పెర్గమ సంఘ కాలము

పెర్గమ సంఘ కాలము

ప్రకటన 2:12-17

"పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము; వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా;సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్ను గూర్చి సాక్షియైన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోవలసియున్నది. అవేమనగా, విగ్రహములకు బలి యిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యెడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు.అటువలెనె నికోలాయితుల బోధ ననుసరించువారును నీలో ఉన్నారు.కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధముచేసెదను.సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్ల రాతినిత్తును; ఆ రాతి మీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును; పొందినవానికే గానీ అది మరి ఎవనికిని తెలియదు."

పెర్గమ

పెర్గమము (ప్రాచీన నామము) మైసీయాలో ఉండెడిది. మూడు నదుల ద్వారా ఆ జిల్లా చుట్టబడియుండెను. అందులో ఒకటి సముద్రమునకు సంబంధము కలిగియుండెను. ఆసియాలో ఇది ఒక మహా ఉజ్వల పట్టణముగా వర్ణించబడినది. ఇది ఒక సాంస్కృతిక పట్టణముగా ఉండి, అలెగ్జాండ్రియాలోనున్న గ్రంథాలయము తరువాత పెద్దది ఇక్కడ ఉండెను. ఇది మహా పాపపు పట్టణము, అయినా గాని అస్కులాపియస్ ఆరాధన కొరకు కర్మకాండలు నిర్వహించు అనుమతి ఇయ్యబడెను, సజీవముగానున్న సర్పమును మాదిరిగా వారు ఆరాధించిరి, దానిని ఆలయములో పెంచి పోషించెడివారు. నీటి కాలువలచే సేద్యము చేయబడు పండ్ల తోటల తోపులు, బహిరంగ నడకప్రదేశములు, పార్కులు కలిగిన ఈ సుందరమగు పట్టణములో ఒక చిన్నగుంపుగా సమర్పణగల విశ్వాసులు జీవించెడివారు. వీరు ఆ సౌందర్య ప్రలోభమునకు లోంగిపోకుండా ఆ స్థలమును నింపిన సాతానీయ ఆరాధనను అసహ్యించుకొనిరి.

కాలము

పెర్గమ కాలము దాదాపుగా మూడు వందల సంవత్సరములు కొనసాగినది. అది క్రీ.శ. 312 నుండి 606 వరకు.

వర్తమానికుడు

ప్రతి కాలమునకు వర్తమానికుని ఎన్నుకొనుటకు మన దేవుడు-ఇచ్చిన పద్ధతిని వాడుకొనుచూ మొదటి వర్తమానికుడు పౌలునకు అతి సమీపముగా లేదా దాదాపుగా యున్నవారి పరిచర్యను మనము చూడవలెను. ఆ విధముగా చూచినప్పుడు నిస్సందేహముగా పర్గెమ వర్తమానికునిగా మార్టిన్ను పేర్కొందుము. మార్టిన్ 315లో హంగేరీలో జన్మించెను. అయినను, అతని జీవితకాలము ఫ్రాన్సులో పనిచేసెను. టూర్స్ కు బయట మరియులోపట అతడు బిషప్పుగా పనిచేసెను. 399లో అతడు మరణించెను. ఈ గొప్ప పరిశుద్ధుడు మరియొక అద్భుతమగు క్రైస్తవుడగు పరిశుద్ధ పాట్రిక్ అను ఐర్లండ్ వాసికి అంకుల్.

ఒక వృత్తిరీత్యా సైనికునిగా పనిచేయుచున్న సమయములో మార్టిన్ మారి క్రీస్తును అంగీకరించెను. ఇంకా అతడు ఆ వృత్తిలో కొనసాగుచుండగనే అతి గొప్ప గుర్తింపదగిన అద్భుతము ఒకటి జరిగినది. మార్టన్ విధిని నిర్వహించుటకు నియమింపబడిన ఆ పట్టణపు వీధిలో ఒక బిచ్చగాడు వ్యాధిగ్రస్తుడై పడియుండెను. అతడు సరైన వస్త్రములను కలిగియుండనందున, ఆ చలికాలపు మంచును మరియు శీతలమును తట్టుకొనలేని స్ధితిలో యుండెను. మార్టిన్ ఆ ప్రక్కగా వెళ్ళు వరకు ఎవరును అతని అవసరములను గూర్చి పట్టించుకొనలేదు. ఈ పేదవాని యొక్క దుస్థితిని చూచి అతడు తన పైన ధరించిన వస్త్రమును తీసి, తన కత్తితో రెండుగా కోసి చలికి గడ్డకట్టిపోవుచున్న ఆ వ్యక్తికి చుట్టెను. తన యొద్ద మరియొక్క అదనపు వస్త్రము లేకపోయినా గాని ఈ విధంగా సహాయము చేసెను. ఆ రాత్రి ఒక దర్శనమందు ప్రభువైన యేసు అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మార్టిన్ ఇచ్చిన సగము వస్త్రము ధరించి ఆ బిచ్చగానివలెనె నిలబడియుండెను. ఆయన ఇట్లు మాట్లాడెను, "మార్టిన్, అతడు అందరి చేత తృణీకరింపబడినా గాని నీవు నాకు ఈ వస్త్రమును కప్పితివి." ఆ సమయము నుండియు మార్టిన్ తన పూర్ణ హృదయముతో ప్రభువును సేవించుటకు పూనుకొనెను. అతని జీవితము ఒక అద్భుతముల ధారగా మారెను. దేవుని యొక్క శక్తిని బయలుపరచెను.

సైన్యముము విడిచిపెట్టిన తరువాత సంఘములో ఒక నాయకునిగా మారెను. విగ్రహారాధనకు వ్యతిరేకముగా అతడు చాలా గట్టిగా నిలబడెను. అతడు బలిపీఠములను నాశనము చేసెను, విగ్రహములను విరుగగొట్టెను, దేవతా స్తంభములను చిన్నాభిన్నము చేసెను. ఆలాగు చేసినందున అన్యులు అతనిని ఎదుర్కొనిరి, బయలు ప్రవక్తలతో ఏలియా సవాలు చేసిన విధముగానే ఇతడు అన్యులతో సవాలు చేసెను. విగ్రహముండిన స్థలములో ఒక చెట్టుకు తనను కట్టి ఆ చెట్టును నరకమని వారితో అనెను, ఆ చెట్టు నరకబడిన పిమ్మట పూర్తిగా అతని మీద పడి తతునియలుగా చేయును, దేవుడు ఆ చెట్టును పడకుండా త్రిప్పినచో మాత్రమే అతడు బ్రదుకును. దుర్మార్గులగు అన్యులు అతనిని ఆ చెట్టుకు కట్టిరి, అది ఒక కొండ వాలులో ఎదుగుచుండెను, సహజముగా భూమ్యాకర్షణ శక్తి వలన ఆ చెట్టు వాలును బట్టి నిశ్చయముగా ఇతని మీద పడునట్లుచేయునని వారు చెప్పిరి. ఆ చెట్టు నరకబడిపోవుచున్న సమయములో దేవుడు దానిని కొండ పైభాగమునకు లాగెను, అది ప్రకృతి సంబంధమగు నియమమునకు పూర్తిగా విరుద్ధము. ఆ చెట్టు, పారిపోవుచున్న అన్యుల మీద పడినందున వారిలో చాలా మంది నలిగిచనిపోయిరి.

యేసు నామమునందు విశ్వాసముంచుట ద్వారా కనీసము మూడు సందర్భములలో అతడు చనిపోయినవారిని బ్రదికించెనని చరిత్రకారులు ఒప్పుకొందురు. మరియొక సందర్భములో అతడు చనిపోయిన బిడ్డ కొరకు ప్రార్థించెను. ఎలీషావలె, అతడు బిడ్డమీద చాచుకొని పరుండి ప్రార్ధి౦చెను. ఆ బిడ్డ బ్రదికి ఆరోగ్యముగా యుండెను. మరియొక సందర్భములో అతనిని ఒక చనిపోతున్న సోదరునికి సాయం కొరకు రావలెనని కబురు పంపిరి. ఆ సోదరుడు మహా శ్రమల కాలములో చనిపోయెను. అతడు ఆ పేదవాని యొద్దకు వచ్చినప్పటికే, అతడు చనిపోయెను. వారతనిని ఒక చెట్టుకు వ్రేలాడదీసిరి. అతని శరీరములో జీవము లేదు మరియు అతని కన్నులు బయటకు పొడుచుకొనివచ్చినవి. కాని మార్టిన్ అతనిని క్రిందికి దింపించి ప్రార్థించెను, మరియు అతడు ప్రాణమును పొంది తన కుటుంబముతో పాటు సంతోషించెను.

శత్రువు ఎంతటి వాడయినా గాని మార్టిన్ ఎన్నడును లెక్కచేయలేదు. భయపడలేదు. ఆ విధంగా అతడు ఒక దుర్మారుడగు చక్రవర్తిని వ్యక్తిగతంగా ఎదుర్కొనెను. అనేకమంది ఆత్మ నింపుదలగల పరిశుద్ధులను వాడు చంపించెను. ఆ చక్రవర్తి ఎవరినీ తన యొద్దకు రానీయకుండా చేసెను. ఆ చక్రవర్తి యొక్క స్నేహితుడగు డమాసస్ ను మార్టిన్ చూచుటకు వెళ్ళెను, అతడు రోమ్నకు క్రూరమైన బిషప్పు. కాని ఆ బిషప్పు నామకార్థ క్రైస్తవుడైనందున, కారు ద్రాక్షావల్లికి చెందినవాడయినందున, ఆ చక్రవర్తితో మధ్యవర్తిత్వము జరుపలేదు. మార్టిన్ ఆ రాజ భవనమునకు తిరిగి వెళ్ళెను, కానీ అప్పుడు ఆ తలుపులు (గుమ్మములు) మూయబడియున్నవి, మరియు వారు అతనిని లోపటకు వెళ్ళుటకు అనుమతించలేదు. మార్టిన్ రాజ భవనములోనికి ప్రవేశించునట్లు చేయమని ప్రభువునకు మోకరిల్లి ప్రార్థించెను. లేచి రమ్మని ఒక స్వరము పలుకుటను అతడు వినెను. అతడు వేచిచూడగా, ఆ గుమ్మములు వాటంతట అవే తెరచుకొనినవి. అతడు అవరణలోనికి నడిచి వెళ్ళేను. కాని ఆ క్రూరుడగు పాలకుడు తన తలను త్రిప్పలేదు మరియు ఇతనితో మాట్లాడలేదు. మార్టిన్ మరల ప్రార్థించెను. ఆకస్మాత్తుగా అగ్ని ఆ సింహాసనము మీదికి రాగా ఆ చక్రవర్తి త్వరపడి దిగిపోయెను, వానికి ఆనందము లేదు. నిశ్చయంగా ప్రభువు గర్విష్టులను అణచును మరియు దీనులను హెచ్చించును.

దేవుని సేవించుటలో అతని ఉత్సాహము అంత తీవ్రమైనది ఎందుకంటే, దెయ్యము బలంగా రెపబడింది సత్యము యొక్క విరోధులు మార్టిన్ను చంపడానికి హంతకులను మాట్లాడుకున్నారు. వారు రహస్యంగా అతని యింటిలో చొరబడిరి, మరియు వారతనిని చంపబోగా, అతడు నిటారుగా నిలబడి ఖడ్గము ఎదుట తన మెడను ఉంచాడు. వారు ముందుకు దూకగానే, అకస్మాత్తుగా దేవుని శక్తి వారిని గది అవతలికి విసిరేసింది. ఆ పరిశుద్ధమైన, భయంకరమైన వాతావరణంలో వారు, వారి చేతులూ మరియు మోకాళ్ళపై పాకుతూ, అతని ప్రాణం తీయుటకై ప్రయత్నించినందుకు క్షమాపణకై వేడుకొనునంతగా లోబడిరి.

ప్రభువు చేత వాడబడుచుండు వారు గర్వముతో నిండియుండుటను మనము తరచుగా గుర్తించుచుందుము. కాని మార్టిన్ అలాంటివాడు కాడు. అతడు ఎల్లప్పుడును దేవుని యొక్క దీన సేవకునిగానే ఉండిపోయెను. ఒక రాత్రి అతడు బలిపీఠము యొద్దకు వచ్చుటకు సిద్ధపడుచుండగా, ఒక బిచ్చగాడు అతడు అధ్యయనము చేయుచున్న చోటికి వచ్చి వస్త్రము నిమ్మని కోరెను. సంఘపెద్ద యొద్దకు వెళ్ళమని మార్టిన్ ఆబిచ్చగానికి చెప్పెను. అహంకారియగు ఆ పెద్ద పొమ్మని బిచ్చగానిని కసిరికొట్టెను. అతడు మరల మార్టిన్ యొద్దకు వచ్చెను. మార్టిన్ లేచి తను ధరించిన మంచి అంగీని ఇచ్చి వేసెను. దానికంటె తక్కువ వెలగల మరియొక అంగీని తనకు తెచ్చి పెట్టమని పెద్దకు చెప్పెను. ఆ రాత్రి మార్టిన్ వాక్యము బోధించుచుండగా దేవుని యొక్క మంద అతడు ఒక మృదువైన కాంతివంతమైన వెలుగు వస్త్రము ధరించియున్నట్లుగా చూచిరి.

నిశ్చయంగా ఇతడు గొప్ప వ్యక్తి, ఆ కాలమునకు ఒక నిజమగు వర్తమానికుడు. ఎన్నడూ ఘనతను కొరుకొనలేదు గాని దేవునిని సంతోషపరచుటకు అతి సమర్పణగల జీవితమును జీవించెను. అతడు మొదట ప్రార్ధించితేనే గాని ఎన్నడునూ ప్రసంగించుటకు ఇష్టపడెడివాడు కాడు. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని చేరుకొనెను. పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్దాత్మ ద్వారా దేవుని యొక్క సంకల్పమునంతటినీ తెలియచేసెను. సంపూర్ణమగు నిశ్చయతను పొందువరకు అతడు ప్రార్ధిచుటవలన తరచుగా జనులు అతని గూర్చి వేచియుండవలసి వచ్చెడిది.

మార్టిన్ గూర్చి మరియు అతని యొక్క శక్తిగల పరిచర్య గూర్చి తెలిసికొనినప్పుడు పరిశుద్ధుల యొక్క హింస ఆగిపోయినదని ఎవరయినా తలంచెదరు. కాని అది నిజము కాదు. దుష్టులను ఒక సాధనముగా వాడుకొనుచూ అపవాది ఇంకనూ పరిశుద్ధులను నాశనము చేయుచుండెను. వారిని ఉరికొయ్యలకు కట్టి కాల్చివేయుచుండిరి. వారిని మేకులతో స్తంభములకు కొట్టుచుండిరి, వారి మీదికి పిచ్చి కుక్కలను వదులుచుండిరి, వారి యొక్క శరీరమును మరియు ప్రేగులను కుక్కలు బయటకు పీకుచుండెడివి. ఆ విధముగా వారు బహు చిత్రహింసలు పొందుచూ మరణించుచుండిరి. ప్రసవించనైయున్న తల్లుల గర్భములను చీల్చి ఆ పసికందులను పందులకు వేయుచుండిరి. స్త్రీల యొక్క రొమ్ములను కోసివేయుచుండిరి, వారిని నిటారుగా నిలబడునట్లు బలవంతము చేసి వారి రక్తము పూర్తిగా ఆ నాళములలో నుండి బయటకు వచ్చి చనిపోవువరకు చూచెడివారు. ఈ పనిని అన్యులు మాత్రమే కాదు గాని అది నామకార్ధులగు క్రైస్తవులకు కూడా చేయుచుండిరని వినినప్పుడు మనకు మరింత దుఃఖము కలుగును. ఆ విధముగా వారు చేసినందువలన దేవుని యొక్క మొప్పును పొందెదమని తలంచిరి. ఈ విధేయులగు సిలువ యోధులు వాక్యము కొరకు నిలబడి పరిశుద్ధాత్మకు విధేయులయిరి.

యోహాను 16:2,

"వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నారని అనుకొను కాలము వచ్చుచున్నది."

మత్తయి 24:9,

" అప్పుడు జనులు మిమ్మును శ్రమలపాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తముసకల జనముల చేత ద్వేషింపబడుదురు."

సూచక క్రియల ద్వారాను, అద్భుతముల ద్వారాను, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారాను, ఆ కాలమునకు నిజమగు వర్తమానికునిగా మార్టిన్ వాస్తవంగా రుజువుచేయబడెను. గొప్ప పరిచర్యను వరముగా పొందుట మాత్రమే కాదు గాని అతడు సదా దేవుని యొక్క వాక్యముపట్ల నమ్మకమును చూపెను. సంస్థకు విరోధముగా అతడు పోరాడెను. ఉన్నత స్థలములందు జరుగుచున్న పాపమును అతడు ఎదిరించెను. మాటలోను మరియు క్రియలోను అతడు వాక్యమును నిజమని నిరూపించి మరియు క్రైస్తవ జీవితపు నిండు జయమును తన జీవితములో కనుపరచెను.

అతనిని గూర్చి ఒక ఆత్మకథను వ్రాయు రచయిత ఇట్లు చెప్పెను, "అతడు ఎన్నడూ కోపపడుట గాని, వ్యసనపడుట గాని, దుఃఖించుట గాని, లేదా నవ్వుట గాని ఎవ్వరూ చూడలేదు. అతడు ఎల్లప్పుడూ ఒకే మాదిరిగా యుండెను, మర్త్య స్వభావమునకు అతీతుడై కనబడెను, పరలోక సంబంధమగు ఒక రకమగు సంతోషము ఆయన ముఖము మీద ప్రకాశించుచుండెను. ఆయన పెదవులలో క్రీస్తు తప్ప మరేదీ ఎన్నడూ ఉండెడిది కాదు. అతని హృదయములో పరిశుద్ధత, సమాధానము మరియు దయ తప్ప మరేమియూ ఉండెడివి కావు. తనను హింసించుచున్న వారి పాపముల గూర్చి అతడు తరచుగా ఏడ్చుట కనిపించేది. అతడు నెమ్మది గాను, మతిపరుపు గాను ఉన్న సమయములోవారు విషపూరిత పెదవులతోను, చావును కపలించు నాలుకలతోను దాడిచేసిరి. అతని యొక్క సద్గుణములను బట్టి అతనిని చాలామంది ద్వేషించిరి, ఎందుకనగా ఎవరూ అతనిని అనుకరించలేకపోయిరి. అతని సద్గుణములు ఎవరికీ లేవు. అయ్యో! అతని యొక్క హంతకులు అతని బిషప్పులే!"

అభివందనము

ప్రకటన 2:12

"వాడియైన రెండంచులు గల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా."

మూడవ సంఘ కాలమునకు వర్తమానము రాబోవుచున్నది. దాగని ఈ నాటకము, "క్రీస్తు తన సంఘము మధ్యను సంచరించుచున్నాడు," యొక్క మూడవ రంగమును చూద్దాం, ఇది బయలుపరచబడుటకు సిద్ధముగా యున్నది. బూరవంటి స్వరముతో ఈ సాటిలేని వానిని ఆత్మ బయలుపరచుచున్నది. "వాడియెన రెండంచులు గల ఖడ్గము గలవాడు!" దేవుని గొర్రెపిల్లయగు ఆయనను పిలాతు ఎట్లు పరిచయము చేసెనో చూడండి. ఇప్పుడు ఆయన దానికి పూర్తి భిన్నమగు రీతిలో కనబడుచున్నాడు. ఆయనకు వారు ఊదారంగు వస్త్రము ధరింపచేసి ఎగతాళి చేసిరి, ఆయనను కొట్టి ముండ్ల కిరీటమును పెట్టిరి. "ఈయనే మీ రాజు," అని హేళన చేసిరి. కాని ఇప్పుడాయన రాజ దుస్తులు ధరించి మహిమ కిరీటమును పెట్టుకొనియున్నాడు. ఆయన పునరుద్ధానుడగు ప్రభువు. "క్రీస్తు, దేవుని యొక్క శక్తియైయున్నాడు."

'వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు' అను వాక్యములో దైవత్వము యొక్క మరో ప్రత్యక్షత ఉన్నది. ఎఫెసు సంఘకాలమును మీరు గుర్తుచేసికొనండి, ఆయన మారని దేవునిగా యుండెను. స్ముర్న యుగములో ఆయనను ఒకే నిజ దేవునిగా చూచియున్నాము, ఆయన తప్ప మరెవరునూ లేరు. ఈ పెర్గమ సంఘకాలములో ఆయన దైవత్వము యొక్క మరి ఎక్కువ ప్రత్యక్షతను చూతుము. ఆయన తన వాడియగు ఖడ్గమును బయలుపరచుట మనము చూతుము, అది దేవుని వాక్యమే.

హెబ్రీ 4:12

"ఎందుకునగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచూ హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది."

ఎఫెసీ 6:17

"దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.

ప్రకటన 19:13, & 15

"రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది.

యోహాను 1:1-3,

"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను. వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యమే (వాక్యము) ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కలిగియున్నదేదియూ ఆయన లేకుండా కలుగలేదు."

I యోహాను 5:7,

"సాక్ష్యమిచ్చువారు ముగ్గురు: అనగా ఆత్మయు, నీళ్ళును, రక్తమును (తండ్రీ, వాక్యము మరియు పరిశుద్ధాత్మ - ఇంగ్లీష్ బైబిల్ను అనుసరించి) ఈ ముగురు ఏకీభవించియున్నారు."

వాక్యముతో ఆయన యొక్క సంబంధమును మనము చూడగలము. ఆయనే వాక్యము. ఆయన హోదా అదియే. ఆయన నామములోని వాక్యము.

యోహాను 1:1లో ఇట్లు చెప్పబడెను. "ఆదియందు వాక్యముండెను." వాక్యము అను దాని యొక్క భాషాంతరము 'లోగోస్' అయి యున్నది, అనగా 'ఆలోచన' లేక 'భావన.' దానికి రెండు అర్థములున్నవి, 'ఆలోచన' లేక 'భాష'. "బయలుపరచబడిన ఆలోచనయే, మాట లేదా మాటలు." ఇది చాలా ఆశ్చర్యకరము గాను, చక్కగాను ఉన్నది కదూ? దేవుని యొక్క భావన యేసులో వ్యక్తమయినదని యోహాను చెప్పెను.

హెబ్రీ 1:1-3లో పౌలు కూడా అదియే చెప్పెను,

"పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములు గాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు,ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతకంటె ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటె అంతశ్రేష్టుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను."

యేసు క్రీస్తు అను వ్యక్తియందు దేవుడు వ్యక్తపరచబడెను. యేసు అనగా బయలుపరచబడిన దేవుని యొక్క స్వరూపము.

మరల యోహాను 1:14 చూడండి,

"ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను."

దేవుని యొక్క సమస్తమూ శరీరమును ధరించి మనమధ్య నివాసము చేసెను. ఏ మనుష్యుడునూ సమీపించజాలని ఆ గొప్ప ఆత్మ దేవుడు ఇప్పుడు శరీరమును ధరించుకొని మానవుల మధ్యని వాసము చేసెను. ఎవడునూ ఎన్నడునూ ఆయనను చూడలేదు, చూచిన బ్రదుకడు, ఇప్పుడు దేవుని యొక్క సంపూర్ణత మానవులకు ప్రత్యక్షమాయెను.

యోహాను 1:18

"ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను."

దేవుడు, అయా సంధర్భములలో తన యొక్క సన్నిధిని మేఘము ద్వారా గాని లేదా అగ్నిస్తంభము ద్వారా గాని మానవులకు బయలుపరచెను. అందువలన మానవుల హృదయములు భయముతో నిండిపోయెడివి. ప్రవక్తల యొక్క మాటల ద్వారా తన హృదయు లక్షణములను బయలు పరచుకొనిన ఈ దేవుడు ఇప్పుడు ఇమ్మానుయేలుగా మారెను (దేవుడు మనకు తోడు) ఆయన తన్నుతాను బయలుపరచుకొనెను. తన్నుతాను బయలుపరచుకొనెను అను గ్రీకు మూల పదముము మనము చూచినచో, పూర్తిగా వివరించుకొని తేటతెల్లమగుట అని అర్థము. తరచూ దాని అర్ధమును తెలియచేసికొనుట అందుము. సజీవ వాక్యమగు యేసు అదే చేసెను. ఆయన దేవునిని మనకొరకు తీసికొని వచ్చెను. ఏలయనగా ఆయనే దేవుడు.

పరిపూర్ణమగు స్పష్టతతో ఆయన మనకు దేవునిని బయలుపరచెను.

యోహాను ఆయనను గూర్చి 1 యోహాను 1:1-3లో ఇట్లు చెప్పగలిగెను.

"జీవ వాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియచేయుచున్నాము.(ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపరచుచున్నాము;)మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కువూరుడైన యేసు క్రీస్తుతో కూడను ఉన్నది."

దేవుడునిజముగా బయలుపరచబడినప్పుడు ఆయన శరీరమందు ప్రత్యక్షమాయెను. "నన్ను చూచిన వాడుతండ్రిని చూచియున్నాడు."

ఇప్పుడు మరల హెబ్రీ 1:1-3లో చూడండి. దేవుని యొక్క బయలుపరచబడిన స్వరూపమే యేసు అని మనము చూచాము. ఆయన దేవుడై యుండి తన్ను మానవులకు మానవునిగా బయలుపరచుకొనెను. కాని ఈ వచనములలో మనము గమనించవలసిన సంగతి ఒకటున్నది, ముఖ్యముగా ఒకటి మరియు రెండు వచనములు చూడండి.

"పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను."

ఇక్కడ మీరు గమనించవలెనని కోరుచున్నాను. మీ బైబిలు యొక్క మార్జినులో ఒక దిద్దు బాటును మీరు చూచెదరు. "ద్వారా" అనునది సరియగు అనువాదము కాదు. "లో" అని యుండవలెను. 'ద్వారా' కాదు. అప్పుడు సరిగా యుండును. "పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములుగాను ప్రవక్తలో మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారునిలో మనతో మాటలాడెను."

I సమూయేలు 3:21,

"షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను."

ఇది 1 యోహాను 5:7ను పరిపూర్ణముగా తీసికొని వచ్చుచున్నది. "వాక్యము మరియు ఆత్మ ఒక్కటే." యేసు, తండ్రిని బయలుపరచెను. వాక్యము తండ్రిని బయలుపరచెను. యేసే సజీవమగు వాక్యము. దేవునికి స్తోత్రము, ఈ రోజు కూడా ఆయన అదే సజీవ వాక్యముగా యున్నాడు.

యేసు భూమి మీదయుండగా ఇట్లు చెప్పెను,

"నేను తండ్రియందును, తండ్రి నా యందును ఏకమైయున్నామని మీరు విశ్వసించుట లేదా? నేను మీతో చెప్పుచున్న సంగతులు నా యంతట నేనే చెప్పుట లేదు. నాయందు నివసించుచున్న తండ్రియే ఈ క్రియలను చేయుచున్నాడు." (యోహాను 14:10)

ఇక్కడ ఇది చాలా తేటగా చెప్పబడియున్నది, కుమారునియందు దేవుడు సంపూర్ణముగా బయలుపరచబడెను. లోపల నివసించుచుండిన ఆత్మ వలన క్రియలోను, మాటలోను అది రుజవాయెను. ఇంతవరకు దానినే మనము బోధించుచున్నాము. ఎప్పుడైతే వధువు, వాక్య వధువుగా మారినప్పుడు ఆమె కూడా యేసు చేసిన క్రియలనే చేయును. వాక్యమే దేవుడైయున్నాడు. ఆత్మ దేవుడైయున్నాడు. వారు అంతా ఒక్కటే. ఒకరు మరియొకరి నుండి వేరయి పనిచేయలేరు. ఒకరు నిజంగా దేవుని ఆత్మను కలిగియున్నయెడల అతనిలో దేవుని యొక్క వాక్యముండును. ప్రవక్తలు ఆ విధంగానే యుండిరి. వారిలో దేవుని యొక్క, ఆత్మ నివాసముండెను కనుక వారి యొద్దకు వాక్యము వచ్చెను. యేసు ఆ విధముగానే యుండెను. అయనలో పరిమితిలేని ఆత్మయుండెను మరియు ఆయన యొద్దకు వాక్యము వచ్చెను. (యేసు క్రియ చేసెను మరియు ఉపదేశించెను. నా బోధ నా స్వంతము కాదు, నన్ను పంపిన నా తండ్రిది. అపో, కా.1:1, యోహాను 7:16.)

ఇప్పుడు గుర్తుంచుకొనండి, బాప్తిస్మమిచ్చు యోహాను తన దినమునకు ప్రవక్త గాను వర్తమానికునిగాను ఉండెను. తన తల్లి గర్భములో ఉన్నప్పటినుండియే అతడు పరిశుద్ధాత్మతో నిండియుండెను. అతడు యోర్దానులో బాప్తిస్మమిచ్చుచుండగా దేవుని యొక్క వాక్యము (యేసు) అతని యొద్దకు వచ్చెను. వాక్యము ఎల్లప్పుడును నిజముగా ఆత్మ నింపుదల గల వారియొద్దకు వచ్చును. పరిశుద్ధాత్మతో నింపబడియున్నందుకు అదే సూచన. అదే సూచనగా యుండునని యేసు చెప్పెను. "నేను తండ్రిని వేడుకొందును, ఆయన మరియొక ఆదరణకర్తను పంపించును. ఆయన మీతో సదాకాలము ఉండును. ఆ సత్య స్వరూపియగు ఆత్మను లోకము చేర్చుకొనదు." సత్యమనగా ఏమిటో మనకు తెలియును.

"నీ వాక్యమే సత్యము." (యోహాను 17:17)

మరల యోహాను 8:43లో

"మీరు నా మాటలను ఎందుకు గ్రహించలేకపోవుచున్నారు? నా వాక్యమును మీరు చేర్చుకొననందునే."

ఈ లోకము పరిశుద్ధాత్మను చేర్చుకొనజాలదని యేసు చెప్పిన మాటను మీరు గమనించారా? ఇప్పుడు చదివిన ఈ వచనములో వారు వాక్యమును చేర్చుకొనలేదని చెప్పుట విన్నారు. ఎందువలన? ఎందుకనగా ఆత్మ మరియు వాక్యము ఒక్కటై యున్నారు. ప్రవక్తలవలె మీరు పరిశుద్ధాత్మను కలిగియున్నయెడల వాక్యము మీ యొద్దకు వచ్చును. దానిని మీరు చేర్చుకొందురు.

యోహాను 14:26లో ఇట్లున్నది.

"ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకము చేయును."

దేవుని యొక్క ఆత్మ వలన వాక్యము వచ్చుటను ఇక్కడ మరల మనము గమనించగలము.

మరల యోహాను 16:13లో

"అయితే ఆయన, అనగా సత్య స్వరూపియెన ఆత్మ (వాక్యము) వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి (వాక్యము) సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును." (వాక్యమే సత్యము. వాక్యమే దేవుడు. ఆత్మ వలన ప్రవచన వాక్యము వచ్చును).

ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలెనని కోరుచున్నాను. పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందినట్లుగా సూచన భాషలతో మాట్లాడుట, వాటికి అర్ధము చెప్పుట, ప్రవచించుట, చప్పట్లు కొట్టుట, నాట్యము చేయుట కాదని యేసు చెప్పెను. మీరు సత్యములో యుందురు, అదియే సూచన అని చెప్పెను; మీ కాలమునకు ఉద్దేశించిన దేవుని యొక్క వాక్యములో మీరు ఉందురు. వాక్యమును చేర్చుకొనుటలోనే ఆ సూచన ఇమిడియున్నది.

I కొరింధీ 14:37లో,

"ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మ సంబంధిననియైనను తలంచుకొనినయెడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని, అతడు దృఢముగా తెలిసికొనవలెను."

ఇప్పుడు దీనిని చూడండి. అంతరంగమందు ఆత్మ నివసించుచున్నట్లుగా రుజవు ఏమనగా ఆకాలమునకు సంఘమును క్రమములో పెట్టిన దేవునియొక్క ప్రవక్తను వెంబడించి ఒప్పుకొనుటయే. మరియొక ప్రత్యక్షతను పొందియున్నామని చెప్పుకొను వారితో పౌలు ఇట్లనుచున్నాడు. (36వ వచనము)

"దేవుని వాక్యము మీ యొద్దనుండియే బయలు వెళ్ళేనా? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా"

ఆత్మ నింపుదల కలిగిన క్రైస్తవ విశ్వాసి యొక్క సూచన ఏమనగా సత్యమును (వాక్యము) ఉత్పత్తి చేయుట కాదు గాని సత్యమును (వాక్యము) చేర్చుకొనుటయే. దానికి లోబడి దానిని విశ్వసించవలెను.

ప్రకటన 22:17లోని దానిని మీరు గమనించారా?

"ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, — విను వాడును రమ్ము అని చెప్పవలెను."

చూడండి. ఆత్మ చెప్పుచున్నదానినే పెండ్లికుమార్తెయు చెప్పును. ఆమె వాక్య వధువుగా యుండి తనకు ఆత్మ యున్నట్లుగా ఆమె రుజువు చేసికొనును. ప్రతి సంఘకాలములోను ఈ మాటలు విందుము.

"చెవిగలవాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటను వినును గాక!"

వాక్యమును ఆత్మ ఇచ్చును. ఆ నిజ క్రైస్తవులు తమ కాలములోని వాక్యమును చేర్చుకొనిన ప్రకారముగా నీవును ఆత్మను కలిగియుండినచో, నీ కాలమునకు చెందిన వాక్యమును విందువు.

మీరు ఆ చివరి ఆలోచనను గ్రహించారా? మరల చెప్పెదను. ప్రతి సంఘకాలము ఈ హెచ్చరికతోనే అంతమగును. "చెవిగలవాడు (వ్యక్తిగతంగా) ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటను వినును గాక!" ఆత్మయే వాక్యమును ఇచ్చును. ప్రతి కాలమునకు చెందిన సత్యము దానియొద్ద ఉన్నది. ప్రతికాలములోను దాని యొక్క ఏర్పరచబడిన వారున్నారు. ఆ ఏర్పరచబడిన గుంపు ఎల్లప్పుడును "వాక్యమును వినును," మరియు దానిని చేర్చుకొనును. తమలో విత్తనమున్నదని రుజవు చేసికొందురు.

యోహాను 8:47,

"దేవుని సంబంధియైనవాడు దేవునియొక్క మాటలను వినును. మీరు దేవుని సంబంధులుకారు గనుక ఆయన మాటలను వినలేదు."

వారు వాక్యమును నిరాకరించిరి. (యేసును) తమ దినములకు ఆయన ఇచ్చిన మాటలను త్రోసివేసిరి, కాని నిజమగు సంతానము వాక్యమును చేర్చుకొనెను, ఎందుకనగా వారు దేవుని సంబంధులు.

మీ పిల్లలందరు దేవునిచే నేర్చించబడవలెను." (పరిశుద్ధాత్మ)

యెషయా 54:13.

యేను కూడా యోహాను 6:45 లో దానినే చెప్పెను. వాక్యముతో ఒక్కటిగా యుండుట వలననే నీవు దేవుని సంబంధివనియు, ఆత్మ నింపుదల గలవాడవనియు నిరూపణయగును, మరియొక రుజువులేదు.

అయితే ఈ భాషలు, వాటికర్థము చెప్పుట, ఇంకా ఇతర వరముల మూట ఏమిటి? అవి ప్రత్యక్షతలు. వాక్యము దానినే చెప్పుచున్నది.

దానిని మీరు 1 కొరింధీ 12:7లో చూడగలరు.

"అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది."

పౌలు ఆ ప్రత్యక్షతలు ఏమిటో చెప్పియున్నాడు.

ఇప్పుడు ఒక ప్రశ్న తల ఎత్తునని నాకు తెలియను. మీరందరూ దానిని అడుగుటకు ఆసక్తిగా యున్నారని నేనెరుగుదును. పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందినట్లుగా ప్రత్యక్షత ఎందుకు సూచనగా లేదని మీరందురు, ఎందుకనగా మీరు నిజంగా ఆత్మ నింపుదల కలిగియుంటెనే గాని, మీరు నిశ్చయముగా పరిశుద్ధాత్మను బయలుపరచజాలరు? అది నిజమేనని నేను చెప్పగోరుచున్నాను, ఎందుకనగా జనులను నేను బాధపరచగోరుట లేదు, వారియొక్క బోధలో నడువగోరుట లేదు; కాని దేవుని యొక్క సంకల్పమంతయూ నేను చెప్పనియెడల నిజమగు దేవుని దాసునిగా నేనుండను. ఇది నిజము కాదా?

బిలామును కొద్దిగా చూద్దాం. అతడు మతభక్తిగలవాడే, అతడు దేవునిని ఆరాధించెను. బలి అర్పించు సరియగు విధానమును, దేవునిని సమీపించుట ఎట్లో అతడు అర్థము చేసికొనెను, కాని అతడు నిజసంతానమునకు సంబంధించిన ప్రవక్త కాడు, ఎందుకనగా అతడు నీతి బాహ్యముగా ప్రతి ఫలమును తీసికొనెను. అన్నిటికంటె నీచమైనది ఏమనగా, అతడు దేవుని ప్రజలను జారత్వము మరియువి గ్రహారాధనలోనికి నడిపించెను. అయినా గాని దేవుని యొక్క ఆత్మ అతని ద్వారా బయలుపరచబడలేదని ఎవరు కాదనగలరు? ఎందుకనగా అతి గొప్ప ప్రవచనములలో ఒక ప్రవచనమును, ప్రపంచము ఎన్నడూ చూడని ఒక ఖచ్చితమగు ప్రవచనమును అతడు పలికెను. అయినా గాని అతనిలో ఎన్నడూ పరిశుద్ధాత్మలేదు.

ఆలాగే ఇప్పుడు ప్రధాన యాజకుడగు కయప సంగతి ఏమిటి? ప్రభువు ఏ విధమగు మరణమును పొందునో తెలియచేయు ప్రవచనమును ప్రవచించెనని బైబిలు బోధించుచున్నది. కాని అతడు ఆత్మనింపుదలగలవాడు కాడని మనందరకూ తెలియును. ఆ ముసలి సిమెయోను వలెను లేదా పరిశుద్ధురాలగు హన్నావలెను ఆత్మ నడిపింపుగల వ్యక్తి కాడు. అయినా గాని పరిశుద్ధాత్మ యొక్క నిజమగు ప్రత్యక్షత కలిగియుండెను. దానిని మనము కాదనలేము. కాబట్టి బయలుపాటును మనము ఒక సూచనగా చెప్పలేము. అది ఆలాగుండదు. నీవు నిజంగా దేవుని ఆత్మవలన నింపబడినయెడల నీ జీవితములో వాక్యపు సూచనను కలిగియుందువు.

నాకు దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యక్షత ద్వారా ఈ సత్యమును బహు లోతుగా అర్థము చేసికొనియున్నాను. అదెట్లో మీకు చూపించెదను. దానిని చెప్పు ముందుగా దీనిని నేను చెప్పగోరుచున్నాను. మీరు చాలా మంది నన్ను ప్రవక్తగా విశ్వసించుచున్నారు. నేను ప్రవక్తని కాదని చెప్పుట లేదు. మీరే చెప్పితిరి. కాని దేవుడు నాకిచ్చిన దర్శనములు ఎన్నడునూ తప్పిపోలేదని మన ఇద్దరికి తెలియును. ఒక్కసారి కూడా విఫలము కాలేదు. ఎవరయినా గాని నా దర్శనము ఎన్నడయినా విఫలమయినదేమో చూపించినచో దానిని గూర్చి నేను తెలిసికొనగోరుచున్నారు. ఇంతవరకు మీరునన్ను వెంబడించారు, ఇది నా గాధ.

చాలా సంవత్సరాల క్రితం నేను పెంతెకోస్తు జనులలో ఉండినప్పుడు వారియొక్క కూటములకు నేను హాజరయ్యాను. భాషలు మాట్లాడుట, భాషలకర్థము చెప్పుట, ప్రవచించుట మొదలగు ప్రత్యక్షతలను చూచాను. ఇద్దరు బోధకులు మరే ఇతర సోదరుల కంటె ఎక్కువగా ఈ రకమగు భాషలు మాట్లాడుటలో మునిగిపోయి యుండుట ప్రత్యేకంగా చూచాను. నేను కూటములను బాగుగా అనుభవించాను. ఆ యూ బయలుపాటులయందు నిజంగా నేను విశ్వాసముంచాను. వాటియందు వాస్తవము ప్రతిబింబించుట వలన నిజమైన ఆసక్తిని కనుపరచాను. ఈ వరముల గురించి నేను నేర్చుకోగలిగినదంతయూ నేర్చుకోవలెనని నేను ఎంతగానో ఆశించాను. కాబట్టి వాటిని గూర్చి ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుటకు నిర్ణయించుకొన్నాను. నాలో దేవునియొక్క వరమున్నది గనుక ఆ మొదటి వ్యక్తిలోని ఆత్మ ఎట్టిదో వివేచించగోరాను. నిజంగా అతడు దేవుని సంబంధియా, కాడా అని తెలిసికొనగోరాను. ఆ చక్కని దీన సోదరునితో క్లుప్తంగా ముచ్చటించిన తరువాత అతను నిజమైన కదలని క్రైస్తవుడు అని తెలుసుకున్నాను. అతడు నిజమైన (సరియైన) వాడు. ఆ తరువాత యువకుడు ఈ మొదటివానివలె కనిపించలేదు. అతడు అహంకారియు, గొప్పలు చెప్పుకొనువాడునైయున్నాడు. అతనితో నేను మాట్లాడుచుండగా నా కండ్లలో ఒక దర్శనము కదలసాగినది. అతడు ఒక స్త్రీని పెండ్లిచేసికొన్నట్లు చూచాను, కాని మరొక స్త్రీతో జీవించుచున్నట్లు చూచాను. ఆమె ద్వారా ఇద్దరు పిల్లలనుకనెను. అంతకంటె వేషధారి మరెవరూ లేరు.

ఇప్పుడు నన్ను చెప్పనివ్వండి, నాకు ఆశ్చర్యము కలిగినది. ఇదిట్లు జరిగినది? ఈ ఇద్దరిలో ఒకరు నిజమగు విశ్వాసి మరియొకడు పాపాత్ముడగు అనుకరణ కర్త. అయినా గాని ఇద్దరునూ ఆత్మయొక్క వరములను వెల్లడిచేయుచున్నారు. ఈ గందరగోళము వలన నాకు కలవరము కలిగినది. దేవుని యొద్ద నుండి జవాబును పొందగోరి నేను కూటము విడిచిపెట్టి వెళ్ళిపోయాను. నేన ఏకాంతముగా ఒక రహస్య స్థలమునకు వెళ్ళాను. అక్కడ నేను నా బైబిలు తీసికొని దేవుని జవాబు కొరకు కనిపెట్టుచూ ప్రార్ధి౦చసాగాను. ఏ వాక్యభాగము చదువవలెనో నాకు తెలియకుండానే నేను మామూలుగా బైబిలు తెరిచాను. మత్తయి సువార్తలో అది తెరువబడినది. కొంతసేపు నేను చదివాను మరియు ఆ తరువాత దానిని క్రింద పెట్టాను. ఒక క్షణములో ఆ గదిలోనికి గాలి విసరినది, బైబిలులోని పేజీలను త్రిప్పినది. హెబ్రీ ఆరవ అధ్యాయము వచ్చినది. దానిని నేను చదివాను. ఆ వింత వచనములను చూచి నేను ప్రత్యేకంగా ఆకర్షింపబడితిని.

హెబ్రీ 6:4-9,

"ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు,తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచూ, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు.గనుక మారు మనస్సు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగెలును దాని మీద పెరిగినయెడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును; తుదికది కాల్చివేయబడును.అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము."

నేను బైబిలును మూసివేసి క్రిందపెట్టి, కొంతసేపు ధ్యానించాను, మరి ఎక్కువగా ప్రార్ధించాను. ఇంకా నాకు జవాబు రాలేదు. మరల నేను బైబిలు తెరచాను. గురి లేకుండానే తీసాను, కానీ చదువలేదు. ఆకస్మాత్తుగా గదిలోనికి మరల గాలి వీచినది. మరోసారి బైబిలులోని హెబ్రీ పత్రిక ఆరవ అధ్యాయము తెరువబడినది, అక్కడ ఆగి గాలి అదృశ్యమైనది. మరల నేను ఆ మాటలు చదివాను, అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ గదిలోనికి వచ్చినది. నాకు ఒక దర్శనము కలిగినది. ఒక తెల్లని వస్త్రమును ధరించిన ఒకాయనను నేను ఆ దర్శనములో చూచాను. క్రొత్తగా దున్నబడిన పొలములో అతడు విత్తనములను జల్లుచుండెను. అది ప్రకాశమానముగాయున్న దినము, మరియు ఆ ఉదయమున విత్తనములు జల్లుట అయిపోయినది. ఆ తెల్లని వస్త్రములు ధరించి విత్తిన వ్యక్తి వెళ్ళిపోయెను. ఆ తరువాత రాత్రియందు నల్లని ఒక వ్యక్తి వచ్చి దొంగతనముగా మరి కొన్ని విత్తనములను ఆ ముందు తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తి చల్లిన వాటి మధ్య చల్లిపోవుచుండెను. దినములు గడిచిపోయినవి — సూర్యరశ్మి మరియు వర్షము ఆనేలను ఆశీర్వదించెను. ఒకరోజున ఆ గింజలు లేదా పంటకనబడెను. అదెంతో చక్కగా యున్నది. కాని కొన్ని దినముల తరువాత గురుగులు కనబడెను.

గోధుమలు మరియు గురుగులు కలిసి ఎదిగినవి. అవి రెండునూ ఒకే నేల నుండి ఒకే ఆహారమును పొందినవి. ఒకే సూర్యరశ్మిని, ఒకే వర్షమును అవి అనుభవించినవి.

ఆ తరువాత ఒక దినమునకు మేఘములు ఇత్తడి వలె మారినవి. ఆ మొక్కలన్నియూ ఎండిపోయి చావసాగినవి. ఆ గోధుమ మొక్కలు దేవునివైపు స్వరమెత్తి వర్షము కొరకు మొరపెట్టుట విన్నాను. గురుగులు కూడా తమ సర్వములు ఎత్తి వర్షము కొరకు ప్రార్ధించసాగినవి. అప్పుడు కారు మేఘములు క్రమ్మి వర్షము కురిసెను. మరల గోధుమ మొక్కలు సంపూర్ణ బలము పొంది తమ స్వరములు ఎత్తి దేవుని ఘనపరచినవి, "దేవునికి స్తోత్రము." మరల పుంజుకొనిన గురుగులు కూడా పైకి చూచి "హల్లెలూయా," అని చెప్పుట నాకు ఆశ్చర్యము కలిగించినది.

అప్పుడు ఆ కూటములో చూచినదానియొక్క సత్యము తెలిసినది. ఆ దర్శనము అర్ధమైనది. విత్తువాడు మరియు విత్తనము యొక్క ఉపమానము తెలిసినది. హెబ్రీ ఆరవ అధ్యాయములోని అత్మ వరముల గూర్చి గ్రహింపు కలిగినది. మిశ్రీత జనాంగములో ఆత్మ సంబంధమగు వరముల యొక్క ప్రత్యక్షతను చూచాను — అంతా కూడా తేటగా బయలుపరచబడినది. తెల్లని వస్త్రము ధరించి చల్లినవాడు ప్రభువు. నల్లగా యుండి చల్లినవాడు అపవాది. లోకమే పొలము. జనులే విత్తనములు, వారు ఏర్పరచబడినవారు మరియు భ్రష్టులు. వారిరువురును ఒకే ఆహారమును, ఒకే సూర్యరశ్మిని, ఒకే నీటిని పంచుకొనియున్నారు. ఇద్దరూ ప్రార్ధించారు. ఇద్దరూ దేవుని యొద్ద నుండి సహాయము పొందిరి, ఎందుకనగా ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన యొక్క సూర్యుని ఉదయింప చేయుచున్నాడు మరియు వర్షమును కురిపించుచున్నాడు. వారిద్దరికిని ఒకే అద్భుతమగు ఆశీర్వచనము ఉన్నప్పటికి, ఇద్దరికి ఒకే అద్భుతమగు ప్రత్యక్షతలు ఉన్నప్పటికిని ఆ గొప్ప భేదము ఇంకా నిలచియున్నది. వారి విత్తనములు వేరుగా నున్నవి.

మత్తయి 7: 21-23నకు జవాబు ఇక్కడున్నది.

"ప్రభువా, ప్రభువా అని నన్ను పిలచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము జరగించువాడే పరలోక రాజ్యమందు ప్రవేశించును.ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుతకార్యములను చేయలేదా?అప్పుడు నేను వారితో ఇట్లందును. మిమ్మును ఎన్నడునూ నేనెరుగను. అక్రమము చేయువారలారా నా యొద్దనుండి తొలగిపోవుడి."

మానవుల ద్వారా పరిశుద్ధాత్మ గొప్ప కార్యములను చేయగలదని యేసు చెప్పెను. దానిని ఆయన కాదనడు, కాని ఆయన వారిని ఎన్నడూ ఎరుగనని మాత్రము చెప్పెను. వీరు వెనుకకు జారిపోయినవారు కారు. వారు దుర్మారులు, మారుమనస్సు పొందనివారు, భ్రష్టులు. వీరు సాతాను యొక్క సంతానమైయున్నారు.

చూడండి. ఆత్మ ద్వారా జన్మించినందుకును, ఆత్మ ద్వారా నింపబడినందుకును ఈ బయలుపాటులను నీవు సూచనగా తీసికొనజాలవు. కానే కాదు. పరిశుద్ధాత్మ గొప్ప కార్యములను చేయుట నిజమగు బయలుపాటు అనియు సూచన అనియు నేను ఒప్పుకొందును, కాని అది వ్యక్తిగతముగా ఆత్మ నింపుదల కలిగియున్నట్లుగా మాత్రము సూచన కాదు. ఒక వ్యక్తి ఆ బయలుపాటులను సమృద్ధిగా కలిగియుండవచ్చును.

ఈనాడు పరిశుద్ధాత్మను పొందియున్నటుగా రుజువు, ఆనాడు ప్రభువు దినములలో యుండినటుగానే యున్నది. నీవు జీవించియున్న దినములలోని సత్యవాక్యమును నీవు అంగీకరించవలెను. యేసు ఎన్నడునూ వాక్యము గూర్చి నొక్కి చెప్పినంతగా ఈ కార్యముల ప్రాముఖ్యత గూర్చి చెప్పలేదు. ప్రజలు వాక్యము అనుసరించినయెడల క్రియలు దానంతట అదే వె౦బడించును అని ఆయనకు తెలియును. అదియే బైబిలు.

పెర్గమ కాలములో వాక్యము నుండి తొలగిపోవు ఒక భయంకరమగు స్థితి వచ్చునని యేసునకు తెలియును. అప్పటికే పత్మసు దర్శనము ఇంకా రెండు వందల సంవత్సరముల దూరములో యున్నది. అందువలన వారు అంధకార యుగములలోనికి వెళ్ళుదురని ఆయనకు తెలియును. మనుష్యులు అసలు ముందుగా దేవుని నుండి ఎట్లు దూరమగుదురు అనగా మొదట, వాక్యమును విడిచిపెట్టెదరు. వాక్యమును నీవు విడిచిపెట్టినయెడల దేవునిని విడిచినట్లే లెక్క. ఆ విధముగా ఆయన పెర్గమ సంఘమునకు బయలుపరచుకొనియున్నాడు. నిశ్చయంగా అన్ని సంఘములకును ఆయన ఆ విధంగానే బయలుపరచుకొనియున్నాడు. "నేను వాక్యమునైయున్నాను. మీరు మీ మధ్యకు దైవమురావలెనని కోరుకొనిన యెడల వాక్యమును ఆహ్వానించి చేర్చుకొనుడి. మీకును, ఆ వాక్యమునకును మధ్య ఎవరూ లేదా ఏదీ చొరబడుటకు తావియ్యవద్దు. నేను మీకుఇచ్చుచున్న (వాక్యము) ఇది నా యొక్క ప్రత్యక్షతయైయున్నది. నేను వాక్యమునైయున్నాను. దానిని గుర్తుంచుకొనండి!"

మనమధ్య ఉన్న వాక్యముతో మనము సమృద్ధిగా సంతృప్తి చెందుచున్నామో లేదా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఇక్కడ మీకు ఒక ఆలోచన చెప్పుచున్నాను. మనమేలాగు ప్రార్ధి౦చుదుము? మనము యేసు నామములో ప్రార్ధించుచున్నాము. కాదా? ప్రతి ప్రార్థనను ఆయన నామములోనే చేయుచున్నాము. లేనియెడల జవాబు రాదు.

I యోహాను 5:14లో మనకిట్లు చెప్పబడినది.

"ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయున చిత్తానుసారముగా మనమేది అడిగినను, ఆయున మన మనవి ఆలకించుననునదియే.

ఇప్పుడు మనము ప్రశ్నించుకొందము, "ఆయన చిత్తము ఏమిటి?" ఆయన చిత్తమును తెలిసికొనుటకు ఒకే ఒక మార్గమున్నది. దేవుని వాక్యము ద్వారానే దానిని మనము తెలిసికొనగలము.

విలాప వాక్యములు 3:37,

"ప్రభువు సెలవులేనిది, మాట ఇచ్చి నెరవేర్చగల వాడెవడు?"

చూడండి. అది వాక్యములో లేనియెడల దానిని మీరు పొందజాలరు. కావున అది వాక్యములో యుంటేనేగాని మనము అడుగరాదు. ఆయన నామములోనే దానిని మనము అడుగవలెను లేదా మొరపెట్టవలెను. మరల చూడండి. యేసే వాక్యమైయున్నాడు. (ఆ నామము) దేవునిని మరియు వాక్యమును మీరు వేరు చేయలేరు. వారు ఒక్కటే.

ఆయన విడిచిపెట్టిన ఈ వాక్యము, అనగా ఈ అచ్చువేయబడిన పేజీల మీద ఉన్న ఈ వాక్యము ఆయనలో భాగమైయున్నది. విశ్వాసము ద్వారా అంగీకరించినప్పుడు ఆత్మ నింపుదల గల జీవితమును పొందెదవు. తన యొక్క మాటయే జీవమని ఆయన చెప్పెను. యోహాను 6:63. ఆయన ఖచ్చితంగా అదే అయి యున్నాడు:

యోహాను 14:6,

"నేను మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను."

రోమా 8:9.

"క్రీస్తుయొక్క ఆత్మలేనివాడు ఆయన సంబంధి కాడు."

ఆయనే ఆత్మయు మరియు జీవమునై యున్నాడు. వాక్యము సరిగ్గా అదియే అయి యున్నది. యేసు ఖచ్చితంగా అదే అయి యున్నాడు. ఆయన వాక్యమైయున్నాడు. ఆత్మ మూలముగా జన్మించినవాడు, మరియు విశ్వాసమందు ఆత్మనింవుదలగలవాడు ఆ వాక్యమును తీసికొని తన హృదయములో చేర్చుకొనును, దానిని తన పెదవుల మీద నిలువుకొనును, అది దేవుడు మాట్లాడుచున్న దానితో సమానమే. ప్రతి పర్వతము కదిలిపోవలెను. ఆ మనుష్యుని యెదుట సాతాను నిలువజాలదు.

ఆ గత కాలములో నుండిన మూడవ యుగపు సంఘము తన మధ్య యుండిన సజీవ వాక్యము యొక్క ప్రత్యక్షతను పట్టుకొనియుండినయెడల దేవుని యొక్క శక్తి ఆ చీకటి యుగములలో ఉండినటుగా సన్నగిల్లియుండెడిది కాదు. ఈనాడు కూడా, విశ్వాసము ద్వారా సంఘము వాక్యము వైపుకు మళ్ళినయెడల ఆమె మధ్యకు మరల దేవుని యొక్క మహిమ మరియు దేవుని యొక్క అద్భుత కార్యములు వచ్చును.

ఒక రాత్రి నేను ప్రభువు యొద్ద కనిపెట్టుచుండగా పరిశుద్ధాత్మ నా కలము తీసికొని వ్రాయమని చెప్పెను. వ్రాయవలెనని నా కలమును తీయుచుండగా, ఆయన ఆత్మ సంఘము కొరకు ఒక వర్తమానమును నాకు ఇచ్చెను. దానిని మీకు చెప్పుచున్నాను… ఇది వాక్యమునకును ఆయనయొక్క వధువుకును సంబంధించినది.

"నేను నీతో చెప్పవలెనని ప్రయత్నించుచున్నది ఇది: పునరుత్పత్తి యొక్క నియమము ఏమనగా ప్రతి జాతి తిరిగి తన జాతినే మరల పుట్టించును. ఆదికాండము 1:11 ప్రకారము కూడా ఆలాగునే యున్నది, "దేవుడు — గడ్డిని, విత్తనములిచ్చు చెట్టును భూమిమీద తమతమ జాతిప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా, ఆ ప్రకారమాయెను. విత్తనములో ఏ విధమగు జీవమున్నదో అది ఆ మొక్కలోనికి వచ్చి ఫలముగా మారెను. అదే నియమము ఈనాడు సంఘమునకును వర్తించును. ఎటువంటి విత్తనముతో అది ఆరంభమాయెనో అదే తిరిగి ఎదుగును. ముందు విత్తిన విత్తనమువలెనె అది యుండును, ఎందుకనగా ఆ విత్తనమే నాటబడెను. ఈ చివరి దినములలో నిజమగు వధువు సంఘము (క్రీస్తు విత్తనము) మూలరాయి దగ్గరకు వచ్చును. ఆమె అగ్రగామియగు సంఘముగా యుండును. ఒక అగ్రగామియగు జాతిగా యుండి ఆయనను చేరువగును. వధువులో ఉన్నవారు ఆయనను పోలియుందురు. ఆయన యొక్క స్వరూపమునే వారు కలిగియుందురు. ఆయనతో ఏకమగుటకు ఇది జరుగును. వారు ఒక్కటిగా యుందురు. వారు సజీవుడగు దేవునియొక్క వాక్య ప్రత్యక్షతగా యుందురు. శాఖలు దీనిని ఉత్పత్తి చేయజాలవు (తప్పు విత్తనము). అవి తమ ఆచారములను, తమ విశ్వాస ప్రమాణములను వాక్యముతో కలిపి ఉత్పత్తి చేయును. ఈ కలగలుపు వలన ఒక సంకర జాతి ఉత్పత్తియగును.

మొదటి కుమారుడు (ఆదాము) దేవునియొక్క పలుకబడిన వాక్య విత్తనమై యుండెను. అతనికి వధువు ఇయ్యబడి తనకుతానుగా ప్రత్యుత్పత్తి చేయగల శక్తి ఇవ్వబడెను. అందుకే అతనికి వధువు ఇయ్యబడెను, తనకు ప్రత్యుత్పత్తి కొరకు; మరియొక దేవుని కుమారుని ఉత్పత్తి చేయుట కొరకు. కాని ఆమె పడిపోయెను. సంకరము ద్వారా ఆమె పతనమాయెను. ఆమె అతనిని చనిపోవునట్లు చేసెను.

రెండవ కుమారుడు (యేసు) కూడా దేవుని యొక్క పలుకబడిన వాక్య సంతానమై యుండెను. ఆదామువలె అతనికిని వధువు ఇయ్యబడెను. కాని ఆయనామెను పెండ్లి చేసికొనుటకు ముందే ఆమె కూడా పడిపోయినది, ఆమె కూడా ఆదాము యొక్క భార్యవలెనె పరీక్షింపబడెను. దేవునియొక్క వాక్యమును నమ్మి జీవించునో లేక వాక్యమును గూర్చి సందేహించి, మరణించునో ఆయన చూచెను. ఆమె సందేహించెను. ఆమె వాక్యమును విడిచిపెట్టెను. ఆమె చచ్చెను.

వాక్యము యొక్క నిజ సంతానముగా యున్న ఒక చిన్న గుంపు నుండి క్రీస్తుకు ఒక ప్రియమగు వధువు అనుగ్రహించబడును. ఆమె ఆయన వాక్యము యొక్క కన్యక. ఆమె కన్యక, ఎందుకనగా ఆమెకు ఏ మానవకల్పిత ఆచారములు లేదా విశ్వాస ప్రమాణములు తెలియవు. వధువు యొక్క సభ్యులు అన్ని విధములుగాను దేవుని చేత వాగ్ధానము చేయబడిన దానిని నెరవేర్చుదురు. కన్యకలో దేవుని యొక్క వాగ్ధానములన్నియూ బయలు పరచబడును.

వాగ్ధాన వాక్యము కన్య మరియ యొద్దకు వచ్చెను. ఆయనే ఆ వాగ్ధాన వాక్యము. ఆయనే స్వయంగా బయలుపరచబడవలసియున్నాడు. దేవుడు బయలుపరచబడెను. ఆ సమయములో ఆయనే స్వయంగా పనిచేసి తనయొక్క వాగ్ధాన వాక్యమును కన్యకలో నెరవేర్చెను. దూత ఆమె యొద్దకు వర్తమానమును తీసికొని వచ్చెను. కాని ఆ దూత యొక్క వర్తమానము దేవుని యొక్క వాక్యమే. యెషయా 9:6. ఆయనను గూర్చి వ్రాయబడియున్న దానినంతటిని ఆయన ఆ సమయములో నెరవేర్చెను. ఎందుకనగా ఆమె ఆయన యొక్క వాక్యమును స్వీకరించెను.

కన్యకయగు వధువు యొక్క సభ్యులు ఆయనను ప్రేమించెదరు. ఆయన యొక్క శక్తి సామర్థ్యములను వారు కలిగియుందురు, ఎందుకనగా ఆయనే వారి శిరస్సు సర్వాధికారము ఆయనకు చెందియుండును. మన శరీరములోని అవయవములు శిరస్సునకు ఎట్లు లోబడియుండునో, ఆ ప్రకారము వారాయనకు లోబడియుందురు.

తండ్రి మరియు కుమారుని యొక్క ఏకత్వమును గమనించండి. తండ్రి మొదటగా చూపించితేనే గాని యేసు ఎన్నడునూ ఏ కార్యమును చేయలేదు. యోహాను 5:19, ఈ ఏకత్వము ఇప్పుడు పెండ్లికుమారునికిని, ఆయన యొక్క వధువునకును మధ్య ఉండవలసియున్నది. ఆయన తన యొక్క జీవ వాక్యమును ఆమెకు చూపించును. దానిని ఆమె చేర్చుకొనును. దానిగూర్చి ఎన్నడూ ఆమె సందేహించదు. కాబట్టి ఆమెకు ఏదియూ, మరణము సహితము హాని చేయజాలదు. ఎందుకనగా విత్తనమును నాటినప్పుడు దానిని నీరు పైకిలేపును. దీని యొక్క రహస్యమును చూడండి. వధువులో వాక్యమున్నది (మరియలో ఉండినట్లుగానే) వధువు క్రీస్తు యొక్క మనస్సును కలిగియున్నది. అందువలన ఆమె వాక్యముతో ఆయన చేయమన్నదానిని చేయును, ఆయన నామములో ఆజ్ఞాపించబడిన వాక్య ప్రకారముగా ఆమె చేయును. ఎందుకనగా ఆమె "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు"ను కలిగియున్నది. ఆ వాక్యము అప్పుడు ఆత్మ ద్వారా త్వరపరచబడి నెరవేరును. అది జరుగును. నాటబడిన విత్తనమునకు నీరు పోసినప్పుడు అది పూర్తి పంటను ఇచ్చి దాని ఉద్దేశ్యమును నెరవేర్చునట్లుగా.

వధువులో యున్నవారు ఆయన చిత్తమును మాత్రమే చేయుదురు. వారిని ఎవరూ ప్రక్కత్రోవ పట్టించలేరు. వారికి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని" యున్నది. లేనియెడల వారు ఊరకుందురు. తమలో క్రియ జరిగించుచున్నవాడు దేవుడే అని వారికి తెలియును. ఆయన యొక్క స్వంత వాక్యమును నెరవేర్చుదురు. ఆయన ఈ భూమిమీద ఉండి సేవ చేసిన దినములలో తన పనులన్నియూ పూర్తిగా చేయలేదు, కాబట్టి ఇప్పుడాయన వధువులో యుండి ఆమె ద్వారా పనిచేయుచున్నాడు.

ఆ సంగతి ఆమెకు తెలియును, ఇంకా కొన్ని ప్రత్యేకమగు పనులు చేయు సమయము ఆయనకు రాలేదు, ఇప్పుడాయన తప్పక చేయవలెను. ఈ ప్రత్యేక కాలము కొరకు ఆయన విడిచిపెట్టినపనిని ఇప్పుడాయన వధువు ద్వారా నెరవేర్చుచున్నాడు.

ఇప్పుడు మనము యొహోషువా, కాలేబులవలె నిలబడుదుము. వారికివలెనె మన వాగ్ధాన దేశము కూడా కనుచూపుమేరలోనికి వచ్చియున్నది. యెహోషువా అనగా "యెహోవాయే రక్షకుడు," అని అర్థము. అతడు సంఘమునకు రానైయున్న అంత్యకాలపు నాయకునికి సూచనగా యున్నాడు. మూల నాయకునిగా పౌలు వచ్చెను. యెహోషువాతో నమ్మకముగా నిలచియుండిన వారికి సాదృశ్యముగా కాలేబు యున్నాడు. గుర్తుంచుకొనండి, ఇశ్రాయేలు ఒక వాక్య కన్యకగా యుండునట్లు దేవుడు వారిని ప్రారంభించెను. కాని వారు ఏదో వేరయినది కావలెనని కోరుకొనిరి. ఈ చివరి కాలపు సంఘము కూడా ఆలాగే చేయగోరుచున్నది. దేవుడు తన స్వంత నిర్ణయకాలము వచ్చు వరకు ఇశ్రాయేలును వాగ్ధాన దేశములోనికి కదలనీయకుండా ఉంచెను. నాయకుడగు యొహోషువా మీద జనులు ఒత్తిడి చేసియుందురు. "ఆ దేశము మనది. వెళ్ళి స్వాధీనపరచుకొండుము. యెహోషువా, నీ పని అయి పోయినది. నీ ఆజ్ఞను నీవు మరచిపోయినట్లున్నావు. ఇంతకు ముందు నీకుండిన శక్తి ఇప్పుడు లేదు. ఇంతకు ముందు నీవు దేవునితో మాట్లాడి దేవుని యొక్క చిత్తమును తెలిసికొని త్వరగా పనిచేసెడివాడు. ఇప్పుడేదో పొరపాటు జరిగియున్నది." కాని యొహోషువా దేవునిచేత పంపబడిన ప్రవక్త గనుక దేవుని యొక్క వాగ్దానములను ఎరుగును. కాబట్టి అతడు వాటికొరకు ఎదురుచూచెను. దేవుని యొద్ధ నుండి స్పష్టమగు నిర్ణయము వచ్చువరకు అతడు ఎదురు చూచెను. కదలవలసిన సమయము వచ్చినప్పుడు, దేవుడు తన సంపూర్ణ నాయకత్వమును యెహోషువా యొక్క చేతులలో ఉంచెను, ఎందుకనగా అతడు వాక్యముతో నిలచియుండెను. యెహోషువాను దేవుడు నమ్మగలడు గాని ఇతరులను నమ్మలేడు. ఈ అంత్య దినమున కూడా అదియే తిరిగి జరుగును. అదే సమస్య, అదే ఒత్తిడి.

మోషేలో మనము చూచిన ఉదాహరణను తీసుకొందాము. మహాశక్తితో అభిషేకించబడిన దేవుని యొక్క ప్రవక్తగా ఒక వింతగా జననము పొందెను, ఐగుపులో నుండి అబ్రహాము యొక్క సంతానమును విమోచించవలసి వచ్చిన సరైన సమయములో ఇతడు పుట్టెను. అతడు ఐగుపులో నిలచియుండి వారితో వాక్యము గూర్చి వాదించలేదు, ఆ యాజకులతో తర్కించలేదు. తనను చేర్చుకొనుటకు జనులు సిద్ధమగు వరకూ అతడు అరణ్యములో యుండెను. దేవుడు మోషేను అరణ్యమునకు పిలచెను, కనిపెట్టుట మోషే వలన జరుగలేదు. ప్రజలు అతనిని చేర్చుకొనుటకు సిద్ధపడనందునే ఆగవలసి వచ్చెను. ప్రజలు అర్ధము చేసికొందురని మోషే తలంచెను గాని వారు గ్రహించలేదు.

అప్పుడు యొహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమయ్యెను చూడండి. అతడు సత్యమును బోధించుట మానివేసెను. అక్కడున్న ఆ గుంపును మీరు చూడండి మరియు వారు ఈ అమెరికను యొజెబెలు గుంపుకు ముందున్నవారు, వాక్యమును వారు చేర్చుకొనరు, దేవుడతనిని ఇక రమ్మని పిలచెను. ప్రవక్తను మరియు దేవుడిచ్చిన వర్తమానమును నిరాకరించినందుకు ఆ తరమును దేవుడు తెగులుతో మొత్తెను. దేవుడతనిని అరణ్యమునకు పిలచుకొనెను మరియు రాజు యొద్దకు కూడా అతడు రాలేదు. అతనిని రాజు యొద్దకు రప్పింపవలెనని ప్రయత్నించిన వారు చనిపోయిరి. కాని దేవుడు తనయొక్క నమ్మకస్తుడగు ప్రవక్తతో దర్శనము ద్వారా మాట్లాడెను. అతడు గుహలో నుండి బయటకు వచ్చి ఇశ్రాయేలు వారికి తిరిగి వాక్యము బోధించెను.

ఆ తరువాత బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చెను. అతడు క్రీస్తుకు నమ్మకస్తుడగు ముందు దూత, ఆ దినమునకు శక్తిగల ప్రవక్త, అతడు తన తండ్రి యొక్క పాఠశాలకు వెళ్ళలేదు. పరిసయ్యల యొక్క బడికి కూడా వెళ్ళలేదు — ఏ శాఖ యొద్దకును అతడు వెళ్ళలేదు, కాని అరణ్యములోనికి దేవుని చేత పిలువబడెను. దేవుడు వర్తమానముతో తనను పంపు వరకు అతడు ఆగియుండెను. "మెస్సీయా సమీపమందున్నాడు," అని చెప్పెను.

ఇక్కడ మనము లేఖన సంబంధమగు హెచ్చరికను చూద్దాం. దేవుని యొక్క ప్రత్యక్షత్ర గలిగిన మోషే దినములలో కోరహు లేచెను. ఆ మహాశక్తి గల ప్రవక్తను అతడు ఎదిరించెను. మోషేతో అతడు వివాదపడెను, మరియు జనులను నడిపించు హక్కు తనకు కూడా యున్నట్లు అతడు చెప్పెను. దైవ ప్రత్యక్షతను అందరూ కలిగియున్నారని పలికెను. మోషే ఒక్కడే కాదు అనెను. మోషే యొక్క అధికారమును అతడు ధిక్కరించెను. అక్కడున్న జనులను చూడండి, వారు నిజమగు వాక్యమును వినిరి, వాస్తవమును వారు బాగుగా ఎరుగుదురు. అతడు దేవుని చేత బయలుపరచబడిన నిజమగు ప్రవక్తయని వారికి తెలియును. వారు కోరహు యొక్క మోసపు మాటలకు పడిపోయిరి. కోరహు లేఖనసంబంధమగు ప్రవక్తకాడు, కాని జనులు గుంపు గుంపులుగా తమ నాయకులతో పాటుగా అతని వెనుకపడిరి. ఈనాడు సువార్తికులను చూడండి, వారు తమ బంగారు దూడ ప్రణాళికలతో కోరహువలె యున్నారు. వారు జనులకు చక్కగా కనబడుచున్నారు, కోరహు కూడా మంచిగానే కనబడెను. వారి నుదుటి మీద నుండి రక్తము వచ్చుచున్నది, చేతులలో నుండి నూనె వచ్చుచున్నది, వేదిక మీద నుండి అగ్నిగోళములు వచ్చుచున్నవి. వారు స్త్రీ బోధకులను అనుమతించుచున్నారు, తమ స్త్రీలు జట్టు కత్తిరించుకొనినా వారికి పరవాలేదు, మగవారి దుస్తులు లేదా పొట్టి బట్టలు ధరించుచున్నారు. వారు దేవుని వాక్యమును అతిక్రమించుచున్నారు. తవు స్వంత ఆచారములను, విశ్వాస ప్రమాణములను వెంబడించుచున్నారు. వారిలో ఎటువంటి విత్తనమున్నదో అర్థమగుచున్నది. కాని జనులందరూ మోషే మీద తిరుగబడి దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టలేదు. లేదు, ఏర్పరచబడినవారు అతనితోనే నిలచియుండిరి. ఈ రోజున అదే మరల జరుగుచున్నది. చాలామంది వాక్యమును విడిచిపెట్టుచున్నారు, కాని కొందరు దానితోనే నిలచియున్నారు. కాని ఆ గోధుమలు మరియు గురుగులు గూర్చిన ఉపమానమును గమనించండి. గురుగులను కట్టకట్టి దహించెదరు. ఈ విశ్వాసభ్రష్ట సంఘములు చాలా గట్టిగా కట్టబడుచున్నవి, దేవుని యొక్క తీర్పు అను అగ్ని వారిమీద పడుటకు సిద్ధముగా యున్నది. కాని గోధుమలు యజమాని యొక్క కొట్టులోనికి సమకూర్చబడెను.

ఇక్కడ మీరు బహు జాగ్రత్తగా గమనించవలెనని కోరుచున్నాను. అంత్యకాలములో మలాకీ 4 నెరవేర్చబడునని దేవుడు వాగ్ధానము చేసెను, అది నెరవేరవలసియున్నది. ఎందుకనగా ఆత్మ ద్వారా జీవింపచేయబడిన దేవుని వాక్యమును ప్రవక్తయగు మలాకీ పలికెను. దానిని యేసు ప్రస్తావించెను. క్రీస్తు రెండవ సారి వచ్చు ముందుగా అది జరుగును. యేసు వచ్చు సమయమునకు వాక్యమంతయూ నెరవేర్చబడుట అవశ్యము. అన్యుల యొక్క యుగము చివరి సంఘ కాలమునకు వచ్చియుండును, మలాకీలో చెప్పబడిన వర్తమానికుడు వచ్చి అతడు వాక్యముతోనే నిలచియుండును. అతడు ఆదికాండము నుండి ప్రకటన వరకు గల మొత్తం బైబిలును స్వీకరించును. సర్ప సంతానము యొద్ధ అతడు ప్రారంభించి, కడవరి వర్షములో యున్న వర్తమానికుని వరకు వెళ్ళును. కాని శాఖల ద్వారా అతడు నిరాకరించబడును.

అతడు ఆలాగు ఉ౦డవలసియున్నది, ఎందుకనగా ఆహాబు కాలము నుండి చరిత్ర పునరావృత్తమగుచున్నది. ఆహాబు నాయకత్వము క్రింద ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఎట్లుడునో, అదే మలాకీ యొక్క ప్రవక్త ప్రత్యక్షమగు ఈ అమెరికాలో తిరిగి జరుగుచున్నది. స్వేచ్చగా ఆరాధించుకొనుటకు ఇశ్రాయేలీయులు ఐగుపును విడిచిపెట్టిరి, ఆ స్థానికులను త్రోసివేసిరి, ఒక గొప్ప దేశమును నెలకొల్పిరి మరియు దావీదు మొదలగు మహానాయకులు లేచిరి. ఆ తరువాత ఆహాబు వంటి రాజు సింహాసనము ఎక్కెను, అతనికి సూత్రధారిగా యొజెబెలు ఉండెను. ఈ అమెరికాలో కూడా అదే మనము చేశాము. మన పితరులు, ఈ దేశమునకు స్వతంత్రమును కోరి, స్వేచ్చారాధనను కోరి వచ్చిరి. ఈ స్థానికులను వారు త్రోసివేసి వారి దేశమును తీసికొనిరి. వాషింగ్టన్ మరియు లింకన్ వంటి మహామహులు ఇక్కడ లేచిరి, కాని కొంతకాలమైన తరువాత ఆ యోగ్యులైనవారి స్థానములలో శక్తిహీనులును అయోగ్యులునగు ఆహాబువంటివారు వచ్చిరి. అధ్యక్ష స్థానములలో కూర్చొనియున్న వారిని యొజెబెలు వంటి వారు నడిపించుచుండిరి. ఈ సమయములోనే మలాకీ యొక్క వర్తమానికుడు తప్పక రావలసియున్నాడు. ఆ తరువాత కడవరి వాన వచ్చును. కర్మెలు పర్వతపు ప్రదర్శన జరుగును. దీనిని ఇప్పుడు జాగ్రత్తగా వాక్యములో చూడండి. మలాకీ 3లో ముందున్న దూత యోహాను. అతడు తొలకరి వాన విత్తనమును నాటెను. తన కాలపు సంస్థల వలన విసర్జింపబడెను. యేసు వచ్చి రూపాంతరపు కొండ ప్రదర్శనను ఇచ్చెను. క్రీస్తు యొక్క రెండవ రాకడను సూచించు ముందుగా వచ్చు రెండవ దూత కడవరి విత్తనములు జల్లును. శాఖలకును మరియు ఆచారములకును మధ్య యేసు ఒక ప్రదర్శనగా యుండును, ఎందుకనగా ఆయన తన వాక్యమును బలపరచుటకును మరియు తన వధువును రాకడలో కొనిపోవుటకును వచ్చును. మొదటి ప్రదర్శన కర్మెలు పర్వతము మీద; రెండవది రూపాంతరపు కొండ మీద, మూడవది సీయోను కొండమీద యుండును.

మోషే, ఏలియా మరియు యోహానుల యొక్క వింత ప్రవర్తనను చూచిన యెడల జనులలో నుండి వారు వేరయి ఏకాంతములోనికి వెళ్ళి అనేకులను గందరగోళములో పడవేసిరి. వారియొక్క వర్తమానములను నిరాకరించినందుననే ఆలాగు జరిగెనని వారికి గ్రహింపు కలుగలేదు. కానీ విత్తనము విత్తబడినది, నాటు వేయబడినవి. తరువాత తీర్పు జరుగును. వారు తమ ఉద్దేశ్యమును నెరవేర్చిరి, జనులకు వారు ఒక సూచనగా యున్నారు, ఇక తరువాత తీర్పు జరుగును.

ప్రకటన 13:16 ప్రకారము వధువు బోధించుటను ఆపవలసి వచ్చును అని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా ఆ మృగము చేతి మీద గాని లేదా నొసటి మీద గాని మృగము యొక్క ముద్ర వేసికొనవలెను అని బలవంతము చేయును; లేని యెడల బోధించుటకు అనుమతి యుండదు. శాఖలు ఆ ముద్రను వేయించుకొనును, లేనియెడల బలవంతముగా బోధను ఆవుదురు. అప్పుడు తన వధువు కొరకు గొర్రెపిల్ల వచ్చును, మహా వేశ్యకు తీర్పు తీర్చును.

ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఒక ప్రత్యేక పనికొరకు మోషే జన్మించెను, అయితే ఆ పని చేయుట కొరకు కావలసిన వరములను పొందువరకు అతడు తన పనిని చేయలేకపోయెను. అతడు ఎడారిలోనికి వెళ్ళి ఎదురుచూడవలసి వచ్చెను; దేవునికి ఒక నిర్ణయకాలము ఉన్నది. సింహాసనము మీదికి ఒక ఫరో రావలసియుండెను, జనులు జీవాహారము కొరకు కేకలు వేయవలసియుండెను, ఆ తరువాతనే దేవుడాతనిని తిరిగి రప్పించెను. ఇది మన దినములకు కూడా నిజమే.

కాని ఈ దినమున మనము ఏమి కలిగియున్నాము? సూచక క్రియలను జరిగించు వారు కోకొల్లలుగా యున్నారు. చివరకు ఈ తరము సూచక క్రియలను వెదకు తరముగా తయారయినది. వాక్యము గూర్చి కొద్దిగా కూడా వీరికి తెలియదు. దేవుని ఆత్మ యొక్క నిజ కదలికను వారెరుగరు. వారికి రక్తము, నూనె, అగ్ని కనబడితే చాలా సంతోషించెదరు; వాక్యము వారికసలు అవసరము లేదు. ఏ సూచక క్రియనయినా గాని వారు బలపరచుదురు, అది లేఖనపూర్వకము కాకపోయినా పరవాలేదు. దానిని గూర్చి దేవుడు ముందే మనలను హెచ్చరించెను. మత్తయి 24లో ఆయన చెప్పెను, చివరి దినములలో రెండు ఆత్మలూ చాలా సన్నిహితముగా యుండి సాధ్యమయితే ఏర్పరచబడినవారిని కూడా మోసము చేయును, అయితే వారు మాత్రము మోసపుచ్చబడరు.

ఈ రెండు ఆత్మలను ఎట్లు మీరు గ్రహించగలరు? వాటికి వాక్య పరీక్షను ఇయ్యండి. వారు ఆ వాక్యమును చెప్పనియెడల దుష్ట సంబంధులే. దుష్టుడు మొదటి ఇద్దరు పెండ్లి కుమార్తెలను మోసము చేసెను. ఈ చివరి దినపు వధువును మోసము చేయుటకు అతడు ప్రయత్నించును. ఆచారముల ద్వారా ఆమెను సంకరము చేయుటకు వారు ప్రయత్నించును. వారు తమకు నచ్చిన సూచక క్రియ దొరికితే చాలు వాక్యమును విడిచిపెట్టి వెళ్ళిపోవుదురు. కాని దేవుడెన్నడునూ వాక్యముకంటె ముందుగా సూచక క్రియలను పంపించడు. వాక్యము వెనుక సూచక క్రియలు వచ్చును, ఏలాగనగా మొదట తనకు ఒక అప్పము చేసి తీసికొని రమ్మని ఏలియా ఆ స్త్రీతో చెప్పెను, యొహోవా యొక్క మాట ప్రకారము. వాక్యము ప్రకారముగా ఆమె చేసినప్పుడు, సరియగు సూచక క్రియ జరిగెను. మొదట వాక్యము యొద్దకు వచ్చి ఆ తరువాత అద్భుతమును చూడుము. వాక్యమును విత్తనమునకు ఆత్మయే జీవింపచేయు శక్తిని ఇచ్చును.

దేవునిచేత పంపబడిన ఏ వర్తమానికుడయినా గాని సగము వాక్యమును నమ్మి సగము వాక్యమును నిరాకరించునా? ఈ చివరి దినమున దేవుని యొక్క నిజమగు ప్రవక్త మొత్తం వాక్యమును ప్రకటించును. శాఖలు అతనిని ద్వేషించును. అతని యొక్క మాటలు బాప్తిస్మమిచ్చు యోహాను మాటలవలె కరకుగా యుండును, అతను వారిని పాములని పిలచెను. కాని ముందుగా నిర్ణయింపబడినవారు విని ఎత్తబాటు కొరకు సిద్ధపడుదురు. అబ్రహాము యొక్క రాజ సంతానము, అబ్రహాము వంటి విశ్వాసమునే కలిగియుండి ఆ వాక్యమును పట్టుకొనియుందురు, ఎందుకనగా వారు ముందుగానే నిర్ణయింపబడిరి.

దేవుడు నిర్ణయించిన కాలములో చివరి దినపు వర్తమానికుడు ప్రత్యక్షమగును. ఇది చివరికాలమని మనందరికిని తెలియును, ఎందుకనగా ఇశ్రాయేలు తన స్వదేశ మందున్నది. మలాకీ ప్రకారము ఏ సమయములోనయినా గాని ఆయన రావచ్చును. అతడు వాక్యమునకు అంకితమయి యుండుట మనము చూచెదము. అతడు ఖచ్చితంగా కనబడును (వాక్యములో చూపింపబడెను. ప్రకటన 10:7) అతని యొక్క పరిచర్యను దేవుడు రుజువుపరచును. ఏలియావలె అతడు సత్యమును బోధించును మరియు సీయోను పర్వతపు ప్రదర్శనకు సిద్ధముగా యుండును.

చాలామంది అతనిని అపార్ధము చేసికొందురు, ఎందుకనగా వారికి వాక్యము వేరేవిధముగా నేర్పింపబడియున్నది. వారు సత్యమును మరో విధముగా గ్రహించుచున్నారు. దానికి వ్యతిరేకంగా అతడు వచ్చినయెడల, వారు నమ్మరు. ఆ వర్తమానికునిని కొందరు నిజమగు సేవకులు కూడా అపార్ధము చేసికొందురు, ఎందుకనగా మోసగాండ్రు వేరే దానిని దేవుని సత్యమని చెప్పిరి.

కాని ఈ ప్రవక్త వచ్చును, మొదటి రాకడకు ముందుగా దూత వచ్చి ఇట్లు కేక వేసెను, "ఇదిగో లోకపాపమును మోసికొనిపోవుచున్న దేవుని గొర్రెపిల్ల." నిస్సందేహముగా ఆ విధంగానే ఇతడు కేకవేయును, "మహిమలో వచ్చుచున్న దేవుని గొర్రెపిల్లను చూడండి." ఈలాగు అతడు చేయును, ఏర్పరచబడిన వారికి వర్తమానికునిగా యోహాను వచ్చెను. అతడు సత్యమును బోధించెను. ఆ విధముగానే ఏర్పరచబడిన వారికొరకును, వాక్యము ద్వారా జన్మించిన వధువు కొరకును ఈ చివరి వర్తమానికుడు ఉండును.

క్రీస్తు ఆ సంఘమును మెచ్చుకొనుట.

ప్రకటన2:13,

"సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును; మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసియై యుండినన్ను గూర్చి సాక్ష్యియైన అంతిపయగువాడు మీ మధ్యను చంపబడిన దినములలో, నీవు నా నామము గట్టిగా చేపట్టి, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును."

"నీ క్రియలను నేనెరుగుదును." ప్రతి కాలములోను యుండిన దేవుని ప్రజలకు సంబంధించి ఏడుగురు వర్తమానికులు ఈ మాటలు పలుకుట మనము గ్రహించగలము. రెండు ద్రాక్షావల్లుల గూర్చి చెప్పబడినది. (నిజమైనది మరియు కారు ద్రాక్షావల్లి) ఒక గుంపువారి యొక్క హృదయములకు వారు ఆనందమును, సంతోషమును కలుగ చేయుదురు, కాని వారు మరియొకరి హృదయములో భయమును పుట్టించుదురు. మనము కృప ద్వారా రక్షింపబడియున్ననూ, నిజమగు రక్షణ వలన క్రియలు కనబడును. క్రియల మూలముగా రక్షించబడలేదు. దేవునిని సంతోషపరచు క్రియలను చేయుదుము.

యోహాను 3:7,

"చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి; ఆయన నీతిమంతుడైయున్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు."

ఈ వచనము యొక్క అర్థము. ఎటువంటి వ్యక్తి ఆయన.

యాకోబు 3:11,

"ఒకే బావినుండి తీయ్యని జలము, ఉప్పు జలము వచ్చునా?"

రోమా 6:2,

"పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము."

మత్తయి 12:33-35,

"చెట్టు మంచిదని యొంచి దాని పండును మంచిదే అని యెంచుడి. లేదా చెట్టు చెడ్డదని యొంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును.సర్ప సంతానమూ, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా?సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషములను తెచ్చును."

ఒక మనిషి వాక్యము వలన జన్మించినట్లయితే అతడు వాక్యమునే బయటకు తెచ్చును (క్షయ భీజము నుండి కాక అక్షయ భీజము వలన అనగా, సదాకాలము నిలచియుండు దేవుని వాక్యమువలన జన్మించినవాడు: పేతురు 1:23) అతని యొక్క ఫలము లేదా క్రియలు అతని జీవితములోని విత్తనమును పోలియే యుండును. ఆ విధముగా ఆతని క్రియలు వాక్యానుసారమైనవిగా నుండును. పెర్గమ కాలమునకు వ్యతిరేకముగా ఈ సత్యము ఎట్లు నేరారోపణ చేయునో చూడగలరు. సాటిలేనివాడు అక్కడ నిలబడియున్నాడు. ఆయన యొక్క చేతిలో రెండంచులు గల వాడియైన ఖడ్గమున్నది. అది దేవుని యొక్క వాక్యము. అంత్యదినమున ఆ వాక్యము మనకు తీర్పు తీర్చును. వాస్తవానికి ఆ వాక్యము ఇప్పుడే తీర్పు చేయుచున్నది, ఎందుకనగా అది హృదయ రహస్యములను, ఆలోచనలను పరిశోధించుచున్నది. ఆత్మ సంబంధమగు వాటిలో నుండి శరీరసంబంధమగు వాటిని అది కోయును. అది మనలను వ్రాయబడిన పత్రికలుగా చేయును. దేవుని మహిమార్ధము మనుష్యులందరూ మనలను చదువుదురు.

"నీ క్రియలను నేనెరుగుదును." ఒకడు తాను దేవునిని సంతోషపరచుట లేదని భయపడుచున్నయెడల అతడు వాక్యమును నెరవేర్చవలెను. "భళా, నమ్మకమగు మంచిదాసుడా," అను మాటలను విని ఆశ్చర్యము పొందినవాడు తన జీవితములో దేవుని వాక్యమును నెరవేర్చవలెను, అతడు నిశ్చయంగా ఆ మొచ్చుకొను మాటలను వినును. అప్పుడు సత్యవాక్యమే గొప్పదని ఎరుగును; ఇప్పుడును అదే గొప్పది. మరియొక ప్రమాణములేదు; మరియొక మట్టపు గుండు లేదు. క్రీస్తు యేసను ఒకనివలన ఈ లోకమునకు తీర్పు తీర్చబడబోవుచుండగా, అయిననూ వాక్యము ద్వారా లోకము తీర్పు తీర్చబడును. ఒకడు తాను ఎట్లున్నానో తెలిసికొనగోరినయెడల అతడు యాకోబు సలహను పాటించవలెను: "దేవుని వాక్యమను అద్దములోనికి చూడవలెను."

"నీ క్రియలను నేనెరుగుదును." అక్కడ ఆయన వాక్యముతో నిలబడి నమూనా ప్రకారముగా వారి జీవితములను పరీక్షించుచున్నాడు. ఆయన ఆ వెలుగును వారికి ఏర్పరచెను. ఆయన ఎక్కువ పరిమాణములో సంతోషించెడి వాడే, ఎందుకనగా వారు, వారికి ముందు గతించినవారివలెనె అనీతిమంతుల యొక్క హింసను సహించుచుండిరి. వారు ఇంకా ఎక్కువగా సంతోషించుచూ ఆ ప్రభువును హత్తుకొనియుండిరి. ప్రభువును సేవించుట కొన్నిసార్లు కష్టమయినా గాని వారాయనను సేవించిరి, ఆయనను ఆత్మతోను మరియు సత్యముతోను ఆరాధించిరి. కాని కారు ద్రాక్షావల్లి ఆలాగు లేదు. అయ్యో! వారు వాక్యము మీద నిర్మింపబడిన జీవితములను నాశనము చేసిరి. ఇప్పుడు వారు సత్యము నుండి ఇంకా ఎంతో దూరముగా వెళ్ళుచున్నారు. వారెంత లోతునకు మునిగిపోయి యున్నారో వారి క్రియలే సాక్ష్యమిచ్చుచున్నవి.

నా నామమును గట్టిగా చేపట్టియున్నావు

"మేమెక్కడికి వెళ్ళుదుము? నీవు మాత్రమే నిత్యజీవపు మాటలుగలవాడవు." వారు అప్పుడూ గట్టిగా పట్టుకొనిరి; ఇప్పుడు కూడా పట్టుకొనిరి, కాని వారు ఫలము లేని జీవితములను కలిగిలేరు, కొందరు మనుష్యులవలె మూర్ఖముగా లేరు. వారు ఆయన బలముయొక్క శక్తిని గట్టిగా పట్టుకొనిరి, వారాయనతో ఏకమైయున్నట్లుగా ఆత్మయొక్క నిశ్చయతను కలిగియుండిరి. తమ పాపములు నిశ్చయముగా క్షమింపబడియున్నట్లు వారు ఖచ్చితంగా తెలుసుకొని, క్రైస్తవులు అను నామమును కలిగియుండి, సాక్ష్యమిచ్చిరి. అన్ని నామములకంటె పై నామమగు దానిని వారు నమ్మి ప్రేమించిరి. ఆ నామమునకు వారు మోకాళ్ళూనిరి. వారి నాలుకలు దానిని ఒప్పుకొనినవి. వారు ఏది చేసినా గాని, యేసు ప్రభుని నామములోనే దానిని చేసిరి. వారు ఆ నామమును బట్టి చెడునుండి దూరముగా తొలగిపోయి, దాని పక్షముగా నిలబడియుండిరి. ఆ నామము కొరకు ఇప్పుడు వారు చనిపోవుటకును సిద్ధముగా యున్నారు, మేలైన పునరుద్ధానమందు వారికి నిశ్చయతయున్నది.

యేసు నామమును నీతో కొనిపొమ్మ,

దుఃఖముతో శ్రమతో నిండిన బిడ్డా.

అది నీకు ఆదరణను, సంతోషిమును ఇచ్చును.

నీవు వెళ్ళ చోటికి దానిని కొనిపొమ్ము.

ప్రశస్త నామము, ఓ! ఎంత మధురము,

భూలోక నిరీక్షణ మరియు పరలోకానందము.

"తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మ" అను ఆ పదములు రెండవ శతాబ్దములోనే చాలామందికి "త్రిత్వముగా" వినిపించెను. ముగ్గురు దేవుళ్ళు అను బహు దేవతారాధన ఉద్దేశ్యము ఒక బోధగా అబద్ధ సంఘములో వెలసినది. నామము అదృశ్యమగుటకు ఎంతో కాలము పట్టలేదు, ఈ కాలములో నిశ్చయముగా అదే జరుగుచున్నది, ఒకే మహా దేవుని యొక్క నామము ప్రభువైన యేసుక్రీస్తునకు బదులుగా బిరుదులనుపయోగించిరి. చాలామంది విశ్వాసభ్రష్టులుగా మారి త్రిత్వమును పటుకొని, దేవత్వము యొక్క బిరుదులలో బాప్తిస్మమును ఇచ్చుచుండిరి. చిన్న మంద మాత్రము ఇంకా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చుచూ, సత్యము పటుకొనియుండిరి.

అనేకులు దేవునిని అగౌరపరచుచూ, ఆయనను ముగురు దేవుళ్ళుగా మార్చిరి, మరియు ఆయన కృపగల నామమును బిరుదులలోనికి మార్చిరి. ఆ గొప్ప నామము పలుకబడి సూచక క్రియలు మరియు అద్భుతములు ఇంకా ఆ జనుల మధ్య కనబడుట చూచినప్పుడు, ఎవరికయినా ఆశ్చర్యము కలుగును. నిశ్చయంగా ఆ సూచక క్రియలు బహు గొప్పగాను, ఆశ్చర్యకరముగాను బయలుపర్చబడిననూ, వీరు కారు ద్రాక్షావల్లికి చెందినవారు కారు. మార్టిన్ వ౦టివారు గొప్పగా వాడబడి అద్భుతములు, సూచక క్రియలు మరియు పరిశుద్ధాత్మ యొక్క వరముల ద్వారా దేవుడు వారి ఎడల సాక్ష్యమిచ్చుచుండెను. ఎప్పుడూ మాదిరిగానే, ఆ నామము ప్రభావముగలదిగా యుండెను. భవిష్యత్తులోనూ ఆలాగేయుండును. పరిశుశుద్ధులు ఆయనను వాక్యము ద్వారాను, విశ్వాసము ద్వారాను ఘనపరచుదురు.

నాయందలి విశ్వాసమును విసర్జింపలేదు.

అపో, కా. 3:16లో శృంగారమను దేవాలయపు గుమ్మము నొద్ద నిలబడియుండిన కుంటివాడు స్వస్థత పొందిన ఆ గొప్ప అద్భుతము ఎట్లు జరిగినదని వారు పేతురును ప్రశ్నించిరి. దానిని అతడు ఇట్లు వివరించెను, "ఆయన (యేసు) నామమందలి విశ్వాసమూలముగా ఆయన (యేసు) నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని (ముందు కుంటివానిగా ఉన్నవాడు) బలపరచెను. ఆయన వలన కలిగిన (యేసు) మీ అందరి యెదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను." చూడండి, అక్కడే యేసు నామము ఉన్నది. మరియు యేసునందలి విశ్వాసమే ఆ అద్భుతమును తీసికొని వచ్చెను. అది తన యొక్క స్వంత మానవ విశ్వాసమని పేతురు చెప్పుకొనలేదు. తన స్వంత నామమని కూడా అతడు చెప్పుకొనలేదు, యేసు నామమందలి విశ్వాసమువలనే ఇది జరిగినదని అతడు చెప్పెను. యేసు ద్వారానే ఆ గొప్ప కార్యము జరిగెను. ఈ విశ్వాసము గూర్చియే ప్రభువు మాట్లాడుచుండెను. ప్రకటన 2:13. అది ఆయన యొక్క విశ్వాసము. ఆయన యందలి విశ్వాసము కాదు. అది ఆయన యొక్క స్వంత విశ్వాసము. దానిని ఆయన విశ్వాసులకు ఇచ్చెను.

రోమా 12:3,

"దేవుడు ఒక్కొక్కనికి విభజించి విశ్వాస పరిమాణ ప్రకారము (1 వచనము ప్రకారము వీరు సోదరులు)"

ఎఫెసీ 2.8,

"మీరు కృప ద్వారా విశ్వాసము చేతనే రక్షింపబడియున్నారు. ఆ విశ్వాసము మీది కాదు గాని, దేవుని యొక్క వరమే."

యాకోబు 2:1లో, ఇట్లు చెప్పబడినది.

"నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస సమయములో మోమాటముగలవారై యుండకుడి."

మనుష్యులు రక్షణను మానవపరమైనదిగా మార్చుచుండిన ఈ పెర్గమ కాలములో సత్యము నుండి తొలగిపోయి రక్షణ ప్రభువు వలన కలిగినదని వారు నమ్ముట మానిరి. ఏర్పరచుకొనుట అను బోధను ఒక ప్రక్కకు త్రోసివేసిరి. సంఘ తలుపును విశాలంగా తెరచిరి. ఎవరితోనయినా సరే వారు సహవాసమునకు సిద్ధమయిరి. వారికి ఎవరు చందాలు ఇస్తే వారితో చేతులు కలిపిరి (వాక్యమును లెక్కచేయలేదు), మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాస పరిమాణమును వారు ఇంకనూ కలిగియుండిరి. శక్తిగల కార్యములు చేయుటకు వారు ఆ విశ్వాసమును ఉపయోగించుటయే కాదు గాని, తాము సంఘములో చేరుట వలన మాత్రమే రక్షింపబడినామని చెప్పుకొనుచున్న వారిని ధైర్యముగా ఎదిరించిరి. ప్రభువైన యేసు యొక్క విశ్వాస పరిమాణము చొప్పునే గాని ఎవడునూ తనంతటతానుగా నిత్య జీవమును గాని దేవుని యొక్క నీతిని గాని విశ్వసించజాలడు. ఈనాడు సంఘములు మానసిక విశ్వాసులతో నిండియున్నవి. కన్యక జన్మను, చిందించబడిన రక్తమును, ప్రభురాత్రి భోజనమును సంఘ హాజరును అంగీకరించుదురు, అసలు తిరిగి జన్మించనేలేదు. మూడవ కాలములో కూడా అదే సమస్య వచ్చినది. మానవ విశ్వాసము సరిపోదు. అప్పుడు ఇప్పుడు కూడా అది చాలదు. దేవుని కుమారుని యొక్క విశ్వాసము మానవ హృదయములో పడవలెను. అప్పుడు అతడు మహిమకు ప్రభువును చేర్చుకొనును. హస్తకృతము కాని దేవాలయములో ఆయన నివసించును.

ఇది ఒక సజీవ విశ్వాసము. "దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా నేను జీవించుచున్నాను." దేవుని కుమారునిలోని విశ్వాసము ద్వారా నేను జీవించితినని పౌలు చెప్పలేదు. దేవుని కుమారుని యొక్క విశ్వాసమే అతనికి జీవమును ఇచ్చెను. మరియు క్రైస్తవ విజయములో అతని జీవితమును నడిపించెను.

లేదు, రక్షణ అనునది ఆదినుండి అంతము వరకును సహాజతీతమైనది అనే దానిని ఎన్నడూ వారు వ్యతిరేకించలేదు. ఆయన నామము మరియు ఆయన విశ్వాసము యొక్క సత్యమును వారు జీవముగా యుంచిరి. వారు ప్రభువు ద్వారా దీవించబడిరి మరియు వారాయనకు యోగ్యులుగా లెక్కంచబడిరి.

నా నమ్మకమగు హతసాక్షియగు అంతిప

ఈ సోదరుని గురించి వాక్యములో ఇంకో చోట గాని లేదా తెలసిన చరిత్రలో గాని మరి ఎక్కువగా చెప్పబడలేదు. కాని నిశ్చయంగా ఆ అవసరము లేదు. అతడు ప్రభువుకు ముందే తెలియును మరియు ఆయనకు తెలియబడియున్నచో చాలును. అతడు ప్రభువుయెడల ఎంత నమ్మకముగా యున్నాడో వాక్యములో వ్రాయబడియున్నది చాలును. అతడు ఒక క్రైస్తవుడు. యేసు నామమును అతడు కలిగియుండెను. మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క విశ్వాసమును అతడు కలిగియుండెను, దాని మూలముగా జీవించిన వారి మధ్యలో అతడు యున్నాడు. యాకోబు యొక్క మాటలకు అతడు స్పందించెను. "మన ప్రభువగు యేసుక్రీస్తు తన విశ్వాసమును మోమాటము లేకుండా అనుగ్రహించును." పరిశుద్ధాత్మతో పూర్తిగా నింపబడెను, స్తెఫనువలె విశ్వాసము కలిగియుండెను, ఆయన ఎవరికీ తలవంచలేదు, ఆయన ఎవరికిని భయపడలేదు. ఆయన నామమును అంగీకరించినవారందరికీ మరణము విధించబడునని ఆజ్ఞ యున్నాగాని అతడు యేసు క్రీస్తునందలి విశ్వాసములో నడిచెను. వెనుకకు మళ్ళని వారి పక్షముగా అతడు నిలబడియుండెను. అతడు చనిపోయెను గాని, హేబెలువలె దేవుని యొద్ద నుండి సాక్ష్యమును పొందెను (అతని పేరు వాక్యములో వ్రాయబడెను) అతడు చనిపోయినా గాని అతని యొక్క స్వరము దేవుని యొక్క పరలోకసంబంధమగు గ్రంథమందుండి ఇంకనూ మాట్లాడుచున్నది. మరియొక నమ్మకమగు హతసాక్షి తన విశ్రాంతిలో ప్రవేశించెను; కాని సాతాను ఇంకా అప్పటికి జయము పొందలేదు, సమాధానాధిపతిని చంపినా గాని సాతానుకు విజయము రాలేదు, ఎందుకనగా సాతాను సిలువ యొద్ద నిరాయుధుడయ్యెను. ఆ విధముగానే అంతిప యొక్క రక్తము వందలాది మంది సిలువను ఎత్తికొని ఆయనను వెంబడించుచున్న వారితో మాట్లాడుచునేయున్నది.

సాతాను సింహాసనమున్న స్థలము

ఆత్మ యొక్క మొచ్చుకొను విషయములలో ఇది ఒక భాగముగా యుండుటకు కారణమున్నది. ఈ ధైర్యము గల సిలువ యొక్క సైనికులు సాతాను సింహాసనమున్న చోటనే యుండి వానిని జయించుచున్నాడు. యేసు నామము మరియు విశ్వాసము ద్వారా వారు ఆ అంధకారసంబంధులగు నాయుకులున్న చోటనే యుద్ధమును జయించుచున్నారు. ఎంత గొప్ప సంగతి! బలాఢ్యులైన దావీదు వారు వలె, వీరున్నారు. వారు శత్రువు యొక్క పాళెము మీదికి దండెత్తి దావీదు యొక్క దాహము చల్లారుటకు నీరు తీసికొనివచ్చిరి. ఆ విధముగానే ఈ విశ్వాస యోధులు సాతాను యొక్క ఈ భూసంబంధమగు స్థావరమును కైవసము చేసికొనిరి. బోధించుట మరియు హెచ్చరించుట ద్వారా ఆ రక్షణ జలమును మరణ ఛాయలలో జీవించుచున్న జనులకు తెచ్చి ఇచ్చిరి.

సాతాను యొక్క సింహాసనము మరియు రాజ్యము అను ఈ మాటలు దేవుడు తానేర్పరచుకొనిన వారిని ఘనపరచుటలో భాగము. సంఘములో ఆగ్రస్థానము సంపాదించుకొనిన చెడును ఖండించుటకు వారు కంకణము కట్టుకొనిరి.

పెర్గమ: సాతాను యొక్క సింహాసనము మరియు కాపురము ఉన్న చోటు. చాలా మందికి, ఈ మాటలు అలంకారప్రాయములుగానే కనిపించును, కాని ఇవి నిజంగా చారిత్రక సత్యములని గ్రహించరు. నిశ్చయముగా అవి నిజము మరియు చరిత్ర దానిని రుజవు చేయుచున్నది. పెర్గమ నిశ్చయంగా సాతాను యొక్క సింహాసనము మరియు కాపురమున్న చోటు. అది ఈ విధముగా జరిగినది:

పెర్గమ సాతాను నివాసమున్న అసలైన స్థలము కాదు. (మానవ వ్యవహారముల బట్టి చూచినప్పుడు) అక్షరార్ధముగాను మరియు అలంకార రూపముగాను కూడా ఎల్లప్పుడూ బబులోనే వాని యొక్క ప్రధాన కార్యాలయము. సాతానును ఆరాధించుటకు ఆరంభము అసలు బుబులోను పట్టణములోనే ప్రారంభమయినది. ఆదికాండము 10: 8-10, "కూష నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను. అతడు యొహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి - యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి గలదు. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు."

ఆదికాండము 11:1-9,

"భూమియందంతట ఒక్క భాషయు, ఒక్క పలుకును ఉండెను.వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను, అక్కడ వారు నివసించి.మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్ళకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టి కీలునువారికుండెను.మరియు వారు — మనము భూమి యందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండి అని మాటలాడుకొనగా,యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను.అప్పుడు యొహోవా — ఇదిగో జనము ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు: ఇక మీదట వారు చేయదలచు ఏ పనియెనను చేయకుండ వారికి ఆటంకమేమియు ఉండదు.గనుక మనము దిగిపోయి, వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను; గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.దానికి బాబేలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమూరు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను."

బబులోనుకు అసలు పేరు బాబెలు. దానికి అర్ధము గందరగోళము. హాము కుమారుడగు కూషు ద్వారా అక్షరాలా అది ప్రారంభమాయెను, కాని అతని కుమారుడగు నిమ్రోదు అను మహా పరాక్రమశాలియగు వేటగాని వలన అది బలము మరియు మహిమగల రాజ్యముగా రూపొందెను. నిమ్రోదు, ఆదికాండము పదకొండవ ఆధ్యాయము ప్రకారము మరియు తెలసిన చరిత్ర ప్రకారముగా, అతడు మూడు క్రియలను చేయుటకు పూనుకొనెను. అతడు ఒక బలమగు రాజ్యమును నిర్మించగోరెను, దానిని చేసెను. తన స్వంత మతమును వ్యాపింపచేయగోరెను, దానిని చేసెను. తను గొప్ప పేరు సంపాదించు కొనగోరెను, దానిని కూడా అతడు సాధించెను. అతని యొక్క ఘనకార్యములు చాలా చిరస్థాయి కలిగియున్నవి. బబులోను రాజ్యమును బంగారు శిరస్సుగలదానిగా పిలచిరి. ప్రపంచ ప్రభుత్వములన్నింటిలో అది తలమానికముగా యున్నది. అతని యొక్క మతము ప్రాధాన్యతను పొందినది. దానిని పూర్తిగా సాతాను సంబంధమగు శక్తిగా లేఖనములు గుర్తించుటను మీరు గమనించండి. యెషయా 14వ అధ్యాయములోను, ప్రకటన 17-18 అధ్యాయములలోను ఈ వాస్తవమును చూడగలరు. సర్వప్రపంచము మీదికి ఇది దండెత్తినదని చరిత్ర ద్వారా మనము నిరూపించగలము. విగ్రహారాధన యొక్క ప్రతి విధానమునకు ఇదే మూలము. కాల్పనిక చరిత్ర సిద్దాంత ప్రకారము భూభాగములలోని ఆయా విభజనలను బట్టి దేవతల పేర్లు మారినప్పటికిని, లేక జనుల యొక్క భాషను బట్టి పద్ధతిలో తేడా వచ్చినప్పటికిని, మూలము ఒక్కటే. అతడు గొప్ప పేరును సంపాదించుకొనెను. మారు మాట్లాడకుండా అతని అనుచరులు నడచుచుండిరి. ఈ ప్రస్తుత కాలము కొనసాగునంత వరకూ (యేసు తన్ను తన సోదరులకు బయలుపరచుకొను సమయము వచ్చు వరకూ) ఇతడు ఆరాధింపబడును, ఘనపరచబడును; నిమ్రోదు అను పేరు కాకుండా, మరో పేరు క్రింద మరియు అతను ఆరాధించబడిన అసలు ఆలయము కాక, మరోక దానిలో.

ఇతర రాజ్యముల యొక్క చరిత్రను సవివరముగా బైబిలు అందించని కారణమును బట్టి ప్రాచీన అధికారిక చరిత్రలను పరిశీలించి, బబులోను యొక్క సాతానీయ మతమునకు పెర్గమ ఎట్లు సింహాసనమైనదో కనుగొనుట అవసరమైయున్నది. ఈ పరిశోధనలకు మూలాధారములు ఐగుప్తు మరియు గ్రీకు సంస్కృతుల చరిత్రలలో యున్నవి. దీనికి కూడా కారణమున్నది; ఐగుప్తు వారు సైన్సు మరియు లెక్కలను కల్దీయుల నుండి నేర్చుకొనిరి. ఆ తరువాత వాటిని ఐగుప్తియుల నుండి గ్రీకు వారు నేర్చుకొనిరి.

ఈ సైన్సును బోధించు పనిని యాజకులకు అప్పగించిరి కాబట్టి ఈ సైన్సును మతములో ఒక భాగముగా నియమించిరి. ఈ రెండు దేశములలో బబులోను మతము ఇంత బలంగా ఎందుకు స్థిరపడినదో ఆ మూల కారణము ముందే మనకు తెలియును. ఒక దేశము మరియొక దేశమును జయించు శక్తిని పొందినప్పుడు, కాలక్రమములో జయించిన దేశము యొక్క మతము జయించబడిన దేశములో అధికారికంగా అమలు చేయబడును. ఇది నిజమే. బబులోను వారివలేనె గ్రీకులకు కూడా ఒకే గురుతులున్న రాశి చక్రముండెను. ఇది అందరికిని తెలసిన సంగతి. ఈజిప్ట్ వారు తమ బహుదేవతారాధనా జ్ఞానమును గ్రీకులకు ఇచ్చినట్లు ప్రాచీన ఐగుప్తు, గ్రంథములలో దొరికినవి. అందువలన బబులోను యొక్క మర్మములు ఒక దేశము నుండి మరొక దేశమునకు వెళ్ళుచున్నవి. ఎంతవరకు అనగా రోమ్, చైనా, ఇండియా, మరియు ఉత్తర-దక్షిణా అమెరికాలలో కూడా పాకినవి.

భూమి మీద ఆది కాలములలో నున్న జనుల యొక్క అసలు మతము ఇది ఖచ్చితముగా కాదని ప్రాచీన చరిత్రలు చెప్పుచున్నవి. ఈ బబులోను మతము గూర్చి బైబిలులో చెప్పబడినట్లే అవియు చెప్పుచున్నవి. అసలు విశ్వాసములో నుండి ముందు తొలగిపోయినది ఇదే, కాని దానికది మాత్రము అసలు మతము కాదు. విల్కిన్ సన్ మరియు మాలెట్ వంటి చరిత్రకారులు ప్రాచీన వ్రాత పత్రుల ఆధారంగాని రూపించినదేమనగా, ఒకప్పుడు భూమిమీద మానవులందరూ ఒకే దేవునియందు విశ్వాసముంచిరి. ఆయనే సర్వోన్నుతుడు, నిత్యుడు, అదృశ్యుడు. ఆయన తన నోటి మాట ద్వారా సమస్తమును ఉనికి లోనికి తెచ్చెను. ఆయన యొక్క గుణశీలములో ప్రేమ, మంచితనము మరియు న్యాయము ఉన్నవి. కానీ సాతాను తనకు సాధ్యమైనంత వరకు ప్రతిదానిని కలుషితము చేయును, వాడు మానవుల యొక్క హృదయములను మరియు మనస్సులను కలుషితము చేయుచున్నాడు గనుక వారు సత్యమును నిరాకరించుచున్నారు. తాను దేవునివలె పూజింపబడగోరి దాసునిగాను లేదా దేవుని సృష్టిగాను ఉండగోరక, దేవుని నుండి వాడు ఆరాధనను లాగుకొనుటకు ప్రయత్నించి, ఆ విధముగా వాడు చివరికి తన్నుతాను హెచ్చించు కొనగోరును. వాడు నిశ్చయుముగా తన కోరికను నెరవేర్చుకొనియున్నాడు, మొత్తం ప్రపంచమునకు తన మతమును వ్యాపింపచేసియున్నాడు. దీనిని దేవుడు రోమా పత్రికలో అధికారపూర్వకముగా తెలియచేసెను. "వారు దేవునిని తెలిసికొనినప్పుడు, ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు తమ ఊహలలో వ్యర్ధులయిరి. హృదయ అంధకారమును బట్టి ఒక చెడిపోయిన మతమును అంగీకరించిరి. వారు చివరికి సృష్టికర్తను కాకుండా సృష్టులను ప్రేమించు స్థాయికి వచ్చిరి."

గుర్తుంచుకొనండి, సాతాను దేవుని యొక్క ఒక సృష్టము. (వేకువ కుమారుడు) ఆ విధముగా ఒక్కసారి మనుష్యుల మధ్య సత్యము విభాగించబడినది, వారు అందరూ ఆ ఒక్క సత్యమునే పట్టుకొనిరి. ఆతరువాత ఒక దినము వచ్చెను, ఒక పెద్ద గుంపు దేవుని నుండి తిరిగిపోయి ప్రపంచమంతటా ఒక బహు దేవతారాధనను వ్యాపింపచేసిరి. చరిత్ర దానిని తెలియచేయుచున్నది, షేము యొక్క తెగవారు మారని సత్యము పక్షముగా నిలబడరి. అపవాది యొక్క అబద్ధమును నమ్మి సత్యము నుండి తొలగిపోయిన హాము వారు వీరికి విరోధులయిరి, దీనిని గూర్చి చర్చించుటకు సమయము లేదు; కేవలము దానియొక్క పరిచయమును మనము చూచెదము, అక్కడ మీరు రెండే రెండు మతములను చూచెదరు, అందులో చెడ్డది ప్రపంచ ప్రసిద్ధిచెందెను.

ఏక దేవుని ఆరాధనను బబులోను వారు బహు దేవతారాధనగా మార్చిరి. దేవుని యొక్క సత్యమునకును మరియు దేవుని యొక్క మర్మములకును విరోధముగా అపవాది యొక్క మర్మములు మరియు అపవాది యొక్క అబద్ధము ఆ పట్టణములో లేచినవి. సాతాను నిజంగా ఈ లోక దేవునిగా మారిపోయి, ఎవరిని అది మోసము చేసెనో వారి నుండి ఆరాధనను పొందుచూ, నిజంగా అపవాదినే ప్రభువుగా నమ్ములాగున చేసినది.

శత్రువు యొక్క బహు దేవతా మతము త్రిత్వ సిద్ధాంతముతో ప్రారంభమయినది. ఎప్పుడో ఆ ప్రాచీన కాలములోనే, "ముగురు వ్యక్తులలో ఒక్క దేవుడు," అను తలంపు ఆవిర్భవించినది. మన ఆధునిక వేదాంత పండితులు దీనిని తెలిసికొనకపోవుట ఎంత వింతగాయున్నది! వారు సాతాను వలన మోసము చేయబడిరి, దేవత్వములో వారు ముగురు వ్యక్తులున్నారని ఇంకనూ నమ్ముచున్నారు. ఆ సిద్దాంతమునకు అధికారమును గ్రహించు లేఖనవు ఒక్కటయినా ఉన్నదేమో చూపించమనండి. హాము సంతతి వారియొక్క ఈ సాతాను ఆరాధనలో ముగురు దేవుళ్ళు, అనే ప్రాధమిక భావన ఇమిడియుండుట ఆశ్చర్యముగా లేదా! మరియు అటువంటి దానిని షేము యొక్క సంతతివారు నమ్మినట్లుగా ఒక్క చిన్న జాడ కూడా కనిపించదు. దానికి అనుగుణముగా ఉన్న ఒక్క ఉత్సవ ఆరాధన కూడా కనిపించదు. ఆ మాదిరియే వారిలో లేదు. హెబ్రీయులు నమ్మినది అదేనని మీరెరుగుదురు గదా? "ఓ ఇశ్రాయేలూ, వినుము, నీ ప్రభువగు దేవుడు ఒక్కడే." దైవత్వములో ముగురు వ్యక్తులు ఎక్కడున్నారు? షేము సంతతివాడగు అబ్రహాము, ఆదికాండము 18లో ఒకే దేవునిని, ఇద్దరు దేవదూతలతో చూచెను.

ఇప్పుడు ఈ త్రిత్వము ఎట్లు వ్యక్తపరచబడినది? ఒక సమాంతర త్రిభుజము ద్వారా అది బయలుపరచబడినది? నేటికిని రోమ్లో ఆ విధంగానే చెప్పెదరు. వింత ఏదనగా, హెబ్రీయులకు ఆ భావన లేదు. అయితే ఎవరిది నిజము? హెబ్రీయులదా లేదా బబులోనీయులదా? ముగ్గురిలోనున్న ఒకే దేవుని గూర్చిన బహు దేవతా ఉద్దేశ్యము మూడు శిరస్సులున్న విగ్రహమునకు ఒకే శరీరము ద్వారా ఆసియాలో అమలులోనికి వచ్చెను. మూడు మేథా శక్తులుగా వానిని వివరించిరి. ఇండియాలో, ఒకే దేవుడు గాని మూడు రూపములని వారి హృదయములలో ముద్రింపబడినది. అది నిజంగా ఈనాటి ఆధునిక సత్ సిద్ధాంతముగా యున్నది. జపాన్లో మహా బుద్ధునికి మూడు శిరస్సులున్నవి. ముందు మనము వివరించిన దానివలెనె యున్నది.

కాని వీటనన్నింటివలన ముఖ్యంగా బయలుపడినది ఏమనగా దేవుని యొక్క త్రిత్వ భావము, మూడు రూపములలో యున్నదందురు: 1. సృష్ణుని యొక్క శిరస్సు తండ్రియగు దేవునికి సూచన అందురు; 2. ఒక వృత్తమున్నది, దానియొక్క మర్మయుక్తమగు భావము 'విత్తనము' అనగా కుమారుడని అర్థము; 3. ఒక పక్షి యొక్క రెక్కలు మరియు తోక (పావురము). ఇక్కడ తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క సిద్దాంతమున్నది; దైవత్వములోని ముగురు వ్యక్తులు అని చెప్పుచున్నారు. ఇది ఒక సాపేక్ష త్రిత్వము. రోమ్ లో మీరు దీనినే చూతురు. మిమ్మును మరల ఒక్కసారి అడుగుచున్నాను, అపవాది మరియు వానియొక్క ఆరాధికులకు వాస్తవంగా, విశ్వాసులకు తండ్రి మరియు అతని సంతతివారికంటె (అబ్రహాము) ఎక్కువ సత్యము బయలుపరచుట వింతగా లేదా? దేవుని పిల్లలకంటె ఎక్కువగా సాతాను ఆరాధికులకు దేవునిని గూర్చి తెలియుట వింతగా లేదా? ఆధునిక సిద్ధాంతకర్తలు, పండితులు త్రిత్వమును గూర్చి అదే మనకు చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. ఇక నుండి మీరు ఈ ఒక్క సంగతి గుర్తుంచుకొనండి: ఈ సంగతులు వాస్తవములు మరియు ఇది ఒక సత్యము — సాతాను ఒక అబద్ధికుడు; అబద్ధములకు జనకుడవై యున్నాడు, వాడు ఏదయినా వెలుగుతో వచ్చినా గాని అది ఇంకనూ అబద్ధమే. వాడు ఒక హంతకుడు. వాని యొక్క త్రిత్వ సిద్దాంతము ఎన్నో జనసమూహములను నాశనము చేసినది. యేసు వచ్చు వరకు నాశనము చేయుచునే యుండును.

చరిత్ర ప్రకారము తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క భావనలోనికి మార్పు తీసికొని వచ్చుటకు ఎంతో సమయము పట్టలేదు. సాతాను వారిని సత్యము నుండి ఒక అడుగు బయటకు వేయించినది. పరిణామము చెందిన దైవత్వము యొక్క భావన ఇది: 1. నిత్యుడగు తండ్రి, 2. దేవుని యొక్క ఆత్మ ఒక మానవ తల్లిలో అవతారము ధరించెను (అది మిమ్ము ఆలోచింపచేయుచున్నదా?) 3. ఒక దైవ కుమారుడు, ఆ అవతారము యొక్క ఫలము, (స్త్రీ యొక్క సంతానము)

కాని అపవాదికి సంతృప్తి లేదు. ఇంకా వాడు తనకుతానుగా ఆరాధించుటను సాధించుకొనలేదు, కానీ పరోక్షముగా ఆరాధనను పొందుచున్నాడు. కావున వాడు జనులను సత్యము నుండి ఇంకా దూరముగా లాక్కొని పోవుచున్నాడు. తన మర్మముల ద్వారా వాడు జనులను మోసము చేయుచున్నాడు. అదృశ్యుడగు తండ్రియగు దేవుడు మానవుల వ్యవహారములలో జోక్యము చేసికొనక నిశ్చబ్దముగా యున్నాడని చెప్పుచున్నాడు, కాబట్టి మౌనముగా ఆయనను బాగుగా ఆరాధింపవచ్చునని చెప్పుచున్నాడు. వాస్తవానికి అతడు చెప్పుచున్నదేమనగా పూర్తిగా దేవునిని వద్దనకపోయినా వీలయినంత వరకు అలక్ష్యము చేయమని చెప్పుచున్నాడు. ఈ బోధ ప్రపంచమంతయూ విస్తరించుచున్నది, మరియు ఈ రోజున మీరు ఇండియాలో ఆ గొప్ప సృష్టికర్తకు, మౌన దేవునికి కట్టిన దేవాలయములు సంఖ్యలో చాలా తక్కువగా యుండుట మీరు చూడగలరు.

సృష్టికర్తయగు తండ్రిని ఆరాధించవలసిన అవసరము లేదు గనుక సహజము గానే "తల్లి మరియు శిశువు" యొక్క ఆరాధనకు మళ్ళి వారే పూజనీయులనిరి. ఈజిప్టులో కూడా అదే విధమగు తల్లి మరియు కుమారుడు ఐసిస్ మరియు ఒసిరిస్ గా పిలువబడుచు ఆరాధించుట వాడుక. ఇండియాలో అది ఈసి మరియు ఈశ్వర. (ఆ పేర్ల యొక్క సారూప్యము గమనించండి) ఆసియాలో అది సైబిలు మరియు డియోయుస్, రోమ్ మరియు గ్రీసులో దానికి తగినట్లుగానే యుండును. చైనాలోనూ అంతే. చైనాలోనికి ప్రవేశించిన కొందరు రోమను కాతలిక్కు మిషనెరీలను సంభ్రమాశ్చర్యములో ముంచివేసిన సంగతి వినండి. చైనాలోని వారు మడోనా మరియు శిశువును పూజించుచున్నారు. ఆ శిశువు యొక్క శిరస్సు పైన కాంతి పుంజములు ఏటవాలుగా పడి కనబడుచున్నవి. ఆ విగ్రహమునకు, వాటికన్లో యున్న విగ్రహమునకు ఏమీ తేడా లేదు. కొన్ని ముఖ కవళికులలో తప్ప పెద్ద మార్పు ఎక్కడా లేదు.

అసలు తల్లి మరియు బాలుని కనిపెట్టవలసిన అవసరము ఇప్పుడు మనకున్నది. బబులోను యొక్క అసలు దేవతా మూర్తి సెమిరామిస్, ఆమెను తూర్పు దేశములలో రీయా అని పిలచెదరు, ఆమె తన చేతులలో ఒక కుమారుని ఎత్తుకొనినది. శిశువుగా పిలువబడినా గాని అతడు పొడవుగాను, బలముగాను, అందముగాను ఉండెను, ముఖ్యముగా స్త్రీలను వశపరచుకొనునట్లుండెను. యెహెజ్కెలు 8:14లో అతనిని తమ్మూజు అని పిలచెను. అలంకారప్రాయమగు వ్రాత్రలను వ్రాయువారు అతనిని బాకస్ అని పిలచిరి. బబులోనీయులకు అతడు నైనస్. అతడు చేతులలోని శిశువుగా ఎందుకు చూపబడెనో ఆ వాస్తవమును చూడండి. అయినా గాని అతడు ఒక గొప్ప బలశాలిగా ఎందుకు చూపబడెనో గ్రహించండి. వారు ఆ విగ్రహమును "భర్త -కుమారుడు" అని పిలచెడివారు. వాని యొక్క బిరుదులలో ఒకటి ఏమనగా "తల్లి యొక్క భర్త," ఇండియాలో ఈ ఇద్దరిని ఈశ్వర మరియు ఈసీగా పిలచెదరు. అతడు (భర్త) శిశువుగా పిలువబడి, తన స్వంత భార్య యొక్క రొమ్మును హతుకొనియుండెను.

ఈ నైనస్ బైబిలులోని నిమ్రోదు అని మనము చరిత్రను ఆది కాండములోని సంగతులతో పోల్చినచో నిశ్చయమగును. పొ౦పియస్ ఇట్లు చెప్పెను, "నైనస్, అషూరియా రాజు. అతడు జయించవలెనను కోరిక కలిగియుండి ప్రాచీన జీవన విధానములను మార్చెను. తన పొరుగు వారికి విరోధముగా మొదట యుద్ధమును చేసినవాడు ఇతడే. ఆస్సీరియా నుండి లిబియా వరకు గల దేశములన్నింటిని అతడు జయించెను, ఎందుకనగా వారికి యుద్ధ నైపుణ్యములు తెలియవు." డియోడరస్ చెప్పెను. "చరిత్రలో వివరించబడిన అస్సీరియను రాజులందరిలోను నైసస్ పురాతనమైనవాడు. యుద్ధ వాతావరణమును సృష్టించి, చాలామంది యువకులకు యుద్ధ నైపుణ్యములను తెలియచేయు కఠినమగు శిక్షణను ఇప్పించెను. బాబిలోనియాను తన అధీనములోనికి తెచ్చుకొనెను. అప్పటికింకా బబులోను పట్టణము కూడా లేదు." ఆ విధముగా ఈ నైనస్ బబులోనులో గొప్పవాడగుట ప్రారంభమయ్యెను, బాబెలును నిర్మించి ఆస్సీరియాను జయించెను, దాని యొక్క రాజాయెను, ఆ తరువాత అతడు ఇంకా చాలా భూభాగములను కబళించెను. ఆ భూభాగములలోని వారికి యుద్ధమొట్లు చేయవలెనో తెలియనందున, ఓడిపోయి ఆధునిక రీతిలో జీవించసాగిరి అని హంపియస్ చెప్పెను.

ఇప్పుడు ఆదికాండము 10లో నిమ్రోదు రాజ్యము గూర్చి ఇట్లు చెప్పబడెను,

"షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు వెళ్ళినవి నీనెవేను, కాలాహును మొదలగునవి."

కాని అనువాదకులు అషూరును ఒక నామవాచకముగా తర్జుమా చేసి తప్పు చేసిరి. అది క్రియ. కదలీయుల భాషలో దానికి అర్ధము "బలముగా చేయుట." ఆ విధముగా నిమ్రోదు బలవంతునిగా తయారయ్యెను. (ప్రపంచములో మొదటగా సైన్యమును నిర్మించి, అతడు తన రాజ్యమును స్థాపించుకొనెను. బావులను త్రవ్వుట, కష్టించి పనిచేయుట, వేటాడుట వారికి నేర్పెను) తన బలమగు సైన్యముతో షీనారును దాటి వెళ్ళి దేశములను జయించెను, మరియు నీనెవ వంటి పట్టణములను అతడు నిర్మించెను, అతని పేరు మీద దానిని కట్టెను. నేటికిని ఆ పట్టణ శిథిలములలోని ప్రధాన భాగములను నిమ్రోదు అనియే పిలచుచున్నారు.

నైనస్ ఎవరో మనము కనిపెట్టాము కనుక, అతనికి తండ్రి ఎవరో ఇపుడు కనిపెట్టుట అవసరము. చరిత్ర ప్రకారము అతని పేరు బేలు, బాబిలోనును నిర్మించినవాడు. (బెల్ దీనిని నిర్మించెనని చెప్పినదానిలో భావమును ఇచ్చట మీరు గమనించవలెను. అదేమనగా ఈ ఉద్యమమంతటికి ప్రారంభకుడు ఇతడే. కాని దానిని స్థాపించినవాడు అతని కుమారుడగు నైనస్. దానికి అతడే మొదటి రాజు.) కాని వాక్యము ప్రకారము నిమ్రోదు యొక్క తండ్రి కూషు. "కూష నిమ్రోదునును కనెను." ఇది మాత్రమే కాదు గాని హాము కూషును కనెను. ఈజిప్టు సంస్కృతి ప్రకారము బెల్ ను హెర్మస్ అని పిలచిరి, హెర్మస్ అనగా "హాము కుమారుడు" అని అర్థము. చరిత్ర ప్రకారముగా విగ్రహారాధనకు హెర్మస్ మహా ప్రవక్త, దేవతల యొక్క అనువాదకుడు అతడే. అతడు మెర్క్యూరీ అను మరో పేరు చేత కూడా పిలువబడెను. (అపోకా 14:11-12 చదవండి)

దీనిని గూర్చి హయిజినిస్ చెప్పును బెల్, హెర్మస్, మెర్క్యూరీ మొదలగు నామములలో దేవునిగా అతడు పిలువబడెను, "చాలా యుగముల వరకు మానవులు జోన్ ప్రభుత్వము క్రింద జీవించిరి. (రోమను జోన్ కాదు. హెబ్రీయుల యొక్క యెహోవా, రోమను చరిత్రకంటె ముందున్నవాడు) పట్టణములు గాని చట్టములు గాని ఏమియూ లేకుండా అందరూ ఒకే భాషను మాట్లాడుచుండిరి. కాని ఆ తరువాత మెర్క్యూరీ (బెల్ కూషు) మానవుల భాషలను అనువదించుట వచ్చెను. (అనువాదకుని హెర్మినిటస్ అని పిలచెడివారు) అతడే రాజ్యములను ప౦చెను. ఆ తరువాత వైషమ్యములు ప్రారంభమాయెను." దీనిని బట్టి చూడగా బెల్ లేదా కూషు, నిమ్రోదు యొక్క తండ్రి, ప్రజలను నిజమగు దేవుని నుండి దూరము చేసిన అసలు మూలసూత్రధారి అని చెప్పవచ్చును. "దేవుళ్ళకు మధ్యవర్తిగా" పనిచేయుచున్నట్లుగా చెప్పి, జనులను ప్రోత్సాహపరచి మరియొక మతమును అతడు ఈ విధముగా రూపొందించెను. తన కుమారుడు వాస్తవంగా నిర్మించిన గోపురమును ఆపకుండా కట్టుడని అతడు వారిని ప్రోత్సాహపరచెను. ఈ ప్రోత్సాహము వలన ఆ గందరగోళమంతయూ వచ్చెను. మనుష్యుల మధ్య విభజన జరిగెను, ఆ విధముగా అతడు, "అనువాదకుడు మరియు గందరగోళ కర్త."

కాబట్టి కూషు, బహు దేవతారాధనకు తండ్రియైయున్నాడు, మరియు మానవుల ద్వారా మానవులు అపవిత్రపరచబడిరి, ఇతడు దేవతలకు తండ్రిగా యున్నాడు. ఇప్పుడు కూషును బెల్ అని పిలచుదురు. రోమను పురాణముల ప్రకారము బెల్ అనగా జానస్. అతని బోమ్మను చూచినచో రెండు ముఖములు ఉండును. అతడు ఒక కర్రను మోయుచుండును, జనులను "చెదరగొట్టుటకు" తారుమారు చేయుటకు కర్రనుపయోగించినట్లుగా గ్రహించవలెను. జానెస్ తనను గూర్చి చెప్పుకొనెనని ఒవిడ్ ఇలాగ వ్రాసెను. "ప్రాచీనములోని వారు నన్ను ఆగాధము అని పిలచెదరు." ఆ విధముగా బైబిలులోని కూషు, ఏకైక దేవునికి మూల వ్యతిరేకి అని కనుగొందుము; అతనినే బెల్, బెల్స్, హెర్మస్, జానస్ మొదలగు పేర్లతో పిలచిరి, ప్రాచీనుల మధ్య ఆలాగు అతడు ప్రసిద్ధిచెందెను. దేవతల యొద్ద నుండి ప్రత్యక్షతలను మరియు వర్తమానములను తాను తెచ్చుచున్నట్లుగా జనులకు చెప్పెను. ఆ విధముగా చేసి దేవుని ఉగ్రతను రప్పించి జనులను చెదరగొట్టునట్లుగా చేసినవాడాయెను. గందరగోళమును, వేర్పాటును తీసికొని వచ్చెను.

ఇప్పుడు ఇంతవరకు మనము బహు దేవతారాధన లేదా చాలామంది దేవుళ్ళను ఆరాధించుట ఎట్లు వచ్చెనో చూచాము. "దేవుళ్ళందరికి పితరునిగా" బిరుదును పొందిన కూషు అను పేరుగల ఒక మనుష్యుని గూర్చి మనము ప్రస్తావించుటను మీరు గుర్తించారా? ప్రాచీన పురాణముల యొక్క మూలాంశమును ఇక్కడ మీరు గమనించారా? దేవుళ్ళు మానవులతో తమ్మును గుర్తించుకొందరను సంగతిని గ్రహించండి. పితరులను ఆరాధించుట ఆ విధంగానే ప్రారంభమాయెను. కాబట్టి పితరులను ఆరాధించుట ఏలాగు వచ్చినదో చరిత్రను పరీక్షించినప్పుడు అర్థమగును. తండ్రి, కుమారుడు, మరియు ఆత్మ యొక్క ముగ్గురు దేవుళ్ళ ఆరాధనను కూషు పరిచయము చేసి తీసికొని వచ్చెను. ఆ ముగ్గురు దేవుళ్ళు అన్ని రకములుగా సమానులని చెప్పెను. కాని స్త్రీ యొక్క సంతానము వచ్చుచున్నదని వానికి తెలియును, కావున ఒక స్త్రీ యుండవలెను, ఆమె యొక్క సంతానము రంగము మీదికి వచ్చును. నిమ్రోదు చనిపోయిన తరువాత ఇది నెరవేరెను. అతని భార్య సెమిరామిస్ అతనిని దేవునిగా మార్చినది. ఆ విధముగా ఆమె తన్ను ఆ కుమారుని తల్లిగాను, దేవతల యొక్క తల్లిగాను తయారు చేసికొనెను. (మరియను రోమను సంఘము దైవముగా మార్చినట్లేయున్నది. ఆమె పాపరహితురాలనియు, దేవుని యొక్క తల్లి అనియు వారు చెప్పెదరు) ఆమె (సెమిరామిస్) నిమ్రోదును "జెరోష్టా" అని పిలచెను, దానికి అర్థము "స్త్రీ యొక్క వాగ్దాన సంతానము."

కుమారునికంటె ఆ స్త్రీయే ఎక్కువ మందిని ఆకర్షించుటకు ఎంతో సమయము పట్టలేదు, సర్పమును కాళ్ళ క్రింద వేసి త్రోక్కుచున్నట్లుగా ఆమెను చిత్రీకరించిరి. వారామెను "పరలోకపు రాణి" అనిరి. ఆమెను దైవాంశసంభూతురాలుగా చేసిరి. ఈనాడు యేసు తల్లియగు మరియను అమర్త్యురాలుగా వారు హెచ్చించినట్లుగా మరియు ఇప్పుడు 1964 సెప్టెంబరులో, వాటికన్ ఆలోచన సమితి వారు మరియకు లేని ఒక గుణలక్షణమును ఇవ్వవలెనని ప్రయత్నములు చేయుచున్నారు, వారు ఆమెను "మధ్యవర్తిణియగు మరియ," "విశ్వాసులందరికి మరియు తల్లి" లేదా "సంఘమునకు తల్లి" అని వారు పిలువగోరుచున్నారు. ఒక మతములో బబులోనీయ పితరుల ఆరాధనను చూడవలెనన్నచో దానిని రోమన్ మతములోనే మీరు చూడగలరు.

బబులోనులో పితరులను ఆరాధించుట ప్రారంభమగుటయే గాక ప్రకృతిని ఆరాధించుట కూడా మొదలయినది. బబులోనులో దేవతలను సూర్యుడు మరియు చంద్రునితో గుర్తించుట ప్రారంభమాయెను. సృష్టిలోని ప్రధాన వస్తువు సూర్యుడు. అది వెలుగును ఇచ్చును, వేడిని ఇచ్చును, శక్తిని జన్మింపచేయును. ఆకాశములలో అది ఒక అగ్నిగోళము వలె కనిపించును. ఆ విధముగా వారి ప్రధానమగు దేవుడు సూర్యుడు, వారు దానిని బాల్ అని పిలచెడివారు. సూర్యుని వారు తరచుగా అగ్నిజ్వాలవలె చిత్రీకరించుట చూతుము. త్వరలోనే ఆ అగ్నిగోళము చుట్టూ సర్పము కనబడెను. సూర్యుని యొక్క గురుతుగా సర్పమును చిత్రీకరించుటకు ఎంతో కాలము పట్టలేదు మరియు క్రమముగా దానిని ఆరాధించుట ప్రారంభించిరి. ఆ విధముగా సాతాను యొక్క కోరిక పూర్తిగా కార్యరూపము ధరించినది. వాడు దేవునిగా ఆరాధింపబడెను. వాని యొక్క సింహాసనము స్థాపింపబడెను. వాని యొక్క బానిసలు వంగి నమస్కరించిరి. ఆ పేర్గములో సజీవ సర్పమునే ఆరాధింప మొదలిడిరి. మంచి, చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఇప్పుడు సజీవ సర్పములో సూచనగా చూపబడినది, అది అవ్వను మోసము చేయుటయే కాదు గాని మానవులలో ఎక్కువ మందిని మోసము చేసెను.

బబులోను దాని సింహాననముగా ఉండగా పెర్గమ ఎట్లు సాతాను యొక్క సింహాసనముగా మారినది? జవాబు మరల ఆ చరిత్రలోనే యున్నది. మాదీయులకు, పారసీకులకు బబులోను వశమయినప్పుడు, యాజక రాజగు అట్లాస్, పట్టణమును విడిచి పారిపోయెను. తన యొక్క యాజకులతోను మరియు పవిత్ర మర్మములతోను పెర్గమకు చేరెను. అక్కడితడు తన రాజ్యమును స్థాపించెను, అది రోమను సామ్రాజ్యమునకు వెలుపట యున్నది, మరియు అపవాది యొక్క బలము క్రింద స్థిరపడినది.

బబులోనీయ మతము యొక్క పురోగమనమునకు, అది పెర్గమలోనికి వచ్చుటను గూర్చిన చరిత్రకు ఇది క్లుప్త వివరణ. చాలా ప్రశ్నలకు జవాబులు లేకుండానే విడిచిపెట్టితిని, సందేహము లేదు, మనకు కనువిప్పు కలుగుటకు ఇదంతయూ చెప్పితిని, కాని ఇది చరిత్రను అధ్యయనము చేయుటకు ఉద్దేశించిన సమయము కాదు, వాక్యమును అధ్యయనము చేయుటలో సహాయపడుటకు దీనిని వినియోగించవలెను.

తప్పిదములు

ప్రకటన 2:14-15

"అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేమనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో యున్నారు.అటువలెనె నికొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు."

ఈ పెర్గమ కాలములో ప్రభువు ద్వేషించు రెండు సిద్దాంతములను గూర్చి తప్పు మోపుచున్నాడు: 1. విగ్రహారాధనను తీసికొని వచ్చిన బిలాము యొక్క బోధ. బయల్పెయోరు యొద్ద ఇశ్రాయేలీయులను విపరీతమగు పాపము చేయునట్లుగా ప్రోత్సహించెను; 2. నికొలాయితుల బోధ, అది ఇంతకు ముందుండినది, కానీ ఎఫెసు కాలములో క్రియలుగా ఉండినది. పెర్గమ సాతాను యొక్క సింహాసనముగా యున్నదని ఆయన నొక్కి చెప్పెను. ఈ వాస్తవమును ఆయన యొక్క నేరారోపణలతో జోడించండి. బాబెలు యొక్క మతము మొత్తం మీద ఏదో ఒక విధంగా క్రైస్తవ్యముతో కలిసిపోయినది అని మనము చాలా తేలిక గాను, ఖచ్చితముగాను చెప్పవచ్చును.

ఇది కేవలము ఊహాగానము కాదు గాని చారిత్రక సత్యము. దాదాపుగా క్రీ.శ. 36 యొద్దకు వెళ్ళి ఆ చరిత్ర ద్వారా మనము దానిని రుజవు చేయగలము. 325లోని నైసియను ఆలోచన సమితి యొద్దకు రండి. క్రైస్తవులు యెరూషలేము నుండి చెదరగొట్టబడిరి. (ముఖ్యంగా జన్మరీత్యా యూదులు) వారు చెదిరిపోయిన ప్రతి దేశములోను సువార్తను బోధించిరి, ముఖ్యంగా సమాజ మందిరములలో బోధించిరి. ఆ విధముగా మూడు సంవత్సరములలో లేదా దాదాపు క్రీ.శ. 36లో జూనియస్ మరియు ఆండోనికస్ల ద్వారా సువార్త రోమ్లోనికి వెళ్ళెను. రోమా 16:7 ప్రకారము, వారు అపోస్తలులు. చాలా సంవత్సరముల పాటు అక్కడ సేవ వర్ధిల్లెను. అయితే యూదులు నిరంతర ముతమలో తాము వివాదపడుట వలన క్లాడియస్ చక్రవర్తి వారిని రోమ్ నుండి బహిష్కరించెను. ఆ పట్టణములో నుండి యూదులు బహిష్కరించబడుట వలన ఆ చిన్న సంఘము యొక్క వెన్నెముక విరిగిపోయినట్లయినది. బహుశా ఆ పెద్దలు యూదులుగా యుండిరేమో గనుక అది కూడా పోయినది. సభ్యులు హాజరు కాలేదు మరియు మార్గదర్శిగా వాక్యము వ్రాయబడలేదు గనుక ఈ చిన్న మంద దారితొలగిపోవుట చాలా తేలికగా జరిగినది. లేక వేదాంత పండితులు వీరిని తేలికగా ఆ దినమున గల అన్యబోధవైపు త్రిప్పగలిగిరి. క్రూరమగు తోడేళ్ళ చొరబడినవి, మరియు క్రీస్తువిరోధి ఆత్మవిడుదల అయినది, ఈ రోమ్లోని చిన్న సంఘము భయంకరముగా వెనుకకు జారినదని మనము చరిత్ర ద్వారా కనుగొందుము. క్రైస్తవ బిరుదల క్రింద అన్య ఉత్సవములను పరిచయము చేయసాగిరి.

13 సంవత్సరముల పాటు ఈ బహిష్కరణ కొనసాగినందున పునాది వేసిన జూనియస్ మరియు ఆండ్రోనికస్లు క్రీ.శ. 54 వరకు తిరిగి రాలేదు. ఆ తరువాత వారు వచ్చు సరికి క్రైస్తవ పేరు కలిగిన అన్య సంఘమును చూచి ఎంతగా తల్లడిల్లియుందురో, మీరే ఊహించండి. ఆలయములో బలిపీఠములుండి దానిమీద వారు ధూపము వేయుచూ అన్య ఆచారములను అమలు చేయుచుండిరి. ఆ సంఘమును స్థాపించిన నాయకులు దగ్గరకు రాలేకపోయిరి, కావున నమ్మకముగా నిలచియున్న కొద్దిమంది విశ్వాసులు నూతన సంఘమును ఏర్పాటు చేసుకొనిరి. అది రోమ్లోని రెండవ సంఘము. దేవుడు తన కృపను వారిమధ్య కనుపరచి అద్భుతములు, సూచక క్రియలు జరిగించెను. అందువలన మూడవ సంఘము ప్రారంభమాయెను. అన్య ఆచారములతో కొనసాగుచున్న మొదటి సంఘమును నిందించినా గాని అది తనయొక్క పేరును వూర్చుకొనక ఆలాగే యుంచుకొనెను. దాని ఆరాధనలో క్రైస్తవులు లేరు, కాని ఇంకనూ అది రోమ్ యొక్క ప్రథమ సంఘముగానే నిలిచియున్నది — అదియే రోమను కాతలిక్కు చర్చి.

మనలో ఎక్కువ మందికి ఒక తప్పు అభిప్రాయమున్నది, అదేమనగా క్రైస్తవులుగా పిలువబడు వారినెవరినయినా గాని సాతాను గురిగా నిర్ణయించుకొనుననుకొందురు మరియు అందుకొరకు ప్రభుత్వము క్రూర కార్యములను చేయుచుండును. కాని అది తప్పు అభిప్రాయము. ఈ మొదటి సంఘము సంఖ్యలో పెరిగిపోయి విస్తరింపసాగినది, అది ప్రభుత్వములోని అధికారులు మరియు చక్రవర్తి కొన్ని రాజకీయ కారణముల వలన ఆ సంఘము పట్ల ఇష్టత చూపిరి.

ఆ ప్రకారముగా రోమ్లోని ప్రధమ సంఘ నాయకులు ప్రభుత్వములో చోటు సంపాదించుకొని ఆ అవకాశమును ఆసరాగా చేసికొని నిజ విశ్వాసులకు విరోధముగా పనిచేయుటకు ప్రభుత్వమును పురికొల్పిరి. తమ సంఘములోనికి రాని వారినందరనీ హింసించమని కోరిరి. రోమ్లోని ప్రథమ సంఘపు ఒక బిషప్పు అనిసిటస్ అట్టివాడే. అతడు రెండవ శతాబ్దములో జీవించెను. పాలికార్పుకు అతడు సమకాలికుడు.

రోమ్ యొక్క మొదటి క్రైస్తవ సంఘము అన్య ఉత్సవములలో పాలుపొంది, సువార్త సత్యమును చెరచివేసినదని రోషము గల పాలికార్పు విని వారిని మారమని చెప్పుటకు అతడు వచ్చెను. అపోస్తలులు మరియు పరిశుద్ధుల పేర్ల మీద విగ్రహములను చేసి వాటి ముందు సాష్టాంగపడుటను అతడు చూచెను. బలి పీఠముల మీద క్రొవ్వొత్తులు వెలిగించి ధూపము వేయుటను అతడు చూచెను. ఈస్టరు అను పేరు క్రింద వారు పస్కాను ఆచరించుట అతడు చూచెను. అక్కడ వారు గుండ్రని ఆకారములోనున్న రొట్టెను హెచ్చించి, సూర్య దేవుని ఘనపరచుటను అతడు చూచెను. దేవతలకు ద్రాక్షా రసమును వారు ఒక వేడుకగా పోయుచుండిరి. కానీ ఈ వృద్ధ-పరిశుద్ధుడు 1500 మైళ్ళ దూరము ప్రయాణించి వచ్చినా వారియొక్క దుస్థితిలో వారు మునగకుండా రక్షించలేకపోయెను. వెళ్ళిపోవుచుండగా అతని ద్వారా దేవుడు మాట్లాడెను. "ఎఫ్రాయీము తన విగ్రహములకు పెండ్లీచేయబడెను, వానిని ఆలాగే ఉండనీయుడి." హోషేయ 4:15, మరెన్నడూ పోలికార్పు తిరిగి రాలేదు.

ఎనిసిటిస్ తరువాత రోమ్ బిషప్పుగా దుర్మారుడగు విక్టర్ వచ్చెను. అతడు ఇంకా ఎక్కువ అన్య పండుగలను మరియు ఉత్సవములను మొదటి సంఘములో ప్రవేశపెట్టెను. అవే ఉద్దేశములను నిజమగు క్రైస్తవ సంఘము కూడా అమోదింపవలెనని అతడు తన శాయశక్తులా పనిచేసెను, కాని వారందుకు ఒప్పుకొనలేదు, వారిని అతడు బ్రతిమిలాడినా వినలేదని. అతడు ప్రభుత్వాధికారులను తన మాటచే త్రిప్పుకొని నిజవిశ్వాసులను హింసించుటకు పూనుకొనెను. వారిని కోర్టుకు ఈడ్చుచుండిరి, వారిని చెరసాలలో వేయుచుండిరి మరియు చాలా మందిని మరణమునకు కూడా గురిచేసిరి. అటువంటి దుష్ట క్రియలను గూర్చి చరిత్రలో చూడగలము. చక్రవర్తియగు సెప్టిమస్ సెవిరస్ యొక్క క్రియలు చూడండి, కాలిస్టస్ కంటే మించిపోయెను. (విక్టర్ యొక్క స్నేహితుడు) థెస్సలోనీకాలో 7000 మందిని చంపెను, ఎందుకనగా ఈ నిజవిశ్వాసులు పస్కాపండుగను ప్రభువైన యేసు ఆజ్ఞాపించిన ప్రకారము ఆచరించిరి గాని ఆస్టార్తే ఆరాధన ప్రకారము ఆచరించలేదు.

కారు ద్రాక్షావల్లి ఇప్పటికే దాని కోపమును వెళ్ళగ్రక్కుచున్నది. దేవుని యొక్క జీవము గల ఏర్పరచబడిన వారిని చంపుచున్నది. కయీను హేబెలును చంపినట్లే యున్నది.

మొదట సంఘమును మూరుమనస్సు పొందించవలెనని నిజసంఘము ఇంకా ప్రయత్నించుచునే యున్నది. కాని అది ఆ విధముగా చేయలేకపోయెను. దాని పరిమాణము మరియు ప్రభావము చాలా విస్తరించెను. నిజ సంతానమును తుడిచి పెట్టుటకై అది ఒక ఎడతెగని పోరాటమును సలిపినది. వారు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజ సంతానమని లేక నిజ ప్రతినిధులమని చెప్పుకొనసాగిరి. రోమ్లో తమదే అసలయిన సంఘమని చెప్పసాగిరి. వారు మాత్రమే మొదటి సంఘము అని గొప్ప చెప్పుకొనిరి. నిజంగానే వారు మొదటి సంఘమై యున్నారు, వారు నిశ్చయంగానే ప్రధమ సంఘము.

ఆ విధముగా ఈ మూడవ సంఘ కాలమునకు రెండు సంఘములు ఒకే పేరుతో తయారగుట మనము చూతుము, కాని వాటి మధ్య గొప్ప తేడాయున్నది. ఒకటి సత్యము నుండి తొలగిపోయి, విగ్రహములను పెండ్లిచేసికొని జీవము లేనిదిగా యున్నది. అది సంకరపు సంతానముగా మారినది. దాని యొక్క కదలికలలో మరణ ఛాయలు కనబడినవి. (జీవము లేదు) చాలా సభ్యులతో అది బలముగా యున్నది. లోకము యొక్క బలము దానికున్నది. ఇంకొకటి హింసింపబడుచున్న చిన్న గుంపుగా యున్నది. కాని అది వాక్యమును వెంబడించియున్నది, సూచన క్రియలు ఆమెలో కనబడుచున్నవి. రోగులు స్వస్థత పొందిరి, మృతులు సజీవులయిరి. ఆమె జీవముతో కదులుచూ యున్నది. ఆమె తన జీవితమును ప్రేమించుట లేదు కానీ ఆయన నామమును పట్టుకొనియున్నది. మరియు మరణము ఎదురయినా గాని ఆయన విశ్వాసమును వదలలేదు.

అధికార రోమ్ యొక్క భయంకర హింస, కాన్స్టాంటైన్ వచ్చి మత ఆరాధనా స్వతంత్రమును ఇచ్చు వరకు కూడా నిజవిశ్వాసుల మీదకు వచ్చినది. ఈ స్వతంత్రముము ఎందుకీయ్యబడినదో రెండు కారణములు కనబడుచున్నవి. మొదటిగా ఆయా మంచి చక్రవర్తులు హింసము అనుమతించలేదు కాని కాలక్రమేణా వారు కూడా క్రైస్తవులను చంపిన వారినే అనుసరించసాగిరి. క్రైస్తవులను ఒంటరిగా విడిచిపెట్టవలెనని చివరికి ప్రజలకు మనవి చేసిరి. ఎంత మతిలేని విధంగా వారు ప్రవర్తించిరో దీనిని బట్టి అర్థము చేసికొనవచ్చును. బాగుగా గుర్తింపదగిన రెండవ కారణమును చూడండి. కాన్స్టాంటైన్ తన సామ్రాజ్యమును అదుపులో ఉంచుకొనుటకు చాలా కఠినమగు యుద్ధమును ఎదుర్కొనవలసి వచ్చెను. ఒక రాత్రి స్వప్నమందు ఒక తెల్లని సిలువను అతడు తన ఎదుట చూచెను. క్రైస్తవులు తన విజయము కొరకు ప్రార్థన చేసినయెడల తాను జయము పొందుదునని, అందుకు ఇది శుభసూచన అని అతడు భావించెను. తాను ఈ విషయములో జయము పొందినయెడల స్వతంత్రము ఇచ్చుదునని వారికి వాగ్ధానము చేసెను. ఆలాగే అతడు జయమును పొంది వచ్చి క్రీ.శ 312లో నాన్టెస్ పత్రము ప్రకారముగా ఆరాధనా స్వతంత్రమును ఇచ్చెను.

హింస మరియు మరణము నుండి విముక్తి పొందుటకు ఇతడిచ్చిన స్వతంత్రము మొదట కనబడినంత ఉదారముగా లేదు. ఇప్పుడు కాన్స్టాంటైన్ ఒక అమలు చేయు అధికారివలె హోదా పొందెను. అమలు చేయవలసిన వాడు ప్రేక్షకునివలె సర్దుకొనిపోలేడు గదా, సంఘము యొక్క వ్యవహారములలో తాను కూడా సహాయపడుటకు తీర్మానించుకొనెను. ఆయా విషయముల మీద వారు భేదములు కలిగియున్నట్లు అతడు చూచెను. అలెగ్జాండర్ బిషప్ అగు ఏరియస్ తన అనుచరులకు యేసు కేవలము దేవుడు అనుట తప్పు అనియు, దేవునికంటె తక్కువవాడనియు, దేవుని ద్వారా సృజింపబడిన వాడనియు చెప్పెను. పాశ్చాత్య సంఘము అందుకు భిన్నమైన అభిప్రాయమును కలిగి యుండెను. యేసు దేవుడనియు, "ఆయన తండ్రితో సరిసమానుడనియు" వారు నమ్ముచుండిరి. ఇటువంటి సంగతులతో పాటు అన్య ఆచారములు ఆరాధనలోనికి ప్రవేశించి, 325లో చక్రవర్తి నైసీన్ ఆలోచన సభను ఏర్పాటు చేసెను. అన్ని గుంపులను ఏకము చేయవచ్చునని, అక్కడ వారు తమ భేదములను విస్మరించి ఒక సామాన్య అవగాహనకు వచ్చుదురని అందరూ ఒక్కటగుదురని తలంచెను. ఇది చాలా వింతగా లేదా? ఇది కాన్స్టాంటైన్ తో ప్రారంభమయినా గాని చనిపోలేదు, నేటికిని ఇంకా అది సజీవముగానే యున్నది. "ప్రపంచ సంఘ సమితిగా అనునది వింతగా లేదా?" నిజంగా ఆనాడు అతడు సాధించవలెననుకొనినది, ఈనాడు ఈ ప్రపంచ సంఘ ఉద్యమము ద్వారా సాధించబడుచున్నది.

ఇప్పుడు సంఘముతో రాజ్యము జోక్యము చేసికొనుట ఒక బుద్ధిహీన సంగతి, ఎందుకనగా వాక్యములో యుండు సత్యమును గాని, సంఘ విధానములను గాని లోకము అర్థము చేసికొనజాలదు. ఎందుకు, ఏరియస్ చెప్పినది తప్పు అని సభవారి ద్వారా అమోదించబడిన దానిని, రెండు సంవత్సరముల తరువాత చక్రవర్తి కొట్టివేసెను. చాలా సంవత్సరముల పాటు ఆ తప్పు సిద్దాంతము జనులమీద రుద్దబడెను.

సంఘము మరియు రాజ్యము ఏకమగునను సంగతి ప్రభునకు ముందే తెలియును. పెర్గమ అను మాటకు పూర్తిగా "తరచూ వివాహము చేసికొనెడి" అని అర్ధము. నిజంగానే సంఘము మరియు రాజ్యము పెండ్లీచేసికొనినవి; రాజకీయము మరియు మతము ఏకమయినవి. ఈ ఐక్యత వలన పుట్టినది అతి భయంకరమగు సంకర సంతానము. ప్రపంచము ముందెన్నడూ అటువంటిది ఎరుగదు. వారిలో సత్యము లేదు, కానీ కయీను యొక్క చెడు మార్గములన్నియూ యున్నవి. (మొదటి సంకర జాతి)

ఈ కాలములో రాజ్యము మరియు సంఘము ఏకమగుటయే కాదు గాని బాబెలు యొక్క మతము మొదటి సంఘములో అధికారపూర్వకంగా విలీనమయినది. ఇప్పుడు క్రీస్తు యొక్క నామమును సాతాను వాడుకొనుచూ మరియు ఆరాధించుటలో దేవుని యొక్క సింహాసనమును అతడు పొందెను. రాజ్యాధికారుల సహాయముతో అందమగు కట్టడములకు సంఘములు పడిపోయినవి. తెల్లని చలువ రాళ్ళతో బలిపీఠములను నిర్మించిరి, చనిపోయిన పరిశుదుల యొక్క విగ్రహములను ప్రతిష్టించిరి. ఈ కాలములోనే ప్రకటన 13:3లో చెప్పబడిన మృగము మరణమగునంతగా గాయపరచబడినది: (అన్య రోమా సామ్రాజ్యము) అది మరల జీవమును పొంది "పరిశుద్ధ రోమా సామ్రాజ్యముగా" అధికారము పొందినది. రోమ్ ఒక వస్తు సంబంధమగు రాజ్యముగా చాలా శ్రమపడినది. ఇంకా సంపూర్తిగా శ్రమ పడవలసినపని దానికున్నది; కాని ఇప్పుడు దానిని లెక్కచేయలేదు, ఎందుకనగా దాని యొక్క మతసంబంధమగు రాజ్యము దానిని ప్రపంచములో పైన ఉంచి అది లోన దాగియుండి పరిపాలన చేయును. ఆ విధముగా చేయుచున్నట్లు పైకి కనిపించదు.

ఈ సంగతిని గూర్చిన పూర్తి లేఖన సత్యమును మీకు చూపించెదను, ఎందుకనగా నేను నా స్వంత వివరణ ఇచ్చుచున్నట్లు ఎవరునూ తలంచరాదు — లేఖనములో లేని ప్రత్యక్షతను ఇయ్యను.

దానియేలు 2:31-45,

"రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా? ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమునుగలదై తమరియెదుట నిలిచెను.ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమై బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములును వెండివియు దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను.మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్లు తమకు కనబడెను.అంతట ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వె౦డియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా; వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను.తాము కనిన కల ఇదే; దాని భావము రాజు సముఖమున మేము తెలియ చెప్పెదము.రాజా, పరలోకమందున్న దేవుడు, రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించియున్నాడు. తమరు రాజులకు రాజైయున్నారు.ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును, మనుష్యలనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతికప్పగించియున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించియున్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు.తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటు తరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది ఇత్తడి వంటిదగును.పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుమువలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టునది కదా? ఇనుము పగులగొట్టనట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును.పాదములును వ్రేళ్ళును కొంత మట్టనగు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్లు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్లు కనబడెను గనుక ఆరాజ్యములో ఆలాగుననుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలముగలదై యుండును.పాదముల వ్రేళ్ళు కొంతమటునకు ఇనుపవిగాను, కొంతమటునకు మట్టివిగానుఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును.ఇనుమును బురదయు మిళితము అయి యుండుట తమరికి కనబడెను. అటువలె మనుష్య జాతులు మిళితములై ఇనుము, మట్టితో అతకనట్టు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు.ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలచును.చేతి సహాయము లేక పర్వతము నుండి తియ్యబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహా దేవుడు ముందు జరుగబోవు సంగతి రాజనకు తెలియజేసియున్నాడు. కల నిశ్చయము. దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను."

భవిష్యత్తు యొక్క ఖచ్చితమగు ప్రత్యక్షత ఇక్కడ చూడగలము. నెరవేరని చరిత్ర ఈ భూమి మీదికి రానున్నదని ముందుగా ప్రవచింపబడెను. దానియేలు కాలమునుండి యేసు వచ్చి దావీదు కుమారునిగా పరిపాలించు కాలము వరకు జరుగు సంగతులవి. "అన్యుల కాలములు" అని దీనిని చెప్పుట మనకు తెలియును, దానిలో నాలుగు చారిత్రక విభాగములున్నవి. అవి ఒక్కొక్కటి తమ సామ్రాజ్యమును తిరుగులేని విధంగా ఏలుచున్నవి. అవి ఏమిటో మనకు తెలియును; బాబిలోనియను, మధ్య పర్షియను, గ్రీసియను, రోమను.

అన్నిటికంటె గొప్పది మరియు అతి సంపూర్ణ ఏకచ్ఛత్రాధిపత్యము కలిగినది బాబిలోనియను. బంగారు శిరస్సుగా దానిని ఉదహరించెను.

ఆ తరువాత మహిమలో నుండినది మధ్య పర్షియను. అది కొద్ది తక్కువగా మహిమను కలిగియుండినదని చరిత్ర ద్వారా మనకు తెలియును. దాని భుజములును, రొమ్మును వెండివి అని పోల్చబడెను.

ఆ తరువాత గ్రీకుల యుగము వచ్చినది. దాని రాజు, సైనిక నాయకులందరిలోనూ అతి గొప్పవాడు. ప్రపంచము అట్టివానిని ఎన్నడూ చూచియుండలేదు. దాని ఉదరమును, తొడలును ఇత్తడివి. ఆ పోలిక చక్కగా తగియున్నది. దానికి ముందున్న రెండు రాజ్యములకంటె కొద్దిగా తక్కువ మహిమ కలిగినది ఇది.

ఆఖరిగా చివరి రాజ్యము వచ్చెను. అదే రోమా సామ్రాజ్యము. మోకాళ్ళు మరియు పాదములు దానికి మాదిరిగా యున్నవి. దీనికి ముందున్న రాజ్యములు శుద్ధ ఖనిజములుగా పోల్చి చూపబడినవి! (శుద్ధ బంగారము, వెండి మరియు ఇత్తడి) ఈ చివరి సామ్రాజ్యములో శుద్ధ ఇనుమును మోకాళ్ళు మాత్రమే కలిగియుండినవి. దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునైయుండెను. మట్టి మరియు లోహము మిశ్రమము కావు. అందువలన బలము గాని, స్థిరత్వము గాని ఉత్పత్తి కాదు. ఇంత మాత్రమే కాదు గాని ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఒకటున్నది. ఈ చివరి సామ్రాజ్యము (రోమను) యేసు తిరిగి వచ్చువరకు దాని యొక్క ఈ "వింత కలగలుపు" స్థితిలోనే కొనసాగును.

ఇనుముతో కూడిన ఈ రోమను సామ్రాజ్యము రెండు ప్రధాన విభాగములతో కూడియుండెను. (ఇనుము, అధికారమునకును, ప్రతి పక్షమును నాశనము చేయు మహాశక్తికిని, సూచనగా యున్నది) నిశ్చయముగా ఆ సామ్రాజ్యము రెండుగా చీలిపోవును — తూర్పు మరియు పడమర, రెండునూ చాలా శక్తివంతమైనవే. అవి తమ ఎదుటికి వచ్చిన వారికి తుత్తునియలు చేయును.

అన్ని సామ్రాజ్యముల యొక్క మహిమ మరియు అధికారము ఉడిగిపోయెను. గనుక ఈ సామ్రాజ్యము కూడా పతనమగుట ప్రారంభమగును. ఆ విధంగా రోమ్ పతనమాయెను. అన్య రోమా సామ్రాజ్యము ఇక ఇనుముగా లేదు. అది పడిపోయెను. అది చావుదెబ్బ తినెను. ఇప్పుడు రోమ్ పరిపాలించజాలదు. దాని పని సమాప్తమయినది. ప్రపంచము ఆ విధంగా భావించెను. కొని ప్రపంచ భావన ఎంత తప్పో చూడండి. ఆ శిరస్సు గాయపడినా గాని అది చావలేదు. (రోమ్) చావుదెబ్బ తినినది. (ప్రకటన 13:3నకు వస్ట్ అనువాదము చూడండి. "వాని శిరస్సులలో ఒకటి శరీర సంబంధముగా గాయపడినట్లుగా కనిపించెను. కంఠము మూగవోయినట్లు కనిపించెను, కాని వాని చావుదెబ్బ నయమాయెను. సర్వ ప్రపంచము ఆశ్చర్యముతో ఆ దుష్ట మృగమును వెంబడించెను.")

జనులు రోమ్ వైపు చూచెదరు. వారు ఇటలీ దేశమువైపు చూచెదరు. వారు చూచుచుండగా ఆ దేశములోయున్న మరో దేశమును మాత్రము గమనించరు. రోమ్ చాలా కఠినముగా వ్యవహరించును, అందులో పోపుకు వాస్తవంగా కొంత భూమియున్నది, ఒక దేశములోని దేశములో అతనికి నిజంగా అధికారమున్నది. దానికి రాయబారులున్నారు. అది రాయబారులను స్వీకరించును. పోపుల అబద్ధ క్రైస్తవ రోమ్ (దానిని నిత్య పట్టణమని కూడా పిలిచారు — ఎంత దేవదూషణ) ఇప్పుడు మతము ద్వారా నియంత్రణ చేయుచున్నది. అన్య రోమా సామ్రాజ్యము శుద్ధ ఇనుప శక్తి ద్వారా ఏలినదానికంటె ఇంకా ఎక్కువ సామర్ధ్యము ఇది ఇప్పుడు ఏలుచున్నది. రోమ్ మరోవిధమగు నూతన జన్మను పొందినది. కాన్స్టాంటైన్ సంఘమును మరియు రాజ్యమును ఏకము చేసినపుడు దాని బలము మరల కూడగట్టుకొనినది. అన్య రోమాను నడిపించిన ఆ ఆత్మయే ఇప్పుడు అబద్ద క్రైస్తవ రోమ్ను నడిపించుచున్నది. దానిని మీరు చూడగలరు, ఎందుకనగా నాలుగవ సామ్రాజ్యము ఉనికిలో లేకుండా పోయినట్లు ఎక్కడా మీరు చూడరు; దాని యొక్క వెలుపటి ఆకారము మాత్రమే మారినది.

ఒకప్పుడు నైసీస్ ఆలోచన సభ, రాజకీయ రోమ్ యొక్క శక్తిని సంఘమునకు ఇచ్చినప్పుడు ఈ మొదటి క్రైస్తవసంఘము ఎక్కడికి వెళ్ళునో అసలు హద్దులు కూడా కనిపించలేదు. క్రైస్తవులు అను నామమువలననే హింస ప్రజ్వరిల్లినది. ఇప్పుడు వారే హింసించు వారుగా మారిరి. ఈ కాలములోనే హిప్పో వాసియగు ఆగస్టిన్ (354-430) ఒక సూత్రమును ప్రవేశపెట్టెను, అదేమనగా: సంఘము తన పిల్లలను మందలోనికి తిరిగి తీసికొని వచ్చుటకు అవసరమయితే తప్పకుండా బలమును ప్రయోగించవచ్చునని చెప్పెను. మత భ్రష్టులను, విశ్వాస భ్రష్టులను చంపుట దేవుని వాక్యానుసారముగా సరియేనని చెప్పెను. డొనాటిస్టులతో అతనికి వచ్చిన విభేదములను గూర్చి వ్రాసినది ఉన్నది… "బోధించుట ద్వారా మనుష్యులు దేవునిని ఆరాధించుటకు నడిపించబడినచో నిశ్చయంగా మంచిదే. శిక్ష వచ్చును లేదా శ్రమ వచ్చును గనుక ఆరాధించవలెనను ఉద్దేశ్యము కంటే కూడా అది మంచిదే, కాని అది ఒక్కటే మార్గము కాదు, ఎందుకనగా ఆ ముందు పద్ధతి వలన మంచి మనుష్యులు తయారగుదురు. కాని అందుకు లోబడని వారిని వదలి ఊరుకొనుట మంచిది కాదు, ఎందుకనగా భయము మరియు హింస ద్వారా మొదటిగా వత్తిడి పెట్టి దారి మళ్ళింపబడినవారు ఆ తరువాత ఉపదేశము ద్వారా చాలా లాభము పొందుచున్నారు. (దానిని మేము నిరూపించియున్నాము. వాస్తవ అనుభవము ద్వారా అను దినము రుజువు చేయుచున్నాము) వారు ముందు మాటల ద్వారా నేర్చుకొన్నదానిని ఇప్పుడు క్రియాపూర్వకముగా వెంబడించెదరు. ప్రేమద్వారా నడిపించబడినవారు మంచిగానే యుందురు, కాని భయపెట్టి సరిదిద్దబడినవారు నిశ్చయంగా చాలా ఎక్కువగా యుందురు. గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టిన క్రీస్తు కంటె ఎక్కువగా మనలను ప్రేమించకలిగిన వారెవరున్నారు?

ఆయన తన మాట ద్వారా పేతురును, ఇతర అపోస్తలులను పిలచిన తరువాత ఆయన పౌలును పిలిచిన విధము చూడండి. ఆయన తన స్వరముతో అతనిని బలవంతపరచుటయే గాక తన శక్తితో ఆయన అతనిని నేలమీద పడగొట్టెను. ఆ విధంగా ఆయన బలాత్కారముగా అతనిని పట్టుకొనెను, ఎందుకనగా అతడు గాడా౦ధకారములో కొట్టుకొనుచున్నాడు. హృదయమునకు వెలుగు కావలెనని కోరుచున్నాడు. ఆయన మొదటగా అతనిని శరీర సంబంధమగు గ్రుడ్డితనముతో మొత్తెను. కాబట్టి నశించిపోయిన తన కుమారులను మళ్ళించుటకు సంఘము ఎందుకు బలమును వాడరాదు? రాజ మార్గములలోనికిని, సందుల లోనికిని, వెళ్ళివారిని బలవంతముగా తీసికొని రండని ప్రభువు ఎందుకు చెప్పెను? దైవనిర్ణయము ద్వారా సంఘము శక్తిని, అధికారమును పొందినది. దాని కాలమును బట్టి అది పనిచేయవలెను. మతపూర్వక గుణశీలము ద్వారాను, రాజల యొక్క విశ్వాసము ద్వారాను అది ఒక సాధనముగా వాడబడుచున్నది. రాజమార్గములలోను, సందులలోను కొందరున్నారు, వారెవరనగా మతభ్రష్టులు మరియు విశ్వాస విచ్ఛేదకులు, వారిని బలవంతముగా లోనికి తీసికొనిరావలెను, కావున బలాత్కారము ద్వారా తీసికొని వచ్చుట తప్పు కాదు."

రక్తము కొరకయిన దాహము పెరుగుచున్నది. స్పెయిన్లోని కారు ద్రాక్షావల్లి, చక్రవర్తులను అండగా చేసికొని, వాక్యమును, సూచక క్రియలను, అద్భుతములను కలిగియుండిన నిజవిశ్వాసుల మీదికి దాడిని నిర్వహించుటలో పాత్ర వహించినది. ఆ విధముగా కొందరు ప్రిసిలియనులను బిషప్ ఇతాక స్ట్రెవస్ యొద్దకు తెచ్చెను. (385) అతడు వారిమీద చేతబడితనము, అవనీతి ఆరోపణల చేసి ఉరి తీయించెను. టూర్స్ వాసియగు మార్టిన్, మిలన్ వాసియగు ఆంబ్రోస్, దీనిని ఎదిరించిరి. ఈ హింసను ఆపవలెనని వారు వాదించిరి గాని విఫలమయిన ఆ హింస పొడిగించబడినప్పుడు ఈ ఇద్దరు బిషప్పులు, హైడాటస్, ఇంకా ఇతర అటువంటి బిషప్పులతో సహవాసము చేయుటను తెంచుకొనిరి. ట్రివిస్లోనున్న సినడ్ ఆ హంతకుల పక్షముగా నిలబడుట ఇంకా వింతగా నున్నది.

ఈ సమయము నుండి, ముఖ్యముగా అంధకార యుగములలో, శరీర సంబంధులగు వారు ఆత్మ సంబంధులగు పిల్లలలను హింసించి, నాశనము చేయుట మనము చూతుము. వారిరువురూ ఒకే తండ్రి పిల్లలమని చెప్పుకొందురు, ఇష్మాయేలు మరియు ఇస్సాకులవలె. ఆత్మ సంబంధమగు చెడుతనము యొక్క చీకటి ఇంకా ఎక్కువగును మరియు దేవుని యొక్క నిజవెలుగు గతించును, సంఖ్యను బట్టి చూచినయెడల అది చాలా బలహీనముగా వెలుగును. అయినా గాని దేవుని వాగ్దానము నిజముగానే యుండును. "ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను, కాని ఆ చీకటి దానిని గ్రహింపకుండెను."

ఈ సమయము వరకు నేను, వాగ్దానము చేసిన ఆ చరిత్రలోని అంశమును చెప్పనే లేదు, అదేమనగా: నిమ్రోదు యొక్క మతమును మరియు క్రైస్తవ మతమును కలగలుపు చేయుట. బాబెలు నుండి పెర్గముకు అట్లాస్ పారిపోయి, రోమను సామ్రాజ్యమునకు అందని చోట తన రాజ్యమును ఏర్పరచుకొనెను. అది చాలా సంవత్సరముల పాటు వృద్ధి చెందెను, ఈ యుగసంబంధమగు దేవత ద్వారా ఆశీర్వదించబడెను. అట్లాస్ తరువాత యాజక రాజుల క్రమము ఆరంభమాయెను. అట్లాస్ III పరిపాలన వరకు అది జరిగెను. అతడు తన రాజ్యమును రోమ్ కు అప్పగించెను. సార్వభౌముడగు దేవునికి మాత్రమే ఈ కారణములు తెలియును. శరీరసంబంధమగు రాజ్యమును మరియు ఆత్మసంబంధమగు రాజ్యమును, అనగా రెండింటినీ జూలియస్ సిజరు తీసికొనెను. బబులోనీయ మతమునకు అతడు పొంటి ఫ్మాక్సిమస్ అయ్యెను. ఆ విధముగా అతడొక యాజక రాజు. ఆ తరువాత వచ్చిన చక్రవర్తులకును ఈ బిరుదు వర్తించెను, కాని ఇది మాక్సిమస్ III వరకే సాగెను, ఎందుకనగా అతడు దానిని నిరాకరించెను. స్టీవెన్స్ చరిత్ర ప్రకారము చక్రవర్తి నిరాకరించిన ప్రధానత్వమును పోపు తీసికొనుట అప్పుడు ప్రారంభమాయెను. ఈ రోజున ఇంకా లోకములో పొంటిఫ్ యున్నది, అతడు నిజంగానే పొంటిఫ్ మాక్సిమస్. అతడు త్రికోణ కిరీటము ధరించి రోమ్ లో నివాసము చేయును. ప్రకటన 17లో దేవుడు పెర్గమును సాతాను సింహాసనమున్న స్థలముగా ఇక చెప్పలేదు. సాతాను ఎక్కడ కాపురముండెనో ఆయన చెప్పలేదు. సింహాసనమున్న చోటు ఇక పెర్గము కాదు, అది మర్మమైయున్న బబులోను. అది బబులోనులో లేదు గాని మర్మమైయున్న బబులోనులో యున్నది. ఏడు కొండల మీద గల పట్టణములో అది యున్నది. దాని యొక్క శిరస్సు క్రీస్తు విరోధి, ఎందుకనగా ఆతడు క్రీస్తుయొక్క స్థానము అన్యాయముగా ఆక్రమించుకొనెను. ఎందుకనగా క్రీస్తు మాత్రమే మధ్యవర్తి, ఆయన మాత్రమే పాపములను క్షమించగలడు. అవును. నేడు పొంటిఫ్ మాక్సిమస్ మనతోనే ఉన్నాడు.

నీకొలాయితుల బోధ

ప్రకటన 2:15,

"అటువలెనె నీకోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు."

మీకు గుర్తిండియుండును, ఎఫెసు సంఘకాలము గూర్చి చెప్పినప్పుడే నేను ఈ మాటను చెప్పాను. నీకొలాయితు అను పదము రెండు గ్రీకు మాటల కలయిక: నికో అనగా "జయించుట" అనియు, లావో అనగా "అర్ఛకేతరులు" అనియు అర్ధము. నీకోలాయితు అనగా "అర్చకులు కాని వారిని జయించుట" అని అర్థము. ఇది ఎందువలన అంత భయంకరమగు విషయము? అది భయంకరమే, ఎందుకనగా దేవుడు తన సంఘమును ఎన్నడును కూడా ఎన్నుకొనబడిన నాయకత్వపు హస్తములలో యుంచడు. వారు రాజకీయ బుద్ధితో మొలగుదురు. ఆయన తన సంఘమును దేవుని చేత అభిషేకించబడిన, ఆత్మచే నింపబడిన, వాక్యముచే జీవించుచున్నవారి చేతులలో ఉంచెను, వారు వాక్యముతో జనులను పోషించుచూ నడిపించెదరు. ఆయన జనులను తరగతులుగా విడదీయలేదు. ఆ జనులను పరిశుద్ధ యాజకత్వము నడిపించవలెనని కోరలేదు. నాయకత్వము తప్పకుండా పరిశుద్ధముగా ఉండవలెననునది నిజమే. అయితే సమాజమంతయూ ఆలాగే యుండవలెను. అంతే కాకుండా దేవునికిని మరియు జనుల మధ్య యాజకులు లేదా సేవకులు లేదా అటువంటివారెవరూ మధ్యవర్తులుగా వాక్యములో ఎక్కడా లేరు. ప్రభువును ఆరాధించుటకు ఆ విధంగా విభాగించబడినట్లు ఎక్కడనూ లేదు. అందరూ కలిసి తనను ప్రేమించి సేవించవలెనని దేవుడు కోరుకొనెను. ఆ నీతి సూత్రములను నీకొలాతిజము నాశనము చేసి ఇందుకు బదులుగా జనులనుండి యాజకులను వేరుగా చేసి, వారిని సేవకులుగా ఉంచుటకు బదులుగా ప్రభువులు గాను, నాయకులు గాను చేయును.

ఈ బోధ ఆ మొదటి కాలములో ముందు ఒక క్రియగా ప్రారంభమాయెను. ఆ సమస్య రెండు మాటల్లో వచ్చినది. 'పెద్దలు,' (ప్రెస్బిటర్) 'కాయువారు.' (బిషప్పులు) ప్రతి సంఘములోను చాలామంది పెద్దలు ఉండినట్లుగా వాక్యము చెప్పుచున్నాగాని, కొందరు ఈ బిషప్పు యొక్క ఉద్దేశ్యమును వ్యక్తపరచిరి. (వారిలో ఇగ్నేషియస్ ఒకడు) బిషప్పు అనగా పెద్దల మీద ఆధిక్యతను, అధికారమును, నియంత్రణను కలిగియుండువాడని వారి అభిప్రాయము.

ఈ విషయములోని సత్యము, 'పెద్ద' అను పదము వ్యక్తిని చూపించుచున్నది, కానీ 'బిషప్పు' అను పదము వ్యక్తి యొక్క కార్యములను చూపించుచున్నది. పెద్ద అనగా ఒక మనిషి, బిషప్పు అనగా వ్యక్తి యొక్క కార్యాలయము. పెద్ద అను పదము ఒక వ్యక్తి యొక్క సాంక్రమిక వయస్సును సామాన్యముగా ప్రభువు యొక్క కాలములలో తెలియచేయును. అతడు ఎన్నుకోబడినందువలన గాని, లేదా అభిషేకించబడినందువలన గాని, పెద్దగా యుండలేదు గాని; అతడు పెద్దవాడై యున్నాడు. అతనికి ఎక్కువ వయస్సున్నది, శిక్షణ యున్నది, క్రొత్తవాడు కాడు, నమ్మదగిన వాడు. ఎందుకనగా అతనికి క్రైస్తవ అనుభవమునకు రుజువు చాలా కాలము నుండి యున్నది.

కాని బిషప్పులు ఆలాగు లేరు. వారు పౌలు యొక్క పత్రికలను వెంబడించరు. పైగా వారు అపో. కా. 20లోని ఎఫెసు నుండి మెలితే వరకు "పెద్దలను" ఏర్పరచిన పౌలు యొక్క కాలమును లెక్కలోనికి తీసికొందురు. 17వచనములో ఇట్లున్నది. "పెద్దలు పిలువబడిరి. 28వ చనములో వారిని కాయువారిగా పిలచెను (బిషప్పులు). ఈ బిషప్పులు (రాజకీయ బుద్ధి మరియు అధికార దాహముగలవారని నిస్సందేహముగా చెప్పవచ్చును) ఇంకా గట్టిగా పౌలు చెప్పినదానికి అర్థము చెప్పెదరు. మందను కాయువారు స్థానిక పెద్దలకన్న గొప్పవారని వారందురు. పెద్దలకు తమ స్వంత సంఘములో మాత్రమే అధికార హోదా యున్నదని వారందురు. చాలా మంది స్థానిక నాయకుల మీద విస్తరించబడిన అధికారము బిషప్పుకున్నదని వారందురు. అటువంటి అభిప్రాయము లేఖనసంబంధమైనదీ కాదు లేక చారిత్రకమైనదీ కాదు. పోలికార్పు వంటి అంత గొప్ప వ్యక్తిత్వము గల వ్యక్తి కూడా ఆ సంస్థను ఆదరించెను.

ఆ విధముగా మొదటి కాలములో ఒక క్రియవలె ప్రారంభమయినది. తరువాత అక్షరాలా బోధగా మారినది. నేటికిని ఆలాగునే యున్నది. మనుష్యులను లోబరచుకొను అధికారము కొరకు ఇంకా బిషప్పులు వంతపలుకుచున్నారు. తమకిష్టమొచ్చినట్టుగా ప్రజలతో వ్యవహరించుచున్నారు. సేవలో వారు ఆలాగుండవలెనని ఎక్కడున్నదో లేఖనములో చూపించుకొందురు. ఇందువలన వీరు పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమును నిరాకరించుచున్నారు. "వారిని నేను పిలచిన పనికొరకు పౌలును, బర్నబాను ప్రత్యేకించుము," అని పరిశుద్ధాత్మ చెప్పెను. ఇది వాక్య విరోధము మరియు క్రీస్తుకు విరోధము.

మత్తయి 20:25-28,

"గనుక యేసు తన యొద్దకు వారిని పిలచి — అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును.మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో, వాడు మీ పరిచారకుడైయుండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో, వాడు మీ దాసుడై యుండవలెను.ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను."

మత్తయి 23:8-9,

"మీరైతే బోధకులని పిలువబడవద్దు: ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు: ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు."

దీనిని ఇంకా ఎక్కువగా స్పష్టపరచుటకు నికొలాయితిజంను ఈలాగు వివరించెదను.

ప్రకటన 13:3లో చెప్పబడినది మీకు గుర్తిండియుండును,

"దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి."

ఆ గాయపడిన శిరస్సు అన్య రోమా సామ్రాజ్యము అని ఇప్పుడు మనకు తెలియును. అది గొప్ప ప్రపంచ రాజకీయాధికారము. ఈ శిరస్సు మరల లేచినది, అదియే "రోమను కాథలిక్కు ఆత్మసంబంధమగు రాజ్యము." ఇప్పుడు దీనిని జాగ్రత్తగా గమనించండి. రాజకీయ అన్య రోమ్ తన విజయమునకు ప్రాతిపదికగా ఏమి చేసెను? అది "విభజించి, జయమును పొందినది." అది రోమ్ యొక్క బీజమైయున్నది — పరిపాలన కొరకు విభాగించి తద్వారా జయించినది. ఆమె యొక్క ఇనుప పండ్లు ఎందరినో చీల్చి మ్రింగినవి. ఆమె ఎవరినీ చీల్చి మ్రి౦గెనో వారు మరల లేవలేకపోయిరి. కార్తేజ్ ను ఆమె నాశనము చేసినది, దానిని ఉప్పుకు విసిరివేసినది. అదే ఇనుప బీజము ఇంకా ఆమెలో నిలచియున్నది. ఆమె అబద్ధ సంఘముగా తిరిగి లేచినది. ఆమె యొక్క విధానము ఎప్పటివలెనె మిగిలియున్నది — విభజించి జయించినది. అదే నీకొలాయితిజము. దానిని దేవుడు ద్వేషించును.

పేరొందిన చారిత్రక ఆధారము ఏదనగా ఈ తప్పు సంఘములోనికి ప్రాకినది, జనులు బిషప్పు పదవి కొరకు పోటీ పడసాగిరి. దీని ఫలితముగా ఈ పదవిని ఎక్కువగా చదువుకొనిన వ్యక్తికి, లోకసంబంధముగా వర్దిల్లుచున్న వ్యక్తికి, మరియు రాజకీయ మనస్సు గలవారికి ఇచ్చుట జరిగినది. మానవ జ్ఞానము మరియు కార్యక్రమము. దేవుని యొక్క జ్ఞానమును స్థానమును ఆక్రమించసాగినవి. పరిశుద్ధాత్మ ఇక అదుపులో ఉంచుకొనలేదు. ఇది నిశ్చయంగా ఒక విచారకరమగు కీడు, ఎందుకనగా వాక్యమునుబోధించుటకు గాని, సంఘములో విధులు నిర్వర్తించుటకు గాని నిర్మలమగు క్రైస్తవ శీలము ఇక అవసరము లేదని బిషప్పులు చెప్పుట ప్రారంభమాయెను. ఎందుకనగా సాధనములు మరియు కర్మకాండలు మాత్రమే లెక్కలోనికి తీసికొనబడునని చెప్పిరి. ఇందువలన దుర్మార్గులు మందను చీల్చుటకు అవకాశము కలిగెను. (మోసగాళ్ళు)

మానవ కల్పిత సిద్దాంతముల ద్వారా బిషప్పులను హెచ్చించుట జరిగినది. వారి స్థానములు లేఖనము ప్రకారమైనవి కావు. ఇంకొక మొట్ట ఏమనగా, వారు వరుస ప్రకారము బిరుదులను ఇచ్చుటకు ప్రారంభించిరి. ఆ విధముగా మతవారసత్వమును నిర్మించసాగిరి. త్వరలోనే బిషప్పుల మీద ఆర్చి బిషప్పులు వచ్చిరి, ఆర్చి బిషప్పుల మీదికి కార్డినలులు వచ్చిరి, మూడవ బోనిఫస్ కాలము వచ్చుసరికి అందరి మీద పోప్ అధికారిగా వచ్చెను. ఒక పొంతిఫ్.

నీకొలాయితుల బోధ మరియు బాబిలోనియ నిజంతో క్రైస్తవ్యము సంలీనమగుట ప్రధాన ఫలితములుగా కనబడుచున్నవి. యెహెజ్కేలు చూచినది అదే, 8:10,

"నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన విగ్రహములన్నియూ గోడ చుట్టూను వ్రాయబడియున్నట్లు కనబడెను."

ప్రకటన 18:2,

"అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను — మహా బబులోను కూలిపోయెను, కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి వ్యక్తికి ఉనికి పట్టును ఆయెను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగిపడిపోయిరి."

ఈ నికోలాయితు బోధ, సంఘములో స్థిరపరచబడిన ఈ నియమమును సంఘములోని చాలా మంది అంగీకరించలేదు గనుక అది పెద్ద ప్రభావమును చూపలేదు, ఎందుకనగా వారు భక్తులు వ్రాసిన వాక్య వివరణలను లేదా వాస్తవములను చదువకలిగిన స్ధితిలో యుండిరి. కావున సంఘము ఏమి చేయును? నీతిగల ఉపదేశకులను అది బహిష్కరించి వ్రాతప్రతులను తగులబెట్టినది. "వాక్యమును చదువవలెనన్నచో ప్రత్యేకమగు విద్య కావలెననిరి. దానిని అవగాహన చేసికొనుటకు కష్టమని పేతురు సహితము చెప్పెను." వారు జనుల యొద్ద నుండి వాక్యమును లాగివేసికొనిరి. జనులు త్వరలోనే యాజకుడు చెప్పు దానిని వినసాగిరి. వారు చెప్పినదానినే వీరు చేయసాగిరి. దేవునిని, ఆయన యొక్క పరిశుద్ధ వాక్యమును వారు కలిగియున్నట్లుగా చెప్పుకొనిరి. వారు జనుల యొక్క మనస్సులను, జీవితములను వశపరచుకొనిరి. దుష్టసంబంధమగు యాజకత్వమునకు వారిని దాసులుగా చేసికొనిరి.

మనుష్యుల యొక్క జీవితములను మరియు మనస్సులను కాతలిక్కు సంఘము కోరుకొనుచున్నదను దానికి మీరు రుజువును చూడగోరినయెడల తియోడయొసిస్ (Theodosius X) యొక్క శాసనమును చూడండి. తియోడయొసిస్ యొక్క మొదటి వ్రాత శాసనము.

రోమ్ యొక్క మొదటి సంఘము ద్వారా అతడు బాప్తిస్మమును పొందిన వెంటనే ఈ శాసనము జారీ చేయబడినది. "మా యొక్క ఆధీనములోనున్నవారు రోమనులకు పరిశుద్ధ పేతురు బోధించిన మతమును గట్టిగా అంటిపెట్టుకొని యుండవలెను. పారంపర్యాచారము ద్వారా ఇది నమ్మకముగా భద్రపరచబడియ్నుది. దీనిని ఇప్పుడు పాంటిఫ్, రోమ్ యొక్క డమాసస్, పీటర్, అలెగ్జాండ్రియా యొక్క బిషప్పు, అపోస్తలిక్ పరిశుద్ధతకు చెందిన ఒక వ్యక్తి ఒప్పుకొనుచున్నారు. అపోస్తలుల సంస్థకు చెందినవాడే ఒప్పుకొనుచున్నాడు. ఇది సువార్త యొక్క బోధ; తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ఒకే దైవత్వమును మనము నమ్ముదము. పరిశుద్ధ త్రిత్వములో సమానమగు ఔన్నత్యమును వారు కలిగియున్నారు. ఈ విశ్వాసమును హత్తుకొనినవారందరూ కాతలిక్కు క్రైస్తవులుగా పిలువబడవలెనని మేము ముగ్గురు చక్రవర్తులము ఆజ్ఞాపించుచున్నాము. ఇందుకు మేము సమ్మతించియున్నాము. ఇతర మతములను చెడ్డ పేరుతో పిలచుచున్నాము. వారియొక్క సంఘ నామములను మేము నిషేధించుచున్నాము. దైవసంబంధమగు న్యాయశిక్ష మాత్రమే కాకుండా మా అధికారము ద్వారా వచ్చు కఠిన శిక్షను వారు తప్పక ఎదుర్కోవలసియుందురు. మేము పరలోక సంబంధమగు జ్ఞానము ద్వారా నడిపించబడుచున్నాము. వారినెట్లు బాధింపవలెనో సరిగా ఆలోచించెదము."

ఈ చక్రవర్తి జారీచేసిన పదిహేను శిక్షా శాసనముల వలన కొన్ని సంవత్సరముల పాటు అన్ని రకముల సువార్తికులు హింసననుభవించిరి. తమ మతమును ఆచరణలో అమలుపరచలేకపోయిరి. అన్ని పౌర సంబంధమగు కార్యలయములలో నుండి వారిని బహిష్కరించిరి. జరిమానాలు, జప్తులు, దేశ బహిష్కరణలు, ఇంకా కొన్ని సందర్భములలో మరణములు కూడా వారికి విధించి బెదిరించిరి.

మీకది ఏమిటో తెలియునా? ఈనాడు మనము అటు వైపుగానే సాగిపోవుచున్నాము. తానే తల్లి సంఘమని స్వయంగా రోమను కాతలిక్కు సంఘము చెప్పుకొనుచున్నది. తానే మొదటిది లేదా మూల సంఘము అని చెప్పుకొనుచున్నది. అది సంపూర్తిగా నిజము. అది నిజంగానే వెనుకకు జారిపోయి పాపములోనికి పోయిన రోమ్ యొక్క మొదటి సంఘము. మొదటగా సంస్థ అయినది కూడా అదే. దానిలోనే ముందుగా నీకొలాయితుల క్రియలు మరియు నీకొలాయితుల తనము కనుగొనబడినవి. అది తల్లి కాదని ఎవరూ అనజాలరు, అది తల్లియైయుండి కుమార్తెలను ఉత్పత్తిచేసినది. ఒక స్త్రీలో నుండి ఇప్పుడొక కుమార్తె వచ్చుచున్నది. ఎర్రని వస్త్రము ధరించుకొనిన స్త్రీ, రోమ్ యొక్క ఏడు కొండల మీద కూర్చొనియున్నది. అది ఒక వేశ్యయై యుండి కుమార్తెలను కనినది. ఆ కుమార్తెలే ప్రొటస్టెంటు సంఘములు. ఆమెలో నుండి బయటకు వచ్చిరి, కాని వెనుదిరిగి మరల సంస్థలోనికిని మరియు నీకొలాయితు బోధలోనికి వెళ్ళిపోయియున్నారు. కుమార్తె సంఘముల యొక్క తల్లిని వేశ్యయనిరి. తనపెండ్లి ప్రమాణములను లెక్క చేయక అపనమ్మకముగా యుండునదియే వేశ్య. ఆమె దేవునికిపెండ్లీచేయబడి ఆ తరువాత జారత్వము చేయుచూ అపవాదితో వెళ్ళిపోయినది. తన జారత్వము ద్వారా కుమార్తెలను కనినది, వారు ఆమెను పోలియున్నారు. ఈ తల్లి మరియు కుమార్తెల కలయిక, వాక్య విరోధము, ఆత్మ విరోధము, తత్ఫలితమే అంత్యక్రీస్తు. అవును, అంత్యక్రీస్తు.

ఇంకా ముందుకు నేను వెళ్ళుముందుగా, ఒక సంగతి చెప్పగోరుచున్నాను. ఈ ఆదిలోనున్న బిషప్పులు తాము వాక్యముకంటె గొప్పవారిమని చెప్పుకొనిరి. ప్రజలు తమ పాపములను ఒప్పుకొనినచో తాము వారిని క్షమించెదమని చెప్పిరి. అది పూర్తిగా అసత్యము. రెండవ శతాబ్దములో వారు చిన్నపిల్లలకు బాప్తిస్మము ఇయ్యసాగిరి. పునఃస్థితి స్థాపన (నూతన జన్మ) బాప్తిస్మమును వారు నిజంగా ఆచరణలో పెట్టసాగిరి. ఈనాడు జనులు ఎటూ తోచని స్థితిలోయుండుట ఆశ్చర్యము కాదు. వారు ఎంత అయోమయ స్థితిలో యుందురో, అంత దగ్గరగా పెంతెకోస్తుకు వచ్చుదురు. ఇప్పుడు వారు చాలా నిరాశా స్థితిలో యున్నారు. అసలు సత్యము నుండి వారు దాదాపు 2000 సంవత్సరముల దూరములో యున్నారు.

ఓ, దేవుని సంఘమా, ఒకే ఒక నిరీక్షణ యున్నది. వాక్యము నొద్దకు తిరిగి వచ్చి దానితో నిలచియుండుము.

బిలాము బోధ

ప్రకటన 2:14,

"అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లను జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్చిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు.

సంఘములో నీకోలాయితుల క్రియలు, బోధ ఎప్పుడయితే ప్రవేశించునో అప్పుడు ఈ ఇతర బోధ కూడ ప్రవేశించును. మీరు చూడండి, మీ యొక్క ఆరాధనలో దేవుని యొక్క వాక్యమునకును, ఆత్మ యొక్క కదలికకును ఎప్పుడయితే స్థానము లేకుండా పోవునో, (నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను) అప్పుడు దానికి బదులుగా మరొక ఆరాధనను జనులకు అందించవలసియుందురు. ఆ ప్రత్యామ్నాయమునే బిలాము బోధ అందుము.

క్రొత్త నిబంధనలో బిలామ యొక్క బోధను మనము అర్థము చేసికొనగోరినచో, పాత నిబంధనలో ఏమున్నదో చూడవలెను, దానిని ఈ మూడవ సంఘమునకు అన్వయించి నప్పుడు, వర్తమానమునకు అది ఎట్లు వర్తించునో అర్థమగును.

ఈ గాధను మీరు సంఖ్యా కాండము 22వ అధ్యాయము నుండి 25వ అధ్యాయముల వరకూ యున్నదానిలో చూచెదరు. ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పరచబడిన జనులని మీకందరికి తెలియును. ఆ దినమునకు వారు పెంతెకోస్తువారుగా ఉన్నారు. వారు రక్తము క్రింద ఆశ్రయము పొందిరి. వారందరూ ఎర్ర సముద్రములో బాప్తిస్మము పొందిరి. ఆత్మలో గానము చేయుచూ, పరిశుద్ధాత్మ యొక్క శక్తి క్రింద నాట్యము చేయుచూ, వారు జలములో నుండి బయటకు వచ్చిరి. ప్రవచించు మిర్యాము తంబురను వాయించినది. కొంతకాలము ప్రయాణము చేసిన పిదప ఈ ఇశ్రాయేలీయులు మోయాబు యొద్దకు వచ్చిరి. మోయాబు ఎవరో మీకు తెలియును, అతడు లోతు యొక్క కుమారుడు. అనగా లోతుకు తన స్వంతకుమార్తె వలన పుట్టినవాడు. లోతు అబ్రహాము యొక్క మేనల్లుడు, కాబట్టి ఇశ్రాయేలు మరియు మోయాబు ఆ విధంగా బంధువులు. దానిని మీరు చూడవలెనని కోరుచున్నాను. ఈ సత్యము మోయాబీయులకు తెలియును, వారు ఆ సత్య ప్రకారము జీవించినా, జీవించకపోయినా ఇది మాత్రము ఎరుగుదురు.

ఇశ్రాయేలీయులు మోయాబు యొక్క సరిహద్దుల యొద్దకు వచ్చి రాజు యొద్దకు వర్తమానికుల ద్వారా ఇట్లు వర్తమానము పంపిరి. "మనము సోదరులము, మమ్మును మీ దేశము దాటి వెళ్ళనీయుడి. మా జనులు గాని, మా జంతువులు గాని ఏదయినా తినినా, త్రాగినా దాని వెలను మేము సంతోషముగా చెల్లించెదము." కాని రాజగు బాలాకు చాలా ఉగ్రత చెంది ఆ నీకొలాయితు గుంపు యొక్క అధ్యక్షుడు ఆ సంఘమును వెళ్ళనీయలేదు. ఎందుకనగా వారు అద్భుతములు, సూచక క్రియలు, పరిశుద్ధాత్మ యొక్క ఆయా ప్రత్యక్షతల వలన వచ్చుచుండిరి. వారి ముఖములు దేవుని యొక్క మహిమతో ప్రకాశించుచుండినవి. ఇది చాలా చిక్కు సమస్య, తన సమూహములో కొందరిని కోల్పోవచ్చును. కాబట్టి బాలాకు ఇశ్రాయేలీయులను దాటిపోనియ్యలేదు. వాస్తవానికి, అతడు వారిపట్ల భయము కలిగియుండెను, కాబట్టి అతడు బిలాము అను ఒక అద్దె ప్రవక్త యొద్దకు వెళ్ళెను. తనకు దేవునికి మధ్య రాయబారము నడపమని కోరెను. ఇశ్రాయేలు వారిని శపించునట్లుగా సర్వశక్తుని వేడుకొనమని చెప్పెను మరియు వారిని శక్తిహీనులనుగా చేయుమనెను. రాజకీయు వ్యవహారములలో పాలుపొంది గొప్పవాడిని కావలెననుకొనుచుండిన బిలాము, అందుకు సంతోషముగా సమ్మతించెను. కాని ఎవరిని తాను సమీపించవలసి యున్నానో బాగా ఎరుగును, ఆ జనులను స్వయంగా శపించలేడు, దేవుని యొద్ద నుండి అనుమతి పొంది వారిని శపించగోరెను. ఆయన యొద్దకు వెళ్ళి బిలాము అందుకు అనుమతిని కోరెను. నేడు మనతో ఉన్న నికోలాయితులవలె ఇతడు లేడా? తమ విధానము ప్రకారము చేయని ప్రతి వారిని వారు శపించగోరుదురు.

వెళ్ళుటకు అనుమతి ఇమ్మని బిలాము కోరెను గాని, దేవుడతనిని వద్దనెను. ఎంత వింత! బాలాకు ఆతనికి ఇంకా ఎక్కువ సొమ్ము ఘనత ఇచ్చెదనని వాగ్ధానము చేసెను. బిలాము మరల దేవుని యొద్దకు వెళ్ళేను. ఇప్పుడు దేవుని యొద్ద నుండి ఒక జవాబు వచ్చినచో చాలును. కాని స్వచిత్తము కలిగిన బిలాముకు అది చాల లేదు. దేవుడతని మొండి వైఖిరి చూచి, అయితే లేచి వెళ్ళమనెను. వెంటనే అతడు గాడిదను సిద్ధపరచుకొని, వెళ్ళెను. ఇది దేవుని అనుమతిపూర్వక చిత్తమేనని అతడు గ్రహించియుండవలసినది. అతడు ఇరవైసార్లు వెళ్ళినా, ఇరవై మారులు ప్రయత్నించినా, వారిని శపించజాలడు. ఈనాడు జనులు బిలామువలె యున్నారు. వారు ముగ్గురు దేవుళ్ళను నమ్ముచున్నారు. నామమునకు బదులుగా, మూడు బిరుదులలో బాప్తిస్మము పొందుచున్నారు; అయినా గాని ఆయన బిలాము మీదికి పంపినట్లుగానే వారి మీదికిని ఆత్మను పంపుచున్నాడు, తమది పూర్తిగా నిజమని నమ్మి వారు వెళ్ళిపోవుచున్నారు. వారు నిశ్చయంగా బిలాములుగా ఉన్నారు. చూడండి, బిలాము యొక్క బోధను చూడండి. ఏలాగయినా వెళ్ళవచ్చును. మీ ఇష్టము వచ్చినట్లుగా చేయండి. "మంచిది, దేవుడు మిమ్మును దీవించెను. అది తప్పకుండా మంచిదైయుండును," అని వారనరి. దేవుడు మిమ్మును దీవించెనని నాకు తెలియును. దానిని నేను కాదనను. కాని బిలాము కూడా అదే రకమగు సంస్థ యొక్క త్రోవను పట్టుకొని నడిచెను. అది దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధము. అది తప్పు బోధ.

చివరకు దేవుని యొద్ద నుండి ఒక దూత వచ్చి దారిలో అడ్డముగా నిలుచు వరకు బిలాము బహు ధైర్యంగా ఆ మార్గములో నడిచిపోయెను. ఆ ప్రవక్త ఆత్మసంబంధమగు సంగతులు చూడలేని గ్రుడ్డివాడాయెను. (బిషప్, కార్డినల్, చైర్మన్, ప్రెసిడెంటు, మరియు జనరల్ ఓవర్ సీర్) ఘనత, కీర్తి ద్రవ్యము అతని ఆలోచనలలో యుండెను కనుక ఒక దేవదూత ఖడ్గము దూసి నిలచియుండుటను దారిలో చూడలేకపోయెను. మతిలేని ప్రవక్తను అడ్డిగించుటకు దూత నిలబడియుండెను. ఆ చిన్న గాడిద, దూతను చూచెను కనుక అది ముందుకు పోనొల్లక వెనుదిరుగుచూ, చివరకు అది బిలాము యొక్క కాలును గోడకు అదిమి త్రోక్కెను. గాడిద ఆగిపోయి నిలచియుండెను, ముందుకు పోజాలెను. కాబట్టి బిలాము క్రిందికి దూకి దానిని కొట్టనారంభించెను. అప్పుడు గాడిదబిలాముతో మాట్లాడ సాగెను. దేవుడు గాడిదకు భాషలో మాట్లాడు శక్తిని ఇచ్చెను. గాడిద సంకరజాతి కాదు; అది అసలయిన సంతానము. గ్రుడ్డి ప్రవక్తతో అది ఇట్లు చెప్పెను. "నేను నీ గాడిదను కానా? నిన్ను నమ్మకముగా నేను మోయుట లేదా?" అప్పుడు బిలాము ఇట్లనెను, "అవును, అవును, నీవు నా గాడిదవు, ఇప్పటి వరకు నీవు నన్ను నమ్మకముగా మోసియున్నావు; నీవు ముందుకు సాగిపోనియెడల, నిన్ను నేను చంపెదను. ఏమిటిది? ఒక గాడిదతో నేను మాట్లాడుచున్నానా? చాలా వింతగా యున్నది. గాడిద నాతో మాట్లాడుట వినుచున్నాను. అందుకు నేను తిరిగి జవాబు ఇచ్చుచున్నాను."

దేవుడెల్లప్పుడూ ఒకే భాషలో మాట్లాడును. బెల్తేషాజరు యొక్క విందులోను, పెంతెకోస్తు యొద్దను ఆయన మాట్లాడెను. నేడును ఆయన తిరిగి దానిని చేయుచున్నాడు. అది త్వరలో రానైయున్న తీర్పునకు ఒక హెచ్చరిక!

ఆ తరువాత బిలామునకు దూత కనిపించెను. గాడిద లేనియెడల నీవు చచ్చి యుందువని దూత బిలాముతో చెప్పెను. ఇప్పటికిని దేవుని శోధించుట అతడు మానలేదు. వెనుకకు వెళ్ళిపోదునని బిలాము వాగ్ధానము చేసెను. అయినా గాని దేవుడు చెప్పుమనదే తాను చెప్పెదనని అతడు పలుకగా, మందలింపుతో ముందుకు పోయెను.

బిలాము అక్కడికి వెళ్ళి పవిత్ర జంతువులను బలి అర్పించుటకు అతడు ఏడు బలిపీఠములను నిర్మించెను. అతడు ఒక పొట్టేలును వధించెను. అది మెస్సీయా యొక్క రాకకు సాదృశ్యము. దేవునిని సమీపించుటకు ఏమి చేయవలెనో అతనికి తెలియును. అతని విధానములన్నియు బాగుగానే యున్నవి; కాని శక్తి మాత్రము లేదు; ఇప్పుడు ఆలాగే యున్నది. నీకొలాయితులలో దానిని మీరు చూచుట లేదా? అదే రకమగు బలిని అర్పించుచు ఇశ్రాయేలు ఆ లోయలో యున్నది. అవే క్రియలు చేయుచున్నారు, కాని సూచక క్రియలు ఒకే ఒకరి యొద్ద కనబడుచున్నవి. ఒకే ఒకరు తమ మధ్యను దేవుని కలిగియున్నారు. ఆచారము నిన్ను ఎక్కడికిని తీసికొని వెళ్ళదు. ఆత్మ ప్రత్యక్షత యొక్క స్థానమును ఏదియూ ఆక్రమించజాలదు. నైసియా యొద్ద అదే జరిగినది. వారు బిలాము యొక్క బోధను అనుసరించిరి, దేవుని యొక్క బోధను కాదు. వారు తొట్రిల్లిరి; వారు పతనమయిరి. వారు చచ్చిన వారుగా మారిరి.

అర్పణను అర్పించిన తరువాత బిలాము ప్రవచించుటకు సిద్ధముగా యుండెను. కాని దేవుడతని నాలుకను బంధించెను, అతడు వారిని శపించలేకపోయెను. అతడు వారిని ఆశీర్వదించెను.

బాలాకునకు చాలా కోపము వచ్చెను, కాని ఆ ప్రవచనము విషయములో బిలాము చేయకలిగినది ఏదియూ లేదు. అది పరిశుద్ధాత్మ ద్వారా పలుకబడినది. కాబట్టి బిలామును బాలాకు క్రిందికి దిగిపొమ్మని, లోయలోనికి వెళ్ళమని చెప్పెను. వారిని శపించు విధానము ఏదయినా గాని యున్నదేమోనని వారి వెనుక నుండి ఆలోచించెను. బాలాకు ఉపయోగించిన పన్నాగములనే, ఈనాడు వీరును ఉపయోగించుచున్నారు. పెద్ద శాఖలు చిన్న గుంపుల వైపు చూచుచున్నవి, వారిని చెడ్డగా చేయు ఏదయినా నెపము దొరుకునేమోనని వారి మధ్యను వెదకుచున్నారు. వారు దేనినయినా వెదకి కనుగొని పెద్దగా గోలచేయుచున్నారు. ఈ ఆధునికులు పాపములో జీవించినాగాని ఎవరూ ఏమీ మాట్లాడరు; కాని ఏర్పరచబడిన వారిలో ఒకరు ఏదయినా సమస్యలోపడితే చాలును, దేశములోనున్న ప్రతి పత్రిక దానిని గూర్చి గొప్పగా ఎత్తిచూపును. అవును, ఇశ్రాయేలీయులకు వారి వెనుక భాగములున్నవి (శారీరిక సంబంధమైనది.) పొగడ్తకు వీలులేని కొన్ని సమస్యలు వారికున్నవి; వారియొక్క బలహీనతలు ఎన్ని ఉన్నాగాని, దేవుని యొక్క ఉద్దేశ్యము, ఆ ఏర్పరచబడిన వారి ద్వారానే నెరవేరుచున్నది. ఇది కృప ద్వారానే జరుగుచున్నది గాని, క్రియల ద్వారా కాదు. పగటివేళ వారికి మేఘము ఉండినది, రాత్రియందు అగ్నిస్తంభమున్నది, వారికి కొట్టబడిన బండ యున్నది, ఇత్తడి సర్పమున్నది, సూచక క్రియలు, అద్భుతములు వారికి ఉన్నవి. వారికి రుజువు యున్నది — అది వారిలో కాదు, కాని దేవునిలో.

దేవుడు ఆ నీకొలాయితుల పట్ల ఎట్టి గౌరవమును కలిగిలేడు. వారికి పి.హెచ్.డిలు, ఎల్.ఎల్.డిలు, డి.డిలు ఉన్నవి మరియు వారికి చక్కని సంస్థలున్నవి, వారికి గొప్పలు చెప్పుకొను అతిశయపరులున్నారు; కాని ఆయన ఇశ్రాయేలీయుల పట్ల గౌరవము కలిగియున్నాడు, ఎందుకనగా వారి మధ్యను వాక్యము బయలుపరచబడెను. నిశ్చయంగా ఇశ్రాయేలు ఏమీ అంత నాగరికతగల దానివలె కనిపించలేదు, వారు అష్టకష్టములు పడి ఐగుప్తు చెరలో నుండి బయటకు వచ్చిరి, ఏమయినా గాని వారు ఆశీర్వచనము పొందిన జనులు. 300 సంవత్సరముల నుండి వారికి తెలిసినది గొర్రెలు కాయుట మాత్రమే, వ్యవసాయము వారికి తెలియును, ఐగుప్తీయుల దాస్యము క్రింద ఉండి వారు ప్రాణ భయముతో బానిసత్వము చేయుచుండిరి. కాని ఇప్పుడు వారు స్వతంత్రము పొందియున్నారు. వారు దేవుని యొక్క సార్వభౌమత్వము వలన ఆశీర్వదించబడిరి. నిశ్చయంగా మోయాబు వారిని చిన్న చూపుతో చూచెను. ఇతర దేశములన్నియూ ఆ విధంగానే వారిని చూచినవి. సంస్థలు ఎల్లప్పుడును సంస్థలుగా మారని వారివైపు, ఆ విధంగానే చూచును. వారు ఆ సంస్థలోనికి వచ్చినచో వారిని బ్రదుకనిచ్చెదరు, లేనియెడల వారిని నాశనము చేయ చూతురు.

"బ్రన్హం సోదరుడా, మోయాబు సంస్థగా మారినది. ఇశ్రాయేలు సంస్థగా మారలేదు గదా? మరి నీవు ఈ విషయంలో ఏమి తలంచుచున్నావు? ఆ అభిప్రాయము నీకు ఎక్కడ నుండి ఏర్పడినది?" అని మీరు ప్రశ్నించవచ్చును. ఈ బైబిలులోనే ఆ అభిప్రాయమును నేను పొందియున్నాను. ఇక్కడ అది మాదిరిగా యున్నది. పాత నిబంధనలో వ్రాయబడియున్న ప్రతిదియు మనకు ఒక హెచ్చరికగా యున్నది. అది ఒక గాధ రూపములో వ్రాయబడియున్నది. దాని నుండి మనము నేర్చుకొందుము.

సంఖ్యాకాండము 23:9లో వ్రాయబడియున్నది.

"మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను, కొండలనుండి అతని కనుగొనుచున్నాము; ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు."

అది విషయము. మొట్టల శిఖరము నుండి దేవుడతనిని చూచుచున్నాడు, వారి తప్పులను కనుగొని వారిని శిక్షించుటకు ఏదో లోయలో నుండి ఆయన చూచుట లేదు. దేవుడు తన విధానములో వారిని చూచుచున్నాడు — కృప మరియు ప్రేమ అను మొట్టల శిఖరమునుండి దేవుడతనిని చూచుచున్నాడు. వారు ఒంటిగా జీవించెదరు మరియు వారు సంస్థగా మారలేదు. వారికి ఒక రాజు లేడు. వారికి ఒక ప్రవక్త యున్నాడు. ఆ ప్రవక్త యొక్క ఆత్మలో దేవుడు నివాసము చేయుచున్నాడు; వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును మరియు ఆ వాక్యము జనులయొద్దకు వెళ్ళును. వారు ఐక్యరాజ్యసమితికి చెందరు. వారు ప్రపంచ సంఘసమితికి చెందరు. బాప్టిస్టులకు గాని, ప్రెస్బిటేరియనులకు గాని, అసెంబ్లీ ఆఫ్ గాడ్ కు గాని లేదా మరే ఇతర గుంపుకు గాని వారు చెందరు. వారికి చెందవలసిన అవసరము లేదు. వారు దేవునితో చేరిరి. వారికి ఏ ఆలోచన సభనుండియూ ఆలోచన అవసరము లేదు — వారికి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" యున్నది. వారి మధ్యలో అది యున్నది. హల్లేలూయా!

ప్రభువు యొక్క ప్రత్యేకమైన శక్తి ద్వారా ప్రత్యక్షతను పొందుకొనుట మరియు దేవునిని సమీపించుట ఎట్లో బిలామునకు తెలియును. కాని ఇతనికి ఆ అబద్ద గుంపుకు బిషప్పుగా నుండు ఘనత మాత్రమే దొరికియున్నది. ఇప్పుడు బాలాకు యొక్క మొప్పును పొందుటకు ఇతడేమి చేయుచున్నాడు? దేవుడు ఇశ్రాయేలీయులను బలవంతముగా హతము చేయునట్లు ఒక ప్రణాళికను తయారు చేసెను. సాతాను, తాను అవ్వను మోసము చేయకలిగినచో ఫలితముగా దేవుని యొక్క ఉగ్రత వచ్చి పాపమునకు శిక్షగా మరణము వచ్చునని తలంచెను. (అందుకే శరీరసంబంధమగు పాపములో పడునట్లుగా చేసెను) ఆ విధముగానే ఇశ్రాయేలీయులను కూడా పాపములో పడవేసినయెడల, దేవుడు వారిని హతము చేయునని బిలామునకు తెలియును, కాబట్టి అతడు ఒక పధకమును తయారు చేసెను. వారిని పాపములో పడవేసెను. వారిని బయల్పెయోరు పండుగకు రమ్మని అతడు ఆహ్వానములను పంపించెను. (వచ్చి మాతో కలిసి ఆరాధన చేయండి) ఇశ్రాయేలీయులు నిస్సందేహముగా ఐగుప్తు వారియొక్క పండుగలను చూచిరి. కావున వెళ్ళి ఆ పండుగను చూచి, వారితో కలిసి భోజనము చేయుట పెద్ద తప్పు కాదని వారు తలంచిరి. (సహవాసము చేసినచో ఏమి తప్పు అని అడుగుచుందురు. మనము వారిని ప్రేమింపవలసియున్నాము గదా? లేనియెడల వారిని ఎట్లు సంపాదించగలము?) స్నేహముగా నున్నంత మాత్రమున ఏమీ హాని జరుగదు, అని వారనుకొనియుందురు. కాని ఆ కామవికారము కలిగించు మోయాబు స్త్రీలు నాట్యము చేయసాగిరి. వారు తిరుగుచూ ఆ రాక్ఎన్ రోల్ నృత్యము చేయుచుండగా, వారి దుస్తులు జారిపోవుచున్నవి, ఇశ్రాయేలీయులలో శరీరాశ చెలరేగెను మరియు వారు వ్యభిచారము లోనికి ఈడ్చుకొని పోబడిరి. దేవుని ఉగ్రత వారిమీదికి వచ్చి వారిలోని నలుబది రెండు వేలమందిని హతము చేసెను.

నైసీయా వద్దను, నైసీయా తరువాతను, కాన్స్టాంటైన్, అతని తరువాత వచ్చిన వారు దానినే చేసిరి. వారు దేవుని యొక్క ప్రజలను కూటమునకు ఆహ్వానించిరి. భోజనము చేయుటకు సంఘము కూర్చొనినప్పుడు, వారి ఆటలను చూచి ఆమె పడిపోయినది. (సంఘ అచారములు, ఉత్సవములు, క్రైస్తవ విధులుగా పేరు పెట్టబడిన అన్యపండుగలు వారిని ఆకర్షించగా, వారు పాలుపొందిరి) ఆమె జారత్వమును జరిగించినది. దేవుడు బయటకు నడిచెను.

ఏ మనుష్యుడయినా గాని దేవుని యొక్క వాక్యము నుండి వెనుదిరిగి, పరిశుద్ధాత్మను పొందుటకు బదులుగా, సంఘములో చేరినప్పుడు, ఆ మనుష్యుడు చనిపోవును. మరణమే! అదే జరిగినది. ఒక సంఘములో నీవు చేరవద్దు. సంస్థలో నీవు చేరవద్దు మరియు విశ్వాస ప్రమాణములు, ఆచారములు మొదలగు వాటిలో పాలు పొందవద్దు. వాక్యమును మరియు ఆత్మను నిరాకరించి మరి దేనినీ నీవు వెంబడించవద్దు. ఆలాగు చేసినయెడల నీవు చనిపోదువు. అది అక్కడితో అంతమగును. నీవు చనిపోయెదవు. దేవుని నుండి నిత్య ఎడబాటు పొందెదవు!

ఇప్పటి వరకు ప్రతి కాలములోను అదియే జరుగుచున్నది. దేవుడు జనులను విమోచించుచున్నాడు. వారు రక్తము ద్వారా బయటకు వచ్చుచున్నారు, వాక్యము ద్వారా శుద్ధీకరింపబడుచున్నారు, బాప్తిస్మపు జలముల ద్వారా నడుచుచున్నారు, మరియు ఆత్మ ద్వారా నింపబడుచున్నారు; కాని కొంత కాలమయిన తరువాత మొదటి ప్రేమ చల్లబడును. సంస్థను ఏర్పాటు చేయవలెనను అభిప్రాయము ఎవరిలోనో కలుగును. తమ్మును తాము కాపాడుకొనుటకు, తమ కొరకు ఒక పేరును ఏర్పరచుకొనుటకు వారు సంస్థను తయారు చేయుదురు. రెండవ తరములోనే వారు సంస్థగా మారుచుందురు, కొన్నిసార్లు ఇంకా ముందుగానే అది జరుగుచుండెను. దేవుని యొక్క ఆత్మ ఇక వారిలో యుండదు కానీ ఆరాధన ఒక ఆచారముగా మారిపోవును. వారు చనిపోయియున్నారు. వారు ఆచారములతోను, పద్ధతులతోను సంకరము చేయబడిరి మరియు వారిలో ఎట్టి జీవమును లేదు.

కాబట్టి బిలాము ఇశ్రాయేలీయులను వ్యభిచారము చేయనిచ్చెను. శరీరసంబంధమగు జారత్వమును జరిగించు ఆత్మయే సంస్థాగత మతములో యున్నదని మీరు ఎరుగుదురా? జారత్వపు ఆత్మయే సంస్థ యొక్క ఆత్మ అని, నేను మీతో చెప్పుచున్నాను. జారత్వము జరిగించువారందరూ అగ్ని గుండములో పాలుపొందుదురు. దేవుడు సంస్థను ఆ విధముగానే చేయును. అవునండి, వేశ్య మరియు దానియొక్క కుమారైలు అగ్నిగుండములో పాలుపొందుదురు.

శాఖలు దేవునికి చెందినవి కావు. అవి ముందెన్నడూ లేవు మరియు ఇక ముందుకు ఉండవు. వారసత్వమునకును, భిన్న బోధలకును దేవుని ప్రజలను వేరుచేయునది తప్పుడు ఆత్మయై యున్నది. ఒక తప్పు ఆత్మ జనులను వేరుచేయును. శాఖలు, సంస్థలు అదే చేయుచున్నవి. వారు సంస్థను రూపొందించబోయి దేవుని వాక్యము నుండి దూరమగుచున్నారు. ఆత్మ సంబంధమగు వ్యభిచారములో పడిపోవుచున్నారు.

జనులకు ఆ కాన్స్టాంటైన్ ఏర్పరచిన ప్రత్యేక పండుగలను గమనించండి. అవి ఆ పాత అన్య పండుగలే, క్రొత్త పేర్లు వాటికి పెట్టి, సంఘములోనికి తీసికొని వచ్చిరి. మరికొన్ని సందర్భములలో క్రైస్తవ విధులను తీసికొని అన్యుల ఉత్సవములతో కలగలుపు చేసిరి. అతడు సూర్యదేవుని ఆరాధనను తీసికొని దేవుని కుమారుని ఆరాధనగా మార్చెను. డిసెంబరు 21నాడు వారు మామూలుగా ఆ సూర్యదేవునికి పండగను ఆచరించెడివారు. దానికి బదులుగా డిసెంబరు 25నకు దానిని మార్చిరి. ఇది దేవుని కుమారుని జన్మదినమని చెప్పిరి. కాని ఆయన ఏప్రిలు నెలలో జన్మించెనని మనకు తెలియును, ఎందుకనగా డిసెంబరులో జీవము రాదు. వారు అష్టర్తే పండుగను తీసికొని దానిని ఈస్టరు ఉత్సవముగా పిలచిరి, కాని ప్రభువు యొక్క మరణము మరియు పునరుద్ధానములను క్రైస్తవుడు గుర్తుచేసికొనవలసియున్నాడు. వాస్తవానికి అది ఒక అన్య దేవతయగు అష్టర్తే పండుగ.

వారు సంఘములో బలిపీఠములను నెలకొల్పిరి. వారు విగ్రహములను ప్రతిష్టించిరి. వారు జనులకు తమ విశ్వాస ప్రమాణములను ఇచ్చిరి. దానికి అపోస్తలుల విశ్వాస ప్రమాణమని పేరు పెట్టిరి, దానిని మీరు బైబిలులో కనుగొనలేరు. వారు జనులకు పితృ ఆరాధనను నేర్పిరి, అందుమూలముగా వారు రోమను కాతలిక్కు సంఘమును ప్రపంచములోని అతి గొప్ప ప్రేతాత్మల ఆరాధనా సంఘముగా తయారుచేసిరి. ప్రతి అపవిత్ర పక్షి, ఆ పంజరములో యున్నది. ప్రొటస్టెంటు వారు కూడా తమ సంస్థలతో అందులో యుండి, అదే పనిచేయుచున్నారు.

వారు విగ్రహములకు బలి అర్పించినవాటిని తినిరి. ఇప్పుడు విగ్రహములకు బలిగా అర్పించిన మాంసమును వారు అక్షరాలా తినుట దీని అర్థమని నేను చెప్పుట లేదు. యెరూషలేము యొక్క ఆలోచన సభ దానికి విరోధముగా బోధించుచున్నప్పటికిని, పౌలు దానిని గూర్చి ఎక్కువగా చెప్పలేదు, ఎందుకనగా అది శూన్యమని అతడు పలికెను. అది మనస్సాక్షికి సంబంధించిన సంగతి, ఒక బలహీనమగు సోదరుని విషయములో మాత్రమే దానిని అనుమతించలేదు. ఇంకా చెప్పవలెనన్నయెడల ఈ ప్రతక్ష్యతతో అన్యులకు సంబంధమున్నదే గాని యూదులకు సంబంధము లేదు, ఇవి అన్య సంఘములు. మన ప్రభువు యొక్క మాటల వెలుగులో దీనిని నేను చూచుచున్నాను. "నా శరీరమును తిని నా రక్తము త్రాగితేనే గాని మీలో జీవముండదు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును." ఈ సంగతి పూర్తిగా ఆత్మీయార్ధముగలదని మీరు ఎరుగుదురు. ఈ తినుట అటువంటిదే.

ఈ ప్రజలు విగ్రహములకు నమస్కరించుచుండిరి, క్రొవ్వొత్తులు వెలిగించుచుండిరి, సెలవు దినములను ఉపయోగించుకొనుచుండిరి, తమ పాపములను జనులకు ఒప్పుకొనుచుండిరి. (ఇవన్నియూ అపవాది యొక్క మతమునకు చెందినవే,) వారు అపవాది యొక్క పాలిభాగస్ధులు. ప్రభువు యొక్క సంబంధులు కారు. వారు ఒప్పుకొనినా, ఒప్పుకొనక పోయినా, వారు చేయునది మాత్రము విగ్రహరాధనయే. వారు ఏదయినా చెప్పవచ్చును, కాని వారి బలిపీఠములు మరియు ధూపములు అన్యదేవతారాధనను గుర్తుకు తెచ్చును. అది వారు ప్రభువునకు ప్రార్థించుట అని చెప్పవచ్చును, వారు ఏదో ఒక అర్ధముతో దానిని చేయుచుండవచ్చును, కేంద్రీకరణ కొరకు తాము విగ్రహములను పెట్టుకొనినట్లుగా వారు చెప్పుకొనవచ్చును; వారు యాజకునికి ఒప్పుకొని దానిని దేవుని ఎదుట ఒప్పుకొని నట్లుగా భావించుచున్నారు, వారు తమ హృదయములలో ఆలాగు తలంచుచున్నారు. యాజకుడు తమను క్షమించునని వారు చెప్పెదరు, ప్రభువుయొక్క నామములో అతడు దానిని చేయుచున్నట్లుగా వారు చెప్పెదరు; వారు తాము కోరిన విధంగా చెప్పుకొనవచ్చును, కాని వారు బాగుగా తెలిసిన బాబిలోనియను, సాతాను మతములో పాలుపొందుచున్నారు. వారు స్వయంగా విగ్రహముల ఆరాధనలో చేరి, ఆత్మసంబంధమగు జారత్వమును జరిగించిరి, దాని అర్థము మరణము. వారు చనిపోయిన వారే.

ఆ విధంగా రాజ్యము మరియు సంఘము వివాహము చేసికొనినవి. సంఘము విగ్రహములతో చేయికలిపినది. వారి వెనుక రాజ్యాధికారము ఉన్నది. "రాజ్యము వచ్చి యున్నది మరియు ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తము బలవంతముగా రుద్ధబడియున్నది," అని వారనుచున్నారు. ప్రభువైన యేసు రాకడ కొరకు రోమను కాథలిక్కు సంఘము ఎదురు చూడకపోవుటలో ఆశ్చర్యము లేదు. వారు వెయ్యేండ్ల పాలన కొరకు ఎదురుచూచువారు కారు. వారి యొక్క వెయ్యేండ్ల పాలన ఇచ్చటనే యున్నది. పోవు వారిని ఇప్పుడు ఏలుచున్నాడు. దేవుడాతనిలో యుండి పరిపాలించుచున్నాడనుచున్నారు. క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి సిద్ధపరచబడినప్పుడు ఆయన వచ్చునని వారు చెప్పుచున్నారు. కాని వారు చెప్పునది తప్పు, అబద్ధ సంఘమునకు ఆ పోపు శిరస్సు వెయ్యేండ్ల పరిపాలన రాబోవుచున్నది, అది జరిగినప్పుడు అతడు అందులో ఉండడు. అతడు మరెక్కడో యుండును.

హెచ్చరిక.

ప్రకటన 2:16,

"కావున మారుమనస్సు పొందుము, లేనియెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను."

ఆయన అంతకన్న మరేమి చెప్పగలడు? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించుచున్న వారి పాపమును దేవుడు చూచిచూడనట్లు ఉండగలడా? పాపము చేయుచున్నవారు కృపను పొందుటకు ఒకే ఒక మార్గమున్నది. అది మారుమనస్సు, నీవు తప్పు చేయుచున్నట్లుగా ఒప్పుకొనుము. క్షమాపణ కొరకు దేవుని యొద్దకు రమ్ము, దేవుని యొక్క ఆత్మను కోరుకొనుము. ఇది దేవుని నుండి వచ్చిన ఆజ్ఞ, లోబడనిచో మరణమే. ఎందుకనగా ఆయన ఇట్లు చెప్పుచున్నాడు, "నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను." ఆ మృగము పరిశుద్ధులతో యుద్ధము చేసెను, కాని దేవుడు మృగముతో యుద్ధము చేయును. వాక్యముతో యుద్ధము చేయు వారితో ఒక దినమున వాక్యము వారితో యుద్ధము చేయును. దేవుని యొక్క వాక్యమునకు, కలుపుట లేదా తీసివేయుట, చాలా తీవ్రమగు విషయము. దానిని మార్చు వారికి, తమకు అనుగుణముగా దానిని త్రిప్పు వారికి మరణము మరియు నాశనము తప్ప ఇంకేముండును? అయినా గాని దేవుని కృప ఇంకా ఈలాగు కేకవేయుచున్నది. "మారుమనస్సు పొందుము." ఓ, మారుమనస్సు యొక్క ఆలోచనలు ఎంత మధురమైనవి! నేను వట్టి చేతులతో వచ్చియున్నాను, నీ సిలువకు సూక్ష్మంగా నేను హతుకొనియున్నాను. నా దుఃఖమును నేను తీసికొని వచ్చుచున్నాను. నేను పశ్చాత్తాపపడుచున్నాను, ఉన్నపాటున వచ్చుచున్నాను, నేను చేసిన దానిని ఒప్పుకొనుచున్నాను. ఇప్పుడు రక్తము కావలెను, యేసు యొక్క రక్తము తప్ప, మరేదీ అక్కర లేదు. అది ఏమై యుండును? మారుమనస్సు, లేని యెడల మరణ ఖడ్గము వచ్చును. అది నీ నిర్ణయము.

ప్రతిఫలములు

ప్రకటన 2:17,

"సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక, జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గానీ అది మరి ఎవనికిని తెలియదు."

ప్రతి కాలమునకు ఇయ్యబడిన ప్రతి వర్తమానములోను విశ్వాసికి ఒక బహుమానము ఇయ్యబడుచున్నది. జయించువానిగా చేయుటకు అతనికి ఒక ప్రోత్సాహము ఇయ్యబడుచున్నది. ఆ విధముగా ప్రభువు యొక్క ప్రతిఫలము ఇవ్వబడుచున్నది. ఈ కాలములో ఆత్మ వాగ్ధానము చేయుచున్నది ఏమనగా మరుగైయున్న మన్నామరియు తెల్లని రాయి మీద వ్రాయబడిన ఒక క్రొత్త పేరు.

ఈ వర్తమానములో ప్రతి ఒక్కటియు "దూత"కు ఉద్దేశించి చెప్పబడినది. (మానవ దూత) చాలా గొప్ప బాధ్యతయైయున్నది. అలాగే అది అతనికి అద్భుతమగు భాగ్యము కూడా. వీరికి దేవుడు ప్రత్యేకమగు వాగ్ధానములను చేయుచున్నాడు. పన్నెండు మంది అపోస్తలుల విషయములోనూ ఆలాగే జరిగినది. పన్నెండు మంది, పన్నెండు సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలీయుల యొక్క పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. పౌలుకు ఒక ప్రత్యేకమగు వాగ్దానము ఇయ్యబడిన సంగతిని కూడా మీరు గుర్తుచేసికొనండి: అతని దినము యొక్క వధువును యేసునకు ఇచ్చును,

II కొరింధీ 11:2,

"దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసితిని."

తన కాలములో, తన ఘడియలో వాక్యము విషయములో నమ్ముకముగా యున్న ప్రతి వరక్తమానికునికిని ఆలాగే వాగ్ధానము చేయబడియున్నది. ఈ చివరి దినమున కూడా ఆలాగే యుండును. పౌలుకు ఇచ్చిన ప్రత్యేక వాగ్ధానమునే ఆయన ఇచ్చుచున్నాడు. నేను ఎల్లప్పుడూ చెప్పుచుండు మాటను మీరు గుర్తుంచుకొనండి. ప్రభువును ఎన్నోసార్లు నేను అసంతోషపరిచాను, చాలాసార్లు నేను తప్పిపోయి యున్నాను. అది సరిచేసికొను వరకు నేను చనిపోవుటకు భయపడుచునే యుండును. ఒక ఉదయమున నేను పడక మీద పరుండి యున్నాను, ఆకస్మాత్తుగా, అతి వింత దర్శనము నాకు కలిగినది. అది వింతయైనదని నేను చెప్పాను, ఎందుకనగా వేలాది దర్శనములను నేను చూచాను కాని ఒక్కసారి కూడా నేను నా శరీరమును విడిచిపెట్టుట జరుగలేదు. కాని ఆ దర్శనములో నేను పైకి కొనిపోబడితిని, నా భార్యను చూడవలెనని వెనుకకు తిరిగాను. నా భార్య ప్రక్కనే, నా శరీరము పడి యుండుటను నేను చూచాను. అప్పుడు నేను ఎప్పుడు చూడని అతి సుందరమగు ఒక స్థలములో యుండుట జరిగినది. అది పరదైసు. అతి సుందరమగు, అతి సంతోషకరమగు జనులను నేను చూచాను. వారందరూ చాలా యవ్వనములో యున్నారు. వారు 18 నుండి 21 సంవత్సరముల వయస్సు కలిగియున్నారు. వారికి ఒక తెల్ల వెంట్రుక గాని, ముడత గాని, మరే ఇతర వృద్ధాప్య గురుతులు గాని లేవు. ఆ యువతుల యొక్క జట్టు పొడవుగా ఉండి, నడుముల వరకు పెరిగినది. యువకులు చాలా అందముగాను, బలముగాను ఉన్నారు. ఓ! వారు నన్ను ఎట్లు ఆహ్వానించిరో చూడండి. వారు నన్ను కౌగలించుకొని, మా ప్రియ సోదరుడా అని పిలచిరి. నన్ను వారు చూచుటకు ఎంతో సంతోషించుచున్నట్లుగా చెప్పిరి. వారందరూ ఎవరా అని నేను ఆశ్చర్యపడుచుండగా, ఒకతను నా ప్రక్కనే యుండి ఇట్లనెను, "వారు నీ ప్రజలు."

నేను ఎంతో ఆశ్చర్యము పొంది ఇట్లడిగాను, "వీరందరూ బ్రన్హం లేనా?"

"కాదు, వారందరూ నీ ద్వారా మార్పుపొందినవారు," అని అతను చెప్పెను. ఆ తరువాత అతడు ఒకామెను చూపించి, నాతో ఇట్లు పలికెను, "ఒక్క క్షణం క్రితం నీవు ఎంతో అభినందించిన ఆ యువతిని చూడుము. ఆమెను నీవు ప్రభువు యొద్దకు నడిపించినప్పుడు, ఆమె వయస్సు 90 సంవత్సరాలు."

"అవునా? దీనిని తలంచుకొని నేను భయపడితిని," అని చెప్పాను.

"మేము ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసికొనుచున్నాము. ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురుచూచుచున్నాము," అని అతడు చెప్పెను.

"ఆయనను నేను చూడగోరుచున్నాను," అని చెప్పాను.

"ఇంకా నీవాయనను చూడలేవు, ఆయన త్వరగా రాబోవుచున్నాడు,

ఆయన వచ్చినప్పుడు మొదటగా నీ యొద్దకే వచ్చును. నీవు బోధించిన సువార్తను బట్టియే నీకు తీర్పు తీర్చబడును. మేము నీ యొక్క అనుచరులము," అని అతడు చెప్పెను.

"వీరందరికిని నేను బాధ్యుడనియా నీ అర్ధము," అని ప్రశ్నించాను.

"అందరూ బాధ్యులే, కాని నీవు నాయకునిగా జన్మించియున్నావు," అని చెప్పాడు.

"అందరూ బాధ్యులుగా యుందురా?" అయితే పౌలు మాట ఏమిటి? అనడిగాను.

"అతని దినమునకు అతడు బాధ్యుడుగా యుండును," అని చెప్పెను.

"అయితే నేను పౌలు బోధించిన సువార్తనే బోధించాను," అని చెప్పెను. అప్పుడు జనులందరూ, "మేము దాని మీదనే ఆనుకొనియున్నాము," అనిరి.

దేవుడు వారికి అప్పగించిన బాధ్యతను నమ్మకముగా నేరవేర్చిన వర్తమానికులందరికి ప్రత్యేమగు బహుమానము ఇచ్చుటను నేను చూచాను. వారు ఆ కాలమునకు చెందిన వాక్య ప్రత్యక్షతను పొందుకొని, తమ కాలములో దానిని నమ్మకముగా బోధించి తమ బోధ ప్రకారముగానే జీవించినచో, వారు గొప్ప బహుమానమును పొందుదురు.

ఈ తలంపును మనస్సులో యుంచుకొని, ఈ వచనమును మరల చూద్దాం. "మరుగైయున్న మన్నాను వానికి నేనిచ్చెదను." మన్నా అనునది దేవదూతల యొక్క భోజనమని మనకు తెలియును. ఇశ్రాయేలీయులు యాత్ర చేయుచున్న దినములలో, దేవుడు గడ్డిమీద దానిని కురిపించెను. అది పరిపూర్ణమగు ఆహారము. ఈ చిన్న ఆహారపు తునకలు వారిని ఎట్లు ఆరోగ్యవంతులుగా యుంచెనో, తలంచినప్పుడు, ఆశ్చర్యము కలుగును. ఎవరునూ జబ్బు పడలేదు. వారికి అవసరమగునదంతయూ అదే. మందసము తయారు చేయునప్పుడు దానిలో కొంత మన్నాను వారుంచిరి. తెరకు వెనుక వారు ఆ మందసమును ఉంచిరి. ప్రధాన యాజకుడు మాత్రమే ధైర్యముగా దానిని సమీపించగలడు. బలిగా అర్పించబడిన రక్తమును అతడు తీసికొనిపోవును. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము, మన్నాకు సాదృశ్యముగా యున్నది. ఒక దినమున పరలోకము నుండి దిగివచ్చెను. ఆయన యుందు విశ్వాసముంచు వారందరికిని జీవముగా మారెను. "జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ ఆహారమును తినువాడు ఎన్నటికిని చనిపోడు," అని ఆయన చెప్పెను. ఆయన వెళ్ళిపోయినప్పుడు, ఆయన మనకొరకు తన వాక్యమును విడిచి వెళ్ళెను. "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును."

ఆయన మాటయే ఆహారము. అది పరిపూర్ణమగు మన్నా, దానిద్వారా జీవించువాడు ఎన్నిటికిని చనిపోడు. పితరులు చనిపోయిన తరువాత కూడను ఎవరూ ఈ సత్యమును సరిగ్గా గ్రహించినట్లుగా లేరు. కొద్ది కాలములోనే ఈ మన్నా జనులకు కనబడకుండా మరుగైనట్లుండెను. కాని ఆ కాలములో నుండియే దేవుడు దాయబడిన మన్నాను ప్రత్యక్షత్ర ద్వారా తిరిగి అనుగ్రహించుచుండెను. ఈ చివరి దినము వరకును అది జరుగుచునేయున్నది. ప్రకటన 10:7 ప్రకారము, ఒక ప్రవక్త వచ్చును మరియు మర్మములన్నియూ బయలుపరచును మరియు అప్పుడు ప్రభువు వచ్చును. ప్రతి కాలములోను ఈ వర్తమానికులు దాచబడిన సత్యమును కనుగొనియున్నారని నేను చెప్పుచున్నాను. కాని దానిని వారు తమ కొరకు మాత్రమే పొందలేదు, జన సమూహములకు రొట్టెలు మరియు చేపలు వడ్డించుడని ఆయన తన శిష్యులతో చెప్పినట్లుగానే, ఇది యున్నది. యేసు విరిచిన ఆహారమును వారికి ఇచ్చెను, కానీ వారు దానిని ప్రజలకు ఇచ్చిరి. దేవుడు జయించువానికి మరుగైయున్న మన్నాను ఇచ్చుచున్నాడు. ఇది మరొకటి కొదు. ఇది వరకు బయలుపరచబడిన దానిని త్రోసివేసినవారికి ఆయన తన నిధులను తెరువడు.

నేను మొదటినుండి ఈ సంగతిని చెప్పుచూ యున్నాను. ప్రతి కాలములోని వర్తమానికుడు దేవుని యొద్ద నుండి పెంతెకోస్తు యొక్క అసలు సత్యములోని కొంత భాగమును పొందుచునేయున్నాడు. పాత నింబంధనలోని దీని మాదిరిని చూడండి, మోషేకు దేవుడు ఆజ్ఞాపించెను, మూడున్నర సేరుల మన్నాను తీసికొని దానిని బంగారు పాత్రలో పెట్టి, అతిపరిశుద్ధ స్థలము వెనుక గల తెరయందుంచవలెను. అక్కడికి ప్రతి తరములోని ప్రధాన యాజకుడు బల్యార్పణ రక్తముతో ప్రవేశించును. అప్పుడు దానిలోని కొద్దిపాటి మన్నాను అతడు తీసికొనును. (ఎందుకనగా అది చెడిపోలేదు) అతడు దానిని భుజించును. ప్రతి కాలములోను ప్రభుని యొక్క వర్తమానికుడు, ఆ కాలము యొక్క ప్రత్యక్షతను పొందును. ఆ ప్రత్యేక కాలమునకు దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించును. ఒకసారి గనుక వర్తమానికుడు సత్యముతో వెలిగించబడినయెడల, అతడు ఆ సత్యమును జనుల యొద్దకు తెచ్చును. ఆత్మ ద్వారా ఎవరి చెవులయితే తెరువబడునో వారు ఆ సత్యమును విని, నమ్మి, దాని ప్రకారముగా జీవించెదరు.

దాచబడిన మన్నా యొక్క భవిష్యత్తు పాలిభాగము గురించిన ఆలోచన కూడా ఇక్కడున్నది. రాబోవు నిత్య యుగములలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలో నిత్య భాగము పొందుటయై ఇది యున్నదని నేను తలంచుచున్నాను. ఆయన యొక్క వ్యక్తిత్వము యొక్క నిగూఢ సంపదలను మనమెట్లు తెలిసికొనగలము? దానిని ఎక్కడ ప్రారంభించవలెనో మనకు తెలియదు. దానిని తెలిసికొనవలెనని ఎప్పటినుండియో ఎదురుచూచుచున్నాము. ఎన్నో మనకు జవాబు దొరకని ప్రశ్నలున్నవి, అవన్నియూ అప్పుడు బయలుపరచబడును. క్రీస్తు యొద్ద నుండి అవి దొరకును, అయనే మన జీవము. దానిని ఆయన యొద్ద నుండి పొందుదుము. ఆయనను గూర్చి ఆయన వాక్యము గూర్చి కొద్దిగా మనము తెలిసికొనినచో బాగుండునని కొన్నిసార్లు తలంచుచుందుము. అది చాలా మంచిదే. అందువలన మనకు సంతోషము దొరకును, కాని ఒక దినమున మన శరీరమే మార్పుపొంది, ఆ వాక్యము మరియు ఆయన ఏకమగుదురు మరియు ఇది ఎన్నడూ సాధ్యము కాదని మనము కలగని యుందుము.

జయించు వానికి ఒక తెల్లని రాతిని ఇచ్చుదునని కూడా ఆయన ఇక్కడ చెప్పుచున్నాడు. ఆ రాతిలో (మీద కాదు) ఒక క్రొత్త పేరున్నది. అది ఎవరికి చెందునో వారు మాత్రమే దానిని ఎరుగుదురు. ఒక క్రొత్త పేరు యొక్క ఉద్దేశ్యము ఇప్పుడు చాలా పరిచితమే. అబ్రాము అబ్రహాముగాను, శారయి శారగాను, యాకోబు ఇశ్రాయేలు గాను, సీమోను పేతురు గాను, సౌలు పౌలు గాను మారిరి. ఈ పేరులు ఒక మార్పును తెచ్చినవి లేదా మార్పుపొందిన తరువాత ఇవ్వబడినవి. అబ్రాము మరియు శారయిల పేర్లు మారిన తరువాతనే వారు ప్రభువు యొద్ద నుండి కుమారుని పొందుటకు సిద్ధపడిరి. యాకోబు విషయము చూడండి, అతడు జయింపవలసియున్నాడు, అప్పుడు యువరాజు అగును. సీమోను మరియు సౌలు విషయములో నయితే వారు ప్రభువును చేర్చుకొనినప్పుడు వారి పేర్లు మారినవి. ఈ రోజున నిజ విశ్వాసులమగు మనందరి యొక్క పేర్లు మారియున్నవి. మనము క్రైస్తవులము. అది మనందరికిని వర్తించు సామాన్య నామము. కాని ఒక దినమున మనకు మరియొక్క మార్పు వచ్చును. మనము నిశ్చయంగా ఒక క్రొత్త పేరును పొందెదము. అది మన యొక్క నిజమగు అసలు పేరుగా ఉండును. ఆ పేరు జగత్తు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడియున్నది. ఆయనకు ఆ పేరు తెలియును గాని, మనకు తెలియదు. ఒక దినమున ఆయన చిత్తానుసారముగా మనకు కూడా తెలియచేయబడును.

ఒక తెల్లని రాయి. ఎంత చక్కగా యున్నది. భూమి మీద తను అనుభవించిన శోధనలకు ప్రతిఫలముగా, పరిశుద్ధుడు దేవుని యొక్క చేతిలో నుండి బహుమానము పొందు చిత్రమును మరియొక దానిని ఇక్కడ మనము చూచుచున్నాము. మీరెరుగుదురు, కాన్స్టాంటైన్ తరువాత అబద్ధ సంఘము రాజ్యము ఖాజానాలో తన చేతిని ముంచి దానిద్వారా అందమగు భవనములను నిర్మించి చక్కని విగ్రహములను అందులో ప్రవేశపెట్టెను. ఈ విగ్రహములను, తెల్ల చలువ రాళ్ళతో చేసిరి, నిజానికి అవి రోమనుల విగ్రహములు. వాటికి పేర్లు మార్చి పరిశుద్ధుల పేర్లు పెట్టిరి. సంఘములు మరియు వాటి యొక్క అలంకరణలు అపురూప సుందరముగా ఉన్నవి. నేటికిని మీరు వాటిని చూడగలరు. కాని దేవుడు వాటి పక్షముగా లేడు. దేవుడెక్కడున్నాడు? ఆయన తన పరిశుద్ధులతో ఎక్కడో చిన్న గృహములోను, లేక గుహలోను, లేక ఏదో అడవిలోని కొండల మీదను యున్నాడు. అబద్ధ సంఘపు వారివలన వారు శ్రమను పొంది పారిపోయిరి. వారికి అందమగు భవనములు లేవు, గౌనులు ధరించిన సంగీత బృందములు లేవు, చక్కటి బట్టలు లేవు, ఇతర లోకాకర్షణలు లేవు. అన్ని యుగములలోను ఉన్న ఈ నిజవిశ్వాసులకు ప్రత్యేకమగు వాగ్దానమును ఇప్పుడు చూచిన, మహా అందమును నిత్యమన్నికను కలిగియుండు బహుమానములను ఆయన వారికి ఇచ్చునని ప్రకటించుట జరిగినది. ధనికులు పేదల వైపు చూడనీయండి. ఎక్కువ మొత్తమును వారు సంఘమునకు ఇచ్చునట్లు చూడండి. వారు తమ పేరును తెల్లని చలువరాయి ఫలకము మీద చెక్కించుకొని జనులందరికీ కనబడునట్లుగా పెట్టించుకొనుచున్నారు, లేదా తమ ఘనత కొరకు ఒక కట్టడమును కట్టించుకొని జనులు గొప్పగా చెప్పకొనవలెనని ప్రదర్శించుకొనుచున్నారు. ఒక దినమున సర్వమునూ చూచుచూ, సర్వమునూ ఎరిగిన దేవుడు, తనకున్నదంతయూ ఇచ్చిన విధవరాలిని ప్రశంసించినట్లుగా మరొక్కసారి అట్టివారిని ప్రశంసించును, అవి రెండు కాసులే కావచ్చును, కాని ఆయన స్వయంగా, పరలోక నిధులతో బహుమానమును ఇచ్చును.

అవును, మరుగైయున్న మన్నా మరియు తెల్లని రాయి మీద ఒక క్రొత్త పేరు. ప్రభువు మనపట్ల ఎంత మంచిగా యున్నాడో చూడండి. ఎంతో అద్భుతముగా మనకు ప్రతిఫలము ఇచ్చుచున్నాడు. మనకు ఆ అర్హత లేదు. ఓ! నేను అన్నివేళలను ఆయన యొక్క చిత్తమును చేయుటకు సిద్ధముగా యుండగోరుచున్నాను. పరలోకమందు నిధులను దాచుకొనగోరుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...