కాలముల యొక్క సంగ్రహము

కాలముల యొక్క సంగ్రహము

ఏడు సంఘ కాలములకు చెందిన లేఖన భాగములను ఒక్కొక్క వచనము అనుసరించి మనము అధ్యయనము చేసిన విధముగా వాటిని సవివరముగా చూచాము, కానీ సంఘము యొక్క ఒక నిరంతర చారిత్రక మాదిరిని మనము రూపొందించలేదు. ఆలాగు మనము చేసియుండవలసినది, కాబట్టి ఈ అధ్యయమును తీసికొనుటలో మన ఉద్దేశ్యము ఒకటున్నది, ఎఫెసు కాలము మొదలుకొని అన్ని యుగములలోను గల సంఘ చరిత్రను దేవుని ఆత్మ ద్వారా యోహానుకియ్యబడిన ప్రకారము పరీక్షించితిమి. ఇంతకు ముందే మనము నేర్చుకొనిన సంగతులకు సంబంధించిన క్రొత్త సంగతులను జతపరచుట తప్ప అదనంగా వాటికేమియూ చేర్చుట లేదు.

మన అధ్యయనములను బట్టి ఇంతకు ముందే మనము నేర్చుకొనియున్న ప్రకారము ప్రత్యక్షతలో ఎక్కువ భాగమును పూర్తిగా అపార్ధము చేసికొనుట జరిగినది, ఎందుకనగా సంఘమును గూర్చి ఇందులో చెప్పుట జరిగినది గాని, సంఘమునకు ఇది చెప్పినట్లుగాని, ఈ గ్రంథములో ఇంతకు ముందు మనకు తెలియదు. పవిత్ర "ఎక్లీషియా" "ఏర్పరచబడినది," "క్రీస్తు యొక్క శరీరము" "వధువు" అని చెప్పబడలేదు, కాని ఇది క్రైస్తవులు అని పిలువబడిన పూర్తి శరీరముతో మాట్లాడుచున్నది. వారు నిజమైన వారయైనా కావచ్చు లేక నామకార్ధులయినా కావచ్చును. ఇశ్రాయేలీయులందరూ ఏలాగయితే ఇశ్రాయేలీయులు కారో, ఆలాగే క్రైస్తవులందరూ క్రైస్తవులు కారు. ఆ విధముగా సంఘము రెండు ద్రాక్షావలులతో తయారైనదని మనము నేర్చుకొనుచున్నాము. నిజమగు ద్రాక్షావల్లి మరియు కారు-ద్రాక్షావల్లి. ఈ రెండు ద్రాక్షావల్లులు రెండు ఆత్మల వలన పనిచేయుచున్నవి. ఒకటి పరిశుద్ధాత్మ మరియొకటి క్రీస్తు-విరోధి ఆత్మతో నింపబడియున్నది. రెండునూ దేవుని పక్షముగా మాట్లాడుకొనుచున్నట్లుగా చెప్పుకొనుచున్నవి. రెండును కొన్ని మూల సూత్రములను నమ్ముచున్నవి. మరికొన్నింటి విషయములలో వేరుపడుచున్నవి, కాని ఇద్దరును ప్రభువు యొక్క నామమును భరించుచున్నందున, క్రైస్తవులుగా పిలువబడుచున్నందున, ఆ నామమును ధరించుకొనుట ద్వారా ఆయనతో సంబంధము ఏర్పరచుకొంటిమని చెప్పుకొనినందున, (దానిని దేవుడు పెండ్లి అని పిలచుచున్నాడు), దేవుడు ఆ ఇద్దరినీ ఇప్పుడు బాధ్యులనుగా చేసి ఇద్దరితో మాట్లాడుచున్నాడు.

కాలములు ముగియు వరకు ఈ రెండు ద్రాక్షావల్లులు ప్రక్క ప్రక్కనే ఎదుగునని రెండునూ పరిపక్వమునకు వచ్చి కోయబడును అని మనము నేర్చుకొనియున్నాము. కారు-ద్రాక్షావల్లి జయించనేరదు, మరియు నిజమగు ద్రాక్షావల్లిని నాశనము చేయజాలదు. ఆ విధముగానే నిజమగు ద్రాక్షావల్లి కారు-ద్రాక్షావల్లిని జయించి యేసు క్రీస్తుతో సంబంధము కలిగియుండునట్లుగా రక్షించజాలదు.

అతి ఆశ్చర్యకరమగు సత్యమును మనము నేర్చుకొనియున్నాము. మారుమనస్సు లేని కారు-ద్రాక్షావల్లి క్రైస్తవుల మీద పరిశుద్ధాత్మ దిగును. వారు శక్తిగల ప్రత్యక్షతలను కలిగియుందురు. ఆ యా సూచక క్రియలు, అద్భుతములు జరిగించెదరు, యూదా కూడా ఖచ్చితమైన పరిశుద్ధాత్మ పరిచర్యను కలిగియుండెను, అయినా గాని అతడు అపవాది.

ఈ సూత్రములను మనము మనస్సులో యుంచుకొని ఏడు కాలములలో సంఘము యొక్క దశలను మనము గమనించవలెను.

సంఘము పెంతెకోస్తు యొద్ద జన్మించెను. మొదటి ఆదాముకు దేవుడు తన హస్తముతో నూతన వధువును ఇచ్చెను, కొంతకాలము పాటు ఆమె అపవిత్ర పరచబడలేదు. ఆ విధముగానే కడపటి ఆదామగు క్రీస్తునకును పెంతెకోస్తు యొక్క ఒక పవిత్రమగు నూతన వధువు ఇవ్వబడెను. ఆమె కొంతకాలము పాటు ప్రత్యేకముగాను, పవిత్రము గాను నిలచియుండినది.

"కడమ వారిలో ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు." (అపో, కా. 5:13) మరియు"ప్రభువు రక్షణపొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను."

అపో, కా 2:47.

ఇదెంతకాలము కొనసాగినదో మనకు తెలియదు. కాని ఒక దినమున హవ్వ సాతాను ద్వారా శోధించబడి మోసపుచ్చబడిన ప్రకారముగానే సంఘము కూడా క్రీస్తు-విరోధి యొక్క ఆత్మ వలన చెరపెట్టబడినది.

"క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. యిది వరకే అది లోకములో యున్నది."

I యోహాను4:3.

యేసు తన వధువును గూర్చి మొదటి కాలములో చెప్పినట్లుగా,

"అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకముచేసికొని మారుమనస్సు పొందుము.

ప్రకటన2:4-5.

మొదటి కాలములోనే సంఘము ఒక 'పడిపోయిన స్త్రీగా' యున్నది. సాతాను ఆదాము కంటె ముందు హవ్వను కలిసినది, అదే విధంగా క్రీస్తు యొక్క వధువు అయి యున్న సంఘమును, 'గొర్రెపిల్ల పెండ్లి మహోత్సవ విందునకు' ముందే సాతాను మోసము చేసినది. ఆమె పడిపోవుటకు ప్రత్యేకముగా ఏమి కారణము? ప్రకటన 2:6, "నీకొలాయితుల యొక్క క్రియలు," దేవుని యొక్క పవిత్ర వాక్యమును వెంబడించుటను ఆ మొదటి సంఘము మానివేసినది. దేవుడు కోరిన విధంగా వారు లేరు. సంఘము ఆయన మీదనే ఉండవలెనని ఆయన కోరెను. (పూర్తిగా దేవుని మీదనే ఆధారపడి ఆయన వాక్యమును నెరవేర్చవలెను. ఆది నుండి అంతము వరకును ఆలాగే యుండవలెను. మానవ ప్రభుత్వమునకు వేరై యుండవలెను) కాని నీకొలాయితుల క్రియలపై ఆధారపడియున్నది. అది ఒక మానవ ప్రభుత్వ సంస్థగా సంఘములోనే యున్నది, అన్ని ప్రభుత్వములవలెనే ప్రజల కొరకు శాసనములను రూపొందించెను. వారు ఇశ్రాయేలీయులు చేసినట్లుగానే చేసిరి. వారు వాక్యమును ఆత్మను విసర్జించి అందుకు బదులుగా మానవ ప్రయత్నములను ఏర్పరచుకొనిరి.

మరణము ప్రవేశించినది. మనకెట్లు తెలియును? మొదటి కాలములోని ఆత్మ స్వరమును మనము వినలేదా? వినగలవారందరికీ ఆయన చెప్పుచున్నాడు. "జయించు వానిని దేవుని పరదైసులో యుండిన జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును." అప్పటికే సంఘములో మరణము చాలా లోతుగా పాతుకొనిపోయినది. (అదే శాఖా సంబంధమగు కారు-ద్రాక్షావల్లి) వారి అంతము అగ్నిగుండము. కాని ఇప్పుడు జీవ వృక్షమును కాపు కాయుటకు అగ్నిజ్వాలల ఖడ్గములతో కెరూబులు ఎవరూలేరు. దేవుడు ఏదేను తోటలో నుండి వెళ్ళిపోయినట్లుగా ఇప్పుడు సంఘము మధ్యలో నుండి వెళ్ళిపోజాలడు. ఓ, లేదు, చివరి కాలము వరకు ఆయన తన సంఘము మధ్యలోనే ఎల్లప్పుడూ యుండును. ఆ కాలము వరకు ఆయన అందరినీ రమ్మని పిలచుచునే యుండును.

దయచేసి ఇక్కడ జాగ్రత్తగా యుండవలెనని కోరుచున్నాను. ఎఫెసులో యుండిన సంఘపు దూతకు ఈ వర్తమానము ఇచ్చినట్లు చూచాము. కాని ఇది కేవలము ఎఫెసులో యున్న సంఘమునకు మాత్రమే వర్తించదు. ఇది కాలమునకు వర్తమానము. ఆ కాలములో సత్య బీజము ఉన్నది, అయితే తప్పు బీజము కూడా. అక్షరాలా మనము గురుగులు గోధుమలు గూర్చిన ఉపమానములో చూచినట్లుగానే ప్రవేశించియున్నది. సంఘ కాలములు ఒక పొలము, దానిలోనే గురుగులు, గోధుమలు ఉన్నవి. అబద్ధ సంఘము సంస్థగా మారినది, ప్రభుత్వమును మరియు వాక్యమును మానవ మాదిరిగా తయారు చేసి, నిజ-క్రైస్తవులుతో పోరాడిరి.

గోధుమల కంటెను మరియు ఏ ఇతర నాటిన మొక్కలకంటెను గురుగులు ఎల్లప్పుడూ బలముగానే పెరుగుచుండును. గురుగుల సంఘము ఈ మొదటి కాలములో చాలా వేగముగా పెరుగుచుండెను. కాని గోధుమల సంఘము కూడా వర్ధిల్లుచున్నది. మొదటి కాలాంతమునకు నీకొలాయితుల క్రియలు స్థానిక అబద్ధ సంఘములలో వర్ధిల్లు చుండెను. దానిని ఇంకా విస్తరింపచేయవలెనని చాలా ప్రయత్నములు చేయుచుండిరి. దాని ప్రభావము నిజ-సంఘము మీదను పడియున్నది. మహా విశ్వాస వీరులగు పోలికార్పు వంటి వారు కూడా తమ్మును-తాము బిషప్పు లుగా పిలచుకొనిరి. ఆ బిరుదును వాక్యములో ఎక్కడను మనము కనుగొనలేము, దాని అర్ధము బైబిలులో లేదు. అంతేగాకుండా ఆ కాలములో నిజ-సంఘము తన మొదటి ప్రేమను పోగొట్టుకొనినది. పెండ్లీ సమయములో పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె కలిగియుండు ప్రేమకు వివాహమయిన తొలి సంవత్సరములలో ఉండు ప్రేమకు అది సాదృశ్యముగా యున్నది. ఆ సంపూర్తి ప్రేమ చల్లారిపోయి దేవునిని వారు విడిచిపెట్టిరి.

కాని చూడండి. ప్రకటన 2:1 ప్రభువైన యేసు తన సంఘము మధ్యను నిలబడి తన కుడి చేతిలో వర్తమూనికులను పట్టుకొనియున్నాడు అని సూచించుచున్నది. పెండ్లికుమార్తె పడిపోయినది గనుక, సంఘము మంచి-చెడుల మిశ్రమ ద్రాక్షావల్లిగా పెరిగియున్నది గనుక ఆయన విడిచిపెట్టిపోలేదు. అది ఆయన స్వంతము.

రోమా 14: 7-9 ప్రకారము అది అక్షరాలా నిజము.

"మనలో ఎవడును తనకోసమే బ్రదుకడు, ఎవడును తనకోసమే చనిపోడు.మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను, చనిపోయినను ప్రభువు వారమై యున్నాము.తాను మృతులకును, సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను."

సిలువ మీద ఆయన మొత్తం ప్రపంచములోని మనుష్యులందరిని కొనియున్నాడు. వారు ఆయన వారు. ఆయన మృతులకును, సజీవులకును ప్రభువే. (సంబంధము విషయములో కాదు గాని యజమాన్యము విషయములో) తనలో తాను జీవమును మరియు మరణమును కలిగి యుండిన ఆ శరీరము మధ్య ఆయన సంచరించుచున్నాడు.

మొదటి కాలములో నాటబడినది రెండవ కాలములోను, ఇంకా ఆ తరువాత కాలములన్నిటిలోను అనగా పరిపక్వము చెంది కోతకు వచ్చు వరకును ఎదుగుచునే యుండును. ఆ విధముగా స్ముర్న కాలములో సంఘము యొక్క పరిపాలానా చరిత్ర గూర్చి ఆత్మ యొక్క ప్రత్యక్షత్ర ద్వారా ఎక్కువగాను, తేటగాను మనము తెలిసికొనగలము.

ఈ కాలములో కారు-ద్రాక్షావల్లి యొక్క ద్వేషము విస్తరించును. చూడండి, వారు నిజ-సహవాసుల నుండి తమ్మును తాము వేరుచేసికొనిరి. (9వ-వచనము) వారియొద్ద నుండి తొలగిపోయిరి. వారు అబద్ధికులు. వారు తమ యొద్ద లేని దానిని ఉన్నట్లుగా చెప్పుకొనిరి. కాని దేవుడు వారిని నాశనము చేసెనా? చేయడు. "వారిద్దరిని కలిసి ఎదుగనియ్యుడి."

"కాని వారిని ప్రభువు నాశనము చేయవలెను, ఎందుకనగా వారు ప్రభువు యొక్క ప్రజలను నాశనము చేసి వారిని చంపుచున్నారు."

"లేదు, వారిని ఎదుగనియ్యమని ఆయన చెప్పుచున్నాడు. మరణము వరకు 'నీవు నమ్మకముగా యుండి ఇంకా ఎక్కువ నన్ను ప్రేమించుమని ఆయన తన వధువుతో చెప్పుచున్నాడు.'"

ఈ కారు-ద్రాక్షావల్లి సాతాను యొక్క కారు-ద్రాక్షావల్లి కాదని మనము ఏ పరిస్థితుల లోను చెప్పజాలము. వారి సమాజము అదియే (సాతాను). వారు దేవుని యొక్క నామములో కూడుకొనుచూ తాము క్రీస్తు సంబంధులమని అబద్ధము చెప్పుకొనుచున్నారు. వారు బోధించెదరు, ఉపదేశించుదురు, బాప్తిస్మమిచ్చుదురు, ఆరాదించుదురు, సంఘమునకు క్రీస్తు ఇచ్చిన ఆ యా విధులను చక్కగా నిర్వహించెదరు. అయినా గాని వారు దేవుని-సంబంధులు కారు. కాని తాము దేవుని సంబంధులమని చెప్పుకొనుచున్నారు, కాబట్టి ఆయన వారిని బాధ్యులనుగా చేసెను. ప్రతి కాలములోను ఆయన వారితో మాట్లాడుచూ వారిని గూర్చి చెప్పుచుండెను. వారు నిజంగా బిలామును మనకు గుర్తుచేయుచున్నారు. అతనికి ప్రవక్త పనియున్నది. దేవునిని ఎట్లు సమీపించవలెనో సరిగానే అతనికి తెలియును, పవిత్రమగు జంతువులను బలిగా సమర్పించెను. అయినా గాని అతడు 'నిజమగు వాక్య-ప్రవక్త' కాడు. బాలాకును ఘనపరచుటకు వెళ్ళవద్దని దేవుడు అతనితో చెప్పెను, ఏమయినా గాని వెళ్ళవలెనని అతడు ప్రయత్నించెను. బంగారము మరియు గౌరవము తనకు కావలెనని అతడు ఆశించి వెళ్ళగోరెను. కాబట్టి దేవుడు అతనిని పోనిచ్చెను. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము అతని యొక్క అనుమతి పూర్వక చిత్తమునుకు మార్గము ఇచ్చెను, ఎందుకనగా బిలాము యొక్క "హృదయ కోరికను" ఆయన చూచెను. "వెళ్ళమని," దేవుడు అతనితో చెప్పెను. దేవుడు తన మనస్సును మార్చుకొనెనా? మార్చుకోలేదు. బిలాము వెళ్ళుచున్నా గాని దేవునికి స్వంత విధానము ఒకటున్నది. బిలాము దేవుని చిత్తమునకు లోబడలేదు. దేవునికి స్వంత విధానము ఒకటున్నది. నష్టపోవువాడు బిలాము, ఎందుకనగా అతడు వాక్యమును దాటిపోయెను.

ఈ రోజున అదే మన మధ్య జరుగుచున్నది. స్త్రీ ప్రసంగీకులు, సంస్థలు, అబద్ధ-బోధలు మొదలగునవి. ప్రజలు దేవునిని ఆరాధించుచున్నారు, ఆత్మలో ప్రత్యక్షతనందించుచున్నారు, నేరుగా బిలాము వెళ్ళినట్లుగానే వెళ్ళుచున్నారు. దేవుడు తమతో మాట్లాడెనని చెప్పుకొనుచున్నారు, కాని వారు చేయుచున్న పని బయలు పరచబడుచున్న వాక్యమునకు విరుద్ధమైనది. వారితో దేవుడు మాట్లాడలేదని నేను చెప్పను, కాని దేవుడు బిలాముతో రెండవసారి మాట్లాడినట్లు గానే యున్నది. బిలాము యొక్క హృదయములోని కోరికను బట్టి వాక్యమును కాదు గాని, తన స్వంత హృదయ వాంఛను అతడు తీర్చుకొనగోరెనని దేవుడెరుగును. అతడు చివరికి తన 'స్వంత మార్గమునే' అనుసరించెను; ఈ రోజున కూడా దేవుడు జనులను తమ హృదయ కోరిక ననుసరించియే వెళ్ళమని ముందుకు పంపుచున్నాడు. ఎందుకనగా వారు వాక్యమును ఎప్పుడో విసర్జించి యున్నారు. "ఏమి అయినా గాని దేవుని యొక్క చిత్తమే జరుగును." ఆమేన్. దీనిని మీరు చూచిరని తలంచుచున్నాను. కాలములన్నిటిలోను చూచిన దానిని నేను వశపరచుట మాత్రమే కాక, ముఖ్యముగా ఈ చివరి కాలము వారికి సహాయము చేయవలెనని కోరుచున్నాను. ఈ కాలమునకు ఎన్నో ప్రత్యక్షతలు, బయటి ఆశీర్వచనములు యున్నవి. ఈ మొత్తం కాలమంతయూ ఆలాగే యున్నది. 'దేవుని-యొక్క-వాక్యము-బయలుపరచిన-చిత్తమును' వారు వ్యతిరేకించుచున్నారు.

గట్టిగాను మరియు తేటగాను వర్తమానమును పొందిన కాలము ఏదైనా ఉన్న ఎడల, అది ఇదియే. పాత నిబంధన సత్యమును మనమెరుగుదుము. "దాసురాలి యొక్క కుమారుడు స్వతంత్రురాలి యొక్క కుమారుని బాధపరచును. దాసురాలి యొక్క కుమారుడు వెళ్ళగొట్టబడు వరకు ఈలాగు జరుగును." నామకార్ధగుంపు వారు, అబద్ధ-క్రైస్తవులు నిజ-క్రైస్తవులకు విరోధముగా సాతాను ద్వేషమును వెళ్ళగ్రక్కుచూ దేవదూషణ చేయుచున్నది. లవొదికయ కాలాంతములో అబద్ధ-ద్రాక్షావల్లిని దేవుడు వ్రేళ్ళతో కూడా తొలగించు వరకూ ఇది విస్తారమగుచునే యుండును.

ప్రవచనపు ఆత్మద్వారా బయలు పరచబడిన విధముగా మూడవ కాలములో లోకపు-సంఘము నీకోలాయితుల బోధను అనుసరించును. అర్చకులను అర్చకేతరులను వేరు చేయుట క్రమముగా పెరిగియున్నది. బైబిలు సత్యమును అనుసరించి పెద్దల (అనగా స్థానిక సంఘముల యొక్క కాపరులు) వాక్యము ద్వారా మందను ఏలుటను చేయవలెను. కాని ఇప్పుడు 'నీకోలాయితుల క్రియలు' వారిని పరిపాలించుచున్నవి. యాజకులు గౌరవ స్థానములను అలంకరించిరి. ఒకరు పై మరొకరు అధికారులుగా యున్నారు. అది వాక్యములో లేని విధానము, చివరికి అది యాజకత్వముగా మారిపోయినది, మానవులకును మరియు దేవునికిని మధ్యగా యాజకులు నిలబడుట గూర్చి చెప్పిరి. యాజకులకు కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చిరి. అర్చకులు కాని వారిని, వారికి దేవుడిచ్చిన హక్కులను వీరు కాలరాయుచుండిరి. ఇదే అతిక్రమణ. ఈ కాలములో అది ఒక బోధగా తయారైనది. సంఘములో అది దేవుని యొక్క వాక్యమును అంత నిశ్చయముగా చెప్పబడినది. కాని అది నిశ్చయముగా కాదు. కాని మతగురువులు దానిని దేవుని వాక్యమని పిలువసాగిరి, కావున ఆ బోధ క్రీస్తు-విరోధి-బోధ.

మానవ ప్రభుత్వములో రాజకీయము పూర్తిగా ఇమిడియున్నది, ఇది సామాన్య విషయము. సంఘము రాజకీయములలో చొచ్చుకొనిపోసాగినది, ఈ జోక్యమును ఒక నియంతగు-చక్రవర్తి ఆహ్వానించెను, సంఘ-రాజకీయములను రాజ్య-రాజకీయములతో అతడు ఏకము చేసెను. బలము చేత అబద్ధ సంఘమును స్థాపించెను (సాతాను యొక్క అబద్ధ-మతము) దానిని నిజమగు మతమనెను. ఆయా నీతి శాస్త్రముల ద్వారా చాలామంది చక్రవర్తులు అబద్ధ-సంఘమును రాజ్య రాజకీయములతో ఏకము చేసి నిజమగు-ద్రాక్షావల్లిని మరి బాహాటముగా నాశనము చేయసాగిరి.

విచారకరమగు సంగతి ఏమనగా నిజమగు-ద్రాక్షావల్లి ఈ బోధను సంపూర్తిగా నిరోధించలేకపోయెను. నీకొలాయితుల అభిప్రాయములను నిజమగు-ద్రాక్షావల్లి ఒక బోధగా స్థాపించెనని దీని అర్ధము కాదు. అందుకు దూరముగా యున్నది, కాని ఆ చిన్న మరణ పురుగు నిజమగు-ద్రాక్షావల్లిని పట్టుకొని పీడించుచూ అది పడిపోవలెనని ఎదురుచూచుచుండెను. నిజ-సంఘములోనే కాపరులుగా యున్న వారు స్థానికులకంటె మేము ఎక్కువ వారమని చెప్పుకొనసాగిరి. ఈ కాలములో సంఘములోని వారు పౌలు యొక్క భోధలను అర్థము చేసికొనలేదు. "వారు నాలోని ప్రభువును మహిమపరచిరి," అని పౌలు చెప్పెను. పౌలుకున్న అధికారమును లెక్క చేయలేదు. అతడు దేవునిని జనులు చూచునట్లుగా చేసెను. ఎందుకనగా సమస్త అధికారము ఆయనకే చెందును, కాని మత గురువులు ఎల్లప్పుడును మానవునితో కలిసియున్న దైవిక నాయకత్వమును చూచిరి. ఆ విధముగా వారు ఘనపరచకూడని వారిని ఘనపరచసాగిరి. నిజ-సంఘము కూడా మానవతా వాదముతో మచ్చను పొందియున్నదని మనము చూడగలము. నీకొలాయితుల బోధను స్థాపించిరి — అపోస్తలుల వారసత్వమును స్థాపించిరి — సేవకులను నియమించిరి — సంఘకాపరులు వోట్లు వేసిరి. అబద్ధ-సంఘము బిలాము యొక్క మార్గమును అనుసరించుటలో ఒక్క అడుగు దూరములోనే ఉన్నారు. 'సాతాను-యొక్క-లోతుల' (depth of Satan) లోనికి వెళ్ళుటకు వారు రెండవ అడుగు వేయుదురు. అదిప్పుడు పూర్తి అభివృద్ధిలో యున్నది.

బిలాము యొక్క బోధయే ఈ రెండవ అడుగు. (ప్రకటన 2:14లో వివరింపబడెను) ఒక 'ఐక్య కూటము' ద్వారా ఇశ్రాయేలీయులు త్రోవ తప్పునట్లుగా బిలాము బాలాకునకు నేర్పెను. ఆ అతిథులు దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా మరి రెండు సంగతులు జరిగించుదురు. మీకది గుర్తుండి యుండును. తన రాజ్యమునకు సహాయము చేయుటకు బాలాకునకు ఒకటి అవసరమయ్యెను. ఆ దినములలో గొప్ప అధికారముగల ఆత్మీయ నాయకునిగా పేరొందిన బిలామును అతడు పిలచెను. ఇశ్రాయేలీయులను వలలో పడవేసి నాశనము చేయు సలహను బిలాము ఇచ్చెను. అన్నిటికన్న ముందు ఇచ్చిన సలహా చూడండి, అందరూ ఒకచోట కలిసికొని సంగతులు చర్చించుకొని కలిసి భోజనము చేసి విషయములను సరిదిద్దుకోవలెనని సూచించెను. ఒకరినొకరు అర్థము చేసికొనవలెనన్నచో చాలా సమయము కావలెను. ఒకసారి దానిని నీవు స్థాపించుకొనినయెడల అక్కడ నుండి నీవు ఎంత దూరమైనా పోగలవు. ఆ తరువాతి మొట్టు, కలిసి ఆరాధన చేయుట. అవతలి వారు బలవంతము చేయుట వలన అతిధులు అనుకొనిన దాని కంటె కొద్దిగా ఎక్కువగానే ముందుకు వెళ్ళక తప్పదు. పాత నిబంధనలోని దేవుని సంఘమునకు మాత్రమే ఇది జరుగలేదు గాని, క్రొత్త నిబంధన సంఘమునకు ఇది జరిగినది. బాలాకు వంటి ఒక చక్రవర్తియున్నాడు, అతడు తన రాజ్యము విషయములో సహాయము చేయుమని కోరెను.

కావున కాన్ స్టాంటయిన్ నామకార్థ-క్రైస్తవులను ఆహ్వానించెను. రోమ్ యొక్క మొదటి క్రైస్తవ సంఘము అతనికి సహాయము చేయుటకు క్రైస్తవులు వచ్చిరి, ఎందుకనగా క్రైస్తవులు ఎక్కువ సంఖ్యలో యుండిరి. దాని యొక్క ఫలితమే 325లోని నైసియను ఆలోచన సభ, అక్కడ నిజ-క్రైస్తవులు, నామకార్ధ-క్రైస్తవులు ఇరువురును ఏకముగా కూడివచ్చిరి. కాన్ స్టాంటయిన్ వారిని ఆహ్వానించెను. నిజ-క్రైస్తవులకు ఆ కూటమునకు వెళ్ళవలసిన అవసరము ఏమీ లేదు. కాన్ స్టాంటయిన్ వారినందరినీ ఏకము చేయగోరెను, కాని ఆ చోటికి తాము వెళ్ళుచున్నామని నిజ-విశ్వాసులకు తెలిసి, వెళ్ళిపోయిరి. కాని నిలిచియున్నవారికి; రాజ్యఖజానాను, రాజకీయ, శారీరక అధికారమును కాన్ స్టాంటయిన్ ఇచ్చెను. జనులకు విగ్రహారాధన, భూతఆరాధన పరిచయము చేయబడెను మరియు పరిశుద్దుల పేరుగల విగ్రహములు భవనములలో ప్రవేశపెట్టబడినవి. మృతులతో మాట్లాడుటను జనులకు నేర్పింరి, లేదా పరిశుద్దులకు ప్రార్ధనలు చేయుటను నేర్పించిరి, ఇది భూతారాధన తప్ప మరేమీకాదు. మానవులకు నిజంగా కావలసినది దేవుని వాక్యాహారాము. కాని వీరికి ఆచారములు, సిద్దాంతములు, సంప్రదాయము పూజలు ఇయ్యబడినవి. వాటిని రాజ్యము బలవంతముగా వీరి మీద రుద్దినది, అన్నిటికంటె పైగా వారికి ముగ్గురు దేవుళ్ళు ఇవ్వబడి, ఒకే నిజ-దేవునికి మూడు బహుళ నామములను పెట్టి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిస్మమును ఇచ్చుటకు బదులుగా మూడు బిరుదులలో అన్య-బాప్తిస్మమును ఇయ్యసాగిరి.

నిజ-విశ్వాసులు అక్కడికి వెళ్ళియుండవలసినది కాదు. అప్పటికే వారు ఎంతో సత్యమును పోగొట్టుకొనిరి, మరియు ఇప్పుడు వారు దైవత్వము గూర్చి తమకు గల అవగాహనను పోగొట్టుకొనుచున్నారు. నీటి బాప్తిస్మమును నామములో ఇచ్చుటకు బదులుగా బిరుదులలో ఇయ్యసాగిరి.

ఈ బిలాము యొక్క బోధను జాగ్రత్తగా గమనించండి. చెడిపోయిన మత గురువులు జనుల కళ్ళకు గ్రుడ్డితనమును కలుగజేయసాగిరి. ఇందుకు వారు బహిరంగముగానే ప్రయత్నములు చేయుట మనము అన్నిటికంటె పైగా గమనించవలెను. ప్రజలను బాహాటముగా వారు అవిశ్వాసమును పాపములోనికి నడిపించసాగిరి. నీకొలాయితుల బోధ మతగురువులను చెరచినది. వారిలో వారు రాజకీయాధికారము కొరకు కుమ్ములాడు కొనసాగిరి. బిలాము తన బోధ ద్వారా జనులను వారి యొక్క ఆచారముల వైపునకు, విగ్రహారాధనవైపునకు మళ్ళించి వారిని వశపరచుకొనెను. దీనినిప్పుడు జాగ్రత్తగా గమనించండి. ప్రజలను నామకార్థ సంఘములో బంధించి, దాని తరువాత వారిని నాశనము చేయునది ఏమిటి? ఆచారములు మరియు సంఘములో రూపొందించబడిన బోధలు. అది రోమను కాథలిక్కు సంఘము యొక్క బోధ. వాక్యమును నిజాహారము వారికి అనుగ్రహించబడలేదు. విగ్రహారాధన నుండి, బబులోనీయ అన్యత్వము లోపట యుండి క్రైస్తవ పదజాలముతో పిలచిన ఆరాధన నుండి వచ్చిన ఆహారమును వారికి అందించిరి.

అదే ఆత్మ మరియు బోధ ప్రొటస్టెంటు వారి మధ్యను ఉండి శాఖ (DENOMINATION) అని పిలువబడుచున్నది. నీకొలాయితుల బోధ ఒక సంస్థగా యున్నది, సంఘము యొక్క నాయకత్వమును మానవపరం చేసిరి, ఆవిధంగా ఆత్మను వారు త్రోసివేసిరి. బిలాము బోధ ఒక శాఖగా మారినది. బైబిలునకు బదులుగా వారు సంఘ పుస్తకమును వాడుట ప్రారంభించిరి. ఈ ఘడియ వరకు కూడా చాలా మంది దేవుని ప్రజలు శాఖ యొక్క ఊరిలో చిక్కుకొని యున్నారు. దేవుడు వారిని పిలచుచున్నాడు, "దాని యొక్క పాపములలో పాలుపొందకుండునట్లును, దాని తెగుళ్ళు మీకు సంప్రాప్తించకుండునట్టును దానిలోనుండి బయటకు రండి." వారు అజ్ఞానులుగా యున్నారని మీరు చూడగలరు. ఈ క్షణములో గాని రాకడ వచ్చినట్లయితే అజ్ఞానమును బట్టి తీర్పును తప్పించుకొనజాలరు. తెలియదని చెప్పి చేసిన తప్పును బట్టి దేవుని తీర్పులో నుండి తప్పించుకొనజాలరు.

మత గురువులు ఒకరి మీద ఒకరు హోదాను పొందియుండి చివరికి వారి పైన ఒక అధ్యక్షుడున్నాడు. అదే క్రీస్తు-విరోధి యొక్క ఆత్మ ప్రత్యక్షత, అది ఎంతో అద్భుతము గాను, అవసరముగాను కనిపించ వచ్చును, కాని అది మానవ హేతుబుద్ధి తప్ప మరేమియూ కాదు. వాక్యము యొక్క చోటును అది ఆక్రమించినది. సంస్థాగత శాఖలలో యుండిన ఏ వ్యక్తి అయినా గాని అంత్య-క్రీస్తు వ్యవస్థ యొక్క మధ్యలో యున్నట్లే. నేను దీనిని ఇంకా తేటగా మరియు క్లుప్తంగాను చెప్పెదను. "నేను జనులకు వ్యతిరేకముగా లేను. నేను ఆ క్రమమునకు వ్యతిరేకముగా ఉన్నాను." I AM NOT AGAINST THE PEOPLE. I AM AGAINST THE SYSTEM.

సంఘము మరియు రాజ్యము ఏకమవుటతో అంధకార యుగములకు సంఘము సిద్ధమయినది. దాదాపుగా 1000 సంవత్సరముల పాటు సంఘము నిశ్చయంగా చీకటి అంధకారములోనికి పోయినది. సాతాను యొక్క లోతుల లోనికి పోయినది. ఏ మత జనులయినా గాని బిలాము బోధను, నీకొలాయితుల బోధను నమ్ముచున్నారంటే వారు రాజకీయ, ఆర్ధిక, భౌతికబలములను వెంటాడుచున్నారని అర్ధము. వారు అప్పుడు ఒకే మార్గములో పయనించగలరు. వారు తిన్నగా యెజెబెలు బోధలోనికి వెళ్ళేదరు.

దీనిని ఇప్పుడు మేము ఎందుకు చెప్పుచున్నాము? ఎందుకనగా నాలుగవ సంఘకాలములో చెప్పిన దానిని బట్టి యొజెబెలు సీదోనీయురాలు, ఎతుభాయెలు కుమార్తె, అతడు అప్టార్తేకు యాజకుడు. అతడు హంతకుడు. రాజకీయ లాభము కొరకు ఈ స్త్రీ ఆహాబును పెండ్లి చేసికొనెను. (అతడు ఇశ్రాయేలుకు రాజు) ఆ తరువాత ఆమె ప్రజల యొక్క మతములో జోక్యము చేసికొనినది. లేవీయులను చంపించినది, దేవాలయములను నిర్మించినది, ప్రజలు అస్టార్తేకు (వీనస్) ఆరాధన చేయునట్లు చేసినది. బయలును (సూర్య దేవుడు) పూజించుట నేర్పెను. ఆమె బోధను రూపొందించి తన యాజకులు దానిని బోధించునట్లు చేసెను. వారు ప్రజల చేత దానిని అంగీకరింపచేసిరి.

అక్కడ అంధకార యుగములలో నామకార్థ సంఘమును మీరు చూడగలరు. వారు పూర్తిగా దేవుని యొక్క వాక్యము విడిచిపెట్టిరి మరియు దైవత్వము యొక్క కొన్ని పేర్లు మరియు బిరుదులు, కొన్ని లేఖన నియమములు మాత్రమే మిగిలియున్నవి. వారు బైబిలులోని కొన్నింటిని తీసికొని వంకరగా చేసి వాటి యొక్క అర్ధములను మార్చిరి. వారి యొక్క కళాశాలల బిషప్పులు, మొదలగు వారు చాలా పెద్ద వ్యాసములను ప్రచురించిరి, మరియు వారి పోపులు తప్పులులేని వారిగా చెప్పసాగిరి. వారు దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది, జనులతో దేవుడు మాట్లాడుచున్నట్లు మాట్లాడుచున్నామని చెప్పిరి. యాజకులకు దీనిని నేర్పించి వారు ప్రజలను భయపెట్టి దానిని నమ్మునట్లుగా చేసిరి. దానికి లోబడనిచో మరణము లేదా బహిష్కరణ జరిగెడిది. అది మరణ శిక్షకన్నా ఘోరమైనది. ఇప్పుడు సంఘము యొక్క మాటయే వేదవాక్కు అయిపోయినది. వారు భీకర అధికారమును పొందిరి. వారు హతసాక్షుల యొక్క రక్తమును త్రాగిరి. నిజమయిన క్రైస్తవులను నానా హింసలు పెట్టిరి. వాక్యమనునది అసలు మిగలలేదు. పరిశుద్ధాత్మ యొక్క కొద్ది ప్రత్యక్షతయే మిగిలినది, కాని నిజమగు ద్రాక్షావల్లి శోధించబడి నిలదొక్కుకొనినది. దేవుడు చిన్న మందను నమ్మకముగా కాపాడెను. రోమ్ తమ శరీరములను ఏమి చేసినా లెక్కచేయలేదు. మరియు రోమ్ తమ ఆత్మలను ఏమియూ చేయలేదని తెలియును. సత్యము యొక్క వెలుగు ప్రకాశించసాగినది, అందుకు పరిశుద్ధాత్మ మరియు శక్తి తోడయినది.

ఇక్కడ మనము లోతుగా పరిశీలించవలసిన అంశము ఒకటున్నది. చూడండి. నీకొలాయితుల బోధ యొక్క క్రియలు, బిలాము యొక్క బోధ, అబద్ధ ప్రవక్తినియగు యొజెబెలు యొక్క బోధ మూడు వేర్వేరు ఆత్మల నుండి వచ్చినవి కావు, అవి మూడు ఆత్మ సంబంధ సిద్దాంతములుకావు. ఈ మూడును ఒకే ఆత్మ యొక్క ప్రత్యక్షతలు, లోతు నుండి లోతునకు వెళ్ళుచున్నవి. ఇదంతా ఏమిటనగా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అదియే సంస్థ, మూడు ఆయా దశలలో యున్నది. ఒక్కసారి యాజకులు వేరయిపోయి తమ సంస్థను ఏర్పరచుకొనిన, వారు జనులను అణగద్రొక్కి లాగిరి. ఆ సంస్థలలో చేర్చి వారిని కూడా అంధులనుగా చేసిరి. ఈ సంస్థకు మూలాధారము ఆచారములు మరియు సిద్దాంతములు, ప్రజలకు వారు స్వచ్చమైన దేవుని వాక్యమును బోధించుటు మాని దానికి బదులుగా వీటిని బోధింపసాగిరి.

ఆరాధనలో కర్మకాండకు, ఆర్బాటమునకు ఎక్కువ ప్రాధాన్యమును ఇచ్చిరి. ఈ మొత్తం క్రమము త్వరలోనే దైవిక శక్తిగాను బలమగు అధికారముగాను రూపొందినది. చర్చల ద్వారా ఒప్పింపజేయుటలోను, వాక్ శక్తితోను ప్రజలను అదుపులోనికి తెచ్చుటకు శాయశక్తులా ప్రయత్నించిరి. తమ స్వంత అబద్ధ ప్రవచనముల ద్వారా వీరు తమ శక్తిని పొందుకొనిరి. దేవుని వాక్యము ద్వారా వీరు శక్తి పొందలేదు, అయితే క్రీస్తు నామమును పెట్టుకొని అది వచ్చినా గానీ ఇప్పుడది పూర్తిగా క్రీస్తు విరోధి అయి పోయినది.

ఇక ఎవరూ సహాయము చేయలేరనిపించు సమయము వచ్చినప్పుడు సత్యము ఇక తప్పకుండా చనిపోవుననుకొనిరి, కాని అదే సమయములో జనులు లేచి రోమను కాథలిక్కు చర్చియొక్క దుష్టత్వమును ఎదిరించసాగిరి. ఎందుకనగా ఏ విధముగా చూచినా గాని ఆ బోధ గాని, ఆ ప్రవర్తన గాని దేవుని యొద్ద నుండి వచ్చుటకు ఆస్కారము లేదని వారు గ్రహించసాగిరి. ఈ ఎదిరించిన వారిని లెక్క చేయకుండా చంపసాగిరి. వారు ఎక్కువ మందిని ఆకర్షించుటలో విఫలమయిరి. రోమ్ ద్వారా అణచివేయబడిరి, కాని అప్పుడు దేవుడు తన సార్వభౌమ కృప చొప్పున సంస్కరణను ప్రారంభించుటకు ఒక వర్తమానికుని పంపెను. అతడే మార్టిన్ లూథరు, సంస్కరణను ఆరంభించెను. అతడు పనిచేసిన వాతావరణమును చూడండి. రోమ్ తన త్రాడును ఎంతో ఎక్కువగా విసరినది, కాని ఆ త్రాడు వలననే దానికి ఉరిశిక్ష వచ్చునని ఎరుగదు. విశ్వాసము ద్వారా నీతీకరణము జరుగునని లూథర్ బోధించినప్పుడు, అనేక శతాబ్దముల తరువాత నిజ-సంఘము విస్తారమగు రీతిలో ఎదుగునారంభించెను.

నామకార్థ సంఘము రాజ్యాధికారమును ఉపయోగించుకొనసాగినది, కాని ఇప్పుడు రాజ్యాధికారము దానికి అనుకూలముగా ఉండుట లేదు. లూథరు ఇక్కడే తప్పుచేసెను, మరియు నిజ-విశ్వాసులు తప్పుచేసిరి. రాజ్యము వారికి రాయితీలు ఇచ్చుటను అనుమతించిరి. కావున ఈ కాలము వాక్యముతో ఎంతో దూరము వెళ్ళలేకపోయెను. అయితే దేవునికి వందనములు, అది వెళ్ళగలిగినంత దూరము వెళ్ళినది, కాని అది రాజకీయ బలము మీద చాలా ఎక్కువగా ఆధారపడుటవలన ఈ కాలము చివరకు సంస్థగా మారినది. కారు-ద్రాక్షావల్లి నుండి వేరయిన ఈ లూథరు తరములోని గుంపు తిరిగి వేశ్య కుమార్తెగా నుండుటకు మళ్ళియున్నది, ఎందుకనగా అది మరల నీకొలాయుతుల, బిలాము బోధలలోనికి వెళ్ళిపోయియున్నది. ఈ శతాబ్దములో ఎన్నో చీలికలు వారిలో వారికి వచ్చియున్నవి. నిజ-సంతానము నుండి వారు ఎంత దూరముగా వెళ్ళిరో మీరు చూడవలెనన్నచో చరిత్ర చదవండి. వారు ఒకరి నొకరు ఎట్లు హింసించుకొనిరో చూడండి, కొన్ని సందర్భములలో అయితే చంపుకొనుట కూడాజరిగినది. కాని వారి మధ్యలో ఇంకా కొన్ని నామములున్నవి, ప్రతి కాలములోను ఉండిన విధంగానే అప్పుడును యుండిరి.

ఈ ఒక్క సంగతిని బట్టి మనము ఈ కాలమును గూర్చి సంతోషించవలెను. సంస్కరణ ప్రారంభమయినది. అది ఒక పునరుత్థానము కాదు గాని సంస్కరణ. అది పునరుద్ధరణ కూడా కాదు. నైసియా యొద్ద భూమిలో పడి చనిపోయిన గోధుమ గింజ, అంధకార యుగములలో కుళ్ళిపోయి ఇప్పుడు సత్యమను చిగురును వేసియున్నది. భవిష్యత్తు దినములలో లవొదికయ సంఘకాల అంతమందు యేసు వచ్చు ముందుగా, సంఘము తిరిగి గోధుమ గింజ వధువుగా మారునని ఇది చూపించుచున్నది. అప్పుడు గురుగులను కోసి అగ్ని గుండములోవేసి కాల్చుదురు.

అయిదవ కాలములో వాక్యము యొక్క గొప్ప మేల్కోలుపు, ముద్రణా యంత్రము ద్వారా వచ్చినది. దాని ద్వారా వచ్చిన ఫలితమును ఆరవ కాలము చాలా త్వరగా తీసికొనినది. ఈ కాలము పునరుద్ధణలోని రెండవ దశగా యున్నది. ఇంతకు ముందు మనము చెప్పుకొనినట్లుగా ఇది కుచ్చు కాలము. విద్య విస్తరించినది. ఇది మేధావుల యొక్క కాలము, వారు దేవునిని ప్రేమించి ఆయనకు సేవచేసిరి. మిషనరీలు ఎక్కువయి వాక్యము ప్రపంచమంతా వ్యాపించెను. ఇది సహోదర ప్రేమ కాలము. ఇది తెరువబడిన తలుపు గల కాలము. ఇది ఎక్కువ వ్యవధియున్న చివరి కాలము. దీని తరువాత లవోదికయ కాలము వచ్చును, దాని వ్యవధి చాలా తక్కువ.

ఏ కాలములోను వర్ధిల్లనంతగా నిజమగు ద్రాక్షావల్లి ఈ కాలములో వర్ధిల్లెను. దేశములోను, విదేశములలోను కూడా సంఖ్య ఎక్కువయినది. ఈ కాలము పరిశుద్దులను అగ్రభాగమునకు తీసికొని వచ్చినది. నిజమగు ద్రాక్షాపల్లి వ్యాపించినది. కారు-ద్రాక్షావల్లి వెనుకబడినది. నిజమగు ద్రాక్షావల్లి వెళ్ళిన ప్రతి చోటను దేవుడు వెలుగును, సంతోషమును, జీవమును ఇచ్చుచుండెను. కారు-ద్రాక్షావల్లి యొక్క రంగు బయటపడినది. దానిలో చీకటి, దౌర్భాగ్య స్థితి, దరిద్రము, నిరక్షరాస్యత మరియు మరణము ఉండెను. తనకు అధికార ముండిన దినములలో ఈ కారు-ద్రాక్షావల్లి మంచి ద్రాక్షావల్లిని ఎలాగు చంపలేకపోయినదో, అదే విధంగా ఇప్పుడు నిజమగు ద్రాక్షావల్లి, కారు-ద్రాక్షావల్లిని యేసు క్రీస్తుయొద్దకు నడిపించలేకపోయినది. కాని కారు-ద్రాక్షావల్లి తన గొయ్యిని తానే త్రవ్వకొనిచివరి కాలములోని తన చివరి పాత్ర కొరకు ఎదురుచూచుచున్నది. అప్పుడది అందరినీ తిరిగి జయించును, కాని దేవుని నిజమగు ద్రాక్షావల్లిగాను, ఏర్పరచబడిన చిన్నమందగాను యుండిన ఆ కొద్దిమందిని మాత్రము జయించలేదు.

కాని ఈ కాలమును గూర్చి తలంచుచున్నప్పుడు చాలా విచారము కలుగును, ఎందుకనగా దేవుని యొక్క గొప్ప ఉద్యమములు (ఎన్నో ఇందులో) లేచియున్నవి, అయినా గాని వారు నీకొలాయితుల బోధను నిర్మూలించలేకపోయిరి. అందువలన వారు సంస్థగా మారి చనిపోయిరి. తరువాత వారు శాఖల లోనికి మారి, అక్కడ ఆత్మీయముగా చనిపోయిరి, ఎందుకనగా అవి ఆహారము లేని బీడు భూములు. దానిని గూర్చి వారికి తెలియదు, కాని ప్రతి గుంపు కూడా అదే తప్పును చేసినది. ఉజ్జీవజ్వాల చల్లబడసాగినప్పుడు సంస్థ వికసించినది. జనులు శాఖా సంబంధులయిరి. వారు కేవలము నామకార్థ క్రైస్తవులు, అయితే ప్రతి గుంవు తామే నిజమయిన వారమని రోమను కాథలిక్కు చర్చి చెప్పుకొనినట్లుగా చెప్పుకొనిరి. ఎవరికి వారే తమది సరియనియు, మిగిలినవారిది తప్పు అనియు చెప్పుట మామూలే. కుమార్తెలు చివరి కాలములో తమ గృహమునకు వెళ్ళటకు, రోమ్ యొద్దకు తిరిగి చేరుటకు, తల్లి-పెట్ట క్రిందికి వెళ్ళుటకు నిజంగా రంగము సిద్ధమయినది.

ఇప్పుడు మనము చివరి కాలము యొద్దకు వచ్చుచున్నాము: లవొదికయ కాలము. అది మన కాలము. యూదులు పాలస్తీనాకు చేరు కాలము చివరి కాలమేనని మనకు తెలియును. వారెట్లు అక్కడికి వచ్చిరన్నది సంగతి కాదు; వారక్కడికి చేరిరి. ఇది కోతకాలము. కోత కోయుటకు ముందు ఆ రెండు ద్రాక్షావల్లుల ఫలములు పరిపక్వము చెందవలసియున్నవి.

లూథర్ కాలము వసంత కాలము. వెస్లీ కాలము ఎండా కాలము ఎదుగుదల కాలము. లవొదికయ కాలము కోతకాలము. ఈ కాలములో గురుగులన్నియు కట్టలు కట్టబడును, అవి కాల్చివేయబడును; గోధుమలను ప్రభువు కొరకు సమకూర్పుదురు.

కోతకాలము. కోతకాలమును మీరు గమనించండి, గింజ పండుట చాలా త్వరితముగానే జరుగుచుండును గాని ఎదుగుదల మాత్రము చాలా నెమ్మదిగా జరుగుచుండును, చివరికి ఎదుగుదల ఆగిపోవును. దానిని ఇప్పుడు మనము చక్కగా చూచుట లేదా? కారు-ద్రాక్షావల్లికి చెందిన జనసమూహములు కమ్యూనిస్టుల చేతులలోనికి పోవుచున్నారు. ఇంకా వేరు వేరు నమ్మకముల వైపు వెళ్ళిపోవుచున్నారు. మనము అనుకొనినంత విస్తారముగా దాని సంఖ్య పెరుగుట లేదు. ఇంతకుముందు ప్రజల మీద దానికుండిన పట్టు ఇప్పుడు లేదు. చాలా సందర్భములలో సంఘమునకు వెళ్ళుట ఒక ప్రదర్శనగా మారినది. నిజ-ద్రాక్షావల్లి ఎటున్నది? దాని సంగతి ఏమిటి? అది ఎదుగుచున్నదా? ఉజ్జీవముల కాలములోను, వేదిక ఆహ్వానమిచ్చినప్పుడును వచ్చుచుండిన. ఆ గొప్ప సంఖ్యలోని జనులు ఇప్పుడెచ్చటున్నారు? వారిలో చాలామంది కేవలము ఉద్రేకముతో వచ్చినవారు కారా? నిజంగా ఆత్మ సంబంధమగు విషయములను వారు ఆశించి రాలేదు గాని ఏదో శరీరసంబంధమగు అవసరతలను తీర్చుకొనుటకు వచ్చిరి. ఇది నిజంగా నోవాహు ఓడలో ప్రవేశించిన కాలమువలె ఉండును, నోవాహు ఓడలోనికి ప్రవేశించిన తలుపు మూయబడెను, కాని దేవుడు, తన తీర్పును వారి మీదికి పంపకుండా ఇంకా ఏడు రోజులు వేచియుండెను; ఈ దినములు ఆలాగు లేవా? ఆ నిశబ్ద దినములలో ఏ ఒక్కరును అక్షరాలా దేవుని వైపు తిరుగలేదు.

అయినా గాని ఇది కోతకాలము. ఈ కాలములో గురుగులను, గోధుమలను పరిపక్వము చెందించుటకు రంగము మీదికి వారు తప్పక రావలసియున్నారు. చెడు బోధకుల మూలముగా గురుగులు చాలా త్వరగా పక్వము చెందుచున్నవి, జనులను వారు వాక్యము నుండి మళ్ళించుచున్నారు. కాని గోధుమలు కూడా పరిపక్వము చెందవలెను. ఆమె కొరకు దేవుడు ప్రవక్త వర్తమానికుని పంపుచున్నాడు. ప్రత్యక్షత గల పరిచర్య అతనికున్నది. అతనిని ఏర్పరచబడిన వారు స్వీకరించుదురు. మొదటి సంఘము పౌలు యొక్క మాటను వినినట్లుగానే వారు అతని మాటను విందురు. ఆమె వాక్యములో పరిపక్వము చెంది చివరకు వాక్య వధువుగా మారును. ఆమెయందు బలమగు కార్యములు కనబడును, పవిత్ర వాక్యము మరియు విశ్వాసము మీద ఆధారపడును.

అబద్ధ సంఘపు గుంపులు ప్రపంచ సంఘముల సమాఖ్యలో ఏకముగా కూడి వచ్చును. ఈ ప్రపంచ సంఘముల సమాఖ్యయే మృగమునకు నిర్మించబడిన ప్రతిమయై యున్నది.

ప్రకటన 13:11-18,

"మరియు భూమిలో నుండి మరి యొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పమువలె మాట్లాడుచుండెను.అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియూ దాని యెదుట చేయుచున్నది. మరియు చావుదెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.అది ఆకాశము నుండి భూమికి మనుష్యుని యెదుట అగ్ని దిగి వచ్చునట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది.కత్తి దెబ్బతినియు, బ్రదికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతివుకు ప్రాణమిచ్చుటకై దానికి అధికార మియ్యబడెను.కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరును తమ కుడి చేతి మీదనైనను, తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనునట్లను, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను, దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది.బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది యొక మనుష్యుని యొక్క సంఖ్యయే. ఆ సంఖ్య ఆరు వందల అరువది యారు. ఇందులో జ్ఞానము గలదు."

ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఇది చక్రవర్తుల అన్య రోమ్, అది ఖడ్గము ద్వారా కూల్చబడినది. కాని అది ఆ చావు దెబ్బనుండి కోలుకొన్నది. అది రోమ్ యొక్క నామకార్థ సంఘములోచేరినది. అన్యత్వమును మరియు క్రైస్తవ్యమును అది కలగలుపు చేసినది. ఆ విధముగా యేసు వచ్చి ఆ పరిశుద్ధ రోమను సామ్రాజ్యమును నాశనము చేయు వరకు అది నిలచి యుండవలసియున్నది. కాని రోమ్ ఒక్కటిగా వెళ్ళదు, దాని కుమార్తెలు దానితోనే యుందురు. ప్రపంచసంఘముల సమాఖ్య ద్వారా నిరాధికార అధికారమును అది హస్తగతము చేసికొనును.

కొందరికిది ఆలా దూర సత్యముగా కనిపించవచ్చును కాని ఇది వాస్తవముగా చాలా తేటగా యున్నది. అందరూ చూడగలరు, ఎందుకనగా ఇప్పుడు సంఘములు రాజకీయములను అదుపుచేయుచున్నవి. సరయిన సమయములో ఆ అదుపు ఎంత బలమైనదో అర్థమగును. ఈ సమాఖ్య ఉద్యమము చివరకు రోమ్ తో అంతమగును. రోమ్ శిరస్సుగా యుండును, కాని ప్రజలు అది ఆ విధముగా యుండునని తలంచుట లేదు. ఇది నిజము. ఎందుకనగా ప్రకటన 17: 3-6లో అది చెప్పబడినది. వేశ్యయగు, మర్మమైయున్న బబులోను మృగము మీద కూర్చొనియున్నది. చివరిది, అనగా నాలుగవ సామ్రాజ్యమును అది అదుపులో ఉంచుచున్నది. ఈ రోమను సంఘము అది చేయుచున్నది. ప్రపంచ సంఘ క్రమమును రోమ్ అదుపుచేయుచున్నది. ఈ ప్రతిమ (సంఘ క్రమము) రోమ్ కు విధేయులుగా యుండును. ఎందుకనగా రోమ్ యొక్క అదుపులో ప్రపంచ బంగారమున్నది.

ఆ విధముగా ప్రజలందరును ప్రపంచసంఘ క్రమమునకు చెందియుందురు లేదా వారి యొక్క దయా దాక్షిణముల క్రింద యుందురు, ఎందుకనగా చేతిమీద గాని, నొసటి మీద గాని మృగము యొక్క ముద్ర లేనియెడల క్రయ విక్రయములు చేయుటకు ఎవరికిని హక్కు ఉండదు. నొసటి మీద ఈ ముద్ర అనగా ప్రపంచ సంఘక్రమమగు త్రిత్వవాదము మొదలగువాటిని, దాని బోధలను స్వీకరించినట్లే అర్ధము. చేతి మీద ముద్ర అనగా ప్రపంచసంఘము యొక్క ఇష్టమును చేయుట యని అర్ధము. ఈ మహాశక్తి ద్వారా సంఘ క్రమములు నిజమగు వధువును బాధించెదరు. ఆ ప్రతిమ ఈ నిజ-వధువును బోధించనీయకుండాను, ఉపదేశించనీయకుండాను చేయుటకు ప్రయత్నించును. అవసరమయిన ప్రజలకు సత్యమును మరియు ఆదరణను సేవకులు అందించనీయకుండా ఆమె అడ్డు తగులును. కాని అంత్యక్రీస్తు (వ్యక్తిగా) ఈ మొత్తం ప్రపంచ సంఘముల క్రమమును తన వశము చేసికొను ముందుగా నిజ-సంఘము ఈ లోకము నుండి కొనిపోబడి ప్రభువుతో నిత్యమూ యుండును. గొర్రెపిల్ల యొక్క గొప్ప పెండ్లి విందునకు తన వధువును దేవుడు తీసికొనిపోవును.

పెంతెకోస్తు ప్రారంభమయినది మొదలుకొని యుగాంతము వరకు ఉండు రెండు సంఘములను మరియు రెండు ఆత్మలను కనిపెట్టుట కొరకు ఈ ముగింపు అధ్యాయము ఇయ్యబడియున్నది. లవొదికయ సంఘ కాలములో దానిని చూపించుటకు ఈ తుది సమయమును మనము తీసికొందుము.

ఇరవయ్యవ శతాబ్దపు మలుపులో ఈ కాలము ప్రారంభమయినది. పెంతెకోస్తు యొద్ద ఉండిన వధువుగా నిజ-సంఘము ఈ కాలములో ఆఖండమగు శక్తితో తిరిగి రావలసియున్న అవసరతను మనము ఎరుగుదుము. విశ్వాసులు తమ ఆత్మలలో దీనిని పసిగట్టి మొదటి శతాబ్దములో వలె క్రొత్త కుమ్మరింపు కావలెనని వారు దేవునికి మొరపెట్టుచుండిరి.

జవాబువలె కనిపించినది వచ్చినది, అనేకమంది భాషలలో మాట్లాడసాగిరి. ఆత్మయొక్క వరములను బయలుపరచసాగిరి. ఎప్పటినుండియో ఎదురు చూచుచున్న పునరుద్ధరణ ఇదియేనని అప్పుడు చాలామంది నమ్మిరి. అది కాదు, ఎందుకనగా తొలకరి వాన తరువాతనే కడవరి వాన వచ్చును, అదే వసంత కాలము, లేదా ఉపదేశపు వాన. అప్పుడు కడవారివాన అనగా కోత వానయే. ఉపదేశపు వాన రాకుండా ఇది నిజమయినది ఎట్లు కాగలదు? జనులకు ఉపదేశించుటకు ప్రవక్త-వర్తమానికుడు పంపించబడును. పెంతెకోస్తు తండ్రుల వైపు పిల్లల హృదయములను త్రిప్పుట ఇంకా జరుగలేదు. ఆ విధముగా వారు పునరుద్ధరణ అనుకొనినది, రాకడ కొరకు తుది మేల్కొలుపు అనుకొనినది ఇంకా రాలేదు. దానియందు మిశ్రమమున్నది, దుర్నీతిపరులు ఆత్మ సంబంధమగు దీవెనలలో పాలుపొందియున్నారు, పరిశుద్దాత్మలో ప్రత్యక్షతలు చూపించుచుండిరి. దానిని మీకు చూపించుచునేయున్నాము. దానియందు అపవాది యొక్క శక్తి యున్నది, మనుష్యులు అపవాది యొక్క శక్తి క్రింద యుండిరి, కాని దానిని ఎవరూ గ్రహించలేదు. అది నిజము కాదని రుజువుచేయుదును, ఎందుకనగా వారు సంస్థగా మారిరి (కనీసము రెండవ తరము కూడా రాకముందే) వాక్యములో లేని స్వంత సిద్దాంతములను వారు వ్రాసికొనిరి. వారికి ముందున్న ప్రతి గుంపు చేసినట్లుగానే తమ చుట్టు కంచెను కట్టుకొనిరి.

గుర్తుంచుకొనండి, యేసు భూమిమీద ఉండినప్పుడే యూదా యుండెను. ఇరువురు వేర్వేరు ఆత్మ నుండి వచ్చిరి. మరణించిన తరువాత ఎవరి స్థలమునకు వారు వెళ్ళిరి. ఆ తరువాత క్రీస్తు ఆత్మ నిజ-సంఘము మీదికి తిరిగి వచ్చినది. యూదా యొక్క ఆత్మ అబద్ధ సంఘము మీదికి వచ్చియున్నది.

దానిని మీరు ప్రకటన 6: 1-8లో చూడగలరు.

"ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి, రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను. అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళేను. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు, రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని.అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకని నొకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చొన్నవానికి అధికారమియ్యబడెను. మరియు అతనికి ఒకపెద్ద ఖడ్గమియ్యబడెను.ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు, రమ్ము అని మూడవ జీవి చెప్పుటవింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి యుండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యమలనియు, నూనెను ద్రాక్షా రసమును పాడు చేయవద్దనియు.ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు, రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దానిమీద కూర్చొన్నవాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరవు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికియ్యబడెను."

ఆ యూదా యొక్క ఆత్మ తెల్లని గుర్రమును ఎక్కిన వానిగా ఎట్లు వచ్చెనో చూడండి. అది తెల్లని గుర్రము. అసలయిన దానికి చాలా దగ్గరగా యున్నది. యూదా యేసుకు దగ్గరగా ఉండినట్లే యున్నది. అతనికి ఒక కిరీటమియ్య బడెను (తెల్లని గుర్రము మీది ఎక్కినవానికి) ఏలాగు? నీకొలాయితు క్రమము యొక్క నాయకునిలో ఆ ఆత్మ ఇప్పుడున్నది. అతడు ముక్కోణ పుకిరీటము ధరించిన పోపుగా తన ఆలయములో దేవునిగా కూర్చొనియున్నాడు. క్రీస్తు యొక్క స్థానములో యున్నానని చెప్పుకొనుట అనగా క్రీస్తుకు బదులుగాను, లేదా క్రీస్తు స్థానములోను, లేదా దేవుని పక్షముగానుయున్నానని చెప్పుచున్నాడు. తానే పరిశుద్దాత్మనని పోపు చెప్పుకొనుచున్నాడు. పరిశుద్దాత్మను నిరాకరించి నేనే పరిశుద్దాత్మనని చెప్పుకొనుచూ ఆయన తరపున పనిచేయుచున్నాడు. అతనిలో యూదా ఆత్మ ఉండి ఆలాగున పనిచేయుచున్నది. అతడెట్లు జయించెనో చూడండి — జయించుచూ జయించుటకు బయలువెళ్ళెను. క్రీస్తు ఆలాగు చేయలేదు. ఆయన యొద్దకు వచ్చిన వారు తండ్రి చేత ముందుగానే నిర్ణయింపబడిరి. ఆ ఆత్మ ఎంతో ముందుకు పయనించి ఒక దినమున నిజముగానే అది మానవునిగా అవతరించి ప్రపంచసంఘ సమాఖ్యకు శిరస్సుగా నుండును. దానినే మనము చెప్పుకొనుచున్నాము. తన యొద్దనున్న బంగారము ద్వారా మొత్తం ప్రపంచమును వాడు అదుపు చేయును (యూధా యొద్ద సంచి యుండెనని మరువవద్దు) ఆ క్రీస్తు విరోధి క్రమము సమస్తమును స్వంతముచేసికొనును. అందరిని వశపరచుకొనుటకు ప్రయత్నించును. కాని యేసు తిరిగి వచ్చి తన యొక్క రాక ద్వారా ఆ ప్రకాశమానముతో వారినందరినీ నాశనము చేయును. వారి యొక్క అంతము అగ్నిగుండమే.

కాని నిజమగు విత్తనము మాట ఏమిటి? మనము చెప్పుకొనిన రీతిగానే జరుగును. ఈ కాలమునకు చెందిన వర్తమానికుని యొద్ద నుండి సత్యవాక్యమును వినుట ద్వారా దేవుని ప్రజలు సిద్ధపరచబడుదురు. పెంతెకోస్తు యొక్క సంపూర్ణత ఆమెలో యుండును. ఆది యందు వారు ఎక్కడ యుండిరో అక్కడికి అది జనులను తిరిగి తీసికొని వచ్చును. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అయియున్నది.

అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." ఎందుకనగా యావేలు 2:23-26లో చెప్పినది అదే.

"సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి." తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును. వాన కురిపించి పూర్వముందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును.కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును.మీరు కడుపార తిని తృప్తి పొంది, మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతులును, గొంగళి పురుగులును, పసరు పురుగులును, చీడ పురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల ఇత్తును. నా జనులు ఇక ఏన్నటికిని సిగ్గునొందరు.

ఇప్పుడు దేవుడు "మరల ఇచ్చెదనని" సెలవిచ్చుచున్నాడు. లూథరను కాలము సంఘమును పునురుద్ధరించలేదు, అది సంస్కరించినది. వెస్లియగు కాలము పునరుద్ధరించలేదు, పెంతెకోస్తు కాలము సంఘమును పునరుద్ధరించలేదు. కాని దేవుడు పునరుద్ధరించనైయున్నాడు, ఎందుకనగా ఆయన తన వాక్యమును తిరస్కరించలేడు; ఇది సంఘము యొక్క పునరుత్థానము కాదు. ఇది "పునరుద్ధరణ." ఆదిలో యుండిన పెంతెకోస్తుయొద్దకు దేవుడు సంఘమును తీసికొనిపోవుచున్నాడు. ఇప్పుడు 25 వచనమును గమనించండి. ఎందుకు మనకు పునరుద్ధరణ ఎందుకు అవసరమో అది చెప్పుచున్నది. మిడుతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అంతయూ తినివేసినవి, కాని వేరు మరియు చిన్న కాండము మిగిలియున్నది. ఈ పురుగులు అన్నీ ఒక్కటేనని చెప్పుబడినది. ఆయా దశలలో ఒక్కటిగా యున్నవి. అది నిజము. అదియే క్రీస్తువిరోధి ఆత్మ సంస్థలో అది ప్రత్యక్షమయినది. అది నిజము. శాఖలో బయలుపడినది, ఆ యాకాలములలో అబద్ధ-బోధ వచ్చియున్నది. ఆ చిన్న వేరు మరియు కాండము పునరుద్ధరించబడును. దేవుడు ఒక క్రొత్త సంఘమును స్థాపించడు, కాని ఆయన తన ఆది సంఘము యొక్క స్థితికి, మూల విత్తనము యొక్క స్థితికి దీనిని తీసికొని వచ్చును. మరియు 23 వచనములో చెప్పినట్లుగా ఆయన చేయును. ఉపదేశము ద్వారా "తొలకరి వాన" ద్వారా దానిని చేయును. ఆ తరువాత "కడవరి వాన" లేదా ఎత్తబడు విశ్వాసము వచ్చును.

ఆ విధముగా ఈ క్షణమందు మనము మత్తయి 24:24 యొక్క సంపూర్ణ నెరవేర్పులో యున్నాము. "సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయును." ఏర్పరచబడిన వారిని కూడా సాధ్యమయితే మోసము చేయువారెవరు? అది ఈ క్రీస్తు విరోధి ఆత్మ. ఈ చివరి దినపు అబద్ద అభిషిక్తుల ద్వారా అది అందుకు ప్రయత్నములు చేయుచున్నది. ఈ అబద్ధికులు ఇప్పటికే వచ్చియున్నారు. "యేసు నామములో వారు వచ్చి తాము చివరి దినమునకు అభిషేకించబడినట్లుగా చెప్పుకొనుచున్నారు. వారు అబద్ధ మెస్సీయూలు. (అభిషిక్తులు) వారు ప్రవక్తలమని చెప్పుకొనుచున్నారు. కాని వారు వాక్యముతో ఏకమయిరా? ఎన్నడూ ఏకమవరు? వాక్యమునకు వారు కలిపిరి లేదా కొంత తీసివేసిరి. వరముల ద్వారా దేవుని యొక్క ఆత్మ వారి మీద పనిచేయుచున్నదను సత్యమును ఎవరూ కాదన లేరు. కాని బిలామువలె వారికి ఎన్నో కార్యక్రమములున్నవి, డబ్బు కొరకు విజ్ఞాపనలు చేయుచున్నారు, వరములను సాధకము చేయుచున్నారు, కాని వాక్యమును నిరాకరించుచున్నారు, దానిని అతిక్రమించుచున్నారు. ఏదైనా వివాదము తలయెత్తినయెడల తమ సంపాదన తగ్గిపోవునేమోనని భయపడుచున్నారు. అయినా గాని వారు దేవుని శక్తి ద్వారా రక్షణను, విమోచనను ప్రకటించుచున్నారు. యూదాకువలె వారికి క్రీస్తు యొక్క ఒక పరిచర్య యున్నది, కాని వారు తప్పు సంతానము అయినందున వారిలో తప్పు ఆత్మయుండి నడిపించుచున్నది.

మతమా? ఓ! వారు ఏర్పరచబడిన వారిని మించిపోయి ఆసక్తిని ప్రయత్నములను ప్రదర్శించుచున్నారు, కాని అది లవొదికయ సంఘము, క్రీస్తుకు చెందినది కాదు, ఎందుకనగా అది పెద్ద కార్యములను చేయవలెననియు, ఎక్కువ మందిని పోగు చేయవలెననియు, ఆశ్చర్యమును కలిగించు సూచక క్రియలను జరిగించవలెననియు చూచుచున్నది. వారు క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి ప్రకటించెదరు, కాని ప్రవక్తయగు వర్తమానికుని రాకను వ్యతిరేకించుచున్నారు. అతడు శక్తిని, సూచకక్రియలను, నిజ-ప్రత్యక్షతను కనుపరచుచున్నాగాని వారు చూడలేకపోవుచున్నారు. అవును, ఈ చివరి దినమున అబద్ధపు ఆత్మ నిజమగు దానికి చాలా దగ్గరగా యున్నది. వాక్యము నుండి అది తొలగుట వలన మాత్రమే దానిని మనము గమనించగలము. ఎప్పుడును అది వాక్యమునకు విరోధియే. దాని యొక్క వాదనను ఇంతకు ముందే మనము చూచియున్నాము. "మాకు ఫలితములు వచ్చుచున్నవి, కాబట్టి మేము దేవుని సంబంధులము," అని వాదించుచున్నారు.

ఇప్పుడు మనము ముగించు ముందుగా ఈ ఆలోచనను నేను తీసికొని రావలెనని కోరుచున్నాను. గోధుమ గింజ పాతిపెట్టబడి ఆ తరువాత చిగురించుట, తరువాత కుచ్చు, నిజమగు వెన్ను వేయుట గురించి ఇంతవరకు మనము చెప్పుకొనియున్నాము. లూథరనులకు పరిశుద్దాత్మ లేదు, ఎందుకనగా వారు ప్రాథమికంగా నీతీకరణమును గూర్చియే బోధించిరి అని మనము చెప్పినచో కొందరు ఆశ్చర్యము చెందుదురు. మెథడిస్టుల గూర్చి ఆలాగు చెప్పినయెడల వారు ఆశ్చర్యము చెందుదురు. లేదండీ! దానిని మేము చెప్పుట లేదు. మేము వ్యక్తుల గూర్చి గాని, ప్రజల గూర్చి గాని మాట్లాడుట లేదు గాని; 'కాలము' గూర్చి మాట్లాడుచున్నాము. దేవుని యొక్క ఆత్మ లూథరులో యున్నది, కాని అతని కాలము పూర్ణ పునరుద్ధరణ కలిగిన కాలము కాదు. ఆదియందు వలె మరియొక కుమ్మరింపు లేదు. వెస్లీ, బూత్, నాక్స్, వైట్ ఫీల్డు, బ్రెయినార్డు, జోనాతాను ఎడ్వార్ట్సు, ముల్లర్, మొదలగు వారి విషయములో కూడా అంతే. నిశ్చయంగా వారు పరిశుద్దాత్మ పూర్ణులే. అవును, కచ్చితము. కాని వారు జీవించిన ఏ కాలములో కూడా పునరుద్ధరణ జరుగలేదు, ఈ చివరి కాలము తప్ప ఏ కాలము కూడా పునరుద్ధరణ కాలము కాదు. ఈ కాలములో విశ్వాస రాహిత్యము వలన పూర్తి అంధకారము ఏర్పడినది. ఇది భ్రష్టత్వ కాలము, ఇది పునరుద్ధరణ కాలము, సంపూర్తియైన చక్రము యొక్క కాలము ఇది. దీనితో, అంతా సమాప్తమయినది.

కావున ఏడు సంఘ కాలములను ఈలాగు మనము ముగించుదము, ప్రతి కాలమునకు ఆత్మ చెప్పిన దానిని మాత్రమే మనము చెప్పుదము. "సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటను, చెవిగలవాడు వినును గాక."

దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుచున్నదని నేను యధార్థముగా నమ్ముచున్నాను, కాలముల యొక్క సత్యములను మనకు బోధించుట మాత్రమే గాక, ఆయన వైపు తిరుగునట్లుగా ఆయన మన హృదయములతో నమ్మకముగా మాట్లాడుచున్నాడు. ఆ కారణము చేతనే ఈ బోధ మరియు ఉపదేశము జరుగుచున్నది, ఎందుకనగా వాక్యము యొక్క బోధ మరియు ఉపదేశములోనే గొర్రెలు దేవుని యొక్క స్వరమును విని ఆయనను వెంబడించును.

నన్ను జనులు వెంబడించవలెననియు, నా సంఘములో చేరవలెననియు, లేదా ఏదో సంస్థను మరియు సహవాసమును ప్రారంభించవలెననియు ఉద్దేశ్యముతో ఒక్క క్షణము కూడా నేను వర్తమానమును బోధించలేదు. ఎన్నడూ నేను ఆలాగు చేయలేదు. ఇప్పుడు కూడా అది చేయను. ఆ సంగతులలో నాకు ఆసక్తి లేదు. దేవుని యొక్క సంగతులలోను, ప్రజలలోను నాకు ఆసక్తియున్నది. ఒక్క పనిని నేను నెరవేర్చినా గాని నేను సంతృప్తి చెందెదను. ఆ ఒక్క సంగతి ఏమనగా, దేవునికి మానవులకు మధ్య నిజ-సంబంధము ఏర్పడునట్లు చూచుటయే. అప్పుడు మానవులు క్రీస్తునందు నూతన సృష్టియగుదురు, ఆయనాత్మతో నింపబడుదురు, మరియు ఆయన వాక్య ప్రకారము జీవించెదరు. ఈ సమయములో ఆయన స్వరమును వినమని అందరినీ ఆహ్వానించి, బ్రతిమాలి, హెచ్చరించెదను. మీ జీవితములను పూర్తిగా ఆయనకు సమర్పించుడి, నేను కూడా నా జీవితమును పూర్తిగా ఆయనకు సమర్పించి యున్నానని నా హృదయములో పూర్తిగా నమ్ముచున్నాను. దేవుడు మిమ్ము దీవించును, ఆయన రాక మీ హృదయమును సంతోషపరచును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...