిగి ఆయన బయటకు బ్రద్దలు చేసికొని వచ్చెను. యెహోవా బయటకు వచ్చెను. యెహోవా పైకి ఆరోహణుడాయెను. ఆ తరువాత యెహోవా తిరిగి వచ్చి తన సంఘములో నివాసము చేసెను. యెహోవా ఒక బలమగు గాలి వీచినట్లును, అగ్నిజ్వాలలతోను వచ్చెను. యెహోవా తన సంఘము మధ్య సంచరించుటకు వచ్చెను. ఆయన తన ప్రజలను శక్తివంతులనుగా చేసెను. మరొక్కసారి యొహోవా వచ్చెను. ఈ సమయమందు ఆయన తన ప్రజలలో ఉండుటకు వచ్చెను. మరల యొహోవా రోగులను బాగుచేయుచున్నాడు, మృతులను లేపుచున్నాడు మరియు స్వయంగా ఆత్మయందు ప్రత్యక్షమగుచున్నాడు. యెహోవా తిరిగి వచ్చి భాషలతో మాట్లాడుచున్నాడు. దానికి అనువాదము చెప్పి జవాబు ఇచ్చుచున్నాడు.

యెహోవా దిగి వచ్చెను మరియు ఆయన వేశ్యను మార్చి మరెన్నడూ పాపము చేయకుండా చేసెను. ఆయన త్రాగుబోతు యొద్దకు వచ్చి, త్రాగి గోతిలో పడి దొర్లుచున్నవాని ముఖము మీద నుండి ఈగలను తోలి బాగుచేయుచున్నాడు. అవును, యొహోవా శరీరమందు ప్రత్యక్షమగుటకు వచ్చియున్నాడు. మరియు శరీరములో ప్రత్యక్షమాయెను. యెహోవా వచ్చెను — మనలో దేవుడున్నాడు, మహిమకు నిరీక్షణగాయున్నాడు.

అవును, యేసు వచ్చెను మరియు ఆయన తన రక్తమును చిందించి చెరలో ఉన్నవానిని విడిపించెను. ఆయన వచ్చి తప్పిపోయిన గొర్రెలను వెదకి తెచ్చెను. ఆయన వారికి నిత్యజీవమును ఇచ్చెను. వారు ఎన్నడునూ నశించరు, ఆయన వాటిలో ఏ ఒక్కటియూ పోగొట్టుకొనడు, కాని అంత్యదినమున వారిని లేపును.

హల్లెలూయా! రెండవ మరణము వారికి ఏ హానియు కలిగించదు. వారిమీద దానికి ఏ శక్తియూ లేదు, ఎందుకనగా వారు గొర్రెపిల్ల సంబంధులు. ఆయన వెళ్ళు ప్రతి చోటకును వీరు వెళ్ళుదురు.

ప్రతి కాలములో నున్న పరిశుద్ధాత్మ

ప్రకటన 2:11,

"సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక!"

ఈ వచనము పలుకబడని సంఘకాలము ఒక్కటి కూడా లేదు. ప్రతి సంఘ కాలములోను ప్రతివారికి ఈ హెచ్చరిక ఇయ్యబడినది. "సంఘములతో ఆత్మ చెప్పుచ్ను మాట చెవిగలవాడు వినును గాక." వివిధ కాలములలో ఆత్మ ఏమి చెప్పుచున్నదో దానిని వినుట మనుష్యులందరికిని సాధ్యము కాదని ధృఢముగా చెప్పగలము.

I కొరింధీ 2:6-16,

"పరిపూర్ణులైన వారిమధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానముకాదు. నిరర్థకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని,దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసియుండిన యెడల మహిమస్వరూపియగు ప్రభువును సిలువవేయక పోయియుందురు.ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడియున్నది.మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు.ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్చు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించజాలడు.ఆత్మ సంబంధియైనవాడు అన్నింటిని వివేచించునుగాని అతడెవని చేతనైనను వివేచింపబడడు.ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము."

మత్తయి 13:13-16

"ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను.గనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చూచుట మటుకు చూతురు గాని, ఎంత మూత్రమును తెలిసికొనరు అని యొషయూ చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసికొనియున్నారు.అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి."

యోహాను 8:42-44.

"యేసు వారితో ఇట్లనెను — దేవుడు మీ తండ్రియైన యొడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను. నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా?మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడుగా యుండి సత్యమందు నిలిచినవాడుకాడు. వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు."

ఏ మనుష్యుడును తనకు తానుగా దేవుని మాట వినజాలడని ఈ లేఖనముల వలన అర్థమగుచున్నది. దేవుని ద్వారానే అతనికి ఆ సామర్ధ్యము అనుగ్రహింపబడును.

మత్తయి 16:17

"అందుకే యేసు — సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే గాని నరులు నీకు బయలుపరచలేదు."

ఈ వచనములను ఒక చోటికి మనము చేర్చినప్పుడు ఒకే ఒక గుంపు ప్రజలున్నారని మనము చూడగలము. వారు ఒక ప్రత్యేకమగు గుంపు ప్రజలు, ప్రతి కాలములోను ఆత్మ ఏమి చెప్పుచున్నదో దానిని వారు వినగలుగుదురు. ప్రతి కాలము యొక్క ప్రత్యక్షతను ఆ ప్రత్యేకమగు గుంపు చేర్చుకొందురు. ఆ గుంపు దేవునికి చెందియున్నది, ఎందుకనగా దేవుని యొక్క మాటను వినలేని గుంపు దేవునికి చెందినది కాదు. (యోహాను 8: 42-44) ఆత్మ చెప్పుచున్న దానిని విని, స్వీకరించు గుంపు ప్రత్యక్షతను పొందిన గుంపు. ఆ గుంపును గూర్చి వివరించబడినది. I కొరింధీ 2:6-16. దేవుని యొక్క ఆత్మను కలిగియున్నవారు వారే. దేవుని మూలముగా జన్మించినవారు వారే. వారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిస్మము ఆయన ఆత్మ ద్వారా పొందియున్నారు. వారు పరిశుద్ధాత్మచే బాప్తిస్మము పొందియున్నారు.

ఇప్పుడు మనము చెప్పుకొనిన దానిని ఇంకా వివరించుకొనవలెనన్నచో మరియొక లేఖనమును వాడుకొందుము. దానిని మనస్సులో ధ్యానించుచున్నాను. పరిశుద్ధాత్మతో ఎవరు బాప్తిస్మము పొందిరా అని మనము ప్రశ్నించుకొందుము. యోహాను 6:45లో యేసు ఏమి చెప్చెనో చూడండి.

"వారందరును దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలోవ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును."

కాని యెషయా 54:13 చూడండి, దానిని తీసి ఈలాగు చదువుదురు.

"నీ పిల్లలందరు యెహోవా చేత ఉపదేశము పొందుదురు."

దేవుని వారందరును దేవుని యొక్క పిల్లలే, కాబట్టి దేవుని యొక్క నిజ పిల్లల సూచన ఇక్కడ కనబడుచున్నది. (వారి మీదికి ఆత్మ వచ్చి నివాసము చేయును) పరిశుద్ధాత్మ ద్వారా ఒకరు మరల వాక్యము బోధించిన విధముగా యున్నది.

పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందియుండుటకు సూచనగా ఈ భాషలు ఎందుకు లేవో ఇప్పుడు మీరు చూడగలరు. ఏ కాలములోను ఈ విధంగా చెప్పబడలేదు. "భాషగలవాడు మాత్రమే ఆత్మ చెప్పుచున్న దానిని చెప్పును గాక!" అందువలన భాషలు, అర్ధము చెప్పుట, ప్రవచనము మొదలగునవి సూచనగా చూపబడలేదు. ఆత్మ చెప్పుచున్న దానిని వినుటయే సూచన. ఆత్మ మాట్లాడుచున్నది. అవును, ఆత్మ ఉపదేశించుచున్నది. తాను వచ్చినప్పుడు అదే చేయుదునని యేసు ఖచ్చితంగా చెప్పెను.

యోహాను 14:26,

"ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులనన్నింటిని మీకు జ్ఞాపకము చేయును."

అదియే జరిగినది. సువార్త ఆ విధముగానే వ్రాయబడినది. యేసు చెప్పిన మాటలను వీరు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆ కారణము చేతనే సువార్తలు బహు ఖచ్చితముగా యున్నవి, అవి పరిపూర్ణముగా యున్నవి. వారి మనస్సులకు ఆ సంగతుల నన్నింటినీ ఆత్మ జ్ఞాపకమునకు తెచ్చుట మాత్రమే కాదు గాని, వారికిప్పుడున్న సత్యమును గూర్చి మరింత విశదముగా తెలియజేసెను. పౌలు ఆ విధముగానే ప్రత్యక్షతలను పొందెను. దానిని గూర్చి అతడు చెప్పెను.

"నేను బోధించిన సువార్త మనుష్యుల మూలముగా పొందినది కాదని సోదరులారా మీకు ధృవపరచుచున్నాను.నేను దానిని మానవుల వలన పొందను లేదు, ఎక్కడను నేర్చుకొనలేదు. (మానవుల ద్వారా) కానీ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వలన పొందితిని.

గలతీ 1:11-12. పరిశుద్ధాత్మ వలన అతడు నేర్చుకొనెను.

యేసు భూమిమీద ఉండినప్పుడు, ఒక దినమున ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి ఆయనను దర్శింప వచ్చెను. అతడు ఇట్లనెను, "రబ్బీ! నీవు దేవుని వలన పంపబడిన బోధకునివని ఎరుగుదుము." అయితే మీకు తెలియును, యేసు అతని మాటలను కుదించివేసెను. నికోదేము పైపు ఆయన తిరిగి, ఆయన చెప్పిన మాటలను ఈ విధంగా మనము తిరిగి చెప్పుకొనవచ్చును. "నేను బోధకునిని కాను. నేను పాపము కొరకు అర్పించబడు బలి గొర్రెపిల్లను. నా ఆత్మ ద్వారా క్రొత్త జన్మను సాధ్యపరచుచున్నాను. కాని బోధకుడుగు ఒకాయన రాబోవుచున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ" యేసు భూమి మీద ఉండగా గొర్రెపిల్లగా వచ్చెను, ప్రవక్తగాను వచ్చెను. కాని ఆయన సంఘము యొద్దకు తన ఆత్మ ద్వారా తిరిగివచ్చెను, అప్పుడాయన బోధకుడుగా ఉండెను.

ప్రతికాలములోను అదే సత్యమును మనము వినుచున్నాము. "సంఘములతో ఆత్మ చెప్పుచున్న మూటను చెవిగలవాడు వినును గాక!" కాని ఆ కాలమునకు సంబంధించిన ప్రత్యక్షతను ఆత్మనింపుదల కలిగిన వ్యక్తి మాత్రమే వినగలడు. మరెవరును వినలేరు. లేదండి. వారెందుకు వినలేదో పాలు 1 కొరింధీ 2:6-16లో స్పష్టముగా చెప్పెను.

ఇది మీకు ఆనందమును కలుగజేయవలసి యున్నది. ఒక చాలా వింతయగు బోధ ఇప్పుడు చాలా ఎక్కువగా వినబడుచున్నది, దానివలన చాలా అపార్ధము మరియు కఠినమగు భావము ఏర్పడుచున్నది. నీవు తప్పకుండా భాషలు మాట్లాడవలెనని పెంతెకోస్తువారు చెప్పుదురు, లేనియెడల పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందలేదని వారందురు. నాక్సు, మూడీ, టేలర్, గోఫారు మొదలగు మహా భక్తులను వారు విసర్జించుచున్నారు అనుకోవచ్చును, లేదా వారందరూ రహస్యముగా భాషల్లో మాట్లాడుకుంటున్నారు అని అయినా జరుగుచున్నదానిని గూర్చి వారికి తెలియదు. ఇప్పుడు అది సత్యము కాదు. కాదండి. అది పూర్తిగా తప్పు. ఆత్మ నింపుదల కలిగియుండుటకు సూచనగా భాషలు లేవు. అది కేవలము తొమ్మిది ఆత్మ వరములలో ఒక్కటి మాత్రమే. దానిని I కొరింధీ 12లో చూడగలరు. భాషలు మాట్లాడినప్పుడే నీవు పరిశుద్ధాత్మ పొందియున్నావని ఎక్కడనూ వాక్యము చెప్పుట లేదు, లేదా భాషలు మాట్లాడినప్పుడే నీవు పరిశుద్ధాత్మను పొందుదువని కూడా ఎక్కడా చెప్పబడలేదు. కానీ "వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత భాషలు మాట్లాడిరి" అని చెప్పబడియున్నది. ఆ తరువాత వారు ప్రవచించిరని వ్రాయబడి యున్నది.

భాషలు మాట్లాడుట ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందియున్నారని నమ్ముచున్న వారందరూ తాము మాట్లాడుచున్నది నిజమగు భాషలయేనని తలంచుచున్నారు. ఈ రోజున చాలామంది మధ్య ఈ భావము నెలకొనియున్నది. కాని ఇది నిజము కాదు, ఎందుకనగా అనేకులు తప్పు ఆత్మ యొక్క ప్రభావము వలన తెలిసిన భాషలు మాట్లాడుచున్నారు. మనము ఇప్పుడు ఒక కూటములో ఉన్నామనుకొందము, వచ్చిన వారందరూ భాషలు మాట్లాడుచున్నారు అనుకొనండి. ఏ భాష దేవుని ఆత్మవలన వచ్చినదో, ఏ భాష అపవాది వలన వచ్చినదో మీరెట్లు తెలిసికొనగలరు? నేను అన్యుల మధ్య యున్నాను. వారియొక్క మతగురువులు పుర్రెలో రక్తము పోసికొని త్రాగి, భాషలలో మాట్లాడగా, మరికొందరు దానికి అర్థము చెప్పుట, ప్రవచించుట నేను చూచాను. వారు భాషలలో వ్రాయగలరు కూడాను.

ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందియున్నట్లుగా భాషలు సూచన అయినట్లయితే ఆ మాట్లాడినవారందరూ దేవునికి చెందినవారే కావలెను. కాని ఈ భాషల సూచనను గూర్చి మనందరికీ తెలియును. దానిని అందరూ ఒప్పుకొందురు. తప్పు భాషలు సాతాను ద్వారాను, మంచిభాషలు దేవుని ద్వారాను వచ్చుచున్నవి. అసలయిన దానిని సాతాను అనుకరించుచున్నది. కాబట్టి నా ప్రశ్న ఇది: "ఏది నిజమో ఎవరికి తెలియును? ఆ మాట్లాడినది ఏమిటో ఎవరికి అర్థమగును? దానిని తెలిసికొను వివేచన వరము ఎవరికున్నది? ఈ జవాబులను మనము పొందవలెనన్నచో ఇంకా ముందుకు వెళ్ళి మనము పరిశీలించవలెను. అంత వరకు ఈ భాషలకు మూలమేదో మనము ఆశ్చర్యపడక తప్పదు. మీరు భాషలనే సూచనగా నొక్కి చెప్పుచున్నచో ఇప్పుడే ఆ విషయమును చూడండి. భాషలలో చెప్పినది మీకు తెలియదు. కాబట్టి మీరు చివరికి ఒక స్థలమునకు రావలసియున్నారు. భాషలన్నియూ దేవుని మూలమేనని మీరు రుజువు చేయవలసియున్నారు. అప్పుడు మీరు అపవాది వలన భాషలు మాట్లాడుట జరుగదని చెప్పినట్లగును, కాని అది నిజము కాదు. కాదు, ఒక్క నిమిషము కూడా దానిని సత్యముగా నిరూపించలేరు. విదేశములలో మిషనరీగా యున్నవానికి ఈ నిజము తెలియును. అపవాది కూడా అన్య భాషలలోమాట్లాడగలదని వారెరుగుదురు. నా అనుభవము ద్వారా దానిని నేను ఎరుగుదును.

పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినప్పుడు జనులు భాషలతో మాట్లాడవలెనని నిర్ధారించు వాక్యము ఎక్కడనూ లేదని పెంతెకోస్తు వేదాంత పండితులు కూడా ఒప్పుకొందురు. అపోస్తలుల కార్యముల గ్రంథములోని అనుభములను అనుసరించి వీరు ఈ నామమును రూపొందించిరని కూడా వారు చెప్పెదరు. అయిదు సందర్భములలో మూడుసార్లు వారు భాషలలో మాట్లాడిరి. రెండు రకముల భాషలున్నవని కూడా వారు చెప్పెదరు, కాని అందుకు కూడా లేఖనాధారమేమీ లేదని వారు చెప్పెదరు. ఒక భాషను నీవు పరిశుద్ధాత్మను పొందేటప్పుడు మాట్లాడెదవు. అది సూచన అందురు. ఆ తరువాత నీవు నమ్మినయెడల భాషల వరమును పొందెదవని వారందురు. దానిని నీవు తరచుగా మాట్లాడుదువని అందురు.

పరిశుద్ధాత్మను పొందినట్లు సూచనగా నీవు ఒక్కసారి భాషను మాట్లాడిన తరువాత మరెన్నడూ దానిని మాట్లాడవని వారందురు. దీనికి వాక్యాధారము ఎక్కడున్నదని మరోసారి అడుగుచున్నాను. అది వాక్యములో లేనియెడల దానిని దేవుడు పలుకలేదు. వాక్యమునకు దేనినయినా చేర్చువానికి శ్రమ. ఈ అంశము గూర్చి వాక్యములోయున్నది గాని వారు దానిని పూర్తిగా అలక్ష్యము చేయుచున్నారు. I కొరింధీ 13. మనుష్యుల యొక్కయు, దేవదూతల యొక్కయు భాషల గూర్చి అక్కడ చెప్పబడినది. ఇవి తెలిసిన, తెలియని భాషలు. ఈ ఆధునిక పెంతెకోస్తువారు తాము పరిశుద్ధాత్మను పొందియున్నప్పుడు తెలియని భాషలోను, దేవదూతల భాషలోను మాట్లాడుచున్నట్లు చెప్పుచుందురు. వారికి గుర్రముకంటె ముందు, బండియున్నది, ఎందుకనగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయుములో జీవులు ఒక పరిపూర్ణవుగు భాషను మాట్లాడిరనియున్నది. దానిని వినిన అన్యజనులు సహితము అర్ధము చేసికొనిరి.

దేవుడు మౌనముగా యున్నప్పుడు మనమును మౌనముగా యుండుట మంచిది. ఆయన ఎక్కడ మాట్లాడెనో అక్కడ మనము మాట్లాడుట మంచిది. ఆయన ఇంతకు ముందు చెప్పినదానినే మనము చెప్పుదము. ఆయన మనకు సూచనను చెప్పెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తరువాత ఏమి జరుగునో ఆయన చెప్పెను. మనయొద్దకు బోధకుడు వచ్చి సర్వసత్యమును బోధించును. కాని ఆ బోధకుడు అంతరంగమందుండు ఉపదేశకుడు, బయటి ఉపదేశకుడు కాడు. అంతరంగమందు ఆత్మ లేనియెడల నీవు సత్యమును వినజాలవు. దానిని నీవు ప్రత్యక్షత ద్వారానే పొందగలవు. నీవు దానిని దినములోని ప్రతి క్షణము కూడా వింటూ యుండవచ్చును. పౌలు దినములలో అంతరంగమందు నివసించు ఆత్మ యొక్క సూచన అదే. పరిశుద్ధాత్మతో నింపబడినవారు వాక్యమును విని, దానిని చేర్చుకొని, దాని ద్వారానే జీవించిరి. ఆత్మను పొందలేనివారు కేవలము శరీర సంబంధులు వినినట్లుగానే విందురు. దానికి వారు తప్పు అనువాదము చెప్పెదరు. పాపములోనికి వెళ్ళెదరు!

ప్రతి కాలములోను సూచన ఒకే మాదిరిగానే యున్నది. (నిజ విశ్వాసికి ప్రతి కాలము కూడా పరిశుద్ధాత్మ కాలమువలెనె యుండును) — ఆత్మను కలిగియున్నవారు, అనగా ఉపదేశకుని కలిగియున్నవారు వాక్యమును వినిరి. వారిలోయుండిన ఆత్మవాక్యమును స్వీకరించి దానిని నేర్పించెను. (దానిని బయలుపరచెను) వారు ఆ వర్తమానికుని వినిన గుంపుగా యున్నారు. వారు ఆ వర్తమానమును విని దానివలన జీవించిరి.

పెంతెకోస్తు దినము యొద్దకు వెళ్ళి చూచుట ఒక గొప్ప శోధన అని నాకు తెలియును. కొర్నేలి ఇంటివారి మీద పరిశుద్ధాత్మ దిగిన దినమును కూడా మనము చూడవలెను. ఆ రెండు గుర్తింపు కలిగిన అనుభవములను పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క నిదర్శనముగా స్థిరపరచిరి. కాని ఆరెండు సందర్భములలోను వారు మాట్లాడిన భాషలు వినిన వారికి అర్ధమయినవి. పెంతెకోస్తు కూటముల యొక్క గందరగోళము ఈనాటి అధునిక బాబెలుగా యున్నది. అది వారి కేక, అటువంటి తర్కమును విడిచిపెట్టుటకు - ఈ రుజువులు చాలును. వాటి వలన ఒప్పించబడుదుము. మనము ఒక వాస్తవమును ఎదుర్కొనవలసియున్నామని గుర్తు చేయుచున్నాను. ఎన్నడూ భాషలలో మాట్లాడనివారు, తమ జీవితములలో ఆ మిగిలిన ఎనిమిది ప్రత్యక్షతలను లేదా వాటిలో కొన్నింటిని కలిగి యుండవచ్చును. జ్ఞానపు మాట, ఆత్మల యొక్క వివేచన, బుద్ధి వాక్యము, విశ్వాసము, స్వస్థత మరియు అద్భుతములు అను వరములు ఉన్నవి. తొమ్మిది వరములలోను భాషలు మాట్లాడుట అను వరము చాలా అల్పమైనదని మీరు ఎరిగినప్పుడు ఇంకా మీకు ఆశ్చర్యము కలుగును. ఈ విషయమును దృష్టిలో ఉంచుకొనండి; కాబట్టి మనము భాషలలో ఎన్నడూ మాట్లాడని వారిని చూచుచుందుము, వారు ఇంకా గొప్ప వరములను కలిగియుందురు, వారు అందుకే భాషలతో మాట్లాడుట లేదు, కాబట్టి ఈ బోధను మనము ఇంతకు ముందుకంటె మరి సంపూర్తిగా కొట్టివేయవలెను.

కాబట్టి ఇప్పుడు మీరు దీనిని చూచియున్నారు, బైబిలు చెప్పని దానిని చెప్పు హక్కు మాకు లేదు. పరిశుద్ధాత్మ యొక్క పనిని గూర్చి లేఖనము చెప్పుచున్నది, ధన్యుడగు ఆ వ్యక్తి యొక్క ప్రత్యక్షతను గూర్చి చెప్పబడినది. ప్రతి కాలములోను ఆ కాలముయొక్క సత్యమును ఆ కాలములో యుండిన నిజసంతానము యొద్దకు తీసికొని వచ్చును. ఆ వ్యక్తిలో ఆత్మ నివసించుట గూర్చి మనము ఎరుగుదుము. లేనియెడల ఆ కాలమునకు చెందిన సత్యమును అతడు చేర్చుకొనజాలడు. ఆమేన్. ఇది పూర్తిగా నిజము. ఈ కాలములన్నిటిలోను ఈ సత్యము నిశ్చయముగా బయటపడుట మీరు తప్పక గ్రహించగలరు.

ఇప్పుడు ఈ అంశమును విడిచిపెట్టు ముందుగా, వాక్యానుసారముగా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమనగా ఏమిటో తేటగా చెప్పగోరుచున్నాను. నా ఉద్దేశ్యము ప్రకారము కాదు, మీ ఉద్దేశ్యము ప్రకారము కాదు. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ప్రకారము అది యుండవలెను, లేనియెడల మనము త్రోవ తప్పినవారమగుదుము. ఆమేన్.

ప్రారంభములో ఈ సంగతిని గమనించండి. నా కూటములలో నేను సువార్త కూటమును ఆపిన తరువాత, అనగా బోధించిన తరువాత లేదా, ఒక వర్తమానము అందించిన తరువాత నేను వలను విసిరి, జనుల నుండి స్పందనను ఆహ్వానించుదును. వారిని ముందుకు రమ్మని పిలచి పరిశుద్ధాత్మను పొందుడని చెప్పెదను. నా పెంతెకోస్తు స్నేహితులు దీనిని విని నేను జనులను పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందునట్లు ఆహ్వానించు చున్నానని అనుకొందురు, ఎందుకనగా వారంతకు ముందే తిరిగి జన్మించిరి. ఆత్మను పొందుటకు రమ్మని ఇచ్చిన నా ఆహ్వానమును అందుకొని ముందుకు వచ్చిన వారితో మాట్లాడి సలహలిచ్చుటకు పరిశుద్ధాత్మ పొందిన కొందరిని నేను రమ్మని చెప్పెదను. ఈ ప్రియులు ముందుకు వచ్చి ఈ జనులను దేవునికి లోబడమని చెప్పెదరు. ఆ తరువాత భాషలలో మాట్లాడమని వత్తిడి చేయుదురు. ఇందువలన గొప్ప గందరగోళము ఏర్పడుచున్నది, నా భావము ఏమిటో సరిగ్గా నేను చెప్పుచున్నాను. తిరిగి జన్మించుటకు పాపిని ముందుకు రమ్మని నేను అడుగుచున్నాను, అదే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిస్మము పొందుటయైయున్నది; ఎందుకనగా సంఘము ఆవిర్భవించినప్పుడు, పెంతెకోస్తు దినమున వాస్తవంగా అదే జరిగెను, సంఘము ఆవిర్భవించెను. మరోవిధంగా చెప్పవలెనన్నచో, ఆత్మ మూలముగా జన్మించుట అనగా, నిజంగా పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుటయైయున్నది. ఆ రెండునూ ఒక్కటే.

ఇక్కడ కొంతసేపు ఇది గందరగోళము కలిగించునని నాకు తెలియును, నేను బాప్టిస్టు బోధకునిగా అభిషేకించబడితినని చాలామందికి తెలియును. మరియు దానిని ఆ బాప్టిస్టువారు పోగొట్టుకొనిరని నేను జాగ్రత్తగా చూచి చెప్పుచున్నాను. నీవు విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్మను పొందియున్నావని వారందురు, కాని అది నిజము కాదు. "నీవు విశ్వసించినప్పటి నుండి" ఆయనను చేర్చుకొనియున్నావు.

అపో. కా. 19:2-6,

"మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా వారు — పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు — యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి.అందుకు పౌలు — యోహాను తన వెనుక వచ్చు వానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.

వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.

తరువాత పౌలు వారిమీద చేతులుంచగా, పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి."

ఇక్కడ పౌలు అడిగిన దానిని వినండి. "నీవు విశ్వసించినప్పుడు కాదు, నీవు విశ్వసించినప్పటి నుండి పొందితివా? చాలా గొప్ప తేడా యున్నది. మనము విశ్వసించిన తరువాత పొందుదుము. ఎఫెసీ 1:13లో అపో.కా., 19 ప్రకారము ఎఫెసులో జరిగిన దానిని తిరిగి చెప్పియున్నాడు.

"మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి (మీరు విశ్వాసముంచినప్పుడు కాదు)."

ఇక్కడ నా అంశమున్నది. చాలా ఎక్కువమంది మన ఆధునికులు మరియు మౌలికవాదులు కూడా (నామకారులు) రక్షణను ఒక ప్రత్యేక సమయమునకు నమ్ముదురు. చాలా సందర్భములలో దానిని "తీర్మానము చేసికొనుట" అందురు. దానిని క్రీస్తును చేర్చుకొనుట లేదా తిరిగి జన్మించుట అందురు. ఇప్పుడు క్రీస్తును చేర్చుకొనుట అనగా ఆయనాత్మను చేర్చుకొనుటయే. ఆయన ఆత్మను చేర్చుకొనుట అనగా తిరిగి జన్మించుటయే. ఆయను ఆత్మను చేర్చుకొనుట అనగా పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుటయే. ఆమేన్. ఈ జనులు విశ్వసించిరి. ఇది చాలా అద్భుతము. కాని వారు అక్కడే ఆగిపోయిరి. విశ్వసించిన తరువాతనే మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. ఎల్లప్పుడునూ అదే విధానము, ఇక ముందును ఆ విధంగానే యుండును. జనులకు మొదటిసారి పెంతెకోస్తు యొద్ద పేతురు ద్వారా ఇవ్వబడిన నడిపింపు అదియే.

"మారుమనస్సు పొంది మీలో ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందెదరు.ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా ప్రభువగు మన దేవుడు పిలచిన వారికందరికిని చెందును."

పేతురు యొద్ద నుండి ప్రత్యక్ష జవాబుగా ఈ మార్గదర్శక సూత్రములు వచ్చినవి. పెంతెకోస్తు యొద్ద వాస్తవంగా జరిగిన దానికి ఇది సంబంధము కలిగియున్నది. యోవేలు ద్వారా దేవుడు పలికినది నెరవేరెను. సర్వశరీరుల మీదను వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కుమ్మరించబడెను. ఆ సమయమునకు ముందు ఆయన కుమ్మరించబడలేదు లేదా అనుగ్రహించబడలేదు. ఇది అదే. కాని అది ఇప్పుడు మారుమనస్సు పొందుట ద్వారా రావలసియున్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామములోబాప్తిస్మము పొందుట ద్వారా, అప్పుడు దేవుడు తన పనిని చేయబద్దుడై వచ్చిన వారిని ఆయన నింపును. "మీరు తప్పక తిరిగి జన్మించవలెను, ఆ తరువాత పరిశుద్ధాత్మచే నింపబడుదురు" అని పేతురు గాని, మరే అపోస్తులుడు గాని ఎన్నడూ చెప్పలేదు.

పరిశుద్ధాత్మను పొందుటకు సంబంధించిన అనుభవమునకు ఇది ఒక మాదిరిగా యున్నది, జాగ్రత్తగా గమనించండి, జనుల మీద ఆ తరువాత పరిశుద్ధాత్మ దిగిన సందర్భమును చూడండి.

అపో. కా. 8:5-17,

"అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను.జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా,అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువుగలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను.సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచూ తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు, అందరు దేవుని మహాశక్తియనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి.అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్యపెట్టిరి.అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసు క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుడి సూచక క్రియలును, గొప్పఅద్భుతములను జరుగుట చూచి విభ్రాంతినొందెను.సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును, యోహానును వారియొద్దకు పంపిరి.వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్ధనచేసిరి.(అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగియుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి.)అప్పుడు పేతురును, యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.

12వ వచనము ప్రకారము వారు వాక్యమును నమ్మిరి. ఆ తరువాత వారు ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందిరి, కాని 16వ వచనము ప్రకారము వారు అవన్నియూ చేసినా గాని ఇంకా వారు పరిశుద్ధాత్మను పొందలేదు. విశ్వసించిన తరువాత, నిజమైన బాప్తిస్మము పొందిన తరువాత మాత్రమే వారు పరిశుద్ధాత్మను పొందుకొనిరి. అపో.కా, 2:38-39లో పేతురు ద్వారా స్థిరపరచబడిన సరియైన మాదిరి అదే.

దీనిని గూర్చి అద్భుతమగు వివేచన అనుగ్రహించు మరియొక లేఖనమున్నది. అది గలతీ 3:13-14లో యున్నది,

ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది."ఆత్మను గూర్చిన వాగ్దనము విశ్వాసము వలన మనకు లభించునట్టు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. "

"అబ్రహాము యొక్క ఆశీర్వచనము" తిరిగి జన్మించుట అనియూ, "ఆత్మయొక్క వాగ్దానము" పరిశుద్ధాత్మ యొక్కయు బాప్తిస్మము అనియు అనగా ఆ రెండును విడివిడి సంఘటనలని ఏ విధముగాను మనము చెప్పలేము. ఎందుకనగా వాక్యములో ఈలాగున యున్నది: "ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది."

ఇప్పుడు నేను చెప్పిన దానిని అర్ధము చేసికొనుటకు మీరు పౌలు చెప్పిన మాటలను గమనించవలసియున్నారు. పౌలు ఎక్కడా కూడా "తిరిగి జన్మించిన తరువాత పరిశుద్ధాత్మచే నింపబడుడి," అని చెప్పలేదు. వారు తమ స్వంత అర్ధములను ఆ విషయములో చెప్పుచున్నారు, కాని లేఖనములు ఆ విధముగా చెప్పుట లేదు. యేసు కూడా ఎన్నడును ఆ విధముగా చెప్పలేదు.

యోహాను 7:37-39 చూడండి. అర్థము చేసికొనుచూ ఇప్పుడు దానిని చదువుడి.

"ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి — ఎవడైనను దప్పిగొనినయెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు."విశ్వాసి యేసు యొద్దకు వచ్చి విశ్వాసము ద్వారా దప్పి తీర్చుకొనుట ద్వారా అతని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఇక్కడ ప్రత్యేకముగాను, గట్టిగాను నొక్కి చెప్పబడియున్నది. పెంతెకోస్తు యొద్ద ఈ అనుభవమును చూడగలము.

ఈ ఆలోచనను మనము మనస్సులో యుంచుకొని యోహాను 4:10 మరియు 14 చదువుదుము.

"అందుకు యేసు నీవు దేవుని వరమును — నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగియుంటే; నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను.నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్ళు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను."

అదే జీవజలమును గూర్చి ఇక్కడ చెప్పబడినది, కాని ఈసారి ఇక్కడ నదిగా చెప్పబడలేదు; దీనిని బావిగా ఆయన చెప్పెను. ఇక్కడే జనులు పొరపాటు చేయుచున్నారు, ఎందుకనగా ఇది బావిగాను, నదిగాను చెప్పబడినది. ఒక దగ్గర ఆత్మ ద్వారా అనుగ్రహించబడు నిత్యజీవము అనియు ఇంకొక దగ్గర అది ఒక నదిగా పిలువబడినది అనియు (ఒక గొప్ప మహా శక్తి ఇమిడియున్నది) అది శక్తి యొక్క సంచకరువుగా ఇయ్యబడిన ఆత్మయై యుండుననియు వారందురు. ఆలాగు కాదు. అవి రెండును ఒక్కటే అయి యున్నవి. జీవమును మరియు శక్తిని ఇచ్చునది ఆత్మయే. పెంతెకోస్తు యొద్ద అది వచ్చెను.

ఈ అపార్ధమునకు కారణము ఏమిటి? జవాబు ఏమనగా "అనుభవమే." మనము అనుభవము ద్వారా వెళ్ళుచున్నాము గాని వాక్యము ద్వారా కాదు. నీ అనుభవమును కొలబద్దగా నీవు చూచుకొనవద్దు. ఒకే ఒక మట్టపు గుండు, ఒకే ఒక కొలకర్ర యున్నది. అదియే వాక్యము. ఇప్పుడు జాగ్రత్తగా గమనించి దీనిని గ్రహించుడి. పేతురు ఇట్లు చెప్పెను, "ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు." పౌలు కూడా అదే అడిగెను, "విశ్వసించినప్పటి నుండి మీరు పరిశుద్ధాత్మను పొందితిరా?" అనడిగెను. ఇక్కడే మనయొక్క సమస్య ఉత్పన్నమవుతున్నది. జనులు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడుచున్నారు, వారు నీటిలో బాప్తిస్మము పొందుచున్నారు, కాని వారు ముందుకు వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుట లేదు. ఆ ఆత్మను పొందుటను మీరు విశ్వసించండి.

యేసును విశ్వసించుట, అనగా పరిశుద్ధాత్మను పొందుటకు వేయు మంచి అడుగు అని గ్రహించవలెను. కాని జనులు అక్కడే ఆగిపోవుచున్నారు. వారు నీటి బాప్తిస్మము వరకు వచ్చి ఆగిపోవుచున్నారు. వారు నమ్మి ఆగిపోవుచున్నారు. మీరు నమ్మినప్పుడు పొందుదురని బైబిలు చెప్పుట లేదు. మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందియున్నారా? అనడిగెను. దానికి సరియైన, అక్షరాలా అర్థము ఇట్లున్నది: ఇంతకుముందే మీరు నమ్మియన్నారు గదా? పరిశుద్ధాత్మను పొందియున్నారా? జనులు నమ్మి ఆగిపోవుచున్నారు. మారుమనస్సు పొందినప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుట లేదు. ఇంకా ముందుకు వెళ్ళి మీరు పరిశుద్ధాత్మను పొందవలెను. దానిని మీరు చూచుచున్నారా? మన మౌలికవాదులతో వచ్చిన పొరపాటు అదియే. వారికి శక్తి లేదు, ఎందుకనగా వారు పెంతెకోస్తు యొద్దకు వెళ్ళకుండానే ఆగిపోవుచున్నారు.

వారు ఇశ్రాయేలీయులవలెనే యున్నారు, వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చి యున్నారు కాని వాగ్దాన దేశమునకు చేరువలో ఆగిపోయియున్నారు. ఆ ఇశ్రాయేలీయులు ఇరవై-లక్షల జనాంగముగా ఐగుప్తులో నుండి బయలుదేరిరి. వారందరు కలిసి ప్రయాణము చేసిరి, అందరూ ఆ దేవుని యొక్క అద్భుత కార్యములను చూచిరి, అందరూ ఆ మన్నాను పంచుకొనిరి, అందరూ ఆ కొట్టబడిన బండలోని నీరు త్రాగిరి. రాత్రియందు అగ్నిస్తంభమును, పగటియందు మేఘమును వారు వెంబడించిరి, కాని కేవలము ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశమును చేరుకొనిరి. ఇద్దరు మాత్రమే నిజమగు విశ్వాస వీరులుగా యుండిరి. ఇది నిజము. మిగిలినవారందరూ అవిశ్వాసము వలన చనిపోయిరని వాక్యము చెప్పుచున్నది. వారు అవిశ్వాసము వలననే అందులో ప్రవేశించలేకపోయిరి. (హెబ్రీ 3:19) ఆ కారణము వలననే కేవలము ఇద్దరే ప్రవేశించిరి, మిగిలినవారందరూ నిజమైన విశ్వాసులు కారు. ఈ భేదము ఎందువలన వచ్చియున్నది? ఇద్దరు మాత్రము వాక్యముతో నిలచి యుండిరి. కాదేషు బర్నెయా యొద్ద ఆ పదిమంది గూఢచారుల గుండెలు బ్రద్ధలయి పోయినప్పుడు యొహోషువా మరియు కాలేబులు ఏ మాత్రమూ చలించలేదు, ఎందుకనగా వారు దేవుని వాక్యమును నమ్మిరి. "మనము ఆ దేశమును స్వాధీనపరచుకొందుము, మనకు శక్తి చాలును" అనిరి. వారికి ఆ శక్తి ఉన్నట్లు గ్రహించిరి, ఎందుకనగా దేవుడు ఇట్లు చెప్పెను, "మీకు నేను ఆ దేశమును ఇచ్చియున్నాను." ఆ ఇశ్రాయేలీయులందరు దేవుని యొక్క శక్తిని, మంచితనమును మరియు విమోచనను చూచిన తరువాత కూడా విశ్రాంతిలో ప్రవేశి౦పలేకపోయిరి, అది పరిశుద్ధతకు సూచనగా యున్నది. కాబట్టి దేవుని యొక్క ఆత్మను పొందుటకు పూర్తిగా నమ్మువారు చాలా కొద్దిమంది మాత్రమే యుందురని ఇప్పుడు మీరు గ్రహించగలరు.

మంచిది, ఇంతవరకు మనము వచ్చినందుకు సంతోషించుచున్నాము. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళవలెనని నేను కోరుచున్నాను, మరియు ఆ విధముగా నేను చేసినప్పుడు కొన్ని భావోద్రేకములను నేను రేపుదునని నాకు తెలియును. కాని అందుకు నేను బాధ్యుడను కాను. నేను దేవునికిని, ఆయన యొక్క వాక్యమునకును, నేను ఏ ప్రజల యొద్దకు పంపబడితినో ఆ ప్రజలకును బాధ్యుడనైయున్నాను. నాకు చెప్పమనిన దానంతటిలోను నేను నమ్మకస్తుడనై యుండవలెను.

యోహాను 6:37 మరియు 44లో ఇట్లు చెప్పబడెను,

"తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనె౦త మాత్రమును బయటికి త్రోసివేయను.నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున వానిని నేను లేపుదును"

యోహాను 1:12-13,

"తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మనుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు."

ఎఫెసీ 1:4-5

"ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తికలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనలను తనయెదుట పరిశుద్దులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను."

దేవుని యొక్క సార్వభౌమత్వము అను అంశములో మరీ ఎక్కువగా విలీనమగుట లేదు (ఎందుకనగా దాని గూర్చి చెప్పినచో అదే ఒక గ్రంథమగును), కాని ఈ వచనములను బట్టి ఇక్కడనేను చెప్పుచున్నాను. యేసుక్రీస్తు తన స్వంత వధువును ఎన్నుకొనుచున్నాడు, ఈనాడు మనుష్యులు తమ వధువును ఏ విధముగా ఎన్నుకొనుచున్నారో ఆ విధముగా ఈ ఎన్నిక యున్నది. ఒక ప్రత్యేక పురుషుని తన భర్తగా స్వీకరించుదునని వధువు ఈనాడు సూక్ష్యముగా తీర్మానించుకొనదు. కాదండీ! పెండ్లికుమారుడు నిర్ణయించుకొనును. ఒక ప్రత్యేక స్త్రీని తన వధువుగా అతడు ఎన్నకొనును. (యోహాను 15:16, "మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నేనే మిమ్మును ఏర్పరచుకొనియున్నాను.")

ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రకారము, భూమికి పునాది వేయబడక ముందే వధువు ఎన్నుకొనబడెను. ఈ వధువును ఎన్నుకొనుట ఆయన చిత్తమునుబట్టి జరిగెను. ఎఫెసీ 1:9.

రోమా 9:11, ఇట్లు వ్రాయబడియున్నది,

"ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము."

మరే ఇతర విధముగా మీరు దానిని చదువలేరు. ఇది ప్రధానమైన సంకల్పము, దేవుని యొక్క నిత్య ఉద్దేశ్యము. ఆయన తన స్వంత ఎన్నిక ద్వారా వధువును తీసికొసెను, మరియు ఆ సంకల్పము ఆయనదే. జగత్తు పునాది వేయబడక ముందే నిత్యమైనది ఎన్నుకొనబడెను.

ఇప్పుడు దీనిని జాగ్రత్తగా గమనించి చూడండి. నక్షత్ర ధూళి అనునది లేక పూర్వమే; దేవుడు దేవునిగా ఉండక పూర్వమే (దేవుడనగా ఆరాధనకు పాత్రుడు మరియు ఆయనను ఆరాధించుటకు అప్పుడు మనుష్యులెవరును లేరు, ఆ సమయములో ఆయన శక్తిలో మాత్రము దేవునిగానే యుండెను) ఆయన ఒక నిత్య ఆత్మగానే యుండెను. ఆయన యొక్క మనస్సులో వధువు యుండెను. అవును, ఆమె ఉండెను. అప్పుడే ఆమె ఆయన మనస్సులో యుండెను, ఆయన యొక్క ఆలోచనలలో ఆమె యుండెను. ఈ దేవుని యొక్క ఆలోచనల మాట ఏమిటి? అవి నిత్యములు, కావా?

దేవుని యొక్క నిత్య ఆలోచనలు! దేవుని యొక్క ఆలోచనలు నిత్యమైనవా? అని నేనడుగుచున్నాను. మీరు దీనిని అర్ధము చేసికొనినయెడల చాలా సంగతులను అర్థము చేసికొనగలరు. సారములోను మరియు ప్రవర్తనలోను రెండింటిలోనూ దేవుడు మారనివాడై యున్నాడు. దానిని మనము అధ్యయనము చేసికొని ఇంతకు ముందే రుజవు పరచియున్నాము. దేవుడు తనయొక్క శక్తులలో అనంతుడు కాబట్టి దేవుడుగా ఆయన సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని గనుక నేర్చుకొనవలసినది ఆయనకేదియూ ఉండదు. ఆయన ఎవరితోనూ ఆలోచనకూడా చేయడు, చేయనవసరములేదు. ఆయన ఏ సమయములో కూడా తన జ్ఞానమునకు ఏమియూ చేర్చడు. ఆయన తన జ్ఞానమునకు ఏదయినా సమకూర్చుకొనినయెడల ఆయన సర్వజ్ఞాని కాకపోవును. ఆయన మరెప్పుడో ఉన్నవాడునై యున్నాడని శ్రేష్టముగా మనము చెప్పుకొనవచ్చును. కానీ అది లేఖనానుసారమైనది కాదు.

ఆయన సర్వజ్ఞానియై యున్నాడు. దేనిని గూర్చియు ఆయన కెన్నడునూ క్రొత్త ఆలోచన రాదు, ఎందుకనగా ఆయన ఆలోచనలలో భూత భవిష్యత్ వర్తమాన కాలములకు చెందినదంతయూ ఉండును. ఆది నుండి అంతము వరకు ఆయనకు తెలియును, ఎందుకనగా ఆయన దేవుడైయున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క ఆలోచనలు నిత్యములైయున్నవి. అవి వాస్తవమైనవి. అవి ఒక సామాన్య మానవుని ఆలోచనలవలె లేవు. మానవుడు తాను గీసిన నమూనాను ఒక దినమున నిజస్వరూపముగా మార్చును, కాని దేవునికయితే అవి ముందేయున్నవి. అవి దేవునిలో ఒక భాగములై నిత్యముగా యున్నవి, మరియు అవి వాస్తవమైనవి.

ఇదెట్లు పనిచేయునో చూడండి. దేవుడు ఆదాము పట్ల ఎన్నో ఆలోచనలను సదా కలిగియుండెను. ఆయన తలంపులలో యుండిన ఆదామును ఇంకా వ్యక్తపరచబడనేలేదు.

కీర్తనలు 139:15-16 చూచినట్లయితే, మీకు దీనిని గూర్చి కొద్దిగా అవగాహన ఏర్పడును.

"నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన ఎముకలును నీకు మరుగైయుండలేదు.నేను పిండమునై యుండగా, నీ కన్నులు నన్ను చూచెను; నియమింపబడిన దినములలో ఒకటైనకాక మునుపే, నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను."

నేను చెప్పినట్లుగా ఆదాము గూర్చి అది వ్రాయబడలేదు, అయితే మీకు అది కొంత గ్రహింపును ఇచ్చును. ఆయన మనస్సులో ఏ తలంపు కలిగియుండెనో ఆ తెలివిని ఆయన దయచేయును, ఆ ఆలోచన నిత్యమైనది. మరియు అది బయలుపరచబడవలసియున్నది. నేల మ౦టితో ఆదాము రూపింపబడినప్పుడు మరియు అతని యొక్క ఆత్మ సంబంధమగు వ్యక్తిత్వము దేవుని ద్వారా సృజింపబడెను. ఆలాగున ఆదాము వ్యక్తపరచబడిన దేవుని యొక్క ఆలోచనగా మారెను. ఆ నిత్య ఆలోచనలు ఇప్పుడు బయలుపరచబడినవి.

ఎన్నో శతాబ్దముల వెనుకకు మనము పెళ్ళగలము. మోషేను, యిర్మియాను, బాప్తిస్మమిచ్చు యోహానును ఇంకా అనేకులను మనము కనుగొందుము. ఆ యా కాలములలో వ్యక్తపరచబడిన దేవుని యొక్క ఆలోచనలుగా వీరున్నారు. ఇప్పుడు మనము యేసు యొద్దకు వచ్చుదము, అనగా లోగస్. ఆయన వ్యక్తపరచబడిన పరిపూర్ణమగు సంపూర్ణమగు ఆలోచనగా యుండెను. ఆయన వాక్యముగా తెలియబడెను. ఆయన వర్తమాన, భవిష్యత్ కాలములలో ఆలాగే అయియున్నాడు.

"జగత్తు పునాది వేయబడక ముందే ఆయనలో (యేసు) మనలను ఏర్పరచు కొనెనని" చెప్పబడినది. దానియొక్క అర్థము ఏమనగా అప్పుడే ఆయనతో కూడా అక్కడ మనం ఉన్నాము. జగత్తు పునాదికి ముందే దేవుని యొక్క ఆలోచనలలోను, మనస్సులోను మనము ఉన్నాము. ఏర్పరచబడినవారికి యున్న నిత్య లక్షణమును గూర్చి అది చెప్పుచున్నది. దానినుండి మీరు దూరము కాజాలరు.

ఇక్కడ ఒక ఆలోచనను నన్ను చెప్పనీయండి. మున యొక్క ఈ ప్రకృతి సంబంధమగు జన్మకూడా ఎన్నిక మీదనే ఆధారపడియున్నది. స్త్రీ యొక్క అండాశయములో ఎన్నో అండములు ఉత్పత్తియగును. కాని ఒక నిర్ణయింపబడిన కాలములో, నిర్ణయింపబడిన అండము మాత్రమే ఎందుకు పరిపక్వము చెందుచున్నది? ఇంకొకటి ఎందుకని పరిపక్వము చెందదు? ఆలాగునే పురుష వీర్యములోని ఒక జీవి మాత్రమే ఆ అండమునకు విలీనమగును, దీనికి ఏ ప్రత్యేక కారణము ఎవరికిని తెలియదు, మిగిలినవి కూడా అంతే తేలికగా విలీనము కావచ్చును. అందుకు తగిన మంచి అవకాశములున్నవి, అయినా గాని ఆలాగున జరుగక అవి నశించును. దీనంతటి వెనుక ఒక గొప్ప జ్ఞానము పనిచేయుచున్నది, లేనియెడల ఆ పిండమును బాలునిగా లేదా బాలికగా నిర్ణయించునది ఎవరు? నలుపు లేదా తెలుపు రంగును, కండ్ల యొక్క పైవిధ్యము, ఇంకా ఇతరములగు వాటిని ఎవరు నిర్ణయించుచున్నారు? ఈ ఆలోచనలను మనస్సులో యుంచుకొని యొహోషువా మరియు కాలేబుల గూర్చి ఆలోచించండి.

యోహాను 6:49లో యేసు చెప్పలేదా?

"మీ పితరులు అరణ్యములో మన్నాను తినియు చనిపోయిరి గదా?"

ఆ చనిపోయిన పితరులు ఈ బ్రదికియున్న వారికి తండ్రులు, వారితో ఆయన మాట్లాడుచున్నాడు. వారు నశించిపోయిరి, అయినా గాని వారు దేవుని యొక్క ఎన్నికలో యుండిరి. యెహోషువా మరియు కాలేబులు ఆత్మ సంబంధముగా ఆ విధముగానే యు౦డిరి.

కాని ముందుకు సాగిపోవలెను. ఈ ఎన్నిక కాబడినవారు దేవుని యొక్క ఆలోచనలో యుండుట మాత్రమే కాదు గాని, ఆ ఎన్నిక కాబడినవారిని మరియొక పేరుతో పిలచుట కూడా జరిగినది. వారు వారికి నిర్ణయించిన కాలములో శరీరమందు బయలుపరచబడవలసి యున్నారు.

రోమా 4:16,

"ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్తు సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను."

రోమా 9:7-13,

"అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని, ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును.అనగా, శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు.వాగ్దాన రూపమైన వాక్యమిదే. మీదటికి ఈ సమయమునకు వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును.అంతే కాదు. రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతియైనప్పుడు,(ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే;)పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితినని వ్రాయబడియున్నది.

గలతీ 3:16,

"అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు — సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే — నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు.

గలతీ 3:29,

"మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైయుండి వాగ్దన ప్రకారము వారసులైయున్నారు."

రోమా 4:16 ప్రకారము అబ్రహాము యొక్క సంతానమంతటికి దేవుడు ఒక నిశ్చయమగు వాగ్దానమును ఇచ్చెను. ఆ హోదా క్రిందికి పాలు మరియు విశ్వాసులందరును వచ్చిరి, ఎందుకనగా "అబ్రహాము మనందరికి తండ్రి" అని చెప్పబడెను. ఆ తరువాత అతడు తన నిర్వచనమును క్షీణింపచేయలేదు గాని దానికి తుది రూపమిచ్చెను. గలతీ 3లో యేసుతో కూడా ఆ సంతానము (ఏకవచనము) గుర్తించబడినట్లు చెప్పెను. ఆ సంతానమును "వాగ్దన సంతానముగా" ఆయన లెక్కించెను. ఈ వాగ్దానము "ఎన్నిక" లేదా "దేవుని యొక్క ఏర్పాటుతో కూడియున్నది." మనము దానినే ఖచ్చితంగా చెప్పుచున్నాము. రాజసంతానముగా నున్న వీరు దేవుని వలన ఏర్పరచబడినవారు. వారు "ముందుగా నిర్ణయింపబడినవారు. దేవునిచేత ముందు ఎరుగబడినవారు. దేవుని యొక్క మనస్సులోను, ఆయన యొక్క ఆలోచనలలోను వారుండిరి.

క్రీస్తు యొక్క నిజమగు వధువు దేవుని యొక్క మనస్సులో నిత్యముగా ఉండెనని సామాన్య భాషలో చెప్పవచ్చును. అయితే అందరూ ఒక్కసారే వ్యక్తపరచబడలేదు. ఒక్కొక్కరు వారి వారి నిర్ణయ కాలములలో వచ్చుచున్నారు. వారి రుతువును బట్టి వచ్చుచున్నారు. ప్రతి సభ్యుడును శరీరమును ధరించుకొని వచ్చి వ్యక్తపరచబడుచున్నారు. ఆ విధముగా ఈ వధువు అక్షరాలా పలుకబడిన వాక్య వధువు సంతానమైయున్నది. ఆమె అని స్త్రీలింగమును మనము అపాదించుచున్నప్పటికి ఆమె "క్రీస్తు శరీరముగా" పిలువబడినది. ఆ విధముగా ఆమె పిలువబడుట సరియేనని మీరు గ్రహించవచ్చును, ఎందుకనగా ఆమె ఆయనలో ముందుగా నిర్ణయించబడినది. అదే మూలమునుండి ఆమె వచ్చియున్నది. ఆయనతో కూడా నిత్యమూ ఉండును. అనేకమంది సభ్యులున్న ఆయన శరీరములో ఇప్పుడామె దేవునిని బయలుపరచుచున్నది. ఒకప్పుడు దేవుడు ఒకే సభ్యునియందు ప్రత్యక్షమాయెను. ఆయునే ప్రభువైన యేసుక్రీస్తు.

ఇప్పుడిచ్చట మనము ఒక ముగింపునకు వచ్చుచున్నాము. నిత్యుడగు లోగస్ (దేవుడు) కుమారునియందు ప్రత్యక్షమాయెను. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరరీత్యా యేసునందు నివసించెను. ఆ నిత్యుడగు ఆయన తండ్రియై మనముందు ప్రత్యక్షమాయెను, ఆ విధముగా ఆయన కుమారుడగు బిరుదును పొందెను, మనము కూడా ఆలాగునే యున్నాము. ఆయన యొక్క నిత్య ఆలోచనలో ఉన్న మనము మన కాలము వచ్చినప్పుడు మనము కూడా పలుకబడిన వాక్య సంతానములో భాగమై యున్నాము. శరీరమందు బయలుపరచబడిన, ఆ నిత్యమగు ఆలోచనలు ఇప్పుడు శరీరమును ధరించి దేవుని కుమారులయినవి. మనము ఆలాగున పిలువబడియున్నాము. పునర్జన్మవలన మనము సంతానముగా మారలేదు, కానీ మనమే సంతానమైయున్నాము, కావున తిరిగి జన్మించియున్నాము, ఎందుకనగా ఏర్పరచబడినవారు మాత్రమే తిరిగి జన్మించగలరు. మనము సంతానమైయున్నాము, ఆ కారణము చేతనే మనము లేపబడుదుము. సంతానము కానియెడల తిరిగి లేచుట యుండదు.

దీనిని జాగ్రత్తగా మనస్సులో పదిలపరచుకొనండి. ఇప్పుడు మరో అడుగు వేయండి. విమోచన అనగా తిరిగి కొనుట. అది అసలు యజమాని యొద్దకు వచ్చును. దేవుడు తన మరణము ద్వారా, తన రక్తమును చిందించి మనలను తన స్వకీయులనుగా తిరిగి కొనెను. పలుకబడిన వాక్య సంతానమగు వధువును ఆయన తిరిగి కొనెను. "నా గొర్రెలు నా సర్వము వినును, అవి నన్నువెంబడించును." మీరు ఎల్లప్పుడును గొర్రెలు గానే యున్నారు. మీరు ఎన్నడును ఒక పందిగా గాని, లేదా ఒక కుక్కగా గాని యుండి గొర్రెగా మారలేదు. ఆ జాతిలో ఎట్టి మార్పు ఉండదు. ఏ విత్తనము, ఆ విత్తనము యొక్క ఫలమునే ఫలించును. మనము దేవుని యొక్క ఆలోచనలలో యున్నాము. ఆ తరువాత శరీరమందు వ్యక్తపరచబడినాము. ఆయన స్వరమును (వాక్యము) విను ఒక దినము కావలసియుండెను. ఆ స్వరమును వినుట ద్వారా మనము మన తండ్రి యొక్క ఉనికిని గుర్తించి మనము దేవుని యొక్క కుమారులని గ్రహించియున్నాము. ఆయన స్వరమును మనము విని మరియు ఆ తప్పిపోయిన కుమారునివలె ఇట్లు కేక వేసితిమి. "రక్షించుము, ఓ, నా తండ్రీ, నీ యొద్దకు నేను తిరిగి వచ్చుచున్నాను."

దేవుని యొక్క కుమారుడు తాను దేవుని కుమారుడనని గుర్తించుటకు చాలా కాలము పట్టవచ్చును. వాస్తవానికి చాలామంది నిజ క్రైస్తవులు ఆ చిన్న పక్షిరాజు కథలో యుండిన రీతిగానే యున్నారు. అది ఒక కోడిపెట్ట క్రింద పొదుగబడెను. ఆ పక్షిరాజు ఒక నిజ విశ్వాసికి సాదృశ్యముగా యున్నట్లుగా మీరెరుగుదురు. ఒక వ్యవసాయదారుడు పక్షిరాజు గూడులో నుండి ఒక గ్రుడును తీసికొని దానిని కోడిపెట్ట క్రింద పొదిగించెను. ఆ తగిన కాలములో ఆపెట్ట క్రిందగల గూడు అన్నీ పొదుగబడెను. ఆ తల్లిపెట్టతో కూడా ఆ చిన్న కోడిపిల్లలు చక్కగా తిరుగుచున్నవి, కాని ఆ చిన్న పక్షి రాజుకు కోడిపెట్ట యొక్క కూత అర్థము కాలేదు. ఆ పెంట పోగును త్రవ్వి ఆహారము తినుట చేత కాలేదు. ఏదో లాగున ప్రాణమును నిలబెట్టుకొన్నది గాని ఇదంతా దానికి ఏదో గందరగోళముగా కనిపించెను.

ఒక దినమున ఎక్కడో ఆకాశములో ఆ తల్లి పక్షిరాజు దీనిని పసిగట్టినది, తాను పెట్టిన గ్రుడు పొదుగబడి చిన్న పక్షిరాజు పిల్ల బయటకు వచ్చినట్టు కనిపెట్టినది. క్రింద అది తిరుగుచున్నది, అది మహా వేగముతో క్రిందికి దిగి వచ్చినది. తన స్వరమంతటితో కేకవేసినది, తన తల్లిని కలిసికొనుటకు రమ్మను కేకను ఆ పక్షిరాజు పిల్ల వినినది. అంతకు ముందెన్నడూ అది పక్షిరాజుయొక్క స్వరమును వినలేదు, కాని ఆ మొదటిసారిగా ఆ పిలుపును వినగానే దానిలో ఏదో చలనము కలిగినది. అది ఆ తల్లివైపు ఆకర్షించబడినది, అయినా అది ప్రయత్నించుటకు భయపడినది. మరలా ఆ తల్లి కేక వేసినది, గాలిలో ఎగిరి తనను వెంబడించమని చెప్పినది. తనకు భయము వేయుచున్నదని ఇది మరల జవాబు ఇచ్చినది. ప్రయత్నము చేయమని మరల ఒక్కసారి అది కేకవేసినది. తన రెక్కలను విదిల్చినది. గాలిలోనికి తన్ను విసరుకొనినది. తన తల్లి పిలుపునకు జవాబును ఇచ్చినది. నీలాకాశములోనికి ఎగిరిపోయినది. మీరు చూడండి. అది ఎప్పుడునూ పక్షిరాజే. కొంతకాలము పాటు అది ఒక కోడిపిల్లవలె నటించినది, కాని అందువలన తృప్తి కలుగలేదు. ఆ గొప్ప పక్షిరాజు యొక్క కేకను వినగానే, ఆ పక్షిరాజు పిల్ల తన స్థానమును గుర్తించినది. దేవుని యొక్క నిజమగు కుమారుడు ఒక్కసారి గాని వాక్యము ద్వారా ఆత్మ యొక్క స్వరమును వినినయెడల తానెవరో గుర్తించి ఆ గొప్ప ప్రవక్తయగు పక్షిరాజు యొద్దకు పరుగెత్తును. ఆయనతో కూడా సదాకాలము ఉండి క్రీస్తు యేసుతో పరలోక స్థలములందు కూర్చొనును.

ఇప్పుడు మన జయశాలియగు మూలరాయి పరిశుద్ధాత్మ యొక్క బాస్త్రీస్మముతో వచ్చుచున్నది.

గలతీ 4:4-7,

"అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను.ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్త పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను.మరియు మీరు కుమారులైయున్నందున — నాయనా తండ్రీ, అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు."

చూడండి. యేసుక్రీస్తు వచ్చెను, సిలువ మీద చనిపోయెను, విమోచనను పూర్తిచేసెను. (కొనుట ద్వారా లేదా వెల చెల్లించుట ద్వారా అసలు యజమానికి తిరిగి వచ్చెను) ఆ విధముగా ఆయన మనలను కుమారులుగా చేసెను. మనలను ఆయన కుమారులుగా చేయుట, అనగా మనము ఇంతకు ముందు కుమారులుగా లేమని కాదు. ముందే మనము ఆయన కుమారులము, కాని ఇప్పుడాయన ఆ కుమారుల స్థానములో మనలనుంచెను. ఈ లోకములో మనము ఉన్నంతకాలము, శరీరములో యున్నంత కాలము, ఆయన కుమారులముగా మనము గుర్తించబడము. అపవాది ద్వారా మనము చెరపట్టబడినాము, ఏమయినా గాని మనము కుమారులమే. దీనిని వినండి: మీరు కుమారులు గనుక, మీ హృదయములలోనికి ఆయన తన కుమారుని ఆత్మను పంపెను. దాని ద్వారా మీరు అబ్బా తండ్రీ అని మొరపెట్టుచున్నారు. పెంతెకోస్తు యొద్ద ఆత్మ ఎవరి మీద దిగినది? కుమారుల మీద, కొరింధులో ఎవరి మీద దిగినది? కుమారుల మీదనే. వారు వాక్యమును వినిరి.

పరిశుద్ధాత్మ బాప్తిస్మమనగా ఏమిటి? క్రీస్తు యొక్క శరీరములోనికి ఆత్మ నీకు బాప్తిస్మము ఇచ్చును. అదియే నూతన జన్మ దేవుని యొక్క ఆత్మవచ్చి నీవు మారుమనస్సు పొందిన తరువాత, (ఆయన వాక్యమును వినిన తరువాత) నిన్ను నింపును. నీటిలో బాప్తిస్మము పొందుదువు. దేవుని యెడల నిర్మలమైన మనస్సాక్తి కలిగియుండుటకు ఇది ప్రత్యుత్తరముగా యున్నది.

ఇప్పుడు మనము చూపించినది అందరూ అర్ధము చేసికొనుటకు చాలా సుళువుగా యున్నది. అందరునూ దేవత్వము యొక్క ఏకత్వము గూర్చి, ఆ బోధను గూర్చి విశ్వసించిన ఎడల ఆ దేవత్వములో ముగురు వ్యక్తులు లేరు గాని ఆయన ఒక్కడే. ఆ విధముగా మనము ఆత్మ ద్వారా తిరిగి జన్మించలేదు గాని, యేసు యొక్క జీవము మన లోనికి వచ్చి యున్నది. అందుకు అనుగుణముగానే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనకు శక్తిని ఇచ్చును. అది గాని నిజమయినచో ఎందుకు మనము తండ్రిని అగౌరవించుచున్నాము? మనయొక్క పూర్తి రక్షణలో మనము ఆయనకు భాగమిచ్చుట లేదు ఎందుకని? రక్షణ యొహోవా వలన కలుగుచున్నది, కానీ ప్రభువులు ముగ్గురున్నారు మరి ఆయన కూడా ఒకటి తప్పక చేయవలసియుండును కదా (తండ్రి). తాను మాత్రమే దేవుడనని యేసు బహు తేటగా చెప్పెను. ఆయన మాత్రమే విశ్వాసి యొద్దకు వచ్చుచున్నట్లు చెప్పెను.

యోహాను 14:16లో చెప్పబడినదేమనగా, తండ్రి మరియొక ఆదరణకర్తను పంపించును.

కాని తరువాత 17వ వచనములో ఇలా చెప్పెను, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును.

ఆయన వారియొద్దకు వచ్చునని 18 వచనములో యున్నది.

23 వచనములో ఆయన శిష్యులతో మాట్లాడుచూ ఇట్లు చెప్పెను. "మేము (తండ్రి మరియు కుమారుడు) అతని యొద్దకు వచ్చెదము." ఆ విధముగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఒకేసారి వచ్చుచూ యున్నారు. దేవత్వములో ఒకే ఒక వ్యక్తి యున్నాడు. ఆ దృశ్యము పెంతెకోస్తు యొద్ద జరిగెను. ఆత్మ యొక్క రాకడలు రెండు లేవు గాని ఒక్కటే. ప్రజలకు నిజమగు సత్యము తెలియదు. ఇక్కడే సమస్య వచ్చుచున్నది. పాపక్షమాపణ నిమిత్తము వారు యేసును మామూలుగా నమ్ముచుందురు, కాని ఆత్మను పొందుటకు రారు.

ఈ అంశమును నేను ముగించు ముందుగా, మీ మనస్సులోయున్న ఒక ప్రశ్నను నేనెరుగుదునని చెప్పుచున్నాను. ముందు ఉనికి బోధను నేను నమ్ముచున్నానేమో మీరు తెలిసికొనగోరుచున్నారు. మార్మనుల యొక్క ఆ ముందు ఉనికి సిద్దాంతమును నేను నమ్మటలేదు. అవతారము లేదా ఆత్మ యొక్క పునర్జన్మలను గూర్చి నమ్మినట్లుగా అది యుండును. దీనిని మీరు జాగ్రత్తగా యుండి చూడవలెను. దేవుని యొద్ద నుండి నిత్యముగా నిర్ణయించబడివచ్చువాడు వ్యక్తి కాడు గాని వాక్యము లేదా సంతానము. అవును. మానవ మనస్సు గ్రహింపజాలని ఆ వెనుకకు వెళ్ళి చూచినప్పుడు దేవుడు నిత్యుడైయుండి నిత్య ఆలోచనలను కలిగియుండెను. నిత్యమగు ఆజ్ఞను జారీచేసెను.

"యాకోబును నేను ప్రేమించితిని, ఏశావును నేను ద్వేషించితిని."

(రోమా 9:13)

అప్పటికి వారిద్దరు పుట్టలేదు, వారిద్దరూ ఏ మేలు గాని కీడు గాని చేయలేదు.

చూడండి, అది ఒక ఆలోచనగా యుండెను, ఆ తరువాత ఆలోచన వ్యక్తపరచబడెను. దేవుడు యాకోబును తిరిగికొనెను, ఎందుకనగా యాకోబు మాత్రమే సంతానము. యాకోబునకు మాత్రమే సంతానముండెను; ఆ కారణము చేతనే అతను జ్యేష్టత్వపు హక్కు విలువైనదని చూచెను. మరియు దేవుని యొక్క నిబంధన. నీవు నిజమగు సంతానమైనచో, ఆ వాక్యమును విందువు. ఆత్మ నిన్ను క్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిస్మమిచ్చును. నిన్ను నింపి నీకు శక్తిననుగ్రహించును. నీ కాలమునకు మరియు నీ దినమునకు చెందిన వాక్యమును విని చేర్చుకొందువు. నీవు వాక్యము బయలు పరచబడినప్పుడు, ఆ నిజమగు రుజవు ఎంత స్పష్టముగా యుండునో గ్రహించుము. యేసు రాజసంతానమై యున్నాడని గమనించుము. ఆయన మానవ శరీరములో జీవించెను. ఆత్మ అతనిని పిలచినప్పుడు (వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆలోచన) యోర్దాను నదికి వెళ్ళి నీటిలో బాప్తిస్మము పొందెను. వాక్యమునకు విధేయత చూపినందున పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగివచ్చెను. ఆ స్వరము ఇట్లనెను, "ఈయన నా ప్రియు కువూరుడు, ఈయన మాట వినుడి." అంతే గాని ఈయన నా కుమారుడాయెను అని ఆ స్వరము చెప్పలేదు." యేసే కుమారుడు. పరిశుద్ధాత్మ అందరి ముందు ఆయనను కుమారునిగా పెట్టెను. ఆ విధముగా ఆయన నింపబడెను. (పెంతెకోస్తు యొద్దను, ఆ తరువాత ఎన్నడయినా గాని అదే మాదిరి) ఆయన శక్తిని ప్రచురించుచూ వెళ్ళేను, దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆ దినమునకు దేవుని యొద్ద నుండి సంపూర్తిగా పొందెను.

తాను జీవించుచున్న కాలమునకు చెందిన వాక్యమును విశ్వాసి చేర్చుకొనుటయే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినటుగా నిజమైన సూచన అని నిరంతరము మేము చెప్పుచున్నాము. దానిని అతి స్పష్టముగా మీకు చూపించనివ్వండి.

ప్రకటన 2, మరియు 3 అధ్యాయములలో ఏడు సంఘ కాలములను చూసిన, అన్యుల కాలము యొక్క పూర్తి వ్యవధికి అది వర్తించును. అన్యులను రక్షణలోనికి నడిపించుటకు దేవుడు వాడుకొనిన పూర్తి సమయము అది. ప్రతి సంఘకాలములోను, ఎట్టి మినహాయింపు లేకుండా ప్రారంభములోను మరియు చివరలోను ఆ వర్తమానము ఇట్లున్నది: "సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము (ఎఫెసు, స్ముర్న పెర్గేమ, తుయతైర, సార్ధిసు, ఫిలదేల్పియా, లవొదికయు) ఈ సంగతులు చెప్పువాడు, మొదలగు., మొదలగును., ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటను చెవిగలవాడు వినును గాక. (ఏక వచనము) ఇక్కడ గమనించండి. యేసు (ఆత్మ ద్వారా) ప్రతి కాలములోను ఒకే ఒక వ్యక్తిగా చెప్పుకొని యున్నాడు. ఆ కాలమునకు సంబంధించిన వ్యక్తి ఆయనే. ప్రతి కాలమునకు ఒకే ఒక వర్తమానికుడున్నాడు. ఆ కాలమునకు ఆత్మ చెప్పుచున్న దానిని ఆ వర్తమానికుడు చేర్చుకొనును. ఆ ఒక్క వర్తమానికుడే నిజ సంఘమునకు వర్తమానికుడైయున్నాడు. అతడు ప్రత్యక్షతను పొంది, దేవుని పక్షముగా "సంఘములతో" మాట్లాడును. నిజ సంఘము, అబద్ధ సంఘము రెండింటితోను అతడు మాట్లాడును. వర్తమానము అందరికిని ప్రసారము చేయబడును. వర్తమానము యొక్క పరిధిలోనికి వచ్చుచున్నవారందరికిని అది ప్రసారము చేయబడినా గాని వర్తమానమును వ్యక్తిగతముగా మాత్రమే చేర్చుకొందురు. ఆ గుంపు ఒక ప్రత్యేకమైనదిగా యుండి ఒక అర్హతను పొందిన గుంపుగా యుండును. ఆ గుంపులో ఉన్న ప్రతి వ్యక్తియు వర్తమానికుని ద్వారా ఆత్మ చెప్పుచున్న దానిని వినగల సామర్థ్యమును కలిగియుందురు. ఎవరయితే వినుచున్నారో వారు, వారి యొక్క సొంత ప్రత్యక్షత కలిగియుండరు, లేదా ఆ గుంపు వారి యొక్క ఏకమైన ప్రత్యక్షతను కలిగియుండదు; కాని, దేనినైతే వర్తమానికుడు ముందుగా దేవుని దగ్గరి నుండి పొందియున్నాడో, దానిని ప్రతి వ్యక్తి వినుచున్నాడు మరియు పొందుకొనుచున్నాడు.

ఇది ఎంతో వింతగా యున్నదని మీరు తలంచరాదు. దేవుని యొక్క హస్తము ద్వారా పౌలు ఈ మాదిరిని స్థాపించెను. తన దినమునకు చెందిన పూర్తి ప్రత్యక్షతను పాలు మాత్రమే కలిగియుండెను. అతడు ఇతర అపోస్తులులను కలిసికొనినప్పుడు ఇది నిరూపణ అయినదని గమనించగలము. ఆ దినమున అన్యులకు పౌలు ప్రవక్త వర్తమానికునిగా యున్నాడని ఇతర అపోస్తలులును అంగీకరించిరి. వాక్యములో ఉన్న వాస్తవ ఉదాహరణను కూడా గమనించండి, పౌలు ఆసియాకు వెళ్ళగోరెను, కానీ దేవుడతనిని వద్దనెను, ఎందుకనగా మాసిడోనియాలో గొర్రెలున్నవి. (ఆయన పిల్లలు) ఆత్మ ద్వారా పౌలు చెప్పనైయున్న సంగతులను వారు విందురు. (మాసిడోనియా వారు) ఆసియాలోని ప్రజలు వినరు.

ప్రతికాలములోను మనకు అదే మాదిరి యున్నది. ఆ కారణము చేతనే ఒక దేవుడిచ్చిన వర్తమానికుని ద్వారా ఒక ప్రత్యేక స్థలములో వెలుగు ప్రకాశించుచున్నది. ఆ వర్తమానికుని ద్వారా ఆ వెలుగు అక్కడ నుండి ఇతర సేవకుల పరిచర్య ద్వారా వెదజల్లబడుచున్నది. వారు నమ్మకముగా బోధించిరి. అయితే బయటకు వెళ్ళువారందరూ ఆ వర్తమానికుడు చెప్పినదానిని చెప్పినట్లుగా చెల్లింపవలసిన అవసరము లేదు. (గుర్తుచుకొనండి, తాను చెప్పినదానిని చెప్పవలెనని పౌలు జనులను కోరెను. I కొరింధీ 14:37, "ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధిననియైనను తలంచుకొనిన యెడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను." ఏమిటి? మీలో నుండి దేవుని యొక్క మాట వచ్చునా? లేక మీకు మాత్రమే వచ్చునా?) వారు దానికి ఏదయినా చేర్చినా లేక దానిలో నుండి ఏదయినా తీసివేసినా, ఆ వర్తమానము ఎంతో కాలము స్వచ్చముగా యుండదు మరియు ఆ ఉజ్జీవము చనిపోవును. ఆ స్వరము మనము ఎంతో జాగ్రత్తగా వినవలెను, ఎందుకనగా ఆత్మకు ఒకే ఒక స్వరమున్నది. అది దేవుని యొక్క స్వరము. తాను చెప్పినదానిని చెప్పమని పౌలు వారిని హెచ్చరించెను. పేతురు సహితము ఆ ప్రకారముగానే చేసెను. ప్రత్యక్షత ద్వారా తనకు అనుగ్రహించబడిన దానిలో ఒక్క మాటను కూడా మార్చజాలనని, (అనగా పౌలు) చెప్పెను. అందుకు వారిని హెచ్చరించెను. ఆయన యొక్క వర్తమానికుల ద్వారా దేవుని స్వరమును వినుట ఎంత ప్రధానము! వారికిచ్చిన దానిని సంఘములకు చెప్పవలసియున్నారు.

దానిని ఇప్పుడు మీరు చూడనారంభించుచున్నారని నమ్ముచున్నాను. మౌలికవాదులతోను మరియు పెంతెకోస్త వారితోను నేనె౦దుకు అంగీకరించుట లేదో బహుశా మీరు అర్థముచేసికొనియుందురు. నేను వాక్యమును పట్టుకొనియుండవలసియున్నాను. ప్రభువు నాకు ఏ విధముగా బయలుపరచెనో ఆలాగే చెప్పవలెను. ఇప్పుడు దానినంతటినీ నేను చెప్పలేను, చెప్పినచో మరో పుస్తకము తయారగును, కాని ప్రభువు యొక్క సహాయమును బట్టి మనము చాలా ప్రసంగములను మరియు టేపులను, వర్తమానములను విని ఈ సంగతులన్నియూ అర్థము చేసికొనండి. లేఖనములన్నియూ ఒకదానికొకటి సరిపోవును.

"ప్రతి కాలములోను ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటను చెవిగలవాడు వినును గాక!" ప్రతి కాలములోను కేక ఒక్కటే. ఆత్మ చెప్పుచున్నదానిని వినండి. మీరు క్రైస్తవులయినచో, ఆత్మ బోధించుచున్న వాని వైపుకు మీరు తిరిగెదరు. అది ఈ కాలపు వాక్యము. ప్రతి కాలమునకు చెందిన ప్రతి వర్తమానికుడును అదే వాక్యమును బోధించును. ప్రతి నూతనమగు మరియు నిజమగు ఉజ్జీవమును ఆ కాలపు ప్రజలను ఆ దినపు వాక్యము యొద్దకు త్రిప్పును. ప్రతి కాలములోని కేక కూడా ఒక గద్దింపుగానే యుండును. "నీవు దేవుని మాటను విడిచిపెట్టియున్నావు, మారుమనస్సు పొంది, వాక్యము నొద్దకు తిరిగి రమ్ము." బైబిలులోని మొదటి గ్రంథము (ఆది కాండము) మొదలుకొని, చివరి గ్రంథము వరకు (ప్రకటన) దేవుడు విచారము వెల్లడి చేయుటకు ఒకే ఒక కారణమున్నది — వాక్యమును విడిచిపెట్టినందువలననే. ఆయన యొక్క కృపను పొందుటకు ఒకే ఒక విరుగుడు యున్నది — వాక్యము నొద్దకు తిరిగి వచ్చుటయే.

ఎఫెసు కాలములోను, ఈ కాలములోను, ప్రతి కాలములోను ఇది సత్యమని మనము చూడగలము. ఈ చివరి కాలమగు మన కాలములో కూడా వాక్యము యొక్క విసర్జనను మనము చూడగలము, పూర్తి విశ్వాస భ్రష్టత్వము, మహా శ్రమలో ఇది పరిసమాప్త మగును.

మీరు నిజ సంతానమయినచో, మీరు నిజముగా పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందినచో, ఆయన వాక్యమున మీ అవసరమగు ఆహారముకంటె ఎక్కువగా మరియు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించుటకు ఆరాటపడుదువు.

మనందరి కొరకు నేను చేయు ఆసక్తిగల ప్రార్థన ఇదే; ఈనాడు మనకొరకు ఆత్మ వాక్యము నుండి తీసికొని వచ్చుచున్న దానిని మనము విందుము గాక!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...